‘పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి’
‘పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి’
“పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.”—ఎఫెసీయులు 6:1.
విధేయత చూపించాం కాబట్టే మనమింకా బ్రతికున్నాం, ఇతరులు విధేయత చూపించలేదు కాబట్టే వారిప్పుడు బ్రతికిలేరు. దేనికి విధేయత? హెచ్చరికలకు. ఉదాహరణకు, ‘ఆశ్చర్యకరంగా కలుగజేయబడిన’ మన శరీరమిచ్చే హెచ్చరికలకు విధేయత చూపించాలి. (కీర్తన 139:14) మన కళ్లకు కారుమేఘాలు కనబడుతున్నాయి, మన చెవులకు ఉరుముల శబ్దాలు వినబడుతున్నాయి. మిరుమిట్లుగొలిపే మెరుపులు శరీరంలో వణుకు పుట్టిస్తున్నాయి. రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించబడినవారికి ఈ సూచనలు ప్రాణాలకే ముప్పు తీసుకురాగల తీక్షణమైన మెరుపులతో, వడగండ్లతో తుఫాను వస్తోందని, దానినుండి తప్పించుకునేందుకు సురక్షిత ప్రాంతానికి వెళ్లాలనే హెచ్చరికనిస్తాయి.
2 పిల్లలైన మీకు రాబోయే ప్రమాదాల గురించిన హెచ్చరికలు అవసరం, అలా హెచ్చరించవలసిన బాధ్యత మీ తల్లిదండ్రులకుంది. “స్టౌ ముట్టుకోవద్దు, చెయ్యి కాలుతుంది,” అనో “చెరువు దగ్గరకు వెళ్లొద్దు, ప్రమాదకరం” అనో “రోడ్డు దాటేటప్పుడు రెండువైపులా చూసుకుని దాటు” అనో మీకు చెప్పడాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. విచారకరంగా, ఆ మాటలను లక్ష్యపెట్టని పిల్లలు గాయపడడమో లేక మరణించడమో జరిగింది. మీ తల్లిదండ్రుల మాట వినడం “ధర్మం” అంటే మంచిది, సరైనది. అలాగే అది జ్ఞానయుక్తమైనది. (సామెతలు 8:33) అది మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టి “మెచ్చుకొనతగినది” అని మరో బైబిలు వచనం చెబుతోంది. అవును, మీ తల్లిదండ్రులకు విధేయులవమని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.—కొలొస్సయులు 3:20; 1 కొరింథీయులు 8:6.
విధేయతవల్ల లభించే శాశ్వత ప్రయోజనాలు
3 మీ తల్లిదండ్రులకు విధేయులవడం ‘ఇప్పటి జీవము విషయంలో’ మిమ్మల్ని కాపాడడమేకాక, ఆ విధేయత “వాస్తవమైన జీవము” అని పిలవబడిన “రాబోవు” జీవాన్ని కూడా అనుభవించడాన్ని సాధ్యం చేస్తుంది. (1 తిమోతి 4:8; 6:18) మనలో చాలామందికి వాస్తవమైన జీవం దేవుని నూతనలోకంలో భూమిపై నిత్యజీవమై ఉంటుంది, ఆయన తన ఆజ్ఞలకు నమ్మకంగా హత్తుకునేవారికి ఈ జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ ఆజ్ఞల్లో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇలా చెబుతోంది: “నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.” కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకు విధేయులైతే, మీరు సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది, పరదైసు భూమిపై నిత్యజీవం అనుభవించేవారిలో మీరు కూడావుండే అవకాశముంటుంది.—ఎఫెసీయులు 6:2-3.
4 మీరు మీ తల్లిదండ్రులకు విధేయులౌతూ వారిని సన్మానించినప్పుడు, మీరు దేవుణ్ణి కూడా సన్మానించినవారౌతారు ఎందుకంటే వారికి విధేయులవమని ఆయనే మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అదే సమయంలో మీరుకూడా ప్రయోజనం పొందుతారు. “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును” అని బైబిలు చెబుతోంది. (యెషయా 48:17; 1 యోహాను 5:3) విధేయత చూపించడం మీకెలా ప్రయోజనకరంగా ఉంటుంది? అది మీ తల్లిదండ్రులను సంతోషపరుస్తుంది, వారు మీ జీవితాన్ని సంతోషభరితం చేయగల విధానాల్లో తమ సంతోషాన్ని తప్పకుండా వ్యక్తపరుస్తారు. (సామెతలు 23:22-25) అయితే అత్యంత ప్రాముఖ్యంగా మీ విధేయత మీ పరలోకపు తండ్రిని సంతోషపరుస్తుంది, ఆయన అద్భుత రీతిలో మీకు ప్రతిఫలమిస్తాడు! “ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” అని తన గురించి చెప్పిన యేసును యెహోవా ఎలా ఆశీర్వదించి కాపాడాడో మనం పరిశీలిద్దాం.—యోహాను 8:29.
యేసు కష్టపడి పనిచేశాడు
5 యేసు ఆయన తల్లియైన మరియకు ప్రథమ సంతానం. ఆయనను పెంచిన తండ్రియైన యోసేపు వడ్రంగి. యోసేపు దగ్గర ఆ వృత్తిని నేర్చుకుని యేసు కూడా వడ్రంగివాడయ్యాడు. (మత్తయి 13:55; మార్కు 6:3; లూకా 1:26-31) యేసు ఎలాంటి వడ్రంగివాడని మీరనుకుంటున్నారు? ఆయన పరలోకంలో ఉన్నప్పుడు, అద్భుతరీతిలో మరియ గర్భంలోకి రాకముందు, మూర్తీభవించిన జ్ఞానముగా ఇలా అన్నాడు: “నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు [ఉంటిని].” పరలోకంలో యేసు కష్టపడి పనిచేసినందుకు దేవుడు సంతోషించాడు. ఆయన ఈ భూమ్మీద యువకునిగా ఉన్నప్పుడు కూడా నిపుణతగల మంచి వడ్రంగిగా ఉండేందుకు కష్టపడి పనిచేశాడని మీరనుకుంటున్నారా?—సామెతలు 8:30; కొలొస్సయులు 1:15, 16.
6 యేసు పిల్లవానిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు నిస్సందేహంగా ఆటలాడివుంటాడు, ఆ కాలాల్లో పిల్లలు ఆటలాడేవారని బైబిలు చెబుతోంది. (జెకర్యా 8:5; మత్తయి 11:16, 17) అయినప్పటికీ, అంతంత మాత్రపు ఆదాయంగల పెద్ద కుటుంబంలో పెద్ద కొడుకుగా వడ్రంగివాడయ్యేందుకు యోసేపు దగ్గర శిక్షణ పొందడమేకాక, చేయవలసిన ఇంటి పనులుకూడా ఆయనకు ఉండి ఉంటాయి. ఆ తర్వాత, యేసు ప్రచారకుడై, వ్యక్తిగత సుఖాలను త్యాగం చేసేంతగా తన పరిచర్యకు అంకితమయ్యాడు. (లూకా 9:58; యోహాను 5:17) యేసును అనుకరించగల విధానాలేమిటో మీరు చూడగలుగుతున్నారా? మీ గదిని శుభ్రం చేసుకొమ్మనో లేదా ఇతర పనులు చేసిపెట్టమనో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అడుగుతున్నారా? క్రైస్తవ కూటాలకు హాజరవడం ద్వారా, మీ నమ్మకాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుని ఆరాధనలో భాగం వహించమని వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారా? అలా అడిగినప్పుడు యౌవనుడైన యేసు ఎలా స్పందించివుండేవాడని మీరనుకుంటున్నారు?
ఉత్తమమైన బైబిలు విద్యార్థి మరియు బోధకుడు
7 యూదుల మూడు పండుగల సమయాల్లో యెహోవాను ఆరాధించేందుకు దేవాలయానికి వెళ్లాలని ఇశ్రాయేలు కుటుంబాల్లోని మగవారందరూ ఆజ్ఞాపించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 16:16) యేసుకు 12 ఏళ్లప్పుడు పస్కా పండుగకు ఆయన కుటుంబమంతా కలిసి యెరూషలేముకు వెళ్లుంటారు. వాళ్లలో ఆయన తమ్ముళ్లు, చెల్లెళ్లు కూడా ఉండవచ్చు. అయితే యేసు కుటుంబంతోపాటు బహుశా మరియ సహోదరియైన సలోమే, ఆమె భర్త జెబెదయి, ఆ తర్వాత ఆయన శిష్యులుగా మారిన వారి కుమారులు యాకోబు, యోహానులు కూడా ప్రయాణమై ఉండవచ్చు. * (మత్తయి 4:20, 21; 13:54-56; 27:56; మార్కు 15:40; యోహాను 19:25) తిరుగు ప్రయాణంలో యోసేపు, మరియలు యేసు తమ బంధువులతో కూడా ఉండొచ్చని తలంచివుంటారు, అందువల్ల ఆయన కనబడకపోవడాన్ని వారు మొదట గమనించలేదు. మూడు రోజుల తర్వాత, మరియ యోసేపులు చివరకు యేసును కనుగొన్నప్పుడు ఆయన “దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు” ఉండడం చూశారు.—లూకా 2:44-46.
8 యేసు ఏ రీతిలో ఆ బోధకులను ‘ప్రశ్నలడుగుతున్నాడు’? ఆయన కేవలం తన కుతూహలం తీర్చుకోవడానికో లేదా సమాచారాన్ని సేకరించడానికో ప్రశ్నలు అడుగుతుండకపోవచ్చు. ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం న్యాయ విచారణలో ప్రశ్నించేలాంటి విధానాన్ని సూచించవచ్చు, అలాంటి సంభాషణలో అడ్డుప్రశ్నలు వేయడం ఇమిడివుంది. అవును, యేసు చిన్నవాడైనా విద్యావంతులైన మత బోధకులను ఆశ్చర్యపరిచిన బైబిలు విద్యార్థిగా పరిణతి సాధించాడు! “ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి” అని బైబిలు చెబుతోంది.—లూకా 2:47.
9 చిన్నప్పుడే యేసు తన బైబిలు జ్ఞానంతో అనుభవజ్ఞులైన బోధకులను సహితం ఎలా ఆశ్చర్యపరచగలిగాడని మీరనుకుంటున్నారు? బాల్యం నుండే తనకు దేవుని విషయాలు బోధించిన దైవభయంగల తల్లిదండ్రులు ఆయనకున్నారు. (నిర్గమకాండము 12:24-27; ద్వితీయోపదేశకాండము 6:6-9; మత్తయి 1:18-20) లేఖనాలు చదివి, చర్చించే సమాజ మందిరంలో వినడానికి బాలుడైన యేసును యోసేపు అక్కడికి తీసుకెళ్లి ఉంటాడని మనం నమ్మవచ్చు. మీతో బైబిలు అధ్యయనంచేస్తూ, మిమ్మల్ని క్రైస్తవ కూటాలకు తీసుకెళ్లే తల్లిదండ్రులు మీకు ఉన్నారా? యేసు తన తల్లిదండ్రుల ప్రయత్నాలను విలువైనవిగా పరిగణించినట్లే మీరూ వారి ప్రయత్నాలను విలువైనవిగా పరిగణిస్తున్నారా? యేసులాగే మీరుకూడా తెలుసుకున్న విషయాల్ని ఇతరులతో పంచుకుంటున్నారా?
యేసు విధేయత చూపించాడు
10 మూడురోజుల తర్వాత మరియ యోసేపులు యేసును దేవాలయంలో కనుగొన్నప్పుడు వారెలా భావించివుంటారని మీరనుకుంటున్నారు? వారు హాయిగా గాలి పీల్చుకుని ఉంటారనడంలో సందేహం లేదు. అయితే తానెక్కడవున్నాడో తన తల్లిదండ్రులకు తెలియకపోవడం గురించి యేసు ఆశ్చర్యం వెలిబుచ్చాడు. యేసు అద్భుత జననం గురించి వారిద్దరికీ తెలుసు. అంతేకాక, వారికి అన్ని వివరాలు తెలియకపోయినా, రక్షకునిగా దేవునిరాజ్య పరిపాలకునిగా ఆయన భవిష్యత్ పాత్ర గురించి వారికి కొంతైనా తెలిసివుంటుంది. (మత్తయి 1:21; లూకా 1:32-35; 2:11) కాబట్టి యేసు వారినిలా అడిగాడు: “మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరా?” అయినా యేసు విధేయతతో తన తల్లిదండ్రులతోపాటు సొంత ఊరైన నజరేతుకు తిరిగివచ్చాడు. బైబిలు ఇలా చెబుతోంది: “[ఆయన] వారికి లోబడియుండెను.” అంతేకాక, “ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రముచేసికొనెను.”—లూకా 2:48-51.
11 యేసును అనుకరిస్తూ అన్నివేళలా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించడం సులభమని మీకనిపిస్తుందా? లేక తరచూ వారు నేటి లోకాన్ని అర్థం చేసుకోవడం లేదని, వారికన్నా మీకే ఎక్కువ తెలుసని భావిస్తున్నారా? నిజమే, కొన్ని విషయాలు అంటే సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు లేదా ఇతర ఆధునిక పరికరాలు ఉపయోగించడం గురించి మీకు ఎక్కువ తెలిసివుండవచ్చు. కానీ తన ‘ప్రజ్ఞతో ప్రత్యుత్తరములతో’ అనుభవజ్ఞులైన బోధకులను ఆశ్చర్యపరచిన యేసు గురించి ఆలోచించండి. ఆయనకు తెలిసినదానితో పోలిస్తే మీకు తెలిసింది రవ్వంతే అని బహుశా మీరంగీకరిస్తుండవచ్చు. అయినా, యేసు తన తల్లిదండ్రులకు లోబడ్డాడు. అంటే ఆయన అన్ని సందర్భాల్లో వారి నిర్ణయాలకు ఒప్పుకున్నాడని దానర్థం కాదు. అయినప్పటికీ, ఆయన తన కౌమార ప్రాయమంతటిలో “వారికి లోబడియుండెను.” ద్వితీయోపదేశకాండము 5:16, 29.
ఆయన మాదిరినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చని మీరనుకుంటున్నారు?—విధేయత—ఒక సవాలు
12 విధేయత చూపించడం అన్ని సందర్భాల్లో సులభం కాదు, ఈ విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు బాలికలు ఆరు లైన్ల హైవేను (వేగమార్గాన్ని) దాటే వంతెన మీదుగాకాక అడ్డంగా పరుగెత్తి దాటేందుకు ప్రయత్నించిన వైనం ఉదాహరిస్తోంది. రహదారి దాటేందుకు వంతెనవైపు వెళ్తున్న తోటి విద్యార్థిని పిలుస్తూ “జాన్, ఇటురా మనమిలా దాటివెళ్దాం” అని తొందరపెట్టారు. ఆయన వెనకాడినప్పుడు, “నువ్వొట్టి పిరికివాడివి!” అని వారిలో ఒకమ్మాయి హేళనచేసింది. తనకు భయం లేకపోయినా జాన్, “మా అమ్మ చెప్పిన మాట వినాలి” అని వారికి జవాబిచ్చాడు. కొద్దిసేపట్లోనే ఆయన కీచుమన్న టైర్ల శబ్దంవిని క్రిందికి చూస్తున్నంతలో ఓ కారు ఆ అమ్మాయిలను గుద్దింది. ఒకమ్మాయి చనిపోగా, మరో అమ్మాయికి తీవ్రగాయాలవడమేకాక, ఒక కాలు తొలగించాల్సివచ్చింది. రోడ్డువంతెన మీదుగా ఆ రహదారి దాటాలని ఆ అమ్మాయిలను హెచ్చరించిన వారి తల్లి, ఆ తర్వాత జాన్ తల్లితో, “మా అమ్మాయిలు కూడా మీ అబ్బాయిలాగే చెప్పినమాట వినుండాల్సింది” అని అంది.—ఎఫెసీయులు 6:1.
13 “పిల్లలారా, . . . మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి” అని దేవుడెందుకు చెబుతున్నాడు? మీ తల్లిదండ్రులకు విధేయులవడం ద్వారా మీరు దేవునికి విధేయులైనవారౌతారు. అంతేకాక, మీ తల్లిదండ్రులకు మీకన్నా ఎక్కువ అనుభవముంది. ఉదాహరణకు, పైన వివరించబడిన ప్రమాదం జరగడానికి కేవలం ఐదు సంవత్సరాల ముందు, జాన్ తల్లి స్నేహితురాలి కుమారుడు అదే వేగమార్గాన్ని దాటే ప్రయత్నంలో మరణించాడు. నిజమే, మీ తల్లిదండ్రులకు విధేయులవడం అన్నిసమయాల్లో సులభం కాకపోవచ్చు, కానీ మీరలా విధేయత చూపించాలని దేవుడు చెబుతున్నాడు. మరోవైపు, మీ తల్లిదండ్రులు లేదా ఇతరులు అబద్ధమాడమనో, దొంగతనం చేయమనో లేదా దేవుడు ఆమోదించనిది మరేదైనా చేయమనో చెప్పినప్పుడు మీరు ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడాలి.’ అందుకే “తలిదండ్రులకు విధేయులైయుండుడి” అని చెప్పడానికి ముందు “ప్రభువునందు” అని బైబిలు చెబుతోంది. దీనిలో దేవుని నియమాలకు పొందికగావున్న అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు విధేయులవడం ఇమిడివుంది.—అపొస్తలుల కార్యములు 5:29.
14 మీరు పరిపూర్ణులుగా ఉన్నప్పుడు, అంటే యేసులాగే ‘నిష్కల్మషంగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నప్పుడు’ మీ తల్లిదండ్రులకు విధేయులవడం అన్ని సమయాల్లో సులభంగా ఉంటుందని మీరనుకుంటున్నారా? (హెబ్రీయులు 7:26) మీరు పరిపూర్ణులుగా ఉంటే, మీరిప్పుడు చేస్తున్నట్లుగా చెడు చేసేందుకు మొగ్గుచూపించరు. (ఆదికాండము 8:21; కీర్తన 51:5) అయితే యేసు కూడా విధేయత విషయంలో పాఠాలు నేర్చుకోవాల్సివచ్చింది. బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన, [యేసు] కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.” (హెబ్రీయులు 5:8) పరలోకంలో తానెన్నడూ నేర్చుకోవాల్సిన అవసరంలేని పాఠాన్ని అంటే, విధేయతను నేర్చుకునేందుకు శ్రమపడడం యేసుకు ఎలా సహాయం చేసింది?
15 యేసు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు యోసేపు మరియలు యెహోవా నిర్దేశంలో, ఆయనకు హాని కలగకుండా కాపాడారు. (మత్తయి 2:7-23) అయితే దేవుడు చివరకు యేసు నుండి సహజాతీత కాపుదలను తొలగించాడు. యేసు ఎంత తీవ్రమైన మానసిక, శారీరక శ్రమను అనుభవించాడంటే, ఆయన “మహా రోదనముతోను కన్నీళ్లతోను . . . ప్రార్థనలను యాచనలను సమర్పించా[డు]” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 5:7) ఇలా ఎప్పుడు జరిగింది?
16 ప్రత్యేకంగా యేసు యథార్థతను పాడుచేసేందుకు సాతాను తీవ్రంగా ప్రయత్నించిన ఆయన భూజీవిత చివరి ఘడియల్లో అలా జరిగింది. తానొక నేరస్థుడన్నట్లుగా చనిపోవడం తన తండ్రి సత్కీర్తిపై ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తుందోననే తలంపులతో ఆయనెంత మానసిక వ్యధ అనుభవించాడంటే, ఆయన “[గెత్సేమనే తోటలో] ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.” కొన్నిగంటల తర్వాత, హింసాకొయ్యపై ఆయనపడిన మరణవేదన ఎంత తీవ్రంగా ఉందంటే, ఆయన ‘మహా రోదనముతో కన్నీళ్లు’ విడిచాడు. (లూకా 22:42-44; మార్కు 15:34) ఆ విధంగా ఆయన “తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొని” తన తండ్రి హృదయాన్ని సంతోషపర్చాడు. ఇప్పుడు పరలోకంలోవున్న యేసు, విధేయత చూపించేందుకు మనం చేస్తున్న పోరాటాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటాడు.—సామెతలు 27:11; హెబ్రీయులు 2:18; 4:15.
విధేయతా పాఠాన్ని నేర్చుకోవడం
17 మీ తల్లిదండ్రులు మీకు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు, అది వారు మీకు ఉత్తమమైన దానిని కోరుకుంటున్నారని, మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చూపిస్తుంది. “తండ్రి శిక్షింపని కుమారుడెవడు?” అని బైబిలు ప్రశ్నిస్తోంది. తగినంత సమయం తీసుకొని మిమ్మల్ని సరిదిద్దేందుకు ప్రయత్నించేంతగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించకపోవడం విచారకరంగా ఉండదా? అదే విధంగా, యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే, ఆయన మిమ్మల్ని సరిదిద్దుతున్నాడు. “ప్రస్తుతమందు సమస్తశిక్షయు దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.”—హెబ్రీయులు 12:7-11.
18 గొప్ప జ్ఞానంగలవాడని యేసు పేర్కొన్న ప్రాచీన ఇశ్రాయేలు రాజు తల్లిదండ్రుల ప్రేమపూర్వక దిద్దుబాటు గురించి మాట్లాడాడు. “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును” అని సొలొమోను వ్రాశాడు. ప్రేమపూర్వక దిద్దుబాటు పొందేవ్యక్తి మరణించకుండా తన జీవితాన్ని కాపాడుకోవచ్చని కూడా సొలొమోను చెప్పాడు. (సామెతలు 13:24; 23:13, 14; మత్తయి 12:42) ఒక క్రైస్తవ స్త్రీ తన చిన్నతనంలో క్రైస్తవ కూటాల్లో అల్లరి చేస్తే, ఇంటికి వెళ్లిన తర్వాత నీ పని చెబుతానుండు అని తండ్రి చెప్పడాన్ని గుర్తుచేసుకుంటోంది. తండ్రి తనకు ప్రేమానురాగాలతో ఇచ్చిన క్రమశిక్షణే తన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దిందని ఆమె ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటోంది.
19 మిమ్మల్ని ప్రేమించే, మీకు ప్రేమపూర్వకంగా క్రమశిక్షణ ఇచ్చేందుకు తగిన సమయం తీసుకొని ప్రయత్నించే తల్లిదండ్రులు మీకుంటే కృతజ్ఞత కలిగివుండండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తన తల్లిదండ్రులైన యోసేపు మరియలకు లోబడ్డట్టే మీరూ మీ తల్లిదండ్రులకు లోబడండి. ప్రత్యేకంగా మీ పరలోక తండ్రియైన యెహోవా దేవుడు అలా చేయమని మీకు చెబుతున్నాడు కాబట్టి మీరు వారికి విధేయులవండి. అలా మీకైమీరు ప్రయోజనం పొందడమేకాక, మీరు ‘భూమిమీద దీర్ఘాయుష్మంతులవుతారు.’—ఎఫెసీయులు 6:2, 3.
[అధస్సూచి]
^ పేరా 12 యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటి, 841వ పేజీ చూడండి.
మీరెలా జవాబిస్తారు?
• తల్లిదండ్రులకు విధేయులవడం ద్వారా పిల్లలు పొందే ప్రయోజనాలు ఏమిటి?
• బాలునిగా యేసు, తన తల్లిదండ్రులకు విధేయత చూపించడంలో ఎలాంటి మాదిరినుంచాడు?
• యేసు విధేయతను ఎలా నేర్చుకున్నాడు?
[అధ్యయన ప్రశ్నలు]
1. విధేయత మిమ్మల్ని ఎలా కాపాడగలదు?
2. పిల్లలకు హెచ్చరికలు ఎందుకవసరం, వారు తల్లిదండ్రులకు ఎందుకు విధేయులవ్వాలి?
3. మనలో చాలామందికి “వాస్తవమైన జీవము” ఏమిటి, దానిని పొందేందుకు పిల్లలు ఎలా నిరీక్షించవచ్చు?
4. పిల్లలు దేవుణ్ణి సన్మానించి ఎలా ప్రయోజనం పొందగలరు?
5. యేసు కష్టపడి పనిచేసేవాడని నమ్మేందుకు ఎలాంటి కారణాలున్నాయి?
6. (ఎ) యేసు పిల్లవానిగా ఇంటి పనులు చేసివుంటాడని మీరెందుకు అనుకుంటున్నారు? (బి) పిల్లలు ఏయే విధాలుగా యేసును అనుకరించవచ్చు?
7. (ఎ) పస్కా పండుగకు యేసు ఎవరితోపాటు ప్రయాణం చేసివుండవచ్చు? (బి) అందరూ ఇంటికి తిరుగు ప్రయాణమైనప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు, ఆయనక్కడ ఎందుకున్నాడు?
8. దేవాలయంలో యేసు ఏమిచేశాడు, ప్రజలెందుకు విస్మయమొందారు?
9. బైబిలును అధ్యయనం చేయడంలో యేసు మాదిరిని మీరెలా అనుసరించవచ్చు?
10. (ఎ) యేసును ఎక్కడ కనుగొనాలో ఆయన తల్లిదండ్రులకు ఎందుకు తెలిసివుండాలి? (బి) పిల్లలకు యేసు ఎలాంటి చక్కని మాదిరివుంచాడు?
11. విధేయత విషయంలో యేసు నుండి మీరు ఏ పాఠం నేర్చుకోవచ్చు?
12. విధేయత మీ ప్రాణాలనెలా రక్షించవచ్చు?
13. (ఎ) మీరు మీ తల్లిదండ్రులకు ఎందుకు విధేయులవ్వాలి? (బి) పిల్లవాడు తన తల్లిదండ్రులు చెప్పినట్లు చేయకపోవడం ఎప్పుడు సరైనదిగా ఉంటుంది?
14. పరిపూర్ణుడైన వ్యక్తికి విధేయత చూపించడం ఎందుకు సులభం, అయినా ఆ వ్యక్తి దానిని నేర్చుకోవడం ఎందుకవసరం?
15, 16. యేసు ఎలా విధేయతను నేర్చుకున్నాడు?
17. క్రమశిక్షణ పొందడాన్ని మనమెలా దృష్టించాలి?
18. (ఎ) ప్రేమపూర్వక క్రమశిక్షణ దేనికి రుజువుగా ఉంటుంది? (బి) అలాంటి క్రమశిక్షణ మూలంగా ఏ ప్రయోజనకర రీతుల్లో ప్రజలు తీర్చిదిద్దబడడాన్ని మీరు చూశారు?
19. ప్రత్యేకంగా మీరు మీ తల్లిదండ్రులకు ఎందుకు విధేయులవ్వాలి?
[24వ పేజీలోని చిత్రం]
పన్నెండు సంవత్సరాల యేసు లేఖనాల్లో ప్రావీణ్యత సంపాదించాడు
[26వ పేజీలోని చిత్రం]
యేసు శ్రమలవలన ఎలా విధేయత నేర్చుకున్నాడు?