కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భార్యలారా, మీ భర్తలను ప్రగాఢంగా గౌరవించండి

భార్యలారా, మీ భర్తలను ప్రగాఢంగా గౌరవించండి

భార్యలారా, మీ భర్తలను ప్రగాఢంగా గౌరవించండి

‘స్త్రీలారా, మీ సొంతపురుషులకు లోబడియుండండి.’​—⁠ఎఫెసీయులు 5:​22.

చాలాదేశాల్లో, వివాహం చేసుకునే సమయంలో, పెండ్లికుమార్తె తన భర్తను ప్రగాఢంగా గౌరవిస్తాను అని ప్రమాణం చేస్తుంది. అయితే, చాలామంది భర్తలు తమ భార్యలపట్ల వ్యవహరించే విధానం, ఆ ప్రమాణానికి తగ్గట్టు జీవించడం కష్టమయ్యేలా లేదా సులభమయ్యేలా చేస్తుంది. అయితే వివాహ ఆరంభం మాత్రం అద్భుతమైనది. దేవుడు మొదటి మానవుడైన ఆదాము ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసుకొని, స్త్రీని నిర్మించాడు. ఆదాము ఆనందంతో బిగ్గరగా ఇలా అన్నాడు: “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము.”​—⁠ఆదికాండము 2:​19-23.

2 అంత చక్కని ఆరంభమున్నా స్త్రీ విమోచన అని పిలువబడే ఉద్యమం అంటే పురుషాధిక్యత నుండి స్వతంత్రులవ్వాలని స్త్రీలు తలపెట్టిన ప్రయత్నం 1960వ దశాబ్దపు తొలిభాగంలో అమెరికాలో మొదలైంది. ఆ కాలంలో తమ కుటుంబాలను విడిచిపెట్టినవారి నిష్పత్తి 300 భర్తలు 1 భార్య ఉండగా, ఆ నిష్పత్తి 1960వ దశాబ్దాంతానికి 100 భర్తలు 1 భార్యగా మారింది. ఈ కాలంలో స్త్రీలు పురుషులంత ధీటుగా దుర్భాషలాడడం, త్రాగడం, పొగత్రాగడం, దుర్నీతికరంగా ప్రవర్తించడం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల స్త్రీలు మరింత సంతోషంగా ఉన్నారా? లేదు. కొన్నిదేశాల్లో వివాహం చేసుకున్న ప్రజల్లో సగంమంది చివరకు విడాకులు తీసుకుంటున్నారు. తమ వివాహ పరిస్థితిని మెరుగుపర్చుకోవాలని కొందరు స్త్రీలు చేసిన ప్రయత్నం పరిస్థితిని మెరుగుపర్చిందా లేక మరింత దిగజార్చిందా?​—⁠2 తిమోతి 3:​1-5.

3 ప్రాథమికంగా సమస్య ఏమిటి? కొంతమేరకు ఆ సమస్య, “అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన,” తిరుగుబాటు చేసిన దూత హవ్వను మోసగించినప్పటి నుండి ఉనికిలోవుంది. (ప్రకటన 12:⁠9; 1 తిమోతి 2:​13, 14) దేవుడు బోధించేదాన్ని సాతాను బలహీనపర్చాడు. ఉదాహరణకు, అపవాది వివాహాన్ని హద్దులు విధించేదిగా, కఠినమైనదిగా కనిపించేలా చేస్తున్నాడు. అపవాది తాను పరిపాలకునిగావున్న ఈ లోకపు సమాచార మాధ్యమం ద్వారా చేసే ప్రచారం దేవుని ఉపదేశాలు పక్షపాతంతో నిండుకున్నాయని, ప్రస్తుత కాలానికి అవి పనికిరావని కనిపించేలా చేసేందుకు రూపొందించబడింది. (2 కొరింథీయులు 4:​3, 4) కానీ మనం వివాహంలో స్త్రీ పాత్ర గురించి దేవుడు చెబుతున్నదేమిటో నిష్పక్షపాతంగా పరిశీలించినప్పుడు దేవుని వాక్యమెంత జ్ఞానయుక్తమైనదో, ఆచరణీయమైనదో మనం తెలుసుకుంటాం.

వివాహితులకు హెచ్చరిక

4 బైబిలు ఓ హెచ్చరికనిస్తోంది. అపవాది పాలించే ఈ లోకంలో విజయవంతమైన వివాహాలకు కూడా “శ్రమలు” తప్పవని అది చెబుతోంది. కాబట్టి, వివాహం దైవిక ఏర్పాటైనప్పటికీ, వివాహితులను బైబిలు హెచ్చరిస్తోంది. తన భర్త చనిపోయిన కారణంగా మళ్లీ వివాహం చేసుకునే స్వతంత్రతగల స్త్రీ గురించి ప్రేరేపిత బైబిలు రచయిత ఒకరు ఇలా అన్నాడు: “ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరి ధన్యురాలు.” ‘అంగీకరించగలవారికి’ యేసు కూడా అవివాహితులుగా ఉండడాన్నే సిఫారసు చేశాడు. కానీ ఎవరైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటే, “ప్రభువునందు” ఉన్న వ్యక్తినే అంటే సమర్పించుకొని బాప్తిస్మం తీసుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నవారినే పెళ్లిచేసుకోవాలి.​—⁠1 కొరింథీయులు 7:​28, 36-40; మత్తయి 19:​10-12.

5 ప్రత్యేకంగా ఒక స్త్రీ తాను ఎవరిని పెళ్లి చేసుకుంటాననే విషయానికి శ్రద్ధనివ్వడానికి బైబిలు ఇస్తున్న ఈ హెచ్చరికే కారణం: ‘భర్తగల స్త్రీ ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు.’ ఆయన చనిపోయినప్పుడు లేదా లైంగిక దుర్నీతికి పాల్పడి ఆ కారణాన్నిబట్టి దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు మాత్రమే “భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును.” (రోమీయులు 7:​2, 3) తొలిచూపులోనే ప్రేమ అనేది ప్రణయాత్మక సరదాకు సరిపోతుందేమో గానీ, సంతోషకరమైన వివాహానికి అది తగిన పునాది కాదు. కాబట్టి, అవివాహిత స్త్రీ తననుతాను ఇలా ప్రశ్నించుకోవాలి, ‘ఈ పురుషుని విషయమైన ధర్మశాస్త్ర ఏర్పాటుకు కట్టుబడి ఉండేందుకు నేను ఇష్టపడుతున్నానా?’ ఈ ప్రశ్నను వివాహానికి ముందే పరిగణలోకి తీసుకోవాలి, వివాహమైన తర్వాత కాదు.

6 నేడు చాలా ప్రాంతాల్లో, ఒక స్త్రీ వివాహ ప్రతిపాదనను అంగీకరించేందుకు లేదా నిరాకరించేందుకు నిర్ణయించుకోవచ్చు. అయితే వివాహపు సన్నిహితత్వానికి, ప్రేమకు సంబంధించిన కోరిక స్త్రీలో చాలాబలంగా ఉంటుంది కాబట్టి, జ్ఞానవంతమైన ఎంపిక చేసుకోవడం ఆమెకు చాలా కష్టంగా ఉండవచ్చు. ఒక రచయిత ఇలా అన్నాడు: “అది వివాహమే కానీ లేదా పర్వతారోహణే కానీ మనమేదైనా చేయాలని ఎంత ఎక్కువ కోరుకుంటామో, అంత ఎక్కువగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భావిస్తూ, మనం వినాలనుకునే వాటిని చెప్పే సమాచారానికి మాత్రమే అవధానమిస్తాం.” వివేచనారహిత నిర్ణయం పర్వతారోహకుని ప్రాణాలకే ముప్పు తీసుకురావచ్చు; అలాగే వివాహ జతను అజ్ఞానంగా ఎంచుకోవడం కూడా విపత్కరంగా ఉండగలదు.

7 పెళ్లిని ప్రతిపాదించే పురుషుని విషయమైన ధర్మశాస్త్ర ఏర్పాటుకు కట్టుబడి ఉండడంలో ఏమి ఇమిడివుంటుందనేది ఒక స్త్రీ గంభీరంగా ఆలోచించాలి. చాలా సంవత్సరాల క్రితం, ఒక భారతీయ వనిత నమ్రతతో ఇలా అంగీకరించింది: “మన తల్లిదండ్రులు వయసులో పెద్దవారు, తెలివైనవారు, వారు మనం మోసపోయినంత తేలికగా మోసపోరు. . . . నేనైతే సులభంగా పొరపాటు చేసే అవకాశముంది.” తల్లిదండ్రులు, ఇతరులు అందించగల సహాయం చాలా ప్రాముఖ్యం. జ్ఞానియైన ఒక సలహాదారుడు, యౌవనులు తాము వివాహం చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడమేకాక, ఆ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఇతర కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది కూడా జాగ్రత్తగా గమనించాలని ప్రోత్సహించాడు.

యేసు విధేయతను చూపించిన విధానం

8 విధేయత చూపించడం కష్టమైనా, యేసులాగే స్త్రీలు కూడా దానిని గౌరవప్రదమైన విషయంగా దృష్టించవచ్చు. దేవునికి విధేయత చూపించడంలో తాను కష్టాలతోపాటు హింసాకొయ్యపై మరణం అనుభవించడం ఇమిడివున్నా, దేవునికి లోబడడంలో ఆయన ఆనందించాడు. (లూకా 22:​41-44; హెబ్రీయులు 5:​7, 8; 12:⁠3) స్త్రీలు యేసును ఒక మాదిరిగా తీసుకోవచ్చు, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: ‘స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడు.’ (1 కొరింథీయులు 11:⁠3) అయితే, ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, స్త్రీలు వివాహం చేసుకుంటేనే పురుషుల శిరస్సత్వం క్రిందికి వస్తారని దీనర్థం కాదు.

9 స్త్రీలు వివాహితులైనా, అవివాహితులైనా క్రైస్తవ సంఘాన్ని పర్యవేక్షించే ఆధ్యాత్మిక అర్హతగల పురుషుల శిరస్సత్వానికి లోబడాలని బైబిలు వివరిస్తోంది. (1 తిమోతి 2:​12, 13; హెబ్రీయులు 13:​17) అలాచేసే విషయంలో స్త్రీలు దేవుని నిర్దేశాన్ని అనుసరించినప్పుడు, దేవుని సంస్థాపరమైన ఏర్పాటులో వారు దేవదూతలకు మాదిరిగా ఉంటారు. (1 కొరింథీయులు 11:​8-10) అంతేకాక, వివాహిత వృద్ధ స్త్రీలు తమ చక్కని మాదిరి మరియు సహాయకరమైన సలహాల ద్వారా, ‘తమ భర్తలకు లోబడి ఉండాలని’ యౌవనస్త్రీలకు బోధిస్తారు.​—⁠తీతు 2:​3-5.

10 సముచిత విధేయతా విలువను యేసు గ్రహించాడు. ఒక సందర్భంలో ఆయన తామిద్దరి కోసం అధికారులకు పన్ను చెల్లించమని ఆదేశిస్తూ అపొస్తలుడైన పేతురుకు పన్ను చెల్లించడానికి అవసరమైన డబ్బు ఇచ్చాడు. పేతురు ఆ తర్వాత ఇలా వ్రాశాడు: “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి.” (1 పేతురు 2:​13; మత్తయి 17:​24-27) విధేయత విషయంలో యేసు ఉంచిన అసాధారణ మాదిరి గురించి మనమిలా చదువుతాం: “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, . . . విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.”​—⁠ఫిలిప్పీయులు 2:​5-8.

11 ఈ లోకంలో కఠినస్థులైన, అన్యాయస్థులైన అధికారులకు సహితం లోబడివుండాలని క్రైస్తవులను ప్రోత్సహిస్తూ పేతురు ఇలా అన్నాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతురు 2:​21) యేసు ఎంత బాధ అనుభవించాడో, విధేయతాపూర్వకంగా ఎంతగా సహించాడో వివరించిన తర్వాత, అవిశ్వాసులైన భర్తలున్న స్త్రీలను పేతురు ఇలా ప్రోత్సహించాడు: “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.”​—⁠1 పేతురు 3:​1-2.

12 హేళన చేయబడినా, దూషించబడినా లోబడివుండడం బలహీనతకు రుజువుగా దృష్టించబడుతోంది. అయితే, యేసు అలా దృష్టించలేదు. “ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింప[లేదు]” అని పేతురు వ్రాశాడు. (1 పేతురు 2:​23) యేసు మరణాన్ని చూసిన సైనికాధికారి, ఆయనతోపాటు వ్రేలాడదీయబడిన బందిపోటు దొంగతో సహా ఆయన శ్రమపడడం గమనించిన కొందరు, కనీసం కొంతమేరకు విశ్వాసులయ్యారు. (మత్తయి 27:​38-44, 54; మార్కు 15:​39; లూకా 23:​39-43) అదే విధంగా, అవిశ్వాసులైన భర్తలు, దూషించేవారు సహితం తమ భార్యల విధేయతా ప్రవర్తనను గమనించిన తర్వాత క్రైస్తవులవుతారు. నేడు అలా జరగడానికి సంబంధించిన రుజువును మనం చూశాం.

భార్యలు అనుగ్రహం పొందగల విధానం

13 విశ్వాసులుగా మారిన భార్యలు, క్రీస్తులాంటి తమ ప్రవర్తన మూలంగా తమ భర్తలను రాబట్టుకున్నారు. ఇటీవల జరిగిన యెహోవాసాక్షుల జిల్లా సమావేశంలో ఒక భర్త తన క్రైస్తవ భార్య గురించి ఇలా చెప్పాడు: “నేను నా భార్య విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించాను. అయినా ఆమె నన్నెంతో గౌరవించేది. ఆమె ఎన్నడూ నన్ను అవమానించలేదు. తన నమ్మకాలను నాపై రుద్దేందుకు ఆమె ప్రయత్నించలేదు. ఆమె ప్రేమతో నాపట్ల శ్రద్ధ చూపించింది. ఆమె సమావేశానికి వెళ్లినప్పుడు ముందుగానే నాకు భోజనం సిద్ధంచేసి, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేది. ఆమె స్వభావం బైబిలుపై నా ఆసక్తిని రేకెత్తించింది. ఆ కారణంగానే నేనిప్పుడు సాక్షినయ్యాను!” అవును, ఆయన తన భార్య ప్రవర్తన కారణంగానే “వాక్యము లేకుండనే” రాబట్టబడ్డాడు.

14 పేతురు నొక్కిచెప్పినట్లుగా, భార్య మాట్లాడే విషయాలు కాదుగానీ ఆమె ప్రవర్తనే సత్ఫలితాలు సాధిస్తుంది. బైబిలు సత్యాలు నేర్చుకుని, క్రైస్తవ కూటాలకు హాజరవ్వాలని తీర్మానించుకున్న ఒక భార్య దీనికి ఉదాహరణగా ఉంది. “ఆగ్నెస్‌ నువ్వు ఆ గుమ్మంలోంచి బయటకు వెళ్లావో, మళ్లీ తిరిగి రావద్దు!” అని ఆమె భర్త కేకలు వేశాడు. ఆమె “ఆ గుమ్మంలోంచి”కాక, వేరే గుమ్మంలోంచి బయటకు వెళ్లింది. తర్వాతి కూటం రాత్రి ఆయన, “నువ్వు తిరిగొచ్చేసరికి నేనింట్లో ఉండను” అని బెదిరించాడు. అన్నట్లే ఆయన మూడు రోజులదాకా ఇంటికి రాలేదు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆమె ప్రేమగా “భోజనం చేస్తారా” అని అడిగింది. యెహోవాపట్ల తనకున్న భక్తి విషయంలో ఆగ్నెస్‌ ఎప్పుడూ తప్పిపోలేదు. ఆమె భర్త చివరకు బైబిలు అధ్యయనానికి అంగీకరించి, దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, ఆయన ఆ తర్వాత పైవిచారణకర్తగా సేవచేసి అనేక బాధ్యతలు నిర్వహించాడు.

15 పైన ప్రస్తావించబడిన భార్యలు ప్రదర్శించిన ‘అలంకారాన్ని’ అపొస్తలుడైన పేతురు సిఫారసు చేశాడు, అది ‘జడలు అల్లుకోవడానికి, వస్త్రాలు ధరించుకోవడానికి’ అత్యధిక శ్రద్ధనిచ్చే అలంకారం కాదు. బదులుగా, “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది” అని పేతురు అన్నాడు. ధిక్కారంగా మాట్లాడడంలో లేదా దబాయించి అడగడంలో కాదుగానీ, సముచితమైన మాట తీరులో, ప్రవర్తనలో ఈ స్వభావం ప్రతిబింబిస్తుంది. అలా ఒక క్రైస్తవ భార్య తన భర్తపట్ల ప్రగాఢ గౌరవం ప్రదర్శిస్తుంది.​—⁠1 పేతురు 3:​3, 4.

అనుసరించవలసిన మాదిరులు

16 పేతురు ఇలా వ్రాశాడు: “పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.” (1 పేతురు 3:⁠5) యెహోవా ఉపదేశాన్ని లక్ష్యపెట్టి ఆయనను సంతోషపెట్టడం, తమకు కుటుంబ సంతోషాన్నేకాక, నిత్యజీవమనే ప్రతిఫలాన్ని కూడా తెస్తుందని వారు గ్రహించారు. పేతురు, రూపవతియైన అబ్రాహాము భార్య శారా గురించి వ్రాస్తూ ఆమె “అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను” అని పేర్కొన్నాడు. దూర దేశంలో సేవ చేసేందుకు దేవుడు నియమించిన దైవభయంగల తన భర్తకు శారా మద్దతిచ్చింది. ఆమె తన సుఖప్రదమైన జీవనశైలిని విడిచిపెట్టడమేకాక, ప్రాణాపాయ స్థితిలో జీవించేందుకు కూడా సిద్ధపడింది. (ఆదికాండము 12:​1, 10-13) శారా ధైర్యవంతమైన మాదిరిని ప్రశంసిస్తూ పేతురు ఇలా అన్నాడు: “మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్న యెడల ఆమెకు పిల్లలగుదురు.”​—⁠1 పేతురు 3:⁠6.

17 పేతురు మదిలో అబీగయీలు కూడా ఉండివుండవచ్చు, ఆమె దేవునిపై విశ్వాసముంచిన మరో ధైర్యస్థురాలు. ఆమె ‘సుబుద్ధిగలది,’ కానీ ఆమె భర్త నాబాలు మాత్రం ‘మోటువాడు, దుర్మార్గుడు.’ దావీదుకు ఆయన మనుష్యులకు సహాయం చేసేందుకు నాబాలు తిరస్కరించినప్పుడు, వారు నాబాలును అతని ఇంటివారందరినీ హతమార్చేందుకు సిద్ధపడ్డారు. కానీ అబీగయీలు తన ఇంటివారిని రక్షించేందుకు చర్య తీసుకుంది. దావీదు ఆయన మనుష్యులు బయలుదేరి వస్తుండగా, ఆమె ఆహార పదార్థాల్ని గాడిదలపై వేసుకొని ఎదురువెళ్లి ఆయనను కలిసింది. దావీదును చూసినవెంటనే ఆమె గాడిద మీదనుండి క్రిందికి దిగి ఆయన పాదాలు పట్టుకొని తొందరపడవద్దని ఆయనను బ్రతిమలాడింది. దానికి దావీదు చలించిపోయి ఆమెతో ఇలా అన్నాడు: “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. . . . నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.”​—⁠1 సమూయేలు 25:​2-33.

18 షూలమ్మీతీ అనే యువతి భార్యలకు మరో చక్కని మాదిరి, ఈ యువతి తాను పెళ్లి చేసుకోబోయే మామూలు గొర్రెల కాపరిపట్ల నమ్మకంగా ఉంది. సంపన్నుడైన రాజు ఆమెను ప్రేమపూర్వకంగా ఆకర్షించేందుకు ఎంత ప్రయత్నించినా ఆ గొర్రెల కాపరిపట్ల ఆమెకున్న ప్రేమ చెక్కుచెదరలేదు. ఆ యువ గొర్రెల కాపరిపట్ల తన భావాలను వ్యక్తపర్చేందుకు కదిలించబడి ఆమె ఇలా అన్నది: “ప్రేమ మరణమంత బలవంతమైనది . . . నీ హృదయముమీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధసముద్రజలము ప్రేమను ఆర్పజాలదు, నదీప్రవాహములు దాని ముంచివేయజాలవు.” (పరమగీతము 8:​6, 7) అలాగే, వివాహానికి ఒప్పుకున్న స్త్రీలందరూ తమ భర్తలపట్ల నమ్మకంగా ఉంటూ వారిపట్ల ప్రగాఢ గౌరవాన్ని ప్రదర్శించాలని తీర్మానించుకొందురు గాక.

అదనపు దైవిక ఉపదేశం

19 చివరగా, మన ముఖ్యలేఖన సందర్భాన్ని పరిశీలించండి: ‘స్త్రీలారా, మీ సొంతపురుషులకు లోబడియుండండి.’ (ఎఫెసీయులు 5:​22) ఎందుకు లోబడివుండాలి? ఎందుకంటే, “క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు” అని తర్వాతి వచనం చెబుతోంది. అందువల్ల భార్యలకు ఇలా నొక్కిచెప్పబడింది: “సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను.”​—⁠ఎఫెసీయులు 5:​23, 24, 33.

20 ఆ ఆజ్ఞకు విధేయులయ్యేందుకు భార్యలు, క్రీస్తు అభిషిక్త అనుచరుల సంఘంయొక్క మాదిరిని అధ్యయనంచేసి, ఆ మాదిరిని అనుకరించాలి. దయచేసి 2 కొరింథీయులు 11:​23-28 చదివి, ఆ సంఘంలో ఒక సభ్యుడైన అపొస్తలుడైన పౌలు తన శిరస్సైన యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉండడంలో ఏమేమి సహించాడో తెలుసుకోండి. పౌలులాగే, భార్యలేకాక, సంఘస్థులందరూ యేసుపట్ల నమ్మకంగా విధేయులైవుండాలి. భార్యలు తమ భర్తలకు లోబడివుండడం ద్వారా దీనిని ప్రదర్శిస్తారు.

21 నేడు చాలామంది భార్యలు, భర్తలకు లోబడివుండాలంటే చికాకుపడవచ్చు, అయితే జ్ఞానియైన స్త్రీ దాని ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. ఉదాహరణకు, అవిశ్వాసియైన భర్తవున్న భార్య విషయానికొస్తే దేవుని నియమాల్ని లేదా సూత్రాల్ని ఉల్లంఘించని అన్ని విషయాల్లో ఆయన శిరస్సత్వానికి లోబడడం ఆమెకు ‘తన భర్తను రక్షించుకోగల’ అద్భుతమైన ప్రతిఫలాన్ని తీసుకురావచ్చు. (1 కొరింథీయులు 7:​13, 16) అంతేకాక, ఆమె తన ప్రవర్తనా రీతిని యెహోవా ఆమోదిస్తున్నాడనే సంతృప్తితో ఉండడమేకాక, తన ప్రియకుమారుని మాదిరిని అనుకరిస్తున్నందుకు ఆమెను ఆయన మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• భర్తను గౌరవించడం భార్యకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

• వివాహ ప్రతిపాదనను అంగీకరించే విషయం ఎందుకంత గంభీరమైనది?

• భార్యలకు యేసు ఎలా ఒక మాదిరిగా ఉన్నాడు, ఆయన మాదిరిని అనుసరించడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1. భర్తను గౌరవించడం తరచూ ఎందుకు కష్టంగా ఉంటుంది?

2. ఇటీవలి కాలాల్లో, వివాహంపట్ల స్త్రీల దృక్పథంలో, పాత్రలో ఎలాంటి మార్పువచ్చింది?

3. వివాహంపై ఏ ప్రాథమిక సమస్య ప్రభావం చూపిస్తోంది?

4, 5. (ఎ) వివాహం గురించి ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎందుకు మంచిది? (బి) పెళ్లికి ఒప్పుకోవడానికి ముందు ఒక స్త్రీ ఏమిచేయాలి?

6. నేడు చాలామంది స్త్రీలు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు, అది ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది?

7. జతను ఎంచుకునే విషయంలో ఎలాంటి జ్ఞానయుక్తమైన సలహా ఇవ్వబడింది?

8, 9. (ఎ) యేసు తాను దేవునికి లోబడి ఉండడాన్ని ఎలా దృష్టించాడు? (బి) విధేయత చూపించడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

10. విధేయత చూపించడంలో యేసు ఏ మాదిరి ఉంచాడు?

11. అవిశ్వాసులైన భర్తలకు సహితం లోబడివుండాలని పేతురు ఎందుకు భార్యలను ప్రోత్సహించాడు?

12. యేసు కనబరచిన విధేయతా విధానంవల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగాయి?

13, 14. అవిశ్వాసులైన భర్తలకు లోబడడం ఎలా ప్రయోజనకరంగా ఉంది?

15. క్రైస్తవ భార్యలకు ఏ విధమైన “అలంకారము” సిఫారసు చేయబడింది?

16. శారా ఏయే విధాలుగా క్రైస్తవ భార్యలకు చక్కని మాదిరిగావుంది?

17. క్రైస్తవ భార్యలకు మాదిరిగా అబీగయీలు పేతురు మదిలో ఎందుకు ఉండివుండవచ్చు?

18. పరాయివ్యక్తి ప్రేమపూర్వక ఆకర్షణలచేత శోధించబడినప్పుడు భార్యలు ఎవరి మాదిరిని ధ్యానించాలి, ఎందుకు?

19, 20. (ఎ) ఏ కారణాన్నిబట్టి భార్యలు తమ భర్తలకు లోబడాలి? (బి) భార్యలకు ఎలాంటి చక్కని మాదిరి ఉంచబడింది?

21. భార్యలు తమ భర్తలకు లోబడివుండేలా ఏ విషయాలు పురికొల్పగలవు?

[19వ పేజీలోని చిత్రం]

వివాహ ప్రతిపాదనకు ఒప్పుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడం ఎందుకంత గంభీరమైన విషయం?

[21వ పేజీలోని చిత్రం]

అబీగయీలు వంటి, బైబిల్లో ప్రస్తావించబడిన వ్యక్తుల మాదిరినుండి భార్యలు ఏమి నేర్చుకోవచ్చు?