కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన అందమైన భూమ్మీద జీవితాన్ని ఆనందించండి

మన అందమైన భూమ్మీద జీవితాన్ని ఆనందించండి

మన అందమైన భూమ్మీద జీవితాన్ని ఆనందించండి

అనంత దూరాలవరకు విస్తరించివున్న విశ్వంలో, వ్యోమగాములకు మానవ గృహం కేవలం ఒక చిన్న చుక్కగానే కనిపించింది. భౌతిక విశ్వంలో మరెక్కడా జీవపు జాడలు కనిపించలేదు. కేవలం భూగ్రహం మీదనే జీవం ఉనికిలో ఉండడానికి అవసరమైన అనువైన పరిస్థితులున్నాయి.

అంతేకాక, అందమైన ఈ భూగోళంమీద మనం జీవితాన్ని ఆనందించవచ్చు. శీతాకాలంలోని ఒకరోజు సూర్యరశ్మి మనపై పడితే మనకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా! అద్భుతమైన సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసి పరవశించనివారు మనలో ఎవరైనా ఉన్నారా? నిజమే, మన సూర్యుడు కేవలం మనకు మనోల్లాసాన్ని మాత్రమే కలిగించడు. సూర్యుడు మన మనుగడకే చాలా ప్రాముఖ్యం.

కోట్లాది సంవత్సరాలుగా సూర్యుని గురుత్వాకర్షణ శక్తి భూమిని, ఇతర గ్రహాలను స్థిరమైన కక్ష్యల్లో ఉంచుతోంది. విద్యార్థులు పాఠశాలలో నేర్చుకుంటున్నట్లు, మన పాలపుంత నక్షత్ర వీధి మధ్యభాగం చుట్టూ ఉన్న కక్ష్యలో సౌరకుటుంబమంతా పరిభ్రమిస్తోంది. అయితే మన పాలపుంత నక్షత్ర వీధి మధ్యభాగం చుట్టూ పరిభ్రమించే 10,000 కోట్లకన్నా ఎక్కువ నక్షత్రాల్లో సూర్యుడు ఒకటి మాత్రమే.

పాలపుంత నక్షత్ర వీధి దాదాపు 35 నక్షత్ర వీధుల గుచ్ఛములో, గురుత్వాకర్షణ శక్తి ద్వారా బంధించబడి ఉంది. పెద్ద గుచ్ఛముల్లో వేలాది నక్షత్ర వీధులు ఉంటాయి. మన సౌరకుటుంబం మరింత పెద్దదైన, దట్టమైన నక్షత్ర వీధుల గుచ్ఛములో ఉండివుంటే అది అంత స్థిరంగా ఉండకపోయేది. అయితే, “సంక్లిష్టమైన జీవం ఉనికిలో ఉండడానికి మన సౌరకుటుంబమంత అనుకూలంగా” విశ్వంలోని మరింకే భాగమూ లేదని గిల్యర్మో గోన్సాలాస్‌, జే డబ్యూ. రిచర్డ్స్‌లు ద ప్రివిలేజ్డ్‌ ప్లానెట్‌ అనే తమ పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ గ్రహమ్మీద జీవం యాదృచ్ఛికంగా జరిగిన “మహా విస్పోటనం”కు సంబంధించిన ఏదో ఒక దశలో అకస్మాత్తుగా ఉనికిలోకి వచ్చిందా? లేక అందమైన ఈ భూగ్రహమ్మీద జీవానికి గొప్ప సంకల్పమేదైనా ఉందా?

చాలామంది మన భూగృహం జీవనాధారంగా ఉండేందుకే నిర్దిష్టంగా రూపొందించబడిందనే నిర్ధారణకు వచ్చారు. * శతాబ్దాల క్రితం, ఒక హీబ్రూ కవి భూమిని, పరలోకాన్ని వర్ణించాడు. ఆయన ఇలా రాశాడు: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?” (కీర్తన 8:​3, 4) ఒక సృష్టికర్త ఈ విశ్వాన్ని సృష్టించాడని ఆ కవి నమ్మాడు. మనముంటున్న వైజ్ఞానిక యుగంలో అది సహేతుకమైన నిర్ధారణే అని చెప్పవచ్చా?

[అధస్సూచి]

^ పేరా 7 కీర్తనల పుస్తకాన్ని, ప్రత్యేకంగా 8వ కీర్తనను చూడండి.

[3వ పేజీలోని బాక్సు/చిత్రం]

“దూరం నుండి చూస్తే చీకటిగా ఉన్న అంతరిక్షంలో భూమి నీలివర్ణ మరకతంలా మెరుస్తుంది” అని ది ఇలస్ట్రేటెడ్‌ సైన్స్‌ ఎన్‌సైక్లోపీడియా​—⁠అమేజింగ్‌ ప్లానెట్‌ ఎర్త్‌ పేర్కొంటోంది.

[చిత్రసౌజన్యం]

భూగోళం: U.S. Fish & Wildlife Service, Washington, D.C./NASA