కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విపరీత వైఖరిని ఎందుకు అలవర్చుకోకూడదు?

విపరీత వైఖరిని ఎందుకు అలవర్చుకోకూడదు?

విపరీత వైఖరిని ఎందుకు అలవర్చుకోకూడదు?

సమతుల్యతకు అత్యుత్తమ మాదిరి యెహోవాయే. “ఆయన కార్యము సంపూర్ణము,” ఆయన అన్నివేళలా కరుణతోనే న్యాయం తీరుస్తాడు కాబట్టి అది ఎన్నడూ కఠినంగా ఉండదు. (ద్వితీయోపదేశకాండము 32:⁠4) తన పరిపూర్ణ నియమాలకు అనుగుణంగా ఆయన చర్య తీసుకుంటాడు కాబట్టి ఆయన ప్రేమ ఎప్పుడూ సూత్రాధారంగానే ఉంటుంది. (కీర్తన 89:⁠14; 103:​13, 14) మన మొదటి తల్లిదండ్రులు అన్ని విషయాల్లోనూ సమతుల్యంగా ఉండేలా సృష్టించబడ్డారు. వారు ఏ విషయంలోనూ విపరీత వైఖరిని అలవర్చుకునే అవకాశమే లేదు. అయితే, పాపం చేయడంతో వారు “కళంకులై” లేదా అపరిపూర్ణులై తమ సమతుల్యతను కోల్పోయారు.​—⁠ద్వితీయోపదేశకాండము 32:⁠5.

దాన్నిలా ఉదాహరించవచ్చు: టైరు ఉబ్బి ఉన్న కారు లేదా సైకిలును మీరు ఎప్పుడైనా నడిపారా? అలా ఉండడంవల్ల కుదుపులు ఎక్కువగా ఉండి మీ ప్రయాణం ఏమంత సాఫీగా సాగదు, అలాగే అది సురక్షితం కూడా కాదు. అలాంటి టైరు మరింత పాడవకముందే లేక పంచరవకముందే దాన్ని బాగుచేసుకోవాలి. అదే విధంగా, మన అపరిపూర్ణ వ్యక్తిత్వంలో లోపాలకు అవకాశముంది. మనమా లోపాలు అధికమయ్యేందుకు అనుమతిస్తే, మన జీవన ప్రయాణం సాఫీగా సాగకపోవడమే కాక అది ప్రమాదకరంగా తయారవగలదు.

కొన్నిసార్లు మనలోని మంచి లక్షణాలు లేదా మన సామర్థ్యాలు మనం విపరీత వైఖరిని అలవర్చుకునేలా చేస్తాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు తమ బట్టల అంచులకు కుచ్చులు పెట్టుకోవాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించినా, యేసు కాలంలోని పరిసయ్యులు ఇతరులకన్నా భిన్నంగా కనిపించాలనే ఉద్దేశంతో ‘తమ చెంగులు పెద్దవిగా’ చేసుకునేవారు. తమ తోటివారికన్నా మరింత పవిత్రమైనవారిగా కనిపించాలనే ఉద్దేశంతో వారలా చేసేవారు.​—⁠మత్తయి 23:⁠5; సంఖ్యాకాండము 15:​38-40.

నేడు ప్రజలు ఏమిచేసైనా చివరకు ఇతరులను ఆశ్చర్యపరిచైనా వారి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంటారు. నిజానికి అలాంటివారు, “నన్ను గమనించండి! నేనంటూ ఒక వ్యక్తిని ఉన్నాను!” అని మొరపెడుతుండవచ్చు. అయితే, వస్త్రధారణలో, వైఖరుల్లో, చర్యల్లో విపరీత వైఖరిని అలవర్చుకోవడం క్రైస్తవుల నిజ అవసరాల్ని పూరించలేదు.

పని విషయంలో సమతుల్య వైఖరి

మనం ఎవరమైనా, ఎక్కడ నివసిస్తున్నా ప్రయోజనకరమైన పని చేయడం మన జీవితాలను అర్థవంతం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. అలాంటి పనినుండి సంతృప్తి పొందేలా మనం సృష్టించబడ్డాం. (ఆదికాండము 2:​15) అందుకే బైబిలు సోమరితనాన్ని ఖండిస్తోంది. “ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదు” అని అపొస్తలుడైన పౌలు ముక్కుసూటిగా చెప్పాడు. (2 థెస్సలొనీకయులు 3:​10) నిజానికి పనిపట్ల అలాంటి నిర్లిప్తత పేదరికాన్ని అసంతృప్తినే తెస్తుంది కానీ దేవుని ఆమోదాన్ని కాదు.

అనేకమంది పనిలో తలమునకలయ్యే వైఖరిని అంటే తమను తాము పనికి బానిసలుగా చేసుకునే విపరీత వైఖరిని అలవర్చుకుంటారు. వేకువనే పనికి వెళ్లిపోయి ఇంటికి ఆలస్యంగా తిరిగిరావడం వంటివి చేస్తూ తమ కుటుంబ సంక్షేమం కోరే తామలా చేస్తున్నామని సమర్థించుకుంటారు. అయితే, పనిపట్ల వారికుండే అంకితభావం కారణంగా నిజానికి వారి కుటుంబాలు బలౌతుంటాయి. తరచూ తన ఉద్యోగ స్థలంలో అదనపు గంటలు గడిపే భర్త ఉన్న భార్య ఇలా అంటోంది: “నా భర్త నాతో, పిల్లలతో కాస్త సమయం గడపడం కోసం నేను విలాసవంతమైన మా ఇంట్లోని వస్తువులన్నీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను.” అతిగా పని చేయాలనుకునేవాళ్లు రాజైన సొలొమోను స్వీయానుభవం గురించి గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది: “అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యునిక్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.”​—⁠ప్రసంగి 2:​11.

అవును, పని విషయంలో మనం విపరీత వైఖరిని అలవర్చుకోవడం మానుకోవాలి. మనం శ్రద్ధతో పనిచేసేవారిగా ఉండవచ్చు, అయితే పనికి బానిసలమైతే అది మన సంతోషాన్ని, జీవితంలో ఇతర విషయాల్ని మనకు దూరం చేస్తుందని గుర్తుంచుకోవాలి.​—⁠ప్రసంగి 4:​5, 6.

సంతోషం విషయంలో విపరీత వైఖరిని అలవర్చుకోకండి

మన కాలంలో “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” ఉంటారని బైబిలు ముందుగానే చెప్పింది. (2 తిమోతి 3:​2, 4) దేవునినుండి ప్రజల్ని దూరం చేయడానికి సాతాను ఉపయోగించే తంత్రాల్లో, సుఖభోగాల కోసం వెంపర్లాడడం అనేది అత్యంత సమర్థవంతమైనదిగా మారింది. “ఉత్కంఠభరితమైన” లేదా విపరీతమైన క్రీడల్లాంటి ఉల్లాసకార్యకలాపాల్లో లేదా వినోదంలో పాల్గొనడానికి చాలామంది ఉత్సుకత చూపిస్తున్నారు. అలాంటి క్రీడల సంఖ్య, వాటిలో పాల్గొనేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే ఉంది. వాటికి ఎందుకంత ప్రాచుర్యం లభిస్తోంది? అనేకమంది తమ దైనందిన జీవితాలతో విసిగిపోయి, నూతనోత్తేజాన్ని కోరుకుంటున్నారు. కానీ ఎప్పటికప్పుడు అలాంటి ఉత్తేజాన్ని పొందాలంటే వారు మరింత సాహసానికి తెగించాల్సివస్తుంది. నమ్మకస్థులైన క్రైస్తవులు దేవుడిచ్చిన జీవమనే బహుమతిపట్ల, జీవదాతపట్ల గౌరవంతో అలాంటి సాహస క్రీడలకు దూరంగా ఉంటారు.​—⁠కీర్తన 36:⁠9.

దేవుడు మొదటి మానవ జతను సృష్టించినప్పుడు వారిని ఎక్కడ ఉంచాడు? వారిని ఆయన ఏదెను తోటలో ఉంచాడు, ఏదెను అనే పదానికి ప్రాథమిక భాషలో “ఆహ్లాదం” లేదా “సంతోషం” అనే అర్థాలున్నాయి. (ఆదికాండము 2:⁠8) కాబట్టి మానవులు ఆహ్లాదకరమైన, సంతోషకరమైన జీవితాలను గడపాలని యెహోవా సంకల్పించాడనేది స్పష్టం.

సంతోషం విషయంలో సమతుల్య దృక్కోణం కల్గివుండడంలో యేసు అత్యుత్తమ మాదిరినుంచాడు. ఆయన యెహోవా చిత్తం చేయడానికే పూర్తిగా అంకితమై, దేవుని నియమాలకు, సూత్రాలకు అనుగుణంగా జీవించడాన్ని క్షణమాత్రమైనా విడువలేదు. తను అలసిపోయినా, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడానికి సమయం తీసుకున్నాడు. (మత్తయి 14:​13, 14) యేసు ఆతిథ్యాన్ని స్వీకరించాడు, తన జీవితంలో విశ్రమించడానికి, పునరుత్తేజం పొందడానికి సమయం వెచ్చించాడు. అలా చేస్తున్నందుకు కొందరు శత్రువులు తనను విమర్శిస్తున్నారని యేసుకు తెలుసు. వారు ఆయనను గురించి “ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు” అని చెప్పుకునేవారు. (లూకా 7:​34; 10:​38; 11:​37) అయినా, నిజమైన భక్తి చూపించడం అంటే జీవితంలో ఆహ్లాదానికి తావే లేదని అర్థం కాదని యేసు నమ్మాడు.

ఉల్లాసకార్యకలాపాల విషయంలో విపరీత వైఖరిని అలవర్చుకోవడం జ్ఞానయుక్తం కాదని స్పష్టమవుతోంది. సుఖాన్ని, వినోదాన్ని మన జీవితంలో ప్రధాన విషయాలుగా చేసుకోవడం నిజమైన సంతోషాన్నివ్వదు. అలా చేయడం దేవునితో మనకున్న సంబంధంతోపాటు మరింత ప్రాముఖ్యమైన విషయాలను మనం నిర్లక్ష్యం చేసేందుకు నడిపిస్తుంది. అయితే, మన జీవితంలో ఏ విధమైన సంతోషం లేకుండా చేసుకోకూడదు లేదా ఇతరులు సమతుల్యమైన రీతిలో జీవితాన్ని ఆనందిస్తున్నప్పుడు వారిని విమర్శించకూడదు.​—⁠ప్రసంగి 2:​24; 3:​1-4.

సమతుల్యమైన జీవితంలో సంతోషాన్ని కనుగొనండి

“అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు. (యాకోబు 3:⁠2) విపరీత వైఖరిని అధిగమించడానికి చేసే ప్రయత్నంలో కూడా అదే నిజం కావచ్చు. మరి మనం మన సమతుల్యతను ఎలా కాపాడుకోవచ్చు? దానికోసం మనం మన సామర్థ్యాలను, బలహీనతలను గుర్తించాలి. అలా ఖచ్చితంగా గుర్తించడం కష్టమే. మనకు తెలియకుండానే మనం కొంత విపరీత వైఖరిని అలవర్చుకుంటుండవచ్చు. కాబట్టి మనం పరిణతి చెందిన క్రైస్తవులతో సన్నిహితంగా సహవసించడం, వారి సమతుల్యమైన సలహాలను వినడం జ్ఞానయుక్తం. (గలతీయులు 6:⁠1) నమ్మకమైన స్నేహితుడినో లేక సంఘంలో అనుభవమున్న పెద్దనో అలాంటి సలహాల కోసం అడగవచ్చు. మనం యెహోవా దృక్కోణం నుండి చూస్తే మనం ఎంత సమతుల్యత కలిగి ఉన్నామో పరిశీలించుకోవడానికి లేఖనాలతోపాటు అలాంటి బైబిలు ఆధారిత ఉపదేశం “అద్దము”లా పనిచేస్తుంది.​—⁠యాకోబు 1:​22-25.

సంతోషకరంగా, మనం అలాంటి విపరీత వైఖరులతో కూడిన జీవితాల్ని గడపాల్సిన అవసరం లేదు. పట్టుదలతో, యెహోవా ఆశీర్వాదాలతో మనం సమతుల్యమైన జీవితాన్ని గడుపుతూ, తద్వారా ఆనందాన్ని పొందవచ్చు. అలా చేయడంవల్ల మన క్రైస్తవ సహోదర సహోదరీలతో మన సంబంధాలు మెరుగౌతాయి, మనం ప్రకటించేవారికి మనం మరింత ఉత్తమమైన మాదిరులుగా ఉండవచ్చు. అన్నింటికంటే ఎక్కువగా మనం సమతుల్యతను పాటించే మన ప్రేమగల దేవుడైన యెహోవాను మరింతగా అనుకరిస్తాం.​—⁠ఎఫెసీయులు 5:⁠1.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

©Greg Epperson/age fotostock