సాటిలేని మన సౌరకుటుంబం ఎలా ఉనికిలోకి వచ్చింది?
సాటిలేని మన సౌరకుటుంబం ఎలా ఉనికిలోకి వచ్చింది?
ఈ విశ్వంలోని మన సౌరకుటుంబం ప్రత్యేక స్థానంలో నెలకొని ఉండేందుకు అనేక విషయాలు తోడ్పడుతున్నాయి. పాలపుంత నక్షత్ర వీధిలోని రెండు సర్పిలముల మధ్య నక్షత్రాలు అంతగాలేని భాగంలో మన సౌరకుటుంబం నెలకొనివుంది. రాత్రిపూట మనం చూసే నక్షత్రాల్లో అనేకం మనకు ఎంత దూరంలో ఉన్నాయంటే, వాటిని అతిపెద్ద దుర్భిణుల సహాయంతో గమనించినా అవి కేవలం కాంతిబిందువులుగానే కనిపిస్తాయి. మన సౌరకుటుంబం అలాంటి భాగంలోనే ఉండాలా?
మన సౌరకుటుంబం పాలపుంత నక్షత్ర వీధి మధ్యభాగానికి దగ్గరగా ఉండివుంటే, ఒకేచోట దట్టంగా ఉన్న నక్షత్రాల మధ్య ఉండడంవల్ల ఎదురయ్యే హానికర ప్రభావాలకు మనం గురౌతాం. ఉదాహరణకు, భూకక్ష్యలో మార్పువచ్చి మానవజీవితం గమనార్హమైన రీతిలో ప్రభావితం కావచ్చు. ఈ ప్రమాదంతోపాటు వాయుమేఘాల గుండా వెళ్తున్నప్పుడు అధిక ఉష్ణోగ్రతకు గురికావడం, విస్ఫోటం చెందే నక్షత్రాల నుండి, ప్రాణాంతక రేడియోధార్మికతను విడుదల చేసే ఇతర ఆకాశగ్రహాల నుండి రక్షణ లేకుండా పోవడం వంటి ఇతర ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు సౌరకుటుంబం ఖచ్చితంగా సరైన స్థానంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది.
సూర్యుడు మన అవసరాలకు తగిన నక్షత్రం. అనాదిగా ఉనికిలోవున్న ఆ నక్షత్రం నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అది మరీ పెద్దగా లేదు అలాగే దాని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు. మన నక్షత్ర వీధిలో ఉన్న అనేక నక్షత్రాలు మన సూర్యునికన్నా చాలా చిన్నవి, ఆ నక్షత్రాలు సరైన కాంతి ప్రసరించకపోవడమేకాక భూమి వంటి గ్రహాలమీద జీవాన్ని పోషించేందుకు తగినంత ఉష్ణోగ్రతను కూడా అందించలేవు. అంతేకాక, అనేక నక్షత్రాలు గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒక నక్షత్రంతో లేక అంతకన్నా ఎక్కువ నక్షత్రాలతో బంధించబడి, ఒకదాని చుట్టూ మరొకటి పరిభ్రమిస్తాయి. అలాంటివాటికి భిన్నంగా మన సూర్యుడు స్వతంత్రంగా తిరుగుతాడు. మన సౌరకుటుంబం ఒకటి లేక అంతకన్నా ఎక్కువ సూర్యుళ్ళ గురుత్వాకర్షణ శక్తికి గురైతే అది స్థిరంగా ఉండకపోవచ్చు.
మన సౌరకుటుంబాన్ని సాటిలేనిదిగా చేసే మరో అంశం, ఇంచుమించు గుండ్రటి కక్ష్యల్లో తిరుగుతూ భూమిలాంటి అంతర గ్రహాలకు విఘాతం కలిగించే గురుత్వాకర్షణ శక్తి లేని అతిపెద్ద బాహ్యగ్రహాల స్థానాలు. * ఆ బాహ్యగ్రహాలు విఘాతం కలిగించే బదులు, ప్రమాదకరమైన వస్తువులను తమవైపుకు ఆకర్షించుకొని, వాటి దారి మళ్లించడం ద్వారా అంతర గ్రహాలను రక్షిస్తాయి. “గ్రహశకలములు, తోకచుక్కలు మన గ్రహాన్ని ఢీకొంటాయి, అయితే మన గ్రహానికి ఆవలివైపున వాయుపదార్థాలే అధికంగా ఉన్న బృహస్పతి వంటి గ్రహాలున్న కారణంగా అవి అధిక సంఖ్యలో మన గ్రహాన్ని ఢీకొనవు” అని పీటర్ డీ. వార్డ్ మరియు డొనాల్డ్ బ్రౌన్లీ అనే శాస్త్రవేత్తలు, రేర్ ఎర్త్—వై కాంప్లెక్స్ లైఫ్ ఈజ్ అన్‌కామన్ ఇన్ ది యూనివర్స్ అనే తమ పుస్తకంలో వివరిస్తున్నారు. అతిపెద్ద గ్రహాలున్న మన సౌరకుటుంబం లాంటి ఇతర వ్యవస్థలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే భూమి వంటి చిన్న గ్రహాలకు ప్రమాదకరంగా పరిణమించే కక్ష్యలు ఆ అతిపెద్ద గ్రహాల్లో చాలావాటికి ఉన్నాయి.
చంద్రుని పాత్ర
ప్రాచీనకాలాల నుండి మానవులు చంద్రుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు గురౌతున్నారు. అది కవులకు, సంగీత విద్వాంసులకు ప్రేరణనిచ్చింది. ఉదాహరణకు, ఒక ప్రాచీన హీబ్రూ కవి చంద్రుణ్ణి ‘శాశ్వతంగా స్థిరపర్చబడిన మింటనుండు నమ్మకమైన సాక్షి’ అని వర్ణించాడు.—కీర్తన 89:35-37.
చంద్రుడు భూమ్మీద జీవాన్ని ప్రభావితం చేసే ప్రాముఖ్యమైన విధాల్లో, దాని గురుత్వాకర్షణ శక్తి ద్వారా సముద్రంలో
అలల ఆటుపోట్లు కలిగించడం ఒకటి. ఈ ఆటుపోట్లు మహాసముద్ర ప్రవాహాలు కలగడానికి చాలా అవసరమని భావించబడుతోంది, అలాగే ఆ ప్రవాహాలు వాతావరణ మార్పులకు ఎంతో అవసరం.మన చంద్రునివల్ల కలిగే మరో కీలకమైన ప్రయోజనం ఏమిటంటే, భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి దాని అక్షాన్ని స్థిరపరుస్తుంది. నేచర్ అనే విజ్ఞానశాస్త్ర పత్రిక ప్రకారం, చంద్రుడే లేకుంటే భూమి అక్షపు వాలు దీర్ఘకాలాలపాటు “దాదాపు 0 [డిగ్రీల] నుండి 85 [డిగ్రీల] వరకు” మారుతూ ఉంటుంది. ఒకవేళ భూమి అక్షం ఒరిగి లేనట్లయితే ఏమి జరుగుతుందో కాస్త ఊహించండి! మనోల్లాసాన్ని కలిగించే రుతువుల మార్పును మనం చూడలేం, వర్షాభావ పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుంది. భూమి అక్షం ఒరిగివుండడం, ఉష్ణోగ్రతలు మన మనుగడకు ప్రమాదకరంగా మారే స్థాయికి చేరకుండా ఉండేందుకు కూడా దోహదపడుతుంది. జాక్ లాస్కార్ అనే ఖగోళశాస్త్రజ్ఞుడు, “చంద్రునివల్లే మన ప్రస్తుత వాతావరణంలో స్థిరత్వం ఉంది” అనే నిర్ధారణకు వచ్చాడు. మన చంద్రుడు స్థిరపరిచే పాత్రను పోషించేందుకు వీలుగా పెద్దగా, వేరే అతిపెద్ద గ్రహాలకున్న చంద్రుళ్ళకన్నా పెద్దగా ఉన్నాడు.
ప్రాచీన బైబిలు పుస్తకమైన ఆదికాండము రచయిత పేర్కొన్నట్లు, భూమికున్న సహజ ఉపగ్రహం చేసే మరో పని రాత్రుళ్ళు వెన్నెలనివ్వడమే.—ఆదికాండము 1:16.
యాదృచ్ఛికంగానా లేక సంకల్పంతోనా?
భూమ్మీద జీవితం సాధ్యమవడమేకాక అది ఆహ్లాదకరంగా కూడా ఉండేందుకు అనువైన అనేక పరిస్థితులు ఒకేసారి ఎలా ఏర్పడ్డాయి? మన ముందు రెండే రెండు వివరణలు ఉన్నట్లు కనిపిస్తోంది. వాటిలో మొదటిది, ఈ వాస్తవ సంఘటనలు ఎలాంటి సంకల్పం లేకుండా యాదృచ్ఛికంగా సంభవించివుండవచ్చు. రెండవది, వాటి వెనుక ఏదో చక్కని సంకల్పం ఉండవచ్చు.
సృష్టికర్త అయిన సర్వశక్తిగల దేవుడు మన విశ్వాన్ని రూపొందించి సృష్టించాడని వేలాది సంవత్సరాల క్రితం పరిశుద్ధ లేఖనాలు పేర్కొన్నాయి. అదే నిజమైతే మన సౌరకుటుంబంలోని పరిస్థితులు యాదృచ్ఛికంగా ఏర్పడలేదు గానీ ఒక ఉద్దేశంతో రూపకల్పన చేయబడ్డాయని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, భూమ్మీద జీవితం సాధ్యమయ్యేలా చేసేందుకు తాను తీసుకున్న చర్యల గురించిన వృత్తాంతాన్ని సృష్టికర్త మనకిచ్చాడు. ఈ వృత్తాంతం దాదాపు 3,500 సంవత్సరాల పురాతనమైనదైనా, దానిలో వర్ణించబడిన విశ్వ చరిత్రకు సంబంధించిన సంఘటనలకూ, ఏమి జరిగి ఉంటుందని విజ్ఞానశాస్త్రజ్ఞులు నమ్ముతున్నారో వాటికీ ఎంతో దగ్గరి పోలికవుందని తెలుసుకొని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈ వృత్తాంతం బైబిలు పుస్తకమైన ఆదికాండములో ఉంది. అది ఏమి వివరిస్తుందో పరిశీలించండి.
ఆదికాండములోని సృష్టి వృత్తాంతం
“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” (ఆదికాండము 1:1) బైబిల్లోని ఆ ప్రారంభ వాక్యాలు, మన గ్రహంతోపాటు మన విశ్వంలోని వందలకోట్ల నక్షత్ర వీధుల్లో ఉన్న నక్షత్రాల సృష్టి గురించి, మన సౌరకుటుంబ సృష్టి గురించి ప్రస్తావిస్తున్నాయి. బైబిలు ప్రకారం, ఒకప్పుడు భూమి ఉపరితలం “నిరాకారముగాను శూన్యముగాను” ఉంది. అప్పుడు ఖండాల్లేవు, ఫలవంతమైన నేలలేదు. ఒక గ్రహం జీవనాధారంగా ఉండాలంటే దానిలో నీరు పుష్కలంగా ఉండడం ఎంతో ప్రాముఖ్యమని విజ్ఞానశాస్త్రవేత్తలు అంటారు, తర్వాతి వాక్యాలు దాని గురించే ప్రస్తావించాయి. దేవుని ఆత్మ “జలములపైన అల్లాడుచుండెను.”—ఆదికాండము 1:2.
ఉపరితలంమీద ఉన్న నీరు ద్రవ రూపంలో ఉండాలంటే, ఒక గ్రహం దాని సూర్యుని నుండి సరైన దూరంలో ఉండాలి. “అంగారకగ్రహం అతి శీతలంగా, శుక్రగ్రహం అతి వేడిగా ఉంటాయి, భూమి ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటుంది” అని గ్రహాలను పరిశోధించే శాస్త్రవేత్త ఆండ్రూ ఇంజర్సాల్ వివరించాడు. అలాగే పచ్చిక పెరగాలంటే తగినంత కాంతి అవసరం. గమనార్హంగా, సృష్టి ప్రారంభంలో, శిశువుకు చుట్టబడే “పొత్తిగుడ్డ”లా మహాసముద్రాన్ని ఆవరించిన నల్లని నీటి మేఘాలను సూర్యకాంతి ఛేదించుకుని వచ్చేలా దేవుడు చేశాడు.—యోబు 38:4, 9; ఆదికాండము 1:3-5.
ఆదికాండములోని తర్వాతి వచనాల్లో, బైబిలు “విశాలము” అని పేర్కొంటున్న దానిని సృష్టికర్త సృష్టించాడని మనం చదువుతాం. (ఆదికాండము 1:6-8) ఈ విశాలము వాయువులతో నింపబడి, భూవాతావరణంగా ఏర్పడింది.
దేవుడు నిరాకారంగావున్న భూ ఉపరితలాన్ని ఆరిన నేలగా మార్చాడని బైబిలు ఆ తర్వాత వివరిస్తోంది. (ఆదికాండము 1:9, 10) ఆయన భూ ఉపరితలం కొన్నిచోట్ల లోపలికి నొక్కుకుపోయి కొన్నిచోట్ల పైకి వచ్చేలా చేసివుండవచ్చు. దానివల్ల లోతైన గోతులు ఏర్పడి, మహాసముద్రంలో నుండి ఖండాలు బయటికి వచ్చివుండవచ్చు.—కీర్తన 104:6-8.
భూమి గత చరిత్రలోని ఏదో ఒక అనిర్దిష్ట సమయంలో, దేవుడు మహాసముద్రంలో సూక్ష్మాతిసూక్ష్మమైన నాచును సృష్టించాడు. స్వీయ పునరుత్పాదక శక్తివున్న ఆ ఏకకణ జీవులు సూర్యుని నుండి వచ్చే శక్తిని ఉపయోగించుకుంటూ కార్బన్‌డయాక్సైడ్‌ను ఆహారంగా మార్చుకుని వాతావరణంలోకి ఆమ్లజనిని విడుదల చేయడం మొదలుపెట్టాయి. మూడవ సృష్టికాలంలో పచ్చిక సృష్టించబడడం ద్వారా ఈ అద్భుతమైన ప్రక్రియ వేగవంతమైంది, చివరకు ఆ పచ్చిక భూమంతటినీ కప్పేసింది. అలా వాతావరణంలో ఆమ్లజని శాతం పెరిగి మానవులు, జంతువులు గాలిని పీల్చుకొని జీవించేందుకు అనువుగా భూమి తయారైంది.—ఆదికాండము 1:11, 12.
సృష్టికర్త భూమిని ఫలవంతంగా మార్చడానికి నేలలో వివిధరకాల సూక్ష్మజీవులను సృష్టించాడు. (యిర్మీయా 51:15) ఆ చిన్న ప్రాణులు, మృత పదార్థాలు కుళ్లిపోయేలా చేసి, తిరిగి వాటిని మొక్కలు పెరిగేందుకు ఉపయోగించుకునే మూలపదార్థాలుగా చేస్తాయి. నేలలో ఉండే ప్రత్యేక రకానికి చెందిన సూక్ష్మక్రిములు గాలిలో నుండి నత్రజనిని గ్రహించి, మొక్కలు పెరిగేందుకు తోడ్పడే ఈ ప్రాముఖ్యమైన మూలపదార్థాన్ని వాటికి అందిస్తాయి. ఆశ్చర్యకరంగా, గుప్పెడు సారవంతమైన నేలలో ఆరువందలకోట్ల సూక్ష్మజీవులు ఉండవచ్చు!
సూర్యచంద్రులు, నక్షత్రాలు నాల్గవ సృష్టికాలంలో ఏర్పడినట్లు ఆదికాండము 1:14-19 వచనాలు వివరిస్తున్నాయి. ఈ వచనాలను మొదటిసారి చదివినప్పుడు, అవి పైన ఇవ్వబడిన లేఖన వివరణకు విరుద్ధంగా ఉన్నాయని అనిపించవచ్చు. అయితే, ఆదికాండము రచయిత అయిన మోషే, సృష్టి వృత్తాంతాన్ని ఒకవేళ ఒక వ్యక్తి భూమ్మీదనుండి గమనిస్తే ఎలా ఉంటుందో ఆ దృక్కోణంలో వర్ణించాడని గుర్తుంచుకోండి. సూర్యచంద్రులు, నక్షత్రాలు భూవాతావరణంలో అప్పుడే కనిపించివుండవచ్చు.
ఆదికాండము వృత్తాంతం, ఐదో సృష్టి కాలంలో సముద్ర జీవాలు ఉనికిలోకి వచ్చాయని, భూజంతువులు, మానవుడు ఆరో సృష్టి కాలంలో ఉనికిలోకి వచ్చారని చెబుతోంది.—ఆదికాండము 1:20-31.
మానవులు భూమ్మీద జీవితాన్ని ఆనందించేలా అది సృష్టించబడింది
ఆదికాండము వృత్తాంతంలో వర్ణించబడినట్లు భూమ్మీద ఉనికిలోకి వచ్చిన జీవం, మనం ఆనందించే విధంగా
సృష్టించబడినట్లు మీకు అనిపించడంలేదా? ప్రకాశవంతమైన ఒకరోజు మీరు మేల్కొని, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, సజీవంగా ఉన్నందుకు ఎప్పుడైనా సంతోషించారా? బహుశా మీరు తోటలో వాహ్యాళికి వెళ్లి పూల అందాన్ని, పరిమళాన్ని ఆస్వాదించివుండవచ్చు. లేక మీరు పండ్లతోటలో నడిచివెళ్తూ ఏదో ఒక రుచికరమైన ఫలాన్ని కోసుకునివుండవచ్చు. (1) భూమ్మీద సమృద్ధిగా ఉన్న నీరు, (2) సూర్యుని నుండి సరైన పరిమాణంలో వచ్చే ఉష్ణోగ్రత, కాంతి, (3) మన వాతావరణంలో సరైన పాళ్లలో ఉన్న వాయువులు, (4) సారవంతమైన నేల వంటివి లేకపోతే మనం అలాంటి మధురమైన అనుభూతులను పొందలేం.మన సౌరకుటుంబంలోని అంగారకుడు, శుక్రునితోపాటు మన పొరుగునున్న ఇతర గ్రహాల్లో లేని ఆ అంశాలన్నీ మన గ్రహానికి యాదృచ్ఛికంగా రాలేదు. భూమ్మీద జీవితం సంతోషకరంగా ఉండేలా అవి చక్కగా పొందుపర్చబడ్డాయి. తర్వాతి ఆర్టికల్ వివరిస్తున్నట్లు, మన అందమైన గ్రహం నిత్యం నిలిచివుండేలా సృష్టికర్త రూపొందించాడని కూడా బైబిలు చెబుతోంది.
[అధస్సూచి]
^ పేరా 5 మన సౌరకుటుంబంలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అనే నాలుగు అంతర గ్రహాలకు రాళ్లురప్పలున్న ఉపరితలం ఉంది కాబట్టి అవి టెరస్ట్రియల్ (భూమిలాంటి) గ్రహాలు అని పిలవబడుతున్నాయి. అతిపెద్ద బాహ్యగ్రహాలైన బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లలో వాయు పదార్థాలే ఎక్కువగా ఉన్నాయి.
[6వ పేజీలోని బాక్సు]
“ఒక భూగర్భశాస్త్రజ్ఞునిగా భూమి ఆవిర్భావానికి, దానిమీద జీవం వికసించడానికి సంబంధించిన ఆధునిక తలంపులను ఆదికాండము పుస్తకం ఎవరి కోసమైతే వ్రాయబడిందో అలాంటి సామాన్య గొర్రెలకాపరులవంటి తెగలవారికి వివరించాల్సివస్తే, నేను ఆదికాండము పుస్తకంలోని మొదటి అధ్యాయంలో వివరించబడినట్లే విషయాలను వివరించాల్సి వస్తుంది.”—భూగర్భశాస్త్రజ్ఞుడు వాలస్ ప్రాట్.
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
విశ్వాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అనువైన స్థలం
సూర్యుడు మన నక్షత్రవీధిలో వేరే చోట నెలకొని ఉంటే మనం నక్షత్రాలను సరిగ్గా చూడలేం. “మన సౌరకుటుంబం అమితమైన వెలుగు వ్యాపించివున్న ధూళితో నిండివున్న ప్రాంతాలకు దూరంగా ఉన్న కారణంగా, అది దగ్గర్లోని నక్షత్రాలను, సుదూర విశ్వాన్ని చక్కగా వీక్షించేందుకు అనువైన స్థలంలో . . . నెలకొని ఉంది” అని ద ప్రివిలేజ్డ్ ప్లానెట్ అనే పుస్తకం వివరిస్తోంది.
అంతేకాక, చంద్రుడు సరైన పరిమాణంలో ఉండడమేకాక భూమినుండి సరైన దూరంలో ఉన్నాడు కాబట్టే, సూర్యగ్రహణం జరిగినప్పుడు చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పగలుగుతాడు. అలాంటి అరుదైన, విస్మయపరిచే పరిస్థితులు ఉన్న కారణంగానే వ్యోమగాములు సూర్యుణ్ణి అధ్యయనం చేయగలుగుతున్నారు. నక్షత్రాలు ఎలా మెరుస్తున్నాయి వంటి గతంలో తెలియని విషయాలు అలాంటి అధ్యయనాలవల్ల వారు తెలుసుకోగలిగారు.
[5వ పేజీలోని చిత్రం]
చంద్రుని ద్రవ్యరాశి ఒరిగి ఉండే భూమి అక్షాన్ని స్థిరపరిచేందుకు తగినంత ఎక్కువగా ఉంది
[7వ పేజీలోని చిత్రాలు]
భూమ్మీద జీవం ఉనికిలో ఉండడాన్ని సాధ్యం చేసేవేమిటి? దానిలో సమృద్ధిగా ఉన్న నీరు, సరైన పాళ్లలో ఉన్న కాంతి, ఉష్ణోగ్రత, వాతావరణం, సారవంతమైన నేల ఉన్నాయి
[చిత్రసౌజన్యం]
భూగోళం: Based on NASA Photo; గోధుమ: Pictorial Archive (Near Eastern History) Est.