కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఈ లోకసంబంధమైనది” కాని రాజ్యం కోసం ఎదురుచూడడం

“ఈ లోకసంబంధమైనది” కాని రాజ్యం కోసం ఎదురుచూడడం

జీవిత కథ

“ఈ లోకసంబంధమైనది” కాని రాజ్యం కోసం ఎదురుచూడడం

నైకోలై గుసుల్యాక్‌ చెప్పినది

నేను 41 రోజులుగా జైల్లో జరుగుతున్న తిరుగుబాటులో చిక్కుబడిపోయాను. ఒకరాత్రి హఠాత్తుగా ఫిరంగి పేలడంతో నిద్ర నుండి మేల్కొన్నాను. యుద్ధ ట్యాంకులతో ఖైదీలపై దాడి చేస్తూ సైనికులు జైల్లోకి దూసుకువస్తున్నారు. నా ప్రాణం ప్రమాదంలో ఉంది.

అలాంటి పరిస్థితుల్లో నేనెలా చిక్కుకున్నాను? నన్ను వివరించనివ్వండి. ఆ సంఘటన 1954లో జరిగింది. అప్పుడు నాకు 30 సంవత్సరాలు. సోవియట్‌ పరిపాలన క్రింద జీవిస్తున్న అనేకమంది యెహోవాసాక్షుల్లాగే నేను కూడా రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉన్నందుకు, దేవుని రాజ్యం గురించి ఇతరులకు చెబుతున్నందుకు జైల్లో వేయబడ్డాను. ఖైదు చేయబడిన సాక్షుల గుంపులో 46 మంది పురుషులు, 34 మంది స్త్రీలు ఉన్నారు. మమ్మల్ని కజక్‌స్థాన్‌ మధ్యభాగంలో ఉన్న కెంగీర్‌ అనే గ్రామ సమీపంలోని లేబర్‌ క్యాంపులో పెట్టారు. అక్కడ మేము వేలాదిమంది ఇతర ఖైదీల మధ్య జీవించాం.

సోవియట్‌ యూనియన్‌ నాయకుడైన జోసెఫ్‌ స్టాలిన్‌ అంతకుముందు సంవత్సరమే మరణించాడు. మాస్కోలో ప్రారంభమైన కొత్త పరిపాలన, జైల్లో తాము ఎదుర్కొంటున్న అమానుషత్వాన్ని గురించిన ఫిర్యాదులను వింటుందేమో అని చాలామంది ఖైదీలు ఎదురుచూశారు. ఖైదీల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి అంతకంతకూ పెరిగి చివరికి వారు పూర్తిగా తిరుగుబాటు చేయడానికి దారితీసింది. జరిగిన ప్రతిఘటనలో, సాక్షులమైన మేము అటు ఆవేశంతో ఉన్న తిరుగుబాటుదారులకు ఇటు సైనికులకు మా తటస్థ వైఖరి గురించి వివరించాల్సి వచ్చింది. అలా తటస్థంగా ఉండడానికి మాకు దేవునిపై విశ్వాసం అవసరమైంది.

తిరుగుబాటు!

మే 16న జైల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. రెండు రోజుల తర్వాత, క్యాంపులో మెరుగైన పరిస్థితులను, రాజకీయ ఖైదీలకు కొన్ని హక్కులను కోరుతూ 3,200కన్నా ఎక్కువమంది ఖైదీలు పనికి వెళ్లడానికి నిరాకరించారు. ఆ తర్వాతి సంఘటనలు వేగంగా జరిగిపోయాయి. ముందుగా తిరుగుబాటుదారులు సైనికులను క్యాంపు బయటకు తరిమేశారు. తర్వాత చుట్టూ ఉన్న ప్రాకారాన్ని అక్కడక్కడా విరగ్గొట్టారు. పురుషుల, స్త్రీల వార్డులను వేరుచేసే గోడలను కూలగొట్టి, కుటుంబ బారకాసులు అని పిలువబడేవాటిని తయారుచేశారు. ఉత్కంఠభరితంగా సాగిన తర్వాతి రోజుల్లో, ఖైదు చేయబడిన పాదిరీలు వివాహ సేవలు నిర్వహించగా కొందరు ఖైదీలు వివాహాలు కూడా చేసుకున్నారు. ఆ తిరుగుబాటు జరిగిన మూడు వార్డుల్లోని 14,000 మంది ఖైదీల్లో దాదాపు అందరూ ఆ తిరుగుబాటులో భాగంవహించారు.

తిరుగుబాటుదారులు సైనికదళంతో సంప్రదింపులు జరపడానికి క్యాంపు సమితిని ఏర్పాటుచేసుకున్నారు. అయితే కొంతకాలానికే ఆ సమితి సభ్యుల్లో వాగ్వివాదాలు చెలరేగి క్యాంపు నిర్వహణ అత్యంత ఆవేశపరుల చేతుల్లోకి మారింది. తిరుగుబాటు వాతారణం మరింత ఉధృతమయ్యింది. తిరుగుబాటుదారుల నాయకులు “క్రమబద్ధత” కోసం భద్రతా విభాగాన్ని, సైనిక విభాగాన్ని, ప్రచార విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఖైదీల్లో తిరుగుబాటు భావాన్ని రగల్చడానికి ఆ నాయకులు క్యాంపులో అక్కడక్కడా స్తంభాలపై ఉన్న లౌడు స్పీకర్లలో కోపోద్రిక్తమైన సందేశాలను ప్రచారం చేసేవారు. అంతేకాక, ఇతర ఖైదీలు తప్పించుకుని పారిపోకుండా ఆపేవారు, వారికి ఎదురు తిరిగినవారిని శిక్షించేవారు, తమ ఆమోదాన్ని పొందని ఎవరినైనా హతమార్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించేవారు. అప్పటికే కొందరు ఖైదీలు చంపబడ్డారని అపోహలు కూడా బయలుదేరాయి.

సైనికులు దాడి చేస్తారని తిరుగుబాటుదారులు ముందే ఊహించారు కాబట్టి వారు తమను తాము కాపాడుకోవడానికి శ్రద్ధగా ఏర్పాట్లు చేసుకున్నారు. క్యాంపును రక్షించడానికి సాధ్యమైనంత ఎక్కువమంది ఖైదీల దగ్గర ఆయుధాలుండాలనే ఉద్దేశంతో ఖైదీలందరూ ఆయుధాలు ఉంచుకోవాలని నాయకులు ఆదేశించారు. దానికోసం ఖైదీలు కిటికీల నుండి ఇనుప కడ్డీలను ఊడదీసి, ఆ లోహంతో కత్తులను, ఇతర ఆయుధాలను తయారుచేసుకున్నారు. వారు తుపాకులను, ప్రేలుడు పదార్థాలను కూడా సంపాదించారు.

భాగం వహించమని ఒత్తిడి చేయబడడం

ఆ సమయంలో ఇద్దరు తిరుగుబాటుదారులు నా దగ్గరికి వచ్చారు. ఒకడు అప్పుడే సానబెట్టిన కత్తిని తీసి నాకిస్తూ, “రక్షణ కోసం ఇది నీకు అవసరమౌతుంది. దీన్ని తీసుకో!” అని ఆజ్ఞాపించాడు. ప్రశాంతంగా ఉండేందుకు సహాయం చేయమని నేను యెహోవాకు మౌనంగా ప్రార్థించాను. ఆ తర్వాత, “నేను క్రైస్తవుణ్ణి, యెహోవాసాక్షుల్లో ఒకరిని. మేము ప్రజలకు వ్యతిరేకంగా కాదుకానీ అదృశ్యమైన ఆత్మల సమూహములతో పోరాడుతున్నాం కాబట్టి ఖైదు చేయబడ్డాం. వాటికి వ్యతిరేకంగా పోరాడడానికి మాకు విశ్వాసం, దేవుని రాజ్యంపై నిరీక్షణ అనే ఆయుధాలు ఉన్నాయి” అని జవాబిచ్చాను.​—⁠ఎఫెసీయులు 6:​12.

ఆశ్చర్యకరంగా, అతడు నన్ను అర్థం చేసుకున్నవాడిలా తల ఊపాడు. అయితే, మరో వ్యక్తి మాత్రం నన్ను గట్టిగా కొట్టాడు. తర్వాత వాళ్ళు వెళ్లిపోయారు. తిరుగుబాటులో భాగం వహించమని సాక్షులను ఒత్తిడిచేయడానికి ప్రయత్నిస్తూ ఆ తిరుగుబాటుదారులు బారకాసులన్నీ తిరిగేవారు. కానీ మన క్రైస్తవ సహోదర సహోదరీలందరూ నిరాకరించారు.

యెహోవాసాక్షుల తటస్థ వైఖరి గురించి తిరుగుబాటుదారులు సమితి కూటంలో చర్చించుకున్నారు. “అన్ని మతాల ప్రజలు అంటే, పెంతెకొస్తువారు, అడ్వెంటిస్టులు, బాప్టిస్టులు, అందరూ తిరుగుబాటులో పాల్గొంటున్నారు. కేవలం యెహోవాసాక్షులే నిరాకరించారు, వారినేమి చేద్దాం” అంటూ వారు చర్చించుకున్నారు. మమ్మల్ని భయపెట్టడానికి మాలో ఒక సాక్షిని జైల్లో ఉండే పొయ్యిలో పడేయాలని వారిలో ఒకరు సలహా ఇచ్చారు. అయితే వారు గౌరవించే వ్యక్తి, పూర్వం సైనికదళంలో అధికారిగా పనిచేసిన ఒక ఖైదీ నిలబడి, “అది తెలివితక్కువ పని. వాళ్లందరినీ క్యాంపు చివర్లో ముఖద్వారం పక్కనే ఉన్న బారకాసులో ఉంచుదాం. అప్పుడు, సైనికులు యుద్ధ ట్యాంకులతో మనమీద దాడి చేసినప్పుడు, సాక్షులే ముందు వారి చేతుల్లో బలౌతారు. అలాచేస్తే వారిని చంపిన దోషం కూడా మనమీద ఉండదు” అని చెప్పాడు. వేరేవాళ్లందరూ ఆ సలహాను ఆమోదించారు.

ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నాం

అలా అనుకున్న వెంటనే ఖైదీలు క్యాంపులో తిరుగుతూ “యెహోవాసాక్షులారా, బయటకి వెళ్లిపోండి” అంటూ అరిచారు. మమ్మల్ని అంటే మొత్తం 80 మందిని క్యాంపు చివర్లో ఉన్న బారకాసు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడి బారకాసులో మా కోసం స్థలం ఏర్పర్చడానికి అందులోని కలప మంచాలను బయటకు లాగి, మమ్మల్ని లోపలికి వెళ్లమని ఆజ్ఞాపించారు. ఆ బారకాసు మాకు జైల్లోనే మరో జైలుగా మారింది.

మా గుంపులోని క్రైస్తవ సహోదరీలు దుప్పట్లను కలిపి కుట్టారు, వాటిని ఉపయోగించి మేము బారకాసును రెండు భాగాలుగా అంటే ఒకటి పురుషుల కోసం, ఒకటి స్త్రీల కోసం అన్నట్లుగా విభజించాము. (తర్వాత, రష్యాలోని ఒక సాక్షి ఆ బారకాసు బొమ్మను గీశాడు, అది క్రింద చూపించబడింది.) ఇరుకుగావున్న ఆ బారకాసులో నివసిస్తున్నప్పుడు మాకు వివేచన, “బలాధిక్యము” ఇవ్వమని యెహోవాను పదేపదే వేడుకుంటూ తరచూ కలిసి ప్రార్థించేవాళ్లం.​—⁠2 కొరింథీయులు 4:⁠7.

ఆ సమయమంతటిలో, మేము ఇటు తిరుగుబాటుదారులకు అటు సోవియట్‌ సైనికదళానికి మధ్య ప్రమాదకర పరిస్థితుల్లో జీవించాం. ఇరువర్గాల తర్వాతి చర్య ఏమిటో మాలో ఎవ్వరికీ తెలీదు. వృద్ధుడు, నమ్మకస్థుడైన ఒక క్రైస్తవ సహోదరుడు మమ్మల్నిలా ప్రోత్సహించేవాడు: “ఏమి జరగబోతోందో ఊహిస్తూ కూర్చోకండి. యెహోవా మనల్ని ఎడబాయడు.”

వయసుతో నిమిత్తం లేకుండా ప్రియమైన మా క్రైస్తవ సహోదరీలు అచంచలమైన సహనాన్ని చూపించారు. వారిలో 80 ఏళ్ల ఒక సహోదరికి అన్ని పనుల్లో ఎవరైనా సహాయం చేయాలి. మరికొందరికి అనారోగ్యం వల్ల వైద్యపరమైన సహాయం అవసరమయ్యింది. ఆ సమయమంతటిలో తిరుగుబాటుదారులు రోజంతా మాపై నిఘా వేయడానికి బారకాసు తలుపులు తెరిచేవుంచేవారు. రాత్రుళ్ళు సాయుధ ఖైదీలు బారకాసులోకి వచ్చేవారు. కొన్నిసార్లు వారు “దేవుని రాజ్యం నిద్రపోతోంది” అని అనడం మేము విన్నాం. పగలు ఒక్కోసారి మమ్మల్ని క్యాంపు భోజనశాలకు వెళ్లడానికి అనుమతించినప్పుడు, మేమందరం కలిసే వెళ్లేవాళ్లం, దౌర్జన్యం చేసేవారి నుండి మమ్మల్ని కాపాడమని యెహోవాకు ప్రార్థించేవాళ్లం.

ఆ బారకాసులో మేము ఆధ్యాత్మికంగా ఒకరికొకరం చేయూతనిచ్చుకోవడానికి ప్రయత్నించేవాళ్లం. తరచూ సహోదరుల్లో ఒకరు, మాకు మాత్రమే వినబడేలా బైబిలు నుండి ఒక వృత్తాంతాన్ని చెప్పేవాడు. ఆ తర్వాత ఆ వృత్తాంతాన్ని మేమున్న పరిస్థితులకు అన్వయించేవాడు. ఒక వృద్ధ సహోదరుడికైతే గిద్యోను సైన్యం గురించి మాట్లాడడం అంటే చాలా ఇష్టం. “తమ చేతుల్లో సంగీత వాయిద్యాలతో 300 మంది యెహోవా నామమున, 1,35,000 మంది సాయుధ సైనికులతో పోరాడారు. 300 మందిలో ఎవరికీ ఏ హానీ జరగకుండా తిరిగి వచ్చారు” అని ఆయన మాకు గుర్తుచేసేవారు. (న్యాయాధిపతులు 7:​16, 22; 8:​10) అదేకాక, మరితర బైబిలు ఉదాహరణలు మాకు ఆధ్యాత్మిక బలాన్నిచ్చాయి. నేను ఆ మధ్యనే సాక్షిని అయినప్పటికీ మరింత అనుభవజ్ఞులైన సహోదర సహోదరీల విశ్వాసాన్ని చూసి ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. యెహోవా నిజంగానే మాతో ఉన్నాడని నాకనిపించింది.

పోరాటం మొదలవడం

వారాలు గడుస్తున్నకొద్దీ క్యాంపులో అలజడి మరింత ఎక్కువయ్యింది. తిరుగుబాటుదారులకు, అధికారులకు మధ్య సంప్రదింపులు తీవ్రతరమయ్యాయి. మాస్కోలోని కేంద్ర ప్రభుత్వం తమను కలవడానికి ఒక ప్రతినిధిని పంపించాలని తిరుగుబాటుదారులు పంతంపట్టారు. మరోవైపు, తిరుగుబాటుదారులు లొంగిపోయి తమ ఆయుధాలను అప్పగించి తిరిగి పనికి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఇరుపక్షాలు రాజీకి ఒప్పుకోలేదు. అప్పటికే, సైనిక దళాలు ఆజ్ఞ అందగానే దాడిచేయడానికి సిద్ధంగా క్యాంపును చుట్టుముట్టాయి. తిరుగుబాటుదారులు కూడా అడ్డుగోడలను నిర్మించుకుని, ఆయుధాలను పోగుచేసుకుని పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. సైన్యానికి, ఖైదీలకు మధ్య అంతిమ పోరాటం ఏ క్షణంలోనైనా జరగవచ్చని అందరూ ఎదురుచూస్తున్నారు.

జూన్‌ 26వ తేదీన, చెవులు పగిలిపోయేలా ఒకదాని తర్వాత ఒకటిగా పేలుతున్న గుండ్ల శబ్దంతో మేము నిద్ర మేల్కొన్నాం. యుద్ధ ట్యాంకులు ప్రాకారాన్ని ధ్వంసం చేసి క్యాంపులోకి దూసుకువచ్చాయి. ఆ తర్వాత సైనికులు మెషీన్‌ గన్నులతో దాడి చేశారు. ఖైదీల్లోని స్త్రీపురుషులు అందరూ “హుర్రే” అని అరుస్తూ, రాళ్లను, తాము తయారుచేసుకున్న బాంబులను, చేతికి ఏది అందితే దాన్ని విసురుతూ దూసుకువస్తున్న ట్యాంకులవైపు పరుగెత్తారు. భయంకరమైన పోరాటం ప్రారంభమైంది, అయితే సాక్షులమైన మేము మధ్యలో చిక్కుకుపోయాం. మేము సహాయం కోసం చేసిన ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిచ్చాడు?

హఠాత్తుగా, సైనికులు మేముండే బారకాసు వైపు దూసుకువచ్చారు. “పరిశుద్ధులారా, బయటకు రండి! త్వరగా! ఆ ప్రాకారం బయటకి పారిపోండి” అంటూ అరిచారు. మమ్మల్ని చంపకుండా మాతో ఉండి మమ్మల్ని రక్షించమని సైనికాధికారి సైనికులకు ఆజ్ఞాపించాడు. తీవ్ర పోరాటం సాగుతుండగా మేము మాత్రం క్యాంపు ఆవరణ వెలుపల పచ్చికలో కూర్చున్నాం. నాలుగు గంటలపాటు మేము క్యాంపులో నుండి వస్తున్న ప్రేలుళ్లను, కాల్పులను, అరుపులను, మూలుగులను విన్నాం. తర్వాత అంతా నిశ్శబ్దం. తర్వాతి రోజు పగటి వెలుగులో, సైనికులు క్యాంపులోనుండి చనిపోయినవారిని మోసుకెళ్లడాన్ని చూశాం. వందలాదిమంది క్షతగాత్రులయ్యారని లేక మృత్యువాతపడ్డారని మాకు తెలిసింది.

కొంతసేపటికి, నాకు పరిచయమున్న ఒక అధికారి మా దగ్గరికి వచ్చాడు. “ఇప్పుడు చెప్పు నైకోలై, మిమ్మల్ని కాపాడింది ఎవరు? యెహోవానా లేక మేమా” అంటూ గర్వంగా అడిగాడు. మా ప్రాణాల్ని కాపాడినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూనే మేము ఇలా అన్నాం: “శక్తిమంతుడైన మా దేవుడైన యెహోవా బైబిలు కాలాల్లో తన సేవకుల్ని రక్షించడానికి ఎలాగైతే ఇతరుల్ని పురికొల్పాడో అలాగే మమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని కదిలించాడని మేము నమ్ముతున్నాం.”​—⁠ఎజ్రా 1:​1, 2.

సైనికులకు మేము ఎవరం, మమ్మల్ని ఎక్కడ పెట్టారనేది ఎలా తెలిసిందో కూడా ఆ అధికారే వివరించాడు. తిరుగుబాటుదారులకు సైనిక దళాలకు మధ్య జరిగిన చర్చల్లో ఒకసారి, తిరుగుబాటుదారులు తమకు మద్దతివ్వనివారిని హతమారుస్తున్నారని సైనికాధికారులు ఆరోపించారని చెప్పాడు. తమను తాము సమర్థించుకుంటూ, యెహోవాసాక్షులు తిరుగుబాటులో పాల్గొనకపోయినా వారిని చంపలేదని ఆ తిరుగుబాటుదారులు బదులిచ్చారు. దానికి బదులుగా, సాక్షులందరూ ఒకే బారకాసులో నిర్బంధించబడ్డారని వారు చెప్పారు. వారు చెప్పినదాన్ని సైనికాధికారులు గుర్తుపెట్టుకున్నారు.

రాజ్యం పక్షాన స్థిరంగా నిలబడ్డాం

రష్యాకు చెందిన ఆలీక్జాండర్‌ సోల్జెనిట్జిన్‌ అనే ప్రఖ్యాత రచయిత జైల్లో మేము ఎదుర్కొన్న తిరుగుబాటు గురించి ద గులాగ్‌ ఆర్కిపెలాగో అనే తన పుస్తకంలో ప్రస్తావించాడు. ఆ సంఘటన గురించి మాట్లాడుతూ, “మాకు స్వేచ్ఛ కావాలి . . . కానీ దాన్ని మాకు ఎవరు ఇవ్వగలరు?” అన్న ఆలోచనతోనే తిరుగుబాటు ప్రారంభమైందని ఆయన వ్రాశాడు. అదే జైల్లోని క్యాంపులో ఉన్న యెహోవాసాక్షులమైన మేము కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నాం. అయితే, మాకు కావాల్సింది కేవలం జైలు నుండి స్వేచ్ఛ కాదు గానీ దేవుని రాజ్యం మాత్రమే తీసుకురాగల స్వాతంత్ర్యం. జైల్లో ఉండగా మేము దేవుని రాజ్యం పక్షాన స్థిరంగా నిలబడేందుకు మాకు ఆయనిచ్చే శక్తి అవసరమౌతుందనే విషయం మాకు తెలుసు. యెహోవా మాకు కావల్సినవన్నీ అనుగ్రహించాడు. కత్తులు, బాంబుల సహాయం లేకుండానే ఆయన మాకు విజయాన్ని ప్రసాదించాడు.​—⁠2 కొరింథీయులు 10:⁠3.

“నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే . . . నా సేవకులు పోరాడుదురు” అని యేసుక్రీస్తు పిలాతుతో చెప్పాడు. (యోహాను 18:​36) కాబట్టి, క్రీస్తు అనుచరులముగా మేము రాజకీయ పోరాటాల్లో పాలుపంచుకోలేదు. తిరుగుబాటు జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా దేవుని రాజ్యంపట్ల మా యథార్థత ఇతరులకు స్పష్టమైనందుకు మాకు సంతోషం కలిగింది. ఆ సమయంలో మా ప్రవర్తన గురించి సోల్జెనిట్జిన్‌ ఇలా వ్రాశాడు: “యెహోవాసాక్షులు తమ మత నియమాలను పాటించడానికి ధైర్యంగా నిలబడి, క్యాంపును రక్షించే ఏర్పాట్లలో పాల్గొనడానికి, కాపలా కాయడానికి నిరాకరించారు.”

ఆ సంక్షోభిత సంఘటనలు సంభవించి ఇప్పటికి 50కి పైనే సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే, ఆ కాలంలో నేను యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడం, ఆయన శక్తిపై పూర్తి నమ్మకం ఉంచడం లాంటి విలువైన పాఠాలను నేర్చుకున్నాను కాబట్టి తరచూ వాటిని కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకుంటాను. అవును, మునుపటి సోవియట్‌ యూనియన్‌లోని అనేకమంది ప్రియమైన ఇతర సాక్షుల్లాగే నేను కూడా, “ఈ లోకసంబంధమైనది” కాని రాజ్యం కోసం ఎదురుచూసేవారికి యెహోవా నిజంగానే స్వాతంత్ర్యాన్ని, సంరక్షణను, విడుదలను అనుగ్రహిస్తాడని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

[8, 9వ పేజీలోని చిత్రాలు]

కజక్‌స్థాన్‌లో మేము నిర్బంధించబడిన లేబర్‌ క్యాంపు

[10వ పేజీలోని చిత్రం]

సాక్షులను పెట్టిన బారకాసులోని స్త్రీల భాగాన్ని చూపించే చిత్రం

[11వ పేజీలోని చిత్రం]

మేము విడుదలైన తర్వాత క్రైస్తవ సహోదరులతో