కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం

మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం

మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం

“నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.”​—⁠కీర్తన 34:⁠3.

యేసు, ఆయన అపొస్తలులు కలిసి సా.శ. 33, నీసాను 14వ తేదీ రాత్రి యెరూషలేములోని ఒక మేడగదిలో యెహోవాకు స్తుతిగీతాలు పాడారు. (మత్తయి 26:​30) యేసు తన అపొస్తలులతో అలా పాడడం అదే చివరిసారి. అయితే, ఆయన తన శిష్యులతో ఆ సమావేశాన్ని ఆ విధంగా ముగించడమే సముచితం. యేసు తన భూ పరిచర్య ఆద్యంతమూ తన తండ్రిని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఉత్సాహంగా ప్రకటించాడు. (మత్తయి 4:​10; 6:⁠9; 22:​37, 38; యోహాను 12:​28; 17:⁠6) నిజానికి ఆయన కీర్తనకర్త ఇచ్చిన ఈ స్నేహపూర్వక ఆహ్వానాన్ని ప్రతిధ్వనించాడు: “నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.” (కీర్తన 34:⁠3) మనం అనుసరించడానికి అదెంత చక్కని మాదిరో కదా!

2 యేసుతో కలిసి ఆ స్తుతిగీతాలు పాడిన కొన్నిగంటల తర్వాత, అపొస్తలుడైన యోహాను పూర్తిగా భిన్నమైన సంఘటన జరగడం చూశాడు. తన యజమాని, ఇద్దరు నేరస్థులు హింసాకొయ్యలపై చంపబడడం చూశాడు. రోమా సైనికులు ఆ ఇద్దరు నేరస్థులు త్వరగా మరణించేలా వారి కాళ్లు విరగ్గొట్టారు. అయితే, వారు యేసు కాళ్లు విరగ్గొట్టలేదని ఆయన నివేదిస్తున్నాడు. ఆ సైనికులు యేసు దగ్గరకు వచ్చేసరికే ఆయన చనిపోయాడు. యోహాను తన సువార్తలో ఆ పరిణామం 34వ కీర్తనలోని మరో భాగం నెరవేర్పుగా జరిగిందని గుర్తించాడు. అదిలావుంది: ‘ఆయన ఎముకలలో ఒక్కటియైనను విరిగిపోదు.’​—⁠యోహాను 19:​32-36; కీర్తన 34:​20, సెప్టాజింట్‌.

3 క్రైస్తవులకు ఆసక్తికరమైన అనేక అంశాలు 34వ కీర్తనలో ఉన్నాయి. అందువల్ల మనం దీనిలో, దీని తర్వాతి ఆర్టికల్‌లో దావీదు ఏ పరిస్థితుల్లో ఈ కీర్తన వ్రాశాడో సమీక్షిస్తూ, ఆ కీర్తనలోని ప్రోత్సాహకరమైన అంశాలను పరిశీలిస్తాం.

దావీదు సౌలు దగ్గరనుండి పారిపోవడం

4 దావీదు యువకునిగా ఉన్నప్పుడు, సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. అయితే సౌలు అవిధేయుడై యెహోవా అనుగ్రహం పోగొట్టుకున్నాడు. అందువల్ల, ప్రవక్తయైన సమూయేలు ఆయనతో ఇలా అన్నాడు: “నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.” (1 సమూయేలు 15:​28) ఆ తర్వాత, యెష్షయి చిన్నకుమారుడైన దావీదును ఇశ్రాయేలు తర్వాతి రాజుగా అభిషేకించేలా యెహోవా సమూయేలును నిర్దేశించాడు. ఈ సమయంలో దేవుని ఆత్మను పోగొట్టుకున్న సౌలు రాజు దిగులుతో కృంగిపోయాడు. సంగీతంలో ప్రావీణ్యుడైన దావీదు, రాజు సేవకోసం గిబియాకు తీసుకురాబడగా, దావీదు వాయించిన సంగీతం సౌలుకు సేదదీర్పునిచ్చింది, అందువల్ల దావీదుమీద “సౌలునకు బహు ఇష్టము పుట్టెను.”​—⁠1 సమూయేలు 16:​11, 13, 21, 23.

5 కాలం గడిచేకొద్దీ యెహోవా దావీదుకు తోడైవున్నట్లు రుజువైంది. ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతును జయించేందుకు యెహోవా దావీదుకు సహాయంచేసి, ఆయన సైనిక సామర్థ్యాన్నిబట్టి ఇశ్రాయేలులో సన్మానించబడినప్పుడు మద్దతిచ్చాడు. అయితే దావీదును యెహోవా ఆశీర్వదించడం సౌలులో ఈర్ష్య పుట్టించగా, అతడు దావీదుపై ద్వేషం పెంచుకున్నాడు. సౌలు ఎదుట దావీదు సితార వాయిస్తున్నప్పుడు, రెండు సందర్భాల్లో ఆ రాజు ఆయనపై ఈటె విసిరాడు. ఆ రెండు సందర్భాల్లోనూ దావీదు ఆ ఈటెను తప్పించుకున్నాడు. సౌలు మూడవసారి హత్యా ప్రయత్నం చేసినప్పుడు, ఇశ్రాయేలు భావిరాజు తన ప్రాణం దక్కించుకునేందుకు పారిపోవడం మంచిదని గ్రహించాడు. సౌలు తనను పట్టుకుని చంపేందుకు ఎడతెగక ప్రయత్నిస్తున్న కారణంగా దావీదు చివరకు ఇశ్రాయేలు వెలుపల తలదాచుకోవాలని నిర్ణయించుకున్నాడు.​—⁠1 సమూయేలు 18:​11; 19:​9, 10.

6 ఇశ్రాయేలు సరిహద్దుకు వెళ్లేదారిలో దావీదు, యెహోవా ఆలయ గుడారమున్న నోబు పట్టణంలో ఆగాడు. పారిపోయిన దావీదుతో ఇతర యౌవనులు కూడా ఉన్నారు, దావీదు తనకు, తనతో ఉన్నవారికి ఆహారం కోసం ప్రయత్నించాడు. ప్రధానయాజకుడు దావీదుకు, అతని మనుష్యులకు కొంత ఆహారాన్ని, చనిపోయిన గొల్యాతు దగ్గరనుండి దావీదు తీసుకున్న ఖడ్గాన్ని ఇచ్చాడని సౌలు తెలుసుకొని, ఆగ్రహంతో 85 మంది యాజకులతోపాటు ఆ పట్టణస్థులందరినీ చంపించాడు.​—⁠1 సమూయేలు 21:​1, 2; 22:12, 13, 18, 19; మత్తయి 12:​3, 4.

మరోసారి మరణాన్ని తప్పించుకోవడం

7 దావీదు, ఆయన మనుష్యులు నోబు నుండి పశ్చిమదిక్కుగా 40 కిలోమీటర్ల దూరంవరకు పారిపోయి ఫిలిష్తీయుల దేశంలో ప్రవేశించి గొల్యాతు సొంతపట్టణమైన గాతు రాజైన ఆకీషు దగ్గర ఆశ్రయం పొందారు. సౌలు తనకోసం గాతుకు వచ్చే అవకాశమే లేదని దావీదు తలంచివుండవచ్చు. కానీ కొద్దిరోజుల్లోనే గాతు రాజు సేవకులు దావీదును గుర్తుపట్టారు. తనను గుర్తుపట్టారని దావీదు విన్నప్పుడు, ఆయన “గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.”​—⁠1 సమూయేలు 21:​10-12.

8 ఆ వెంటనే ఫిలిష్తీయులు దావీదును బంధించారు. బహుశా ఆ సమయంలో దావీదు ఈ హృదయపూర్వక కీర్తన వ్రాసివుంటాడు, అందులో ఆయన యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి.” (కీర్తన 56:⁠8, పైవిలాసము) ఆ విధంగా ఆయన యెహోవా తన దుఃఖాన్ని మర్చిపోడనీ తనపట్ల ప్రేమపూర్వక శ్రద్ధచూపిస్తూ, తనను కాపాడతాడనే నమ్మకాన్ని వ్యక్తపర్చాడు. దావీదు ఫిలిష్తీయ రాజును బోల్తాకొట్టించే పథకం కూడా ఆలోచించాడు. ఆయన పిచ్చివాడిలా నటించాడు. ఇది గమనించిన ఆకీషు రాజు తన దగ్గరకు “పిచ్చిచేష్టలు” చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చినందుకు సేవకులను గద్దించాడు. స్పష్టంగా, దావీదు పథకానికి యెహోవా మద్దతిచ్చాడు. దావీదు ఆ పట్టణం నుండి వెళ్లగొట్టబడ్డాడు, అలా ఆయన మరోసారి తృటిలో మరణాన్ని తప్పించుకున్నాడు.​—⁠1 సమూయేలు 21:​13-15.

9 దావీదు మద్దతుదారులు ఆయనతోపాటు గాతుకు పారిపోయారో లేక ఇశ్రాయేలులోని దగ్గరి గ్రామాల్లో ఉండి ఆయనను గమనిస్తూ వచ్చారో బైబిలు చెప్పడం లేదు. ఏదేమైనా, యెహోవా మళ్లీ తననెలా తప్పించాడో దావీదు వారికి వివరించినప్పుడు వారెంతో సంతోషించివుంటారు. పైవిలాసము చూపిస్తున్నట్లుగా, ఆ సంఘటన 34వ కీర్తన వ్రాయడానికి ఆధారాన్నిచ్చింది. ఆ కీర్తనలోని మొదటి ఏడు వచనాల్లో, తనను విడిపించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ, తన ప్రజల గొప్ప రక్షకునిగా యెహోవాను స్తుతించేందుకు తనతో కూడి పాడమని ఆయన తన మద్దతుదారులను ఆహ్వానించాడు.​—⁠కీర్తన 34:​3, 4, 7.

10 దావీదు ఆయన మనుష్యులు గాతుకు తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఇశ్రాయేలు పర్వత ప్రాంతంలోని అదుల్లాము గుహలో తలదాచుకున్నారు. రాజైన సౌలు పరిపాలనలోని పరిస్థితులతో అసంతృప్తిచెందిన ఇశ్రాయేలీయులు అక్కడకొచ్చి ఆయనతో కలవడం ఆరంభించారు. (1 సమూయేలు 22:​1, 2) దావీదు కీర్తన 34:​8-22లోని మాటలను కూర్చినప్పుడు, అలాంటివారు ఆయన మనసులో ఉండి ఉండవచ్చు. ఆ వచనాల్లోని జ్ఞాపికలు నేడు మనకు కూడా ప్రాముఖ్యమైనవే, ఈ చక్కని కీర్తన యొక్క వివరణాత్మక చర్చనుండి మనం నిశ్చయంగా ప్రయోజనం పొందుతాం.

దావీదుకున్న ప్రాథమిక కోరికే మీకూవుందా?

11“నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.” (కీర్తన 34:⁠1) బహిష్కృతునిగా జీవిస్తున్న దావీదుకు భౌతిక విషయాల చింతలు అధికంగా ఉండే ఉండవచ్చు, కానీ ఈ మాటలు చూపిస్తున్నట్లుగా, ఆయన దైనందిన చింతలు యెహోవాను సన్నుతించాలన్న ఆయన నిశ్చయాన్ని మరుగుచేయలేదు. మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు మనకు అదెంత చక్కని మాదిరో కదా! మనం పాఠశాలలోవున్నా, ఉద్యోగస్థలంలోవున్నా, తోటి క్రైస్తవులతోవున్నా, లేక బహిరంగ పరిచర్యలోవున్నా మన ప్రాథమిక కోరిక యెహోవాను సన్నుతించాలన్నదే అయ్యుండాలి. అలా సన్నుతించేందుకు మనకున్న అసంఖ్యాకమైన కారణాల గురించి ఒక్కసారి ఆలోచించండి! ఉదాహరణకు, అద్భుతమైన యెహోవా సృష్టికార్యాల్లో మనం కనిపెట్టి, ఆనందించగల విషయాలకు అంతులేదు. ఆయన తన సంస్థయొక్క భూసంబంధ భాగం ద్వారా నెరవేర్చినవాటిని పరిశీలించండి. నమ్మకమైన మానవులు అపరిపూర్ణులే అయినప్పటికీ, ఈ ఆధునిక కాలాల్లో యెహోవా వారిని మహాశక్తివంతంగా ఉపయోగించుకున్నాడు. దేవుని కార్యములను, ఈ లోకం పూజించే మనుష్యుల పనులతో పోలిస్తే అవెలా ఉంటాయి? “ప్రభువా, దేవతలలో నీవంటివాడు లేడు. నీ కార్యములకు సాటియైన కార్యములు లేవు” అని కూడా వ్రాసిన దావీదుతో మీరు ఏకీభవించరా?​—⁠కీర్తన 86:⁠9.

12 యెహోవా సాటిలేని కార్యములనుబట్టి మనం కూడా దావీదులాగే ఆయనను ఎల్లప్పుడూ సన్నుతించేందుకు ప్రేరేపించబడతాం. అంతేకాక, దేవుని రాజ్యమిప్పుడు దావీదు శాశ్వత వారసుడైన యేసుక్రీస్తు చేతుల్లో ఉందని తెలుసుకొని మనం పులకిస్తున్నాం. (ప్రకటన 11:​15) అంటే ఈ విధానాంతం సమీపించిందని అర్థం. ఆరువందల కోట్లకన్నా ఎక్కువమంది ప్రజల నిత్య భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. దేవుని రాజ్యం గురించి ఇతరులకు చెప్పడమే కాక, అది త్వరలో మానవాళి కోసం చేయబోయే వాటిగురించి వివరిస్తూ, వారు కూడా మనతోపాటు యెహోవాను స్తుతించేలా సహాయం చేయవలసిన అవసరత మునుపెన్నడూ ఇంతగా లేదు. కాబట్టి ఆలస్యం కాకముందే ఈ ‘రాజ్యసువార్తను’ అంగీకరించేలా ఇతరులను ప్రోత్సహించేందుకు ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకోవడం నిశ్చయంగా మన జీవితంలో ప్రధానాంశంగా ఉండాలి.​—⁠మత్తయి 24:​14.

13“యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.” (కీర్తన 34:⁠2) దావీదు ఇక్కడ వ్యక్తిగత ఘనకార్యాల గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. ఉదాహరణకు, గాతు రాజును తానెలా బోల్తాకొట్టించాడో ఆయన గొప్పగా చెప్పుకోలేదు. గాతులో ఉన్నప్పుడు యెహోవా తనను కాపాడాడని, యెహోవా సహాయంతో తాను తప్పించుకున్నానని ఆయన గ్రహించాడు. (సామెతలు 21:⁠1) కాబట్టి దావీదు తనను కాదుగానీ, యెహోవానే ఘనపర్చాడు. అలా దావీదు యెహోవాను ఘనపర్చాడు కాబట్టే, దీనులు యెహోవావైపు ఆకర్షించబడ్డారు. అలాగే యేసు కూడా యెహోవా నామాన్ని ఘనపర్చాడు, అది దీనులైన, బోధించదగిన ప్రజలను దేవునివైపు ఆకర్షించింది. నేడు, అన్నిదేశాల్లోని దీనులు యేసు శిరస్సుగావున్న అభిషిక్త క్రైస్తవుల అంతర్జాతీయ సంఘానికి ఆకర్షించబడుతున్నారు. (కొలొస్సయులు 1:​18) వినయస్థులైన దేవుని సేవకులు ఆయన నామాన్ని మహిమపర్చడాన్ని విన్నప్పుడు, తామర్థంచేసుకునేలా దేవుని పరిశుద్ధాత్మ సహాయం చేసిన బైబిలు సందేశాన్ని విన్నప్పుడు అలాంటి దీనుల హృదయాలు పురికొల్పబడతాయి.​—⁠యోహాను 6:​44; అపొస్తలుల కార్యములు 16:​14.

కూటాలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి

14“నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.” (కీర్తన 34:⁠3) యెహోవాను ఏకాంతంగా స్తుతించడంతోనే దావీదు సంతృప్తి చెందలేదు. దేవుని నామాన్ని గొప్పచేయడంలో తనతో కలవమని ఆయన తన సహచరులను ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడు. అదే విధంగా, గొప్ప దావీదు అయిన యేసుక్రీస్తు యెహోవాను బహిరంగంగా అంటే స్థానిక సమాజమందిరాల్లో, యెరూషలేములోని దేవుని ఆలయంలో జరిగే పండుగల్లో, తన అనుచరులతో కలిసి స్తుతించడంలో ఆనందించాడు. (లూకా 2:​49; 4:​16-19; 10:​21; యోహాను 18:​20) ప్రత్యేకంగా మనం ‘ఆ దినం సమీపించడాన్ని చూస్తుండగా’ సాధ్యమైన ప్రతీ సందర్భంలో తోటి విశ్వాసులతో కలిసి యెహోవాను స్తుతించడంలో యేసు మాదిరిని అనుసరించడం ఎంత ఆనందదాయకమైన ఆధిక్యతో కదా!​—⁠హెబ్రీయులు 10:​24, 25.

15నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.” (కీర్తన 34:⁠4) ఈ అనుభవం దావీదుకు ఎంతో ప్రాముఖ్యం. అందుకే ఆయనింకా ఇలా అన్నాడు: “ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.” (కీర్తన 34:⁠6) తోటి విశ్వాసులతో సహవసించేటప్పుడు, క్లిష్ట పరిస్థితుల్ని సహించేందుకు యెహోవా మనకు ఎలా సహాయం చేశాడో తెలిపే ప్రోత్సాహకరమైన అనుభవాలు చెప్పగల చాలా అవకాశాలు మనకు లభిస్తాయి. అలా చెప్పడం, దావీదు మాటలు తన మద్దతుదారుల విశ్వాసాన్ని బలపరిచినట్లే, మన తోటివిశ్వాసుల విశ్వాసాన్ని బలపరుస్తుంది. దావీదు విషయంలో, ఆయన సహవాసులు “ఆయన [యెహోవా] తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.” (కీర్తన 34:⁠5) రాజైన సౌలు నుండి పారిపోతున్నా వారు దానిని అవమానంగా భావించలేదు. దేవుడు దావీదుకు మద్దతిస్తున్నాడని వారు విశ్వసించారు, వారికి వెలుగు కలిగింది. అదే విధంగా, క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారేకాక, దీర్ఘకాలంగా నిజ క్రైస్తవులుగా ఉన్నవారు కూడా మద్దతుకోసం యెహోవావైపు చూస్తారు. వారు వ్యక్తిగతంగా ఆయన సహాయం చవిచూశారు కాబట్టి, నమ్మకంగా నిలిచివుండాలనే వారి దృఢసంకల్పం వారి ముఖాల్లో ప్రకాశమానంగా ప్రతిబింబిస్తుంది.

దేవదూతల సహాయానికి కృతజ్ఞతతో ఉండండి

16“యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును.” (కీర్తన 34:⁠7) యెహోవా తననలా కాపాడడం తనకు మాత్రమే పరిమితమని దావీదు దృష్టించలేదు. నిజమే, దావీదు ఇశ్రాయేలు భావిరాజు, యెహోవా ఆయనను అభిషేకించాడు; అయితే యెహోవా నమ్మకమైన తన ఆరాధకులు వారు ప్రధానులైనా, అప్రధానులైనా వారినందరినీ కనిపెట్టుకుని ఉండేందుకు తన దూతలను ఉపయోగిస్తాడని ఆయనకు తెలుసు. మన ఆధునిక కాలంలో, సత్యారాధకులు కూడా యెహోవా అందజేస్తున్న కాపుదలను చవిచూశారు. నాజీ జర్మనీలో, అలాగే అంగోలా, మలావీ, మొజాంబిక్‌ తదితర అనేక దేశాల్లో యెహోవాసాక్షులను తుడిచిపెట్టేందుకు అధికారులు ఉద్యమాలు సాగించారు. వారి ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. బదులుగా, ఆ దేశాల్లోని యెహోవా ప్రజలు కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేస్తూ ఎడతెగక వర్ధిల్లుతున్నారు. ఎందుకు? ఎందుకంటే, యెహోవా తన ప్రజలను కాపాడి నిర్దేశించేందుకు తన పరిశుద్ధ దూతలను ఉపయోగిస్తున్నాడు.​—⁠హెబ్రీయులు 1:​14.

17 అంతేకాక, ఇతరులకు అభ్యంతరం కలిగించేవారెవరైనా యెహోవా ప్రజల్లోనుండి తొలగించబడేలా కూడా యెహోవా దూతలు పనిచేయగలరు. (మత్తయి 13:​41; 18:​6, 10) ఆ సమయంలో మనకు తెలియకపోయినా, మనం దేవునికి చేసే సేవను అడ్డగించగల అవాంతరాలను తొలగించడమేకాక, యెహోవాతో మన సంబంధాన్ని ప్రమాదంలో పడేయగల వాటినుండి కూడా దేవదూతలు మనల్ని కాపాడతారు. అత్యంత ప్రాముఖ్యంగా, వారు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రకటనాపని జరిగించబడుతున్న ప్రాంతాలతోసహా సర్వమానవాళికి “నిత్యసువార్త” ప్రకటించే పనిలో మనకు నిర్దేశమిస్తున్నారు. (ప్రకటన 14:⁠6) దేవదూతల సహాయానికి సంబంధించిన రుజువు యెహోవాసాక్షులు ప్రచురించే బైబిలు సాహిత్యాల్లో తరచూ చూపించబడుతోంది. * అలాంటి అనుభవాలు కేవలం కాకతాళీయం అని కొట్టిపారేయలేనంత అసంఖ్యాకంగా ఉన్నాయి.

18 దేవదూతల నిర్దేశం నుండి, కాపుదల నుండి మనం ఎడతెగక ప్రయోజనం పొందాలంటే వ్యతిరేకతవున్నా యెహోవా నామాన్ని నిరంతరం గొప్ప చేస్తూవుండాలి. దేవుని దూత “యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు” మాత్రమే కావలివుంటాడని గుర్తుంచుకోండి. దీనర్థమేమిటి? దేవునిపట్ల భయభక్తులతో ఉండడమంటే ఏమిటి, దానిని మనమెలా పెంపొందించుకోవచ్చు? ప్రేమగల దేవుడు మనమాయనకు భయపడాలని ఎందుకు కోరుతున్నాడు? ఈ ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడతాయి?

[అధస్సూచి]

^ పేరా 24 యెహోవాసాక్షులు​—⁠దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకం, 550వ పేజీ; యెహోవాసాక్షుల వార్షికపుస్తకము​—⁠2005, (ఆంగ్లం) 53-4 పేజీలు; కావలికోట మార్చి 1, 2000, 5-6 పేజీలు; కావలికోట (ఆంగ్లం) జనవరి 1, 1991 27వ పేజీ; కావలికోట (ఆంగ్లం) ఫిబ్రవరి 15, 1991 26వ పేజీ చూడండి.

మీరెలా జవాబిస్తారు?

• యువకుడైన దావీదు ఎలాంటి పరీక్షలను సహించాడు?

• దావీదులాగే మనం కూడా ప్రధానంగా ఏమి కోరుకుంటాం?

• క్రైస్తవ కూటాలను మనమెలా దృష్టిస్తాం?

• మనకు సహాయం చేసేందుకు యెహోవా తన దూతలనెలా ఉపయోగిస్తాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు తన భూ పరిచర్య కాలంలో ఎలాంటి చక్కని మాదిరివుంచాడు?

2, 3. (ఎ) ముప్పై నాల్గవ కీర్తనకు ప్రవచనార్థక ప్రాముఖ్యత ఉన్నట్లు మనకెలా తెలుసు? (బి) దీనిలో, దీని తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

4. (ఎ) దావీదు ఇశ్రాయేలు భావిరాజుగా ఎందుకు అభిషేకించబడ్డాడు? (బి) సౌలుకు దావీదుమీద ఎందుకు “బహు ఇష్టము పుట్టెను”?

5. దావీదుపట్ల సౌలు దృక్పథం ఎందుకు మారింది, దావీదు ఏమిచేయక తప్పలేదు?

6. నోబు నివాసులను చంపమని సౌలు ఎందుకు ఆజ్ఞాపించాడు?

7. దావీదుకు గాతు ఎందుకు సురక్షిత స్థలం కాదు?

8. (ఎ) గాతులో దావీదుకు కలిగిన అనుభవం గురించి 56వ కీర్తన మనకేమి చెబుతోంది? (బి) దావీదు ఎలా తృటిలో మరణాన్ని తప్పించుకున్నాడు?

9, 10. దావీదు ఏ కారణంచేత 34వ కీర్తన వ్రాశాడు, ఆ కీర్తన కూర్చినప్పుడు దావీదు మనసులో ఎవరు ఉండవచ్చు?

11, 12. యెహోవాను ఎల్లప్పుడూ సన్నుతించేందుకు మనకు ఎలాంటి కారణాలున్నాయి?

13. (ఎ) దావీదు ఎవరినిబట్టి అతిశయించాడు, ఎలాంటి ప్రజలు స్పందించారు? (బి) నేడు దీనులు క్రైస్తవ సంఘానికి ఎలా ఆకర్షించబడుతున్నారు?

14. (ఎ) యెహోవాను ఏకాంతంగా స్తుతించడంతోనే దావీదు సంతృప్తి చెందాడా? (బి) ఆరాధనా సంబంధ కూటాల విషయంలో యేసు ఎలాంటి మాదిరివుంచాడు?

15. (ఎ) దావీదు అనుభవం ఆయన మనుష్యులపై ఎలాంటి ప్రభావం చూపించింది? (బి) మన కూటాలకు హాజరవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?

16. మనల్ని కాపాడేందుకు యెహోవా తన దూతలను ఎలా ఉపయోగించాడు?

17. దేవదూతలు మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తున్నారు?

18. (ఎ) దేవదూతల సహాయం నుండి ప్రయోజనం పొందేందుకు మనకు ఏమి అవసరం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[21వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రామా

గాతు

సిక్లగు

గిబియా

నోబు

యెరూషలేము

బేత్లెహేము

అదుల్లాము

కెయీలా

హెబ్రోను

జీఫు

హోరేషు

కర్మెలు

మాయోను

ఏన్గెదీ

ఉప్పు సముద్రం

[చిత్రసౌజన్యం]

మ్యాపు: Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[21వ పేజీలోని చిత్రం]

పలాయితునిగా ఉన్నప్పటికీ, దావీదు యెహోవా నామాన్ని గొప్పచేశాడు

[23వ పేజీలోని చిత్రం]

మన క్రైస్తవ కూటాల్లో వివరించబడే ప్రోత్సాహకరమైన అనుభవాలను విన్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది