కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఏ మతాన్ని ఎన్నుకుంటారనేది అంత ప్రాముఖ్యమా?

మీరు ఏ మతాన్ని ఎన్నుకుంటారనేది అంత ప్రాముఖ్యమా?

మీరు ఏ మతాన్ని ఎన్నుకుంటారనేది అంత ప్రాముఖ్యమా?

మనం మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఎన్నుకోవడానికి వీలుగా చాలారకాల వస్తువులు ఉండాలని కోరుకుంటాం. మార్కెట్‌లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు ఉన్నప్పుడు మనకు రుచిగా అనిపించేవి, మన కుటుంబీకులకు ఆరోగ్యకరమైనవి ఎన్నుకోవచ్చు. బట్టల దుకాణంలో తక్కువ ధరకు వివిధ రకాల, వివిధ రంగుల బట్టలు లభిస్తే మనకు చక్కగా నప్పేది ఎన్నుకోవచ్చు. మనం జీవితంలో చేసుకునే కొన్ని ఎంపికలు కేవలం మన వ్యక్తిగత అభిరుచులకు సంబంధించినవై ఉంటాయి. అయితే, మరికొన్ని ఎంపికలు అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని లేదా జ్ఞానవంతులైన స్నేహితులను ఎంపిక చేసుకోవడంలాంటివి మన సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. మరి మతాన్ని ఎంపిక చేసుకోవడం మాటేమిటి? మన ఆరాధనా విధానం కూడా మన అభిరుచికి సంబంధించినదేనా? లేక అది మన సంక్షేమాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే విషయమా?

మనం ఎన్నుకోవడానికి చాలారకాల మతాలున్నాయి. నేడు అనేక దేశాలు మత స్వాతంత్ర్యం ఇస్తామని హామీనిస్తున్నాయి, అంతేకాక ప్రజలు తమ తల్లిదండ్రుల మతాన్ని విడిచిపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. అమెరికాలో నిర్వహించబడిన ఒక సర్వే ప్రకారం 80 శాతం అమెరికన్లు “ఒకటికన్నా ఎక్కువ మతాల్ని అవలంబించడం రక్షణకు నడిపించవచ్చని నమ్ముతున్నారు.” అదే సర్వే ప్రకారం, “జవాబిచ్చిన ఐదుగురిలో ఒకరు తాము ఎదిగిన తర్వాత మతాలు మార్చుకున్నాం” అని చెప్పారు. బ్రెజిల్‌ నివాసుల్లో పావువంతుమంది మత మార్పిడి చేసుకున్నారని అక్కడ జరిపిన సర్వేలో వెల్లడైంది.

పూర్వం, వివిధ మతాలకు గుర్తింపుగావున్న సిద్ధాంతాల గురించి ప్రజలు ఆవేశంగా వాదోపవాదాలు చేసేవారు. అయితే నేడు అనేకమంది, ‘మీరు ఏ మతాన్ని ఎన్నుకుంటారనేది అంత ప్రాముఖ్యం కాదు’ అన్న దృక్పథాన్నే కనబరుస్తున్నారు. నిజంగా అది ప్రాముఖ్యం కాదా? మీరు ఏ మతాన్ని ఎన్నుకుంటారనేది మిమ్మల్ని ప్రభావితం చేయగలదా?

వివేచనాపరులైన కొనుగోలుదారులు వస్తువులు ఎక్కడినుంచి వచ్చాయనేదాని గురించి ప్రశ్నలు అడుగుతారు. అలాగే మీరు ‘వివిధ మతాలు ఎలా ఆవిర్భవించాయి, అవి ఎందుకు ఆరంభమయ్యాయి’ అని ప్రశ్నించుకోవడం జ్ఞానయుక్తం. బైబిలు వాటికి జవాబులు ఇస్తుంది.

మతాలు ఎలా ఆవిర్భవించాయి?

యేసు భూమ్మీదికి రావడానికి దాదాపు వెయ్యి సంవత్సరాల ముందు, రాజైన యరొబాము ప్రాచీన ఇశ్రాయేలులో ఒక కొత్త మతాన్ని ప్రారంభించాడు. వేరుపడిన ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు యరొబాము మొదటి రాజు. తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ప్రజలందరినీ ఐక్యపరిచే సవాలు అతనికి ఎదురైంది. రాజు “ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి​—⁠యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; ఇశ్రాయేలువారలారా, . . . మీ దేవుడు ఇవే” అని చెప్పాడు. (1 రాజులు 12:​28-29) ప్రజలు యెరూషలేములో ఆరాధన చేసేవారు కాబట్టి దానిపట్ల వారికున్న యథార్థతను మళ్లించడానికే రాజు ఆ మతాన్ని ఉపయోగించాలనుకున్నాడనేది స్పష్టమవుతోంది. యరొబాము ప్రారంభించిన మతం చాలా శతాబ్దాలు నిలిచి, చివరకు దేవుడు ఆ మతభ్రష్ట ఇశ్రాయేలు జనాంగానికి తీర్పుతీర్చినప్పుడు లక్షలాదిమంది మరణానికి కారణమైంది. యరొబాము ఆ మతాన్ని రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశంతోనే ప్రారంభించాడు. అదే విధంగా ఈనాటి వరకూ ప్రాచుర్యంలో ఉన్న కొన్ని దేశాల మతాలు రాజకీయ అధికారాన్ని పెంచుకొనే ప్రయత్నాలతోనే ఆవిర్భవించాయి.

ప్రజలు కొత్త మతాన్ని ఏర్పర్చుకోవడానికిగల మరో కారణాన్ని అపొస్తలుడైన పౌలు ఈ మాటల్లో వెల్లడిచేస్తున్నాడు: “నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొస్తలుల కార్యములు 20:​29, 30) అహంకారులైన మతనాయకులు ప్రజల్ని తమవైపు ఆకట్టుకోవాలనే ఉద్దేశంతోనే సాధారణంగా మత ఉద్యమాలు ప్రారంభిస్తుంటారు. నామకార్థ క్రైస్తవ చర్చీలు అసంఖ్యాక శాఖలుగా చీలిపోయాయి.

మతాలు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాయి?

ప్రజలు కోరుతున్నదానికి అనుగుణంగా ఒక కొత్త మతాన్ని ప్రారంభించడానికి కొందరు పురికొల్పబడవచ్చు. ఉదాహరణకు, ఎకానమిస్ట్‌ అనే పత్రిక అమెరికాలోవున్న మెగాచర్చీలు అని పిలువబడేవాటి గురించి నివేదించింది. ఆ చర్చీలు “విజయవంతమైన వ్యాపారాలన్నీ పాటించే సూత్రాన్నే అంటే వినియోగదారునికి ప్రాధాన్యతనివ్వడమనే సూత్రాన్ని పాటిస్తున్నాయి” కాబట్టే అవి పెరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. కొన్ని చర్చీలు “వీడియో ప్రదర్శనలు, నాటకాలు, ఆధునిక సంగీతంతో కూడిన మనోరంజకమైన సేవాకూటాలు” నిర్వహిస్తున్నాయి. ఆ చర్చీల్లోని కొందరు మతనాయకులు తమ సభ్యులకు “ధనవంతులుగా, ఆరోగ్యంగా ఉండడమెలాగో, సమస్యలు లేని జీవితాన్ని అనుభవించడమెలాగో” బోధిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అలాంటి చర్చీలు వినోద పరిశ్రమలో లేక “స్వయంసహాయక వృత్తిలో” ఉన్నందుకు విమర్శించబడుతున్నా, “అవి కేవలం ప్రజలు కోరుతున్నదానికి అనుగుణంగా నడుచుకుంటున్నాయి” అని అదే వార్తాపత్రిక నివేదిస్తోంది. “వ్యాపారం, మతాల మేళవింపు అద్భుతంగా విజయవంతమయ్యింది” అంటూ ఆ నివేదిక ముగిసింది.

ఇతర మతాల వ్యాపారతత్వం అంత బహిరంగంగా కనిపించకపోయినా, “ప్రజలు కోరుతున్నదానికి అనుగుణంగా” నడుచుకునే చర్చీలు మనకు పౌలు ఇచ్చిన హెచ్చరికను గుర్తుచేస్తాయి. ఆయనిలా వ్రాశాడు: “జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవి నియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.”​—⁠2 తిమోతి 4:​3, 4.

అనేక మతాలు దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరికకన్నా రాజకీయ అధికారం, హోదా, ప్రజాదరణపై దాహంతో ఆవిర్భవించాయి కాబట్టి, మతం పిల్లలపై అత్యాచారం, మోసం, యుద్ధం లేక ఉగ్రవాదం వంటి చెడుతనంలో పాలుపంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. తరచూ మతం వట్టి భూటకం. దానిచేత మోసగింపబడకుండా మీరు ఎలా జాగ్రత్తపడవచ్చు?

[4వ పేజీలోని బ్లర్బ్‌]

అనేక మతాలు దేవుణ్ణి సంతోషపెట్టాలనే కోరికకన్నా రాజకీయ అధికారం, హోదా, ప్రజాదరణపై దాహంతో ఆవిర్భవించాయి