యెహోవాపట్ల భయభక్తులతో జీవించండి
యెహోవాపట్ల భయభక్తులతో జీవించండి
“యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.”—కీర్తన 34:9.
దేవునికి భయపడడం గురించి బోధించే క్రైస్తవమత సామ్రాజ్య ప్రచారకులు, దేవుడు పాపులను నిరంతరం నరకాగ్నిలో బాధిస్తాడనే లేఖనరహిత బోధ ఆధారంగా తరచూ అలా బోధిస్తారు. ఆ సిద్ధాంతం, ప్రేమగల, న్యాయంగల దేవుడని యెహోవా గురించి బైబిలు బోధిస్తున్నదానికి విరుద్ధంగా ఉంది. (ఆదికాండము 3:19; ద్వితీయోపదేశకాండము 32:4; రోమీయులు 6:23; 1 యోహాను 4:8) క్రైస్తవమత సామ్రాజ్య పరిచారకుల్లో కొందరు మరోరకంగా బోధిస్తారు. వారు దేవుని భయం గురించి ఎన్నడూ ప్రస్తావించరు. బదులుగా, వారు దేవునికి పట్టింపులేదని, ఒకవ్యక్తి ఎలా జీవించినా అతణ్ణి ఆయన అంగీకరిస్తాడని బోధిస్తారు. బైబిలు ఇలా కూడా బోధించడం లేదు.—గలతీయులు 5:19-21.
2 నిజానికి దేవునికి భయపడమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. (ప్రకటన 14:7) ఇది కొన్ని ప్రశ్నలను లేవదీస్తుంది. ప్రేమగల దేవుడు తనకు భయపడమని మనల్ని ఎందుకు అడుగుతున్నాడు? ఆయన ఎలాంటి భయాన్ని కోరుతున్నాడు? దేవునికి భయపడడం మనకెలా ప్రయోజనం చేకూర్చగలదు? మనం 34వ కీర్తన యొక్క మన చర్చను కొనసాగిస్తుండగా ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం.
దేవునికి ఎందుకు భయపడాలి?
3 యెహోవాయే విశ్వ సృష్టికర్త, సర్వోన్నత పరిపాలకుడు కాబట్టి, మనమాయనకు భయపడాలి. (1 పేతురు 2:17) అయితే, ఆ భయం క్రూరుడైన దేవునికి తీవ్రంగా భయపడడం లాంటిది కాదు. అది యెహోవా గుణగణాలనుబట్టి ఆయనపట్ల కలిగివుండే భక్తిపూర్వక భయం. అది ఆయనను అసంతోషపర్చకూడదనే భయం కూడా. ఆ దైవభయం ఉదాత్తమైనదేకాక, క్షేమాభివృద్ధికరమైనది కూడా, అది కృంగదీసే లేదా భీతిల్లచేసే భయం కాదు. ‘సంతోషంగా ఉండే దేవుడైన’ యెహోవా తాను సృష్టించిన మానవులు జీవితాన్ని ఆనందించాలని కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:11, NW) అయితే అలా ఆనందించేందుకు మనం దేవుని కట్టడల ప్రకారం జీవించాలి. అందుకు చాలామంది తమ జీవనశైలిని మార్చుకోవలసి ఉంటుంది. అవసరమైన మార్పులు చేసుకునేవారందరూ కీర్తనకర్తయైన దావీదు పలికిన ఈ మాటల సత్యత్వాన్ని చవిచూస్తారు: “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి, ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.” (కీర్తన 34:8, 9) యెహోవా దేవునికి భయపడేవారందరూ ఆయనతో మంచి సంబంధం కలిగివుంటారు కాబట్టి, వారికి శాశ్వత విలువగలదేదీ కొదువగా ఉండదు.
4 దావీదు తన మనుష్యులను “భక్తులు” అని పిలుస్తూ వారిని సన్మానించాడని గమనించండి, ఆయన కాలంలో అలా పిలవడం అలాగే అన్వయించబడేది. వారు దేవుని పరిశుద్ధ జనాంగంలో భాగం. దావీదును అనుసరించేందుకు వారు తమ ప్రాణాలకు తెగిస్తున్నారు. తాము రాజైన సౌలు నుండి పారిపోతున్నా, యెహోవా తమ ప్రాథమిక అవసరాలు తీరుస్తాడని దావీదు బలంగా నమ్మాడు. దావీదు ఇలా వ్రాశాడు: “సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును; యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు.” (కీర్తన 34:10) యేసు కూడా తన అనుచరులకు అలాంటి హామీనే ఇచ్చాడు.—మత్తయి 6:33.
5 యేసు మాటలు విన్నవారిలో చాలామంది యూదుల్లోని అణగగొట్టబడినవారు, బీదల తరగతికి చెందినవారు. అందువల్ల యేసు, “వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరప[డ్డాడు].” (మత్తయి 9:36) అలాంటి దీనులకు యేసును అనుకరించే ధైర్యముందా? అలా అనుసరించేందుకు వారు మనుష్యులపట్ల కాదుగానీ యెహోవాపట్ల భయాన్ని పెంపొందించుకోవాలి. యేసు ఇలా అన్నాడు: “దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో [‘గెహెన్నాలో,’ NW] పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా?”—లూకా 12:4-7.
6 యెహోవా భక్తులు దేవుని సేవను ఆపేలా శత్రువులు వారిపై ఒత్తిడి తెచ్చినప్పుడు, వారు యేసు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని గుర్తుచేసుకోవచ్చు: “నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతలయెదుట వానిని ఒప్పుకొనును. మనుష్యులయెదుట నన్ను ఎరుగనను వానిని, నేనును ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును.” (లూకా 12:8, 9) ఆ మాటలు, ప్రత్యేకంగా ఆరాధన నిషేధించబడిన దేశాల్లోని క్రైస్తవులను బలపర్చాయి. అలాంటివారు వివేచనతో క్రైస్తవ కూటాల్లో, తమ బహిరంగ పరిచర్యలో మానక యెహోవాను స్తుతిస్తున్నారు. (అపొస్తలుల కార్యములు 5:29) “భయభక్తులు” కనబర్చే విషయంలో యేసు అత్యుత్తమ మాదిరినుంచాడు. (హెబ్రీయులు 5:7) ఆయన గురించి మాట్లాడుతూ, ప్రవచన వాక్యమిలా చెబుతోంది: “యెహోవా ఆత్మ . . . యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును; యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును.” (యెషయా 11:2, 3) కాబట్టి, దైవభయంవల్ల చేకూరే ప్రయోజనాల గురించి మనకు బోధించే ఉత్కృష్టమైన అర్హత యేసుకు ఉంది.
7 యేసు మాదిరిని అనుకరిస్తూ ఆయన బోధలకు లోబడేవారందరూ నిజానికి దావీదు ఇచ్చినలాంటి ఈ ఆహ్వానానికి స్పందిస్తున్నవారిగా ఉంటారు: “పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.” (కీర్తన 34:11) దావీదు తన మనుష్యులను “పిల్లలారా” అని సంబోధించడం సరైనదే, ఎందుకంటే వారాయనను తమ నాయకుడిగా భావించారు. దావీదు తనవంతుగా, తన అనుచరులు ఐకమత్యం కలిగి దేవుని అనుగ్రహాన్ని ఆస్వాదించగలిగేలా వారికి ఆధ్యాత్మిక సహాయం అందించాడు. క్రైస్తవ తల్లిదండ్రులకు అదెంత చక్కని మాదిరో కదా! తమ కుమారులను, కుమార్తెలను ‘ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచేందుకు’ యెహోవా వారికి అధికారమిచ్చాడు. (ఎఫెసీయులు 6:4) తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతీదినం ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ, వారితో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా యెహోవాపట్ల భయంతో జీవించేలా వారికి సహాయం చేస్తారు.—ద్వితీయోపదేశకాండము 6:6, 7.
మనమెలా దైవభయాన్ని అభ్యసించవచ్చు?
8 ముందు పేర్కొన్నట్లుగా, యెహోవా భయం మన ఆనందాన్ని హరించదు. దావీదు ఇలా అడిగాడు: “బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?” (కీర్తన 34:12) మేలుననుభవిస్తూ దీర్ఘకాలం జీవించేందుకు యెహోవా భయమే కీలకమనేది స్పష్టం. “నేను దేవునికి భయపడుతున్నాను” అని చెప్పడం చాలా సులభం. అయితే మన ప్రవర్తన ద్వారా దానిని నిరూపించడం మాత్రం అంత సులభం కాదు. అందువల్ల, మనం దైవభయాన్ని ఎలా చూపించవచ్చో దావీదు వివరిస్తున్నాడు.
9“చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము.” (కీర్తన 34:13) అపొస్తలుడైన పేతురు, క్రైస్తవులు పరస్పరం సహోదరప్రేమతో మెలగాలని ఉపదేశించిన తర్వాత 34వ కీర్తనలోని ఈ భాగాన్ని ఎత్తివ్రాసేందుకు ప్రేరేపించబడ్డాడు. (1 పేతురు 3:8-12) చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను కాచుకోవడమంటే హానికరమైన గాలికబుర్లను వ్యాప్తిచేయకుండా ఉండడమని అర్థం. బదులుగా, మనం ఇతరులతో క్షేమాభివృద్ధికరంగా మాట్లాడేందుకే ఎల్లప్పుడూ కృషిచేస్తాం. అంతేకాక, ధైర్యంగావుంటూ సత్యం మాట్లాడేందుకు కృషిచేస్తాం.—ఎఫెసీయులు 4:25, 29, 31; యాకోబు 5:16.
10“కీడు చేయుట మాని మేలు చేయుము; సమాధానము వెదకి దాని వెంటాడుము.” (కీర్తన 34:14) దేవుడు ఖండించే లైంగిక దుర్నీతి, అశ్లీలత, దొంగతనం, అభిచారం, దౌర్జన్యం, త్రాగుబోతుతనం, మాదకద్రవ్యాలను ఉపయోగించడం వంటివాటికి మనం దూరంగా ఉంటాం. అలాంటి హేయమైన వాటిని చూపించే వినోదాన్ని కూడా మనం తిరస్కరిస్తాం. (ఎఫెసీయులు 5:10-12) బదులుగా మేలుచేసేందుకు మనం మన సమయాన్ని వినియోగిస్తాం. మనం చేయగల అతిగొప్ప మేలు ఏమిటంటే, రాజ్య ప్రకటనాపనిలో, శిష్యులనుచేసే పనిలో క్రమంగా భాగంవహిస్తూ రక్షణ పొందేలా ఇతరులకు సహాయం చేయడమే. (మత్తయి 24:14; 28:19, 20) మేలు చేయడంలో క్రైస్తవ కూటాలకు సిద్ధపడి, వాటికి హాజరవడం, ప్రపంచవ్యాప్త పనికి విరాళాలివ్వడం, రాజ్యమందిరంపట్ల శ్రద్ధ చూపించడం, బీద క్రైస్తవుల అవసరాలను పట్టించుకోవడం కూడా ఇమిడివుంది.
11 సమాధానాన్ని వెదకడంలో దావీదు మంచి మాదిరివుంచాడు. సౌలును చంపే అవకాశం ఆయనకు రెండుసార్లు వచ్చింది. ఆ రెండు సందర్భాల్లో ఆయన దౌర్జన్యానికి దిగకపోవడమేకాక, సమాధానపడాలనే ఆశతో రాజుతో గౌరవంగా మాట్లాడాడు. (1 సమూయేలు 24:8-11; 26:17-20) నేడు సంఘ ప్రశాంతతను పాడుచేసే పరిస్థితి తలెత్తినప్పుడు ఏమిచేయవచ్చు? మనం ‘సమాధానాన్ని వెదకి దానిని వెంటాడాలి.’ కాబట్టి, మనకు మన తోటివిశ్వాసికి మధ్య సంబంధం సరిగాలేదని గ్రహించినప్పుడు, “మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము” అని యేసు ఇచ్చిన ఉపదేశానికి లోబడతాం. ఆ తర్వాతే మనం సత్యారాధనకు సంబంధించిన ఇతర అంశాల్లో కొనసాగుతాం.—మత్తయి 5:23, 24; ఎఫెసీయులు 4:26.
దేవునికి భయపడడం విస్తారమైన ప్రతిఫలాలనిస్తుంది
12“యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.” (కీర్తన 34:15) దేవుడు దావీదుతో వ్యవహరించిన విధానం ఆ మాటల సత్యత్వాన్ని నిరూపిస్తోంది. యెహోవా మనల్ని కనిపెడుతున్నాడని మనకు తెలుసు కాబట్టే నేడు మనం అధిక ఆనందాన్ని, అంతరంగ సమాధానాన్ని అనుభవిస్తున్నాం. మనం తీవ్రమైన ఒత్తిడి క్రిందవున్నా, ఆయనెల్లప్పుడూ మన అవసరాలకు తగ్గట్లు స్పందిస్తాడనే నమ్మకం మనకుంది. సత్యారాధకులందరూ ముందే చెప్పబడినట్లుగా మాగోగువాడైన గోగు ముట్టడిని, ‘యెహోవాయొక్క భయంకరమైన దినాన్ని’ త్వరలోనే ఎదుర్కొంటారని మనకు తెలుసు. (యోవేలు 2:11, 31; యెహెజ్కేలు 38:14-18, 21-23) మనమప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసివచ్చినా మన విషయంలో దావీదు పలికిన ఈ మాటలు నిజమౌతాయి: “నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.”—కీర్తన 34:17.
13 ఆ సమయంలో యెహోవా తన గొప్పనామాన్ని మహిమపర్చడాన్ని చూడడం ఎంత పులకరించేదిగా ఉంటుందో కదా! మన హృదయాలు క్రితమెన్నడూలేనంతగా మరెంతో భక్తిపూర్వక భయంతో, పూజ్యభావంతో నిండిపోగా, వ్యతిరేకులు అవమానకరమైన రీతిలో నాశనమౌతారు. “దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.” (కీర్తన 34:16) దేవుని నీతియుక్త నూతనలోకంలోకి ప్రవేశించేలా విడుదల చేయబడడం ఎంతగొప్ప ప్రతిఫలమో కదా!
సహించేందుకు మనకు సహాయంచేసే వాగ్దానాలు
14 ఈ మధ్యకాలంలో, భ్రష్టుపట్టి వైరీభావం ప్రదర్శించే లోకంలో యెహోవాకు విధేయత చూపిస్తూ ఉండేందుకు సహనం అవసరం. మనం విధేయతను అలవర్చుకునేందుకు దైవభయం మనకెంతో సహాయం చేస్తుంది. మనం నివసిస్తున్న అపాయకరమైన కాలాల దృష్ట్యా, యెహోవా సేవకుల్లో కొందరు తమ హృదయాన్ని కలచివేసి, నిరుత్సాహం కలిగించే తీవ్ర ఇబ్బందుల్ని అనుభవించవచ్చు. అయితే, వారు యెహోవాపై ఆధారపడితే, సహించేందుకు ఆయన సహాయం చేస్తాడనే నిశ్చయతతో ఉండవచ్చు. దావీదు పలికిన ఈ మాటలు నిజంగా ఓదార్పునిస్తాయి: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు; నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” (కీర్తన 34:18) ప్రోత్సాహకరంగా, దావీదు ఇంకా ఇలా అన్నాడు: “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్తన 34:19) మనకెన్ని విపత్తులు సంభవించినా, మనల్ని విడిపించేందుకు యెహోవా సమర్థుడు.
1 సమూయేలు 22:13, 18-21) సహాయం కోసం దావీదు నిస్సందేహంగా యెహోవాపై ఆధారపడి, “నీతిమంతులకు” భవిష్యత్తులో పునరుత్థానముందనే ఉత్తరాపేక్షనుబట్టి నిశ్చయంగా ఓదార్పు పొందివుంటాడు.—అపొస్తలుల కార్యములు 24:14.
15 దావీదు 34వ కీర్తన కూర్చిన కొద్దిరోజులకే, ఆయన నోబు నివాసులకు కలిగిన విపత్తు గురించి విన్నాడు. ఆ పట్టణ నివాసులను, చాలామంది యాజకులను సౌలు సంహరించాడు. తాను నోబుకు వెళ్లడమే సౌలు కోపానికి కారణమని గుర్తుచేసుకొని ఆయనెంత బాధపడి ఉంటాడో కదా! (16 నేడు, పునరుత్థాన నిరీక్షణ మనల్ని కూడా బలపరుస్తోంది. మన శత్రువులు మనకు శాశ్వత హాని కలిగించేదేదీ చేయలేరని మనకు తెలుసు. (మత్తయి 10:28) ఈ విధమైన నమ్మకాన్నే దావీదు ఈ మాటల్లో వ్యక్తపర్చాడు: “ఆయన వాని [నీతిమంతుని] యెముకలన్నిటిని కాపాడును; వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.” (కీర్తన 34:20) ఆ వచనం యేసు విషయంలో అక్షరార్థంగా నెరవేరింది. యేసు క్రూరంగా చంపబడినప్పటికీ, ఆయన ఎముకలలో ఏదియూ ‘విరువబడలేదు.’ (యోహాను 19:36) విస్తృత అన్వయింపులో కీర్తన 34:20, అభిషిక్త క్రైస్తవులు, “వేరే గొఱ్ఱెల” సహవాసులు ఎలాంటి పరీక్షలనెదుర్కొన్నా వారికెన్నటికీ శాశ్వత హాని జరగదనే హామీ మనకిస్తోంది. సూచనార్థకంగా చెప్పాలంటే, వారి ఎముకలు ఎన్నడూ విరువబడవు.—యోహాను 10:16.
17 కానీ దుష్టుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. త్వరలోనే వారు తాము విత్తిన పంటకోస్తారు. “చెడుతనము భక్తిహీనులను సంహరించును; నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు.” (కీర్తన 34:21) దేవుని ప్రజలను అదేపనిగా వ్యతిరేకించే వారందరూ అత్యంత నాశనకరమైన విపత్తునెదుర్కొంటారు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వారు “నిత్యనాశనమను దండన పొందుదురు.”—2 థెస్సలొనీకయులు 1:9.
18 దావీదు కీర్తన ఈ ఓదార్పుకరమైన మాటలతో ముగుస్తోంది: “యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును; ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.” (కీర్తన 34:22) రాజైన దావీదు, 40 ఏళ్ల తన పరిపాలన ఇక ముగుస్తుందనగా ఇలా అన్నాడు: “సకలమైన ఉపద్రవములలోనుండి [దేవుడు] నన్ను విడిపించెను.” (1 రాజులు 1:29) దావీదులాగే, యెహోవాకు భయపడేవారు కూడా తమ గతాన్ని గుర్తుచేసుకొని, పాపం మూలంగా కలిగిన అపరాధ భావంనుండి విడిపించబడినందుకు, తమకు కలిగిన పరీక్షలన్నింటినుండి కాపాడబడినందుకు ఆనందిస్తారు. ఇప్పటికే అభిషిక్త క్రైస్తవుల్లో చాలామంది తమ పరలోక ప్రతిఫలాన్ని అందుకున్నారు. అన్ని దేశాల నుండి వచ్చిన “ఒక గొప్పసమూహము” ఇప్పుడు భూమ్మీద మిగిలివున్న యేసు సహోదరులతో కలిసి దేవుణ్ణి సేవిస్తూ, తత్ఫలితంగా యెహోవా ఎదుట పరిశుభ్ర స్థానం కలిగివున్నారు. దీనికి కారణం, యేసు చిందించిన రక్తానికున్న విడుదలచేసే శక్తిని వారు విశ్వసించడమే. రాబోయే వెయ్యేళ్ల క్రీస్తు పరిపాలనలో విమోచన క్రయధన బలి ప్రయోజనాలు పూర్తిగా అన్వయించబడి, వారు మానవ పరిపూర్ణతకు తీసుకురాబడతారు.—ప్రకటన 7:9, 14, 17; 21:3-5.
19 ఈ ఆశీర్వాదాలన్నీ దేవుని ఆరాధకుల ‘గొప్పసమూహానికే’ ఎందుకు లభిస్తాయి? ఎందుకంటే వారు ఎల్లప్పుడూ యెహోవాకే భయపడాలని తీర్మానించుకుని, భక్తిపూర్వక భయంతో, గౌరవపూర్వక విధేయతతో ఆయనను సేవిస్తున్నారు. అవును, యెహోవాపట్ల భయంతో ఉండడం, ఇప్పటి జీవితాన్ని ఆహ్లాదకరం చేయడమేకాక, “వాస్తవమైన జీవమును” అంటే దేవుని నూతనలోకంలో నిత్యజీవాన్ని ‘సంపాదించుకునేందుకు’ సహాయం చేస్తుంది.—1 తిమోతి 6:12, 18, 19; ప్రకటన 15:3, 4.
మీకు జ్ఞాపకమున్నాయా?
• మనమెందుకు దేవునికి భయపడాలి, ఆయనకు భయపడడమంటే ఏమిటి?
• భయభక్తులు కలిగివుండడం మన ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపించాలి?
• దేవునికి భయపడడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి?
• సహించడానికి మనకు ఏ వాగ్దానాలు సహాయం చేస్తాయి?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) క్రైస్తవమత సామ్రాజ్యం దేవుని భయాన్ని ఏ యే విధాలుగా దృష్టించింది? (బి) మనమిప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?
3. (ఎ) దేవునికి భయపడమనే ఆజ్ఞను మీరెలా దృష్టిస్తారు? (బి) యెహోవాకు భయపడేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు?
4. దావీదు, యేసు ఎలాంటి హామీని ఇచ్చారు?
5. (ఎ) యేసు అనుచరుల్లో చాలామంది నేపథ్యమేమిటి? (బి) భయం విషయంలో యేసు ఏమని ఉపదేశించాడు?
6. (ఎ) యేసు పలికిన ఏ మాటలు క్రైస్తవులను బలపర్చాయి? (బి) భయభక్తులు కనబర్చే విషయంలో యేసు ఎందుకు అత్యుత్తమ మాదిరిగా ఉన్నాడు?
7. (ఎ) నిజానికి, దావీదు ఇచ్చినలాంటి ఆహ్వానానికి క్రైస్తవులు ఎలా స్పందిస్తారు? (బి) తల్లిదండ్రులు దావీదు మంచి మాదిరిని ఎలా అనుసరించవచ్చు?
8, 9. (ఎ) దైవభక్తిగల జీవన విధానాన్ని ఏది మరింత ఆకర్షణీయంగా చేస్తుంది? (బి) మన నాలుకను కాచుకోవడంలో ఏమి ఇమిడివుంది?
10. (ఎ) చెడు చేయకుండా ఉండడమంటే ఏమిటో వివరించండి. (బి) మేలు చేయడంలో ఏమి ఇమిడివుంది?
11. (ఎ) సమాధానం గురించి తాను చెప్పిన విషయాలను దావీదు ఎలా ఆచరణలో పెట్టాడు? (బి) సంఘంలో ‘సమాధానాన్ని వెంటాడేందుకు’ మీరేమి చేయవచ్చు?
12, 13. (ఎ) దేవునికి భయపడేవారు ప్రస్తుతం ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? (బి) నమ్మకమైన ఆరాధకులు త్వరలోనే ఎలాంటి దివ్య ప్రతిఫలాన్ని అనుభవిస్తారు?
14. విపత్తులు సంభవించినా సహించేందుకు మనకేది సహాయం చేస్తుంది?
15, 16. (ఎ) దావీదు 34వ కీర్తన కూర్చిన కొద్దిరోజులకే ఏ విపత్తు గురించి విన్నాడు? (బి) పరీక్షలను సహించేందుకు మనకేది సహాయం చేస్తుంది?
17. పశ్చాత్తాపం లేకుండా యెహోవా ప్రజలను వ్యతిరేకించేవారికి ఏ విపత్తు వేచివుంది?
18. “గొప్పసమూహము” ఇప్పటికే ఏ భావంలో విడిపించబడింది, భవిష్యత్తులో వారేమి అనుభవిస్తారు?
19. ‘గొప్పసమూహపు’ సభ్యులు ఏమి చేయడానికి తీర్మానించుకున్నారు?
[26వ పేజీలోని చిత్రం]
యెహోవాకు భయపడేవారు నిషేధం క్రింద ఉన్నప్పుడు వివేచనతో మెలుగుతారు
[28వ పేజీలోని చిత్రం]
మన పొరుగువారితో రాజ్యసువార్త పంచుకోవడమే మనం వారికి చేయగల అతి గొప్పమేలు