కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ “సంస్కరణకు ముందు జీవించిన సంస్కర్త”

వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ “సంస్కరణకు ముందు జీవించిన సంస్కర్త”

వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ “సంస్కరణకు ముందు జీవించిన సంస్కర్త”

1517లో ప్రారంభమైన ప్రొటస్టెంట్‌ సంస్కరణోద్యమం గురించి తెలిసిన విద్యార్థులందరికీ లూథర్‌, టిండేల్‌, కాల్విన్‌ అనే పేర్లు తెలిసినవే. అయితే, వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ అనే పేరు మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ఆయన “సంస్కరణకు ముందు జీవించిన సంస్కర్త” అని పిలువబడేవాడు. మీకు ఆ వ్యక్తి గురించి మరింత తెలుసుకోవాలని ఉందా?

వె స్సల్‌ 1419లో నెదర్లాండ్స్‌లోని గ్రోనిన్‌జెన్‌ పట్టణంలో జన్మించాడు. 15వ శతాబ్దంలో చాలా తక్కువమందికి పాఠశాలకు వెళ్లే అవకాశం ఉండేది, అరుదైన ఆ అవకాశం వెస్సల్‌కు లభించింది. వెస్సల్‌ మంచి ప్రజ్ఞావంతుడే అయినా ఆయనకు 9 ఏళ్లున్నప్పుడు తన తల్లిదండ్రుల కడుపేదరికం వల్ల చదువు మానేయాల్సి వచ్చింది. అయితే, సంతోషదాయకంగా గొప్పింటి విధవరాలు ఒకామె వెస్సల్‌ ప్రతిభ గురించి విని ఆయన చదువుకయ్యే ఖర్చు తాను భరిస్తానంది. అలా వెస్సల్‌ మళ్లీ తన చదువు కొనసాగించగలిగాడు. అనతికాలంలో ఆయన మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన మత ధర్మశాస్త్ర అధ్యయనానికి సంబంధించిన డాక్టరేట్‌ కూడా అందుకొని ఉండవచ్చనిపిస్తుంది.

వెస్సల్‌కు జ్ఞానం సంపాదించాలనే బలమైన కోరిక ఉండేది. అయితే, ఆయన కాలంలో చాలా తక్కువ గ్రంథాలయాలు ఉండేవి. అప్పటికి మూవబుల్‌ ముద్రణా విధానం (టైప్‌ ఫేసుల్ని సులభంగా మార్చుకోవడానికి వీలయ్యే ముద్రణా విధానం) ఆవిష్కరించబడినా ఎక్కువ పుస్తకాలు చేత్తో వ్రాయబడేవి, అవి ఎంతో ఖరీదుండేవి. వెస్సల్‌ ఒక విద్వాంసుల గుంపులో సభ్యునిగా ఉండేవాడు, వారు అరుదైన వ్రాతప్రతులను, కనుమరుగైన పుస్తకాలను వెతుక్కుంటూ గ్రంథాలయాలను, క్రైస్తవ సన్యాసుల మఠాలను సందర్శించేవారు. ఆ తర్వాత వారు తాము తెలుసుకున్నవాటిని గుంపులోని ఇతరులతో పంచుకునేవారు. వెస్సల్‌ అపారమైన జ్ఞానాన్ని సంపాదించి, తన పుస్తకం నిండా గ్రీకు, లాటిన్‌ భాషా సాహిత్యం నుండి సేకరించిన ఉదాహరించబడిన భాగాలను, గ్రంథ భాగాలను వ్రాసుకున్నాడు. మత ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన ఇతరులు తరచూ ఆయన చెప్పే విషయాలను అనుమానించేవారు ఎందుకంటే వారు ఎన్నడూ కనీవినీ ఎరుగని ఎన్నో విషయాలు వెస్సల్‌కు తెలిసి ఉండేవి. వెస్సల్‌ను అప్పట్లో మాజిస్టర్‌ కాంత్రాడిక్తియోనిస్‌ లేదా వైరుద్ధ్యాల పండితుడు అని పిలిచేవారు.

“క్రీస్తు దగ్గరికి ఎందుకు నన్ను నడిపించరు?”

వెస్సల్‌, సంస్కరణోద్యమం ప్రారంభమవడానికి దాదాపు 50 ఏళ్ల ముందు థామస్‌ ఆ కెంపిస్‌ను (సుమారు 1379-1471) కలిశాడు. ఆ వ్యక్తి డి ఇమిటేషియోన్‌ క్రైస్టీ (ఇమిటేషన్‌ ఆఫ్‌ క్రైస్ట్‌) అనే ప్రఖ్యాత పుస్తకాన్ని వ్రాసిన రచయిత. థామస్‌ ఆ కెంపిస్‌ కామన్‌ లైఫ్‌ అనే ఉద్యమానికి చెందిన సహోదరులలో ఒకడు, ఆ ఉద్యమం దైవభక్తితో జీవించవలసిన అవసరాన్ని నొక్కిచెప్పింది. థామస్‌ ఆ కెంపిస్‌ వెస్సల్‌ను మేరీ మాత సహాయాన్ని అర్థించమని ఎన్నోసార్లు ప్రోత్సహించాడని వెస్సల్‌ జీవితచరిత్ర వ్రాసిన ఒక వ్యక్తి పేర్కొన్నాడు. దానికి వెస్సల్‌ ఇలా జవాబిచ్చేవాడు: “ప్రయాసపడి భారం మోస్తున్న వారందరినీ తన దగ్గరికి రమ్మని దయతో ఆహ్వానించే క్రీస్తు దగ్గరికి ఎందుకు నన్ను నడిపించరు?”

వెస్సల్‌కు ప్రీస్టు అవడం ఇష్టముండేది కాదని చెప్పబడుతుంది. మతనాయకుల్లో సభ్యునిగా గుర్తించబడేలా తన తలపై జట్టు తీసేయించుకోవడాన్ని ఎందుకు నిరాకరించాడో చెప్పమని అడిగినప్పుడు, పూర్తి మతిస్థిమితంతో ఉన్నంత వరకూ తాను ఉరితీయబడినా భయపడనని బదులిచ్చాడు. అలా అన్నప్పుడు ఆయన, చర్చిలో ప్రీస్టులైనవారు హతమార్చబడేవారు కాదు, నిజానికి అనేకమంది ప్రీస్టులు అలా జుట్టు తీసేయించుకోవడం వల్లే ఉరితీయబడడం నుండి తప్పించుకున్నారనే విషయాన్ని చెప్పాడని స్పష్టమవుతోంది. వెస్సల్‌ అప్పట్లో ప్రాబల్యంగా ఉన్న కొన్ని మతాచారాలను కూడా వ్యతిరేకించాడు. ఉదాహరణకు, ఆయన కాలంలో జనాదరణ పొందిన డయాలోగుస్‌ మీరాకులోరుమ్‌ అనే పుస్తకంలో వర్ణించబడిన అద్భుత కార్యాలను నమ్మలేదని విమర్శించబడ్డాడు. దానికి జవాబుగా ఆయనిలా చెప్పాడు: “వాటిని నమ్మే బదులు పరిశుద్ధ లేఖనాల నుండి చదవడమే మంచిది.”

“మనం ఎంత అడుగుతామో, మనకు అంతే తెలుస్తుంది”

వెస్సల్‌ హెబ్రీ, గ్రీకు భాషలను అభ్యసించి, తొలి చర్చి పాదిరీలు వ్రాసిన గ్రంథాల నుంచి అపార జ్ఞానం సంపాదించుకున్నాడు. బైబిలు వ్రాయబడిన ఆదిమ భాషలపట్ల ఆయనకున్న మక్కువ ప్రత్యేకంగా అసాధారణమైంది ఎందుకంటే ఆయన ఎరాస్మస్‌, రోయ్‌క్లెన్‌ల కన్నా ముందే జీవించాడు. * సంస్కరణోద్యమానికి ముందు గ్రీకు భాష తెలిసినవాళ్లు చాలా అరుదు. జర్మనీలో కేవలం కొద్దిమంది విద్వాంసులకు మాత్రమే గ్రీకు తెలుసు, ఆ భాష నేర్చుకోవడానికి ఉపకరణాలు కూడా ఏమీ లేవు. కాన్‌స్టాంటినోపుల్‌ 1453లో పతనమైన తర్వాత, వెస్సల్‌ పశ్చిమానికి పారిపోయిన గ్రీకు సన్యాసులను కలుసుకుని వారి నుండి ప్రాథమిక గ్రీకు భాష నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో, కేవలం యూదులు మాత్రమే హెబ్రీ భాష మాట్లాడేవారు కాబట్టి వెస్సల్‌ మతమార్పిడి చేసుకున్న యూదుల నుండి ప్రాథమిక హెబ్రీ భాష నేర్చుకుని ఉండవచ్చు.

వెస్సల్‌కు బైబిల్‌ అంటే ఎనలేని ప్రీతి. ఆయన దాన్ని దేవుని ప్రేరేపిత పుస్తకంగా పరిగణించాడు, దానిలోని పుస్తకాలన్నీ ఒకదానితో ఒకటి పూర్తి సమన్వయం కలిగి ఉన్నాయని నమ్మాడు. బైబిల్‌ లేఖనాల అర్థం వాటి సందర్భంతో పూర్తిగా ఏకీభవించాలని, వాటి అర్థాన్ని ఎవరూ వక్రీకరించలేరని వెస్సల్‌ అభిప్రాయపడేవాడు. అలా వక్రీకరించబడిన ప్రతీ వివరణ మతానికి విరుద్ధమైందిగా పరిగణించబడాలి. ఆయనకు ఇష్టమైన లేఖనాల్లో మత్తయి 7:​7 ఒకటి, అందులో “వెదకుడి మీకు దొరకును” అని ఉంటుంది. ఆ లేఖనంలోని సందేశం వల్లనే ప్రశ్నలు అడగడం ప్రయోజనకరమైనదని, “మనం ఎంత అడుగుతామో, మనకు అంతే తెలుస్తుంది” అని వెస్సల్‌ దృఢంగా నమ్మేవాడు.

వింత కోరిక

వెస్సల్‌ 1473లో రోమ్‌ను సందర్శించాడు. అక్కడ ఆయన పోప్‌ సిక్స్‌టస్‌ IVను కలుసుకున్నాడు. అక్రమ నైతిక ప్రవర్తన కారణంగా ప్రొటస్టెంట్‌ సంస్కరణోద్యమానికి మూలకారకులైన ఆరుగురు పోప్‌లలో ఆ పోప్‌ కూడా ఉన్నాడు. సిక్స్‌టస్‌ IV “బహిరంగంగా సిగ్గువిడిచి స్వలాభం కోసం నిత్యం వెంపర్లాడడం, అధికారంతో ప్రజలపై పెత్తనం చెలాయించడం” వంటివి జరిగిన సమయానికి పునాదివేశాడని చరిత్రకారిణి అయిన బార్బరా డబ్ల్యూ. టక్‌మెన్‌ చెబుతోంది. ఆయన బంధుప్రీతితో చుట్టాలకు పదవులు ఇవ్వడం గురించి బహిరంగంగా మాట్లాడుతూ చర్చిలోని ప్రజల్ని ఆశ్చర్యపరిచాడు. సిక్స్‌టస్‌, పోప్‌ పదవిని తన కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలనుకుని ఉండవచ్చని ఒక చరిత్రకారుడు వ్రాశాడు. అలా మోసగించబడడాన్ని ఖండించడానికి చాలా తక్కువమందికి ధైర్యం ఉండేది.

అయితే, వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ మాత్రం భిన్నమైనవాడు. ఒకరోజు సిక్స్‌టస్‌ ఆయనతో ఇలా అన్నాడు: “నాయనా, నీకు ఏమి కావాలో కోరుకో, అది నేను నీకిస్తాను.” వెస్సల్‌ దానికి కరుకుగా జవాబిస్తూ, “పరిశుద్ధ తండ్రీ . . . మీరు భూలోకంలో అత్యంత గొప్ప ప్రీస్టు, గొర్రెల కాపరి కాబట్టి . . . గొఱ్ఱెల గొప్ప కాపరి . . . వచ్చినప్పుడు, మీతో: ‘భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని సంతోషములో పాలుపొందుము’ అనేలా . . . ఉన్నతమైన మీ బాధ్యతను నిర్వర్తించండి” అని అన్నాడు. సిక్స్‌టస్‌ అది తన బాధ్యతనీ, వెస్సల్‌ తన కోసం వేరే ఏదైనా కోరుకోమని జవాబిచ్చాడు. దానికి వెస్సల్‌, “అయితే మీరు వాటికన్‌ గ్రంథాలయం నుండి గ్రీకు, హెబ్రీ భాషల బైబిలును ఇవ్వాలని నేను కోరుతున్నాను” అని అన్నాడు. పోప్‌ ఆయన కోరికను తీర్చిన తర్వాత, బిషప్‌ పదవిని కోరుకోకుండా వెస్సల్‌ చాలా తెలివితక్కువగా ప్రవర్తించాడని అన్నాడు.

“అబద్ధం, తప్పు”

నేడు ప్రఖ్యాతమైన సిస్టైన్‌ చర్చిని నిర్మించడానికి వనరులు చాలా తక్కువగా ఉండడంతో సిక్స్‌టన్‌, మరణించిన వారికోసం పాపపరిహార పత్రాలను అమ్మేపనిని ఆశ్రయించాడు. ఆ పత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. విసార్స్‌ ఆఫ్‌ క్రైస్ట్‌​—⁠ద డార్క్‌ సైడ్‌ ఆఫ్‌ ద పాపసీ పుస్తకం ఇలా చెబుతోంది: “విధవలు, భార్యలు చనిపోయినవారు, పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు అందరూ తమ ప్రియమైన వారిని పాపపరిహార లోకం నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో తమకున్నదంతా ఖర్చు చేసేవారు.” చనిపోయిన తమ ప్రియమైనవారు పరలోకానికి వెళ్ళేలా పోప్‌ హామీ ఇవ్వగలడని పూర్తిగా నమ్మిన సామాన్య ప్రజలు పాపపరిహార పత్రాల అమ్మకాన్ని స్వాగతించారు.

అయితే, వెస్సల్‌ మాత్రం క్యాథలిక్‌ చర్చికిగానీ, పోప్‌కు గానీ పాపాలను క్షమించే సామర్థ్యం లేదని బలంగా నమ్మాడు. వెస్సల్‌ పాపపరిహార పత్రాల అమ్మకాన్ని బహిరంగంగా “అబద్ధం, తప్పు” అని ఖండించాడు. అలాగే పాప క్షమాపణ కోసం ప్రీస్టుల ముందు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆయన నమ్మాడు.

పోప్‌లు తప్పులే చేయరు అని చెప్పడాన్ని కూడా వెస్సల్‌ ఖండించాడు, పోప్‌లు కూడా పొరపాట్లు చేస్తారు కాబట్టి ప్రజలు ఎప్పుడూ పోప్‌లనే నమ్మాలని ఆశించబడితే విశ్వాసపు పునాదులు బలహీనంగా ఉంటాయని ఆయన అనేవాడు. వెస్సల్‌ ఇలా వ్రాశాడు: “ఉన్నత మతాధికారులే దేవుని నియమాలను నిరాకరించి మానవ నిర్మిత నియమాలను ప్రజలపై రుద్దితే . . . వారు చేసేది, ఆజ్ఞాపించేది నిష్ప్రయోజనం.”

వెస్సల్‌ సంస్కరణోద్యమానికి మార్గం సిద్ధం చేశాడు

వెస్సల్‌ 1489లో మరణించాడు. ఆయన చర్చిలోని కొన్ని తప్పుల్ని వ్యతిరేకించినా, తాను క్యాథలిక్‌గానే ఉండిపోయాడు. అయినా చర్చి ఆయనను ఎన్నడూ మతభ్రష్టుడని నిందించలేదు. అయితే, ఆయన మరణం తర్వాత, మతనిష్ఠగల క్యాథలిక్‌ సన్యాసులు ఆయన వ్రాసినవాటిని అపవిత్రమైనవిగా పరిగణిస్తూ వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించారు. లూథర్‌ కాలానికల్లా దాదాపు అందరూ వెస్సల్‌ను మర్చిపోయారు, ఆయన వ్రాసినవి ఏవీ అచ్చుకాలేదు, వాటిలో కొన్ని మాత్రమే మిగిలాయి. చివరకు 1520, 1522 మధ్యకాలంలో వెస్సల్‌ వ్రాసిన పుస్తకాల మొదటి సంపుటి ప్రచురించబడింది. అందులో లూథర్‌, వెస్సల్‌ వ్రాసినవాటిని వ్యక్తిగతంగా అభినందిస్తూ వ్రాసిన ఉత్తరం కూడా జతచేయబడింది.

వెస్సల్‌, లూథర్‌లా ఒక సంస్కర్త కాకపోయినా, సంస్కరణోద్యమానికి నడిపించిన కొన్ని తప్పులను ఆయన బహిరంగంగా ఖండించాడు. నిజానికి, మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా ఆయనను, “జర్మనీలో పుట్టి సంస్కరణోద్యమానికి మార్గం సిద్ధం చేసిన అత్యంత ప్రముఖుడు” అని వర్ణిస్తోంది.

లూథర్‌ వెస్సల్‌ను స్నేహితునిగా పరిగణించాడు. సి. ఆకెస్టిన్‌ అనే రచయిత ఇలా వ్రాస్తున్నాడు: “లూథర్‌ తాను జీవించిన కాలాన్ని, తనకు లభించిన ప్రతిఫలాన్ని ఏలియాకు ఎదురైన వాటితో పోల్చుకున్నాడు. దేవుని యుద్ధాల్లో పోరాడడానికి తాను మాత్రమే మిగిలివున్నానని ఆ ప్రవక్త ఎలా అనుకున్నాడో, అలాగే లూథర్‌ కూడా చర్చితో తాను చేసే పోరాటంలో ఒంటరిగా ఉన్నానని భావించాడు. అయితే, ఆయన వెస్సల్‌ వ్రాసినవాటిని చదివిన తర్వాత, ప్రభువు ‘ఇశ్రాయేలులో శేషమును’ రక్షించాడని గ్రహించాడు.” “లూథర్‌ చివరకు ఇలా ప్రకటించాడు: ‘నేను ఆయన వ్రాసినవాటిని ముందే చదివుంటే, వెస్సల్‌ వ్రాసినవాటిలోంచే లూథర్‌ అంతా నేర్చుకున్నాడని నా శత్రువులు అనుకుని ఉండేవారు. ఆయన ఆలోచనా విధానానికి నా దానికి ఎంతో దగ్గర పోలిక ఉంది.’” *

“మీకు దొరకును”

సంస్కరణోద్యమం హఠాత్పరిణామం కాదు. సంస్కరణోద్యమానికి నడిపించిన ఆలోచనలు ప్రజల మనసుల్లో కొంతకాలంగా రేకెత్తుతున్నాయి. పోప్‌ల పతనం సంస్కరణ కావాలనే ఆశకు దారితీస్తుందని వెస్సల్‌ గ్రహించాడు. ఆయనొకసారి ఒక విద్యార్థితో ఇలా అన్నాడు: “నువ్వు బాగా చదువుతావు, నిజ క్రైస్తవ విద్వాంసులందరూ ఇలా తగువులాడుకునే మతధర్మశాస్త్ర పండితుల . . . బోధలను నిరాకరించే రోజు నువ్వు చూస్తావు.”

వెస్సల్‌ తన కాలంలో జరుగుతున్న కొన్ని తప్పులను, భ్రష్టత్వాన్ని గ్రహించినా ఆయన పూర్తి బైబిలు సత్యపు వెలుగును వెల్లడి చేయలేకపోయాడు. అయినా, ఆయన బైబిలును చదివి, అధ్యయనం చేయాల్సిన పుస్తకంగా చూశాడు. ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటీ అనే పుస్తకం ప్రకారం, వెస్సల్‌ “బైబిలు పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడింది కాబట్టి విశ్వాసానికి సంబంధించిన విషయాలన్నింటిలో దానిదే అంతిమ అధికారం అని భావించాడు.” ఆధునిక లోకంలో, నిజ క్రైస్తవులు బైబిలు దేవుని ప్రేరేపిత వాక్యమని నమ్ముతారు. (2 తిమోతి 3:​16) అయితే బైబిలు సత్యాలు ఇక ఏమాత్రం మసకగా లేవు లేక కనుగొనడానికి కష్టమైనవి కావు. పూర్వం కన్నా నేడు ఈ బైబిలు సూత్రం నిజమౌతోంది: “వెదకుడి మీకు దొరకును.”​—⁠మత్తయి 7:⁠7; సామెతలు 2:​1-6.

[అధస్సూచీలు]

^ పేరా 9 వారివురూ బైబిలు వ్రాయబడిన ఆదిమ భాషల అధ్యయనానికి ఎంతగానో తోడ్పడ్డారు. రోయ్‌క్లెన్‌ 1506లో హెబ్రీ వ్యాకరణ పుస్తకాన్ని ప్రచురించాడు, దానితో హెబ్రీ లేఖనాలను లోతుగా అధ్యయనం చేయడం సాధ్యమైంది. ఎరాస్మస్‌ అందుబాటులోవున్న క్రైస్తవ గ్రీకు లేఖనాల ప్రాచీన వ్రాతప్రతుల్లో నుండి ఎత్తివ్రాసిన గ్రీకు లేఖన సంకలనాన్ని 1516లో ప్రచురించాడు.

^ పేరా 21 వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ (1419-1489) అండ్‌ నార్థన్‌ హ్యూమానిజమ్‌, 9, 15 పేజీలు.

[14వ పేజీలోని బాక్సు/చిత్రం]

వెస్సల్‌ మరియు దేవుని పేరు

వెస్సల్‌ వ్రాసిన పుస్తకాల్లో దేవుని నామం సాధారణంగా “యెహోవా” అనే అనువదించబడింది. అయితే, వెస్సల్‌ “యెహోవా” నామాన్ని కనీసం రెండుసార్లైనా ఉపయోగించాడు. వెస్సల్‌ అభిప్రాయాల గురించి చర్చిస్తూ, హెచ్‌. ఎ. ఓబర్‌మాన్‌ అనే రచయిత ఒక ముగింపుకు వచ్చాడు. థామస్‌ అక్వినాస్‌కు, ఇతరులకు హెబ్రీ భాష తెలిసుంటే, “మోషేకు దేవుడు బయల్పర్చిన నామానికి అర్థం ‘నేను ఉన్నవాడను’ అని కాక ‘నేనెలా ఉండాలో అలా అవుతాను’ అని వారు తెలుసుకునేవారు” అని వెస్సల్‌ భావించాడని ఆ రచయిత వ్రాశాడు. * నూతనలోక అనువాదము దాని అర్థాన్ని “నేను ఎలా కావాలంటే అలా అవుతాను” అని సరిగా అనువదించింది.​—⁠నిర్గమకాండము 3:13, 14 NW.

[అధస్సూచి]

^ పేరా 30 వెస్సల్‌ కాన్స్‌ఫోర్ట్‌ (1419-1489) అండ్‌ నార్థన్‌ హ్యూమానిజమ్‌, 105వ పేజీ.

[చిత్రసౌజన్యం]

వ్రాతప్రతి: Universiteitsbibliotheek, Utrecht

[15వ పేజీలోని చిత్రాలు]

పోప్‌ సిక్స్‌టస్‌ IV ఆమోదించిన పాపపరిహార పత్రాల అమ్మకాన్ని వెస్సల్‌ ఖండించాడు