కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధనను ఎలా గుర్తించవచ్చు?

సత్యారాధనను ఎలా గుర్తించవచ్చు?

సత్యారాధనను ఎలా గుర్తించవచ్చు?

అనేక మతాలు, తాము బోధించేవి దేవుని నుండే వచ్చాయని చెప్పుకుంటాయి. కాబట్టి యేసు అపొస్తలుడైన యోహాను చెప్పిన ఈ మాటల్ని మనం లక్ష్యపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది: “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.” (1 యోహాను 4:⁠1) ఏదైనా ఒక బోధ దేవుని సంబంధమైనదో కాదో మనం ఎలా పరీక్షించవచ్చు?

దేవుని నుండి వచ్చే ప్రతీది ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రాముఖ్యంగా ఆయన ప్రధాన గుణమైన ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, వాసన చూడగలిగే సామర్థ్యాన్నే తీసుకోండి, మనం ఔషధ మొక్కల, పూల గుబాళింపును, లేదా అప్పుడే తయారుచేసిన బ్రెడ్డు కమ్మని వాసనను ఆస్వాదించడానికి సహాయం చేసే ఆ ఇంద్రియ శక్తి దేవునికి మనపట్ల ఉన్న ప్రేమకు వ్యక్తీకరణ. సూర్యాస్తమయాన్ని, సీతాకోకచిలుకను లేక పసిపాప నవ్వుని చూడగలిగే మన సామర్థ్యం దేవునికి మనపట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. శ్రావ్యమైన సంగీతాన్ని, పక్షుల కువకువలను లేక మనకు ఇష్టమైనవారి స్వరాన్ని వినగలిగే సామర్థ్యం కూడా దేవుని ప్రేమను చూపిస్తుంది. చివరకు, మన అపరిపూర్ణ మానవ ప్రవృత్తి కూడా దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది. అందుకే మనం తరచూ యేసు మాటల్లోని ఈ సత్యాన్ని చవిచూస్తుంటాం: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) మనం “దేవుని స్వరూపమందు” సృష్టించబడ్డాం కాబట్టి మనం ప్రేమను వ్యక్తం చేయడంలో ఆనందాన్ని పొందుతాం. (ఆదికాండము 1:​27) యెహోవాకు మరెన్నో లక్షణాలు ఉన్నా ఆయన వ్యక్తిత్వంలో ప్రేమే అత్యంత ఉన్నతమైనదిగా నిలుస్తుంది.

దేవుని నుండి వచ్చిన గ్రంథాలు ఆయన ప్రేమకు అద్దంపట్టేవిగా ఉండాలి. లోకంలోని మతాలకు ఎన్నో పురాతన గ్రంథాలున్నాయి. అలాంటి గ్రంథాలు దేవుని ప్రేమను ఎంతమేరకు ప్రతిబింబిస్తున్నాయి?

నిజానికి, అనేక పురాతన మతగ్రంథాలు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించవచ్చు అనే విషయాల గురించి చాలా తక్కువగా వివరిస్తున్నాయి. అందుకే, “దేవుని ప్రేమకు ప్రకృతిలో నిదర్శనాలు కనిపిస్తున్నా, లోకంలో బాధలు, దుష్టత్వం ఎందుకు ప్రబలంగా ఉన్నాయి” అని లక్షలాదిమంది అడిగినా వారికి జవాబు దొరకడం లేదు. అయితే, దేవుని ప్రేమను పూర్తిగా విశదీకరించే ఏకైక పురాతన మతగ్రంథం బైబిలే. అది, మనం ఎలా ప్రేమ చూపించాలో కూడా బోధిస్తుంది.

ప్రేమను గురించిన పుస్తకం

దేవుని వాక్యమైన బైబిలు, యెహోవా ‘ప్రేమకు కర్తయగు దేవుడు’ అని వెల్లడిస్తోంది. (2 కొరింథీయులు 13:​11) మొదటి మానవులకు అనారోగ్యం, మరణం లేని జీవితాన్ని ఇవ్వడానికి యెహోవాను ప్రేమ ఎలా పురికొల్పిందో బైబిలు వివరిస్తోంది. కానీ దేవుని అధికారానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు కారణంగా మానవజాతికి బాధలు మొదలయ్యాయి. (ద్వితీయోపదేశకాండము 32:​4, 5; రోమీయులు 5:​12) వారు కోల్పోయినదాన్ని తిరిగి ఇవ్వడానికి యెహోవా చర్యలు తీసుకున్నాడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” అని దేవుని వాక్యం చెబుతోంది. (యోహాను 3:​16) విధేయులైన మానవజాతికి తిరిగి శాంతిని ప్రసాదించేందుకు దేవుడు ఎలా యేసు ఆధిపత్యంలో ఒక పరిపూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడో వివరించినప్పుడు పరిశుద్ధ లేఖనాలు దేవుని ప్రేమను మరింతగా విశదీకరిస్తున్నాయి.​—⁠దానియేలు 7:​13, 14; 2 పేతురు 3:​13.

బైబిలు మానవుని బాధ్యతను ఈ క్రింది మాటల్లో సమీకరిస్తుంది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి.” (మత్తయి 22:​37-40) బైబిలు దేవునిచేత ప్రేరేపించబడిందని చెప్పుకుంటోంది. అది ఆయన వ్యక్తిత్వాన్ని అంత స్పష్టంగా ప్రతిబింబిస్తుంది కాబట్టి అది ‘ప్రేమకు కర్తయగు దేవుని’ నుండి వచ్చిందనే మనం నమ్మవచ్చు.​—⁠2 తిమోతి 3:​16.

ఆ ఒక్క ప్రమాణాన్ని అన్వయించడం ద్వారా ఏ ప్రాచీన గ్రంథాలు నిజంగా దేవుని నుండి వచ్చాయో మనం గుర్తించవచ్చు. ప్రేమ, సత్యారాధకులకు గుర్తింపుగా ఉంటుంది ఎందుకంటే వారు ప్రేమ చూపించడంలో దేవుణ్ణి అనుకరిస్తారు.

దేవుణ్ణి ప్రేమించే ప్రజలను ఎలా గుర్తించవచ్చు?

దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు అందరిలో ప్రత్యేకంగా నిలుస్తారు, బైబిలు “అంత్యదినములు” అని పిలిచే ఈ కాలంలో మనం జీవిస్తుండగా వారు మరింత ప్రత్యేకంగా ఉంటారు. అంతకంతకూ ప్రజలు “స్వార్థప్రియులు ధనాపేక్షులు . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించు” వారిగా తయారౌతున్నారు.​—⁠2 తిమోతి 3:​1-4.

దేవుణ్ణి ప్రేమించే ప్రజలను మీరెలా గుర్తుపట్టవచ్చు? “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 5:⁠3) ప్రజలకు దేవునిపట్ల ఉన్న ప్రేమ, వారు బైబిల్లోని నైతిక ప్రమాణాలను గౌరవించేలా పురికొల్పుతుంది. ఉదాహరణకు, దేవుని వాక్యంలో లైంగిక సంబంధాలకు, వివాహానికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. శారీరక సంబంధాలు కేవలం వివాహజతకే పరిమితం చేయబడ్డాయి, వివాహబంధం శాశ్వత బాంధవ్యం. (మత్తయి 19:⁠9; హెబ్రీయులు 13:⁠4) క్రైస్తవమత ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన ఒక స్త్రీ కూటానికి హాజరైనప్పుడు, అక్కడున్న యెహోవాసాక్షులు బైబిల్లోని నైతిక నియమాలను ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేస్తున్నారు. “అక్కడ విశదీకరించబడిన లేఖనాధారిత ప్రసంగాల్నిబట్టే కాక వారి మధ్య ఉన్న ఐక్యతను, వారి ఉన్నత నైతిక ప్రమాణాలను, మంచి ప్రవర్తనను చూసిన తర్వాత నాకెంతో ప్రోత్సాహకరంగా అనిపించింది” అని ఆమె అంటోంది.

నిజ క్రైస్తవులు దేవుణ్ణి ప్రేమించడమేకాక, తమ పొరుగువారిపట్ల చూపించే ప్రేమనుబట్టి కూడా సులభంగా గుర్తించబడతారు. వారికున్న అత్యంత ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, మానవులకున్న ఏకైక నిరీక్షణ అయిన దేవుని రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడడమే. (మత్తయి 24:​14) తమ పొరుగువారు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయం చేయడం వల్ల వారికి వచ్చే శాశ్వత ప్రయోజనాలు ఇంక దేనివల్లా రావు. (యోహాను 17:⁠3) నిజ క్రైస్తవులు తమ ప్రేమను ఇతర విధాలుగానూ ప్రదర్శిస్తారు. బాధల్లో ఉన్నవారికి వారు అవసరమైన సహాయం చేస్తారు. ఉదాహరణకు, ఇటలీలో భూకంపంవల్ల విపత్తు సంభవించినప్పుడు, యెహోవాసాక్షులు “మతంతో పట్టింపు లేకుండా బాధల్లో ఉన్నవారికి అవసరమైన విధాల్లో చేయూతనిచ్చారు” అని ఒక స్థానిక వార్తాపత్రిక నివేదించింది.

నిజ క్రైస్తవులు దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించడమేకాక, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” అని యేసు చెప్పాడు.​—⁠యోహాను 13:​34, 35.

నిజ క్రైస్తవుల మధ్య ఉండే ప్రేమ భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుందా? ఇళ్లలో పనిచేసే ఎమా అనే స్త్రీ అలాగే భావించింది. ఆమె బొలీవియాలోని లాపాజ్‌ నగరంలో పనిచేస్తుంది, అక్కడ జాతిసంబంధిత వివక్ష ధనికులకు, పేదవారికి మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. ఆమె ఇలా అంటోంది: “నేను యెహోవాసాక్షుల కూటానికి మొదటిసారి వెళ్లినప్పుడు, అక్కడ హుందాగా కనిపిస్తున్న ఒక వ్యక్తి మా దేశానికి చెందిన ఒక స్త్రీ దగ్గర కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నాడు. అలా జరగడం నేనిదివరకు ఎప్పుడూ చూడలేదు. వీరే దేవుని ప్రజలని నేను ఆ క్షణంలోనే నిర్ధారించుకున్నాను.” అదే విధంగా బ్రెజిల్‌కు చెందిన మిరియమ్‌ అనే యౌవనస్థురాలు ఇలా అంటోంది: “స్వతహాగా లేక కుటుంబంలో సంతోషంగా ఉండడం అంటే ఏమిటో నాకు తెలీదు. ప్రేమ కార్యరూపం దాల్చడాన్ని నేను మొదటిసారిగా యెహోవాసాక్షుల మధ్యనే గమనించాను.” అమెరికాలో, ఒక టీవీ ఛానెల్‌కు వార్తా నిర్దేశకునిగా పనిచేస్తున్న వ్యక్తి ఇలా వ్రాశాడు: “మీ మతంలోని ప్రజలు జీవించినట్లే వేరేవాళ్లు కూడా జీవిస్తే ఈ దేశం ఇప్పుడున్న దుర్దశలో ఉండేది కాదు. మీ సంస్థ, ప్రేమపై, సృష్టికర్తమీద దృఢమైన విశ్వాసంపై ఆధారపడివుందనే విషయం తెలిసిన విలేఖరిని నేను.”

సత్యారాధనా మార్గంలో నడవండి

ప్రేమ సత్యారాధనకు గుర్తింపు చిహ్నంలాంటిది. సత్యారాధనను కనుగొనడాన్ని యేసు సరైన మార్గాన్ని అన్వేషించి దానిలో నడవాలని కోరుకోవడంతో పోల్చాడు. కేవలం ఆ మార్గమే నిత్యజీవానికి నడిపిస్తుంది. “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే” అని యేసు చెప్పాడు. (మత్తయి 7:​13-14) నిజ క్రైస్తవుల గుంపు మాత్రమే ఐక్యంగా సత్యారాధనా మార్గంలో దేవునితో నడుస్తుంది. కాబట్టి, మీరు ఏ మతాన్ని ఎన్నుకుంటారనేది ప్రాముఖ్యమే. మీరు ఆ మార్గాన్ని కనుగొని దానిలో నడవాలని కోరుకుంటే, మీరు అత్యుత్తమ జీవనమార్గాన్ని ఎన్నుకున్నట్లే, ఎందుకంటే అది ప్రేమచేత నిర్దేశించబడే మార్గం.​—⁠ఎఫెసీయులు 4:​1-4.

సత్యారాధనా మార్గంలో నడుస్తుండగా మీకెంతటి ఆనందం కలుగుతుందో కాస్త ఊహించండి! అది దేవునితో నడవడంతో సమానం. ఇతరులతో మంచి సంబంధాలు కలిగివుండేలా మీరు దేవుని నుండి జ్ఞానాన్ని సంపాదించుకుని, ప్రేమించడం నేర్చుకోవచ్చు. ఆయన దగ్గరే మీరు జీవిత సంకల్పం గురించి తెలుసుకొని, దేవుని వాగ్దానాల గురించి అర్థం చేసుకుని భవిష్యత్తు కోసం ఒక నిరీక్షణను కలిగివుండవచ్చు. సత్యారాధనా మార్గంలో నడిచినందుకు మీరు ఎన్నడూ చింతించరు!

[5వ పేజీలోని చిత్రం]

ప్రాచీన మత గ్రంథాలన్నింటిలో బైబిలు మాత్రమే దేవుని ప్రేమను వెల్లడిస్తుంది

[7వ పేజీలోని చిత్రాలు]

నిజ క్రైస్తవులు ప్రేమను క్రియల్లో చూపిస్తారు కాబట్టి వారిని గుర్తించవచ్చు