కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆమె మమ్మల్ని తన ‘ఇంటికి రమ్మని బలవంతం చేసింది’

ఆమె మమ్మల్ని తన ‘ఇంటికి రమ్మని బలవంతం చేసింది’

ఆమె మమ్మల్ని తన ‘ఇంటికి రమ్మని బలవంతం చేసింది’

ప్రాచ్య దేశాల్లో ఆతిథ్యం ఇవ్వడమనేది సర్వసాధారణ వాడుక. ఉదాహరణకు, భారతదేశంలో అనుకోకుండా వచ్చిన అతిథికి భోజనం పెట్టడానికి కుటుంబమంతా పస్తు ఉండవచ్చు. ఇరాన్‌లో నివసించే ఒక తల్లి, అనుకోకుండా వచ్చేవారికి ఆతిథ్యమివ్వడానికి తన ఫ్రిజ్‌ నిండా ఆహార పదార్థాలు నిల్వ ఉంచుతుంది.

బైబిల్లో పేర్కొనబడిన అనేకమంది అలాంటి ఉదార స్వభావాన్ని కనబరిచారు. వారిలో ప్రత్యేకంగా నిలిచే ఉదాహరణ లూదియ అనే స్త్రీది, ఆమె మాసిదోనియ ముఖ్య పట్టణమైన ఫిలిప్పీలో జీవిస్తున్న యూదామత ప్రవిష్టురాలు అయ్యుండవచ్చు. అపొస్తలుడైన పౌలు ఆయన ప్రయాణ సహచరులు ఒక సబ్బాతు రోజున లూదియ, ఇంకొందరు స్త్రీలు ఫిలిప్పీ వెలుపలనున్న నది దగ్గర సమకూడి ఉండడాన్ని గమనించారు. ఆ సందర్భంలో పౌలు మాట్లాడుతుండగా యెహోవా ఆమె హృదయాన్ని తెరిచాడు. తత్ఫలితంగా, ఆమె తన కుటుంబ సభ్యులతోపాటు బాప్తిస్మం తీసుకుంది. ఆ తర్వాత ఆమె ఆ ప్రయాణీకుల్ని ఇలా వేడుకుంది: “నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడి.” పౌలు సహచరుడైన లూకా, ఆమె “మమ్మును బలవంతము చేసెను” అని చెప్పాడు.​—⁠అపొస్తలుల కార్యములు 16:​11-15.

లూదియలాగే క్రైస్తవులు నేడు కూడా తోటి విశ్వాసులకు అంటే ప్రయాణ పైవిచారణకర్తలకు, వారి భార్యలకు ఆతిథ్యమిస్తారు. ఆతిథేయులు వారిని తమ ఇంటికి రమ్మని ‘బలవంతం చేస్తారు.’ తత్ఫలితంగా, ఆతిథ్యమిచ్చినవారు ప్రోత్సాహకరమైన సంభాషణతో, ఆధ్యాత్మిక సహవాసంతో ఆశీర్వదించబడతారు. యెహోవాసాక్షుల్లో చాలామంది ఆర్థికంగా మంచి స్థితిలో లేకపోయినా, వారు “శ్రద్ధగా ఆతిథ్యము” ఇస్తుంటారు. (రోమీయులు 12:​13; హెబ్రీయులు 13:⁠2) ఇవ్వడం వారికి ఆనందాన్నిస్తుంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు సరిగానే చెప్పాడు.​—⁠అపొస్తలుల కార్యములు 20:​35.