క్రీస్తు రాకడ ఏమి సాధిస్తుంది?
క్రీస్తు రాకడ ఏమి సాధిస్తుంది?
“భ యం గుప్పిట్లో సావోపౌలో.” వ్యవస్థీకృత నేరంవల్ల బ్రెజిల్‌లోని అతి పెద్ద సంపన్న నగరం “పూర్తిగా నిస్సహాయ స్థితికి” చేరుకున్న సమయమైన 2006 మే నెలలోని నాలుగు దినాలను వేజా పత్రిక అలా వర్ణించింది. “ఇంచుమించు 100 గంటలకన్నా ఎక్కువసేపు జరిగిన హింసాకాండలో,” దాదాపు 150 మంది పోలీసు అధికారులు, నేరస్థులు, సాధారణ పౌరులు చంపబడ్డారు.
హింస గురించిన వార్తలు దాదాపు ప్రపంచ నలుమూలలా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడుతున్నాయి. మానవ నాయకులు దానిని ఆపలేకపోతున్నట్లు అనిపిస్తుంది. మన ప్రపంచం అంతకంతకూ మానవ మనుగడకు ప్రమాదకరమైన స్థలంగా మారుతోంది. ఎక్కడ చూసినా చెడు వార్తలే వినిపిస్తున్నాయి కాబట్టి, మీకు నిరుత్సాహం కలుగుతుండవచ్చు. అయితే మార్పు సంభవించే సమయం సమీపించింది.
దేవుని రాజ్యం వచ్చేందుకు, దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరేందుకు ప్రార్థించమని యేసు తన శిష్యులతో చెప్పాడు. (మత్తయి 6:9, 10) దేవుని నియమిత రాజుగా క్రీస్తుయేసు చేసే పరిపాలనే ఆ రాజ్యం. ఆ రాజ్యం మానవ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. అయితే, దేవుని రాజ్యం భూమ్మీద మార్పులు తీసుకురావాలంటే మానవ పరిపాలన స్థానంలో క్రీస్తు పరిపాలన రావాలి. క్రీస్తు రాకడ ఖచ్చితంగా దానినే సాధిస్తుంది.
మార్పు శాంతియుతంగా ఉంటుందా?
జనాంగాలు శాంతియుతంగా క్రీస్తు పరిపాలనకు లోబడతాయా? దానికి జవాబిచ్చే దర్శనాన్ని అపొస్తలుడైన యోహాను చూశాడు. ఆయనిలా వివరిస్తున్నాడు: “ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను [యేసు] ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును [ప్రపంచ రాజకీయ వ్యవస్థ] భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.” (ప్రకటన 19:19) ఆ యుద్ధంలో భూరాజులకు ఏమౌతుంది? యెహోవా నియమిత రాజు ‘ఇనుపదండముతో వారిని నలుగగొడతాడు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొడతాడు’ అని బైబిలు పేర్కొంటోంది. (కీర్తన 2:9) రాజకీయ వ్యవస్థ పూర్తిగా నాశనం చేయబడుతుంది. దేవుని రాజ్యం “[మానవ] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:44.
దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించేవారి విషయమేమిటి? “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై[నప్పుడు],” ‘దేవుని నెరుగనివారికిని, సువార్తకు లోబడని వారికి ప్రతిదండన’ చేసే వ్యక్తిగా 2 థెస్సలొనీకయులు 1:6) “భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు” అని సామెతలు 2:22 చెబుతోంది.
ఆయన వర్ణించబడ్డాడు. (క్రీస్తు రాకడ గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును.” (ప్రకటన 1:7) ప్రజలు తమ అక్షరార్థమైన కళ్లతో ఆయనను చూడరు. యేసు పరలోకానికి ఆరోహణమైనప్పటి నుండి, ఆయన ఆత్మప్రాణిగా “సమీపింపరాని తేజస్సులో . . . ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు.”—1 తిమోతి 6:16.
మోషే కాలంలో ఐగుప్తీయులమీద పది తెగుళ్లు తీసుకువచ్చినప్పుడు యెహోవా ఎలాగైతే ప్రజలకు కనిపించాల్సిన అవసరం రాలేదో, అలాగే యేసు భూ నివాసులు ‘చూసే’ విధంగా మానవరూపం దాల్చాల్సిన అవసరంలేదు. ఆ తెగుళ్లను యెహోవాయే కలిగిస్తున్నాడని ఆ కాలపు ప్రజలకు ఖచ్చితంగా తెలుసు, ఆయన శక్తిని వారు గుర్తించాల్సివచ్చింది. (నిర్గమకాండము 12:31) అదే విధంగా, దేవుని తీర్పును అమలుచేసే వ్యక్తిగా క్రీస్తు చర్య తీసుకున్నప్పుడు, తమకు తీర్పు తీర్చడానికి దేవుడే యేసును ఉపయోగిస్తున్నాడని దుష్టులు ‘చూడాల్సివస్తుంది,’ లేక గ్రహించాల్సివస్తుంది. మానవజాతి ముందుగానే హెచ్చరించబడుతోంది కాబట్టి వారు దానిని తెలుసుకుంటారు. అవును, “ప్రతి నేత్రము ఆయనను చూచును . . . భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు.”—ప్రకటన 1:7.
భూమ్మీద నిజమైన శాంతి, సుభిక్షత పునరుద్ధరించబడే ముందు దుష్టులు, దుష్ట పరిపాలన నిర్మూలించబడాలి. క్రీస్తు ఆ పనులను నెరవేరుస్తాడు. అప్పుడు ఆయన భూవ్యవహారాలన్నిటినీ తన అధీనంలోకి తీసుకుంటాడు, ఆ తర్వాత ప్రాముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి.
ప్రయోజనాలను చేకూర్చే పునరుద్ధరణ
అపొస్తలుడైన పేతురు ‘దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికిన అన్నిటి కుదురుబాటు’ లేదా పునరుద్ధరణ గురించి ప్రస్తావించాడు. (అపొస్తలుల కార్యములు 3:21) ఆ పునరుద్ధరణలో క్రీస్తు పరిపాలనలో భూమ్మీద జరిగే మార్పు ఇమిడివుంది. భూమ్మీద ‘అన్నిటి కుదురుబాటు’ గురించి చెప్పేందుకు దేవుడు ఉపయోగించిన ప్రవక్తల్లో సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దానికి చెందిన యెషయా ప్రవక్త కూడా ఉన్నాడు. “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసుక్రీస్తు భూమ్మీద శాంతిని పునరుద్ధరిస్తాడని ఆయన ప్రవచించాడు. క్రీస్తు పరిపాలన గురించి యెషయా ప్రవచనం ఇలా చెబుతోంది: “ఇది మొదలుకొని మితిలేకుండ దానికి [ఆ అధిపతి పాలనకు] వృద్ధియు క్షేమమును కలుగును.” (యెషయా 9:6, 7) యేసు భూ నివాసులకు శాంతియుతంగా ఎలా జీవించాలో తెలియజేసే విద్యాభ్యాసం అందిస్తాడు. అప్పుడు, భూ నివాసులు “బహు క్షేమము కలిగి సుఖించెదరు.”—కీర్తన 37:11.
క్రీస్తు పరిపాలనలో పేదరికానికి, ఆకలికి ఏమౌతుంది? యెషయా ఇలా అన్నాడు: “ఈ పర్వతముమీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును మడ్డిమీదనున్న ద్రాక్షారసముతో విందుచేయును మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.” (యెషయా 25:6) కీర్తనకర్త ఇలా పాడాడు: “దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును.” (కీర్తన 72:16) అంతేకాక, భూ నివాసుల గురించి మనమిలా చదువుతాం: “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.”—యెషయా 65:21, 22.
వ్యాధులు, మరణం అంతమౌతాయని కూడా యెషయా ప్రవచించాడు. దేవుడు యెషయా ద్వారా ఇలా చెప్పాడు: “గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును.” (యెషయా 35:5, 6) అప్పుడు “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) దేవుడు “మరెన్నడును ఉండకుండ మరణమును . . . మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.”—యెషయా 25:8.
“సమాధులలో నున్నవారందరి” విషయమేమిటి? (యోహాను 5:28, 29) యెషయా ఇలా ప్రవచించాడు: “మృతులైన నీవారు బ్రదుకుదురు . . . శవములు సజీవములగును.” (యెషయా 26:19) అవును, మృతులు సజీవులౌతారు!
‘నిరంతరం దేవుడే నీ సింహాసనం’
క్రీస్తు రాకడవల్ల భూగ్రహం పూర్తిగా పునరుద్ధరించబడుతుంది. భూమి అద్భుతమైన పరదైసుగా మారడమేకాక, మానవజాతి సత్య దేవుని ఆరాధనలో ఐక్యమౌతుంది. భూమ్మీద నుండి దుష్టత్వాన్ని తీసివేయడంలో, నీతియుక్త పరిస్థితులను నెలకొల్పడంలో యేసుక్రీస్తు విజయం సాధిస్తాడనే నమ్మకంతో మనం ఉండవచ్చా?
యేసుకు శక్తిని, అధికారాన్ని ఎవరు అనుగ్రహించారో పరిశీలించండి. కుమారుని గురించి బైబిలు ఇలా పేర్కొంటోంది: ‘నిరంతరం దేవుడే నీ సింహాసనం, నీ రాజదండము న్యాయమైనది. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు.’ (హెబ్రీయులు 1:7, 9, NW) యేసుకు సింహాసనాన్ని అంటే ఆయన పదవిని లేక అధికారాన్ని యెహోవాయే అనుగ్రహించాడు. దేవుడే ఆ సింహాసనానికి మూలకర్త, దాత. యేసు పరిష్కరించలేని కష్టమైన సమస్య అంటూ ఏదీ ఉండదు.
యేసు పునరుత్థానమైన తర్వాత తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” (మత్తయి 28:18) ‘ఆయన దూతలమీదను అధికారులమీదను అధికారము పొందాడు’ అని 1 పేతురు 3:22 పేర్కొంటోంది. యేసును వ్యతిరేకించడంలో ఏ శక్తి లేక అధికారం విజయం సాధించదు. ఆయన మానవజాతికి శాశ్వత ప్రయోజనం తీసుకురావడాన్ని ఏదీ ఆపలేదు.
క్రీస్తు రాకడ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
అపొస్తలుడైన పౌలు, థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలో ఇలా అన్నాడు: “విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచున్నాము.” (1 థెస్సలొనీకయులు 1:2) యేసుక్రీస్తు కోసం నిరీక్షించాలంటే ఎంతో ప్రయాసపడి, ఓర్పు కనబరచాల్సిన అవసరముందని పౌలు వివరించాడు. ఆ నిరీక్షణలో క్రీస్తు రాకడపట్ల, ఆ రాకడలో జరిగే పునరుద్ధరణపట్ల విశ్వాసముంచడం కూడా ఇమిడివుంది. అలాంటి నిరీక్షణ నిజక్రైస్తవులకు శక్తినివ్వగలదు లేక అతి కష్టమైన పరిస్థితులలో కూడా సహిస్తూ ఉండేందుకు దోహదపడగలదు.
బ్రెజిల్‌లోని సావోపౌలో నివాసియైన కార్లోస్ ఉదాహరణే తీసుకోండి. తనకు క్యాన్సర్ ఉందని ఆయన 2003 ఆగస్టులో తెలుసుకున్నాడు. అప్పటి నుండి ఆయనకు ఎనిమిది శస్త్రచికిత్సలు జరిగాయి, దానివల్ల ఆయన బాధాకరమైన, బలహీనపర్చే దుష్ప్రభావాలు ఎదుర్కొన్నాడు. అయినా, ఆయన ఇతరులను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఉదాహరణకు, ఒక పెద్ద ఆసుపత్రి ముందున్న వీధిలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన తోటి యెహోవాసాక్షియైన ఒక సహోదరిని కలిశాడు, ఆమె భర్త కీమోథెరపీ (రసాయన చికిత్స) చేయించుకుంటున్నాడు. కార్లోస్ స్వయంగా క్యాన్సర్ దుష్పరిణామాలను అనుభవించాడు కాబట్టి, ఆయన ఆ భార్యాభర్తలిద్దరినీ ప్రోత్సహించి, ఓదార్చగలిగాడు. ఆయనతో చేసిన సంభాషణ మమ్మల్ని ప్రోత్సహించింది అని వారు ఆ తర్వాత చెప్పారు. ఆ విధంగా ఆయన పౌలు చెప్పిన ఈ మాటల సత్యసంధతను చవిచూశాడు: “దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.”—2 కొరింథీయులు 1:4.
కార్లోస్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఇతరులను ప్రోత్సహిస్తూ ఉండేందుకు ఆయనకు బలం ఎక్కడ నుండి వచ్చింది? క్రీస్తు రాకడ గురించిన, అది నెరవేర్చే వాగ్దానాల గురించిన నిరీక్షణ “మేలుచేయుట యందు విసుకక” ఉండేందుకు ఆయనను ప్రోత్సహిస్తోంది.—గలతీయులు 6:9.
సామ్యావల్ విషయాన్ని కూడా తీసుకోండి, వాళ్లింటికి కేవలం 50 మీటర్ల దూరంలో ఆయన తమ్ముడు హత్యచేయబడ్డాడు. ఆయన శరీరంలోకి పది బులెట్లు వెళ్ళాయి. ఆయన శవాన్ని రోడ్డు ప్రక్కన ఎనిమిది గంటలపాటు అలాగే ఉంచి పోలీసులు నేర పరిశోధన చేశారు. ఆ రోజు జరిగిన సంఘటనలను సామ్యావల్ మరచిపోలేడు. అయితే క్రీస్తు భూమ్మీద ఉన్న దుష్టత్వమంతటినీ తీసివేస్తాడని, ఆ తర్వాత స్థాపించబడే నీతియుక్త పరిపాలన మానవజాతికి ఆశీర్వాదాలు తీసుకువస్తుందనే నిరీక్షణ ఆయనకు శక్తినిస్తోంది. పరదైసు భూమిలో పునరుత్థానం చేయబడిన తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుంటున్నట్లు సామ్యావల్ తరచూ ఊహిస్తాడు.—అపొస్తలుల కార్యములు 24:14.
మీరేమి చేయాలి?
క్రీస్తు రాకడ గురించిన, అది నెరవేర్చే వాగ్దానాల గురించిన నిరీక్షణ నుండి మీరు ఎంతో ఓదార్పును పొందుతారు. మానవ సమస్యలకు మూలకారణాలను, మనల్ని చుట్టుముట్టిన సమస్యలను యేసు తప్పక పరిష్కరిస్తాడు.
మానవజాతిమీద క్రీస్తు పరిపాలన తీసుకువచ్చే ఆశీర్వాదాలను ఆనందించడానికి మీరేమి చేయాలి? దేవుని వాక్యమైన బైబిలును జాగ్రత్తగా అధ్యయనం చేయడం ప్రారంభించండి. యేసు తన తండ్రికి చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) బైబిలు ఏమి బోధిస్తుందో పరిశోధన చేయడాన్ని మీ లక్ష్యంగా చేసుకోండి. ఈ విషయంలో మీకు సహాయం చేయడానికి మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు సంతోషిస్తారు. వారిని సంప్రదించమని లేక ఈ పత్రికా ప్రచురణకర్తలకు రాయమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
[7వ పేజీలోని చిత్రాలు]
క్రీస్తు రాకడతో భూమి పూర్తిగా పునరుద్ధరించబడుతుంది
[చిత్రసౌజన్యం]
అంతర చిత్రం, నేపథ్యం మాత్రమే: Rhino and Lion Park, Gauteng, South Africa