కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవదూతలు మానవజాతి కోసం ఏమిచేస్తారు?

దేవదూతలు మానవజాతి కోసం ఏమిచేస్తారు?

దేవదూతలు మానవజాతి కోసం ఏమిచేస్తారు?

“అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని . . . అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను​—⁠మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను.”​—⁠ప్రకటన 18:​1, 2.

ప త్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పుడు, వృద్ధ అపొస్తలుడైన యోహానుకు ప్రవచనార్థక దర్శనాలు ఇవ్వబడ్డాయి. ఆయన ‘ఆత్మవశుడై ప్రభువు దినంలోకి’ వచ్చినప్పుడు ఉత్కంఠభరిత సంఘటనలు చూశాడు. ఆ దినం యేసుక్రీస్తు 1914లో సింహాసనం అధిష్టించినప్పుడు ఆరంభమై, ఆయన వెయ్యేళ్ల పరిపాలన ముగిసేవరకు కొనసాగుతుంది.​—⁠ప్రకటన 1:​10.

2 యెహోవా దేవుడు ఈ దర్శనాన్ని యోహానుకు నేరుగా ఇవ్వలేదు. ఆయన ఒక మాధ్యమాన్ని ఉపయోగించాడు. ప్రకటన 1:1 ఇలా చెబుతోంది: “యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.” యెహోవా “ప్రభువు దినమందు” జరిగే అద్భుతమైన సంగతులను యోహానుకు తెలియజేసేందుకు యేసు ద్వారా ఒక దూతను ఉపయోగించాడు. ఒక సందర్భంలో యోహాను, “మహాధికారముగల వేరొక దూత పరలోకంనుండి దిగివచ్చుట” కూడా చూశాడు. ఆ దూత నియామకమేమిటి? “అతను గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను​—⁠మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను.” (ప్రకటన 18:​1, 2) శక్తివంతుడైన ఈ దేవదూతకు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను కూలిపోవడాన్ని ప్రకటించే ఆధిక్యత ఇవ్వబడింది. కాబట్టి యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చేందుకు ఒక ప్రాముఖ్యమైన రీతిలో దూతలను ఉపయోగిస్తాడనడంలో సందేహం లేదు. దేవుని సంకల్పంలో దూతల పాత్ర గురించి, వారు మానవజాతి కోసం ఏమిచేస్తారనేదాని గురించి వివరణాత్మకంగా పరీక్షించడానికి ముందు, ఈ ఆత్మప్రాణుల పుట్టుక గురించి పరిశీలిద్దాం.

దేవదూతలు ఎలా ఉనికిలోకి వచ్చారు?

3 దేవదూతలు ఉనికిలో ఉన్నారని నేడు లక్షలాదిమంది నమ్ముతున్నారు. అయితే చాలామందికి వారి గురించి, వారి ఆరంభం గురించి వాస్తవం తెలియదు. ఉదాహరణకు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరకెళ్తాడని, అక్కడ దేవదూతగా మారతాడని కొందరు మతస్థులు నమ్ముతారు. దేవదూతల సృష్టి గురించి, ఉనికి గురించి, వారి సంకల్పం గురించి దేవుని వాక్యం బోధించేది అదేనా?

4 అధికశక్తి, అధికారంగల ముఖ్యదూత​—⁠అగ్రదూత​—⁠ప్రధానదూతయైన మిఖాయేలు అని పిలవబడ్డాడు. (యూదా 9) ఆయనెవరో కాదు యేసుక్రీస్తే. (1 థెస్సలొనీకయులు 4:​16) యుగాల పూర్వం యెహోవా తాను సృష్టికర్త కావాలనుకున్నప్పుడు ఆయన మొట్టమొదట, దేవదూతయైన ఈ కుమారుణ్ణే సృష్టించాడు. (ప్రకటన 3:​14) ఆ తర్వాత, యెహోవా ఆదిసంభూతుడైన ఈ కుమారుని ద్వారానే మిగతా ఆత్మప్రాణులందరినీ సృష్టించాడు. (కొలొస్సయులు 1:​15-17) ఈ దేవదూతలను తన కుమారులుగా పేర్కొంటూ యెహోవా పితరుడైన యోబును ఇలా ప్రశ్నించాడు: “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?” (యోబు 38:​4, 7) కాబట్టి, దూతలు దేవుడు సృష్టించినవారే, అంతేకాక, వారు మానవులకన్నా ఎంతోకాలం ముందే ఉనికిలోకి వచ్చారు.

5 “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్తకాడు” అని 1 కొరింథీయులు 14:⁠33 చెబుతోంది. తదనుగుణంగా, యెహోవా తన ఆత్మకుమారులను మూడు ప్రధాన వర్గాలుగా వ్యవస్థీకరించాడు: (1) సెరాపులు, వీరు దేవుని సింహాసనం దగ్గర సహాయకులుగా సేవచేస్తూ, ఆయన పరిశుద్ధతను ప్రకటిస్తూ, ఆయన ప్రజలను ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉంచుతారు; (2) కెరూబులు, వీరు యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తుంటారు; (3) ఇతర దేవదూతలు ఆయన చిత్తం నెరవేరుస్తుంటారు. (కీర్తన 103:​20; యెషయా 6:​1-3; యెహెజ్కేలు 10:​3-5; దానియేలు 7:​10) గొప్ప సంఖ్యలోవున్న ఈ ఆత్మప్రాణులు మానవజాతి కోసం ఏమేమి చేస్తారు?​—⁠ప్రకటన 5:11.

దేవదూతలు ఏ పాత్ర పోషిస్తారు?

6 ఆత్మప్రాణులు మొదటిసారిగా ఆదికాండము 3:⁠24లో నేరుగా ప్రస్తావించబడ్డారు, అక్కడ మనమిలా చదువుతాం: “[యెహోవా] ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.” ఆదాము హవ్వలు తమ మొదటి ఉద్యానవన గృహంలోకి తిరిగి ప్రవేశించకుండా ఈ కెరూబులు అక్కడ ఉంచబడ్డారు. అది మానవ చరిత్రారంభంలో జరిగింది. అప్పటినుండి దేవదూతలు ఏ పాత్ర పోషించారు?

7 ఆదిమ భాషా బైబిల్లో దేవదూతలు దాదాపు 400 సార్లు ప్రస్తావించబడ్డారు. “దేవదూత”కు ఉపయోగించబడిన హీబ్రూ, గ్రీకు పదాలను “సందేశకుడు” అని అనువదించవచ్చు. ఆ విధంగా దేవునికి, మానవులకు మధ్య సందేశాలు అందించే మాధ్యమంగా దేవదూతలు పనిచేశారు. ఈ ఆర్టికల్‌లోని మొదటి రెండు పేరాల్లో పేర్కొనబడినట్లుగా యెహోవా, అపొస్తలుడైన యోహానుకు తన సందేశం అందించేందుకు ఒక దూతను ఉపయోగించాడు.

8 భూమ్మీది దేవుని సేవకులకు మద్దతిచ్చి వారిని ప్రోత్సహించేందుకు కూడా దేవదూతలు ఉపయోగించబడ్డారు. ఉదాహరణకు, పూర్వం ఇశ్రాయేలులో న్యాయాధిపతులున్న కాలంలో మానోహ, గొడ్రాలిగావున్న ఆయన భార్య తమకొక బిడ్డ కావాలని మనసారా కోరుకున్నారు. మానోహ భార్యకు కుమారుడు పుడతాడని చెప్పేందుకు యెహోవా ఒక దూతను ఆమె దగ్గరకు పంపించాడు. ఆ వృత్తాంతం మనకిలా చెబుతోంది: “ఇదిగో . . . నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టును.”​—⁠న్యాయాధిపతులు 13:​1-5.

9 మానోహ భార్య చివరకు సమ్సోను అనే కుమారుని కనగా, ఆయన బైబిలు చరిత్రలో ప్రసిద్ధిగాంచాడు. (న్యాయాధిపతులు 13:​24) ఆ పిల్లవాడు పుట్టకముందే, మానోహ ఆ పిల్లవాణ్ణి పెంచే విషయంలో తామేమిచేయాలో ఉపదేశించేందుకు ఆ దేవదూత తమ దగ్గరకు తిరిగిరావాలని వేడుకున్నాడు. మానోహ, “ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని” అడిగాడు. అప్పుడు యెహోవా దూత మానోహ భార్యకు ఇచ్చిన ఉపదేశాల్నే తిరిగిచెప్పాడు. (న్యాయాధిపతులు 13:​6-14) మానోహ ఎంతగా ప్రోత్సహించబడి ఉంటాడో కదా! దేవదూతలు ఆనాటిలా నేడు ఆయావ్యక్తులను సందర్శించరు, కానీ తల్లిదండ్రులు మానోహలాగే పిల్లలకు శిక్షణనిచ్చేటప్పుడు యెహోవా నిర్దేశాన్ని వెదకాలి.​—⁠ఎఫెసీయులు 6:⁠4.

10 దేవదూతలిచ్చే మద్దతుకు సంబంధించి ప్రవక్తయైన ఎలీషా కాలంలో ఉత్తేజకరమైన ఉదాహరణ ఉంది. ఎలీషా ఇశ్రాయేలు పట్టణమైన దోతానులో నివసిస్తున్నాడు. ఎలీషా పనివాడు ఒకరోజు ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళి చూసినప్పుడు, ఆ పట్టణం గుర్రాలతో, యుద్ధరథాలతో చుట్టుముట్టి ఉండడం గమనించాడు. సిరియా రాజు ఎలీషాను పట్టుకునేందుకు సైనిక బలగాల్ని పంపించాడు. ఎలీషా పనివాడు ఎలా స్పందించాడు? భయంతో, బహుశా బిత్తరపోయి ఇలా అరిచాడు: “అయ్యో నా యేలినవాడా, మనము ఏమి చేయుదము?” ఆయనకు పరిస్థితి దిక్కుతోచనిదిగా ఉంది. అయితే ఎలీషా ఇలా జవాబిచ్చాడు: “భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు.” ఆయన భావమేమిటి?​—⁠2 రాజులు 6:​11-16.

11 తనకు మద్దతిచ్చేందుకు దేవదూతల సమూహం అక్కడుందని ఎలీషాకు తెలుసు. కానీ, ఆయన పనివానికి అది కనిపించలేదు. కాబట్టి “యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.” (2 రాజులు 6:​16, 17) అప్పుడు ఆ పనివాడు దేవదూతల సమూహమును చూడగలిగాడు. ఆధ్యాత్మిక అంతర్దృష్టితో మనం కూడా, దూతలందరూ యెహోవా, యేసుక్రీస్తుల నిర్దేశంలో యెహోవా ప్రజలకు మద్దతిస్తూ, వారిని కాపాడుతూ ఉండడాన్ని గ్రహించవచ్చు.

క్రీస్తు కాలంలో దేవదూతల మద్దతు

12 యూదా కన్యయైన మరియ ఈ వార్త విన్నప్పుడు పొందిన మద్దతును పరిశీలించండి: “నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.” ఆశ్చర్యకరమైన ఈ సందేశాన్ని అందజేయడానికి కాస్తముందు, దేవుని దగ్గరనుండి పంపించబడిన గబ్రియేలు దూత ఆమెతో ఇలా అన్నాడు: “మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.” (లూకా 1:​26, 27, 30, 31) దేవుని అనుగ్రహం తనకుందనే ఈ మాటలనుబట్టి మరియ ఎంతగా ప్రోత్సహించబడి, బలపర్చబడి ఉంటుందో కదా!

13 అరణ్యంలో సాతాను యేసును మూడుసార్లు శోధించినప్పుడు ఆయన వాటిని తిరస్కరించిన తర్వాత దేవదూతలు మద్దతిచ్చిన మరో సందర్భాన్ని మనం చూస్తాం. ఆ శోధనలు ముగిసిన తర్వాత, “అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి” అని ఆ వృత్తాంతం చెబుతోంది. (మత్తయి 4:​1-11) యేసు మరణించడానికి ముందురాత్రి కూడా అలాగే జరిగింది. అత్యంత వేదనతో యేసు మోకాళ్లూని, “తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.” (లూకా 22:​42, 43) కానీ మనకు నేడు దేవదూతలు ఏ విధంగా మద్దతిస్తున్నారు?

ఆధునిక కాలాల్లో దేవదూతల మద్దతు

14 యెహోవాసాక్షుల ప్రకటనాపనికి సంబంధించిన ఆధునిక చరిత్రను పరిశీలించినప్పుడు, దేవదూతల మద్దతును మనం స్పష్టంగా చూడడం లేదా? ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధానికి (1939-45) ముందు, యుద్ధం జరుగుతున్న సమయంలో నాజీ జర్మనీలో, పశ్చిమ ఐరోపాలో తమపై జరిగిన భీకరమైన దాడిని యెహోవా ప్రజలు తట్టుకోగలిగారు. ఇటలీ, స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల్లోని క్యాథలిక్‌ ఫాసిస్ట్‌ పరిపాలనల్లో వారు ఇంకా ఎక్కువకాలం హింసను ఎదుర్కొన్నారు. మాజీ సోవియట్‌ యూనియన్‌లో దాని అధికారం క్రిందున్న దేశాల్లో వారు దశాబ్దాలపాటు హింసను భరించారు. కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా సాక్షులు హింసను సహించారు. * ఇటీవలి సంవత్సరాల్లో జార్జియా దేశంలో యెహోవా సేవకులు అత్యంత క్రూరమైన హింసను అనుభవించారు. యెహోవాసాక్షుల కార్యకలాపాలను అంతమొందించేందుకు సాతాను తన శాయశక్తులా ప్రయత్నించాడు. అయినప్పటికీ, ఒక సంస్థగా వారు ఆ వ్యతిరేకతను, తట్టుకుని నిలబడి వర్ధిల్లారు. ఇది కొంతమేర దేవదూతల కాపుదలవల్లే సాధ్యమైంది.​—⁠కీర్తన 34:⁠7; దానియేలు 3:​28; 6:​22.

15 దేవుని రాజ్యసువార్తను భూవ్యాప్తంగా ప్రకటిస్తూ, అన్ని ప్రాంతాల్లోని ఆసక్తిపరులకు బైబిలు సత్యాన్ని బోధిస్తూ శిష్యులను చేయమని తమకివ్వబడిన ఆజ్ఞను యెహోవాసాక్షులు గంభీరంగా తీసుకుంటారు. (మత్తయి 28:​19, 20) కానీ దేవదూతల మద్దతు లేకుండా తామీ ఆజ్ఞను నెరవేర్చలేమని వారికి బాగా తెలుసు. అందువల్ల, ప్రకటన 14:​6, 7లో చెప్పబడిన మాటలు వారికి నిరంతర ప్రోత్సాహానికి మూలాధారంగా ఉన్నాయి. అక్కడ మనం అపొస్తలుడైన యోహాను ఇలా అన్నట్లు చదువుతాం: “మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. అతడు​—⁠మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసినవానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను.”

16 ఈ మాటలు యెహోవాసాక్షుల అసాధారణ ప్రపంచవ్యాప్త సువార్త పనికి దేవదూతల మద్దతు, నిర్దేశం ఉన్నాయని స్పష్టంగా చూపిస్తున్నాయి. యథార్థ ప్రజలను తన సాక్షుల దగ్గరకు నడిపించేందుకు యెహోవా తన దూతలను ఉపయోగిస్తున్నాడు. ఆ దేవదూతలు సాక్షులను సరైన మనోవైఖరిగల వారిదగ్గరకు కూడా నడిపించారు. ఇది ఏదో కాకతాళీయంగా కాదుగానీ అనేక సందర్భాల్లో, సరిగ్గా ఒక వ్యక్తి క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ, ఆధ్యాత్మిక సహాయం అవసరమైన సమయంలోనే యెహోవాసాక్షుల్లో ఒకరు అతణ్ణి లేదా ఆమెను ఎందుకు కలిశారో వివరిస్తోంది.

సమీప భవిష్యత్తులో దేవదూతలు అసాధారణ పాత్ర పోషిస్తారు

17 యెహోవా ఆరాధకులకు సందేశకులుగా, ఆదరణనిచ్చేవారిగా సేవచేయడానికి తోడుగా దేవదూతలు మరోపని కూడా చేస్తారు. పూర్వకాలాల్లో, వారు దైవిక తీర్పులను అమలుచేశారు. ఉదాహరణకు, సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దంలో విస్తారమైన అష్షూరు సైన్యం యెరూషలేమును ముట్టడించింది. యెహోవా ఎలా స్పందించాడు? ఆయనిలా అన్నాడు: “నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.” ఆ తర్వాత ఏమి జరిగిందో బైబిలు వృత్తాంతం మనకిలా చెబుతోంది: “ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులులేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి.” (2 రాజులు 19:​34, 35) ఒకే ఒక దేవదూత బలంతో పోలిస్తే మానవ సైన్యాలు ఎంత అల్పమైనవో కదా!

18 సమీప భవిష్యత్తులో దేవుని తీర్పులు అమలుచేసే సైన్యంగా దేవదూతలు పనిచేస్తారు. త్వరలోనే యేసు ‘దూతలతోకూడ అగ్నిజ్వాలలలో’ వస్తాడు. “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన” చేయడమే వారి పని. (2 థెస్సలొనీకయులు 1:⁠6) ఈ చర్య మానవాళిని ఎలా ప్రభావితం చేస్తుందో కదా! ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రకటించబడుతున్న దేవుని రాజ్యసువార్తకు స్పందించనివారు నాశనమౌతారు. యెహోవాను వెదకి, వినయంతో నీతిని వెదికేవారు మాత్రమే ‘యెహోవా ఉగ్రత దినమున దాచబడతారు,’ వారికి ఏ హానీ కలుగదు.​—⁠జెఫన్యా 2:⁠3.

19 యెహోవా భూమ్మీదున్న తన ఆరాధకులకు మద్దతిచ్చి, వారిని బలపర్చేందుకు తన బలమైన దూతలను ఉపయోగిస్తున్నందుకు మనం కృతజ్ఞులమై ఉండవచ్చు. యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి సాతాను కాడి క్రిందికి చేరిన దూతలు ఉన్నారు కాబట్టి, దేవుని సంకల్పంలో దేవదూతల పాత్రను గురించిన మన అవగాహన ప్రత్యేకంగా ఓదార్పుకరం. సాతాను, అతని దయ్యాల బలమైన ప్రభావానికి గురికాకుండా తమను కాపాడుకునేందుకు నిజ క్రైస్తవులు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

[అధస్సూచి]

^ పేరా 20 ఈ హింసా తరంగాల వివరణాత్మక వృత్తాంతాల కోసం, యెహోవాసాక్షుల వార్షిక పుస్తకము (ఆంగ్లం) 1983 (అంగోలా), 1972 (చెకొస్లొవాకియా), 2000 (జెక్‌ రిపబ్లిక్‌), 1992 (ఇతియోపియా), 1974, 1999 (జర్మనీ), 1982 (ఇటలీ), 1999 (మలావీ), 2004 (మాల్డోవా), 1996 (మొజాంబిక్‌), 1994 (పోలండ్‌), 1983 (పోర్చుగల్‌), 1978 (స్పెయిన్‌), 2002 (యుక్రెయిన్‌), 2006 (జాంబియా) చూడండి.

మీరేమి తెలుసుకున్నారు?

• దేవదూతలు ఎలా ఉనికిలోకి వచ్చారు?

• బైబిలు కాలాల్లో దేవదూతలు ఎలా ఉపయోగించబడ్డారు?

• నేడు దేవదూతల కార్యకలాపాల గురించి ప్రకటన 14:​6, 7 ఏమి వెల్లడిస్తోంది?

• సమీప భవిష్యత్తులో దేవదూతలు ఏ అసాధారణ పాత్ర పోషిస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. తన చిత్తాన్ని నెరవేర్చేందుకు యెహోవా దూతలను ఉపయోగిస్తాడని ఏది చూపిస్తోంది?

3. దేవదూతల గురించి చాలామందికి ఏ తప్పుడు అభిప్రాయం ఉంది?

4. దేవదూతల ఆరంభం గురించి లేఖనాలు మనకేమి చెబుతున్నాయి?

5. దేవదూతలు ఎలా వ్యవస్థీకరించబడ్డారు?

6. ఏదెను వనానికి సంబంధించి యెహోవా కెరూబులను ఎలా ఉపయోగించాడు?

7. “దేవదూత”కు ఉపయోగించబడిన ఆదిమ భాషాపదాల అర్థం దేవదూతలు పోషించే ఒక పాత్రగురించి ఏమి చూపిస్తోంది?

8, 9. (ఎ) దేవదూత సందర్శించడం మానోహను, ఆయన భార్యను ఎలా ప్రభావితం చేసింది? (బి) దేవదూత మానోహను సందర్శించడం నుండి తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవచ్చు?

10, 11. (ఎ) దండెత్తివచ్చిన సిరియా సైన్యాన్నిబట్టి ఎలీషా, ఆయన పనివాడు ఎలా స్పందించారు? (బి) ఈ సంఘటనను పరిశీలించడం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

12. గబ్రియేలు దూతనుండి మరియకు ఎలాంటి మద్దతు లభించింది?

13. దేవదూతలు యేసుకు ఎలాంటి మద్దతిచ్చారు?

14. ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షులు ఎలాంటి హింసను ఎదుర్కోవలసి వచ్చింది, దాని ఫలితమేమిటి?

15, 16. యెహోవాసాక్షులు తమ ప్రపంచవ్యాప్త పరిచర్యలో దేవదూతల నుండి ఎలాంటి మద్దతు పొందుతున్నారు?

17. ఒకే ఒక దేవదూత దాడిచేసినప్పుడు అష్షూరీయులకు ఏమి సంభవించింది?

18, 19. సమీప భవిష్యత్తులో దేవదూతలు ఏ అసాధారణ పాత్ర పోషిస్తారు, అది మానవాళిని ఎలా ప్రభావితం చేస్తుంది?

[22వ పేజీలోని చిత్రం]

మానోహ, ఆయన భార్య దేవదూతచేత ప్రోత్సహించబడ్డారు

[23వ పేజీలోని చిత్రం]

“మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారు”