కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు

యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యిర్మీయా గ్రంథములోని ముఖ్యాంశాలు

యిర్మీయా తన సొంత ప్రజలను ఉద్దేశించి ప్రకటించిన విపత్తులు ఎంత దిగ్భ్రాంతిని కలిగించేవిగా ఉండి ఉంటాయో కదా! మూడు శతాబ్దాలకంటే ఎక్కువ కాలంపాటు ఆరాధనా కేంద్రంగా ఉన్న మహిమాన్విత ఆలయం పూర్తిగా దహించివేయబడుతుంది. యెరూషలేము నగరం, యూదా దేశం నిర్జనంగా విడువబడతాయి, వాటి నివాసులు చెరపట్టబడతారు. ఈ విషయాలు, ఇతర తీర్పు ప్రకటనలు బైబిల్లోని అతిపెద్ద పుస్తకాల్లో రెండవదైన యిర్మీయా గ్రంథంలో కనిపిస్తాయి. యిర్మీయా 67 సంవత్సరాలపాటు ప్రవక్తగా తన పరిచర్యను నమ్మకంగా నెరవేరుస్తూ వ్యక్తిగతంగా ఏమి అనుభవించాడో కూడా అది తెలియజేస్తుంది. ఈ గ్రంథంలోని సమాచారం కాలానుక్రమంగా అందజేయబడలేదు గానీ విషయానుసారంగా అందజేయబడింది.

బైబిలు పుస్తకమైన యిర్మీయా గ్రంథంపట్ల మనమెందుకు ఆసక్తి కలిగివుండాలి? దానిలో పేర్కొనబడిన నెరవేరిన ప్రవచనాలు, వాగ్దానాలను నెరవేర్చేవానిగా యెహోవాపై మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. (యెషయా 55:​10, 11) ప్రవక్తగా యిర్మీయా పని, ఆయన సందేశంపట్ల ప్రజల దృక్పథం మన కాలంలో సమాంతరాలను కలిగివున్నాయి. (1 కొరింథీయులు 10:​11) అంతేగాక, యెహోవా తన ప్రజలతో ఎలా వ్యవహరించాడనే దాని గురించిన వృత్తాంతం ఆయన లక్షణాలను ఉన్నతపరుస్తుంది, అది మనపై గొప్ప ప్రభావం చూపించాలి.​—⁠హెబ్రీయులు 4:​12.

“నా జనులు రెండు నేరములు చేసియున్నారు”

(యిర్మీయా 1:1-20:​18)

యూదా రాజైన యోషీయా పరిపాలనలోని 13వ సంవత్సరంలో, అంటే సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడడానికి 40 సంవత్సరాల ముందు యిర్మీయా ప్రవక్తగా నియమించబడ్డాడు. (యిర్మీయా 1:​1, 2) యోషీయా పరిపాలనలోని మిగిలిన 18 సంవత్సరాల్లో చేయబడిన ప్రకటనలు యూదా చెడుతనాన్ని బహిర్గతం చేసి, దానికి వ్యతిరేకంగా చేయబడిన యెహోవా తీర్పులను ప్రకటిస్తుంది. “యెరూషలేమును పాడు దిబ్బలుగా . . . చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. (యిర్మీయా 9:​11) ఎందుకు? ఎందుకంటే, “నా జనులు రెండు నేరములు చేసియున్నారు” అని ఆయన చెబుతున్నాడు.​—⁠యిర్మీయా 2:​13.

పశ్చాత్తాపం చూపిన కొంతమంది పునఃస్థాపించబడడం గురించిన సందేశం కూడా దానిలో ఉంది. (యిర్మీయా 3:​14-18; 12:​14, 15; 16:​14-21) అయితే, ఆ సందేశాన్ని తీసుకువచ్చిన యిర్మీయా మాత్రం సరిగా ఆహ్వానించబడలేదు. “యెహోవా మందిరములో పెద్ద నాయకుడు” యిర్మీయాను కొట్టి, ఆ రాత్రే బొండలో వేయించాడు.​—⁠యిర్మీయా 20:​1-3.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:11, 12​—⁠యెహోవా తాను చెప్పిన వాక్యము విషయమై ఆతురపడడం [‘మెలకువగా ఉండడం,’ NW], “బాదము చెట్టు చువ్వ”తో ఎందుకు సంబంధం కలిగివుంది? బాదము చెట్టు వసంత ఋతువులో మిగతా చెట్లకన్నా ముందుగా పూత వేస్తుంది. యెహోవా తన తీర్పుల గురించి తన ప్రజలను హెచ్చరించడానికి, సూచనార్థకంగా ‘పెందలకడ లేచి తన ప్రవక్తలను పంపుతూ,’ అవి అమలుచేయబడే వరకు ‘మెలకువగా ఉన్నాడు.’​—⁠యిర్మీయా 7:​25.

2:​10, 11​—⁠నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయుల చర్యలను అంత అసాధారణమైనవిగా చేసినదేమిటి? కిత్తీముకు పశ్చిమాన, కేదారుకు తూర్పునవున్న అన్య రాజ్యాలు తమ దగ్గరున్న దేవతలకు తోడు ఇంకా ఇతర రాజ్యాల దేవతలను కూడా తెచ్చుకునేవి, కానీ తమ దేవతలను తొలగించి వాటి స్థానంలో పరాయి రాజ్యాల దేవతలను ప్రతిష్ఠించుకోవడం మాత్రం ముందెప్పుడూ జరగలేదు. అయితే, ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి, సజీవుడైన దేవుణ్ణి మహిమపర్చే బదులు నిర్జీవమైన విగ్రహాలను మహిమపరుస్తున్నారు.

3:11-22; 11:10-12, 17​—⁠షోమ్రోను సా.శ.పూ. 740లోనే కూలిపోయినప్పటికీ యిర్మీయా పది గోత్రాల ఉత్తర రాజ్యాన్ని తన ప్రకటనల్లో ఎందుకు చేర్చాడు? ఎందుకంటే సా.శ.పూ. 607లో యెరూషలేము నాశనం చేయబడడం, యూదాపై మాత్రమే కాదుగానీ, ఇశ్రాయేలు రాజ్యమంతటిపై యెహోవా తీర్చిన తీర్పును సూచిస్తుంది. (యెహెజ్కేలు 9:​9, 10) అంతేగాక, దేవుని ప్రవక్తల సందేశాలు ఇశ్రాయేలీయులను కూడా ఉద్దేశించి ఇవ్వబడ్డాయి కాబట్టి, పది గోత్రాల రాజ్యం కూలిపోయిన తర్వాత కూడా యెరూషలేము దానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది.

4:​3, 4​—⁠ఈ ఆజ్ఞ భావమేమిటి? నమ్మకద్రోహులైన యూదులు తమ హృదయమనే నేలను సిద్ధం చేసుకుని, మెత్తబరచుకుని, శుభ్రపరచుకోవాలి. వాళ్ళు తమ హృదయాలకు “సున్నతి” చేయించుకోవాలి అంటే అపరిశుభ్రమైన తలంపులను, భావాలను, ఉద్దేశాలను తొలగించుకోవాలి. (యిర్మీయా 9:​25, 26; అపొస్తలుల కార్యములు 7:​51) దీని కోసం వారు తమ జీవన విధానాన్ని మార్చుకోవాలి, చెడు చేయడం మానేసి దేవుని ఆశీర్వాదం తీసుకొచ్చే వాటిని చేయాలి.

4:​10; 15:18​—⁠యెహోవా తిరుగుబాటుదారులైన తన ప్రజలను ఏ భావంలో మోసగించాడు? యిర్మీయా కాలంలో ‘అబద్ధప్రవచనములు పలికే’ ప్రవక్తలున్నారు. (యిర్మీయా 5:​31; 20:⁠6; 23:16, 17, 25-28, 32) తప్పుదారి పట్టించే సందేశాలు ప్రకటించకుండా యెహోవా వారిని నివారించలేదు.

16:16​—⁠యెహోవా ‘చాలామంది జాలరులను, అనేకులైన వేటగాండ్రను పిలిపించడం’ దేన్ని సూచిస్తుంది? ఇది యెహోవా ఎవరి మీదైతే తన తీర్పులు అమలుచేస్తాడో ఆ నమ్మకద్రోహులైన యూదులను వెదికేందుకు శత్రు సైన్యాలను పంపించడాన్ని సూచిస్తుండవచ్చు. అయితే, యిర్మీయా 16:⁠14 చెబుతున్నదాని ప్రకారం, ఆ వచనం పశ్చాత్తాపపడుతున్న ఇశ్రాయేలీయుల కోసం వెదకడాన్ని కూడా సూచిస్తుండవచ్చు.

20:​7​—⁠యెహోవా ఏ విధంగా యిర్మీయాపై తన [‘బలాన్ని ఉపయోగించి ఆయనను భ్రమలోపడేలా చేశాడు,’ NW]? యిర్మీయా యెహోవా తీర్పులను ప్రకటిస్తున్నప్పుడు ఉదాసీనతను, తిరస్కారాన్ని, హింసను ఎదుర్కోవలసి వచ్చినందుకు ఇక కొనసాగడానికి తనకు శక్తిలేదని ఆయన భావించి ఉండవచ్చు. అయితే, యెహోవా అలాంటి భావాలకు వ్యతిరేకంగా తన బలాన్ని ఉపయోగించి, కొనసాగే శక్తిని యిర్మీయాకిచ్చాడు. అలా, ప్రవక్త స్వయంగా తాను చేయలేనని భావించినదాన్ని సాధించడానికి ఆయనను ఉపయోగించుకోవడం ద్వారా యెహోవా ఆయన భ్రమలోపడేలా చేశాడు.

మనకు పాఠాలు:

1:⁠8. పక్షపాతం లేని న్యాయాధిపతులను పంపించడం ద్వారా, శత్రుభావంగల అధికారుల స్థానంలో సహేతుకతగల అధికారులు నియమించబడేలా చేయడం ద్వారా, లేక తన ఆరాధకులకు సహించేందుకు కావలసిన బలాన్నివ్వడం ద్వారా యెహోవా కొన్నిసార్లు తన ప్రజలను హింస నుండి కాపాడతాడు.​—⁠1 కొరింథీయులు 10:​13.

2:​13, 18. నమ్మకద్రోహులైన ఇశ్రాయేలీయులు రెండు చెడ్డ పనులు చేశారు. వాళ్ళు ఆశీర్వాదానికి, నిర్దేశానికి, కాపుదలకు ఖచ్చితమైన మూలమైన యెహోవాను విడిచిపెట్టారు. ఐగుప్తు, అష్షూరుతో సైనిక సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వారు తమ కోసం తాము సూచనార్థకమైన తొట్లను తొలిపించుకున్నారు. మన కాలంలో, మానవ తత్త్వాలు, సిద్ధాంతాలు, లౌకిక రాజకీయాల కోసం సత్యదేవుణ్ణి విడిచిపెట్టడమంటే ‘బద్దలైన తొట్ల’ కోసం “జీవజలముల ఊటను” వదులుకోవడమే అవుతుంది.

6:​16. యెహోవా తిరుగుబాటుదారులైన తన ప్రజలను ఆగి, తమను తాము పరీక్షించుకుని, నమ్మకమైన తమ పితరులు నడిచిన “మార్గములకు” తిరిగిరమ్మని ప్రోత్సహిస్తున్నాడు. మనం యెహోవా కోరుతున్న మార్గంలోనే నిజంగా నడుస్తున్నామా అని చూసుకునేందుకు మనల్ని మనం అప్పుడప్పుడూ పరిశీలించుకోవద్దా?

7:​1-15. యూదులు ఆలయంపై నమ్మకం ఉంచి, దాన్ని ఒక విధమైన తాయెత్తులా దృష్టించడం వారిని కాపాడలేకపోయింది. మనం చూపువలన కాక విశ్వాసము వలన నడుచుకోవాలి.​—⁠2 కొరింథీయులు 5:⁠6.

15:​16, 17. యిర్మీయాలాగే మనం నిరుత్సాహాన్ని ఎదిరించవచ్చు. మనం అర్థవంతమైన వ్యక్తిగత బైబిలు అధ్యయనాన్ని ఆనందించడం ద్వారా, పరిచర్యలో యెహోవా నామాన్ని ఉన్నతపర్చడం ద్వారా, చెడు సహవాసాలకు దూరంగా ఉండడం ద్వారా మనమలా చేయవచ్చు.

17:​1, 2. యూదా ప్రజల పాపాలు వారి బలులు యెహోవాకు అప్రీతికరమైనవయ్యేలా చేశాయి. నైతిక అపరిశుభ్రత మన స్తుతియాగములు అనంగీకారమైనవయ్యేలా చేస్తుంది.

17:​5-8. మానవులు, ఆయా సంస్థలు దేవుని చిత్తానికి, దైవిక సూత్రాలకు అనుగుణంగా ప్రవర్తించినంతవరకే అవి మన నమ్మకానికి అర్హమైనవి. రక్షణ, నిజమైన సమాధానం, భద్రత వంటి విషయాల్లో మనం యెహోవాపై మాత్రమే నమ్మకం ఉంచడం జ్ఞానయుక్తమైనది.​—⁠కీర్తన 146:⁠3.

20:​8-11. ఉదాసీనత, వ్యతిరేకత లేక హింస రాజ్య ప్రకటనా పనిపట్ల మనకున్న ఆసక్తిని తగ్గించడానికి మనం అనుమతించకూడదు.​—⁠యాకోబు 5:​10, 11.

‘బబులోనురాజు కాడిని మీ మెడ మీద పెట్టుకొనుడి’

(యిర్మీయా 21:1-51:​64)

యిర్మీయా యూదాకు చెందిన చివరి నలుగురు రాజులకు, అలాగే అబద్ధ ప్రవక్తలకు, చెడ్డ కాపరులకు, భ్రష్ట యాజకులకు వ్యతిరేకంగా తీర్పులు ప్రకటిస్తాడు. నమ్మకమైన శేషమును మంచి అంజూరపు పండ్లుగా పేర్కొంటూ, యెహోవా ఇలా చెబుతున్నాడు: ‘వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుదును.’ (యిర్మీయా 24:​5, 6) 25వ అధ్యాయంలోని మూడు ప్రవచనాలు, తర్వాతి అధ్యాయాల్లో వివరణాత్మకంగా వర్ణించబడిన తీర్పులను సంక్షిప్తంగా తెలియజేస్తాయి.

యాజకులు, ప్రవక్తలు యిర్మీయాను చంపడానికి పన్నాగం పన్నుతారు. వారు బబులోను రాజుకు సేవ చేయాలనేది ఆయన సందేశం. సిద్కియా రాజుతో యిర్మీయా ఇలా చెప్పాడు: ‘బబులోనురాజుయొక్క కాడిని మీ మెడ మీద పెట్టుకొనుడి.’ (యిర్మీయా 27:​12) అయితే, ‘ఇశ్రాయేలును చెదరగొట్టినవాడే వాని సమకూర్చును.’ (యిర్మీయా 31:​10) సరైన కారణంతోనే రేకాబీయులకు ఒక వాగ్దానం చేయబడింది. యిర్మీయా “బందీగృహశాలలో” వేయబడ్డాడు. (యిర్మీయా 37:​21) యెరూషలేము నాశనం చేయబడింది, చాలామంది నివాసులు చెరగొనిపోబడ్డారు. అలా తీసుకువెళ్ళకుండా విడిచిపెట్టబడినవారిలో యిర్మీయా, ఆయన సేవకుడైన బారూకు ఉన్నారు. భయపడిపోయిన ఆ ప్రజలు, యిర్మీయా వద్దని హెచ్చరించినా వినకుండా ఐగుప్తుకు వెళ్తారు. 46 నుండి 51 అధ్యాయాలు, జనాంగాల గురించి యిర్మీయా పలికిన సందేశం గురించి తెలియజేస్తున్నాయి.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

22:30​—⁠ఈ ఆజ్ఞ దావీదు సింహాసనాన్ని అధిష్టించేందుకు యేసుక్రీస్తుకున్న హక్కును రద్దు చేస్తుందా? (మత్తయి 1:​1, 11) రద్దు చేయదు. ఈ ఆజ్ఞ, యెహోయాకీను సంతానంలో ఎవరైనా ‘యూదాలో దావీదు సింహాసనమందు కూర్చోవడాన్ని’ నివారిస్తుంది. యేసు యూదాలోవున్న సింహాసనం పైనుండి కాదుగానీ పరలోకం నుండి పరిపాలిస్తాడు.

23:⁠33​—⁠“యెహోవా భారము” అంటే ఏమిటి? యిర్మీయా ప్రవక్త కాలంలో, యెరూషలేము నాశనం గురించి ఆయన చేసిన ప్రాముఖ్యమైన ప్రకటనలు ఆయన తోటివారికి భారంగా ఉన్నాయి. అలాగే, బాధ్యతారహితులైన ప్రజలు యెహోవాకు ఎంత భారంగా తయారయ్యారంటే ఆయన వారిని ఎత్తిపారేస్తాడు. అలాగే, రానున్న క్రైస్తవమత సామ్రాజ్య నాశనం గురించిన లేఖనాధారిత సందేశం క్రైస్తవమత సామ్రాజ్యానికి ఒక భారం, లక్ష్యపెట్టని ప్రజలు దేవునికి పెద్ద భారం.

31:33​—⁠యెహోవా ధర్మవిధి హృదయాలమీద ఎలా వ్రాయబడింది? ఒక వ్యక్తి యెహోవా చిత్తాన్ని చేయాలనే ప్రగాఢ కోరిక ఏర్పడేంతగా దేవుని ధర్మవిధిని ప్రేమిస్తే, ఆ వ్యక్తి హృదయంపై దేవుని ధర్మవిధి వ్రాయబడిందని చెప్పవచ్చు.

32:​10-15​—⁠ఒకే ఒడంబడికకు సంబంధించిన రెండు క్రయపత్రములు తయారుచేయడం యొక్క సంకల్పమేమిటి? ముద్రవేయబడని క్రయపత్రం సంప్రదించడానికి ఉంటుంది. అవసరమైతే దీని ఖచ్చితత్వాన్ని సరిచూడడానికి ముద్రవేయబడిన క్రయపత్రం ఉపయోగపడుతుంది. బంధువులతో లేక తోటి విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు కూడా సహేతుకమైన చట్టబద్ధ విధానాలు అవలంబించడం ద్వారా యిర్మీయా మనకు మాదిరి ఉంచాడు.

33:​23, 24​—⁠ఇక్కడ ప్రస్తావించబడిన “రెండు కుటుంబములు” ఏవి? ఒకటి, రాజైన దావీదు వంశం నుండి వచ్చే రాజ కుటుంబం, మరొకటి అహరోను సంతానపు యాజక కుటుంబం. యెరూషలేము, యెహోవా ఆలయము నాశనం చేయబడడంతో, యెహోవా ఈ రెండు కుటుంబాలను తిరస్కరించినట్లు, ఇక భూమిపై ఒక రాజ్యం ఉండదన్నట్లు, ఆయన ఆరాధన తిరిగి స్థాపించబడదన్నట్లు కనిపించింది.

46:22​—⁠ఐగుప్తు ధ్వని పాము చప్పుడుతో ఎందుకు పోల్చబడింది? ఇది, ఐగుప్తు ఒక రాజ్యంగా తాను అనుభవించిన నాశనాన్నిబట్టి బుసకొడుతూ పారిపోవడాన్ని లేక దాని స్వరం తగ్గిపోవడాన్ని సూచిస్తుండవచ్చు. ఈ పోలిక, ఐగుప్తు ఫరోలు ఉటాచిత్‌ అనే సర్పదేవత రక్షిస్తుందని భావిస్తూ పావన సర్ప రూపాన్ని తమ తలపాగాపై ధరించడం ఎంత వ్యర్థమైనదో కూడా చూపిస్తుంది.

మనకు పాఠాలు:

21:​8, 9; 38:​19. మరణించడానికి అర్హులైన, పశ్చాత్తాపం చూపని యెరూషలేము నివాసులకు యెహోవా ఆఖరి ఘడియలో కూడా ఎంపిక చేసుకునే అవకాశాన్నిచ్చాడు. అవును, “యెహోవా బహు వాత్సల్యత గలవాడు.”​—⁠2 సమూయేలు 24:​14; కీర్తన 119:​156.

31:​34. యెహోవా తాను క్షమించేవారి పాపాలను జ్ఞాపకం ఉంచుకోడని, భవిష్యత్తులో వారిపట్ల చర్య తీసుకోడని తెలుసుకోవడం ఎంతటి ఓదార్పునిస్తుందో కదా!

38:​7-13; 39:​15-18. “పరిశుద్ధులకు ఉపచారము” చేయడం ఇమిడివున్న మన నమ్మకమైన సేవను యెహోవా మరచిపోడు.​—⁠హెబ్రీయులు 6:​10.

45:​4, 5. యూదా ఆఖరి దినాల్లోలాగే, ప్రస్తుత విధానపు “అంత్యదినములు” సంపద, ప్రాముఖ్యత, లేక వస్తుదాయక భద్రత వంటి “గొప్పవాటిని” వెదకవలసిన సమయం కాదు.​—⁠2 తిమోతి 3:⁠1; 1 యోహాను 2:​17.

యెరూషలేము దహించబడడం

(యిర్మీయా 52:​1-34)

అది సా.శ.పూ. 607వ సంవత్సరం. సిద్కియా పరిపాలనలో అది 11వ సంవత్సరం. బబులోను రాజైన నెబుకద్నెజరు గత 18 నెలలుగా యెరూషలేమును ముట్టడించాడు. నెబుకద్నెజరు పరిపాలనలోని 19వ సంవత్సరమందు, ఐదవ నెల ఏడవ దినమున రాజదేహసంరక్షకుల అధిపతియైన నెబూజరదాను యెరూషలేముకు ‘వచ్చాడు.’ (2 రాజులు 25:⁠8) నెబూజరదాను బహుశా నగర ప్రాకారముల వెలుపలున్న తన గుడారం నుండి పరిస్థితిని పరిశీలించి, కార్యాచరణకు పథకం వేశాడు. మూడు రోజుల తర్వాత, నెలలోని పదియవ దినమున అతడు యెరూషలేము లోపలికి ‘వచ్చాడు.’ ఆ తర్వాత అతడు ఆ నగరాన్ని దహించివేశాడు.​—⁠యిర్మీయా 52:​12, 13.

యిర్మీయా యెరూషలేము పడిపోవడాన్ని గురించిన వివరణాత్మక వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. అలా ఆయన వర్ణన విలాపవాక్యములకు ఆధారాన్నిస్తుంది. ఈ కూర్పులు, విలాపవాక్యములు అనే బైబిలు పుస్తకంలో కనిపిస్తాయి.

[8వ పేజీలోని చిత్రం]

యిర్మీయా చేసిన ప్రకటనలలో యెరూషలేముకు వ్యతిరేకంగా చేసిన యెహోవా తీర్పులు కూడా ఉన్నాయి

[9వ పేజీలోని చిత్రం]

యెహోవా ఎలా యిర్మీయాపై ‘తన బలాన్ని ఉపయోగించాడు’?

[10వ పేజీలోని చిత్రం]

“చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను.”​—⁠యిర్మీయా 24:⁠5