కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హన్నాకు మనశ్శాంతి ఎలా లభించింది?

హన్నాకు మనశ్శాంతి ఎలా లభించింది?

హన్నాకు మనశ్శాంతి ఎలా లభించింది?

నమ్మకస్థురాలైన ఓ స్త్రీ యెహోవాను స్తుతిస్తూ బిగ్గరగా ప్రార్థించింది. దేవుడు తనను మంటి నుండి ఎత్తి, తనలో నిరుత్సాహానికి బదులు సంతోషాన్ని నింపాడని ఆమె భావించింది.

ఆమె పేరు హన్నా. ఆమె భావాల్లో అంత గమనార్హమైన మార్పు రావడానికిగల కారణం ఏమిటి? ఆమె ఇప్పుడు ఎందుకంత ఆనందంగా ఉంది? ఆమె అనుభవం నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు కనుగొనేందుకు మనం హన్నా కథను పరిశీలిద్దాం.

ఒత్తిడిలో ఉన్న కుటుంబం

ఎఫ్రాయిము ప్రాంతంలో నివసిస్తున్న లేవీయుడైన ఎల్కానా ఇద్దరు భార్యల్లో హన్నా ఒకరు. (1 సమూయేలు 1:​1, 2ఎ; 1 దినవృత్తాంతములు 6:​33, 34) మానవుల కోసం దేవుడు ఏర్పరచిన ఆది సంకల్పంలో బహుభార్యత్వం భాగం కాకపోయినా, మోషే ధర్మశాస్త్రంలో అది అనుమతించబడి, క్రమబద్ధీకరించబడింది. ఎల్కానా కుటుంబంలోనివారు యెహోవా ఆరాధకులైనా, ఎల్కానా కుటుంబ జీవితంలో ఉదాహరించబడినట్లు బహుభార్యత్వం కలహాలకే దారితీస్తుంది.

హన్నాకు పిల్లలు పుట్టలేదు, కానీ ఎల్కానా రెండో భార్య పెనిన్నాకు చాలామంది పిల్లలున్నారు. పెనిన్నా, హన్నాకు వైరిగా తయారైంది.​—⁠1 సమూయేలు 1:​2బి.

ఇశ్రాయేలీయుల స్త్రీలు గొడ్రాలిగా ఉండడాన్ని అవమానంగానే కాక, దేవుడు తమను అయోగ్యురాలిగా దృష్టిస్తున్నాడనడానికి సూచనగా కూడా పరిగణించేవారు. హన్నాకు పిల్లలు పుట్టకపోవడం దైవిక కోపానికి రుజువనే వివరణ బైబిల్లో ఎక్కడా లేదు. అయినా పెనిన్నా హన్నాను ఓదార్చే బదులు, పిల్లలను కనడానికి తనకున్న సామర్థ్యాన్ని తన వైరికి దుఃఖం కలిగించేందుకు ఉపయోగించింది.

యెహోవా ఆలయానికి యాత్రలు

ఈ ఒత్తిళ్లున్నా, ప్రతీ సంవత్సరం షిలోహులోని యెహోవా ఆలయానికి బలులు అర్పించడానికి ఎల్కానా కుటుంబం వెళ్లేది. * వారు రానూపోనూ దాదాపు 60 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించివుండవచ్చు. ఈ సందర్భాలు, ప్రత్యేకంగా హన్నాకు ఎంతో కష్టంగా అనిపించివుండవచ్చు, ఎందుకంటే సమాధాన బలిలో అనేక భాగాలు పెనిన్నాకు, ఆమె పిల్లలకు ఇవ్వబడేవి, అదే హన్నాకైతే ఒక భాగమే ఇవ్వబడేది. యెహోవా “ఆమెకు సంతులేకుండ” చేసినట్లు కనిపిస్తుంది కాబట్టి, పెనిన్నా హన్నాకు కోపం పుట్టించి ఆమెను విసిగించేందుకు ఆ అవకాశాలను ఉపయోగించుకుంది. ఈ బాధను హన్నా ప్రతీ ఏడాది భరించేది, దానివల్ల ఆమె ఏడుస్తూ భోజనం చేసేది కాదు. ఆ విధంగా, ఆనందంగా గడపాల్సిన యాత్రలు ఆమెకు తీవ్ర వ్యధను కలిగించే సందర్భాలుగా మారాయి. అయినా, హన్నా యెహోవా ఆలయానికి ఈ యాత్రలు చేసేది.​—⁠1 సమూయేలు 1:​3-7.

హన్నా మనకు ఎలాంటి మంచి మాదిరి ఉంచిందో మీరు గమనించారా? మీరు కృంగినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తారు? మిమ్మల్ని మీరు వేరుచేసుకొని తోటి విశ్వాసులతో సహవసించడం మానేస్తారా? హన్నా అలా చేయలేదు. ఆమె యెహోవా ఆరాధకుల మధ్య ఉండడం తన అలవాటుగా చేసుకుంది. ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటున్నా మనం కూడా అలాగే చేయాలి.​—⁠కీర్తన 26:​12; 122:⁠1; సామెతలు 18:⁠1; హెబ్రీయులు 10:​24, 25.

ఎల్కానా హన్నాను ఓదార్చి, ఆమె హృదయ భావాలను రాబట్టేందుకు ప్రయత్నించాడు. “హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనోవిచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా?” అని ఆమెను అడిగాడు. (1 సమూయేలు 1:⁠8) ఎల్కానాకు పెనిన్నా దురుసు ప్రవర్తన గురించి తెలియకపోవచ్చు, హన్నా తన సమస్య గురించి ఫిర్యాదు చేయకుండా దానిని మౌనంగా భరించడానికే ఇష్టపడివుండవచ్చు. ఏదేమైనా, హన్నా యెహోవాకు ప్రార్థించడం ద్వారా ఆయనమీద తనకున్న నమ్మకాన్ని ప్రదర్శించింది.

హన్నా మ్రొక్కుకుంది

యెహోవా ఆలయం దగ్గర సమాధాన బలులను తినేవారు. భోజనశాల నుండి బయటికివచ్చిన తర్వాత హన్నా దేవునికి ప్రార్థించేది. (1 సమూయేలు 1:​9, 10) “సైన్యముల కధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినము లన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును” అని వేడుకుంది.​—⁠1 సమూయేలు 1:​11.

హన్నా నిర్దిష్టంగా ప్రార్థించింది. ఆమె మగపిల్లవాడు కావాలని కోరుకొని, ఆయనను జీవితాంతం నాజీరుగా యెహోవాకు అంకితం చేస్తానని మ్రొక్కుకుంది. (సంఖ్యాకాండము 6:​1-5) అలాంటి మ్రొక్కుబడి చేస్తున్నప్పుడు ఆమె తన భర్త ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఎల్కానా తీసుకున్న చర్యలు, ఆయన తన ప్రియమైన భార్య చేసుకున్న మ్రొక్కుబడిని ఆమోదించినట్లు చూపిస్తోంది.​—⁠సంఖ్యాకాండము 30:​6-8.

హన్నా ప్రార్థన చేసిన విధానం ఆమె మత్తురాలిగా ఉందని ప్రధానయాజకుడైన ఏలీ భావించేలా చేస్తుంది. ఆమె తన మనసులో ప్రార్థన చేసుకుంది కాబట్టి, ఆమె పెదవులు కదిలినా ఆమె మాటలు ఆయనకు వినబడలేదు. ఆమె హృదయపూర్వకంగా ప్రార్థిస్తోంది. (1 సమూయేలు 1:​12-14) తాను మత్తురాలిగా ఉన్నానని అంటూ ఏలీ తనను అవమానపరిచినప్పుడు హన్నాకు ఎలా అనిపించివుండవచ్చో ఊహించండి! అయినా ఆమె ప్రధానయాజకునితో గౌరవపూర్వకంగా మాట్లాడింది. హన్నా “అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు” ప్రార్థించిందని ఏలీ గుర్తించినప్పుడు, “ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక” అని ఆమెను ఆశీర్వదించాడు. (1 సమూయేలు 1:​15-17) అప్పుడు హన్నా తన దారిన వెళ్లిపోయి భోజనం చేసి, “నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.”​—⁠1 సమూయేలు 1:​18.

ఈ వృత్తాంతమంతటి నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మన చింతల గురించి యెహోవాకు ప్రార్థించినప్పుడు, మనం ఆయనకు మన భావాలను తెలియజేస్తూ హృదయపూర్వకంగా విన్నవించువాలి. సమస్యను పరిష్కరించడానికి మనం చేయగలిగిందేమీ లేకపోతే, మనం ఆయన చేతుల్లో ఆ విషయాన్ని వదిలేయాలి. అంతకన్నా మంచి మార్గం మరొకటి లేదు.​—⁠సామెతలు 3:​5, 6.

యెహోవా సేవకులు హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత హన్నా అనుభవించిన మనశ్శాంతినే అనుభవించవచ్చు. ప్రార్థన గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:​6, 7) మనం మన భారాన్ని యెహోవామీద మోపినప్పుడు, దానిని ఆయనకు వదిలేయాలి. అప్పుడు హన్నాలాగే మనం ఆపై దుఃఖంతో ఉండనవసరం లేదు.​—⁠కీర్తన 55:​22.

యెహోవాకు ప్రతిష్ఠించబడిన కుమారుడు

దేవుడు హన్నా ప్రార్థనను ఆలకించాడు; ఆమె గర్భవతియై ఒక కుమారుణ్ణి కన్నది. (1 సమూయేలు 1:​19, 20) బైబిల్లో, తన సేవకుడు కాబోయే వ్యక్తి జననానికి దేవుడు బాధ్యత వహించినట్లు పేర్కొనబడిన కొన్ని సందర్భాల్లో ఇది ఒకటి. ఎల్కానా హన్నాల కుమారుడైన సమూయేలు యెహోవా ప్రవక్త అయ్యాడు, ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.

హన్నా ఖచ్చితంగా యెహోవా గురించి సమూయేలుకు బాల్యం నుండే బోధించడం ప్రారంభించింది. అయితే ఆమె చేసుకున్న మ్రొక్కును ఆమె మరిచిపోయిందా? లేదు! “బిడ్డ పాలు విడుచువరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండును” అని ఆమె చెప్పింది. సమూయేలు పాలు విడిచిన తర్వాత, బహుశా ఆయనకు మూడేళ్లు ఉన్నప్పుడు లేక అంతకన్నా పెద్దవాడైన తర్వాత, హన్నా తాను మ్రొక్కుకున్నట్లే, ఆ బాలుడు తన జీవితాన్ని యెహోవా ఆలయంలో గడిపే విధంగా ఆయనను అక్కడికి తీసుకువచ్చింది.​—⁠1 సమూయేలు 1:​21-24; 2 దినవృత్తాంతములు 31:​16.

యెహోవాకు బలి అర్పించిన తర్వాత హన్నా, ఆమె భర్త, సమూయేలును ఏలీ దగ్గరికి తీసుకువెళ్ళారు. “నా యేలినవాడా, నా యేలిన వాని ప్రాణముతోడు, నీయొద్ద నిలిచి, యెహోవాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు” అని హన్నా ఏలీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ బాలుని చేయిపట్టుకొనే ఉండవచ్చు. అలా సమూయేలు జీవితాంతం దేవునికి చేసే ప్రత్యేక సేవ ప్రారంభమైంది.​—⁠1 సమూయేలు 1:​25-28; 2:​11.

కాలం గడిచేకొద్దీ, హన్నా సమూయేలు గురించి మరిచిపోలేదు. లేఖనాలు ఇలా పేర్కొంటున్నాయి: “వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను.” (1 సమూయేలు 2:​19) హన్నా సమూయేలు కోసం ప్రార్థించేది. ఆమె ప్రతీ సంవత్సరం ఆలయానికి వచ్చినప్పుడు, దేవుని సేవలో నమ్మకంగా ఉండమని ఆమె ఆయనను నిస్సందేహంగా ప్రోత్సహించింది.

అలాంటి ఒక సందర్భంలో ఏలీ సమూయేలు తల్లిదండ్రులను ఆశీర్వదిస్తూ ఎల్కానాతో ఇలా అన్నాడు: “యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక.” ఆ మాటలకు అనుగుణంగా, హన్నా ఎల్కానాలు మరో ముగ్గురు కుమారులతో, ఇద్దరు కుమార్తెలతో ఆశీర్వదించబడ్డారు.​—⁠1 సమూయేలు 2:​20, 21.

ఎల్కానా హన్నాలు క్రైస్తవ తల్లిదండ్రులకు ఎంత చక్కని మాదిరివుంచారో కదా! చాలామంది తల్లిదండ్రులు, ఇంటికి దూరంగా ఏదో రకమైన పూర్తికాల పరిచర్యను చేపట్టమని తమ పిల్లలను ప్రోత్సహించడం ద్వారా వారు తమ పిల్లలను యెహోవాకు ప్రతిష్ఠించడానికి ఇష్టపడుతున్నారు. తాము చేస్తున్న త్యాగాలకు అలాంటి ప్రేమగల తల్లిదండ్రులను ప్రశంసించాలి. అంతేకాక, యెహోవా వారికి ప్రతిఫలమిస్తాడు.

ఆనందంతో హన్నా చేసిన ప్రార్థన

ఒకప్పుడు గొడ్రాలిగా ఉన్న హన్నా ఎంత సంతోషాన్ని చవిచూసిందో కదా! స్త్రీలు చేసిన ప్రార్థనలు అరుదుగా లేఖనాల్లో నమోదుచేయబడ్డాయి. అయితే హన్నా విషయానికొస్తే, ఆమె చేసిన రెండు ప్రార్థనలు మనకు తెలుసు. ఆమె మొదటి ప్రార్థనలో ఆమె కోపంగావున్నప్పుడు, బాధించబడినప్పుడు ఆమెకు కలిగిన భావాలు ఉన్నాయి, రెండవ ప్రార్థన, ఆనందంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసింది. “నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది” అంటూ హన్నా తన ప్రార్థనను ప్రారంభించింది. ‘గొడ్రాలు కూడా పిల్లలను కనినది’ అని ఆమె ఆనందించింది, యెహోవా ‘లేవనెత్తువాడని, దరిద్రులను మంటినుండి ఎత్తువాడు’ అని ఆమె ఆయనను స్తుతించింది. నిజంగా, ఆయన “లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు.”​—⁠1 సమూయేలు 2:​1-10.

హన్నా గురించిన ప్రేరేపిత వృత్తాంతం, మనం ఇతరుల అపరిపూర్ణతలనుబట్టి, ఇతరుల పగనుబట్టి మనకు బాధ కలగవచ్చని చూపిస్తోంది. అయినా అలాంటి పరీక్షలు, యెహోవాను ఆరాధించడంలో ఉన్న ఆనందాన్ని దోచుకునేందుకు మనం అనుమతించకూడదు. ఆయన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, నమ్మకస్థులైన తన ప్రజల మొరలను ఆలకించి, వారిని బాధల నుండి విడిపించి అధిక సమాధానంతోపాటు, ఇతర ఆశీర్వాదాలను ఇస్తాడు.​—⁠కీర్తన 22:​23-26; 34:​6-8; 65:⁠2.

[అధస్సూచి]

^ పేరా 9 బైబిలు, ఈ ఆరాధనా కేంద్రాన్ని యెహోవా ‘మందిరం’ అని పిలుస్తోంది. అయితే ఇశ్రాయేలు చరిత్రలోని ఈ కాలవ్యవధిలో నిబంధనా మందసం డేరాలోనో లేక గుడారంలోనో ఉండేది. సొలొమోను రాజు పాలనలో యెహోవాకు మొదటి శాశ్వత మందిరం నిర్మించబడింది.​—⁠1 సమూయేలు 1:⁠9; 2 సమూయేలు 7:​2, 6; 1 రాజులు 7:​50; 8:​3, 4.

[17వ పేజీలోని చిత్రం]

హన్నా సమూయేలును యెహోవాకు ప్రతిష్ఠించింది