ఆచరణాత్మక సమాధానాలు!
ఆచరణాత్మక సమాధానాలు!
నేడు లభ్యమౌతోన్న అనేక స్వయం సహాయక పుస్తకాల్లోని సలహాలు చాలామట్టుకు ప్రస్తుత జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయపడడంపైనే కేంద్రీకరించబడ్డాయి. అయితే, బైబిలు వాటికి భిన్నంగా ఉంది. బైబిల్లోని ఉపదేశం బాధపడుతున్నవారికి ఊరటనివ్వడంకన్నా ఎక్కువే చేస్తుంది. దానిలోని ఉపదేశం, ఒక వ్యక్తి జీవితాన్ని అనవసరంగా ఇబ్బందుల్లో పడేయగల తప్పులు చేయకుండా ఉండడానికి సహాయం చేస్తుంది.
బైబిలు ‘జ్ఞానములేనివారికి బుద్ధిని యౌవనులకు తెలివిని వివేచనను’ ఇవ్వగలదు. (సామెతలు 1:4) మీరు బైబిల్లోని ఉపదేశాన్ని అన్వయించుకుంటే, ‘బుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది, వివేచన మీకు కావలికాస్తుంది. దుష్టుల మార్గమునుండి రక్షిస్తుంది.’ (సామెతలు 2:11, 12) బైబిల్లోని ఉపదేశాన్ని అన్వయించుకోవడం మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడగలదో, మీ కుటుంబ జీవితాన్ని ఎలా మెరుగుపరచగలదో, మీరు మంచి ఉద్యోగస్థునిగా లేక యజమానిగా ఉండడానికి ఎలా సహాయపడగలదో చూపించే కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
మద్యపానం విషయంలో సమతుల్యంగా ఉండండి
మద్యం మితంగా సేవించడాన్ని బైబిలు ఖండించడం లేదు. అపొస్తలుడైన పౌలు యౌవనుడైన తిమోతికి ఈ సలహానిచ్చినప్పుడు ద్రాక్షారసంవల్ల వచ్చే వైద్యపరమైన ప్రయోజనాలను సూచించాడు: “నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము.” (1 తిమోతి 5:23) ద్రాక్షారసం కేవలం ఔషధంగానే ఉపయోగించబడాలని దేవుడు అనుకోలేదని బైబిల్లోని ఇతర లేఖనాలు చూపిస్తున్నాయి. ద్రాక్షారసం “నరుల హృదయమును సంతోషపెట్టే[దిగా]” వర్ణించబడింది. (కీర్తన 104:15) అయితే, ‘మద్యపానాసక్తులుగా’ లేక దానికి బానిసలుగా మారడాన్ని గురించి బైబిలు హెచ్చరిస్తోంది. (తీతు 2:3) అదిలా చెబుతోంది: “ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు.” (సామెతలు 23:20, 21) అలాంటి సమతుల్యమైన ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఎలాంటి పర్యవసానాలు ఎదురౌతాయి? ఉదాహరణకు కొన్ని దేశాల్లో ఏమి జరుగుతోందో గమనించండి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ ఆల్కహాల్ 2004 ఇలా చెబుతోంది: “ఐర్లాండ్ ప్రజలు మద్యపాన సంబంధిత సమస్యలపై ఏటా సుమారు 240 కోట్ల యూరోలు [300 లక్షల అమెరికన్ డాలర్లు] ఖర్చుచేస్తున్నారు.” ఆ భారీ మొత్తంలో “ఆరోగ్య సంరక్షణ ఖర్చులు (279 లక్షల యూరోలు), రోడ్డు ప్రమాదాల ఖర్చులు (315 లక్షల యూరోలు), మత్తులో చేసే నేరాల ఖర్చులు (100 లక్షల యూరోలు), మద్యపానం చేసి
పని మానేయడంవల్ల వాటిల్లిన నష్టం (1034 లక్షల యూరోలు)” భాగంగా ఉన్నాయని ఆ నివేదిక తెలియజేస్తోంది.మద్యపానం వల్ల జరుగుతున్న ఆర్థిక నష్టంకన్నా ప్రజలు అనుభవిస్తున్న బాధలే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో ఒక ఏడాదిలోనే తాగిన మత్తులో ఉన్నవారిచేత, 5,00,000కన్నా ఎక్కువమంది శారీరకంగా హింసించబడ్డారు. ఫ్రాన్స్‌లో జరిగే గృహ హింస అంతటిలో దాదాపు 30 శాతానికి త్రాగుబోతుతనమే కారణం. ఆ విషయాల దృష్ట్యా మద్యం విషయంలో బైబిలు ఇచ్చే ఉపదేశం సహేతుకమైనదని మీకు అనిపించడంలేదా?
శరీరాన్ని మలినపర్చే అలవాట్లకు దూరంగా ఉండండి
పొగత్రాగడం అప్పటికింకా నాగరికతగానే భావించబడుతున్న 1942వ సంవత్సరంలోనే పొగాకు వాడకం బైబిలు సూత్రాలను ఉల్లంఘిస్తుందనీ, దాన్ని ఉపయోగించకూడదనీ పాఠకులు గ్రహించేందుకు ఈ పత్రిక సహాయం చేసింది. ఆ ఏడాది ప్రచురించబడిన ఒక ఆర్టికల్, దేవుణ్ణి సంతోషపెట్టాలనుకునేవారు ‘శరీరానికి కలిగిన సమస్త కల్మషము నుండి తమను పవిత్రులనుగా’ చేసుకోమనే బైబిలు ఆజ్ఞను అనుసరించాలని తర్కించింది. (2 కొరింథీయులు 7:1) అప్పటినుండి దాదాపు 65 సంవత్సరాలు గడిచిపోయినా, బైబిలు ఆధారితమైన ఆ సలహా మంచిదేనని రుజువవ్వడం లేదా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006లో, పొగాకు ఉపయోగం, “ప్రపంచంలో మరణాలకు రెండవ అతి పెద్ద కారణం” అని వర్ణించింది. ప్రతీ సంవత్సరం పొగత్రాగడం వల్ల దాదాపు 5 కోట్లమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానితో పోలిస్తే హెచ్‌ఐవి లేదా ఎయిడ్స్ కారణంగా సుమారు 30 లక్షలమంది మరణిస్తున్నారు. పొగత్రాగడం వల్ల 20వ శతాబ్దంలో 100 లక్షల మంది అంటే ఆ శతాబ్దంలో జరిగిన యుద్ధాలన్నింటిలో మరణించినంతమంది మృత్యువాతపడ్డారని అంచనా వేయబడింది. నిజానికి, పొగాకు వాడకాన్ని నివారించడం వివేకవంతమైనదని ఇప్పుడు దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు.
“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”
లైంగిక విషయాల గురించి బైబిలు చెప్పేదాన్ని మాత్రం చాలామంది అంత సులభంగా అంగీకరించరు. అనేకమంది నమ్మించబడినట్లుగా, బైబిలు చాదస్తంగా అన్నివిధాలైన లైంగిక కోరికలు పాపమని ఖండించడంలేదు. అయితే, మానవులు తమ లైంగిక కోరికల విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంపై అది చక్కని ఉపదేశాన్నిస్తుంది. లైంగిక సంబంధం భార్యాభర్తలకు మాత్రమే పరిమితమని బైబిలు బోధిస్తోంది. (ఆదికాండము 2:24; మత్తయి 19:4-6; హెబ్రీయులు 13:4) వివాహిత దంపతులు శారీరకంగా ఒకటవ్వడం, తమ మధ్య ప్రేమను అనురాగాన్ని పంచుకోవడానికి తోడ్పడుతుంది. (1 కొరింథీయులు 7:1-5) వివాహిత దంపతులకు జన్మించే పిల్లలు, పరస్పరం ప్రేమించుకునే తల్లి, తండ్రి ఉండడంవల్ల ప్రయోజనం పొందుతారు.—కొలొస్సయులు 3:18-21.
పలువ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం గురించి బైబిలు ఇలా ఆదేశిస్తోంది: “జారత్వమునకు దూరముగా పారిపోవుడి.” (1 కొరింథీయులు 6:18) అలా చెప్పడానికిగల ఒక కారణమేమిటి? ఆ వచనం ఇంకా ఇలా చెబుతోంది: “మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.” లైంగిక విషయాల గురించి బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుంది?
అమెరికాలో ఏమి జరుగుతోందో గమనించండి. నేటి పారిశ్రామిక లోకంలో, ఆ దేశంలోనే అత్యంత ఎక్కువశాతం మంది అంటే ప్రతీ ఏట దాదాపు 8,50,000 మంది అమ్మాయిలు గర్భవతులవుతున్నారు. వారు ఒకవేళ గర్భస్రావం చేయించుకోకపోతే, అవివాహిత తల్లులవుతున్నారు. చిన్నవయసులో తల్లులైన ఈ అమ్మాయిల్లో చాలామంది తమ పిల్లల్ని ప్రేమతో, క్రమశిక్షణలో పెంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారనేది నిజమే, వారిలో కొందరు విజయవంతమవుతారు కూడా. అయితే, కఠిన సత్యమేమిటంటే, చిన్నవయసులో ఉన్న తల్లులకు పుట్టిన కుమారులు జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువ, వారికి పుట్టిన కుమార్తెలు కూడా వారిలాగే చిన్న వయసులోనే గర్భవతులయ్యే అవకాశాలు ఎక్కువ. గడిచిన అనేక దశాబ్దాల గణాంక వివరాలను పునఃపరిశీలించిన తర్వాత, పరిశోధకుడు రాబర్ట్ లెర్మాన్ ఇలా వ్రాశాడు: “ఒంటరి తల్లి లేక తండ్రి ఉండే కుటుంబాలు పెరిగిపోవడం కారణంగా పిల్లలు చదువు మానేయడం, మద్యం మత్తుపదార్థాలు ఉపయోగించడం, అమ్మాయిలు గర్భవతులై పిల్లల్ని కనడం, పిల్లలు చిన్నవయసులోనే నేరాలు చేయడం వంటి ఇతర సామాజిక సమస్యలు కూడా ఎక్కువౌతున్నాయి.”
చాలామందితో లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు. ఉదాహరణకు, పీడియాట్రిక్స్ అనే పత్రిక ఇలా నివేదిస్తోంది: “యుక్త వయసులోనే విశృంఖల లైంగిక కార్యకలాపాల్లో చురుగ్గావుండే యౌవనస్థులు కృంగుదలకు లోనయ్యే, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం సూచిస్తోంది.” ఇతర ఆరోగ్య ప్రమాదాల గురించి అమెరికన్ సోషల్ హెల్త్ అసోసియేషన్ ఇలా చెబుతోంది: “[అమెరికాలో] సగంకన్నా ఎక్కువమంది జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎస్‌టిడికి [లైంగిక సంబంధాలవల్ల సోకే వ్యాధి] గురౌతారు.” లైంగిక విషయాల గురించి బైబిలు ఇస్తున్న ఆచరణాత్మక ఉపదేశాన్ని పాటిస్తే ఎంతటి హృదయవేదనను, బాధను నివారించవచ్చో ఆలోచించండి!
పటిష్ఠమైన కుటుంబ బంధాలను ఏర్పర్చుకోండి
బైబిలు హానికరమైన అలవాట్ల గురించి కేవలం హెచ్చరించడం కంటే ఎక్కువే చేస్తుంది. కుటుంబ జీవిత నాణ్యతను ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయంలో అదిచ్చే ఆచరణాత్మక ఉపదేశాన్ని గమనించండి.
దేవుని వాక్యం ఇలా చెబుతోంది: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు.” (ఎఫెసీయులు 5:28) భర్తలు తమ భార్యలను చులకనగా చూడకుండా వారు ‘బలహీనమైన ఘటములని వారిని సన్మానించి, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయాలని’ ప్రోత్సహించబడుతున్నారు. (1 పేతురు 3:7) వారిమధ్య తలెత్తగల తగవుల విషయంలో భర్తలు ఇలా ఉపదేశించబడ్డారు: “భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.” (కొలొస్సయులు 3:19) ఆ ఉపదేశాన్ని అనుసరించే భర్త తన భార్య ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకుంటాడని మీరు అంగీకరించరా?
బైబిలు భార్యలను ఇలా నిర్దేశిస్తోంది: “స్త్రీలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు . . . భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను.” (ఎఫెసీయులు 5:22, 23, 33) భార్య తన భర్తతో మాట్లాడేటప్పుడు లేదా భర్త గురించి మాట్లాడేటప్పుడు ఆ ఉపదేశాన్ని అన్వయించుకుంటే, ఆమెను ఆమె భర్త ప్రగాఢంగా ప్రేమిస్తాడని మీరు ఒప్పుకోరా?
పిల్లలకు తర్ఫీదిచ్చే విషయంలో తల్లిదండ్రులైన మీకు బైబిలు ఇచ్చే ఉపదేశమేమిటంటే, మీరు మీ పిల్లలతో, “యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును” సంభాషించాలనేదే. (ద్వితీయోపదేశకాండము 6:7) ముఖ్యంగా తండ్రులు, తమ పిల్లలకు నైతిక విషయాల్లో నడిపింపును, ప్రేమపూర్వక క్రమశిక్షణను ఇవ్వాలని ఆదేశించబడ్డారు. “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి” అని దేవుని వాక్యం చెబుతోంది. (ఎఫెసీయులు 6:4) పిల్లలకు ఇలా చెప్పబడింది: “మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి,” “నీ తండ్రిని తల్లిని సన్మానింపుము.” *—ఎఫెసీయులు 6:1, 2.
బైబిల్లోని ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవడం వల్ల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని మీకనిపిస్తుందా? ‘ప్రయోజనం పొందుతాయి, అయితే ఇది వినడానికి బాగానే ఉంది కానీ అది నిజంగా ఆచరణాత్మకమైనదేనా’ అని మీరు అడగవచ్చు. మీరొకసారి యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని సందర్శించాలని మేము ఆహ్వానిస్తున్నాం. అక్కడ మీరు, బైబిల్లోని జ్ఞానవంతమైన ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి కృషి చేస్తున్న కుటుంబాలను కలుస్తారు. వారితో
మాట్లాడండి. కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనించండి. బైబిలు సూత్రాల ఆధారంగా జీవించడం కుటుంబాలను నిజంగానే సంతోషభరితం చేస్తుందని మీరు కళ్లారా చూస్తారు!శ్రద్ధగా పనిచేసేవారు, నిజాయితీపరులైన యజమానులు
మనం ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి చేసే పోరాటం గురించి బైబిలు ఏమి చెబుతోంది? తన పనిని కౌశలంతో చేసే వ్యక్తి ప్రశంసించబడతాడని, దానికి ప్రతిఫలాన్ని పొందుతాడని అది చెబుతోంది. “తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? . . . వాడు రాజుల యెదుటనే నిలుచును” అని రాజైన సొలొమోను అన్నాడు. (సామెతలు 22:29) మరోవైపు, “సోమరి” తన యజమానికి, “కండ్లకు పొగ” చిరాకు కలిగించినట్లు చిరాకు కలిగిస్తాడు. (సామెతలు 10:26) ఉద్యోగస్థులు నిజాయితీగా, శ్రద్ధతో పనిచేసేవారిగా ఉండాలని బైబిలు ప్రోత్సహిస్తోంది. “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక . . . తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:27) ఆ ఉపదేశం యజమాని చూడనప్పుడు కూడా వర్తిస్తుంది. “దాసులారా, మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణగలవారై, శరీరమునుబట్టి మీ యజమానులైనవారికి అన్ని విషయములలో విధేయులైయుండుడి.” (కొలొస్సయులు 3:22) మీరు యజమాని అయితే, ఆ ఉపదేశాన్ని అన్వయించుకొనే ఉద్యోగస్థుణ్ణి విలువైనవానిగా ఎంచరా?
యజమానులకు బైబిలు ఈ విషయాన్ని గుర్తుచేస్తోంది: “పనివాడు తన జీతమునకు పాత్రుడు.” (1 తిమోతి 5:18) దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, యజమానులు తమ పనివారికి సమయానికి, తగిన జీతం ఇవ్వాలని నిర్దేశించింది. “నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు. కూలి వాని కూలి మరునాటివరకు నీయొద్ద ఉంచుకొనకూడదు” అని మోషే వ్రాశాడు. (లేవీయకాండము 19:13) బైబిలు నిర్దేశానికి విధేయత చూపించి మీకు సమయానికి, తగిన జీతం ఇచ్చే యజమాని కోసం పనిచేయడం సంతోషాన్నివ్వదా?
జ్ఞానానికి ఉన్నత మూలం
బైబిలు అతి పురాతన పుస్తకమైనా, దానిలో మన కాలంలో ఆచరణీయ ఉపదేశం ఉండడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? ఎన్నో పుస్తకాలు మన కాలానికి అసంబద్ధంగా మారినా బైబిలు ఇంకా నిలిచివుండడానికి కారణం, అందులో ఉన్నది మనుష్యులు వ్రాసింది కాదు, అది “దేవుని వాక్యము.”—1 థెస్సలొనీకయులు 2:13.
మీరు దేవుని వాక్యాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి సమయం వెచ్చించమని మేము ప్రోత్సహిస్తున్నాం. మీరలా చేస్తే, దాని రచయిత అయిన యెహోవా దేవునితో మీకు అనుబంధం ఏర్పడుతుంది. ఆయనిచ్చే ఉపదేశాన్ని అన్వయించుకుంటే, అది మిమ్మల్ని ప్రమాదం నుండి రక్షించి, మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సహాయం చేస్తుందని మీరు గ్రహిస్తారు. అలా చేయడం ద్వారా, మీరు ‘దేవునియొద్దకు వస్తారు, అప్పుడాయన మీయొద్దకు వస్తాడు.’ (యాకోబు 4:8) వేరే ఏ పుస్తకమూ మీకు ఆ విధంగా సహాయం చేయలేదు.
[అధస్సూచి]
^ పేరా 20 మీ కుటుంబానికి సహాయపడగల బైబిలు సూత్రాల సవివరమైన చర్చ కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని చూడండి.
[4వ పేజీలోని చిత్రం]
మద్యం విషయంలో బైబిలు దృక్కోణం ఆచరణాత్మకమైనదని మీకనిపిస్తోందా?
[5వ పేజీలోని చిత్రం]
పొగాకు ఉపయోగాన్ని నివారించమనే బైబిలు ఆధారిత ఉపదేశంతో మీరు ఏకీభవిస్తారా?
[7వ పేజీలోని చిత్రాలు]
బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడం కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తుంది
[5వ పేజీలోని చిత్రసౌజన్యం]
భూగోళం: Based on NASA Photo