కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తుపట్ల, నమ్మకమైన ఆయన దాసునిపట్ల విశ్వసనీయంగా ఉండండి

క్రీస్తుపట్ల, నమ్మకమైన ఆయన దాసునిపట్ల విశ్వసనీయంగా ఉండండి

క్రీస్తుపట్ల, నమ్మకమైన ఆయన దాసునిపట్ల విశ్వసనీయంగా ఉండండి

“యజమానుడు . . . తన యావదాస్తిమీద వాని నుంచును.”​—⁠మత్తయి 24:​45-47.

“మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు [గ్రీకులో అక్షరార్థంగా ‘నాయకుడు’].” (మత్తయి 23:​10) యేసు ఈ మాటలతో, తన అనుచరులకు ఈ భూమ్మీద ఏ వ్యక్తీ నాయకునిగా ఉండడని వారికి స్పష్టం చేశాడు. వారి ఏకైక నాయకుడు పరలోకంలోవున్న యేసుక్రీస్తే. దేవుడే, యేసును ఆ స్థానంలో నియమించాడు. యెహోవా “క్రీస్తును మృతులలోనుండి లేపి . . . సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము.”​—⁠ఎఫెసీయులు 1:​20-23.

2 క్రైస్తవ సంఘానికి సంబంధించి క్రీస్తు ‘సమస్తముపైని శిరస్సుగా’ ఉన్నాడు కాబట్టి, సంఘంలో జరిగే అన్నిటిపై ఆయనకు అధికారం ఉంది. సంఘంలో జరిగేదేదీ ఆయన దృష్టికి రాకుండా పోదు. క్రైస్తవుల ప్రతీ గుంపు లేదా సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఆయన సునిశితంగా గమనిస్తున్నాడు. సా.శ. మొదటి శతాబ్దం చివర్లో అపొస్తలుడైన యోహానుకు ఇవ్వబడిన ప్రకటనలో ఈ విషయం స్పష్టమౌతోంది. యేసు ఏడు సంఘాలనుద్దేశించి మాట్లాడినప్పుడు ఐదుసార్లు వారి క్రియలు అంటే వారి మంచి లక్షణాలు, వారి బలహీనతలు తనకు తెలుసని చెబుతూ తదనుగుణంగా ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. (ప్రకటన 2:​2, 9, 13, 19; 3:​1, 8, 15) అలాగే ఇతర సంఘాల అంటే ఆసియా మైనరు, పాలస్తీనా, సిరియా, బాబిలోనియా, గ్రీసు, ఇటలీ, మరితర ప్రాంతాల్లోని సంఘాల ఆధ్యాత్మిక స్థితి గురించి కూడా క్రీస్తుకు బాగా తెలుసని మనం నిజంగా నమ్మవచ్చు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) మరి నేటి విషయమేమిటి?

నమ్మకమైన దాసుడు

3 యేసు పునరుత్థానం చేయబడి పరలోకంలోవున్న తన తండ్రి దగ్గరికి ఆరోహణమవడానికి కొంతకాలం ముందు తన శిష్యులతో ఇలా అన్నాడు: “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది.” ఆయనింకా ఇలా అన్నాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:​18-20) ఆయన చురుకుగా నాయకత్వం వహించే శిరస్సుగా వారితో ఉండడం కొనసాగిస్తాడు. అపొస్తలుడైన పౌలు ఎఫెసులో, కొలస్సయిలో ఉన్న క్రైస్తవులకు వ్రాసిన పత్రికల్లో క్రీస్తు శిరస్సుగావున్న క్రైస్తవ సంఘాన్ని “శరీరము”తో పోల్చాడు. (ఎఫెసీయులు 1:​22, 23; కొలొస్సయులు 1:​18) కేంబ్రిడ్జ్‌ బైబిల్‌ ఫర్‌ స్కూల్స్‌ అండ్‌ కాలేజెస్‌ అనే పుస్తకం, ఈ రూపకాలంకారం “శిరస్సుతో కలిగివుండే ఆవశ్యక ఐక్యతను మాత్రమేకాక, ఆ శిరస్సు సభ్యులను నిర్దేశిస్తాడనే తలంపును సూచిస్తోంది. వారాయన చేతిలోని ఉపకరణాలు” అని చెబుతోంది. తనకు 1914లో రాజ్యాధికారం ఇవ్వబడినప్పటి నుండి క్రీస్తు ఏ గుంపును తన ఉపకరణంగా ఉపయోగించుకున్నాడు?​—⁠దానియేలు 7:​13, 14.

4 మలాకీ ప్రవచనం, “మీరు వెదకుచున్న ప్రభువు” అంటే యెహోవా, క్రొత్తగా సింహాసనం అధిష్ఠించిన తన కుమారుడు అంటే, “నిబంధన దూత” అయిన క్రీస్తుయేసుతో కలిసి తన “ఆలయమును” లేదా ఆధ్యాత్మిక ఆరాధనా గృహాన్ని పరీక్షించేందుకు, తీర్పుతీర్చేందుకు వస్తాడని ముందే చెప్పింది. ‘దేవుని ఇంటికి తీర్పుతీర్చబడే కాలము’ 1918లో మొదలైందని స్పష్టమౌతోంది. * (మలాకీ 3:⁠1; 1 పేతురు 4:​17) భూమ్మీద దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని, ఆయనను సరైన విధంగా ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నవారు తగినవిధంగా పరీక్షించబడ్డారు. శతాబ్దాలుగా దేవుణ్ణి అవమానపరిచే సిద్ధాంతాలు బోధిస్తూ, మొదటి ప్రపంచ యుద్ధ నరమేథంలో పూర్తిగా నిమగ్నమైయున్న క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలు తిరస్కరించబడ్డాయి. ఆత్మాభిషిక్త క్రైస్తవుల విశ్వసనీయ శేషము పరీక్షించబడి, అగ్నితో శోధించబడినట్లుగా నిర్మలం చేయబడి, ఆమోదించబడింది, అలా వారు “నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యముగా” అర్పించబడిన ప్రజలయ్యారు.​—⁠మలాకీ 3:⁠3.

5 మలాకీ ప్రవచనానికి అనుగుణంగా, యేసు తన “రాకడకును [‘ప్రత్యక్షతకు,’ NW] ఈ యుగసమాప్తికిని” సంబంధించిన కాలాన్ని గుర్తించడానికి తన శిష్యులకు సహాయంచేసేందుకు ఇచ్చిన వివిధ అంశాల సూచనలో ‘దాసుని’ వర్గాన్ని గుర్తించే సూచన కూడా ఉంది. యేసు ఇలా అన్నాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (మత్తయి 24:​3, 45-47) క్రీస్తు ఆ ‘దాసుణ్ణి’ పరీక్షించేందుకు 1918లో “వచ్చినప్పుడు,” ఆయన “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారం అందజేసేందుకు 1879 నుండి ఈ పత్రికను, ఇతర బైబిలు ఆధారిత ప్రచురణలను ఉపయోగిస్తున్న నమ్మకమైన శిష్యుల ఆత్మాభిషిక్త శేషమును కనుగొన్నాడు. ఆయన వారినందరినీ తన సంయుక్త ఉపకరణంగా లేదా ‘దాసునిగా’ ఆమోదించి, 1919లో వారికి భూమ్మీది తన యావదాస్తిపై నిర్వహణా బాధ్యతలు అప్పగించాడు.

క్రీస్తు భూసంబంధ ఆస్తిపై నిర్వహణ

6 యేసు, భూమిపై తనకు ప్రాతినిథ్యం వహించే “దాసుడు” ఉంటాడనే విషయంతోపాటు, తన ప్రత్యక్షతా సూచనకు సంబంధించిన ప్రవచనాన్ని చెప్పడానికి కొద్దినెలల ముందు, ఆ ‘దాసుని’ గురించి మాట్లాడుతూ కాస్త భిన్నమైన పదజాలాన్ని ఉపయోగించాడు, దానితో ఆ దాసుని బాధ్యతలేమిటో స్పష్టమయ్యాయి. యేసు ఇలా అన్నాడు: “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు? అతడు తనకు కలిగినదానియంతటిమీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.”​—⁠లూకా 12:​42, 44.

7 ఇక్కడ ఆ దాసుడు గృహనిర్వాహకుడని పిలవబడ్డాడు. ఆ సంయుక్త దాసుడు, బైబిలు నుండి ఆసక్తికరమైన అంశాలు వివరించే మేధావి వర్గం మాత్రమే కాదు. ఆ ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ “తగినవేళ” బలవర్ధకమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తాడు, అంతేగాక ఆయన క్రీస్తు అనుచరులందరిపై నియమించబడతాడు, భూమిపై క్రీస్తుకు “కలిగినదానియంతటిమీద” అంటే క్రైస్తవ సంఘ కార్యకలాపాలన్నింటి మీద కూడా ఆయనకు నిర్వహణాధికారం అప్పగించబడుతుంది. క్రీస్తుకు కలిగినదానంతటిలో ఏమేమి ఉన్నాయి?

8 ఆ దాసుని బాధ్యతల్లో, క్రీస్తు అనుచరులు తమ క్రైస్తవ కార్యకలాపాలను నెరవేర్చేందుకు ఉపయోగించే యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం, బ్రాంచి కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి ఆరాధనా స్థలాలు అంటే రాజ్యమందిరాలు, సమావేశ స్థలాలవంటి వసతుల్ని పర్యవేక్షించడం కూడా ఇమిడివుంది. అంతకన్నా ప్రాముఖ్యంగా, ఆ దాసుడు వారంలో జరిగే కూటాల్లో, ఆయా సమయాల్లో జరిగే సమావేశాల్లో ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధికరమైన బైబిలు అధ్యయన కార్యక్రమాల్ని కూడా పర్యవేక్షిస్తాడు. ఈ సమావేశాల్లో, బైబిలు ప్రవచనాల నెరవేర్పుకు సంబంధించిన సమాచారం అందించబడడమేకాక, దైనందిన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకునే విధానంపై సమయానుకూలమైన నిర్దేశం కూడా ఇవ్వబడుతుంది.

9 గృహనిర్వాకుని బాధ్యతల్లో అత్యంత ప్రాముఖ్యమైన “ఈ రాజ్యసువార్త”ను ప్రకటించే పనిని, “సమస్త జనులను శిష్యులనుగా” చేసే పనిని పర్యవేక్షించడం కూడా ఉంది. దీనిలో సంఘ శిరస్సైన క్రీస్తు ఈ కాలాంతంలో చేయమని ఆజ్ఞాపించిన వాటన్నింటిని గైకొనేలా ప్రజలకు బోధించడం ఇమిడివుంది. (మత్తయి 24:​14; 28:​19, 20; ప్రకటన 12:​17) ఈ ప్రకటనా, బోధనా పని అభిషిక్త శేషం యొక్క యథార్థ సహవాసుల ‘ఒక గొప్ప సమూహాన్ని’ సమకూర్చింది. ఈ “అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులు” నిస్సందేహంగా, నమ్మకమైన దాసుడు నిర్వహించే క్రీస్తు ప్రశస్తమైన ‘ఆస్తిలో’ భాగంగా లెక్కించబడతాయి.​—⁠ప్రకటన 7:⁠9; హగ్గయి 2:⁠7.

దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిపాలక సభ

10 నమ్మకమైన దాసుని బరువైన బాధ్యతల్లో నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇమిడివుంది. తొలి క్రైస్తవ సంఘంలో, యెరూషలేములోని అపొస్తలులు, పెద్దలు క్రైస్తవ సంఘమంతటి కోసం నిర్ణయాలు తీసుకుంటూ దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహించారు. (అపొస్తలుల కార్యములు 15:​1, 2) మొదటి శతాబ్దానికి చెందిన ఈ పరిపాలక సభ తీసుకున్న నిర్ణయాలు పత్రికల ద్వారా, ప్రయాణ ప్రతినిధుల ద్వారా సంఘాలకు అందజేయబడేవి. తొలి క్రైస్తవులు ఆ స్పష్టమైన నిర్దేశాన్ని సంతోషంగా స్వీకరించారు, అంతేగాక పరిపాలక సభతో వారు ఇష్టపూర్వకంగా సహకరించడం సమాధానాన్ని, ఐక్యతను పెంపొందించింది.​—⁠అపొస్తలుల కార్యములు 15:​22-31; 16:​4, 5; ఫిలిప్పీయులు 2:⁠2.

11 తొలి క్రైస్తవ కాలాల్లోలాగే, ఆత్మాభిషిక్త పైవిచారణకర్తల చిన్నగుంపు నేడు భూమ్మీదున్న క్రీస్తు అనుచరుల పరిపాలక సభగా పనిచేస్తోంది. ఈ నమ్మకమైన పురుషులు రాజ్యపనిని పర్యవేక్షిస్తుండగా, సంఘ శిరస్సైన క్రీస్తు తన “కుడిచేత” ప్రయోగించే శక్తి ద్వారా వారిని నిర్దేశిస్తున్నాడు. (ప్రకటన 1:​16, 20) దీర్ఘకాలం పరిపాలక సభ సభ్యునిగా పనిచేసి ఇటీవలే తన భూజీవితాన్ని ముగించిన ఆల్బర్ట్‌ ష్రోడర్‌ తన జీవిత కథలో ఇలా వ్రాశాడు: “పరిపాలక సభ ప్రతీ బుధవారం సమావేశమవుతుంది, యెహోవా ఆత్మ నిర్దేశాన్ని అర్థిస్తూ ప్రార్థనతో ఆ సమావేశాన్ని ప్రారంభిస్తుంది. చేపట్టే ప్రతీ విషయం, తీసుకునే ప్రతీ నిర్ణయం దేవుని వాక్యమైన బైబిలుపై ఆధారపడి ఉండేందుకే కృషిచేయబడుతుంది.” * అలాంటి నమ్మకమైన అభిషిక్త క్రైస్తవులను మనం నమ్మవచ్చు. వారి విషయంలో మనం ప్రత్యేకంగా అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఆదేశాన్ని లక్ష్యపెట్టాలి: ‘మీపైని నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారి మాట విని, వారికి లోబడియుండుడి.’​—⁠హెబ్రీయులు 13:​17.

నమ్మకమైన దాసునిపట్ల సరైన గౌరవం చూపించడం

12 నమ్మకమైన దాసునిపట్ల సరైన గౌరవం చూపించడానికి ప్రాథమిక కారణమేమిటంటే, మనమలా గౌరవించడం ద్వారా వారి యజమాని అయిన యేసుక్రీస్తుపట్ల గౌరవం చూపిస్తాము. అభిషిక్తుల గురించి పౌలు ఇలా వ్రాశాడు: “స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడినవారు.” (1 కొరింథీయులు 7:​22, 23; ఎఫెసీయులు 6:⁠6) కాబట్టి, మనం నమ్మకమైన దాసుడు, అతని పరిపాలక సభ ఇచ్చే నిర్దేశానికి విశ్వసనీయంగా లోబడినప్పుడు మనం ఆ దాసుని యజమాని అయిన క్రీస్తుకు లోబడుతున్నట్లే అవుతుంది. భూమ్మీది తన ఆస్తి నిర్వహణకు క్రీస్తు ఉపయోగిస్తున్న ఉపకరణంపట్ల సరైన గౌరవం చూపించడం, మనం ‘తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకునే’ మార్గాల్లో ఒకటి.​—⁠ఫిలిప్పీయులు 2:​11.

13 నమ్మకమైన దాసునిపట్ల గౌరవం చూపించడానికి మరో లేఖనాధార కారణమేమిటంటే, భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవులు “ఆత్మమూలముగా” యెహోవా నివసించే అలంకారార్థ ‘దేవాలయముగా’ వర్ణించబడడం. కాబట్టి వారు ‘పరిశుద్ధులు.’ (1 కొరింథీయులు 3:​16, 17; ఎఫెసీయులు 2:​19-22) ఈ పరిశుద్ధ దేవాలయ తరగతివారికే యేసు తన భూసంబంధ ఆస్తిని అప్పగించాడు, అంటే క్రైస్తవ సంఘంలో కొన్ని హక్కులు, బాధ్యతలు ఈ దాసుని వర్గానికి మాత్రమే చెందుతాయని అర్థం. ఈ కారణాన్నిబట్టి, సంఘంలోని వారందరూ నమ్మకమైన దాసుడు, అతని పరిపాలక సభ ఇచ్చే నిర్దేశాన్ని అనుసరిస్తూ దానికి మద్దతివ్వడం తమ పవిత్ర కర్తవ్యంగా దృష్టిస్తారు. నిజానికి, యజమాని ఆస్తిని జాగ్రత్తగా చూసుకునే విషయంలో దాసుని తరగతికి సహాయం చేయడాన్ని “గొప్పసమూహము” తమకు లభించిన ఆధిక్యతగా లెక్కిస్తారు.​—⁠యోహాను 10:​16.

విశ్వసనీయంగా మద్దతివ్వడం

14 ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెందిన అభిషిక్త సభ్యులకు వేరేగొర్రెలు వినయంతో లోబడడం యెషయా ప్రవచనంలో ముందే ఇలా చెప్పబడింది: “యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు​—⁠ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును, దీర్ఘదేహులైన సెబాయీయులును నీయొద్దకు వచ్చి నీవారగుదురు. వారు నీవెంట వచ్చెదరు; సంకెళ్లు కట్టుకొని వచ్చి నీ యెదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు.” (యెషయా 45:​14) సూచనార్థకంగా, నేడు వేరేగొర్రెలు అభిషిక్త దాసుని తరగతి, దాని పరిపాలక సభ ఇచ్చే నిర్దేశాన్ని అనుసరిస్తూ వారివెంట నడుస్తున్నారు. తమ “కష్టార్జితమును” ఇచ్చేవారిగా వేరేగొర్రెలు, క్రీస్తు భూమ్మీది తన అభిషిక్త అనుచరులకు నియమించిన ప్రపంచవ్యాప్త ప్రకటనాపనికి మద్దతిచ్చేందుకు తమ బలాన్ని, తమ వనరుల్ని ఇష్టపూర్వకంగా వెచ్చిస్తున్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠8; ప్రకటన 12:​17.

15 వేరేగొర్రెలు దాసుని తరగతి, దాని పరిపాలక సభ పర్యవేక్షణలో యెహోవాను సేవించేందుకు సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నారు. అభిషిక్తులను వారు “దేవుని ఇశ్రాయేలు” సభ్యులుగా గుర్తిస్తారు. (గలతీయులు 6:​16) ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో సహవసించే ‘అన్యులుగా,’ ‘పరదేశులుగా’ వారు “యెహోవాకు యాజకులు,” “దేవుని పరిచారకులు” అయిన అభిషిక్తుల నిర్దేశం క్రింద ‘వ్యవసాయకులుగా,’ ‘ద్రాక్షతోట కాపరులుగా’ ఆనందంగా సేవచేస్తారు. (యెషయా 61:​5, 6) ఈ రాజ్యసువార్తను ప్రకటించడంలో, సమస్త జనులను శిష్యులనుగా చేయడంలో వారు ఉత్సాహంగా భాగం వహిస్తారు. క్రొత్తగా చేరిన గొర్రెల్లాంటి వ్యక్తులను కాయడంలో, సంరక్షించడంలో దాసుని తరగతికి వారు హృదయపూర్వకంగా సహాయం చేస్తారు.

16 తమకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం అందించేందుకు నమ్మకమైన దాసుడు శ్రద్ధగాచేస్తున్న ప్రయత్నాల నుండి తామెంతో ప్రయోజనం పొందినట్లు వేరేగొర్రెలకు చెందినవారు గుర్తిస్తారు. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడే లేకపోతే, యెహోవా సర్వాధిపత్యం, ఆయన నామ పరిశుద్ధత, రాజ్యం, క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి, ఆత్మ, చనిపోయినవారి స్థితి, యెహోవా, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మల నిజమైన గుర్తింపు వంటి ప్రశస్తమైన బైబిలు సత్యాలు తమకు ఏ కొద్దిగానో తెలిసివుండేవని లేదా అసలు ఏ మాత్రం తెలిసి ఉండేవికావని వారు వినయంగా ఒప్పుకుంటారు. మిగుల కృతజ్ఞతతో, విశ్వసనీయతతో వేరేగొర్రెలకు చెందినవారు ఈ కాలాంతంలో భూమ్మీది క్రీస్తు అభిషిక్త “సహోదరులకు” ప్రేమపూర్వక మద్దతిస్తారు.​—⁠మత్తయి 25:​40.

17 అభిషిక్తుల సంఖ్య తగ్గిపోతున్న కారణంగా, క్రీస్తు ఆస్తి నిర్వహణను పర్యవేక్షించేందుకు వారు అన్ని సంఘాల్లో ఉండడం సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల, పరిపాలక సభ బ్రాంచి కార్యాలయాల్లో, జిల్లాల్లో, సర్క్యూట్లలో యెహోవాసాక్షుల సంఘాల్లో పైవిచారణ చేసేందుకు వేరేగొర్రెలలో నుండి పురుషులను నియమిస్తుంది. ఈ ఉపకాపరులపట్ల మన దృక్పథం క్రీస్తుకు, ఆయన నమ్మకమైన దాసునికి మనం చూపించే విశ్వసనీయతపై ఏదైనా ప్రభావం చూపిస్తుందా? తర్వాతి ఆర్టికల్‌లో ఇది పరిశీలించబడుతుంది.

[అధస్సూచీలు]

^ పేరా 7 ఈ విషయాన్ని గురించి వివరణాత్మక చర్చకోసం, కావలికోట మార్చి 1, 2004, 13-18 పేజీలు; మార్చి 1, 1993, 13వ పేజీ చూడండి.

^ పేరా 16 ఈ పత్రికయొక్క ఆంగ్ల సంచిక మార్చి 1, 1988, 10-17 పేజీల్లో ప్రచురించబడింది.

పునఃసమీక్ష

• మన నాయకుడు ఎవరు, సంఘాల్లోని పరిస్థితులు ఆయనకు తెలుసని ఏది చూపిస్తోంది?

• ‘ఆలయాన్ని’ పరీక్షించినప్పుడు, ఎవరు నమ్మకమైన దాసునిగా పనిచేస్తున్నట్లు కనుగొనబడ్డారు, వారికి ఏ ఆస్తి అప్పగించబడింది?

• నమ్మకమైన దాసునికి విశ్వసనీయంగా మద్దతిచ్చేందుకు ఏ లేఖనాధారిత కారణాలున్నాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) మన నాయకుడు ఎవరని లేఖనాలు సూచిస్తున్నాయి? (బి) క్రైస్తవ సంఘంలో క్రీస్తు చురుకుగా సారథ్యం వహిస్తున్నాడని ఏది చూపిస్తోంది?

3. క్రీస్తును శిరస్సుతో, ఆయన సంఘాన్ని శరీరంతో పోల్చడం ఎందుకు సముచితం?

4. మలాకీ ప్రవచనంలో ముందే చెప్పబడినట్లుగా, యెహోవా, క్రీస్తుయేసు ఆధ్యాత్మిక ఆలయాన్ని పరీక్షించేందుకు వచ్చినప్పుడు వారేమి కనుగొన్నారు?

5. యేసు తన ‘ప్రత్యక్షతకు’ సంబంధించి చెప్పిన ప్రవచనానికి అనుగుణంగా ఎవరు నమ్మకమైన ‘దాసునిగా’ నిరూపించబడ్డారు?

6, 7. (ఎ) యేసు తన నమ్మకమైన ‘దాసుని’ గురించి మాట్లాడుతూ ఇంకా ఏ విధమైన పదజాలాన్ని ఉపయోగించాడు? (బి) “గృహనిర్వాహకుడు” అని యేసు ఉపయోగించిన పదం దేనిని సూచిస్తోంది?

8, 9. దాసుడు ఏ ‘ఆస్తి’ నిర్వహణకు నియమించబడ్డాడు?

10. నిర్ణయాలు తీసుకునే ఏ సభ మొదటి శతాబ్దంలో ఉనికిలోవుంది, అది సంఘాలపై ఎలాంటి ప్రభావం చూపించింది?

11. తన సంఘాన్ని నిర్దేశించేందుకు క్రీస్తు నేడు ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు, ఈ అభిషిక్త క్రైస్తవుల గుంపును మనమెలా దృష్టించాలి?

12, 13. దాసుని తరగతిపట్ల గౌరవం చూపించేందుకు ఏ లేఖనాధార కారణాలున్నాయి?

14. యెషయా ప్రవచించినట్లుగా, వేరేగొర్రెలు ఎలా అభిషిక్త దాసుని తరగతి వెంట నడుస్తూ, తమ “కష్టార్జితమును” వెచ్చిస్తున్నారు?

15. వేరేగొర్రెలకు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు మధ్యవుండే సంబంధాన్ని యెషయా 61:​5, 6లోని ప్రవచనం ముందే ఎలా చెప్పింది?

16. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి విశ్వసనీయంగా మద్దతిచ్చేందుకు వేరేగొర్రెలను ఏది పురికొల్పుతుంది?

17. పరిపాలక సభ ఏమిచేయడం అవసరమని భావించింది, తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలించబడుతుంది?

[23వ పేజీలోని చిత్రాలు]

“గృహనిర్వాహకుడు” పర్యవేక్షించే ‘ఆస్తిలో’ వసతులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రకటనాపని ఉన్నాయి

[25వ పేజీలోని చిత్రం]

వేరేగొర్రెల సభ్యులు ఉత్సాహంగా ప్రకటించడం ద్వారా నమ్మకమైన దాసుని తరగతికి మద్దతిస్తున్నారు