కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక విధవరాలు క్రైస్తవ సంఘం నుండి సహాయం పొందాలంటే “ఒక్క పురుషునికే భార్యయై” ఉండాలని పౌలు చెప్పిన మాటలను మనమెలా అర్థం చేసుకోవాలి?​—1 తిమోతి 5:​9.

అపొస్తలుడైన పౌలు, విధవరాలి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, “ఒక్క పురుషునికే భార్య” అనే వాక్యం ఆమె విధవరాలు కాకముందున్న పరిస్థితిని సూచిస్తుండవచ్చు. ఆమె ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకున్న విధవరాలిగా ఉండాలని దానర్థమా? లేక పౌలు మాటలకు వేరే అర్థం ఉండే అవకాశముందా? *

పౌలు ఒక్కసారి మాత్రమే వివాహం చేసుకున్న విధవరాండ్ర గురించి మాట్లాడుతున్నాడని కొందరు భావించారు. నిజమే, అనేక సంస్కృతుల్లో, సమాజాల్లో మళ్లీవివాహం చేసుకోకుండా విధవరాలిగానే నిలిచిపోయే స్త్రీని పతివ్రతగా పరిగణించేవారు. అయితే, ఆ దృక్కోణం, పౌలు మరోచోట చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉంది. ఉదాహరణకు, ఒక విధవరాలు వివాహం చేసుకోకుండా ఉండడంవల్ల సంతోషంగా ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నా, “ఆమె కిష్టమైనవానిని పెండ్లి చేసికొనుటకు స్వతంత్రురాలై యుండునుగాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని ఆయన కొరింథులోని క్రైస్తవులకు స్పష్టం చేశాడు. (1 కొరింథీయులు 7:​39, 40; రోమీయులు 7:​2, 3) అంతేకాక, తిమోతికి రాసిన ఉత్తరంలో పౌలు ఇలా అన్నాడు: ‘పిన్న వయసులో ఉన్న వితంతువులు పెళ్లి చేసుకోవాలనేది నా సలహా.’ (1 తిమోతి 5:​14, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) కాబట్టి, ఒక విధవరాలు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకుంటే ఆమె నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.

కాబట్టి, పౌలు తిమోతికి చెప్పిన మాటలను మనమెలా అర్థం చేసుకోవాలి? “ఒక్క పురుషునికే భార్య” అనే మాట ఈ వచనంలోనే కనిపిస్తుంది. ఆదిమ భాషలో, దానికి అక్షరార్థంగా “ఒకే పురుషునికి భార్య” అని అర్థం. ఆసక్తికరంగా ఈ మాటకూ, పౌలు తన పత్రికల్లో అనేకసార్లు ఉపయోగించిన ‘ఏకపత్నీ పురుషుడు,’ లేక ఆదిమ భాషలో “ఒకే స్త్రీకి భర్త” అనే మాటకూ పోలిక ఉంది. (1 తిమోతి 3:​2, 12; తీతు 1:⁠6) పౌలు క్రైస్తవ పైవిచారణకర్తలకు, పరిచర్య సేవకులకు ఉండాల్సిన అర్హతల గురించి వివరిస్తున్నప్పుడు ఆయన ‘ఏకపత్నీ పురుషుడు’ అనే మాటను ఉపయోగించాడు. సందర్భానుసారంగా ఆ వాక్యానికి ఉన్న అసలు భావం, ఒక పురుషుడు క్రైస్తవ సంఘంలో బాధ్యతలు పొందడానికి అర్హత సంపాదించేందుకు, ఆయన వివాహితుడైతే తన భార్యకు నమ్మకంగా, విశ్వసనీయంగా ఉండడమే కాక నైతికంగా నిందారహితునిగా కూడా ఉండాలన్నదే. * అందువల్ల, 1 తిమోతి 5:⁠9లో ఉన్న మాటకు అదే భావం ఉంది, సంఘం నుండి సహాయం పొందడానికి ఒక విధవరాలు అర్హతపొందాలంటే ఆమె తన భర్త బ్రతికివున్నంత కాలం ఆయనకు నమ్మకంగా ఉన్న అంకిత భావంగల విశ్వసనీయురాలైన భార్యగా ఉండడమే కాక, నైతికంగా నిందారహితురాలిగా కూడా ఉండాలి. పౌలు పేర్కొన్న అదనపు అర్హతలన్నీ అలాంటి విధవరాలికే వర్తిస్తాయి.​—⁠1 తిమోతి 5:​10.

[అధస్సూచీలు]

^ పేరా 3 స్త్రీ ఒకేసారి అనేకమంది పురుషులకు భార్యగా ఉండడమనే పద్ధతి అపొస్తలుని కాలంలోని గ్రీసు రోమన్‌ ప్రపంచంలో ఆమోదించబడేది కాదు. కాబట్టి, పౌలు తిమోతికి దాని గురించి గానీ లేక దానిని అభ్యసిస్తున్నవారికి తీర్పు తీర్చడం గురించి గానీ రాసివుండకపోవచ్చు.

^ పేరా 5 ఈ అంశం గురించిన చర్చ కోసం, కావలికోట, అక్టోబరు 15, 1996, 17వ పేజీ, సెప్టెంబరు 15, 1980 (ఆంగ్లం), 31వ పేజీలోని “పాఠకుల ప్రశ్నలు” అనే శీర్షికలో చూడండి.