ప్రేమగల కాపరులకు వినయంగా లోబడండి
ప్రేమగల కాపరులకు వినయంగా లోబడండి
‘మీపైని నాయకులుగా ఉన్నవారి మాట విని, వారికి లోబడియుండుడి.’—హెబ్రీయులు 13:17.
యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమగల కాపరులు. యెషయా ఇలా ప్రవచించాడు: “ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును . . . గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును; తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.”—యెషయా 40:10, 11.
2 పునరుద్ధరణకు సంబంధించిన ఆ ప్రవచనం, యూదా శేషం సా.శ.పూ. 537లో యూదాకు తిరిగివచ్చినప్పుడు మొదటిసారి నెరవేరింది. (2 దినవృత్తాంతములు 36:22, 23) అది గొప్ప కోరెషు అయిన యేసుక్రీస్తు అభిషిక్త శేషాన్ని 1919లో “మహాబబులోను” నుండి విడిపించినప్పుడు మరోసారి నెరవేరింది. (ప్రకటన 18:2; యెషయా 44:28) ఆయన పరిపాలించేందుకు, గొర్రెలను సమకూర్చి, వాటిని ఆప్యాయంగా చూసుకునేందుకు యెహోవా ‘బాహువుగా’ ఉన్నాడు. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “నేను గొఱ్ఱెల మంచి కాపరిని. . . . నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును.”—యోహాను 10:14, 15.
3యెషయా 40:10, 11లోని ప్రవచనం, యెహోవా తన ప్రజలను ఎంత ఆప్యాయంగా కాస్తాడో నొక్కిచెబుతోంది. (కీర్తన 23:1-6) యేసు కూడా తన భూపరిచర్య కాలంలో తన శిష్యులపట్ల, సాధారణ ప్రజలపట్ల ఎంతో ఆప్యాయంగా శ్రద్ధను కనబర్చాడు. (మత్తయి 11:28-30; మార్కు 6:34) ఇశ్రాయేలు కాపరులు లేదా నాయకులు నిస్సిగ్గుగా తమ మందలను నిర్లక్ష్యంచేస్తూ మోసగిస్తూ చూపించిన కఠినత్వాన్ని యెహోవా, యేసుక్రీస్తులు ద్వేషించారు. (యెహెజ్కేలు 34:2-10; మత్తయి 23:3, 4, 15) యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.” (యెహెజ్కేలు 34:22, 23) ఈ కాలాంతంలో, యెహోవా భూమ్మీది తన సేవకులందరిపై అంటే ఆత్మాభిషిక్త క్రైస్తవులపై, ‘వేరేగొఱ్ఱెలపై’ నియమించిన ‘ఒకే గొఱ్ఱెల కాపరి’ గొప్ప దావీదు అయిన యేసుక్రీస్తే.—యోహాను 10:16.
సంఘానికి అనుగ్రహించబడిన పరలోక ఈవులు
4 యెహోవా భూమ్మీది తన సేవకులపై ‘ఒకే కాపరిగా’ యేసుక్రీస్తును నియమించడం ద్వారా క్రైస్తవ సంఘానికి అమూల్యమైన ఈవిని అనుగ్రహించాడు. పరలోక నాయకుడైన ఈ ఈవిని గురించి యెషయా 55:4లో ఇలా ప్రవచించబడింది: “ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని.” అభిషిక్త క్రైస్తవులు, ‘గొప్పసమూహపు’ సభ్యులు ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి సమకూర్చబడ్డారు. (ప్రకటన 5:9, 10; 7:9) వారంతా ‘ఒకే కాపరియైన’ క్రీస్తుయేసు నాయకత్వం క్రింద ‘ఒకే మందగా,’ అంటే అంతర్జాతీయ సంఘంగా రూపొందారు.
5 యేసు కూడా భూమ్మీది తన సంఘానికి ఒక అమూల్యమైన ఈవిని అనుగ్రహించాడు. అంటే నమ్మకమైన ఉపకాపరులను అనుగ్రహించాడు, వారు యెహోవా, యేసుక్రీస్తులను అనుకరిస్తూ మందను ఆప్యాయంగా చూసుకుంటారు. ఎఫెసులోని క్రైస్తవులకు వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ ప్రేమపూర్వక ఈవిని గురించి మాట్లాడాడు. ఆయనిలా వ్రాశాడు: “అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను. . . . పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు [‘సరిదిద్దబడునట్లు,’ NW] క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.”—ఎఫెసీయులు 4:8, 13.
6 ‘మనుష్యులలోని ఈ ఈవులు,’ మందను ఆప్యాయంగా కాసేందుకు యెహోవా, ఆయన కుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా నియమించిన పైవిచారణకర్తలు లేదా పెద్దలు. (అపొస్తలుల కార్యములు 20:28, 29) మొదట్లో, ఈ పైవిచారణకర్తలందరూ అభిషిక్త క్రైస్తవ పురుషులే. ప్రకటన 1:16, 19లో, అభిషిక్త సంఘంలోని పెద్దల సభల్లో సేవ చేసినవారు క్రీస్తు కుడిచేతిలో అంటే ఆయన అధీనంలోవున్న ‘నక్షత్రాలుగా’ లేదా ‘దూతలుగా’ సూచించబడ్డారు. అయితే ఈ కాలాంతంలో, భూమ్మీదున్న అభిషిక్త పైవిచారణకర్తల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న కారణంగా, సంఘాల్లోని క్రైస్తవ పెద్దల్లో అధికశాతం మంది వేరేగొర్రెలకు చెందినవారే ఉన్నారు. వీరు పరిశుద్ధాత్మ నిర్దేశంలో పరిపాలక సభ ప్రతినిధులచేత నియమించబడ్డారు కాబట్టి, వీరు కూడా మంచి కాపరియైన యేసుక్రీస్తు కుడిచేతి క్రింద (లేదా, ఆయన నిర్దేశం క్రింద) సేవ చేస్తున్నారని చెప్పవచ్చు. (యెషయా 61:5, 6) మన సంఘాల్లోని పెద్దలు సంఘ శిరస్సైన క్రీస్తుకు లోబడతారు కాబట్టి, వారు మన పూర్తి సహకారాన్ని పొందడానికి అర్హులు.—కొలొస్సయులు 1:18.
మాట వినడం, లోబడడం
7 మన పరలోక కాపరులైన యెహోవా దేవుడు, యేసుక్రీస్తు తాము సంఘంలో బాధ్యతాయుత స్థానాల్లో నియమించిన ఉపకాపరుల మాట మనం వినాలని, వారికి లోబడాలని ఆశిస్తున్నారు. (1 పేతురు 5:5) ప్రేరేపణతో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.”—హెబ్రీయులు 13:7, 17.
8 పెద్దల నమ్మకమైన ప్రవర్తనా ఫలాన్ని మనం “తలంచుకొనుచు” లేదా జాగ్రత్తగా పరిశీలిస్తూ అలాంటి విశ్వాస మాదిరులను అనుసరించమని పౌలు మనల్ని ఆహ్వానిస్తున్నాడని గమనించండి. అంతేకాక, ఈ నియమిత పురుషుల మాట విని, వారికి లోబడమని ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. “మాట వినుట” అని ఇక్కడ అనువదించబడిన ఆదిమ గ్రీకు పదం “మామూలు విధేయతకు సంబంధించిన పదం కాదుగానీ, వారి నాయకత్వాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరిస్తున్నామనే అర్థమున్న ‘ఒప్పించబడడం’ అనే అక్షరార్థ భావాన్నిస్తుంది” అని బైబిలు విద్వాంసుడైన ఆర్. టి. ఫ్రాన్స్ వివరిస్తున్నాడు. పెద్దలకు లోబడాలని దేవుని వాక్యం మనకు నిర్దేశిస్తోందనేకాక, వారికి రాజ్య సంబంధ విషయాలపట్ల, మన సంక్షేమంపట్ల శ్రద్ధవుందని కూడా ఒప్పించబడ్డాం కాబట్టే వారికి లోబడుతున్నాం. వారి నాయకత్వాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరించినప్పుడు మనం నిశ్చయంగా సంతోషంగా ఉంటాం.
9 ఫలాని విషయంలో పెద్దల నిర్దేశం సరైనదేనని మనం పూర్తిగా అంగీకరించలేకపోతే అప్పుడేమిటి? అలాంటప్పుడే మనం లోబడాలి. అన్నీ స్పష్టంగావుండి మనకు అంగీకారమైతే విధేయత చూపించడం సులభమే, అయితే ఇవ్వబడిన నిర్దేశం మనకు వ్యక్తిగతంగా అర్థం కాకపోయినా, దానికి తలొగ్గినప్పుడే మనం నిజంగా లోబడుతున్నామని చూపిస్తాం. ఆ తర్వాత అపొస్తలునిగా మారిన పేతురు అలాంటి విధేయతనే చూపించాడు.—లూకా 5:4, 5.
ఇష్టపూర్వకంగా సహకరించేందుకు నాలుగు కారణాలు
10 పైన ఉల్లేఖించబడిన హెబ్రీయులు 13:7, 17లో అపొస్తలుడైన పౌలు మనమెందుకు క్రైస్తవ పైవిచారణకర్తల మాట విని, వారికి లోబడాలనే దానికి నాలుగు కారణాలు ఇస్తున్నాడు. మొదటిది, వారు మనకు ‘దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు.’ ‘పరిశుద్ధులు సరిదిద్దబడేందుకే’ యేసు సంఘాలకు ఈవులను అనుగ్రహిస్తున్నాడని గుర్తుచేసుకోండి. (ఎఫెసీయులు 4:13) నమ్మకమైన ఉపకాపరుల ద్వారా ఆయన తొలిశతాబ్దపు క్రైస్తవుల ఆలోచనను, ప్రవర్తనను సరిదిద్దాడు, ఆ ఉపకాపరుల్లో కొందరు సంఘాలకు పత్రికలు వ్రాసేందుకు ప్రేరేపించబడ్డారు. తొలిక్రైస్తవులను నిర్దేశించేందుకు, బలపర్చేందుకు ఆయన అలాంటి ఆత్మ నియమిత పైవిచారణకర్తలను ఉపయోగించాడు.—1 కొరింథీయులు 16:15-18; 2 తిమోతి 2:2; తీతు 1:5.
11 నేడు, యేసు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ ప్రాతినిధ్యం వహించే పరిపాలక సభ ద్వారా, నియమిత పెద్దల ద్వారా మనకు నిర్దేశమిస్తున్నాడు. (మత్తయి 24:45) “ప్రధాన కాపరి” అయిన యేసుక్రీస్తుపట్ల గౌరవంతో మనం పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని లక్ష్యపెడతాం: “మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేయుడి.”—1 పేతురు 5:4; 1 థెస్సలొనీకయులు 5:12, 13; 1 తిమోతి 5:17.
12 క్రైస్తవ పైవిచారణకర్తలతో సహకరించేందుకున్న రెండవ కారణం వారు “[మన] ఆత్మలను కాయుచున్నారు.” వారికి మన దృక్పథంలో లేదా ప్రవర్తనలో మన ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడేయగలదేదైనా కనబడితే, గలతీయులు 6:1) “కాయుట” అని అనువదించబడిన గ్రీకు పదానికి అక్షరార్థంగా “నిద్రపోకుండా ఉండడం” అని అర్థం. ఒక బైబిలు విద్వాంసుని ప్రకారం అది “కాపరి అవిశ్రాంతంగా ఉండడాన్ని సూచిస్తుంది.” పెద్దలు ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండడమే కాక మన ఆధ్యాత్మిక సంక్షేమంపట్ల తమకున్న శ్రద్ధనుబట్టి వారు నిద్రలేమిని కూడా అనుభవించవచ్చు. “గొఱ్ఱెల గొప్ప కాపరియైన” యేసుక్రీస్తు ఎంతో ఆప్యాయంగా కనబర్చిన శ్రద్ధను అనుకరించేందుకు కృషిచేస్తున్న ప్రేమగల ఉపకాపరులకు మనం ఇష్టపూర్వకంగా సహకరించవద్దా?—హెబ్రీయులు 13:20.
మనల్ని సరిదిద్దేందుకు వారు వెంటనే మనకవసరమైన ఉపదేశమిస్తారు. (13 పైవిచారణకర్తలకు మనం ఇష్టపూర్వకంగా సహకరించేందుకుగల మూడవ కారణం వారు “లెక్క ఒప్పచెప్పవలసినవారివలే” మనల్ని కాయుచున్నారు. పైవిచారణకర్తలు తాము ఉపకాపరులమని, పరలోక కాపరులైన యెహోవా దేవుని క్రింద, యేసుక్రీస్తు క్రింద సేవచేస్తున్నామని గుర్తుంచుకుంటారు. (యెహెజ్కేలు 34:22-24) గొర్రెల యజమాని యెహోవా, ఆయన వాటిని “తన స్వరక్తమిచ్చి [‘కుమారుని రక్తమిచ్చి,’ NW] సంపాదించాడు” కాబట్టి, ‘కనికరంతో’ చూసుకోవాల్సిన మందను నియమిత పైవిచారణకర్తలు కాసే తీరునుబట్టి ఆయన వారిని జవాబుదారులుగా ఎంచుతాడు. (అపొస్తలుల కార్యములు 20:28, 29) కాబట్టి, మనమందరం ఆయన నిర్దేశానికి స్పందించే తీరునుబట్టి యెహోవాకు జవాబుదారులమే. (రోమీయులు 14:10-12) మనం నియమిత పెద్దల మాట వినడం ద్వారా సంఘ శిరస్సైన క్రీస్తుకు లోబడుతున్నామని చూపిస్తాము.—కొలొస్సయులు 2:18.
14 మనం క్రైస్తవ పైవిచారణకర్తలకు ఎందుకు వినయంగా లోబడాలనేదానికి పౌలు నాలుగవ కారణాన్ని ఇస్తున్నాడు. ఆయనిలా వ్రాశాడు: ‘వారు ఆనందముతో కాక, దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము.’ (హెబ్రీయులు 13:17) బోధించడం, కాయడం, ప్రకటనాపనిలో సారథ్యం వహించడం, కుటుంబాన్ని పోషించడం, సంఘ సమస్యలతో వ్యవహరించడంలాంటి బరువైన బాధ్యతలతో క్రైస్తవ పెద్దలు అధిక భారాన్నే మోస్తున్నారు. (2 కొరింథీయులు 11:28, 29) మనం వారికి సహకరించనప్పుడు, మనం వారి భారాన్ని పెంచుతాము. తత్ఫలితంగా వారికి “దుఃఖము” కలుగుతుంది. మనం సహకార స్ఫూర్తిని చూపించకపోవడం యెహోవాకు అసంతోషం కలిగించడమే కాక, మనకది నిష్ప్రయోజనం కాగలదు. బదులుగా, మనం సరైన గౌరవాన్ని, సహకారాన్ని ఇచ్చినప్పుడు, పెద్దలు తమ కర్తవ్యాన్ని ఆనందంగా నెరవేర్చగలుగుతారు, అది ఐక్యతకు, రాజ్య ప్రకటనాపనిలో ఆనందంగా భాగం వహించేందుకు దోహదపడుతుంది.—రోమీయులు 15:5, 6.
లోబడుతున్నామని చూపించడం
15 నియమిత పైవిచారణకర్తలతో సహకరించేందుకు మనకెన్నో ఆచరణాత్మక మార్గాలున్నాయి. క్షేత్రంలోని క్రొత్త పరిస్థితులకు తగ్గట్టుగా ఉండేందుకు, మన దైనందిన కార్యక్రమంలో మార్పులు చేసుకోవలసి వచ్చే రోజుల్లో, సమయాల్లో పెద్దలు క్షేత్ర సేవా కూటాలను నిర్వహించేందుకు ఏర్పాటుచేశారా? ఆ క్రొత్త ఏర్పాట్లకు మద్దతిచ్చేందుకు మనం కృషిచేద్దాం. ఊహించని ఆశీర్వాదాలు మనకు లభించవచ్చు. సేవా పైవిచారణకర్త మన సంఘ పుస్తక అధ్యయన గుంపును సందర్శిస్తున్నాడా? ఆ వారంలో జరిగే ప్రకటనాపనిలో మనకు సాధ్యమైనంత పూర్తిగా భాగం వహించవచ్చు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మనకు నియామకం లభించిందా? ఆ నియామకాన్ని నిర్వహించేలా అక్కడ ఉండేందుకు మనం కృషిచెయ్యాలి. రాజ్య మందిరాన్ని శుభ్రం చేసే పని మన గుంపుదని సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్త ప్రకటించాడా? మన ఆరోగ్యం, బలం అనుమతించిన మేరకు మనమాయనకు పూర్తి మద్దతునిద్దాం. ఈ విధాలుగా, మరి అనేక విధాలుగా, మందను కాసేందుకు యెహోవా ఆయన కుమారుడు నియమించిన పురుషులకు మనం లోబడుతున్నామని చూపిస్తాం.
16 కొన్నిసార్లు ఒక పెద్ద, నమ్మకమైన దాసుడు, అతని పరిపాలక సభ ఇచ్చిన నిర్దేశం ప్రకారం చేయకపోవచ్చు. ఆయన అలా ప్రవర్తిస్తూనేవుంటే, ఆయన “[మన] ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన” యెహోవాకు లెక్క ఒప్పజెప్పవలసి ఉంటుంది. (1 పేతురు 2:25) అయితే కొంతమంది పెద్దల వైఫల్యం లేదా తప్పులు మన ధిక్కార స్వభావాన్ని సమర్థించవు. యెహోవా అవిధేయతను, తిరుగుబాటును అంగీకరించడు.—సంఖ్యాకాండము 12:1, 2, 9-11.
ఇష్టపూర్వక సహకారాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు
17 పైవిచారణకర్తలుగా తాను నియమించిన పురుషులు అపరిపూర్ణులని యెహోవా దేవునికి తెలుసు. అయినప్పటికీ, ఆయన వారిని ఉపయోగించుకుంటున్నాడు, ఆయన తన పరిశుద్ధాత్మ మూలంగా భూమ్మీది తన ప్రజల్ని కాస్తున్నాడు. అటు పెద్దల విషయంలోనూ ఇటు మనందరి విషయంలోనూ ‘ఆ బలాధిక్యము మన మూలమైనది కాక దేవునిదై యుంది.’ (2 కొరింథీయులు 4:7) కాబట్టి మన నమ్మకమైన పైవిచారణకర్తల ద్వారా యెహోవా నెరవేరుస్తున్న దానికి మనమాయనకు కృతజ్ఞతలు చెల్లించడమే కాక, మనం వారికి ఇష్టపూర్వకంగా సహకరించాలి.
18 ఈ అంత్యదినాల్లో తన మందపై పర్యవేక్షణకు నియమించబడిన కాపరులు ఎలావుండాలని యెహోవా వర్ణించాడో ఆ విధంగా ఉండేందుకు పైవిచారణకర్తలు తమ శాయశక్తులా కృషిచేస్తారు. యిర్మీయా 3:15లో ఆ వర్ణన ఇలావుంది: “నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.” మన మధ్యవున్న పెద్దలు యెహోవా గొర్రెలకు బోధిస్తూ, వాటిని కాపాడే పనిని నిశ్చయంగా మెచ్చుకోదగిన రీతిలో చేస్తున్నారు. మనం ఇష్టపూర్వకంగా సహకరించడం ద్వారా, మాట వినడం ద్వారా, లోబడడం ద్వారా వారుచేసే కృషిపట్ల మనం కృతజ్ఞత చూపించడంలో కొనసాగుదాం. అలా చేయడం ద్వారా, మనం మన పరలోక కాపరులైన యెహోవా దేవునిపట్ల, యేసుక్రీస్తుపట్ల మన కృతజ్ఞతను చూపిస్తాం.
పునఃసమీక్ష
• యెహోవా, యేసుక్రీస్తు తాము ప్రేమగల కాపరులమని ఎలా నిరూపించుకున్నారు?
• మాట వినడంతోపాటు, లోబడడం ఎందుకు అవసరం?
• ఏ ఆచరణాత్మక మార్గాల ద్వారా మనం లోబడుతున్నామని చూపించవచ్చు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. యెహోవా, యేసుక్రీస్తు ప్రేమగల కాపరులని ఏ లేఖనాలు చూపిస్తున్నాయి?
3. తన గొర్రెలతో వ్యవహరించే విధానంపట్ల యెహోవా ఎలా ప్రేమపూర్వక శ్రద్ధ కనబరుస్తాడు?
4, 5. (ఎ) యెహోవా భూమ్మీది తన ప్రజలకు ఏ అమూల్యమైన ఈవిని అనుగ్రహించాడు? (బి) యేసు తన సంఘానికి ఏ ఈవిని అనుగ్రహించాడు?
6. పెద్దల సభల్లో సేవచేసిన అభిషిక్త పైవిచారణకర్తలు ప్రకటన 1:16, 19లో ఎలా వర్ణించబడ్డారు, వేరేగొర్రెలకు చెందిన నియమిత పెద్దల గురించి ఏమి చెప్పవచ్చు?
7. క్రైస్తవ పైవిచారణకర్తలపట్ల మన దృక్పథం విషయంలో అపొస్తలుడైన పౌలు ఏ ఉపదేశమిచ్చాడు?
8. మనం దేనిని ‘తలంచుకోవాలని’ పౌలు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనమెలా ‘వారి మాట వినాలి’?
9. మనం మాట వినడమేకాక ‘లోబడడం’ ఎందుకు అవసరం?
10, 11. పైవిచారణకర్తలు తమ తోటి క్రైస్తవులకు ‘దేవుని వాక్యాన్ని’ మొదటి శతాబ్దంలో ఏ విధంగా ‘బోధించారు,’ నేడు ఏ విధంగా ‘బోధిస్తున్నారు’?
12. పైవిచారణకర్తలు ఎలా “[మన] ఆత్మలను కాయుచున్నారు”?
13. పైవిచారణకర్తలు, క్రైస్తవులందరూ ఎవరికి, ఏయే విధాలుగా జవాబుదారులై ఉన్నారు?
14. క్రైస్తవ పైవిచారణకర్తలు “దుఃఖముతో” సేవ చేసేందుకు ఏది కారణమవగలదు, దాని ఫలితాలు ఏమిటి?
15. మాట వింటున్నామని, లోబడుతున్నామని మనమెలా చూపించవచ్చు?
16. ఒక పెద్ద నిర్దేశించబడిన ప్రకారం చేయకపోతే, మనం తిరగబడడాన్ని అదెందుకు సమర్థించదు?
17. మన పైవిచారణకర్తల విషయంలో మన దృక్పథం ఎలా ఉండాలి?
18. మన పైవిచారణకర్తలకు లోబడడం ద్వారా వాస్తవానికి మనమేమి చేస్తున్నాం?
[27వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ పెద్దలు క్రీస్తు నాయకత్వానికి లోబడతారు
[29వ పేజీలోని చిత్రాలు]
యెహోవా నియమించిన కాపరులకు లోబడుతున్నామని చూపించేందుకు చాలా మార్గాలున్నాయి