కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ప్రవచనంలో విశ్వాసం జీవితాన్ని కాపాడుతుంది

బైబిలు ప్రవచనంలో విశ్వాసం జీవితాన్ని కాపాడుతుంది

బైబిలు ప్రవచనంలో విశ్వాసం జీవితాన్ని కాపాడుతుంది

యేసు యెరూషలేములోని ఆలయంలో నుండి చివరిసారి బయటకు వెళ్తుండగా ఆయన శిష్యుల్లో ఒకరు ఇలా అన్నారు: “బోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుము.” ఆ ఆలయం యూదా జనాంగానికి గర్వకారణం, అది వారికెంతో విలువైనది. అయితే, యేసు ఇలా సమాధానమిచ్చాడు: “ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడును.”​—⁠మార్కు 13:⁠1, 2.

ఆ విషయం వారికి నమ్మశక్యం కానిదిగా ఉంది! ఆలయ రాళ్ళలో కొన్ని చాలా పెద్దగా ఉండేవి. అంతేగాక, ఆలయం గురించి యేసు చెబుతున్నది యెరూషలేము నాశనాన్నే కాక, బహుశా ఆ ఆలయం ఆరాధనా కేంద్రంగావున్న యూదా జనాంగ నాశనాన్ని కూడా సూచిస్తుండవచ్చు. కాబట్టి యేసు శిష్యులు ఆయనను ఇంకా ఇలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుము.”​—⁠మార్కు 13:⁠3, 4.

“అంతము వెంటనే రాదు” అని యేసు హెచ్చరించాడు. మొదట, శిష్యులు ఒక స్థలం తర్వాత మరో స్థలంలో యుద్ధాలు, భూకంపాలు, కరవులు, తెగుళ్ళ గురించి వింటారు. ఆ తర్వాత, భయోత్పాత సంఘటనలు యూదా జనాంగాన్ని విపత్కరమైన సంక్షోభంలో పడేస్తాయి, అవును “మహాశ్రమ” ప్రారంభమవుతుంది. అయితే “ఏర్పరచబడినవారిని” అంటే నమ్మకమైన క్రైస్తవులను రక్షించడానికి దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎలా?​—⁠మార్కు 13:⁠7; మత్తయి 24:​7, 21, 22; లూకా 21:​10, 11.

రోముపై తిరుగుబాటు

ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి, యెరూషలేములోని క్రైస్తవులు ఇంకా అంతం కోసం ఎదురుచూస్తున్నారు. రోమా సామ్రాజ్యం యుద్ధాలు, భూకంపాలు, కరవులు, తెగుళ్లతో అతలాకుతలమయ్యింది. (9వ పేజీలోని బాక్సు చూడండి.) యూదయలో పౌర, జాతి పోరాటం సాగుతోంది. అయినప్పటికీ, యెరూషలేము ప్రాకారాల లోపల కొంతమేర ప్రశాంతత నెలకొనివుంది. ప్రజలు ఎప్పటిలాగే తింటున్నారు, పనులు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు. అంత పెద్ద ఆలయం కళ్ళెదుట కన్పిస్తుండడంతో ప్రజల్లో క్షేమంగా, సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడింది.

దాదాపు సా.శ. 61లో, యెరూషలేములోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు నుండి ఒక పత్రిక అందింది. ఆయన వారి సహనాన్ని బట్టి వారిని మెచ్చుకున్నాడు, కానీ సంఘంలోని కొందరిలో అత్యవసర భావం కొరవడుతోందని ఆయన చింతించాడు. కొంతమంది ఆధ్యాత్మికంగా కొట్టుకుపోతున్నారు లేక వారిలో క్రైస్తవ పరిణతి కొరవడింది. (హెబ్రీయులు 2:⁠1; 5:​11, 12) పౌలు వారికిలా ఉద్భోదించాడు: “కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి . . . ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును. . . . నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.” (హెబ్రీయులు 10:​35-38) నిజంగా సమయానుకూలమైన ఉపదేశం! కానీ క్రైస్తవులు విశ్వాసం కలిగివుండి, యేసు ప్రవచన నెరవేర్పు విషయంలో అప్రమత్తంగా ఉంటారా? యెరూషలేము అంతం నిజంగా సమీపించిందా?

తర్వాతి ఐదు సంవత్సరాల్లో, యెరూషలేములోని పరిస్థితులు క్రమేణా క్షీణించిపోయాయి. చివరకు సా.శ. 66లో అవినీతిపరుడైన రోమా అధిపతి ఫ్లోరస్‌ పరిశుద్ధ ఆలయ ధననిధిలో నుండి “పన్ను బకాయిలుగా” 17 తలాంతులను బలవంతంగా వసూలు చేశాడు. యూదులు ఉగ్రులై తిరుగుబాటు లేవదీశారు. యూదా తిరుగుబాటుదారులు లేక జీలట్‌లు యెరూషలేములోకి గుంపులు గుంపులుగా ప్రవేశించి అక్కడున్న రోమా సైన్యాలను వధించారు. ఆ తర్వాత వారు యూదయ రోము నుండి స్వతంత్రమైందని ధైర్యంగా ప్రకటించారు. దానితో యూదయ, రోము ఒకదానితో ఒకటి తలపడ్డాయి!

మూడు నెలల్లోనే, సిరియాపై రోమా అధిపతిగావున్న సెస్టియస్‌ గాలస్‌ యూదా తిరుగుబాటును అణచివేయడానికి 30,000 మంది సైన్యంతో దక్షిణదిశగా ప్రయాణించాడు. అతని సైన్యం పర్ణశాలల పండుగ సమయంలో యెరూషలేముకు చేరుకుని త్వరత్వరగా నగర శివారు ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుపోయింది. తక్కువ సంఖ్యలో ఉన్న జీలట్‌లు ఆలయ కోట లోపల ఆశ్రయం పొందారు. రోమా సైనికులు త్వరలోనే ఆలయ గోడ కూలగొట్టడం ఆరంభించారు. యూదులు బెంబేలెత్తిపోయారు. అన్యమత సైనికులు యూదామత అతిపరిశుద్ధ స్థలాన్ని మలినపర్చబోతున్నారు! అయితే ఆ నగరంలోవున్న క్రైస్తవులు యేసు చెప్పిన ఈ మాటలను గుర్తుతెచ్చుకున్నారు: “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” (మత్తయి 24:​15, 16) వారు యేసు ప్రవచన మాటల్లో విశ్వాసం ఉంచి, తదనుగుణంగా చర్య తీసుకునేలా పురికొల్పబడతారా? తర్వాత పరిస్థితులు మారినట్లుగా, వారు అలా చేయడం పైనే వారి జీవితాలు ఆధారపడ్డాయి. కానీ వారెలా పారిపోతారు?

హఠాత్తుగా, ఏ స్పష్టమైన కారణం లేకుండానే, సెస్టియస్‌ గాలస్‌ తన సైన్యాన్ని తీసుకుని తీరం వైపుగా వెనక్కి వెళ్ళిపోయాడు, జీలట్‌లు ఆగ్రహావేశాలతో వారిని తరుముకుంటూ వెళ్లారు. ఆశ్చర్యకరంగా, నగరంలో శ్రమ తక్కువ చేయబడింది! క్రైస్తవులు యేసు ప్రవచన హెచ్చరికలో తమకున్న విశ్వాసాన్ని చూపిస్తూ యెరూషలేము నుండి యొర్దాను నదికి అవతలివైపున పర్వతాల్లో నెలకొనివున్న తటస్థ నగరమైన పెల్లాకు పారిపోయారు. వారు సరైన సమయంలో తప్పించుకుని పారిపోయారు. త్వరలోనే జీలట్‌లు యెరూషలేముకు తిరిగివచ్చి, మిగిలిన నివాసులను తమతోపాటు తిరుగుబాటులో పాల్గొనమని బలవంతం చేశారు. * ఈలోగా, పెల్లాలో సురక్షితంగా ఉన్న క్రైస్తవులు తర్వాతి పరిణామాల కోసం వేచివున్నారు.

అరాచకత్వంలోకి కూరుకుపోవడం

కొద్దినెలల్లోనే ఒక క్రొత్త రోమా సైన్యం యెరూషలేమువైపు ముందుకుసాగింది. సా.శ. 67లో సైన్యాధిపతియైన వెస్పేసియన్‌ ఆయన కుమారుడు టైటస్‌ 60,000 మంది సైనికులున్న పెద్ద పెద్ద దళాలను నడిపించాడు. తర్వాతి రెండు సంవత్సరాల్లో ఈ మహా సైన్యం తనకు అడ్డువచ్చిన ప్రతిదాన్ని ఛేదించుకుంటూ యెరూషలేము వైపు ముందుకుసాగింది. ఈలోగా, యెరూషలేము లోపల, యూదుల్లోని శత్రుపక్షాలు తమ మధ్య తామే తీవ్రంగా పోరాడుకున్నాయి! నగర ధాన్యాగారాలు నాశనం చేయబడ్డాయి, ఆలయం చుట్టూవున్న భాగం నేలమట్టం చేయబడింది, 20,000 కంటే ఎక్కువమంది యూదులు చంపబడ్డారు. వెస్పేసియన్‌ ఇలా ప్రకటిస్తూ యెరూషలేమువైపు తన ప్రయాణ వేగాన్ని తగ్గించాడు: ‘నాకంటే దేవుడే మంచి రోమా సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు; మన శత్రువులు స్వహస్తాలతో ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు.’

రోమా చక్రవర్తి నీరో మరణించినప్పుడు, వెస్పేసియన్‌ యూదా ముట్టడిని తుదముట్టించే పనిని టైటస్‌కు విడిచిపెట్టి తాను సింహాసనాన్ని దక్కించుకోవడానికి రోముకు వెళ్లిపోయాడు. సా.శ. 70 పస్కా పండుగ సమయంలో టైటస్‌ నగరవాసులు, యాత్రికులు నగరంలో చిక్కుబడేలా చుట్టుముట్టి యెరూషలేమును చేరుకున్నాడు. అతని సైన్యం చుట్టుముట్టిన రాజధాని నగరం చుట్టూ కోసుగా చెక్కిన మొద్దులతో 7 కిలోమీటర్ల కంచె నిర్మించడానికి యూదయ గ్రామీణ ప్రాంతాల్లోని చెట్లను నరికేశారు. ఇది సరిగ్గా యేసు ముందే చెప్పినట్లుగా ఉంది: ‘నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టుదురు.’​—⁠లూకా 19:​43.

త్వరలోనే కరువు నగరాన్ని కుదిపేసింది. సాయుధ గుంపులు చనిపోయినవారి, చనిపోతున్నవారి ఇళ్ళను దోచుకున్నారు. కనీసం ఒక స్త్రీ ఆకలి తట్టుకోలేక తన పసిబిడ్డను చంపుకుని తిని ఈ ప్రవచనం నెరవేరేలా చేసింది: “ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా . . . నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెలయొక్కయు మాంసమును తిందువు.”​—⁠ద్వితీయోపదేశకాండము 28:​53-57.

చివరకు, ఐదు నెలలపాటు ముట్టడించబడిన తర్వాత యెరూషలేము పతనమైంది. ఆ నగరం, దాని మహిమాన్విత ఆలయం దోచుకోబడి, దహించివేయబడ్డాయి, రాయి మీద రాయి నిలువకుండా పడద్రోయబడ్డాయి. (దానియేలు 9:​26) దాదాపు 11,00,000 మంది మరణించారు; మరో 97,000 మంది బానిసలుగా అమ్మివేయబడ్డారు. * (ద్వితీయోపదేశకాండము 28:​68) యూదయలో దాదాపు యూదులే లేకుండా పోయారు. నిజంగా, అంతకు ముందెప్పుడూ అంతపెద్ద నాశనం జరగలేదు, యూదా రాజకీయ, మత, సాంస్కృతిక జీవితంలో అదొక మలుపు రాయి. *

ఈ సమయంలో, పెల్లాలోని క్రైస్తవులు తమను కాపాడినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. బైబిలు ప్రవచనంలో వారి విశ్వాసం వారి జీవితాలనే కాపాడింది!

ఆ సంఘటలను పునరాలోచించుకుంటూ మనలో ప్రతి ఒక్కరం నేడు ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘రానున్న మహాశ్రమలో నా జీవితాన్ని రక్షించుకునే విశ్వాసము నాకుందా? నేను “ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన” వ్యక్తినా?’​—⁠హెబ్రీయులు 10:​39; ప్రకటన 7:​14.

[అధస్సూచీలు]

^ పేరా 10 జీలట్‌లు యెరూషలేముకు తిరిగిరావడానికి ముందు ఏడు రోజులపాటు రోమన్లను తరిమారని యూదా చరిత్రకారుడైన జోసీఫస్‌ నివేదిస్తున్నాడు.

^ పేరా 15 ఒక అంచనా ప్రకారం, రోమా సామ్రాజ్యంలోవున్న యూదులందరిలోకి ఏడింట ఒక వంతుమంది చంపబడ్డారు.

^ పేరా 15 యూదా బైబిలు విద్వాంసుడైన ఆల్ఫ్రెడ్‌ ఎడర్‌షీమ్‌ ఇలా వ్రాశాడు: “ఇశ్రాయేలుకు వచ్చిన [ఈ] శ్రమ దాని భయంకరమైన చరిత్రలో ముందెన్నడూ సంభవించలేదు, రక్తసిక్తమైన దాని భవిష్యత్తు విషాదాల్లో కూడా ఇలాంటిది మరెన్నడూ జరుగదు.”

[9వ పేజీలోని చార్టు]

మొదటి శతాబ్దంలో నెరవేరిన సూచనలోని అంశాలు

యుద్ధాలు:

గాల్‌ (సా.శ. 39-40)

ఉత్తర ఆఫ్రికా (సా.శ. 41)

బ్రిటన్‌ (సా.శ. 43, 60)

అర్మేనియా (సా.శ. 58-62)

యూదయలో పౌర, జాతి పోరాటాలు (సా.శ. 50-66)

భూకంపాలు:

రోము (సా.శ. 54)

పాంపేయీ (సా.శ. 62)

ఆసియా మైనరు (సా.శ. 53, 62)

క్రేతు (సా.శ. 62)

కరవులు:

రోము, గ్రీసు, ఐగుప్తు (సుమారు సా.శ. 42)

యూదయ (సుమారు సా.శ. 46)

తెగుళ్ళు:

బాబిలోనియా (సా.శ. 40)

రోము (సా.శ. 60, 65)

అబద్ధ ప్రక్తలు:

యూదయ (సుమారు సా.శ. 56)

[10వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

పాలస్తీనాలో రోమా సైనిక ముట్టడులు సా.శ. 67-70

తొలెమాయి

గలిలయ సముద్రం

పెల్లా

పెరయ

సమరయ

యెరూషలేము

ఉప్పు సముద్రం

యూదయ

కైసరయ

[చిత్రసౌజన్యం]

మ్యాపు మాత్రమే: Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[11వ పేజీలోని చిత్రం]

‘మన శత్రువులు స్వహస్తాలతో ఒకరినొకరు నాశనం చేసుకుంటున్నారు’​—⁠వెస్పేసియన్‌

[11వ పేజీలోని చిత్రాలు]

సా.శ. 70లో రోమా సైన్యాలు యెరూషలేమును నాశనం చేశాయి

[11వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఉబ్బెత్తు శిల్పం: Soprintendenza Archeologica di Roma; Vespasian: Bildarchiv Preussischer Kulturbesitz/Art Resource, NY