కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శిష్యులను చేసే పని నా జీవితాన్ని తీర్చిదిద్దింది

శిష్యులను చేసే పని నా జీవితాన్ని తీర్చిదిద్దింది

జీవిత కథ

శిష్యులను చేసే పని నా జీవితాన్ని తీర్చిదిద్దింది

లినెట్‌ పీటర్స్‌ చెప్పినది

వాళ్ళు మమ్మల్ని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి వచ్చారు. తుపాకి గురిపెట్టిన వ్యక్తి భవంతి మీద నిలబడివున్నాడు. సైనికులు తుపాకులు ఎక్కుపెట్టి గడ్డి మీద పడుకొని ఉన్నారు. ఆ ఆదివారం ఉదయం నేను, నా తోటి మిషనరీలు, ఆగివున్న హెలికాప్టర్‌ వైపు పరుగులు తీస్తూనే ప్రశాంతంగా ఉండడానికి విశ్వప్రయత్నం చేశాము. కొద్ది క్షణాల్లో హెలికాప్టర్‌ పైకి లేచింది. ఆ తర్వాత, పది నిమిషాల్లో మేము, తీరం దగ్గర లంగరు వేయబడివున్న సైనిక ఓడలోకి సురక్షితంగా చేరుకున్నాము.

మరుసటి ఉదయం, మేము క్రితం రాత్రి తలదాచుకుందామనుకున్న హోటల్‌పై తిరుగుబాటుదారులు బాంబులు వేశారని మాకు తెలిసింది. సియర్రాలియోన్‌లో సంవత్సరాలుగా కొనసాగుతున్న పౌర సంక్షోభం చివరకు పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమించింది. మాతో సహా విదేశీయులందరూ దాదాపు క్షణాల్లో దేశం వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. నేనా పరిస్థితుల్లో ఎందుకున్నానో వివరించడానికి, మొదటి నుండి నన్ను చెప్పనివ్వండి.

నేను, 1966 నుండి గయానా అని పిలువబడుతున్న బ్రిటీష్‌ గయానాలో పెరిగాను. అక్కడ 1950లలో నా తొలి జీవితం చీకూచింతా లేకుండా సంతోషంగా గడిచింది. చాలామంది తల్లిదండ్రులు విద్యను విలువైనదిగా ఎంచేవారు, బడిలో పిల్లలు బాగా చదువుకోవాలని ఆశించేవారు. ఒక బ్యాంకు గుమస్తా ఒకసారి మా నాన్నను ఇలా అడగడం నాకు గుర్తుంది: “మీరు మీ పిల్లల చదువులకు ఎందుకంతగా ఖర్చుచేస్తున్నారు?” నాన్న దానికిలా జవాబిచ్చాడు: “ఉత్తమ విద్య మాత్రమే వారికి విజయాన్ని చేకూరుస్తుంది.” ఉత్తమ విద్యను పేరుపొందిన పాఠశాలల్లోనే పొందాలని అప్పట్లో ఆయన తలంచాడు. అయితే అనతికాలంలోనే ఆయన ఆలోచన మారిపోయింది.

నాకు పదకొండేళ్ళు ఉన్నప్పుడు అమ్మ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించింది. ఆమె ఒక పొరుగింటామెతో రాజ్యమందిరానికి వెళ్ళింది. ఆ రాత్రి వాళ్ళు విన్నదానినిబట్టి, తాము సత్యాన్ని కనుగొన్నామని వాళ్ళిద్దరికీ రూఢీ అయిపోయింది. ఆ తర్వాత, అక్కడ చర్చించబడిన విషయాల గురించి అమ్మ మరో పొరుగింటామెతో మాట్లాడింది. త్వరలోనే వాళ్ళు ముగ్గురు డాఫ్నీ హారీ (ఆ తర్వాత బార్డ్‌) మరియు రోస్‌ కేఫీ అనే మిషనరీలతో అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. సంవత్సరం తిరగకముందే అమ్మ, ఆమె ఇద్దరు స్నేహితురాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్ళకు మా నాన్న సెవెంత్‌ డే అడ్వెంటిస్ట్‌ చర్చి నుండి విడిపోయి యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకున్నాడు.

యౌవనులమైన నేను, నా ఇద్దరు చెల్లెళ్ళు అంటే పదిమంది పిల్లల్లో పెద్దవాళ్ళమైన మేము ముగ్గురం, డాఫ్నీ మరియు రోస్‌ నివసించే మిషనరీ గృహంలో ఎన్నో గంటలు సంతోషంగా గడిపేవాళ్ళం. అలాంటి సందర్భాల్లో వాళ్ళు చెప్పిన క్షేత్ర సేవా అనుభవాలను వినేవాళ్లం. ఇతరుల ఆధ్యాత్మిక సంక్షేమం గురించి అవిశ్రాంతంగా శ్రద్ధ తీసుకోవడంలో ఈ మిషనరీలు ఎంతో ఆనందించేవారు. వారి మాదిరే నాలో మిషనరీని కావాలనే కోరికను నాటింది.

బంధువులు, తోటి విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించుకునేందుకు ఉన్నత విద్య కోసం ప్రాకులాడుతుండగా, పూర్తికాల సేవపై దృష్టినిలపడానికి నాకేమి సహాయం చేసింది? ఆకర్షణీయమైన అవకాశాలు ఎన్నో వచ్చాయి, నేను న్యాయశాస్త్రం, సంగీతం, వైద్యం లేక మరేదైనా చదువుకుని ఉండేదాన్నే. నా తల్లిదండ్రుల చక్కని మాదిరి నాకు అవసరమైన నిర్దేశాన్నిచ్చింది. వాళ్లు సత్యాన్ని తమ జీవితాల్లో అన్వయించుకున్నారు, బైబిలు శ్రద్ధగా అధ్యయనం చేసేవారు, యెహోవా గురించి తెలుసుకోవడానికి అంకితభావంతో ఇతరులకు సహాయం చేసేవారు. * అంతేగాక వారు పూర్తికాల సేవకులను క్రమంగా మా ఇంటికి ఆహ్వానించేవారు. ఈ సహోదర సహోదరీలు పొందుతున్న సంతోషం, సంతృప్తి శిష్యులను చేసే పని నా జీవితాన్ని తీర్చిదిద్దేందుకు అనుమతించాలనే నా కోరికను బలపర్చాయి.

నేను పదిహేనేళ్ళ వయసులో బాప్తిస్మం తీసుకున్నాను. ఉన్నతపాఠశాల విద్య ముగించిన వెంటనే పూర్తికాల పయినీరు సేవ ప్రారంభించాను. హాస్పిటల్లో పనిచేసే ఫిలోమినా అనే స్త్రీ సమర్పించుకొని బాప్తిస్మం తీసుకొనేంతవరకు అభివృద్ధి సాధించడానికి నేను సహాయం చేసినవారిలో మొదటి వ్యక్తి. ఆమె యెహోవాను ప్రేమించడాన్ని చూసి కలిగిన ఆనందం, పూర్తికాల సేవలో కొనసాగాలనే నా కోరికను మరింత బలపర్చింది. ఆ తర్వాత కొద్దికాలానికి, నేను సెక్రటరీగా పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో మరింత మంచి ఉద్యోగం లభించే అవకాశం వచ్చింది. కానీ నేను పయినీరు సేవ కొనసాగించాలని నిశ్చయించుకున్నాను కాబట్టి దాన్ని తిరస్కరించాను.

అప్పటికి నేనింకా ఇంట్లోనే ఉంటున్నాను, మిషనరీలు మా దగ్గరికి వస్తూనే ఉన్నారు. వాళ్ళ అనుభవాలు విని నేనెంతగా ఆనందించేదాన్నో! మిషనరీని కావాలనే నా కోరిక నెరవేరడం అసాధ్యమేమో అనిపించినా, ఇదంతా నా కోరికను మరింత బలపర్చింది. మిషనరీలు అప్పట్లో గయానాకు పంపించబడేవారు, ఇప్పటికీ పంపించబడుతున్నారు. 1969లో ఒకరోజు, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరవమంటూ ఆహ్వానం అందడంతో నేను ఆశ్చర్యపోయాను, అయితే నాకు ఎంతో ఆనందం కూడా కలిగింది.

నేను ఊహించని నియామకం

గిలియడ్‌ 48వ తరగతిలో 21 దేశాల నుండి వచ్చిన 54 మంది విద్యార్థులున్నారు. పదిహేడుమందిమి అవివాహిత సహోదరీలం. ఆ తరగతి 37 సంవత్సరాల క్రితం జరిగినా, ఆ ఐదునెలల్లో జరిగిన విషయాలు నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. నేర్చుకోవలసింది ఎంతో ఉంది, లేఖన సత్యాలే కాదుగానీ భవిష్యత్తులో మిషనరీలుగా జీవించడానికి అవసరమైన ఆచరణీయ సలహాలు, ఉపదేశం కూడా ఉన్నాయి. ఉదాహరణకు, నేను నిర్దేశాన్ని అనుసరించడం, ఫ్యాషన్ల విషయంలో సమతుల్యత కలిగివుండడం, అననుకూల పరిస్థితుల్లో కూడా పట్టుదలతో కొనసాగడం వంటివి నేర్చుకున్నాను.

మా తల్లిదండ్రులు క్రమంగా కూటాలకు వెళ్ళడాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవారు. ఆదివారం కూటాలకు రాలేనంతగా ఒంట్లో బాగోలేదని సాకుచెప్పే వారిని సోమవారం పియానో లేదా సంగీత కార్యక్రమాలకు వెళ్ళనిచ్చేవారుకాదు. అయితే, గిలియడ్‌ పాఠశాలలో కొంతకాలంపాటు నేను కూటాలకు అంత క్రమంగా వెళ్లలేదు. ఒక శుక్రవారం సాయంకాలం, కూటాలకు తమ వాహనంలో నన్ను తీసుకెళ్లే బెతెల్‌ జంట డాన్‌ మరియు డొలొరస్‌ ఆడమ్స్‌ ఎదుట నన్ను నేను సమర్థించుకోవడానికి ప్రయత్నించాను. ఎంతో హోంవర్క్‌ ఉంటుంది, అందులో రిపోర్ట్‌లు కూడా తయారుచేసుకోవాలి! దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు, సేవాకూటానికి రావడానికి నాకింకా సమయం ఎక్కడుంటుంది? సహోదరుడు ఆడమ్స్‌ నాతో కాసేపు తర్కించిన తర్వాత ఇలా అన్నాడు: “నీ మనస్సాక్షి నిన్ను నిర్దేశించనివ్వు.” నేను ఆయన సలహా పాటించి, అప్పటినుండి ఆ రోజే కాదు మరెప్పుడూ కూటాలకు వెళ్లకుండా ఉండలేదు. గడిచిన సంవత్సరాల్లో మరీ ఎంతో కష్టమైన పరిస్థితుల్లో తప్ప, క్రైస్తవ కూటాలకు వెళ్ళకుండా నన్ను ఏదీ అడ్డగించనివ్వలేదు.

తరగతి సగం అయిపోయాక, విద్యార్థులు తమ నియామకాల గురించి మాట్లాడుకునేవారు. నేను నా మనసులో, నన్ను గయానాకే పంపిస్తారని అనుకునేదాన్ని, అక్కడ ప్రకటనాపనిలో సహాయం చేయవలసిన అవసరత ఎంతో ఉంది. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళబోవడంలేదని తెలుసుకుని ఎంత ఆశ్చర్యపోయానో ఊహించండి. బదులుగా, నేను పశ్చిమాఫ్రికాలోని సియర్రాలియోన్‌కు నియమించబడ్డాను. ఇంటికి దూరంగా మిషనరీగా ఉండాలనే నా కోరిక చివరకు నెరవేరినందుకు నేను యెహోవాకు ఎంత కృతజ్ఞురాలినో కదా!

నేర్చుకోవలసింది ఎంతో ఉంది

“రమణీయం!” ఎన్నో కొండలు, పర్వతాలు, ఆఖాతాలు, సముద్రతీరాలు ఉన్న సియర్రాలియోన్‌ను చూసిన వెంటనే నాకు కలిగిన మొట్టమొదటి భావన అదే. అయినా, పశ్చిమాఫ్రికాలోని ఈ దేశపు అసలు అందం దాని నివాసులు, వీరు విదేశీయులు సహితం హృదయపూర్వకంగా ఆహ్వానించబడుతున్నట్లు భావించేలా ప్రేమను, దయను వ్యక్తం చేస్తారు. క్రొత్త మిషనరీలు ఇంటిమీద బెంగపెట్టుకోకుండా ఉండడంలో ఇదెంతగానో దోహదపడుతుంది. సియర్రాలియోన్‌ వాసులకు తమ ఆచారాల గురించి, సాంప్రదాయం గురించి మాట్లాడడమన్నా, ప్రాముఖ్యంగా ఆ దేశ వ్యవహార భాషయైన క్రియో భాష నేర్చుకునేందుకు క్రొత్తవారికి సహాయం చేయడమన్నా ఎంతో ఇష్టం.

క్రియో భాష మాట్లాడే ప్రజలమధ్య ఎన్నో సామెతలు వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు, కోతులు పనిచేస్తాయి, కొండముచ్చులు తింటాయి అనే సామెత ఉంది, అంటే ఎప్పుడూ విత్తినవారే కోయరని భావం. లోకంలో విస్తృతంగా జరుగుతున్న అన్యాయాన్ని అదెంత సరిగ్గా వర్ణిస్తుందో కదా!​—⁠యెషయా 65:​22.

ప్రకటనాపని, శిష్యులనుచేసే పని ఆనందాన్నిచ్చేది. బైబిలుపట్ల ఆసక్తి చూపించనివారు కనిపించడం అరుదు. గడిచిన అనేక సంవత్సరాల్లో, మిషనరీలు, ఎంతోకాలంగా యెహోవా సేవచేస్తున్నవారు అన్ని రంగాలకు అన్ని జాతులకు చెందిన పెద్దవారికి, చిన్నవారికి సత్యాన్ని హత్తుకునేందుకు సహాయం చేశారు.

మిషనరీ సేవలో నా మొదటి సహచరిణి అయిన ఎర్లా సెయింట్‌ హిల్‌ అవిశ్రాంతంగా పనిచేస్తుంది. మిషనరీ గృహం గురించి శ్రద్ధ తీసుకోవడంలో ఆమె ఎంతో ఆసక్తి కనపర్చేది, పరిచర్యలో అంతకంటే ఎక్కువ ఆసక్తి చూపించేది. ఇరుగుపొరుగువారితో పరిచయం ఏర్పరచుకోవడం, అనారోగ్యంతో బాధపడుతున్న సాక్షులను, ఆసక్తిగలవారిని దర్శించడం, సాధ్యమైనచోట అంత్యక్రియల ఏర్పాట్లలో సహాయం చేయడం వంటి ఎన్నో పనుల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఆమె నాకు సహాయం చేసింది. క్షేత్రసేవ ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో నివసిస్తున్న సహోదర సహోదరీలను కొద్దిసేపే అయినా తప్పక పలకరించి వెళ్ళడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆమె నాకు నేర్పింది. ఇలా చేయడం వల్ల త్వరలోనే నాకు తల్లులు, సహోదరులు, సహోదరీలు, స్నేహితులు లభించారు, నా నియామక క్షేత్రమే నా స్వగృహమైపోయింది.​—⁠మార్కు 10:29, 30.

నాతోపాటు సేవ చేసిన చక్కని మిషనరీలతో పటిష్ఠమైన స్నేహబంధాలను కూడా నేను పెంపొందించుకున్నాను. వారిలో, నా గదిలో ఉండిన అడ్నా బిర్డ్‌ ఒకరు, ఈమె 1978 నుండి 1981 మధ్యకాలంలో సియర్రాలియోన్‌లో సేవచేసింది, మరొకరు చెరిల్‌ ఫెర్గూసన్‌, గత 24 సంవత్సరాలుగా మేమిద్దరం ఒకే గదిలో ఉంటున్నాం.

పౌరయుద్ధం మూలంగా పరీక్షలు

1997లో, అంటే సియర్రాలియోన్‌లో క్రొత్త బ్రాంచి భవనాల ప్రతిష్ఠాపన తర్వాత దాదాపు ఒక నెలకు, ముందు చెప్పినట్లుగా, యుద్ధం మూలంగా మేము దేశం వదిలివెళ్ళవలసి వచ్చింది. దానికి ఆరు సంవత్సరాల ముందు, లైబీరియాలోని యుద్ధాన్ని తప్పించుకునేందుకు సియర్రాలియోన్‌కు పారిపోయివచ్చిన లైబీరియా సాక్షుల విశ్వాసం చూసి మేము అబ్బురపడ్డాము. కొందరైతే ఏమి తీసుకోకుండా వచ్చేశారు. పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, వాళ్ళు ప్రతీరోజు పరిచర్యలో పాల్గొనేవారు. యెహోవాపట్ల, ప్రజలపట్ల వారికున్న ప్రేమ మమ్మల్ని కదిలించింది.

ఇప్పుడు మేమే గినియా దేశంలో శరణార్థులుగా ఉన్నాం కాబట్టి, లైబీరియా సహోదరుల మాదిరిని అనుసరిస్తూ యెహోవాపై నమ్మకం ఉంచి, రాజ్య సంబంధ విషయాలకు మొదటి స్థానమిచ్చాం. ఒక సంవత్సరం తర్వాత, మేము సియార్రాలియోన్‌కు తిరిగి రాగలిగాము, కానీ ఏడు నెలల్లోనే యుద్ధం ప్రారంభమై మేము మరోసారి వెంటనే గినియాకు వెళ్ళిపోవలసి వచ్చింది.

పోరాడుతున్న వర్గాల్లో ఒక వర్గంవారు కిస్సీలోవున్న మా మిషనరీ గృహం ఆక్రమించారని, మా వస్తువులన్నీ దోచుకున్నారని లేక నాశనం చేశారని మాకు తెలిసింది. నిరుత్సాహపడే బదులు, బ్రతికి ఉన్నందుకు మేము కృతజ్ఞులమని భావించాం. మా దగ్గర కొన్ని వస్తువులే ఉన్నా మేము సర్దుకుపోగలిగాము.

మేము రెండవసారి దేశం వదిలి వెళ్ళిన తర్వాత, నాతోపాటు ఉండే చెరిల్‌, నేను గినియాలో ఉండిపోయాము. అంటే మేము ఫ్రెంచ్‌ నేర్చుకోవాలి. నా తోటి మిషనరీల్లో కొందరు తాము నేర్చుకున్న ఫ్రెంచ్‌ భాషను వెంటనే ఉపయోగించడం మొదలుపెట్టారు, వాళ్ళు తమ తప్పుల గురించి అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ నాకు మాత్రం తప్పులు మాట్లాడడం ఇష్టం లేదు, అందుకే నేను మరీ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే ఫ్రెంచ్‌ మాట్లాడేదాన్ని. ఎంతో బాధనిపించేది. ఇతరులు యెహోవా గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడానికే నేను గినియాలో ఉన్నానని నాకు నేను రోజూ గుర్తుతెచ్చుకునేదాన్ని.

నేను అధ్యయనం చేయడం ద్వారా, భాష బాగా మాట్లాడేవారు చెప్పేది వినడం ద్వారా, నిర్భయంగా మాట్లాడే సంఘంలోని పిల్లల సహాయాన్ని తీసుకోవడం ద్వారా మెల్లగా అభివృద్ధి సాధించాను. ఆ తర్వాత అనుకోకుండా, యెహోవా సంస్థ నుండి సమయోచిత సహాయం లభించింది. సెప్టెంబరు 2001 నుండి మన రాజ్య పరిచర్య వివిధ మత విశ్వాసాలకు చెందిన ప్రజలకు పుస్తకాలు, బ్రోషుర్లు అందించడంలోనే కాక, పత్రికలు అందించడంలో కూడా సూచనలు అందజేసింది. నేను మాతృభాషలో వ్యక్తం చేసినంత స్పష్టంగా కాకపోయినా, ఇప్పుడు నేను పరిచర్యలో పాల్గొన్నప్పుడు మరింత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను.

పెద్ద కుటుంబంలో పెరగడం అనేకమందితో అంటే ఒక్కోసారి 17 మందితో సర్దుకుపోవడంలో నాకు సహాయం చేసింది. నేను మిషనరీ సేవ చేసిన 37 సంవత్సరాల్లో, నేను 100కంటే ఎక్కువమంది మిషనరీలతో కలిసి నివసించాను. అందరికీ విభిన్న వ్యక్తిత్వాలున్నా ఒకే సంకల్పం కోసం కలిసి పనిచేస్తున్న అంతమందితో పరిచయం ఏర్పడడం ఎంతటి ఆధిక్యతో కదా! దేవునితో కలిసి పనిచేయడం, ప్రజలు బైబిలు సత్యాన్ని హత్తుకోవడాన్ని చూడడం ఎంతటి ఆనందాన్నిచ్చాయో!​—⁠1 కొరింథీయులు 3:⁠9.

గడిచిన సంవత్సరాల్లో నేను నా చెల్లెళ్ళ తమ్ముళ్ళ వివాహాలు వంటి మా కుటుంబ సభ్యులకు సంబంధించిన అనేక ముఖ్యమైన సందర్భాలకు వెళ్ళలేకపోయాను. నా తోబుట్టువుల పిల్లలతో నేను కోరుకున్నంత సమయం గడపలేకపోయాను. అది నాకు, మిషనరీ పనిలో ఉండమని నిస్వార్థంగా నన్ను ప్రోత్సహించిన నా కుటుంబానికి పెద్ద త్యాగమే.

అయినప్పటికీ, ఇంటికి వెళ్ళలేక నేను పోగొట్టుకున్న దాన్ని మిషనరీ సేవలో ఉండగా ఒకసారి కాకపోతే మరోసారి పొందాను. నేను అవివాహితగా ఉండాలని నిర్ణయించుకున్నా, నాకు చాలామంది ఆధ్యాత్మిక పిల్లలున్నారు, నేను బైబిలు అధ్యయనం చేసినవారే కాదు, నాకు సన్నిహితమైనవారు కూడా వారిలో ఉన్నారు. అంతేగాక, వాళ్ళ పిల్లలు పెద్దవారై వివాహాలు చేసుకుని పిల్లల్ని కని వాళ్ళను సత్యమార్గంలో పెంచడాన్ని చూశాను. నాలాగే, వారిలో కొందరు, శిష్యులను చేసేపని తమ జీవితాలను కూడా తీర్చిదిద్దేందుకు అనుమతించారు.

[అధస్సూచి]

^ పేరా 9 మా అమ్మ 25 సంవత్సరాలకంటే ఎక్కువకాలంపాటు పయినీరు సేవ చేసింది, మా నాన్న ఉద్యోగవిరమణ పొందిన తర్వాత సహాయ పయినీరు సేవచేశాడు.

[15వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

నాకు పశ్చిమాఫ్రికాలోని సియర్రాలియోన్‌కు నియామకం లభించింది

గినియా

సియర్రాలియోన్‌

[13వ పేజీలోని చిత్రం]

నా చెల్లెళ్ళిద్దరు, నాతోపాటు 1950లలో మిషనరీలతో కలిసి ఎన్నో గంటలు సంతోషంగా గడిపారు

[14వ పేజీలోని చిత్రం]

గిలియడ్‌ 48వ తరగతిలోని తోటి విద్యార్థులతో

[16వ పేజీలోని చిత్రం]

సియర్రాలియోన్‌లోని క్రొత్త బ్రాంచి వసతుల ప్రతిష్టాపన