కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏడ్రియానా కోరిక

ఏడ్రియానా కోరిక

ఏడ్రియానా కోరిక

అమెరికాలోని ఓక్లహామాలోవున్న తుల్సాకు చెందిన ఆరేళ్ల ఏడ్రియానాకు ఒక కోరిక ఉండేది. “యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను” అని పాడిన కీర్తనకర్తయైన దావీదు కోరికతో ఆమె కోరికను పోల్చవచ్చు.​—⁠కీర్తన 27:⁠4.

ఏడ్రియానాకు కేవలం 6 నెలలున్నప్పుడు న్యూరోబ్లాస్టోమా అంటే నాడీవ్యవస్థలోని భాగాల్లో పెరిగే అపాయకరమైన కంతి ఉన్నట్లు తేలింది. ప్రాణాంతకమైన ఆ వ్యాధివల్ల ఆమె కాళ్ళకు పక్షవాతం వచ్చింది. ఆమెకు చాలా శస్త్రచికిత్సలు, ఒక సంవత్సరం పాటు కీమోథెరపీ (రసాయన చికిత్స) చేసి వైద్యులు ఆమె వ్యాధికి చికిత్స చేశారు.

ఏడ్రియానా, ఆమె తల్లి అనుసరించే మతానికి చెందని ఆమె తండ్రి, తన కుమార్తెను ప్రపంచ ప్రఖ్యాత అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి తీసుకువెళ్ళమని ఒక ధర్మ సంస్థను కోరాడు. దానికి అనుమతించేముందు ఆ సంస్థ ఏడ్రియానాను కలుసుకుంది. తనను పరిగణలోనికి తీసుకున్నందుకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసి, ఆ పార్కుకి తీసుకువెళ్లే బదులు యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు కేంద్రమైన న్యూయార్క్‌లోవున్న బెతెల్‌కు తీసుకెళ్లమని కోరింది. తన తండ్రి కోరినదానిని తెలుసుకున్న తర్వాత బెతెల్‌ చూసే అవకాశం తనకు కల్పించమని ఏడ్రియానా యెహోవాకు ప్రార్థించింది. బెతెల్‌ని చిన్నపిల్లలు అంతగా ఇష్టపడరని ఆ సంస్థ మొదట్లో అనుకున్నా, ఆమె అభీష్టాన్ని ఆమె తండ్రి నిరాకరించలేదు కాబట్టి బెతెల్‌కి వెళ్లేందుకు అనుమతించింది.

ఏడ్రియానా తన తల్లి, అక్క, స్నేహితురాలతో కలిసి మొదటిసారిగా బెతెల్‌ని చూడడానికి న్యూయార్క్‌కు వెళ్లింది. “యెహోవా నా ప్రార్థనలను విన్నాడు. ఆయన నాకు బెతెల్‌ని సందర్శించే అవకాశమిస్తాడని తెలుసు. పుస్తకాలు, పత్రికలు, బైబిళ్ళు ముద్రించబడడాన్ని నేను చూశాను. అమ్యూజ్‌మెంట్‌ పార్కు కన్నా ఇది చాలా బావుంది” అని ఏడ్రియానా అంటోంది.

ఏడ్రియానా “యెహోవా ప్రసన్నతను” చూసింది అంటే, నేడు యెహోవా ప్రజల కార్యకలాపాలు నిర్వహించబడే కేంద్రానికి వెళ్ళి అక్కడ జరుగుతున్న పనుల్ని ప్రశంసాపూర్వకంగా చూసి వచ్చింది. బెతెల్‌ని సందర్శించడానికి మీరు కూడా ఆహ్వానించబడుతున్నారు. న్యూయార్క్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంతోపాటు, ప్రపంచంలోని వివిధ దేశాల్లో బ్రాంచి కార్యాలయాలు ఉన్నాయి.