కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రూరత్వం ఎప్పటికైనా అంతమౌతుందా?

క్రూరత్వం ఎప్పటికైనా అంతమౌతుందా?

క్రూరత్వం ఎప్పటికైనా అంతమౌతుందా?

నే డు లోకంలో క్రూరత్వం ఉండడానికి స్వార్థమే ముఖ్య కారణమని చాలామంది వెంటనే అంగీకరిస్తారు. స్వార్థపూరిత జీవనశైలికి ప్రాధాన్యత పెరిగినందువల్ల స్వార్థపరులే ఎక్కువగా ఉన్న సమాజం ఏర్పడింది. తమకు కావాల్సింది సంపాదించుకునేందుకు చాలామంది ఏమి చేయడానికైనా వెనకాడడంలేదు, అది తరచూ క్రూరమైన కృత్యాలకు పాల్పడడానికి దారితీస్తోంది. కేవలం ఆ యా వ్యక్తులే కాక, అన్ని దేశాలూ క్రూరత్వానికి పాల్పడుతున్నాయి.

తోటి మానవుల జీవితాలకు ఇప్పుడు విలువే లేకుండా పోయింది. క్రూరంగా ప్రవర్తించడంలో ఆనందించేవారు కూడా ఉన్నారు. కేవలం సరదా కోసం ఇతరులకు హాని తలపెడతామని ఒప్పుకునే నేరస్థులకు అనిపించినట్లే వారికది వినోదభరితంగా అనిపిస్తుంది. అనేకమంది హింస, క్రూరత్వం ఉన్న సినిమాలను ఇష్టపడుతున్నారు కాబట్టి లాభాలు గడించేందుకు సినీ పరిశ్రమ అలాంటి కథాంశాలమీద చిత్రాలు తీస్తున్న మాటేమిటి? వినోద కార్యక్రమాల్లో, సమాచార మాధ్యమాల్లో అతి క్రూరమైన కృత్యాలను పదేపదే చూడడంవల్ల చాలామంది కఠినంగా తయారౌతారు.

క్రూర ప్రవర్తనకు బలైనవారు సాధారణంగా మానసిక, భావోద్రేక సమస్యలను ఎదుర్కొంటారు, వారు ఇతరులతో అదే విధంగా ప్రవర్తించడానికి మొగ్గుచూపుతారు. క్రూరత్వంవల్ల ఉత్పన్నమయ్యే హింస గురించి మాట్లాడుతూ నేషనల్‌ ఒటోనమస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెక్సికోలో బోధించే నోయిమీ డియాస్‌ మారోకెన్‌ ఇలా చెబుతోంది: “మనం హింసా ప్రవృత్తిని నేర్చుకుంటున్నాం, అది మన సంస్కృతిలో భాగమై పోయింది. . . . మన చుట్టూవున్న వాతావరణం దానిని అనుమతించి ప్రోత్సహించినప్పుడు మనం హింసాయుతంగా ప్రవర్తించడాన్ని నేర్చుకుంటాం.” కాబట్టి, గతంలో హింసకు గురైనవారు కొంతకాలానికి ఇతరులను హింసించేవారిగా తయారుకావచ్చు, బహుశా వారు తాము హింసించబడిన రీతుల్లోనే ఇతరులను హింసించవచ్చు.

ఇతర సందర్భాల్లో, మద్యపానం అతిగా సేవించేవారు, మాదకద్రవ్యాలను వాడేవారు కూడా క్రూరులుగా తయారుకావచ్చు. ప్రజల అవసరాలను తీర్చని ప్రభుత్వంతో అసంతృప్తి చెందిన వ్యక్తులను తక్కువ అంచనా వేయకూడదు. వారిలో కొందరు తమ అభిప్రాయాలను తెలియజేయాలనే దృఢనిశ్చయంతో క్రూరమైన కృత్యాలకు పాల్పడి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ తరచూ అమాయకులను బలిగొంటున్నారు.

అయితే, ‘మానవులు క్రూరంగా ప్రవర్తించడాన్ని స్వయంగా నేర్చుకున్నారా? ప్రస్తుత పరిస్థితికి కారణాలేమిటి?’ అని మీరు ఆలోచించవచ్చు.

క్రూరత్వానికి అసలు కారకుడు ఎవరు?

అపవాదియైన సాతాను ప్రభావం ఈ ప్రపంచంమీద బలీయంగా ఉందని, అతడు “ఈ యుగ సంబంధమైన దేవత” అని బైబిలు చెబుతోంది. (2 కొరింథీయులు 4:⁠4) అతడు ఈ విశ్వంలోనే అతి స్వార్థపూరితుడైన, అతి క్రూరుడైన వ్యక్తి. అందుకే యేసు అతణ్ణి “నరహంతకుడు” అని “అబద్ధమునకు జనకుడు” అని సరిగానే వర్ణించాడు.​—⁠యోహాను 8:​44.

మొదటి మానవ జంట అయిన ఆదాముహవ్వలు అవిధేయులైనప్పటి నుండే మానవజాతిమీద సాతాను ప్రభావం బలీయంగా ఉంది. (ఆదికాండము 3:​1-7, 16-19) మొదటి మానవ జంట యెహోవాను తిరస్కరించిన దాదాపు 15 శతాబ్దాల తర్వాత, తిరుగుబాటుదారులైన దేవదూతలు మానవ శరీరాలు ధరించి స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని నెఫీలులని పిలవబడే సంకరజాతి పిల్లలను కన్నారు. వారి విలక్షణ గుణాలేమిటి? వారి పేరే దానికి జవాబిస్తుంది. వారి పేరుకు “బలత్కారులు” లేక కూలద్రోసేవారు అని భావం. ఈ బలత్కారులు లేదా హింసాప్రవృత్తిగల వ్యక్తులు లోకంలో నింపిన క్రూరత్వాన్ని, అనైతికతను దేవుడు తీసుకువచ్చే జలప్రళయం మాత్రమే అంతమొందించగలదు. (ఆదికాండము 6:​4, 5, 17, అధస్సూచి) నెఫీలులు జలప్రళయంలో సమూలంగా నాశనం చేయబడినప్పటికీ, వారి తండ్రులు అదృశ్య దయ్యాలుగా ఆత్మసంబంధ లోకానికి తిరిగివెళ్లారు.​—⁠1 పేతురు 3:​19, 20.

తిరుగుబాటుదారులైన దేవదూతల క్రూరత్వం యేసు కాలంలో దయ్యం పట్టిన బాలుని విషయంలో స్పష్టమౌతుంది. దయ్యము ఆ బాలుణ్ణి విలవిలలాడిస్తూ, వానిని నాశనం చేయడానికి పదేపదే అగ్నిలో నీళ్లలో పడద్రోసేది. (మార్కు 9:​17-22) స్పష్టంగా, అలాంటి “దురాత్మల సమూహము,” తమ క్రూర ప్రధానాధిపతి అయిన అపవాదియగు సాతాను కర్కశ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.​—⁠ఎఫెసీయులు 6:​12.

నేడు కూడా దయ్యాల ప్రభావంవల్ల మానవులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు, బైబిలు దాని గురించి ఇలా ప్రవచించింది: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు . . . బింకములాడువారు అహంకారులు . . . కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”​—⁠2 తిమోతి 3:​1-5.

క్రీస్తుయేసు, 1914లో దేవుని రాజ్యాన్ని స్థాపించిన తర్వాత సాతాను, అతని దయ్యాల సమూహం పరలోకం నుండి పడద్రోయబడ్డారు కాబట్టి, ప్రత్యేకంగా మన కాలం ఎంతో అపాయకరంగా ఉంటుందని బైబిలు ప్రవచనాలు వెల్లడిచేస్తున్నాయి. బైబిలు ఇలా ప్రకటిస్తోంది: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”​—⁠ప్రకటన 12:​5-9, 12.

పరిస్థితి మెరుగుపడే అవకాశమేలేదని దాని భావమా? చెడు ప్రవర్తనను “ప్రజలు విడిచిపెట్టగలరు” అని మునుపు ప్రస్తావించబడిన డియాస్‌ మారోకెన్‌ పేర్కొంది. అయితే సాతాను ప్రభావం నేడు భూమిని ఆవరించివుంది. కాబట్టి, ఒక వ్యక్తి తన ఆలోచనా, ప్రవర్తనా విధానాన్ని భిన్నమైన, మరి శ్రేష్ఠమైన శక్తి ప్రభావితం చేయడానికి అనుమతిస్తే తప్ప దానిని విడిచిపెట్టలేకపోవచ్చు. ఆ శక్తి ఏమిటి?

మార్పులు ఎలా చేసుకోవచ్చు?

సంతోషకరంగా, దేవుని పరిశుద్ధాత్మ ఉనికిలో ఉన్న అత్యంత బలమైన శక్తి కాబట్టి, అది దయ్యాల సంబంధమైన ఎలాంటి ప్రభావాన్నైనా అధిగమించగలదు. అది మానవుల్లో ప్రేమను పెంపొందిస్తుంది, వారి సంక్షేమానికి తోడ్పడుతుంది. దేవుని ఆత్మతో నింపబడాలంటే, యెహోవాను సంతోషపెట్టాలని కోరుకునే ప్రతీ ఒక్కరూ క్రూరత్వాన్ని పోలిన ప్రవర్తనకు దూరంగా ఉండాలి. క్రూరత్వానికి దూరంగా ఉండాలంటే దేవుని చిత్తానికి అనుగుణంగా తమ వ్యక్తిత్వాన్ని మలచుకోవాలి. ఆ చిత్తమేమిటి? మనం సాధ్యమైనంతవరకు దేవుని విధానాన్ని అనుకరించడమే ఆ చిత్తం. అంటే, మనం కూడా ఇతరులను దేవుడు దృష్టిస్తున్నట్లే దృష్టించాలి.​—⁠ఎఫెసీయులు 5:​1, 2; కొలొస్సయులు 3:​7-10.

దేవుని వ్యవహార విధానాన్ని అధ్యయనం చేస్తే, యెహోవా ఎన్నడూ ఇతరులపట్ల ఉదాసీనత కనబరచలేదనే నమ్మకం మీకు కలుగుతుంది. ఆయన ఏ మానవునితో అన్యాయంగా వ్యవహరించలేదు, అంతెందుకు ఏ జంతువుకు కూడా ఆయన అన్యాయం చేయలేదు. * (ద్వితీయోపదేశకాండము 22:​10; కీర్తన 36:⁠7; సామెతలు 12:​10) ఆయన క్రూరత్వాన్నీ, క్రూరంగా ప్రవర్తించేవారందరినీ వ్యతిరేకిస్తాడు. (సామెతలు 3:​31, 32) క్రైస్తవులు నూతన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని యెహోవా కోరుతున్నాడు, దానిని పెంపొందించుకోవడం ద్వారా వారు ఇతరులను యోగ్యులుగా ఎంచుతూ వారిని గౌరవించగలుగుతారు. (ఫిలిప్పీయులు 2:​2-4) ఆ నూతన క్రైస్తవ వ్యక్తిత్వంలో ‘జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము’ వంటి గుణాలు పెంపొందించుకోవడం ఇమిడివుంది. ప్రేమ “పరిపూర్ణతకు అనుబంధమైన[ది]” కాబట్టి మరింత ప్రాముఖ్యంగా దానిని పెంపొందించుకోవాలి. (కొలొస్సయులు 3:​12-14) ప్రజల్లో అలాంటి గుణాలు ఎక్కువగా ఉన్నట్లైతే లోకం ఎంతో భిన్నంగా ఉంటుందని మీరు అంగీకరించరా?

అయితే, వ్యక్తిత్వంలో శాశ్వత మార్పులు చేసుకోవడం నిజంగా సాధ్యమేనా అని మీరు ఆలోచించవచ్చు. ఒక నిజ జీవిత ఉదాహరణను పరిశీలించండి. మార్టిన్‌ తన పిల్లల ముందే తన భార్యను తిడుతూ, తీవ్రంగా కొట్టేవాడు. ఒక సందర్భంలో పరిస్థితి ఎంతగా విషమించిందంటే పిల్లలు సహాయం కోసం పొరుగింటికి పరుగులు * తీయాల్సివచ్చింది. అనేక సంవత్సరాల తర్వాత, ఆ కుటుంబం యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించింది. తాను ఎలాంటి వ్యక్తిగా మారాలో, ఇతరులతో ఎలా వ్యవహరించాలో మార్టిన్‌ తెలుసుకున్నాడు. ఆయన మారగలిగాడా? ఆయన భార్య ఇలా చెబుతోంది: “గతంలో మా వారికి కోపం వస్తే ఏమి చేసేవారో తనకే తెలిసేది కాదు. దానివల్ల ఎంతోకాలంవరకు మా జీవితం అస్తవ్యస్తంగా ఉండేది. మా వారు మారేలా యెహోవా సహాయం చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు చాలడంలేదు. ఆయన ఇప్పుడు మంచి తండ్రి, చక్కని భర్తగా తయారయ్యారు.”

ఆయన అనుభవం కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేసి క్రూరత్వాన్ని విడిచిపెట్టారు. అవును, మార్పులు చేసుకోవడం సాధ్యమే.

అన్నిరకాల క్రూరత్వానికి అంతం సమీపించింది

కనికరంగల పరిపాలకుడైన క్రీస్తుయేసు రాజుగా పరలోకంలో స్థాపించబడిన దేవుని రాజ్యం సమీప భవిష్యత్తులో భూమంతటినీ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంటుంది. అది ఇప్పటికే అన్నిరకాల క్రూరత్వానికి మూలకారకుడైన సాతాను, అతని దయ్యాలను పరలోకం నుండి తీసివేసింది. త్వరలో దేవుని రాజ్యం భూమ్మీద ఉన్న శాంతికాముకులైన ప్రజల అవసరాలను తీరుస్తుంది. (కీర్తన 37:​10, 11; యెషయా 11:​2-5) ప్రపంచ సమస్యలకు అదొక్కటే నిజమైన పరిష్కారం. మీరు ఈ రాజ్యం కోసం వేచివుండగా క్రూరత్వానికి బలైతే అప్పుడేమిటి?

క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తితో అదే విధంగా ప్రవర్తించడంవల్ల ఫలితం ఉండదు. అది మరింత క్రూరత్వానికే దారితీస్తుంది. యెహోవాపట్ల నమ్మకముంచాలని బైబిలు మనల్ని కోరుతోంది, ఆయన తగిన సమయంలో “ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతికారము” తీరుస్తాడు. (యిర్మీయా 17:​10) (ఈ ఆర్టికల్‌తోపాటు ఇవ్వబడిన “క్రూరత్వానికి ఎలా ప్రతిస్పందించాలి” అనే బాక్సును చూడండి.) నిజమే, మీరు క్రూరమైన నేరానికి బలైనప్పుడు బాధ అనుభవించవచ్చు. (ప్రసంగి 9:​11) అయినా, దేవుడు అన్నిరకాల క్రూరత్వంవల్ల ఎదురయ్యే పర్యవసానాలతోపాటు మరణాన్ని కూడా తొలగించగలడు. ఆయన వాగ్దానం ప్రకారం, క్రూరమైన కృత్యాలవల్ల తమ ప్రాణాలను కోల్పోయినా తన జ్ఞాపకంలోవున్నవారు వారు తిరిగి జీవాన్ని పొందుతారు.​—⁠యోహాను 5:​28, 29.

క్రూరత్వానికి బలయ్యే అవకాశం ఇప్పటికీ ఉన్నా, మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని, ఆయన వాగ్దానాలపట్ల దృఢమైన విశ్వాసాన్ని కలిగివుండడం ద్వారా ఓదార్పును పొందవచ్చు. శారా విషయాన్ని పరిశీలించండి, ఆమె తన భర్త సహాయం లేకుండానే ఇద్దరు అబ్బాయిలను పెంచి పెద్ద చేసి, వారికి చక్కని విద్యాబుద్ధులు అబ్బేలా చూసింది. వృద్ధాప్యంలో ఆమె ఇద్దరు కుమారులు ఆమెను విడిచి వెళ్ళిపోయారు, వారు ఆమెకు ఆర్థిక సహాయం చేయలేదు సరికదా ఆమె వైద్య సంరక్షణ విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు క్రైస్తవురాలైన శారా ఇలా అంటోంది: “వారలా చేసినందుకు నాకు బాధగా ఉన్నా, యెహోవా నన్ను విడిచిపెట్టలేదు. నన్ను అన్ని సమయాల్లో శ్రద్ధగా చూసుకుంటున్న నా ఆధ్యాత్మిక సహోదర సహోదరీల ద్వారా నేను ఆయన మద్దతును పొందుతున్నాను. ఆయన నా సమస్యలనే కాక, ఆయన శక్తిని విశ్వసించి, ఆయన ఆజ్ఞలకు లోబడేవారందరి సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాడనే గట్టినమ్మకం నాకుంది.”

శారా ప్రస్తావించిన ఆధ్యాత్మిక సహోదర సహోదరీలు ఎవరు? వారు ఆమె క్రైస్తవ సహచరులైన యెహోవాసాక్షులు. వారు కనికరంగల వ్యక్తులతోకూడిన ప్రపంచవ్యాప్త సహోదరత్వానికి చెందినవారు, క్రూరత్వం అతి త్వరలో అంతమౌతుందనే నమ్మకం వారికి ఉంది. (1 పేతురు 2:​17) క్రూరత్వానికి ప్రధాన కారకుడైన అపవాదియైన సాతాను గానీ, అతనిలాగే ప్రవర్తించే వ్యక్తులు గానీ ఇక ఉండరు. ఒక రచయిత “క్రూరమైన శకం” అని వర్ణించిన ఈ శకం గతించిపోతుంది. యెహోవాసాక్షులను సంప్రదించడం ద్వారా ఈ నిరీక్షణ గురించి మీరెందుకు తెలుసుకోకూడదు?

[అధస్సూచీలు]

^ పేరా 16 దేవుని లక్షణాలను, వ్యక్తిత్వాన్ని గురించిన లోతైన చర్చ కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన యెహోవాకు సన్నిహితమవండి అనే పుస్తకాన్ని చూడండి.

^ పేరా 17 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[6వ పేజీలోని బాక్సు]

క్రూరత్వానికి ఎలా ప్రతిస్పందించాలి?

క్రూరత్వంతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో దేవుని వాక్యం ఆచరణాత్మక సలహాలు ఇస్తోంది. మీరు జ్ఞానయుక్తమైన ఈ క్రింది మాటలను ఎలా అన్వయించుకోవచ్చో పరిశీలించండి:

“కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు, యెహోవాకొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును.”​—⁠సామెతలు 20:​22.

“బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కనబడినయెడల దానికి ఆశ్చర్యపడకుము . . . మరి ఎక్కువైన అధికారము నొందినవాడు వారికి పైగా నున్నాడు.”​—⁠ప్రసంగి 5:⁠8.

“సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.”​—⁠మత్తయి 5:⁠5.

“మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్తయి 7:​12.

“కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగియుండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి​—⁠పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది.”​—⁠రోమీయులు 12:​17- 19.

“క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. . . . ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.”​—⁠1 పేతురు 2:​21-23.

[7వ పేజీలోని చిత్రాలు]

క్రూరత్వాన్ని విడిచిపెట్టే విధానాన్ని యెహోవా చాలామందికి బోధించాడు