కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘తెల్లబారి కోతకు వచ్చిన’ క్షేత్రం

‘తెల్లబారి కోతకు వచ్చిన’ క్షేత్రం

‘తెల్లబారి కోతకు వచ్చిన’ క్షేత్రం

దక్షిణ అమెరికా ఉత్తర అంచున గ్వాహీరా ద్వీపకల్పం ఉంది. అది కొలంబియాకు ఉత్తరాన, వెనిజ్యులాకు వాయువ్య దిశలో ఉంది. ఎడారిని తలపించే ఈ ప్రాంతంమీద మండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు, వర్షపాతం అత్యల్పంగా నమోదౌతుంది, ఇక్కడి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌వరకు చేరుకోగలవు. అలాంటి వాతావరణమున్నా ఇక్కడి ప్రజలు చురుకుగా పనిచేసే ఉత్పాదక వ్యవసాయదారులు. నిలకడగా వీచే సముద్రపు గాలులు, ఈశాన్యంవైపు తదేకంగా వీచే పవనాలు కొంత ఉపశమనాన్నిస్తూ సందర్శకులకు సమ్మోహింపజేసే ప్రకృతి దృశ్యాలను, రమణీయమైన సముద్రతీరాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి.

వై యూ ఇండియన్ల ప్రాంతానికి స్వాగతం. ప్రపంచంలో దాదాపు 3,05,000 మంది వైయూ ఇండియన్లు ఉన్నారు, వారిలో 1,35,000 మంది కొలంబియాలో నివసిస్తున్నారు. స్పానిష్‌వారు ఇక్కడికి వలస రావడానికి ముందునుండే ఈ తెగవారు ఇక్కడ నివసిస్తున్నారు.

పశువుల పెంపకం, వ్యవసాయమే వైయూ ఇండియన్ల జీవనాధారం. వారు చేపలు పడతారు, పొరుగునున్న దేశాలతో వ్యాపారాలు కూడా చేస్తారు. స్త్రీలు ప్రకాశవంతమైన రంగుల్లో, నైపుణ్యవంతమైన నేతపని చేస్తారు, వారి ఉత్పత్తులను పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు.

వైయూ ఇండియన్లు నిజాయితీపరులుగా, అతిథులను ఆదరించేవారిగా పేరుపొందారు. అయితే, వారు కూడా “అపాయకరమైన కాలములో” జీవిస్తున్నారు. (2 తిమోతి 3:⁠1) వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి పేదరికం, ఆ సమస్య నిరక్ష్యరాస్యత, శిశు కుపోషణ, ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతోపాటు, కొన్ని ప్రాంతాల్లో నేరప్రవృత్తి వంటి ఇతర సమస్యలకు దారితీస్తోంది.

ఎన్నో దశాబ్దాలపాటు, క్రైస్తవమత సామ్రాజ్యపు చర్చీలు వైయూ ఇండియన్లతో కలిసి జీవించడానికి మిషనరీలను పంపించాయి. దాని ఫలితంగా అనేక ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలు, బోర్డింగ్‌ పాఠశాలలు చర్చీ అధీనంలో ఉన్నాయి. ఈ తెగవారిలో అనేకమంది విగ్రహారాధన, శిశు బాప్తిస్మం వంటి నామకార్థ క్రైస్తవుల ఆచారాలను స్వీకరించారు, అయితే వారు సాంప్రదాయ పురాణగాథలు, మూఢవిశ్వాసాల నుండి వచ్చిన నమ్మకాలను, ఆచారాలను విడిచిపెట్టలేదు.

సాధారణంగా, వైయూ ఇండియన్లకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయి, యెహోవాసాక్షులు బోధించే బైబిలు సత్యాలను వారు ఇష్టపడతారు. 1980ల తొలిభాగంలో గ్వాహీరాలో యెహోవాసాక్షులు ఏడుగురే ఉండేవారు, వారిలో ముగ్గురు రాజధానియైన రియోవాచాలో ఉండేవారు. ఆ ప్రాంతానికి చెందిన సాక్షులతోపాటు మరో 20 మంది ప్రచారకులు స్పానిష్‌ భాషలో రాజ్య సువార్త ప్రకటించేవారు.

మాతృభాషలో సందేశం

రియోవాచాలో నివసించే అనేకమంది వైయూ ఇండియన్లు, తమ మాతృభాష అయిన వైయునికీతోపాటు కొంత స్పానిష్‌ భాష కూడా మాట్లాడతారు. ప్రారంభంలో రాజ్య ప్రకటనాపనిలో పెద్దగా ఫలితం లభించలేదు. వైయూ ఇండియన్లు తమ తెగకు చెందనివారిని అరిహునాస్‌ అని పిలుస్తారు, వైయూ ఇండియన్లు వారికి దూరంగా ఉంటారనిపిస్తోంది. సాక్షులు వైయూ ఇండియన్ల ఇళ్లకు వెళ్లినప్పుడు చాలామంది వైయూ ఇండియన్లు తమ మాతృభాషలోనే మాట్లాడేవారు గానీ స్పానిష్‌లో కాదు. ఏమీ చేయలేక సాక్షులు తర్వాతి ఇంటికి వెళ్లేవారు.

అయితే, 1994వ సంవత్సరాంతానికల్లా యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం, కొంతమంది ప్రత్యేక పయినీర్లను లేక పూర్తికాల ప్రచారకులను రియోవాచా సంఘంలో సేవచేయడానికి నియమించింది. తమకు వైయునికీ భాషను నేర్పించమని పయినీర్లు ఆ తెగకు చెందిన ఒక సాక్షిని కోరారు. కొన్ని సులభమైన ప్రతిపాదనలను కంఠస్థం చేసిన తర్వాత ఆ ప్రచారకులు ఆ క్షేత్రానికి వెళ్లారు, ప్రజల ప్రతిస్పందనలో గమనార్హమైన మార్పును వారు వెంటనే గమనించారు. ఆ ప్రత్యేక పయినీర్లు వచ్చీరానీ వైయునికీ భాషలో మాట్లాడినా, గృహస్థులు ఆశ్చర్యానందాలకు గురై సువార్తను వినేందుకు ఇష్టపడేవారు, కొన్నిసార్లు తమకు అంతగా రాని స్పానిష్‌ భాషలో ఉత్సాహంగా సంభాషణను కొనసాగించేవారు!

‘తెల్లబారి కోతకు వచ్చింది’

అపొస్తలుడైన పౌలు క్రైస్తవ శిష్యులను తయారుచేసే పనిని పొలాన్ని సాగుచేసే పనితో పోల్చాడు, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చే వైయూ ఇండియన్లు ఆ పోలికను సులభంగా అర్థంచేసుకుంటారు. (1 కొరింథీయులు 3:​5-9) అలంకార భావంలో వైయూ ఇండియన్ల క్షేత్రం నిజానికి ‘తెల్లబారి కోతకు వచ్చింది.’​—⁠యోహాను 4:​35.

మెనౌరా పట్టణంలో నివసించిన నెల్‌ అనే వైయూ ఇండియన్‌, పుట్టుకతోనే వచ్చిన ఒక లోపంతో బాధపడేవాడు. తన లోపానికి దేవుణ్ణి నిందిస్తూ ఆత్మహత్య చేసుకునేంతగా ఆయన మానసిక కృంగుదలకు గురయ్యాడు. ఒక సాక్షి తన ఉద్యోగ పనులమీద వివిధ పట్టణాలకు వెళ్తున్నప్పుడు ఇంటింటి పరిచర్యలో పాల్గొనేందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు, ఆ సమయంలో ఆయన నెల్‌తో యెహోవా రాజ్యం గురించి మాట్లాడాడు. నెల్‌కు అప్పుడు 14 ఏళ్లే. నెల్‌కున్న ఆసక్తిని పసిగట్టి, ఆ సాక్షి ఆయనతో బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు. యెహోవా ప్రేమపూర్వక వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకొని నెల్‌ సంతోషించాడు, తన బాధలకు దేవుడు కారకుడు కాదనే నిర్ధారణకు వచ్చాడు. వ్యాధులు ఇక ఉండని భూ పరదైసు గురించిన దేవుని వాగ్దానాన్ని ఆయన చదివినప్పుడు, అది ఆయనను ఎంతగా ప్రభావితం చేసివుంటుందో కదా!​—⁠యెషయా 33:​24; మత్తయి 6:​9, 10.

ఆ సమయంలో నెల్‌ కుటుంబానికీ, మరో కుటుంబానికీ మధ్య కలహం రేగింది. తమ రక్షణ కోసం, నెల్‌ బంధువులు కొన్ని తెగ సంబంధమైన మతకర్మలను చేశారు. అప్పుడు జరిగిన సంఘటనలను నెల్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మొదట్లో, నేను క్రొత్తగా కనుగొన్న విశ్వాసం గురించి నా కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి, ముఖ్యంగా ఎంతో గౌరవించబడే కుటుంబ పెద్దలతో మాట్లాడడానికి భయపడ్డాను.” బైబిలుకు అనుగుణంగా లేని నమ్మకాలను నెల్‌ అనుసరించడు, అలాగే అభిచార సంబంధమైన ఆచారాలను అభ్యసించడు అని తెలుసుకొని ఆయన తల్లిదండ్రులకు కోపంవచ్చింది. అప్పుడు నెల్‌, రియోవాచాకు తరలివెళ్లి అక్కడున్న సంఘంతో సహవసించడం ప్రారంభించాడు. ఆయన ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన 1993లో పరిచర్య సేవకునిగా నియమించబడ్డాడు, మూడేళ్ల తర్వాత క్రమ పయినీరు అయ్యాడు. తర్వాత 1997లో ఆయన సంఘ పెద్దగా నియమించబడ్డాడు. 2000వ సంవత్సరంలో ఆయన ప్రత్యేక పయినీరు సేవచేపట్టి తన పరిచర్యను విస్తృతపరచుకున్నాడు.

థెరీసా అనే వైయూ ఇండియన్‌ విషయాన్ని కూడా పరిశీలించండి, ఆమె సాక్షులతో బైబిలు అధ్యయనం ప్రారంభించింది. ఆమె పెళ్ళి చేసుకోకుండానే డానియల్‌ అనే వ్యక్తితో కలిసి జీవించేది, ఆయన ఆమెను ఎగతాళి చేస్తూ వారి ముగ్గురు పిల్లలను హింసించేవాడు. ఆ తర్వాత ఆయన థెరీసాతోపాటు బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించినా తన స్నేహితులతో కలిసి అతిగా త్రాగేవాడు, కొన్నిసార్లు నాలుగైదు రోజులవరకు త్రాగేవాడు. ఆయన కుటుంబం పేదరికంలో కూరుకుపోయింది. థెరీసా నమ్మకంగా అధ్యయనాన్ని కొనసాగించి, క్రైస్తవ కూటాలకు హాజరైంది. బైబిలు అధ్యయనం చేయడం ఎందుకు ప్రాముఖ్యమో డానియల్‌ గ్రహించడానికి అది సహాయం చేసింది. వారి పిల్లల్లో ఒకరు ప్రమాదవశాత్తు నీళ్లు మరగబెడుతున్న పాత్రలో పడి తీవ్ర గాయాలతో మరణించాడు. కుమారుణ్ణి కోల్పోయిన తీవ్ర వేదనతోపాటు లేఖనవిరుద్ధమైన అంత్యక్రియల ఆచారాలను పాటించాల్సిందిగా స్నేహితుల నుండి, పొరుగువారి నుండి ఆమె ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సివచ్చింది.

ఆ కష్ట సమయంలో దగ్గర్లోని సంఘాల సభ్యులు ఆ దంపతులకు ఊతమిచ్చి ఓదార్చారు. అంత్యక్రియల తర్వాత కూడా స్థానిక వైయునికీ భాషా సంఘ సభ్యులు వారిని ఓదార్చేందుకు వాళ్లింటికి వెళ్లారు. సంఘాల్లోని సభ్యులు చూపించిన క్రైస్తవ ప్రేమను చూసిన తర్వాత ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి డానియల్‌ ప్రోత్సహించబడ్డాడు. ఆయన త్రాగుడును, థెరీసాను హింసించడాన్ని మానేశాడు. డానియల్‌, థెరీసా వివాహం చేసుకున్నారు, ఆయన తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. వారు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి 2003లో బాప్తిస్మం తీసుకున్నారు. వారిద్దరూ చాలా బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. థెరిసా తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన చక్కని సాక్ష్యం కారణంగా సాక్షులు ఇంటికి వచ్చినప్పుడు వారు చెప్పేది వినడానికి ఆమె బంధువులు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. డానియల్‌ మేనల్లుడు ఇప్పుడు బాప్తిస్మం పొందని ప్రచారకుడయ్యాడు, ఆయన మేనకోడలు, అన్న కూతురు బైబిలు అధ్యయనం చేస్తూ సంఘ కూటాలకు హాజరౌతున్నారు. థెరీసా వదిన కూడా ఒక దుర్ఘటనలో తన కుమారుణ్ణి కోల్పోయింది, ఆమె కుటుంబం బైబిలు అధ్యయనం చేయడానికి ఆసక్తి చూపించింది.

వైయునికీ భాషలో ఆధ్యాత్మిక ఆహారం

1998లో భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! * అనే చిన్నపుస్తకం వైయునికీ భాషలో విడుదల చేయబడింది. వైయూ ఇండియన్ల క్షేత్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు, గృహ బైబిలు అధ్యయనాలను నిర్వహించేందుకు అది అమూల్యమైన ఉపకరణంగా తయారైంది. యెహోవాసాక్షుల ప్రచురణలు 2003వ సంవత్సరంలో, వైయునికీలోకి అనువదించబడేలా అనేక సహోదరులకు శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. రియోవాచాలోని అనువాదకుల గుంపు కష్టించి పనిచేసిన కారణంగా అనేక బ్రోషుర్లు అందుబాటులోకి వచ్చాయి, అది వైయునికీ భాష మాట్లాడే శిష్యుల ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడింది.

2001వ సంవత్సరం నుండి జిల్లా సమావేశ కార్యక్రమంలోని కొన్ని భాగాలు వైయునికీలోకి అనువదించబడుతున్నాయి. బైబిలు విద్యార్థులు కార్యక్రమాన్ని తమ భాషలో విన్నప్పుడు వారు ఆధ్యాత్మికంగా ప్రోత్సహించబడుతున్నారు. సమీప భవిష్యత్తులో బైబిలు నాటకాలు కూడా వైయునికీలో ప్రదర్శించబడవచ్చని వారు ఆశిస్తున్నారు.

వర్ధిల్లుతున్న క్షేత్రం

రియోవాచాకు ఈశాన్యంలో, దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో యురీబియా అనే పట్టణం ఉంది. యురీబియా వైయూ సంఘంలో 16 మంది రాజ్య ప్రచారకులున్నారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వైయూ ఇండియన్లకు ప్రకటించేందుకు వారెంతో కృషి చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో ప్రకటించడానికి తమ సంఘం చేసిన ప్రయాణం గురించి ఒక సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “చుట్టూ గోడవున్న ఒక పశుపాలనా క్షేత్రంలో ఉన్న దాదాపు పన్నెండు ఇళ్లకు వెళ్లాం, ఆ ఇళ్లు చిన్న కిటికీలతో తక్కువ ఎత్తులో ఉన్నాయి. ప్రతీ ఇంటి ముందు, బలంగా ఉండే నాగజెముడు లోపలి కాండంతో నిర్మించబడిన పందిరి ఉంది, ఆ లోపలి కాండాన్ని యోటోహోలో అని పిలుస్తారు. ఆ పందిర్ల క్రిందే కుటుంబీకులు, సందర్శకులు మండుతున్న ఎండ నుండి రక్షణ పొందుతారు. చాలామందికి ఎంతో ఆసక్తి కనబరచడాన్ని చూసి మేము సంతోషించాం. కాబట్టి, వారిని తిరిగి కలుసుకొని బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశాం. మేము వారి ఇళ్లకు తిరిగి వెళ్లినప్పుడు వారిలో చాలామందికి చదువురాదని గ్రహించాం. నిధుల కొరతవల్ల పాఠశాల మూసేశారని వారు మాకు చెప్పారు. ఆ పాఠశాలను చూసుకుంటున్న వ్యక్తి, అక్షరాస్యత తరగతులను, బైబిలు అధ్యయనాలను నిర్వహించేందుకు ఒక తరగతి గదిని ఉపయోగించడానికి మమ్మల్ని దయతో అనుమతించాడు. ఆరుగురు వైయూ ఇండియన్లు చదవడం, రాయడం నేర్చుకొని బైబిలు అధ్యయనంలో ప్రగతి సాధిస్తున్నారు. వారు చూపించిన కృతజ్ఞత, ఆసక్తి మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది కాబట్టి మేము ఆ పశుపాలనా క్షేత్రంలో కూటాలను జరపాలనుకుంటున్నాం.”

అనేకమంది స్థానికులు కాని సాక్షులు వైయునికీ భాష నేర్చుకున్నారు, వారి సహాయం ఎంతో విలువైనదిగా పరిగణించబడుతోంది. ఇప్పుడు గ్వాహీరా ద్వీపకల్పంలో ఆ భాష మాట్లాడే ఎనిమిది సంఘాలు, రెండు గుంపులు ఉన్నాయి.

ఆ ప్రయత్నాలమీద యెహోవా ఆశీర్వాదం స్పష్టంగా కనిపిస్తుంది. వైయూ ఇండియన్ల క్షేత్రంలో సువార్త ప్రకటనకు సంబంధించి చేయాల్సిన పని ఇంకా ఎంతో ఉందనడంలో సందేహం లేదు. తమ ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తించినవారు క్రైస్తవ శిష్యులుగా మారుతున్నారు కాబట్టి, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. ‘తెల్లబారి కోతకు వచ్చిన’ ఈ క్షేత్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు యెహోవా చాలామంది ప్రచారకులను పంపించును గాక.​—⁠మత్తయి 9:​37, 38.

[అధస్సూచి]

^ పేరా 18 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[16వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

వెనిజ్యూలా

కొలంబియా

లా గ్వాహీరా

మెనౌరా

రియోవాచా

యురీబియా

[16వ పేజీలోని చిత్రసౌజన్యం]

రెండు పేజీల్లో ఉన్న వైయూ ఇండియన్ల శిబిరం: Victor Englebert