కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేటి క్రూర లోకం

నేటి క్రూర లోకం

నేటి క్రూర లోకం

మారియాకు 64 ఏళ్లు, ఆమె ఒంటరిగా జీవించేది. ఆమె తన ఇంట్లోనే శవమై తేలింది. ఎవరో ఆమెను కొట్టి, మెడకు కేబుల్‌ వైర్‌చుట్టి చంపేశారు.

ఇద్దరు అబ్బాయిలను కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ కోపోద్రిక్తమైన ఒక గుంపు ముగ్గురు పోలీసులను కొట్టింది. ఆ గుంపు ఇద్దరు పోలీసులమీద పెట్రోలు పోసి వారిని అగ్నికి ఆహుతి చేసింది. మూడో పోలీసు ఎలాగోలా తప్పించుకోగలిగాడు.

ఒక అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌వల్ల దిగ్భ్రాంతికరమైన విషయం వెల్లడైంది. సెలవులకని వెళ్లిన నలుగురి శవాలు ఒక తోటలో వెలికితీయబడ్డాయి. వారి కళ్లకు గంతలు, చేతులకు తాళ్లు కట్టబడివున్నాయి. వారు సజీవంగా పాతిపెట్టబడ్డారని శవపరీక్షలో తేలింది.

ఆ దారుణకృత్యాలు, క్రూరమైన హింసాయుత సినిమాల్లోని దృశ్యాలు కావు. ఆ నివేదికలు ఒక లాటిన్‌ అమెరికా దేశంలో ఇటీవల ప్రధానంగా ప్రచురించబడిన యథార్థ గాథలే. నేటి లోకంలో, కేవలం ఆ దేశంలో మాత్రమే అలాంటి దారుణకృత్యాలు జరగడంలేదు.

క్రూరమైన కృత్యాలు సర్వసాధారణమయ్యాయి. ఆ క్రూరమైన కృత్యాల్లో బాంబు దాడులు, ఉగ్రవాద దాడులు, హత్యలు, దాడులు, కాల్పులు, మానభంగాలు వంటివి కొన్ని మాత్రమే. సమాచార మాధ్యమాలు దారుణకృత్యాల దృశ్యాలను పదేపదే చూపిస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు చాలామంది అలాంటి క్రూరత్వం చూసి లేక విని దిగ్భ్రాంతి చెందడంలేదు.

‘నేడు ఈ లోకానికి ఏమౌతోంది, ఇతరుల భావాల గురించిన ఆలోచన, జీవంపట్ల గౌరవం ఎవరికీ లేదా’ అని మీరు అనుకోవచ్చు. ఇలాంటి లోకంలో మనమెందుకు జీవించాలి?

క్యాన్సర్‌తో బాధపడుతున్న 69 ఏళ్ల హారీ అనే వ్యక్తి గురించి ఇప్పుడు ఆలోచించండి. ఆయన భార్య మల్టిపుల్‌ స్ల్కీరోసిస్‌తో (నాడీ వ్యవస్థను పలుచోట్ల దెబ్బతీసే వ్యాధితో) బాధపడుతోంది. అయితే పొరుగువారు, స్నేహితులు వారికి చేయూతనిస్తున్నారు. “వారే గనుక మాకు సహాయం చేయకపోతే మా గతి ఏమయ్యేదో నాకు తెలియదు” అని హారీ అంటున్నాడు. ఆయన నివసిస్తున్న కెనడాలో, వృద్ధులను చూసుకునేవారిలో 50 శాతం కన్నా ఎక్కువమంది తమ బంధువులు కానివారికి సహాయం చేస్తున్నట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది. తమ అనుదిన జీవితంలో దయ, స్నేహశీలత కనబరిచే సామాన్య ప్రజలు మీకు తెలిసేవుండవచ్చు. నిజమే, క్రూరత్వానికి బదులు కనికరం, దయ కనబరిచే సామర్థ్యం కూడా మానవులకు ఉంది.

అయితే, దారుణకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రజలు క్రూరంగా ప్రవర్తించడానికిగల కారణమేమిటి? ఇతరులతో క్రూరంగా ప్రవర్తించేవారు మారే అవకాశం ఉందా? క్రూరత్వం ఎప్పటికైనా అంతమౌతుందా? అలాగైతే, అదెలా అంతమౌతుంది, ఎప్పుడు అంతమౌతుంది?

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

రైలు: CORDON PRESS