కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

క్రైస్తవులు కెఫీన్‌ ఉన్న పానీయాలను, ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలా?

కెఫీన్‌ (శాకక్షారం) ఉండే కాఫీ, టీ, చాక్‌లెట్‌, మటా (టీలాంటి పానీయం), సోడాలాంటి పదార్థాలను క్రైస్తవులు తీసుకోకూడదని బైబిలు చెప్పడంలేదు. అయితే, మనం జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడే సూత్రాలను లేఖనాలు అందిస్తున్నాయి. కొంతమంది కెఫీన్‌వున్న ఆహార పదార్థాల్ని, పానీయాల్ని ఎందుకు తీసుకోకుండా ఉంటారో ముందుగా మనం పరిశీలిద్దాం.

ప్రాముఖ్యమైన కారణమేమిటంటే, కెఫీన్‌ మానసిక స్థితిని మార్చే పదార్థంగా, మెదడుపై ప్రభావం చూపించే ఉత్ప్రేరకంగా పరిగణించబడవచ్చు. అది వ్యసనంగా కూడా మారగలదు. మందులు అమ్మేవారి కోసం వ్రాయబడిన ఒక ప్రామాణిక గ్రంథం ఇలా చెబుతోంది: “కెఫీన్‌ను ఎక్కువకాలం అధిక మోతాదులో తీసుకోవడం ఔషధ సహనానికి, వ్యసనానికి దారితీస్తుంది. ఆ ఉత్ప్రేరకం తీసుకోవడం అకస్మాత్తుగా మానేస్తే తలనొప్పి, చిరాకు, గాబరా, ఆందోళన, మైకంవంటి లక్షణాలు కనిపిస్తాయి.” డయాగ్నోస్టిక్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ మాన్యువల్‌ ఆఫ్‌ మెంటల్‌ డిజార్డర్స్‌ అనే పుస్తకంలో ఇతర మందులు మానేస్తే కనబడే లక్షణాలతోపాటు కెఫీన్‌ మానేస్తే కనబడే శారీరక లక్షణాలను కూడా చేర్చే విషయం పరిశీలించబడింది. అందుకే కొంతమంది క్రైస్తవులు దానిపై ఆధారపడకుండా ఉండాలనే, ఆశానిగ్రహాన్ని కనబరచాలనే ఉద్దేశంతో కెఫీన్‌ తీసుకోవడాన్ని తప్పుగా భావించడం సహేతుకమైనదే.​—⁠గలతీయులు 5:⁠22.

కెఫీన్‌ ఒక వ్యక్తి ఆరోగ్యంపై లేక గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని కొంతమంది నమ్ముతారు. క్రైస్తవులు “సంపూర్ణమైన ఆత్మతో” లేదా పూర్ణ శరీరంతో దేవుణ్ణి ప్రేమించాలి కాబట్టి, వారి ఆయుష్షును తగ్గించే ఏ పనీ చేయరు. వారు తమ పొరుగువారిని ప్రేమించమని ఆజ్ఞాపించబడ్డారు కాబట్టి, గర్భస్థ శిశువు ఆరోగ్యానికి హానికలిగించగల వాటిని తీసుకోకుండా ఉంటారు.​—⁠లూకా 10:​25-27, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఆరోగ్యం విషయంలో అంతగా ఆందోళన చెందడం అవసరమా? కెఫీన్‌ వాడకానికి, ఎన్నోరకాల వ్యాధులకు మధ్యవున్న సంబంధం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పరిశోధకులు కాఫీ ఆరోగ్యకరమైనదని కూడా నివేదిస్తున్నారు. టైమ్‌ పత్రిక 2006లో ఇలా చెప్పింది: “[కెఫీన్‌] మూత్రాశయ క్యాన్సర్‌కు, అధిక రక్తపోటుకు, మరితర రుగ్మతలకు దారితీయవచ్చని మొదట్లో చేసిన అధ్యయనాలు సూచించాయి. ఇటీవలి పరిశోధన వాటిలో అనేక వాదనలను త్రోసిపుచ్చడమేకాక, కొన్ని విశిష్టమైన ప్రయోజనాలను కనుగొంది. కెఫీన్‌ కాలేయ వ్యాధి, పార్కిన్‌సన్‌ వ్యాధి, మధుమేహం, అల్జీమర్‌ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, మానసిక కృంగుదలతోపాటు, కొన్నిరకాల క్యాన్సర్‌లనుండి కూడా రక్షణ కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది.” ఒక వార్తాపత్రిక కెఫీన్‌ వాడకం గురించి ఇలా నివేదించింది: “దాన్ని మితంగా వాడడమే కీలకమని అర్థమౌతోంది.”

ప్రతీ క్రైస్తవుడు, కెఫీన్‌ గురించి, దానిలో ఇమిడివున్నట్లు కన్పిస్తున్న బైబిలు సూత్రాల గురించి ప్రస్తుతం లభించే సమాచారంలో తనకున్న అవగాహన ఆధారంగా వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు, తాను గర్భవతిగా ఉన్నప్పుడు కెఫీన్‌ వాడితే గర్భస్థ శిశువుకు ప్రమాదకరం అని భావిస్తే ఒక క్రైస్తవ తల్లి దానిని వాడకుండా ఉండాలనుకోవచ్చు. ఒక క్రైస్తవుడు క్రమంగా కెఫీన్‌ తీసుకోకుండా ఉంటే తనకు చిరాకుగా, నలతగా ఉన్నట్లు భావిస్తే, కనీసం తాత్కాలికంగానైనా కెఫీన్‌ను తీసుకోవడం మానేయమనే సలహా ఆయనకు ఇవ్వబడవచ్చు. (2 పేతురు 1:​5, 6) ఇతర క్రైస్తవులు వారి నిర్ణయాన్ని గౌరవించాలి, తమ అభిప్రాయాన్ని వారిమీద రుద్దకూడదు.

కెఫీన్‌ ఉన్న ఆహారపదార్థాల విషయంలోగానీ, పానీయాల విషయంలోగానీ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పౌలు చేసిన ఈ ఉద్బోధను మనసులో ఉంచుకోవాలి: “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”​—⁠1 కొరింథీయులు 10:​31.