కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పౌలుతోపాటు బెరయకు ప్రయాణిద్దాం

పౌలుతోపాటు బెరయకు ప్రయాణిద్దాం

పౌలుతోపాటు బెరయకు ప్రయాణిద్దాం

ఆ ఇద్దరు మిషనరీల సేవ ఎంతో విజయవంతమయ్యింది, గొప్ప సంఖ్యలో ప్రజలు విశ్వాసులయ్యారు. కానీ, ఒక అల్లరిమూక వారికి వ్యతిరేకంగా అలజడి రేపింది. అందుకే వారొక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్న సంఘం కోసం, తమ క్షేమం కోసం ఆ ఇద్దరు మిషనరీలు రాత్రికిరాత్రి అక్కడినుండి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. అలా పౌలు, సీల దాదాపు సా.శ. 50లో మాసిదోనియలోని థెస్సలొనీక నౌకాశ్రయం నుండి పారిపోయారు. వారు తమ ప్రకటనాపని కొనసాగించడం కోసం తర్వాతి గమ్యస్థానానికి వెళ్లారు, అదే బెరయ.

నే డు సందర్శకులెవరైనా బెరయకు వెళ్తే, ప్రాచీన ప్రయాణీకులకు కనబడినట్లే, అది దూరం నుండి చూసినప్పుడు పచ్చికతో రమణీయంగా కనిపించే బెర్మియోస్‌ పర్వతం అడుగున నెలకొని ఉండడాన్ని చూస్తారు. బెరయ (వెరయ) థెస్సలొనీకకు నైరుతి దిశగా 65 కిలోమీటర్ల దూరంలో, ఏజియన్‌ సముద్రానికి 40 కిలోమీటర్ల లోపలితట్టు ప్రాంతంలో ఉంది. ప్రాచీన గ్రీకు సంస్కృతిలోని ప్రధాన దేవుళ్ల కల్పిత నివాసంగా పేర్కొనబడిన ఒలంపస్‌ పర్వతం బెరయకు దక్షిణాన ఉంది.

పౌలు ప్రకటించి అనేకమందిని క్రైస్తవులుగా మార్చిన బెరయ, బైబిలు విద్యార్థులకు ఆసక్తి కలిగించే పట్టణం. (అపొస్తలుల కార్యములు 17:​10-15) మనం పౌలుతోపాటు చరిత్రలో వెనక్కి ప్రయాణించి, ఆ పట్టణం పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.

తొలి చరిత్ర

బెరయ ఎప్పుడు నిర్మించబడిందో ఎవరికీ తెలీదు. దాని తొలి నివాసులను అంటే బహుశా ఫ్రిజియన్‌ జాతులను మాసిదోనియవాసులు దాదాపు సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో ఆ పట్టణం నుండి తరిమేశారు. మూడు శతాబ్దాల అనంతరం, అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ మాసిదోనియను జయించిన తర్వాత అది అభివృద్ధి చెందింది. అక్కడ మనోహరమైన భవనాలు, ప్రాకారాలేకాక జియుస్‌, అర్తెమిస్‌, అపొల్లో, అథీనా ఇంకా ఇతర గ్రీకు దేవతలకు గోపురాలు కూడా నిర్మించబడ్డాయి.

శతాబ్దాలు గడుస్తుండగా బెరయ “తన చుట్టూ ఉన్న ప్రాంతాలపైనే కాక ఉత్తర గ్రీసు ప్రాంతమంతటికీ కీలక పట్టణంగా వ్యవహరించింది” అని ఒక చారిత్రక పుస్తకం చెబుతోంది. మాసిదోనియ రాజవంశంలో ఆఖరివాడైన ఆంటిగానిడ్స్‌ (సా.శ.పూ. 306-168) పరిపాలనలో బెరయ పట్టణం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. మాసిదోనియ వంశం చివరికి రోము చేతుల్లో పతనమైంది.

సా.శ.పూ. 197లో రాజైన ఫిలిప్‌ V రోమన్ల చేతుల్లో పరాజయం పొందినప్పుడు, “మునుపటి రాజవంశం అధికారాన్ని కోల్పోయి, తూర్పు మధ్యధరా ప్రాంతంలో రోముదే పైచేయిగా నిలిచింది” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. సా.శ.పూ. 168లో బెరయకు దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలోవున్న పిడ్నాలో, రోమన్‌ సైన్యాధిపతి ప్రాచీన మాసిదోనియకు ఆఖరి పరిపాలకుడైన పర్సీయస్‌పై తిరుగులేని విజయాన్ని సాధించాడు. బైబిలు ప్రవచనంలో ముందే తెలియజేయబడినట్లుగా గ్రీకు ప్రపంచాధిపత్యాన్ని రోము చేజిక్కించుకుంది. (దానియేలు 7:​6, 7, 23) ఆ యుద్ధం ముగిసిన తర్వాత, వెంటనే రోముకు లొంగిపోయిన మాసిదోనియ పట్టణాల్లో బెరయ కూడా ఉంది.

సా.శ.పూ. మొదటి శతాబ్దంలో పాంపేయీకి, జూలియస్‌ సీజర్‌కు మధ్య జరిగిన యుద్ధానికి మాసిదోనియ యుద్ధభూమిగా మారింది. నిజానికి, బెరయ సమీపంలో ఉన్న పాంపేయీలోనే ఆయన ప్రధానశిబిరం, సైన్యం ఉండేవి.

రోమన్ల ఆధిపత్యంలో అభివృద్ధి

పాక్స్‌ రోమనా లేక రోములో శాంతి వర్ధిల్లిన కాలంలో, బెరయను సందర్శించినవారు అక్కడి వీధుల్లోని రహదారులు రాళ్లతో అమర్చబడి, వాటి పొడవునా వరుసగా స్తంభాలు ఉండడాన్ని చూశారు. ఆ పట్టణంలో సార్వజనిక స్నానశాలలు, రంగస్థలాలు, గ్రంథాలయాలు, గ్లాడియేటర్ల పోరాటాలు జరిగే ప్రాంగణాలు ఉండేవి. త్రాగునీటిని గొట్టాల ద్వారా సరఫరాచేసే ఏర్పాటేకాక పట్టణంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ కూడా ఉండేది. బెరయ పట్టణం, వర్తకులు, చిత్రకారులు, క్రీడాకారులు సందర్శించే వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది, క్రీడలను లేక ఇతర వేడుకల్ని వీక్షించడానికి ప్రేక్షకులు అక్కడికి వచ్చేవారు. పరదేశులు తమతమ మతాచారాలను జరుపుకునేందుకు వీలుగా వివిధ ఆరాధనా స్థలాలు ఉండేవి. అవును, రోము అంతటా ఉన్న వివిధ మతాలకు చెందినవారందరూ ఆ పట్టణంలో కనిపించేవారు.

బెరయలో పూజించబడిన దేవుళ్ళలో చనిపోయిన తర్వాత పూజ్యులుగా చేయబడిన రోమా చక్రవర్తులు కూడా ఉన్నారు. చక్రవర్తుల ఆరాధనకు ఊతమిచ్చింది అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ను దేవునిగా పరిగణించి ఆరాధించే ఆచారమే కాబట్టి, బెరయవాసులకు ఆ ఆచారం విచిత్రంగా అనిపించి ఉండకపోవచ్చు. ఒక గ్రీకు గ్రంథం ఇలా చెబుతోంది: “చక్రవర్తులకు వారి జీవితకాలంలో దైవత్వపు ఘనతనిచ్చేందుకు అలవాటుపడిన ఆ సామ్రాజ్య ఉత్తరప్రాంత గ్రీకు ప్రజలు ఎంతో సంతోషంగా రోమా చక్రవర్తులకు కూడా తమ మతసంబంధ ఘనతనిచ్చేవారు . . . వారి నాణాలపై వారు చక్రవర్తుల్ని, ప్రకాశవంతమైన కిరీటం ధరించిన దేవుళ్లుగా చిత్రీకరించేవారు. ప్రజలు వారికి కూడా దేవుళ్లకు చేసినట్లే భజనలు, పాటలతో ప్రార్థనలు చేసేవారు.” వారికోసం బలిపీఠాలు, దేవాలయాలు నిర్మించబడ్డాయి, అక్కడ వారికోసం బలులు అర్పించబడేవి. చివరికి చక్రవర్తులు కూడా సామ్రాజ్య సంబంధమైన మత వేడుకలకు హాజరవడానికి వచ్చేవారు, వాటిలో క్రీడలకు, చిత్రలేఖనానికి, సాహిత్యానికి సంబంధించిన పోటీలు నిర్వహించబడేవి.

బెరయ ఎందుకు అన్యమత ఆరాధనకు కేంద్రస్థానంగా ఉంది? ఎందుకంటే అది మాసిదోనియకు సంబంధించిన కీనాన్‌ నిర్వహించబడే స్థలం. కీనాన్‌ అంటే మాసిదోనియ నగరాలకు చెందిన ప్రతినిధులు జరిపే సభ. ఆ ప్రతినిధులు క్రమంగా బెరయలో కలుసుకుని తమతమ పట్టణాలకు, ప్రాంతాలకు సంబంధించిన విషయాలను చర్చించి, రోమా ప్రభుత్వ పర్యవేక్షణలో వాటితో వ్యవహరించేవారు. కీనాన్‌ చేపట్టే ముఖ్యమైన పనుల్లో ఒకటి సామ్రాజ్యంలో జరిగే మతసంబంధ ఆచరణల్ని పర్యవేక్షించడం.

థెస్సలొనీక నుండి పారిపోయిన పౌలు, సీల అలాంటి పరిస్థితులు నెలకొనివున్న పట్టణానికి చేరుకున్నారు. అప్పటికే, బెరయ పట్టణం రెండు శతాబ్దాలుగా రోమా ఆధిపత్యం క్రింద ఉంది.

బెరయకు సువార్త చేరడం

పౌలు ఆ పట్టణంలోని సమాజమందిరంలో ప్రకటించడం ప్రారంభించాడు. ప్రజలు దానికెలా ప్రతిస్పందించారు? అక్కడి యూదులు ‘థెస్సలొనీకలోని ప్రజలకంటే విశాలహృదయులు. వారు సందేశమును గొప్ప ఆపేక్షతో ఆలకించి, అనుదినము పరిశుద్ధగ్రంథమును చదువుకొనుచు, పౌలు చెప్పినది నిజమా కాదా అని పరిశీలించుచుండిరి’ అని ప్రేరేపిత వృత్తాంతం తెలియజేస్తోంది. (అపొస్తలుల కార్యములు 17:​10, 11, పవిత్ర గ్రంథం​—⁠క్యాతలిక్‌ అనువాదము) వారు ‘విశాలహృదయులు’ కాబట్టి తమ మతాచారాలకు మూర్ఖంగా అంటిపెట్టుకోలేదు. వాళ్లు వినేది కొత్త విషయమే అయినా వారు దాన్ని సందేహించలేదు లేక చిరాకుపడలేదు. పౌలు సందేశాన్ని నిరాకరించే బదులు వారు శ్రద్ధగా, పక్షపాతం లేకుండా విన్నారు.

పౌలు బోధలోని సత్యాన్ని ఆ యూదులు ఎలా గుర్తించగలిగారు? వారు విన్నదాన్ని అత్యంత నమ్మదగిన గీటురాయితో పరీక్షించి చూశారు. వారు శ్రద్ధగా, ఓర్పుగా లేఖనాల్లో వెదికారు. బైబిలు విద్వాంసుడైన మాథ్యూ హెన్రీ ఇలా తేల్చి చెప్పాడు: “పౌలు లేఖనాలనుండి తర్కించి, దాన్ని రుజువుచేయడానికి పాతనిబంధనలోని వచనాలను ప్రస్తావించాడు. వారి దగ్గర కూడా బైబిళ్లు ఉండడంతో ఆయన ప్రస్తావించిన లేఖనాలను తెరిచి, వాటి సందర్భాన్ని చదివి, వాటి సందర్భంలో దాగివున్న అర్థాన్ని గ్రహించి, లేఖనాల్లోని ఇతర భాగాలతో పోల్చి, పౌలు వాటిలోనుండి చెప్పినవి నిజమైనవో, ఆయన బోధ యుక్తమైందో కాదో పరిశీలించిన తర్వాతే వాటిపై ఆధారపడి ఒక నిర్ణయానికొచ్చేవారు.”

అది కేవలం పైపైన చేసిన అధ్యయనం కాదు. బెరయ వాసులు కేవలం సబ్బాతు రోజునేకాక దానిని ప్రతీరోజు శ్రద్ధగా చదవడానికి తదేకంగా సమయం వెచ్చించారు.

దాని ఫలితాలెలా ఉంటాయో ఊహించండి. బెరయలోని అనేకమంది యూదులు సందేశాన్ని అంగీకరించి విశ్వాసులయ్యారు. గ్రీసు దేశస్థుల్లో, బహుశా కొంతమంది యూదామత ప్రవిష్టులు కూడా ఆ సందేశాన్ని నమ్మారు. అలా జరగడం థెస్సలొనీకలో ఉన్నవారి కళ్లలో పడింది. వారు దాని గురించి వినగానే, ‘జనసమూహములను రేపి కలవరపరిచేందుకు’ వెంటనే బెరయకు చేరుకున్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 17:​4, 12, 13.

పౌలు బెరయనుండి కూడా పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ ఆయన తన ప్రకటనాపనిని మాత్రం ఆపకుండా వేరే ప్రాంతంలో కొనసాగించాడు. ఈ సారి ఆయన ఏథెన్సుకు వెళ్లే ఓడ ఎక్కాడు. (అపొస్తలుల కార్యములు 17:​14, 15) అయినా, బెరయలో ఆయన చేసిన పనినిబట్టి అక్కడ క్రైస్తవత్వం మొలకెత్తింది. అది నేడు కూడా మంచి ఫలాలనిస్తోంది.

అవును, నేడు కూడా బెరయలో (వెరయలో) “మేలైనదానిని” తెలుసుకుని, స్థిరపర్చబడిన, సత్యమైనదాన్ని ‘చేపట్టడానికి’ లేఖనాలను శ్రద్ధగా పరిశీలించేవారు ఉన్నారు. (1 థెస్సలొనీకయులు 5:​21) ఆ నగరంలో యెహోవాసాక్షుల సంఘాలు రెండు పౌలులాగే ప్రకటనాపనిలో భాగం వహిస్తూ ఇతరులకు బైబిలు సందేశాన్ని అందిస్తున్నాయి. సంఘ సభ్యులు యథార్థహృదయులను వెదికి, వారితో లేఖనాల్లోనుండి తర్కించి, బైబిల్లోని శక్తివంతమైన సందేశం సత్యదేవుడైన యెహోవా గురించి తెలుసుకోవాలనుకునే వారందరికీ సహాయపడేలా తోడ్పడతారు.​—⁠హెబ్రీయులు 4:​12.

[13వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో భాగం

ముసియ

త్రోయ

నెయపొలి

ఫిలిప్పీ

మాసిదోనియ

అంఫిపొలి

థెస్సలొనీక

బెరయ

గ్రీసు

ఏథెన్సు

కొరింథు

అకయ

ఆసియా

ఎఫెసు

రొదు

[13వ పేజీలోని చిత్రం]

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌ గ్రీకు దేవతగా చిత్రీకరించబడిన వెండి నాణెం

[చిత్రసౌజన్యం]

నాణెం: Pictorial Archive (Near Eastern History) Est.

[14వ పేజీలోని చిత్రం]

బెరయలోని యూదుల వాడకు వెళ్లే ద్వారాల్లో ఒకటి

[15వ పేజీలోని చిత్రం]

ఆధునిక బెరయలో ప్రాచీన సమాజమందిరం