కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహబంధంలో మీరు ఆశించినవి నెరవేరనప్పుడు

వివాహబంధంలో మీరు ఆశించినవి నెరవేరనప్పుడు

వివాహబంధంలో మీరు ఆశించినవి నెరవేరనప్పుడు

నిరాశానిస్పృహలు ఏ వివాహబంధంలోనైనా వృద్ధికావచ్చు, ఆఖరికి కోర్ట్‌షిప్‌ సమయంలో చూడముచ్చటగా కనిపించిన జంట మధ్య కూడా వృద్ధికావచ్చు. ఒకరితో ఒకరు వివాహ ప్రమాణాలు చేసుకునేముందు చిలకా గోరింకల్లా కనిపించిన ఇద్దరు వ్యక్తులు కొంతకాలం తర్వాత భిన్న ధృవాలుగా ఎలా మారగలరు?

వివాహితులు “బాధను, దుఃఖాన్ని” అనుభవిస్తారని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 7:​28, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) సాధారణంగా, వారు అలాంటి శ్రమలను కొంతమేరకు మానవ అపరిపూర్ణతవల్ల అనుభవిస్తారు. (రోమీయులు 3:​23) అంతేకాక, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు లేక ఇద్దరూ బైబిలు సూత్రాలను అన్వయిస్తుండకపోవచ్చు. (యెషయా 48:​17, 18) కొన్నిసార్లు స్త్రీ లేక పురుషుడు అవాస్తవిక ఆశలు పెట్టుకొని వివాహం చేసుకుంటారు. అలా వివాహం చేసుకున్నప్పుడు దంపతులమధ్య పొడచూపే అపార్థాలు గంభీరమైన సమస్యలకు దారితీయవచ్చు.

అవాస్తవిక ఆశలు

మీరు ఒక భర్త లేక భార్య అయితే, మీరెన్నో ఆశలు పెట్టుకొని వివాహం చేసుకొనివుండవచ్చు, చాలామంది అలా ఎన్నో ఆశలుపెట్టుకొని వివాహం చేసుకుంటారు. మీరు ఎలాంటి జీవితం కోసం ఆశించారో ఒకసారి ఆలోచించండి. మీ వివాహ జీవితం మీరు ఊహించిన విధంగా లేదా? అలా లేకపోతే, సమస్యలు పరిష్కరించుకోలేమనే నిర్ధారణకు రాకండి. బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు సహాయం చేస్తుంది. * (2 తిమోతి 3:​16) అదే సమయంలో, మీరు వివాహానికి సంబంధించి ఊహించిన కొన్ని విషయాల గురించి పునరాలోచించడం మంచిది.

ఉదాహరణకు, కల్పనాకథల్లో వర్ణించబడినట్లు వివాహ జీవితం రొమాంటిక్‌గా ఉంటుందని కొందరు భావిస్తారు. లేదా మీరు, మీ భాగస్వామి కలిసి ఎక్కువ సమయం గడుపుతారని లేక మీరిద్దరూ విభేదాలన్నిటినీ సాఫీగా, పరిణతితో పరిష్కరించుకుంటారని మీరు అనుకొనివుండవచ్చు. వివాహం చేసుకోవడంవల్ల లైంగిక కోరికలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉండదని చాలామంది అనుకున్నారు. ఈ సాధారణ ఆశలు కొంతమేరకు అవాస్తవికమైనవి కాబట్టి, అవి తప్పకుండా కొందరిలో నిరాశకు దారితీస్తాయి.​—⁠ఆదికాండము 3:​16.

మరో అవాస్తవికమైన ఆశ, వివాహం చేసుకోవడంవల్లనే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడన్నదే. నిజమే, జీవితంలో భాగస్వామి ఉండడంవల్ల ఎంతో ఆనందం కలిగే అవకాశముంది. (సామెతలు 18:​22; 31:​10; ప్రసంగి 4:⁠9) అలాగని, వివాహం విభేదాలన్నిటినీ చటుక్కున పరిష్కరిస్తుందని ఆశించవచ్చా? సాధారణంగా అలా ఆశించేవారు ఆశాభంగం చెందకమానరు!

అప్రకటిత ఆశలు

ఆశలన్నీ అవాస్తవమైనవి కావు. బదులుగా, కొన్ని కోరికలు అర్థం చేసుకోదగినవే. అయితే పెట్టుకున్న కొన్ని ఆశల కారణంగా సమస్యలు ఉత్పన్నంకావచ్చు. “భార్యాభర్తల్లో ఒకరు ఏదో ఒక కోరిక తీరాలని ఎదురుచూస్తున్నా భాగస్వామికి దాని గురించే స్పష్టంగా తెలియని కారణంగా వారు కోపగించుకోవడాన్ని నేను చూస్తున్నాను” అని ఒక వివాహ సలహాదారుడు చెబుతున్నాడు. అదెలా జరగవచ్చో గ్రహించడానికి క్రింది ఉదాహరణను పరిశీలించండి.

మేరీ తన ఊరికి వందల కిలోమీటర్ల దూరంలో నివసించే డేవిడ్‌ను వివాహం చేసుకుంది. తాను సహజంగానే బిడియస్థురాలు కాబట్టి క్రొత్త ప్రాంతానికి వెళ్లడంవల్ల తాను కష్టాలను ఎదుర్కోవాల్సివస్తుందని మేరీ పెళ్ళికిముందే గుర్తించింది. అయితే క్రొత్త పరిస్థితులతో సర్దుకుపోవడానికి డేవిడ్‌ తనకు సహాయం చేస్తాడనే ధైర్యంతో ఆమె ఉంది. ఉదాహరణకు, డేవిడ్‌ తనతోనే ఉండి, ఆయన తన స్నేహితులతో పరిచయం పెంచుకునేందుకు తనకు సహాయం చేస్తాడని మేరీ ఆశించింది. కానీ ఆమె అనుకున్నట్లు జరగడంలేదు. డేవిడ్‌ అనేకమంది స్నేహితులతో మాట్లాడుతూ గడుపుతున్నాడు గానీ క్రొత్తగా వచ్చిన మేరీని ఒంటరిగా వదిలేశాడు. డేవిడ్‌ తనను పట్టించుకోవడంలేదని, ఆయన దాదాపు తనను ఒంటరిగా విడిచిపెట్టాడని మేరీ భావించింది. ‘డేవిడ్‌ ఎందుకింత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు?’ అని ఆమె అనుకుంది.

మేరీ ఆశించింది అవాస్తవికమా? కాదు. తాను క్రొత్త పరిసరాలకు సర్దుకుపోవడానికి తన భర్త సహాయం చేయాలని మాత్రమే ఆమె కోరుకుంటోంది. మేరీ బిడియస్థురాలు కాబట్టి చాలామంది క్రొత్తవారిని కలుసుకోవడం ఆమెకు ఎంతో కష్టమైంది. వాస్తవమేమిటంటే, మేరీ తన భావాలను డేవిడ్‌కు ఎన్నడూ చెప్పలేదు. కాబట్టి, మేరీ భావాల గురించి డేవిడ్‌కు అసలు తెలియనే తెలియదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏమౌతుంది? మేరీకి కోపం పెరగవచ్చు, కొంతకాలానికి తన భర్త తన భావాల గురించి అసలు పట్టించుకోవడమేలేదని భావించవచ్చు.

మీ భాగస్వామి మీ అవసరాలను పట్టించుకోవడంలేదని మీకనిపిస్తే మీకు కూడా అలాంటి నిరాశ, విసుగు కలిగివుండవచ్చు. అలాంటప్పుడు మీరేమి చేయవచ్చు?

ఆ విషయం గురించి మాట్లాడండి

సఫలంకాని ఆశలు లేక కోరికలు మనోవేదనను కలిగించగలవు. (సామెతలు 13:​12) అయినా, పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరు ఒకటి చేయవచ్చు. “మీరు వివేకులై ఉండి, జ్ఞానయుక్తంగా మాట్లాడితే ఇతరులను ఒప్పించగలరు” అని ఒక బైబిలు సామెత చెబుతోంది. (సామెతలు 16:​23, కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌) కాబట్టి, మీరు పెట్టుకున్న సముచితమైన ఆశ తీరడంలేదనిపిస్తే ఆ విషయాన్ని మీ భాగస్వామితో చర్చించండి.

మీరు చింతిస్తున్న విషయాలను తెలియజేసేందుకు సరైన సమయాన్ని, సరైన పరిస్థితిని, సరైన పదాలను ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నించండి. (సామెతలు 25:​11) నెమ్మదిగా, గౌరవపూర్వకంగా మాట్లాడండి. మీ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి, మీరు మీ భాగస్వామిని నిందించాలని అనుకోవడంలేదు గానీ మీరు పెట్టుకున్న ఆశలను, మీ భావాలను తెలియజేయాలని అనుకుంటున్నారు.​—⁠సామెతలు 15:⁠1.

అసలు మీరిదంతా ఎందుకు చేయాలి? శ్రద్ధగల భాగస్వామి మీ అవసరాలను తెలుసుకోగలుగుతుంది లేక తెలుసుకోగలుగుతాడు కదా? మీ భాగస్వామి కేవలం విషయాలను భిన్న దృక్కోణంలో చూస్తుండవచ్చు, అయితే మీరు మీ అవసరాల గురించి వివరిస్తే వాటి గురించి ఆలోచించవచ్చు. మీకు కావాల్సినవి లేక అవసరమైనవి మీరు వివరించినంత మాత్రాన మీ వివాహ బంధం విఫలమైందని దాని భావం కాదు, అలాగే మీ భాగస్వామి నిర్లక్ష్యంగా ప్రవర్తించే వ్యక్తి అని అది రుజువు చేయదు.

కాబట్టి మీ భాగస్వామితో విషయాలను చర్చించడానికి సంకోచించవద్దు. ఉదాహరణకు, పైన వివరించబడిన పరిస్థితిలో మేరీ డేవిడ్‌కు ఇలా చెప్పవచ్చు: “చాలామంది క్రొత్తవారిని కలుసుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. నేను వారితో కలివిడిగా ఉండగలిగేవరకు, ప్రతీ ఒక్కరితో పరిచయం పెంచుకునేందుకు మీరు నాకు కాస్త సహాయం చేస్తారా?”

‘వినుటకు వేగిరపడడం’

మీరు ఆ విషయాన్ని మరో దృక్కోణం నుండి చూడండి. మీ భాగస్వామి మీ దగ్గరికి వచ్చి తనకున్న సముచితమైన ఆశను మీరు తీర్చడంలేదు కాబట్టి తాను మనోవేదనకు గురౌతున్నానని చెప్పారనుకుందాం. అలాంటప్పుడు మీ భాగస్వామి చెప్పేది వినండి! ఆత్మరక్షణ ధోరణిని అవలంబించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. బదులుగా, ‘వినడానికి వేగిరపడండి, మాటలాడడానికి, కోపించడానికి నిదానించండి.’ (యాకోబు 1:​19; సామెతలు 18:​13) అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఇలా ప్రోత్సహించాడు: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను.”​—⁠1 కొరింథీయులు 10:​24.

మీరు విషయాలను మీ భాగస్వామి దృక్కోణంలో చూడడం ద్వారా మీరలా చేయవచ్చు. బైబిలు ఇలా పేర్కొంటోంది: “అటువలెనే పురుషులారా, . . . జ్ఞానము చొప్పున వారితో [మీ భార్యలతో] కాపురము చేయుడి” లేక జె. బి. ఫిలిప్స్‌ అనువాదంలో ఉన్నట్లుగా “భర్తలారా, మీరు కాపురం చేస్తున్న మీ భార్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.” (1 పేతురు 3:⁠7) అవును, భార్యలు కూడా తమ భర్తల విషయంలో అలాగే కృషి చేయాలి.

మీరు, మీ భాగస్వామి ఎంత అన్యోన్యంగా ఉన్నా, మీ ఇద్దరికీ అన్ని విషయాల్లో ఒకే దృక్కోణం ఉండదని గుర్తుంచుకోండి. (“ఒకే ప్రకృతి దృశ్యం, భిన్న దృక్కోణాలు” అనే బాక్సు చూడండి.) నిజంగా, అలాంటి వ్యత్యాసం ఉండడం ప్రయోజనకరమే, ఎందుకంటే విషయాలను ఇతరుల దృక్కోణాల నుండి చూడడం మంచిది. కుటుంబ నేపథ్యం, సంస్కృతి వంటి విషయాల ఆధారంగా ప్రత్యేక ఆశలు పెట్టుకొని మీరు మీ భాగస్వామిని వివాహం చేసుకున్నారు. దానివల్ల మీరిద్దరూ ఒకరిపట్ల ఒకరు ప్రగాఢమైన ప్రేమను కలిగివుండవచ్చు, అదే సమయంలో మీకు భిన్నమైన ఆశలు ఉండవచ్చు.

ఉదాహరణకు, క్రైస్తవ దంపతులకు శిరస్సత్వం గురించిన బైబిలు సూత్రం తెలిసుండవచ్చు. (ఎఫెసీయులు 5:​22, 23) అయితే మీ కుటుంబంలో ప్రత్యేకంగా భర్త శిరస్సత్వాన్ని ఎలా నిర్వహించాలి, భార్య విధేయతను ఎలా కనబర్చాలి? ఈ బైబిలు సూత్రం మీ ఇద్దరినీ నిర్దేశిస్తోందా, దానిని అనుసరించడానికి మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్నారా?

అనుదిన జీవితంలో ఇతర అంశాల విషయంలో కూడా మీకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఇంటి పనులు కొన్నింటిని ఎవరు చేస్తారు? మీరు బంధువులతో ఎప్పుడు సమయం గడపాలి, ఎంత సమయం గడపాలి? తమ జీవితంలో రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానం ఇస్తున్నామని క్రైస్తవ దంపతులు ఎలా చూపిస్తారు? (మత్తయి 6:​33) ఆర్థిక సంబంధమైన విషయాలకొస్తే, అప్పుల్లో కూరుకుపోవడం సులభం కాబట్టి, డబ్బును పొదుపుగా ఖర్చు చేయడం, డబ్బును ఆదాచేసే మార్గాలను అన్వేషించడం మంచిది. అయినా, పొదుపుగా ఖర్చు చేయడానికి, డబ్బు ఆదా చేసే మార్గాలను అన్వేషించడానికి నిజంగా ఏమిచేయాలి? ఇలాంటి విషయాలను దాపరికంలేకుండా, గౌరవపూర్వకంగా చర్చించుకోవడంవల్ల మీకెంతో ప్రయోజనం చేకూరుతుంది.

ఇప్పటివరకు మీరు ఆశించినవి కొన్ని తీరకున్నా మీ వివాహ జీవితంలో ఎంతో సమాధానాన్ని చవిచూసేందుకు అలాంటి చర్చలు దోహదపడగలవు. మీరు అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ హితవును మరింత చక్కగా అన్వయించుకోగలుగుతారు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.”​—⁠కొలొస్సయులు 3:​13.

[అధస్సూచి]

^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలో దంపతులకు చక్కని సలహాలున్నాయి.

[10వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒకే ప్రకృతి దృశ్యం, భిన్న దృక్కోణాలు

‘విహార యాత్రకు వెళ్లిన బృందం ఆకర్షణీయమైన ఒక దృశ్యాన్ని చూస్తోందని ఊహించండి. ఆ బృందమంతా ఒకే దృశ్యాన్ని చూస్తున్నప్పటికి, వారిలో ఒక్కొక్కరు అదే దృశ్యాన్ని ఒక్కోరీతిగా చూస్తారు. ఎందుకు? ఎందుకంటే ఒక్కో వ్యక్తి ఒక్కో దృక్కోణం నుండి చూస్తాడు. ఏ ఇద్దరూ ఖచ్చితంగా ఒకే స్థలంలో నిలబడి లేరు. అంతేగాక బృందంలోని వారంతా దృశ్యంలోని ఒకే భాగాన్ని చూడడం లేదు. ఒక్కోవ్యక్తికి అందులోని ఒక్కో అంశం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వివాహ విషయంలో కూడా అంతే. వారెంతో అన్యోన్యంగా కనిపిస్తున్నా, ఏ దంపతులు వివిధ విషయాలపై ఒకే విధమైన దృక్కోణాన్ని కలిగివుండరు. . . . ఈ విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం ఆ సంభాషణలో ఇమిడివుంది. ఇలా చేయాలంటే మాట్లాడుకోవడానికి సమయం తీసుకోవాలి.’​—⁠కావలికోట, ఆగస్టు 1, 1993 4వ పేజీ.

[11వ పేజీలోని బాక్సు]

మీరిప్పుడు ఏమి చేయవచ్చు?

• మీరు ఆశించిన విషయాల గురించి పునరాలోచించండి. అవి వాస్తవికమైనవా? మీ భాగస్వామి నుండి మీరు సముచితమైనదాని కన్నా ఎక్కువగా ఆశిస్తున్నారా?​—⁠ఫిలిప్పీయులు 2:⁠4; 4:⁠5.

• అవాస్తవికమైన ఆశలను సరిచేసుకునేందుకు ప్రయత్నించండి. ఉదాహరణకు, “మా మాధ్య భేదాభిప్రాయాలకు తావేలేదు” అని చెప్పే బదులు, భేదాభిప్రాయాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేందుకు తీర్మానించుకోండి.​—⁠ఎఫెసీయులు 4:​32.

• మీరు పెట్టుకున్న ఆశల గురించి చర్చించండి. దాపరికంలేకుండా విషయాల గురించి మాట్లాడడం ఒకరిపట్ల ఒకరు ఎలా ప్రేమ చూపించుకోవాలో, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవడానికి తీసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన చర్య.​—⁠ఎఫెసీయులు 5:​33.

[9వ పేజీలోని చిత్రం]

మీ భాగస్వామి చింతిస్తున్న విషయాన్ని ‘వినడానికి వేగిరపడండి’