“ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు” ఇచ్చే సహాయం
“ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు” ఇచ్చే సహాయం
దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, బైబిలు రచయితయైన పౌలు యెహోవాను “ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు” అని వర్ణించాడు. (రోమీయులు 15:5) యెహోవా కాలంతోపాటు మారడని బైబిలు మనకు హామీ ఇస్తోంది కాబట్టి, ఆయనను సేవించేవారికి దేవుడు ఓదార్పునిస్తాడని మనం నమ్మవచ్చు. (యాకోబు 1:17) నిజానికి, యెహోవా అనేక విధాలుగా ఓదార్పునిస్తాడని బైబిలు వెల్లడిస్తోంది. వాటిలో కొన్ని ఏమిటి? సహాయం కోసం అర్థిస్తూ తనకు మొరపెట్టినవారికి యెహోవా శక్తిని అనుగ్రహిస్తాడు. తోటి విశ్వాసులకు ఓదార్పునందించేలా ఆయన నిజ క్రైస్తవుల్ని పురికొల్పుతాడు. అంతేకాదు, పిల్లల్ని మరణంలో కోల్పోయి దుఃఖిస్తున్నవారికి ఎంతో శక్తినివ్వగల, హృదయాన్ని స్పృశించగల వృత్తాంతాలను యెహోవా తన వాక్యమైన బైబిల్లో భద్రపరిచాడు. ఓదార్పునిచ్చే ఆ మూడు అంశాలను మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
“యెహోవా ఆలకించెను”
దావీదు రాజు సృష్టికర్తయైన యెహోవా గురించి ఇలా వ్రాశాడు: “జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము.” (కీర్తన 62:8) దావీదు యెహోవాను ఎందుకు అంతగా నమ్మాడు? తన గురించే చెబుతూ, “ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను” అని దావీదు వ్రాశాడు. (కీర్తన 34:6) తాను ఎదుర్కొన్న కష్టభరిత పరిస్థితులన్నింటిలోనూ దావీదు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు, యెహోవా అన్ని సమయాల్లోనూ ఆయనకు సహాయాన్ని అనుగ్రహించాడు. దేవుడు తనకు ఆసరాగా నిలుస్తూ, సహించేందుకు సహాయం చేస్తాడని దావీదు స్వీయానుభవం నుండి తెలుసుకున్నాడు.
దావీదులాగే, దుఃఖిస్తున్న తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదనను ఎదుర్కొంటున్నప్పుడు యెహోవా తమకు తోడుంటాడని తెలుసుకోవాలి. తమకు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే నమ్మకంతో వారు బహుగా ‘ప్రార్థన ఆలకించువానిని’ సమీపించవచ్చు. (కీర్తన 65:2) ముందటి ఆర్టికల్‌లో పేర్కొనబడిన విలియమ్ ఇలా అన్నాడు: “మా అబ్బాయి లేకుండా నేను ఇంక ఒక్క క్షణం కూడా జీవించలేనని నాకెన్నోసార్లు అనిపించింది, అప్పుడు నాకు ఉపశమనాన్ని కలుగజేయమని నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన అన్ని సమయాల్లోనూ నా జీవితాన్ని కొనసాగించడానికి నాకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చాడు.” మీరు కూడా అదే విధంగా విశ్వాసంతో యెహోవాకి ప్రార్థిస్తే, ఆకాశమందుండే ఆ గొప్ప దేవుడు మీకు బలాన్నిస్తాడు. తనను సేవించడానికి కృషి చేసేవారందరికీ నిజానికి ఆయనిలా వాగ్దానం చేస్తున్నాడు: “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.”—యెషయా 41:13.
నిజమైన స్నేహితులిచ్చే మద్దతు
పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు ఏకాంతంలో విలపించడానికి, తమ భావాల్ని అదుపులోకి తెచ్చుకోవడానికి తరచూ సమయం అవసరమౌతుంది. అయితే, వారు అలాగే చాలాకాలంపాటు ఇతరుల నుండి దూరంగా ఉండడం జ్ఞానయుక్తం కాదు. సామెతలు 18:1 ప్రకారం, “వేరుండగోరువాడు” హానికి గురవ్వచ్చు. కాబట్టి, దుఃఖిస్తున్నవారు తమను తాము ఇతరుల నుండి వేరుపర్చుకునే ఉరిలో పడకుండా జాగ్రత్తపడాలి.
ఆవేదనను అనుభవిస్తున్నవారికి దైవభక్తిగల స్నేహితులు ఎంతో విలువైన సహాయం అందించగలరు. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని సామెతలు 17:17 చెబుతోంది. ముందటి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన లూసీ కూడా, వాళ్లబ్బాయి చనిపోయిన తర్వాత నిజమైన స్నేహితులనుండి ఓదార్పు పొందింది. సంఘంలో తన తోటివిశ్వాసుల గురించి మాట్లాడుతూ, “వాళ్లు కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడకపోయినా, మమ్మల్ని పరామర్శించడం ఎంతో సహాయం చేసింది. ఒక స్నేహితురాలైతే నేను ఒంటరిగా ఉన్న రోజుల్లో నా దగ్గరికి వచ్చేది. నేను ఇంట్లో కూర్చుని దుఃఖిస్తూ ఉంటానని తనకి తెలుసు కాబట్టి తరచూ వచ్చి కలిసేది, కొన్నిసార్లు నాతోపాటు ఆమెకూడా దుఃఖించేది. ఇంకొక స్నేహితురాలైతే ప్రతీరోజు నన్ను ప్రోత్సహించడానికి వచ్చేది. మరికొందరు మమ్మల్ని భోజనాలకి పిలిచేవారు, ఇంకా పిలుస్తూనే ఉన్నారు” అని చెబుతోంది.
తమ పిల్లల్ని కోల్పోయినప్పుడు కలిగే తీవ్రమైన వ్యథ అంత సులభంగా పోయేది కాకపోయినా, దుఃఖిస్తున్నవారు దేవునికి ప్రార్థించడం, యథార్థ క్రైస్తవ స్నేహితులతో సహవసించడం నిజమైన ఓదార్పునిస్తాయి. తమ పిల్లల్ని కోల్పోయిన అనేకమంది యెహోవా తమకు తోడున్నాడని గ్రహించారు. అవును, యెహోవా ‘గుండె చెదరినవారిని బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు.’—కీర్తన 147:3.
ఓదార్పునిచ్చే బైబిలు వృత్తాంతాలు
ప్రార్థన, ప్రోత్సాహకరమైన సహవాసంతోపాటు వ్యథలో ఉన్నవారికి దేవుని లిఖిత వాక్యం ఓదార్పునిస్తుంది. బైబిలు వృత్తాంతాలు, చనిపోయినవారిని తిరిగి లేపడం ద్వారా పిల్లల్ని మరణంలో కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖాన్ని తీసేయాలనే ప్రగాఢ కోరిక, సామర్థ్యం యేసుకు ఉన్నాయని తెలియజేస్తున్నాయి. దుఃఖిస్తున్నవారికి అలాంటి వృత్తాంతాలు నిజమైన ఓదార్పునిస్తాయి. మనం అలాంటి రెండు వృత్తాంతాలను పరిశీలిద్దాం.
యేసు నాయీను అనే పట్టణంలో అంత్యక్రియల ఊరేగింపును చూసినప్పుడు ఏమి జరిగిందో లూకా 7వ అధ్యాయం వివరిస్తోంది. ఆ ప్రజలు విధవరాలి ఒక్కగానొక్క కుమారుణ్ణి సమాధి చేయబోతున్నారు. “ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి—ఏడువవద్దు” అని చెప్పాడని 13వ వచనం చెబుతోంది.
తన కొడుకు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు తల్లిని ఏడ్వవద్దని చెప్పడానికి చాలా తక్కువమంది సాహసిస్తారు. యేసు ఆమెతో ఎందుకలా అన్నాడు? ఎందుకంటే కాసేపట్లో ఆమె దుఃఖించాల్సిన అవసరం ఉండదని ఆయనకు తెలుసు. ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “[యేసు] దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన—చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; లూకా 7:13-15) ఆ క్షణంలో ఆ తల్లి సంతోషంతో మళ్లీ కంటతడి పెట్టుకుని ఉండవచ్చు.
ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను.” (మరో సందర్భంలో, యాయీరు అనే వ్యక్తి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 12 ఏళ్ల తన కూతురిని స్వస్థపర్చమని అర్థించడానికి యేసు దగ్గరికి వచ్చాడు. కొంతసేపటికి, ఆ అమ్మాయి చనిపోయిందనే వార్త ఆయనకు అందింది. ఆ వార్త యాయీరు హృదయాన్ని కలచివేసింది, అయితే యేసు ఆయనతో “భయపడకుము, నమ్మిక మాత్రముంచుము” అని అన్నాడు. వారి ఇంటికి వెళ్లిన తర్వాత యేసు చనిపోయిన ఆ అమ్మాయి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని, ఆయనిలా అన్నాడు: “చిన్నదానా, లెమ్ము!” ఆ తర్వాత ఏమి జరిగింది? “వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను.” దానికి ఆమె తల్లిదండ్రులెలా స్పందించారు? “వారు బహుగా విస్మయమొందిరి.” యాయీరు, ఆయన భార్య తమ కూతురిని అక్కున చేర్చుకొని ఎంతో సంతోషించారు. వారికది కలలానే అనిపించింది.—మార్కు 5:22-24, 35-43.
పిల్లల పునరుత్థానం గురించిన అలాంటి వివరణాత్మకమైన వృత్తాంతాలు, నేడు బాధననుభవిస్తున్న తల్లిదండ్రులు భవిష్యత్తులో దేనికోసం ఎదురుచూడవచ్చో చూపిస్తాయి. ‘ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని బయటికి వచ్చెదరు’ అని యేసు చెప్పాడు. (యోహాను 5:28, 29) తన కుమారుడు చనిపోయినవారికి తిరిగి జీవాన్నివ్వాలని యెహోవా సంకల్పించాడు. యేసు వారితో “లెమ్ము!” అని చెప్పగానే మృత్యుఒడికి చేరుకున్న లక్షలాదిమంది పిల్లలు ‘ఆయన శబ్దము వింటారు.’ ఆ పిల్లలందరూ తిరిగి నడుస్తారు, మాట్లాడతారు. యాయీరు, ఆయన భార్యలా ఆ పిల్లల తల్లిదండ్రులు ‘బహుగా విస్మయం చెందుతారు.’
మీ అమ్మాయి లేక అబ్బాయి కూడా చనిపోతే, యెహోవా వారిని పునరుత్థానం చేయడంద్వారా మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలడని తెలుసుకోండి. ఆ మహిమాన్విత నిరీక్షణ నుండి ప్రయోజనం పొందడానికి మీరు కీర్తనకర్త ప్రోత్సహిస్తున్నట్లుగా, “యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. . . . ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి.” (కీర్తన 105:4, 5) అవును, సత్య దేవుడైన యెహోవాను సేవిస్తూ, ఆమోదయోగ్యంగా ఆయనను ఆరాధించండి.
మీరు ‘యెహోవాను వెదికిన’ సత్వరమే కలిగే ప్రయోజనాలేమిటి? మీరు దేవునికి ప్రార్థించడం ద్వారా శక్తిని పొందుతారు, నిజ క్రైస్తవ సహవాసులు చూపించే ప్రేమపూర్వక శ్రద్ధ నుండి ఓదార్పునందుకుంటారు, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రోత్సహించబడతారు. అంతేకాక, సమీప భవిష్యత్తులో యెహోవా మీ ప్రయోజనార్థం, చనిపోయిన మీ బిడ్డల నిరంతర ప్రయోజనార్థం “ఆశ్చర్య కార్యములను” చేయడాన్ని మీరు చూస్తారు.
[5వ పేజీలోని బాక్సు]
‘ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిని తీసుకురండి’
నైజీరియాకు చెందిన యెహోవాసాక్షులైన కాహిందే, బింటూ అనే దంపతుల పిల్లల్లో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కారు ప్రమాదంలో మరణించారు. అప్పటినుండి వారు తమ పిల్లల మరణం విషయంలో దుఃఖిస్తూనే ఉన్నారు. అయినా, యెహోవాపై ఉన్న నమ్మకం వారికి బలాన్నిస్తుంది కాబట్టి వారు బైబిలిచ్చే నిరీక్షణా సందేశాన్ని తమ పొరుగువారితో పంచుకోవడం మానలేదు.
కాహిందే, బింటూలు ప్రశాంతంగా, ధైర్యంగా ఉండడాన్ని ఇతరులు గమనించారు. ఒకరోజు యుకోలై అనే స్త్రీ, బింటూ స్నేహితురాలితో ఇలా అంది: “ఒకేసారి ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నప్పటికీ బైబిలు సందేశాన్ని ప్రకటిస్తూనే ఉన్న తల్లిని తీసుకురండి. ఆమె అంతగా సహించడానికి శక్తి ఎక్కడినుండి వస్తుందో నాకు తెలుసుకోవాలని ఉంది.” బింటూ ఆ స్త్రీ ఇంటికి వెళ్లినప్పుడు యుకోలై ఆమెతో ఇలా అంది: “నీ పిల్లల్ని చంపిన ఆ దేవుని గురించి నువ్వు ఇంకా ఎందుకు ప్రకటిస్తున్నావో నాకు తెలుసుకోవాలని ఉంది. నాకున్న ఒకేఒక కూతుర్ని ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడు. అప్పటినుండి ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదు.” బింటూ బైబిలును ఉపయోగించి, ప్రజలు ఎందుకు చనిపోతున్నారో, చనిపోయిన మన ప్రియమైనవారు పునరుత్థానం చేయబడతారనే స్థిర నమ్మకాన్ని మనం ఎందుకు కలిగివుండవచ్చో వివరించింది.—అపొస్తలుల కార్యములు 24:14-15; రోమీయులు 5:12.
ఆ తర్వాత యుకోలై ఇలా అంది: “ప్రజల మరణానికి దేవుడే కారకుడని నేను నమ్మేదాన్ని. ఇప్పుడే నాకు నిజమేంటో తెలిసింది.” ఆమె దేవుని వాగ్దానాల గురించి మరింతగా తెలుసుకోవడానికి యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది.
[6వ పేజీలోని బాక్సు]
‘నాకు సహాయం చేయాలనే ఉంది, కానీ ఎలాగో తెలీదు’
మరణించినవారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎంతో ఆవేదనను అనుభవిస్తుండగా వారి స్నేహితులకు ఏమి చేయాలో అర్థం కాకపోవచ్చు. ఆ కుటుంబానికి సహాయపడాలని ఉన్నా, పొరపాటుగా మాట్లాడినా లేక తప్పు చేసినా వారిని ఇంకా ఎక్కడ బాధపెడతామో అనే భయం వారికుంటుంది. ‘నాకు సహాయం చేయాలనే ఉంది, కానీ ఎలాగో తెలీదు’ అని ఆలోచించేవారికి ఇక్కడ కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి.
❖ మీకు ఏమి మాట్లాడాలో, ఏమి చేయాలో తెలియనంత మాత్రాన వారిని ఒంటరిగా విడిచిపెట్టకండి. మీరక్కడ ఉండడమే వారికి బలాన్నివ్వగలదు. మీకు మాటలే కరువయ్యాయా? వారిని కౌగిలించుకుని, హృదయపూర్వకంగా ‘నాకు చాలా బాధగా ఉంది’ అని అనడం ద్వారా వారిపట్ల మీకు శ్రద్ధ ఉందని చూపించవచ్చు. ఒకవేళ మీరు దుఃఖించడం మొదలుపెడితే వారి దుఃఖం ఎక్కువౌతుందేమో అని మీరు భయపడుతున్నారా? “ఏడ్చువారితో ఏడువుడి” అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 12:16) మీ కన్నీరు మీరు వారి బాధను పంచుకోవాలనుకుంటున్నారని చూపిస్తుంది, అది ఓదార్పునిస్తుంది.
❖ చొరవ తీసుకోండి. మీరు ఆ కుటుంబం కోసం తేలికపాటి భోజనం తయారుచేసి పెట్టగలరా ? వంటగదిలో అలాగే ఉండిపోయిన గిన్నెలను కడగగలరా? వారికోసం బజారుకు వెళ్లడంలాంటి పనులు చేయగలరా? “మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి” అని అనకండి. అలా మీరు మనస్ఫూర్తిగానే అన్నా, మీరు వారికి సహాయం చేయడానికి చాలా బిజీగా ఉన్నారని వారికనిపిస్తుంది. బదులుగా, “ఇప్పుడు మీకేదైనా సహాయం అవసరమా” అని అడిగి, వారు కోరినదాన్ని చేయండి. కానీ వాళ్ల ఇంట్లో మీకు సంబంధించని చోటుకు వెళ్లకండి లేదా వారి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోకండి.
❖ “మీకెలా అనిపిస్తుందో నాకు తెలుసు” అని అనకండి. ప్రియమైనవారు చనిపోయినప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కోవిధంగా ప్రతిస్పందిస్తారు. మీరు కూడా పిల్లల్ని కోల్పోయినవారైనా, వారి భావాలు ఖచ్చితంగా ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోలేరు.
❖ ఆ ఇంట్లోని పరిస్థితులు స్థిమితపడడానికి చాలా సమయం పడుతుంది. మీరు చేయగలిగినంత సహాయం చేస్తూనే ఉండండి. ఎవరైనా చనిపోయినప్పుడు మొదట్లో అందరూ సానుభూతి చూపిస్తారు. కానీ వారికి దానికన్నా ఎక్కువే అవసరం. తర్వాతి వారాల్లో, నెలల్లో వారి అవసరాలపై శ్రద్ధ చూపించండి. *
[అధస్సూచి]
^ పేరా 29 తమ పిల్లల్ని మరణంలో కోల్పోయిన వారికి ఎలా సహాయం చేయాలనే విషయం గురించి మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన మీరు ప్రేమిస్తున్న వారెవరైనా చనిపోతే అనే బ్రోషురులోని 20-4 పేజీల్లో ఉన్న “ఇతరులు ఎలా సహాయపడగలరు?” అనే అధ్యాయాన్ని చూడండి.
[7వ పేజీలోని చిత్రాలు]
యేసుకు, చనిపోయిన పిల్లల్ని పునరుత్థానం చేసే సామర్థ్యం, కోరిక ఉన్నాయని బైబిలు వృత్తాంతాలు తెలియజేస్తున్నాయి