కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చాలాకాలం ఉండే తీవ్ర ఆవేదన

చాలాకాలం ఉండే తీవ్ర ఆవేదన

చాలాకాలం ఉండే తీవ్ర ఆవేదన

తమ ప్రియమైనవారి మరణాన్నిబట్టి దుఃఖిస్తున్నవారు కాలం గడిచేకొద్దీ తమ ఆవేదనను తాళుకోగలుగుతున్నారో లేదో తెలుసుకోవాలని ఇటీవలి ఒక పరిశోధకుడు అనుకున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం తమ పిల్లలను కోల్పోయిన కొంతమంది తల్లిదండ్రులకు ఆయన ప్రశ్నాపత్రాలను పంపించాడు. వారిలో అందరూ వాటికి స్పందించలేదు. ఐదేళ్ల క్రితం తన కుమారుణ్ణి పోగొట్టుకున్న తండ్రియైన వ్లాడిమిర్‌ మాత్రం, వాళ్లబ్బాయి గురించి మాట్లాడడం తనకింకా కష్టంగానే ఉందని వివరించాడు. *

తమ పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు అలాంటి తీరని దుఃఖం కలగడం సహజమే. విలియమ్‌ వాళ్ల 18 ఏళ్ల కొడుకు పది సంవత్సరాల క్రితం నీళ్లలో మునిగి చనిపోయాడు. “మా అబ్బాయి మరణం గురించిన ఆవేదన నన్నింకా వెంటాడుతూనే ఉంది, నేను బ్రతికున్నంతవరకు దాన్ని దిగమింగుకోలేను” అని విలియమ్‌ వ్రాశాడు. లూసీ వాళ్ల కొడుకు ఐదేళ్ల క్రితం ఊహించని వ్యాధికి గురై మృత్యువాతపడ్డాడు. “కొన్ని రోజులవరకు నేనది నమ్మలేకపోయాను. నాకేదో పీడకల వచ్చిందనీ, అది చెదిరిపోతుందనీ నాకనిపించేది. కానీ కొంతకాలానికి, మా అబ్బాయి ఇక ఎప్పటికీ తిరిగి రానంత దూరం వెళ్లిపోయాడనే విషయాన్ని గ్రహించేందుకు ప్రయత్నించాను. మా అబ్బాయి చనిపోయి ఐదు సంవత్సరాలవుతున్నా, నేను ఒంటరిగా ఉన్నప్పుడెల్లా ఆ విషయం గుర్తుకువచ్చి ఏడుస్తాను” అని ఆమె చెబుతోంది.

తమ పిల్లల్ని కోల్పోయిన వ్లాడిమిర్‌, విలియమ్‌, లూసీ లాంటి తల్లిదండ్రులు ఎందుకలా చాలాకాలం పాటు ఆవేదనను అనుభవిస్తారు? మనం కొన్ని కారణాలను పరిశీలిద్దాం.

ఎందుకింతటి ఆవేదన?

మరే మానవ బాంధవ్యాల్లో కనిపించనంతగా, ఒక కుటుంబంలో పసికందు పుట్టగానే తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఎంతో పరవశులౌతారు. తమ పాపను ఎత్తుకున్నప్పుడు, ఆ చిన్నారి ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు లేక బోసినవ్వులు నవ్వినప్పుడు చూసి వారు అనిర్వచనీయమైన ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు. ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లల్ని కంటిపాపలా చూసుకుంటారు. తమ పిల్లలు సరైన విధంగా, మర్యాదగా ప్రవర్తించేలా వారికి శిక్షణనిస్తారు. (1 థెస్సలొనీకయులు 2:​7, 11) తామిచ్చే శిక్షణకు స్పందిస్తూ, దానికి అనుగుణంగా పెరిగినప్పుడు తల్లిదండ్రులు వారి విషయంలో గర్వించి, వారిపై ఎన్నో ఆశలు పెంచుకుంటారు.

శ్రద్ధగల తల్లిదండ్రులు తమ పిల్లలను పోషించడానికి చెమటోడ్చి పనిచేస్తారు. తగిన సమయంలో తమ పిల్లలూ ఒక ఇంటివారయ్యేందుకు సహాయం చేయడానికి వారు నెలనెలా డబ్బో, వస్తువులో దాచిపెడుతుండవచ్చు. (2 కొరింథీయులు 12:​14) వారు మనస్ఫూర్తిగా, అంత సమయం, కృషి, డబ్బు వెచ్చించడం ఒక విషయాన్ని రుజువుచేస్తుంది. అదేమిటంటే, తల్లిదండ్రులు తమ పిల్లలు బ్రతికుండాలనే ఆశతో పెంచుతారు కానీ చనిపోవడానికి కాదు. పిల్లవాడు చనిపోయినప్పుడు వారిని పెంచడం మధ్యలోనే ఆగిపోతుంది, తల్లిదండ్రుల ఆశలు అడియాసలవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలపై చూపించాలనుకున్న ప్రేమ, ఆత్మీయతకు మధ్య మరణం పెద్ద అడ్డుగోడగా నిలుస్తుంది. ఒకప్పుడు తమ పిల్లలకు నెలవుగా నిలిచిన హృదయం ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకోలేరు.

పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్రమైన, తీరని దుఃఖాన్ని అనుభవిస్తారని బైబిలు ధృవీకరిస్తోంది. పితరుడైన యాకోబు తన కుమారుడైన యోసేపు చంపబడ్డాడని విన్నప్పుడు ఏమి జరిగిందో వర్ణిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక​—⁠నేను అంగలార్చుచు మృతుల లోకమునకు [లేక సమాధికి] నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి . . . అతని కోసము ఏడ్చెను.” తన కుమారుడు చనిపోయాడనుకున్న యాకోబు చాలా సంవత్సరాల తర్వాత కూడా దుఃఖిస్తూనే ఉన్నాడు. (ఆదికాండము 37:​34, 35; 42:​36-38) మరో బైబిలు ఉదాహరణ, విశ్వాసురాలైన నయోమి అనే స్త్రీ, ఆమె తన కుమారులిద్దరినీ మరణంలో కోల్పోయింది. ఎంతో కృంగిపోయిన ఆమె, నయోమి అంటే “మధురం” అని అర్థమొచ్చే తన పేరును మారా అంటే “చేదు” అని మార్చుకోవాలనుకుంది.​—⁠రూతు 1:​3-5, 20, 21.

అయితే బైబిలు, తల్లిదండ్రులు అనుభవించే ఆవేదనను గురించి మాత్రమే చెప్పడం లేదు. దుఃఖిస్తున్నవారికి యెహోవా ఎలా శక్తినిస్తాడో కూడా అది తెలియజేస్తుంది. తర్వాతి ఆర్టికల్‌లో మనం, దేవుడు దుఃఖిస్తున్నవారికి ఓదార్పునందించే కొన్ని విధాలను పరిశీలిద్దాం.

[అధస్సూచి]

^ పేరా 2 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.