కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యం మీ అడుగులను నిర్దేశించనివ్వండి

దేవుని వాక్యం మీ అడుగులను నిర్దేశించనివ్వండి

దేవుని వాక్యం మీ అడుగులను నిర్దేశించనివ్వండి

“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.”​—⁠కీర్తన 119:​105.

మీరు ఎవరినైనా దిశానిర్దేశాల కోసం అడగవలసి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకోగలరా? బహుశా మీరు మీ గమ్యానికి దగ్గర్లోనేవున్నారు, కానీ చివరి కొన్ని మలుపులు మీకంతగా తెలియదు. లేదా మీరు పూర్తిగా దారితప్పారు, మీరు మీ దారినే పూర్తిగా మార్చుకోవాలి. ఈ రెంటిలో ఏదైనా, ఆ ప్రాంతం తెలిసిన వ్యక్తి దిశానిర్దేశాలను అనుసరించడం జ్ఞానయుక్తం కాదా? అలాంటి వ్యక్తి మీ గమ్యం చేరుకునేందుకు మీకు సహాయం చేయగలడు.

2 వేలాది సంవత్సరాలుగా మానవులు దేవుని సహాయం లేకుండా తమ మార్గాన్ని నిర్దేశించుకొనేందుకు ప్రయత్నించారు. అయితే దేవునిపై ఆధారపడని అపరిపూర్ణ మానవులు పూర్తిగా దారితప్పారు. నిజమైన శాంతి సంతోషాల మార్గాన్ని తెలుసుకోవడం వారి వశంలో లేదు. వారెందుకు ఆ గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు? ప్రవక్తయైన యిర్మీయా 2,500 సంవత్సరాలకన్నా ఎక్కువకాలం క్రితమే ఇలా అన్నాడు: “మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.” (యిర్మీయా 10:​23) యోగ్యమైన సహాయాన్ని అంగీకరించకుండా తన మార్గాన్ని నిర్దేశించుకునేందుకు ప్రయత్నించే వ్యక్తి ఖచ్చితంగా నిరాశ చెందుతాడు. అవును, మానవాళికి దిశానిర్దేశం అవసరం!

3 అలాంటి దిశానిర్దేశం అందించేందుకు యెహోవా దేవునికే అత్యుత్తమ అర్హతవుంది. ఎందుకు? ఎందుకంటే మానవుల నిర్మాణాన్ని వేరెవరికన్నా ఆయనే చక్కగా అర్థం చేసుకోగలడు. మానవజాతి ఎలా దారితప్పి, దిక్కుతోచని స్థితిలో పడిందో ఆయనకు పూర్తిగా తెలుసు. తిరిగి సరైన దారిలోకి వచ్చేందుకు వారికేమి అవసరమో కూడా ఆయనకు తెలుసు. అంతేకాక, మనకేది మంచిదో సృష్టికర్తగా యెహోవాకు ఎల్లప్పుడూ తెలుసు. (యెషయా 48:​17) కాబట్టి, కీర్తన 32:8లో నమోదు చేయబడివున్నట్లుగా, ఆయన చేసిన ఈ వాగ్దానాన్ని మనం పూర్తిగా నమ్మవచ్చు: “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” యెహోవాయే ఉత్తమ దిశానిర్దేశమిస్తాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. అయితే ఆయన మనకెలా నిర్దేశమిస్తాడు?

4 ఒక కీర్తనకర్త యెహోవాకు చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.” (కీర్తన 119:​105) దేవుని వాక్కులు, జ్ఞాపికలు బైబిల్లో ఉండడమేకాక, మన జీవన మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు కూడా మనకు సహాయం చేయగలవు. మనం బైబిలు చదివి మనల్ని నడిపించేందుకు దానిని అనుమతిస్తే, యెషయా 30:⁠21లో వర్ణించబడినది మనం వ్యక్తిగతంగా చవిచూస్తాం. అక్కడిలా చెప్పబడింది: “ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”

5 అయితే కీర్తన 119:​105, దేవుని వాక్యంచేసే పరస్పర సంబంధమున్న రెండు పనులను సూచిస్తోందని గమనించండి. మొదటిది, అది మన పాదాలకు దీపంలా పనిచేస్తుంది. దైనందిన సమస్యలను మనం ఎదుర్కొన్నప్పుడు, మనం జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకొని ఈ లోకపు చిక్కుల్లో, ప్రమాదాల్లో పడకుండా బైబిల్లోని సూత్రాలు మన అడుగులను నిర్దేశించాలి. రెండవది, దేవుని జ్ఞాపికలు మన త్రోవకు వెలుగునిస్తూ, దేవుని వాగ్దత్త పరదైసులో నిత్యం జీవించాలనే మన నిరీక్షణకు పొందికగా ఎంపికలు చేసుకునేందుకు సహాయం చేస్తాయి. ముందున్న దారి వెలుగుమయమై ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట మార్గాన్ని అనుసరించడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలను, అవి మంచివైనా చెడ్డవైనా మనం గ్రహించగల్గుతాం. (రోమీయులు 14:​21; 1 తిమోతి 6:⁠9; ప్రకటన 22:​12) బైబిల్లోని దేవుని వాక్కులు ఎలా మన పాదాలకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా ఉండగలవో మనం మరింత వివరణాత్మకంగా చూద్దాం.

“నా పాదములకు దీపము”

6 ప్రతీరోజు మనం నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు అంత ప్రాముఖ్యమైనవిగా అనిపించకపోవచ్చు, అయితే కొన్నిసార్లు మన నైతికతను, నిజాయితీని లేదా మన తటస్థ వైఖరిని పరీక్షించే పరిస్థితి మనకు ఎదురుకావచ్చు. అలాంటి పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనేందుకు, “మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు” మనకుండాలి. (హెబ్రీయులు 5:​14) దేవుని వాక్య ప్రామాణిక జ్ఞానాన్ని సంపాదించుకుని, దానిలోని సూత్రాల అవగాహనను వృద్ధి చేసుకోవడం ద్వారా మనం యెహోవాకు సంతోషం కలిగించే నిర్ణయాలు తీసుకునేలా మన మనస్సాక్షికి శిక్షణనిస్తాం.​—⁠సామెతలు 3:⁠21.

7 ఒక ఉదాహరణ పరిశీలించండి. మీరు యెహోవా హృదయాన్ని సంతోషపెట్టాలని యథార్థంగా ప్రయత్నిస్తున్న వ్యక్తా? (సామెతలు 27:​11) అలాగైతే, మిమ్మల్ని మెచ్చుకోవల్సిందే. అయితే మీ తోటి ఉద్యోగులు ఒకానొక క్రీడను చూసేందుకు తమతోపాటు రమ్మని మీకు టిక్కెట్టు ఇచ్చారని ఊహించుకోండి. ఉద్యోగ స్థలంలో మీ సహవాసాన్ని వారు ఆనందిస్తున్నారు, అందుకే ఉద్యోగేతర విషయాల్లో మీతో సమయం గడిపేందుకు వారిష్టపడుతున్నారు. వారు చెడ్డవారు కాదనే బలమైన అభిప్రాయం మీకుండవచ్చు. కొన్ని విషయాల్లో వారు మంచి లక్షణాలు కనబరుస్తుండవచ్చు కూడా. మీరేమి చేస్తారు? ఆ ఆహ్వానాన్ని అందుకోవడంలో ప్రమాదమేమైనా ఉండగలదా? ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేందుకు దేవుని వాక్యం మీకెలా సహాయం చేయగలదు?

8 కొన్ని లేఖన సూత్రాలను పరిశీలించండి. మొట్టమొదట 1 కొరింథీయులు 15:⁠33లోని సూత్రం గుర్తుకురావచ్చు. ఆ వచనమిలా చెబుతోంది: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.” ఈ సూత్రానికి కట్టుబడి ఉండేందుకు మీరు అవిశ్వాసులకు పూర్తిగా దూరంగా ఉండాలా? లేదు అనేదే ఆ ప్రశ్నకు లేఖనాధార జవాబు. నిజానికి, అపొస్తలుడైన పౌలు స్వయంగా, అవిశ్వాసులతోసహా ‘అందరిపట్ల’ ప్రేమపూర్వక శ్రద్ధ కనబర్చాడు. (1 కొరింథీయులు 9:​22) మన నమ్మకాలను పంచుకోని వారితోసహా ఇతరులపట్ల శ్రద్ధ చూపించాలనేదే క్రైస్తవత్వ సారం. (రోమీయులు 10:​13-15) నిజానికి, మన సహాయం అవసరమైన ప్రజలకు మనల్నిమనం దూరం చేసుకుంటే, ‘అందరియెడల మేలు చేయుము’ అనే హితవును మనమెలా అనుసరించగలము?​—⁠గలతీయులు 6:​10.

9 అయితే, తోటి ఉద్యోగస్థులతో స్నేహపూర్వకంగా ఉండేందుకు, వారి సన్నిహిత సహవాసిగా ఉండేందుకు మధ్య భేదముంది. దీనిలో మరో లేఖనాధార సూత్రం ఇమిడివుంది. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: “మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి.” (2 కొరింథీయులు 6:​14, పరిశుద్ధ గ్రంథము, రెఫరెన్సుల గలది) “అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి” అనే పదబంధం యొక్క అర్థమేమిటి? కొన్ని బైబిలు అనువాదాలు “జత కట్టకండి,” “సమ ఉజ్జీలుగా కలిసి పనిచేసేందుకు ప్రయత్నించకండి,” లేదా “అనుచిత సంబంధాలు ఏర్పరచుకోకండి” అని అనువదించాయి. తోటి ఉద్యోగితో సంబంధం ఎప్పుడు అనుచితంగా మారుతుంది? అది ఎప్పుడు హద్దుదాటి విజ్జోడుగా తయారౌతుంది? ఇలాంటి పరిస్థితిలో దేవుని వాక్యమైన బైబిలు మీ మార్గాన్ని నిర్దేశించగలదు.

10 మానవులు సృష్టింపబడినప్పటి నుండి వారిపట్ల ప్రేమ కలిగివున్న యేసు ఉదాహరణను పరిశీలించండి. (సామెతలు 8:​31) భూమ్మీద ఉన్నప్పుడు ఆయన తన అనుచరులతో సన్నిహిత బంధాన్ని ఏర్పర్చుకున్నాడు. (యోహాను 13:⁠1) మతసంబంధంగా తప్పుదోవ పట్టించబడిన వ్యక్తిని సహితం ఆయన ‘ప్రేమించాడు.’ (మార్కు 10:​17-22) అయితే యేసు సన్నిహిత సహవాసులను ఎంచుకునే విషయంలో స్పష్టమైన హద్దులు పెట్టుకున్నాడు. ఆయన తన తండ్రి చిత్తం చేయడంలో నిజమైన ఆసక్తిలేని ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోలేదు. ఒక సందర్భంలో యేసు ఇలా అన్నాడు: “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.” (యోహాను 15:​14) మీరు ప్రత్యేకంగా ఓ తోటి ఉద్యోగితో స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ మిమ్మల్నిమీరు ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఈ వ్యక్తి యేసు ఆజ్ఞాపించినవాటిని చేసేందుకు ఇష్టపడుతున్నాడా? ఆరాధించమని యేసు చెప్పిన యెహోవాను గురించి తెలుసుకునేందుకు ఇతను లేదా ఈమె ఇష్టపడుతున్నారా? క్రైస్తవునిగా నేను కలిగివున్న అవే నైతిక ప్రమాణాలను అతను లేదా ఆమె కలిగియున్నారా?’ (మత్తయి 4:​10) మీ తోటి ఉద్యోగస్థులతో మీరు మాట్లాడుతూ బైబిలు ప్రమాణాలను అన్వయించుకోవాలని నొక్కిచెప్పినప్పుడు ఈ ప్రశ్నలకు జవాబులు స్పష్టమౌతాయి.

11 దేవుని వాక్కులు మన పాదాలకు దీపంలా ఉండగల ఇతర పరిస్థితులు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, నిరుద్యోగిగావున్న ఒక క్రైస్తవునికి ఎంతో అవసరమైన ఉద్యోగం దొరికే అవకాశం వచ్చింది. అయితే, ఆ ఉద్యోగానికి ఎక్కువ సమయం, శక్తి వెచ్చించాలి, ఒకవేళ ఆయన ఆ ఉద్యోగానికి ఒప్పుకుంటే క్రైస్తవ కూటాల్లో చాలావాటికి హాజరవలేకపోవడమేకాక, సత్యారాధనకు సంబంధించిన ఇతర కార్యక్రమాలకు వెళ్ళడానికి ఉండదు. (కీర్తన 37:​25) మరో క్రైస్తవుడు, బైబిలు సూత్రాలను స్పష్టంగా ఉల్లంఘించే వినోదాన్ని చూసేందుకు తీవ్రంగా శోధించబడవచ్చు. (ఎఫెసీయులు 4:​17-19) మరోవ్యక్తి తోటి విశ్వాసుల అపరిపూర్ణతలనుబట్టి ఊరకనే అభ్యంతరపడేందుకు మొగ్గుచూపవచ్చు. (కొలొస్సయులు 3:​13) ఇలాంటి పరిస్థితులన్నింటిలో, దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా ఉండేందుకు అనుమతించాలి. అవును, బైబిలు సూత్రాలను పాటించడం ద్వారా జీవితంలో ఎలాంటి సవాలునైనా మనం విజయవంతంగా ఎదుర్కోవచ్చు. దేవుని వాక్యం “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”​—⁠2 తిమోతి 3:​16.

“నా త్రోవకు వెలుగు”

12 మన ముందున్న దారిని వెలుగుమయం చేస్తూ దేవుని వాక్కులు, మన త్రోవకు వెలుగైవుండగలవని కూడా కీర్తన 119:​105 చెబుతోంది. భవిష్యత్తు విషయానికొస్తే, మనం చీకట్లో విడిచిపెట్టబడలేదు, ఎందుకంటే బైబిలు లోకంలోని ఆందోళనకర పరిస్థితుల భావాన్ని వివరించడమేకాక, చివరికి ఏమి జరుగుతుందో కూడా వివరిస్తోంది. అవును, మనం ఈ దుష్ట విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామని అర్థం చేసుకున్నాం. (2 తిమోతి 3:​1-5) భవిష్యత్తు గురించిన జ్ఞానం మన ప్రస్తుత జీవన విధానాన్ని బలంగా ప్రభావితం చేయాలి. అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక . . . దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”​—⁠2 పేతురు 3:​11-12.

13 మన ఆలోచన, మన జీవనశైలి, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి” అనే మన బలమైన నమ్మకాన్ని ప్రతిబింబించాలి. (1 యోహాను 2:​17) బైబిలు నిర్దేశక సూత్రాలను అన్వయించుకోవడం మన భవిష్యత్‌ లక్ష్యాల విషయంలో జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, యేసు ఇలా అన్నాడు: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:⁠33) చాలామంది యౌవనులు పూర్తికాల పరిచర్యలో కొనసాగుతూ యేసు మాటలపై విశ్వాసం ప్రదర్శించడం ఎంత మెచ్చుకోదగిన అంశమో కదా! ఇతరులు, పూర్తి కుటుంబాలు కూడా, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగావున్న ప్రాంతాలకు స్వచ్ఛందంగా తరలివెళ్లారు.

14 యాభైవేల జనాభావున్న ఒక పట్టణంలోని సంఘంలో సేవచేసేందుకు అమెరికా నుండి డొమినికన్‌ రిపబ్లిక్‌కు తరలివెళ్లిన నలుగురు సభ్యులున్న ఒక క్రైస్తవ కుటుంబాన్నే తీసుకోండి. ఆ సంఘంలో దాదాపు 130 మంది రాజ్య ప్రచారకులున్నారు. అయినప్పటికీ, 2006 ఏప్రిల్‌ 12న జరిగిన క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు దాదాపు 1,300 మంది హాజరయ్యారు! ఆ ప్రాంతంలో క్షేత్రం ఎంతగా ‘తెల్లబారి కోతకు వచ్చిందంటే,’ కేవలం ఐదు నెలల తర్వాత ఆ తండ్రి, తల్లి, కొడుకు, కూతురు మొత్తం 30 బైబిలు అధ్యయనాలు నిర్వహించడం ఆరంభించారు. (యోహాను 4:​35) ఆ తండ్రి ఇలా వివరిస్తున్నాడు: “సహాయం చేసేందుకు ఇక్కడకు తరలివచ్చిన సహోదర సహోదరీలు 30 మంది ఈ సంఘంలో ఉన్నారు. వారిలో దాదాపు 20 మంది అమెరికా నుండి, మిగతావారు ఇటలీ, కెనడా, న్యూజీలాండ్‌, బహమాస్‌, స్పెయిన్‌ల నుండి వచ్చారు. పరిచర్యలో పాల్గొనాలనే ఆకాంక్షతో వారు రావడం, స్థానిక సహోదరుల ఉత్సాహంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించింది.”

15 కానీ చాలామంది అవసరం ఎక్కువగా ఉన్న మరో ప్రాంతానికి తరలివెళ్లే స్థితిలో లేరనే విషయం అర్థం చేసుకోదగినదే. అలా తరలి వెళ్లగలిగినవారు లేదా తాము అందుబాటులో ఉండేలా తమ పరిస్థితులను సర్దుబాటు చేసుకోగలవారు, ఈ విధమైన పరిచర్యలో భాగం వహించడం ద్వారా తప్పక అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తారు. మీరెక్కడ సేవచేస్తున్నా, మీ పూర్ణ బలంతో యెహోవాను సేవించినప్పుడు మీకు లభించగల ఆనందాన్ని జారవిడుచుకోవద్దు. మీ జీవితంలో రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిస్తే, “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని” యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.​—⁠మలాకీ 3:​10.

యెహోవా నిర్దేశం నుండి ప్రయోజనం పొందడం

16 మనం చూసినట్లుగా, యెహోవా వాక్కులు పరస్పర సంబంధమున్న రెండు రీతుల్లో మనకు నిర్దేశమిస్తాయి. మనం సరైన దిశలో ముందుకు వెళ్లేందుకు దోహదపడుతూ మనం నిర్ణయాలు తీసుకోవలసినప్పుడు మనకు నిర్దేశమిస్తూ అవి మన పాదాలకు దీపంలా పనిచేస్తాయి. అవి మన త్రోవకు వెలుగునిస్తూ, భవిష్యత్తును స్పష్టంగా చూసేందుకు మనకు తోడ్పడతాయి. ఇది తిరిగి మనం పేతురు ఇచ్చిన ఈ హెచ్చరికను అనుసరించేందుకు సహాయం చేస్తుంది: “మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.”​—⁠1 పేతురు 1:​13.

17 యెహోవా నిర్దేశమిస్తాడనడంలో సందేహం లేదు. అయితే ప్రశ్నేమిటంటే, ఆ నిర్దేశానికి మీరు లోబడతారా? యెహోవా ఇచ్చే ఆ దిశానిర్దేశాన్ని అర్థం చేసుకునేందుకు, ప్రతీరోజు బైబిల్లో కొంతభాగాన్ని చదివేందుకు నిర్ణయించుకోండి. చదివింది ధ్యానిస్తూ, ఆ విషయంలో యెహోవా చిత్తమేమిటో గ్రహించేందుకు ప్రయత్నించడమేకాక, మీ జీవితంలో ఆ సమాచారం అన్వయించగల వివిధ విధానాల గురించి ఆలోచించండి. (1 తిమోతి 4:​15) ఆ తర్వాత, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ‘తర్కశక్తిని’ ఉపయోగించండి.​—⁠రోమీయులు 12:1, NW.

18 దేవుని వాక్యంలోని సూత్రాలను మనం అనుమతిస్తే, అవి మనకు జ్ఞానాన్నివ్వడమేకాక, మనం అనుసరించవలసిన సరైన మార్గం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకు అవసరమైన నిర్దేశమిస్తాయి. యెహోవా లిఖిత వాక్కులు “బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును” అని మనం నిశ్చయత కలిగివుండవచ్చు. (కీర్తన 19:⁠7) మనకు నిర్దేశమిచ్చేందుకు బైబిలును అనుమతిస్తే, నిర్మలమైన మనస్సాక్షి, యెహోవాను సంతోషపర్చడం ద్వారా కలిగే సంతృప్తి మనకు లభిస్తాయి. (1 తిమోతి 1:​18, 19) ప్రతీరోజు మన అడుగులను నిర్దేశించేలా దేవుని వాక్కులను అనుమతించినప్పుడు, యెహోవా విశిష్ట ఆశీర్వాదమైన నిత్యజీవాన్ని మనకు ప్రతిఫలంగా అనుగ్రహిస్తాడు.​—⁠యోహాను 17:⁠3.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యెహోవా దేవుడు మన అడుగులను నిర్దేశించేందుకు అనుమతించడం ఎందుకు ప్రాముఖ్యం?

• దేవుని వాక్కులు ఏ విధంగా మన పాదాలకు దీపంగా ఉంటాయి?

• దేవుని వాక్కులు మన త్రోవకు ఎలా వెలుగై ఉండగలవు?

• దేవుని దిశానిర్దేశాన్ని అనుసరించేందుకు బైబిలు అధ్యయనం మనకెలా సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. నిజమైన శాంతి సంతోషాలను కనుగొనడంలో చాలామంది ఎందుకు విజయం సాధించలేకపోయారు?

3. మానవాళికి దిశానిర్దేశమిచ్చేందుకు యెహోవాకు ఎందుకు అత్యుత్తమ అర్హతవుంది, ఆయనేమి వాగ్దానం చేస్తున్నాడు?

4, 5. దేవుని వాక్కులు మనకెలా దిశానిర్దేశమివ్వగలవు?

6. ఎలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్కులు మన పాదాలకు దీపముగా ఉంటాయి?

7. ఒక క్రైస్తవుడు అవిశ్వాసులైన తోటి ఉద్యోగులతో సహవసించేందుకు మొగ్గుచూపే ఒక పరిస్థితిని వర్ణించండి.

8. సహవాసం విషయంలో తర్కసహితంగా ఆలోచించేందుకు ఏ లేఖనాధార సూత్రాలు మనకు సహాయం చేస్తాయి?

9. తోటి ఉద్యోగస్థులతో మన సంబంధం విషయంలో సమతుల్యత కలిగివుండేందుకు ఏ బైబిలు ఉపదేశం మనకు సహాయం చేస్తుంది?

10. (ఎ) యేసు సహవాసులను ఎలా ఎంచుకున్నాడు? (బి) సహవాసుల గురించి జ్ఞానయుక్తమైన ఎంపిక చేసుకునేందుకు ఒక వ్యక్తికి ఏ ప్రశ్నలు సహాయం చేస్తాయి?

11. దేవుని వాక్యం మన అడుగులను నిర్దేశించాల్సిన పరిస్థితులను పేర్కొనండి.

12. దేవుని వాక్కులు ఎలా మన త్రోవకు వెలుగై ఉన్నాయి?

13. మనకాలాల అత్యవసర పరిస్థితి మన ఆలోచనలను, మన జీవనశైలిని ఎలా ప్రభావితం చేయాలి?

14. ఒక క్రైస్తవ కుటుంబం తమ పరిచర్యను ఎలా విస్తృతపరచుకుంది?

15. మీ జీవితంలో రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిచ్చినందుకు మీరెలాంటి ఆశీర్వాదాలు అనుభవించారు?

16. దేవుని వాక్కులు మనల్ని నిర్దేశించేందుకు అనుమతించడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?

17. దేవుని దిశానిర్దేశాన్ని అనుసరించేందుకు బైబిలు అధ్యయనం మనకెలా సహాయం చేస్తుంది?

18. మనల్ని నిర్దేశించేందుకు దేవుని వాక్యాన్ని అనుమతించినప్పుడు, మనకు ఏ ఆశీర్వాదాలు లభిస్తాయి?

[15వ పేజీలోని చిత్రం]

అవిశ్వాసితో సహవాసం ఎప్పుడు జ్ఞానరహితమౌతుంది?

[16వ పేజీలోని చిత్రం]

యెహోవా చిత్తంచేసినవారే యేసు సన్నిహిత సహవాసులుగా ఉన్నారు

[17వ పేజీలోని చిత్రాలు]

మనం రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిస్తున్నామని మన జీవనశైలి చూపిస్తోందా?