కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యౌవనులారా, దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయండి

యౌవనులారా, దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయండి

యౌవనులారా, దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయండి

“దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసికొనుము.”​—⁠1 తిమోతి 4:⁠7.

“మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు. . . . తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.” (ఫిలిప్పీయులు 2:​20, 22) ఫిలిప్పీలోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు వ్రాసిన తన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఈ వాత్సల్యపూరిత ప్రశంసను చేర్చాడు. ఆయనెవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? తనతోటి యౌవన ప్రయాణ సహవాసియైన తిమోతి గురించి చెబుతున్నాడు. పౌలు వ్యక్తపర్చిన ఈ అభిమానం, నమ్మకం తిమోతిని ఎంతగా ప్రోత్సహించివుంటాయో ఊహించండి!

2 తిమోతిలాంటి దైవభయంగల యౌవనులు యెహోవా ప్రజలకు ఎల్లప్పుడూ అమూల్యమైన సంపదగానే ఉన్నారు. (కీర్తన 110:⁠3) నేడు చాలామంది యౌవనులు దేవుని సంస్థలో పయినీర్లుగా, మిషనరీలుగా, నిర్మాణ పనిలో స్వచ్ఛంద సేవకులుగా, బెతెల్‌ సభ్యులుగా సేవచేస్తున్నారు. ఇతర బాధ్యతలు నెరవేరుస్తూనే సంఘ కార్యకలాపాల్లో ఉత్సాహంగా భాగంవహించే వారు కూడా ఎంతో ప్రశంసార్హులు. అలాంటి యౌవనులు, మన పరలోక తండ్రియైన యెహోవాను మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంవల్ల కలిగే నిజమైన సంతృప్తిని పొందుతారు. వారు నిజంగా ‘దైవభక్తి విషయములో తమకుతాము సాధకము చేసికొనుచున్నారు.’​—⁠1 తిమోతి 4:​7, 8.

3 యౌవనస్థులుగా మీరు నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తున్నారా? అలా చేసేందుకు మీకు ఎక్కడ నుండి సహాయం, ప్రోత్సాహం లభించగలవు? ఐశ్వర్యాసక్తిగల ఈ లోకపు ఒత్తిళ్లను మీరెలా ఎదిరించవచ్చు? దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయని మీరు ఎదురుచూడవచ్చు? తిమోతి జీవితాన్ని, ఆయనెంచుకున్న లక్ష్యాన్ని పరిశీలించడం ద్వారా మనమీ ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం.

తిమోతి నేపథ్యం

4 తిమోతి, రోమ్‌కు చెందిన గలతీయ ప్రాంతంలోవున్న చిన్న పట్టణమైన లుస్త్రలో పెరిగాడు. తిమోతి బహుశా కౌమారదశలోనే అంటే దాదాపు సా.శ. 47లో పౌలు లుస్త్రలో ప్రకటించినప్పుడు క్రైస్తవత్వం గురించి తెలుసుకొని ఉంటాడు. అనతికాలంలోనే తిమోతి స్థానిక క్రైస్తవ సహోదరుల మధ్య మంచి పేరు సంపాదించుకున్నాడు. పౌలు రెండు సంవత్సరాల తర్వాత లుస్త్రకు తిరిగివచ్చి తిమోతి సాధించిన అభివృద్ధి గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన తిమోతిని తన మిషనరీ సహవాసిగా సేవచేసేందుకు ఎన్నుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 14:​5-20; 16:​1-3) తిమోతి పరిణతి సాధిస్తుండగా, సహోదరులను బలపర్చే ప్రాముఖ్యమైన పనులతోపాటు ఆయనకు మరిన్ని బరువైన బాధ్యతలు అప్పగించబడ్డాయి. సా.శ. 65లో రోమ్‌లోని చెరసాల నుండి పౌలు, తిమోతికి వ్రాసే సమయానికి, తిమోతి ఎఫెసులో క్రైస్తవ పెద్దగా సేవచేస్తున్నాడు.

5 స్పష్టంగా తిమోతి ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకే ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకునేందుకు ఆయనను ఏది పురికొల్పింది? తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో పౌలు రెండు ప్రాముఖ్యమైన అంశాలను పేర్కొన్నాడు. ఆయనిలా వ్రాశాడు: “పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.” (2 తిమోతి 3:​14, 15) తిమోతి చేసుకున్న ఎంపికల్లో ఇతర క్రైస్తవులు పోషించిన పాత్రను మనం మొదట పరిశీలిద్దాం.

సానుకూల ప్రభావాల నుండి ప్రయోజనం పొందండి

6 తిమోతి మతసంబంధంగా విభాగించబడిన ఇంట్లో పెరిగాడు. ఆయన తండ్రి గ్రీసు దేశస్థుడు, ఆయన తల్లి యునీకే, అవ్వ లోయి యూదులు. (అపొస్తలుల కార్యములు 16:⁠1) యునీకే, లోయి తిమోతికి బాల్యం నుండే హీబ్రూ లేఖనాల్లోని సత్యాలను బోధించారు. వారు క్రైస్తవులైన తర్వాత, క్రైస్తవ బోధలను విశ్వసించేలా తిమోతిని ఒప్పించారనడంలో సందేహం లేదు. తిమోతి ఈ అద్భుతమైన శిక్షణనుండి పూర్తిగా ప్రయోజనం పొందాడని స్పష్టమవుతుంది. పౌలు ఇలా వ్రాశాడు: “నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొ[నుచున్నాను], . . . ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యునీకేలోను వసించెను, అది నీయందు సహ వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.”​—⁠2 తిమోతి 1:⁠3.

7 నేడు చాలామంది యౌవనులకు లోయి, యునీకేల మాదిరిగా ఆధ్యాత్మిక లక్ష్యాల ప్రాముఖ్యతను గుర్తించే దైవభక్తిగల తల్లిదండ్రులు, తాతయ్యలు అమ్మమ్మ, నానమ్మలు ఉన్నారు. ఉదాహరణకు, సమీరా యౌవనురాలిగా ఉన్నప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో చాలాసేపు మాట్లాడిన సందర్భాలు ఆమెకు ఇప్పటికీ గుర్తున్నాయి. “మా అమ్మానాన్నలు యెహోవా దృక్కోణాన్ని కలిగివుండమని, ప్రకటనాపనిని నా ప్రధాన లక్ష్యంగా చేసుకోమని నాకు బోధించారు. పూర్తికాల సేవ చేపట్టమని వారెల్లప్పుడూ నన్ను ప్రోత్సహించారు” అని ఆమె వివరిస్తోంది. సమీరా తన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహానికి సానుకూలంగా స్పందించి, ఇప్పుడు తన దేశంలోని బెతెల్‌ కుటుంబంలో సభ్యురాలిగా సేవచేసే ఆధిక్యతను ఆనందిస్తోంది. ఆధ్యాత్మిక లక్ష్యాలపై దృష్టిసారించమని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రోత్సహిస్తే వారిచ్చిన సలహా గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మీ జీవితం సంతోషంగా ఉండాలనే వారు కోరుకుంటారు.​—⁠సామెతలు 1:⁠5.

8 మీరు క్రైస్తవ సహోదరత్వంలో క్షేమాభివృద్ధికరమైన సహవాసం కోసం చూడడం కూడా ప్రాముఖ్యం. తిమోతి తన సంఘంలోని క్రైస్తవ పెద్దల దగ్గరేకాక, దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోవున్న ఈకొనియలోని వారి దగ్గరకూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 16:​1, 2) అలుపెరుగని వ్యక్తిగా పేరుగాంచిన పౌలుతో ఆయన సన్నిహిత స్నేహాన్ని పెంపొందించుకున్నాడు. (ఫిలిప్పీయులు 3:​14) తిమోతి సలహాలను స్వీకరించడమేకాక, విశ్వాసుల మాదిరిని వెంటనే అనుకరించేవాడని పౌలు వ్రాసిన పత్రికలు సూచిస్తున్నాయి. (1 కొరింథీయులు 4:​17; 1 తిమోతి 4:​6, 12-16) పౌలు ఇలా వ్రాశాడు: “నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును . . . వెంబడించితివి.” (2 తిమోతి 3:​10) అవును, తిమోతి పౌలు మాదిరిని సన్నిహితంగా అనుసరించాడు. అదే విధంగా, మీరు సంఘంలో ఆధ్యాత్మికంగా బలంగావున్నవారికి సన్నిహితంగా ఉన్నప్పుడు, సరైన ఆధ్యాత్మిక లక్ష్యాలను ఏర్పరచుకునేలా మీకు సహాయం లభిస్తుంది.​—⁠2 తిమోతి 2:​20-22.

“పరిశుద్ధలేఖనములను” అధ్యయనం చేయండి

9 సరైన సహవాసులను ఎంచుకున్నంత మాత్రాన ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించగలుగుతామా? లేదు. తిమోతిలాగే మీరు “పరిశుద్ధలేఖనములను” జాగ్రత్తగా పరిశీలించాలి. అధ్యయనం చేయడం మీకంత సులభంగా ఉండకపోవచ్చు, అయితే తిమోతి ‘దైవభక్తి విషయములో తనకుతాను సాధకము చేసికోవలసి’ వచ్చిందని జ్ఞాపకం చేసుకోండి. క్రీడాకారులు తరచూ తమ లక్ష్యాన్ని సాధించేందుకు అనేక నెలలపాటు తీవ్రంగా సాధనచేస్తారు. అదే విధంగా, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడానికి త్యాగం, హృదయపూర్వక ప్రయత్నం అవసరం. (1 తిమోతి 4:​7, 8, 10) ‘అయితే బైబిలు అధ్యయనం చేయడం నా లక్ష్యాలను సాధించేందుకు ఎలా సహాయం చేయగలదు’ అని మీరడగవచ్చు. మనం మూడు విధానాలను పరిశీలిద్దాం.

10 మొదటిది, లేఖనాలు మీకు సరైన ప్రేరణనిస్తాయి. అవి మన పరలోక తండ్రి అద్భుతమైన వ్యక్తిత్వాన్ని, మనపై ప్రేమతో ఆయన తీసుకున్న సర్వోన్నత చర్యను, తన నమ్మకమైన సేవకుల కోసం దాచివుంచిన నిత్యాశీర్వాదాలను వెల్లడిచేస్తాయి. (ఆమోసు 3:⁠7; యోహాను 3:​16; రోమీయులు 15:⁠4) యెహోవా గురించిన మీ జ్ఞానం పెరిగేకొద్దీ, ఆయనపట్ల మీ ప్రేమ, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకోవాలనే కోరికా వృద్ధవుతాయి.

11 క్రమమైన వ్యక్తిగత బైబిలు అధ్యయనం సత్యాన్ని స్వంతం చేసుకునేందుకు తమకు ముఖ్యంగా సహాయం చేసిందని చాలామంది యౌవన క్రైస్తవులు చెబుతున్నారు. ఉదాహరణకు, ఆడెల్‌ క్రైస్తవ గృహంలోనే పెరిగినా ఏ విధమైన ఆధ్యాత్మిక లక్ష్యాలూ పెట్టుకోలేదు. “మా తల్లిదండ్రులు నన్ను రాజ్యమందిరానికి తీసుకెళ్లేవారు, కానీ నేను వ్యక్తిగత అధ్యయనం చేసేదాన్ని కాదు, కూటాల్లో సరిగా వినేదాన్ని కాదు” అని ఆమె వివరిస్తోంది. ఆడెల్‌ తన అక్క బాప్తిస్మం తీసుకున్న తర్వాత తాను సత్యాన్ని మరింత గంభీరంగా తీసుకోవడం ఆరంభించింది. “నేను మొత్తం బైబిలు చదవడం ఆరంభించాను. కొంత చదివి ఆ తర్వాత చదివిన భాగంపై వ్యాఖ్యానం వ్రాసుకునేదాన్ని. నేను వ్రాసుకున్న నోట్సంతా ఇంకా నా దగ్గరుంది. ఒక సంవత్సరంలో బైబిలు చదవడం పూర్తిచేశాను” అని ఆమె చెబుతోంది. ఫలితంగా, ఆడెల్‌ యెహోవాకు తన జీవితాన్ని సమర్పించుకునేందుకు పురికొల్పబడింది. తీవ్ర శారీరక అశక్తతవున్నా ఆమె ఇప్పుడు పయినీరుగా లేదా పూర్తికాల సువార్తికురాలిగా సేవచేస్తోంది.

12 రెండవది, మీ వ్యక్తిత్వంలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు” “పరిశుద్ధలేఖనములు” ‘ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నవి’ అని పౌలు తిమోతికి చెప్పాడు. (2 తిమోతి 3:​16, 17) దేవుని వాక్య సంబంధిత విషయాలను క్రమంగా ధ్యానిస్తూ, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చేందుకు మీరు అనుమతిస్తారు. అప్పుడు మీరు వినయం, పట్టుదల, కష్టపడి పనిచేయడం, తోటి క్రైస్తవులపట్ల యథార్థమైన ప్రేమ వంటి లక్షణాలను వృద్ధిచేసుకుంటారు. (1 తిమోతి 4:​15) తిమోతిలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, అవి తిమోతిని పౌలుకు, తాను సేవచేసిన సంఘాలకు ప్రయోజనకరమైన వ్యక్తిగా చేశాయి.​—⁠ఫిలిప్పీయులు 2:​20-22.

13 మూడవది, దేవుని వాక్యంలో ఆచరణాత్మక జ్ఞానం సమృద్ధిగా ఉంది. (కీర్తన 1:​1-3; 19:⁠7; 2 తిమోతి 2:⁠7; 3:​15) అది మీరు స్నేహితులను, ఆరోగ్యకరమైన వినోదాన్ని జ్ఞానయుక్తంగా ఎంచుకునేందుకు, అసంఖ్యాకమైన ఇతర సవాళ్లతో వ్యవహరించేందుకు సహాయం చేస్తుంది. (ఆదికాండము 34:​1, 2; కీర్తన 119:​37; 1 కొరింథీయులు 7:​36) ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషిచేయడానికి మీరిప్పుడు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం ఆవశ్యకం.

“మంచి పోరాటము పోరాడుము”

14 యెహోవాను మహిమపరిచే లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత జ్ఞానయుక్త విధానమైనా అదంత సులభమైనది కాదు. ఉదాహరణకు, మీరు ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాల్సివచ్చినప్పుడు, నిజమైన విజయానికి, సంతోషానికి ఉన్నత విద్య, ఆకర్షణీయమైన ఉద్యోగం కీలకమని నమ్మే బంధువుల నుండి, తోటివారి నుండి, శ్రేయోభిలాషులైన విద్యావేత్తల నుండి గొప్ప ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. (రోమీయులు 12:⁠2) తిమోతిలాగే మీరు కూడా యెహోవా మీ కోసం దాచివుంచిన ‘నిత్యజీవాన్ని చేపట్టేందుకు’ “విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడ”వలసి ఉంటుంది.​—⁠1 తిమోతి 6:​12; 2 తిమోతి 3:​12.

15 అవిశ్వాసులైన మీ కుటుంబ సభ్యులు మీ ఎంపికలను ఆమోదించనప్పుడు, ఆ పరీక్ష ప్రత్యేకంగా తీవ్రంగా ఉండవచ్చు. తిమోతి బహుశా అలాంటి వ్యతిరేకతనే అధిగమించి వచ్చి ఉండవచ్చు. ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, తిమోతి కుటుంబం బహుశా “విద్యావంతులైన, సంపన్న కుటుంబమై ఉండవచ్చు.” తిమోతి ఉన్నత విద్యనభ్యసించి కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాలని ఆయన తండ్రి ఆశించివుండవచ్చు. * మిషనరీ సేవలో పౌలుతోపాటు ప్రమాదాల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొనేందుకే తిమోతి ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న ఆయన తండ్రి ఎలా స్పందించివుంటాడో ఊహించండి!

16 నేటి యౌవన క్రైస్తవులు ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నారు. యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న మాథ్యూ ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “నేను పయినీరుగా సేవ చేయడం ఆరంభించినప్పుడు, మా నాన్నగారు చాలా నిరుత్సాహపడ్డారు. నా పరిచర్యకు దోహదపడేలా నేను వాచ్‌మెన్‌ ఉద్యోగం చేపట్టినప్పుడు నేను నా చదువును ‘వ్యర్థం’ చేసుకున్నానని ఆయన భావించారు. నేను పూర్తికాల ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించగలనో గుర్తుచేస్తూ ఆయన నన్ను హేళన చేసేవారు.” అలాంటి వ్యతిరేకతను మాథ్యూ ఎలా అధిగమించాడు? “బైబిలు పఠన సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ, క్రమం తప్పకుండా ప్రార్థించేవాణ్ణి, ప్రత్యేకంగా నాకు విపరీతమైన కోపమొచ్చే సమయాల్లో నేనలా ప్రార్థించేవాణ్ణి” అని ఆయన చెబుతున్నాడు. మాథ్యూ దృఢ సంకల్పానికి ప్రతిఫలం లభించింది. చివరకు తండ్రితో ఆయన సంబంధం మెరుగైంది. మాథ్యూ యెహోవాకు కూడా సన్నిహితమయ్యాడు. “యెహోవా నా పట్ల శ్రద్ధ చూపించడాన్ని, ప్రోత్సహించడాన్ని, తెలివితక్కువ నిర్ణయాలు తీసుకోకుండా నన్ను కాపాడడాన్ని నేను చూశాను. ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయకుంటే ఇవేవీ నేను చవిచూసేవాణ్ణి కాదు” అని మాథ్యూ చెబుతున్నాడు.

ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడంపై దృష్టి కేంద్రీకరించండి

17 ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంలో మీకు తక్షణమే కనిపించని సవాలు తోటి విశ్వాసులనుండి కూడా ఎదురుకావచ్చు. ‘పయినీరు సేవ చేయడమెందుకు? సాధారణ జీవితం గడుపుతూనే ప్రకటనాపనిలో భాగం వహించవచ్చు. మంచి ఉద్యోగం సంపాదించుకొని ఆర్థిక భద్రత చేకూర్చుకో’ అని కొందరనవచ్చు. ఇది మంచి సలహాగానే అనిపించవచ్చు, కానీ ఆ సలహాను పాటిస్తే మీరు నిజంగా దైవభక్తి విషయంలో మీకైమీరు సాధకం చేసుకుంటున్నవారిగా ఉంటారా?

18 తిమోతి కాలంలోని కొందరు క్రైస్తవులకు అలాంటి ఆలోచనలే ఉన్నాయని స్పష్టమవుతుంది. (1 తిమోతి 6:​17) ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడంపై దృష్టి కేంద్రీకరించడానికి తిమోతికి తోడ్పడేందుకు పౌలు ఆయనను ప్రోత్సహిస్తూ ఇలా అన్నాడు: “సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.” (2 తిమోతి 2:⁠4) విధులు నిర్వహించే సైనికుడు పౌరసంబంధ వ్యవహారాల్లో తలదూర్చలేడు. ఆయన జీవితం, ఆయనపై ఆధారపడిన ఇతరుల జీవితాలు, పైఅధికారి ఆదేశానుసారం వెంటనే చర్య తీసుకునేందుకు ఆయన సర్వసన్నద్ధంగా ఉండడంమీదే ఆధారపడివుంటాయి. క్రీస్తు ఆధ్వర్యంలోని సైనికునిగా, మీరు కూడా మీ ప్రాణరక్షణ పరిచర్యను పూర్తిగా నెరవేర్చకుండా మిమ్మల్ని అడ్డగించగల అనవసర వస్తుపర వ్యవహారాల్లో చిక్కుకోకుండా ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలి.​—⁠మత్తయి 6:​24; 1 తిమోతి 4:​16; 2 తిమోతి 4:​2, 5.

19 సుఖప్రదమైన జీవితాన్ని మీ లక్ష్యంగా చేసుకునే బదులు స్వయంత్యాగ స్వభావాన్ని అలవర్చుకోండి. “క్రీస్తుయేసు యొక్క సైనికునిలా జీవిత సుఖాలను వదిలిపెట్టేందుకు సిద్ధంగావుండు.” (2 తిమోతి 2:​3, ది ఇంగ్లీష్‌ బైబిల్‌ ఇన్‌ బేసిక్‌ ఇంగ్లీష్‌) పౌలు సహవాసంలో తిమోతి అత్యంత కష్టభరిత పరిస్థితుల్లో సహితం తృప్తి కలిగివుండడంలోని రహస్యాన్ని తెలుసుకున్నాడు. (ఫిలిప్పీయులు 4:​11, 12; 1 తిమోతి 6:​6-8) మీరు కూడా అలాగే చేయవచ్చు. రాజ్యం కోసం త్యాగాలు చేసేందుకు మీరు ఇష్టపడుతున్నారా?

ఇప్పుడు, భవిష్యత్తులో లభించగల ఆశీర్వాదాలు

20 సుమారు 15 సంవత్సరాలు తిమోతి పౌలుతో కలిసి సేవచేశాడు. దాదాపు మధ్యధరా ఉత్తర ప్రాంతమంతటిలో సువార్త వ్యాపిస్తుండగా క్రొత్త సంఘాలు ఏర్పడడాన్ని తిమోతి ప్రత్యక్షంగా చూశాడు. ఒకవేళ “సాధారణ” జీవితాన్ని ఎన్నుకుంటే లభించే దానికన్నా ఆయన మరెంతో ఉత్తేజకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించాడు. ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంలో మీరు కూడా అమూల్యమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అనుభవిస్తారు. మీరు యెహోవాకు సన్నిహితమవడమే కాక, తోటి క్రైస్తవుల ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకుంటారు. భౌతిక సంపద కోసం పాటుపడడంవల్ల కలిగే వేదన, ఆశాభంగానికి బదులు నిస్వార్థంగా ఇవ్వడంవల్ల కలిగే నిజమైన సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. అన్నింటికన్నా మిన్నగా “వాస్తవమైన జీవమును” అంటే పరదైసు భూమిపై నిత్యజీవాన్ని సంపాదించుకుంటారు.​—⁠1 తిమోతి 6:​9, 10, 17-19; అపొస్తలుల కార్యములు 20:​35.

21 కాబట్టి మీరిప్పటివరకు దైవభక్తి కలిగివుండాలనే లక్ష్యంతో మిమ్మల్ని మీరు సాధకం చేసుకోకుండా ఉంటే, వెంటనే ప్రారంభించమని మేము మిమ్మల్ని ఆప్యాయంగా ప్రోత్సహిస్తున్నాం. ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంలో మీకు సహాయం చేయగల, సంఘంలోవున్న వారికి సన్నిహితమై, వారి నిర్దేశాన్ని అనుసరించండి. దేవుని వాక్య వ్యక్తిగత క్రమ పఠనానికి ప్రాధాన్యమివ్వండి. ఈ లోకపు ఐశ్వర్యాసక్తి స్వభావాన్ని ఎదిరించేందుకు తీర్మానించుకోండి. దేవుణ్ణి మహిమపరిచే లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడాన్ని మీరు ఎన్నుకుంటే, “సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు” దేవుడు మీరిప్పుడు, భవిష్యత్తులోను మెండైన ఆశీర్వాదాలను పొందవచ్చని వాగ్దానం చేస్తున్నాడని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి.​—⁠1 తిమోతి 6:​17.

[అధస్సూచి]

^ పేరా 21 గ్రీకు సమాజం విద్యకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. తిమోతి సమకాలీనుడైన ప్లూటార్క్‌ ఇలా వ్రాశాడు: “సమస్త మేలుకు సరైన విద్యనభ్యసించడమే మూలాధారం మరియు కీలకం. . . . ఈ సరైన విద్యే నైతిక శ్రేష్ఠతకు, సంతోషానికి నడిపిస్తుందని చెబుతున్నాను. . . . మిగతావన్నీ మానవ మాత్రమైనవి, అల్పమైనవేకాక, మన అధిక శ్రద్ధకు యోగ్యమైనవి కావు.”​—⁠మొరాల్యా Iవ సంపుటి, “ది ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌.”

మీకు జ్ఞాపకమున్నాయా?

• ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడానికి అవసరమైన సహాయాన్ని యౌవనులు ఎక్కడ కనుగొనవచ్చు?

• మనస్సాక్షిపూర్వక బైబిలు అధ్యయనం ఎందుకు ప్రాముఖ్యం?

• ఈ లోకపు ఐశ్వర్యాసక్తి స్వభావాన్ని యౌవనులు ఎలా ఎదిరించవచ్చు?

• ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) పౌలు తిమోతిని ఎందుకు మెచ్చుకున్నాడు? (బి) నేడు యౌవనులు ఎలా ‘దైవభక్తి విషయములో తమకుతాము సాధకము చేసికొనుచున్నారు’?

3. ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు పరిశీలించబడతాయి?

4. క్రైస్తవునిగా తిమోతి జీవితాన్ని క్లుప్తంగా వివరించండి.

5. రెండవ తిమోతి 3:​14, 15 ప్రకారం, ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకోవడానికి తిమోతికి ఏ రెండు అంశాలు దోహదపడ్డాయి?

6. తిమోతి ఎలాంటి శిక్షణ పొందాడు, దానికి ఆయనెలా స్పందించాడు?

7. చాలామంది యౌవనులకు ఎలాంటి ఆశీర్వాదముంది, ఇది వారికెలా ప్రయోజనకరంగా ఉండగలదు?

8. క్షేమాభివృద్ధికరమైన క్రైస్తవ సహవాసం నుండి తిమోతి ఎలా ప్రయోజనం పొందాడు?

9. సరైన సహవాసుల్ని ఎంచుకోవడానికి తోడుగా, ‘దైవభక్తి విషయంలో సాధకము చేసుకునేందుకు’ మీరు ఏమిచేయాలి?

10, 11. ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడానికి లేఖనాలు మిమ్మల్నెందుకు పురికొల్పుతాయి? సోదాహరణంగా వివరించండి.

12, 13. (ఎ) బైబిలు అధ్యయనం ఎలాంటి మార్పులు చేసుకునేందుకు ఒక యౌవనునికి సహాయం చేస్తుంది, ఎలా సహాయం చేస్తుంది? (బి) దేవుని వాక్యంలోవున్న ఆచరణాత్మక జ్ఞానానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు పేర్కొనండి.

14. ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడం ఎందుకంత సులభం కాదు?

15. తిమోతి బహుశా ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొని ఉండవచ్చు?

16. ఒక యౌవనుడు తండ్రినుండి వచ్చిన వ్యతిరేకతను ఎలా అధిగమించాడు?

17. పూర్తికాల సేవగురించి ఆలోచిస్తున్నవారిని కొందరు పొరపాటుగా ఎలా నిరుత్సాహపర్చవచ్చు? (మత్తయి 16:​22)

18, 19. (ఎ) ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడంపై మీరెలా దృష్టి కేంద్రీకరించవచ్చు? (బి) యౌవనునిగా మీరు రాజ్యం కోసం ఎలాంటి త్యాగాలు చేస్తున్నారో వివరించండి.

20, 21. (ఎ) ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడం ద్వారా లభించే కొన్ని ఆశీర్వాదాలను వివరించండి. (బి) మీరేమి చేసేందుకు తీర్మానించుకున్నారు?

[24వ పేజీలోని చిత్రం]

తిమోతి ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు కృషిచేశాడు

[25వ పేజీలోని చిత్రాలు]

ఏ సానుకూల ప్రభావాలు తిమోతికి సహాయం చేశాయి?

[26వ పేజీలోని చిత్రాలు]

ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు మీరు కృషిచేస్తున్నారా?