కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ ఉద్దేశములు సఫలమగును”

“నీ ఉద్దేశములు సఫలమగును”

“నీ ఉద్దేశములు సఫలమగును”

కీర్తనకర్తయైన దావీదు తాను కూర్చిన ఒక శ్రావ్యమైన కీర్తనలో ఇలా ప్రార్థించాడు: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.” (కీర్తన 51:​10, 12) బత్షెబతో పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపపడిన దావీదు, తాను సరైనది చేయగలిగేలా యెహోవా దేవుడు తన హృదయాన్ని శుద్ధపరిచి, తన అంతరంగములో నూతన మనసును పుట్టించమని ఆ వచనాల్లో ఆయనను వేడుకున్నాడు.

యెహోవా నిజంగానే మనలో కొత్త హృదయాన్ని, నూతనమైన సమ్మతిగల మనసును లేక సిద్ధ మనసును పుట్టించగలడా? లేక మనమే శుద్ధహృదయాన్ని వృద్ధిచేసుకుని దాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలా? ‘యెహోవా హృదయ పరిశోధకుడు’ అయినప్పటికీ ఆయన మన హృదయాలోచనల్లో ఎంతమేరకు జోక్యం చేసుకుంటాడు? (సామెతలు 17:⁠3; యిర్మీయా 17:​10) ఆయన మన జీవితాన్ని, ఉద్దేశాలను, క్రియలను ఎంతమేరకు ప్రభావితం చేస్తాడు?

సామెతల పుస్తకంలోని 16వ అధ్యాయంలో ఉన్న మొదటి తొమ్మిది వచనాల్లో దేవుని పేరు ఎనిమిదిసార్లు ఉపయోగించబడింది. ఆ వచనాలు, మన “ఉద్దేశములు సఫలం” చేసుకునేలా దేవుడు మన జీవితాన్ని నియంత్రించేందుకు మనం ఎలా అనుమతించవచ్చో చూపిస్తున్నాయి. (సామెతలు 16:⁠3) ఆ అధ్యాయంలోని 10 నుండి 15 వచనాలు రాజు లేక పరిపాలకుని బాధ్యతలను వివరిస్తున్నాయి.

“హృదయాలోచనలు” ఎవరి వశం?

“హృదయాలోచనలు మనుష్యుని వశము” అని సామెతలు 16:⁠1ఎ భాగం చెబుతోంది. అవును “హృదయాలోచనలు” మన వశంలోనే ఉన్నాయి. మన హృదయాన్ని యెహోవా అద్భురీతిలో సిద్ధపరచడు లేక మనలో సిద్ధ మనసును పుట్టించడు. మనమే ఆయన వాక్యమైన బైబిలు నుండి ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, మనం నేర్చుకున్నదాన్ని ధ్యానించడానికి, మన ఆలోచనలను ఆయన ఆలోచనలకు అనుగుణంగా మలచుకోవడానికి కృషి చేయాలి.​—⁠సామెతలు 2:​10, 11.

అయితే, “శుద్ధహృదయము,” ‘నూతన మనసు’ కోసం దావీదు చేసిన విన్నపం, ఆయన తన పాపభరిత మనస్తత్వాన్ని గుర్తించాడని, హృదయాన్ని శుద్ధపరచుకోవడంలో తనకు దైవిక సహాయం అవసరమనే విషయాన్ని గుర్తించాడని చూపిస్తోంది. మనం అపరిపూర్ణులం కాబట్టి “శరీరకార్యములు” చేసేందుకు మనం శోధించబడే అవకాశం ఉంది. (గలతీయులు 5:​19-21) మనం “[మన] అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయ[డానికి]” యెహోవా సహాయం మనకు అవసరం. (కొలొస్సయులు 3:⁠5) మనం శోధనలకు లొంగిపోకుండా ఉండేందుకు, మన హృదయంలోనుండి పాపభరిత లక్షణాలను తొలగించుకునేందుకు సహాయం కోసం మనం ఆయనకు ప్రార్థించడం ఎంత ప్రాముఖ్యమో కదా!

హృదయంలోని ‘ఆలోచనల’ విషయంలో ఇతరులకు మనం సహాయం చేయగలమా? “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 12:​18) మన నాలుక ఎప్పుడు ఆరోగ్యదాయకంగా ఉంటుంది? “చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన” సహాయం పొందినప్పుడే అంటే మనం బైబిలు సత్యానికి అనుగుణంగా సరైన మాటలు మాట్లాడినప్పుడే అది ఆరోగ్యదాయకంగా ఉంటుంది.​—⁠సామెతలు 16:⁠1బి.

“హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని బైబిలు చెబుతోంది. (యిర్మీయా 17:⁠9) మన సూచనార్థక హృదయం దానిని అది సమర్థించుకొనే, మోసపుచ్చుకొనే అవకాశం ఉంది. ఆ ప్రమాదం గురించే హెచ్చరిస్తూ ప్రాచీన ఇశ్రాయేలుకు రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.”​—⁠సామెతలు 16:⁠2.

స్వప్రీతి మన తప్పుల్ని మనం సమర్థించుకునేలా, మన చెడు లక్షణాలను కప్పిపుచ్చుకునేలా, మనలోని చెడును ఉపేక్షించేలా చేయవచ్చు. అయితే, మనం యెహోవాను మోసగించలేం. ఆయన ఆత్మలను పరిశోధిస్తాడు. ఒక వ్యక్తి ఆత్మ ఆయన ఎక్కువగా ఆలోచించే విషయాలను సూచిస్తోంది, అది హృదయంతో ముడిపడివుంటుంది. అది వృద్ధి చెందడం అనేది ఎక్కువగా వారి సూచనార్థక హృదయంలో పుట్టేవాటిపై అంటే ఆలోచనలపై, భావాలపై, ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుంది. “హృదయ పరిశోధకుడు” ఆత్మనే పరిశోధిస్తాడు, ఆయన పక్షపాతంతో తీర్పు తీర్చడు. అందుకే మనం మన ఆత్మను కాపాడుకోవడం జ్ఞానయుక్తం.

“నీ పనుల భారము యెహోవామీద నుంచుము”

ప్రణాళికలు వేసుకోవడానికి ఆలోచించాల్సి వస్తుంది, ఆ ఆలోచనలు హృదయంలో పుడతాయి. మనం సాధారణంగా ప్రణాళికలు వేసుకున్న తర్వాతే పనులను చేస్తాం. మనమా పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతామా? “నీ పనుల భారము యెహోవామీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు [‘ప్రణాళికలు,’ NW] సఫలమగును” అని సొలొమోను చెప్పాడు. (సామెతలు 16:⁠3) మన పనుల భారాన్ని యెహోవాపై వేయడం అంటే ఆయనపై నమ్మకం ఉంచడం, ఆయనపై ఆధారపడడం, ఆయనకు లోబడివుండడం అని అర్థం. సూచనార్థకంగా చెప్పాలంటే, బరువును మన భుజాలమీద నుండి తీసి ఆయన భుజాలమీద వేయడమని దాని భావం. కీర్తనకర్త ఇలా పాడాడు: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.”​—⁠కీర్తన 37:⁠5.

అయితే, మన ప్రణాళికలు సఫలమవ్వాలంటే అవి దేవుని వాక్యానికి అనుగుణంగా ఉండాలి, సదుద్దేశాలతో వేసుకోవాలి. అంతేకాదు సహాయ సహకారాల కోసం మనం యెహోవాకు ప్రార్థించి, జాగ్రత్తగా బైబిలు ఉపదేశాన్ని అనుసరించడానికి శాయశక్తులా కృషి చేయాలి. మనం పరీక్షలను లేక కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మరి ముఖ్యంగా మన ‘భారాన్ని యెహోవామీద మోపాలి’ ఎందుకంటే ఆయన మనల్ని ‘ఆదుకొంటాడు.’ నిజానికి “నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”​—⁠కీర్తన 55:​22.

“యెహోవా ప్రతి వస్తువును దాని దానిపని నిమిత్తము కలుగజేసెను”

మనం మన పనుల భారాన్ని యెహోవాపై వేయడంవల్ల ఇంకా ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? “యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను” అని జ్ఞానియైన రాజు చెబుతున్నాడు. (సామెతలు 16:4ఎ) విశ్వానికి సృష్టికర్త సంకల్పంగల దేవుడు. మనం మన పనుల భారాన్ని ఆయనపై వేసినప్పుడు మన జీవితంలో ప్రయోజనకరమైన పనులను చేస్తాం, అందులో వ్యర్థమైన పనులకు చోటుండదు. ఈ భూమి కోసం, భూమిపై జీవించే మానవుల కోసం యెహోవాకు ఒక నిత్య సంకల్పం ఉంది. (ఎఫెసీయులు 3:​8-11) ఆయన ఈ భూమిని “నివాసస్థలమగునట్లుగా” రూపొందించి దానిని సృష్టించాడు. (యెషయా 45:​18) అంతేకాక, మానవుల గురించిన ఆయన ఆది సంకల్పం ఖచ్చితంగా నెరవేరబోతోంది. (ఆదికాండము 1:​28) సత్యదేవునికి అంకితం చేయబడిన జీవితానికి అంతమే ఉండదు, అది ఎప్పటికీ అర్థవంతంగా ఉంటుంది.

యెహోవా ‘నాశన దినమునకు భక్తిహీనులను కలుగజేసెను.’ (సామెతలు 16:⁠4బి) “ఆయన కార్యము సంపూర్ణము” కాబట్టి ఆయన దుష్టుల్ని సృష్టించలేదు. (ద్వితీయోపదేశకాండము 32:⁠4) అయితే, వారు ఉనికిలోకి రావడానికి, తన అంతిమ తీర్పు తీర్చే సరైన సమయం వచ్చేవరకు వారు సజీవంగా ఉండడానికి ఆయన అనుమతించాడు. ఉదాహరణకు, యెహోవా ఐగుప్తులోని ఫరోకు ఇలా చెప్పాడు: “నా బలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.” (నిర్గమకాండము 9:​16) పది తెగుళ్లు రప్పించడం, ఎర్ర సముద్రంలో ఫరోను, ఆయన సైన్యాలను నాశనం చేయడం ద్వారా దేవుడు తన సాటిలేని శక్తిని గుర్తుండిపోయే విధంగా ప్రదర్శించాడు.

దుష్టులు తమకు తెలియకుండానే తన సంకల్పాలను నెరవేర్చేలా కూడా యెహోవా పరిస్థితులను సృష్టించగలడు. కీర్తనకర్త ఇలా చెప్పాడు: “నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు [యెహోవా] ధరించుకొందువు.” (కీర్తన 76:​10) యెహోవా తన సేవకుల మీద, తన శత్రువులు ఆగ్రహాన్ని చూపించేందుకు అనుమతించవచ్చు, అయితే తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టడానికి అవసరమైనంత మట్టుకే ఆయన దాన్ని అనుమతిస్తాడు, అలా చేయడం ద్వారా ఆయన వారికి శిక్షణనిస్తాడు. శత్రువుల ఆగ్రహం ఏమాత్రం ఎక్కువవకుండా నియంత్రించే శక్తి దేవునికి ఉంది.

యెహోవా వినయస్థులైన తన సేవకులకు మద్దతునిస్తాడు. మరైతే గర్విష్టుల, అహంకారుల మాటేమిటి? “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు” అని ఇశ్రాయేలుకు రాజు చెబుతున్నాడు. (సామెతలు 16:⁠5) “గర్వహృదయులు” పరస్పరం సహకరించుకుంటూ జట్టు కట్టొచ్చు, కానీ వారు శిక్షనైతే తప్పించుకోలేరు. అందుకే మనకు ఎంత జ్ఞానమున్నప్పటికీ, మనం ఎంత సమర్థులమైనప్పటికీ లేక మనకెలాంటి సేవాధిక్యతలున్నప్పటికీ వినయాన్ని పెంపొందించుకోవడం జ్ఞానయుక్తం.

“యెహోవాయందు భయభక్తులు”

పాపంలో పుట్టిన మనం తప్పులు చేసే అవకాశం ఉంది. (రోమీయులు 3:​23; 5:​12) మనల్ని పాపానికి నడిపించే ప్రణాళికలు వేసుకోకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? “కృపాసత్యములవలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటవలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు” అని సామెతలు 16:⁠6 చెబుతోంది. యెహోవా తన కృపాసత్యములతో మన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కలుగజేసినా, మనకు యెహోవాపట్ల ఉండే భయభక్తులే మనం పాపాలు చేయకుండా ఆపుతాయి. అందుకే దేవునిపట్ల ప్రేమను, ఆయన కృపపట్ల కృతజ్ఞతలతోపాటు ఆయనకు బాధకలిగిస్తామేమో అనే భయాన్ని పెంపొందించుకోవడం ఎంత ప్రాముఖ్యమో కదా!

మనం దేవుని సాటిలేని శక్తిపట్ల భక్తిని, గౌరవాన్ని పెంపొందించుకున్నప్పుడు మన హృదయాల్లో దైవభయం కలుగుతుంది. సృష్టిలో కనిపించే ఆయన శక్తి గురించి ఒక్కసారి ఆలోచించండి! సృష్టి కార్యాల్లో కనిపించే శక్తి గురించి పితరుడైన యోబుకు గుర్తుచేయబడడం ఆయన తన ఆలోచనల్ని సరిచేసుకోవడానికి సహాయం చేసింది. (యోబు 42:​1-6) యెహోవా తన ప్రజలతో వ్యవహరించిన విధానం గురించి బైబిల్లో నమోదు చేయబడిన వృత్తాంతాలను చదివి, వాటిని ధ్యానించినప్పుడు మన ఆలోచనలను సరిచేసుకోవడానికి మనం కూడా పురికొల్పబడమా? కీర్తనకర్త ఇలా పాడాడు: “దేవుని ఆశ్చర్యకార్యములను చూడ రండి నరులయెడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై యున్నాడు.” (కీర్తన 66:⁠5) యెహోవా కృపను మనం తేలికగా తీసుకోకూడదు. ఇశ్రాయేలీయులు ‘తిరుగుబాటుచేసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా యెహోవా వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను.’ (యెషయా 63:​10) మరోవైపు, “ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును.” (సామెతలు 16:⁠7) యెహోవాపట్ల భయభక్తులు కలిగివుండడం ఎంతటి రక్షణ కల్పిస్తుందో కదా!

“అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితోకూడిన కొంచెమే శ్రేష్ఠము” అని జ్ఞానియైన రాజు చెబుతున్నాడు. (సామెతలు 16:⁠8) “నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు” అని సామెతలు 15:⁠16 చెబుతోంది. మనం నీతి మార్గంలో కొనసాగడానికి దేవునిపట్ల భక్తిపూర్వక భయాన్ని కలిగివుండడం ఖచ్చితంగా అవసరం.

“ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును”

మానవుడు తప్పొప్పులను ఎంపికచేసుకునే విధంగా స్వేచ్ఛా చిత్తంతో సృష్టించబడ్డాడు. (ద్వితీయోపదేశకాండము 30:​19, 20) వివిధ ఎంపికల్ని బేరీజు వేసి, వాటిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ విషయాలపై అవధానముంచే సామర్థ్యం మన అలంకారార్థ హృదయానికి ఉంది. ఎంపికలు చేసుకునే బాధ్యత మనదేనని సూచిస్తూ సొలొమోను ఇలా అంటున్నాడు: “ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును.” అలా ఆలోచించుకున్న తర్వాత, “యెహోవా వాని నడతను స్థిరపరచును.” (సామెతలు 16:⁠9) యెహోవా మన మార్గాన్ని నిర్దేశించగలడు కాబట్టి మనం మన ‘ప్రణాళికలను సఫలం చేసుకోవడానికి’ ఆయన సహాయాన్ని కోరడం జ్ఞానయుక్తం.

మనం ఇప్పటికే చర్చించినట్లుగా, హృదయం మోసకరమైనదేకాక, అది తప్పుగా తర్కించగలదు కూడా. ఉదాహరణకు, ఒక వ్యక్తి పాపం చేసినా అతని హృదయం దానిని అది సమర్థించుకోగలదు. అప్పుడు అతను ఆ పాపపు మార్గాన్ని విడిచే బదులు దేవుడు ప్రేమ, జాలి, దయ, క్షమా గుణంగలవాడనీ తర్కించుకోవచ్చు. అలాంటి వ్యక్తి తన మనసులో “దేవుడు మరచిపోయెను ఆయన విముఖుడై యెప్పుడును చూడకుండును” అని అనుకుంటాడు. (కీర్తన 10:​11) అయితే, దేవుడు దయగలవాడనే వంకతో తప్పులు చేయడం సరైనది కాదు, అది ప్రమాదకరం.

“న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు”

హృదయం గురించి, మానవుల క్రియల గురించి మాట్లాడిన తర్వాత సొలొమోను, రాజుల గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటున్నాడు: “దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు.” (సామెతలు 16:​10) అది సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు విషయంలో ఖచ్చితంగా నిజం. భూమిపై ఆయన చేసే పరిపాలన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటుంది.

న్యాయానికి, నీతికి మూలాన్ని గుర్తిస్తూ జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు: “న్యాయమైన త్రాసును తూనికరాళ్లును యెహోవా యొక్క యేర్పాటులు సంచిలోని గుండ్లన్నియు ఆయన నియమించెను.” (సామెతలు 16:​11) న్యాయమైన తూనికరాళ్లను, త్రాసును యెహోవాయే ఏర్పాటు చేశాడు. అలాంటి ప్రమాణాలను రాజులు తమ ఇష్టానుసారంగా నిర్ణయించకూడదు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఇలా చెప్పాడు: “నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.” తండ్రి ‘తీర్పుతీర్చుటకు సర్వాధికారము అప్పగించిన’ కుమారుని నుండి మనం పరిపూర్ణ న్యాయాన్ని ఆశించవచ్చు.​—⁠యోహాను 5:​22, 30.

యెహోవాకు ప్రతినిధిగావున్న రాజు నుండి మనం ఇంకా ఏమి ఆశించవచ్చు? “రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతివలన సింహాసనము స్థిరపరచబడును” అని ఇశ్రాయేలు రాజు అంటున్నాడు. (సామెతలు 16:​12) మెస్సీయ రాజ్యం దేవుని నీతియుక్త సూత్రాలకు అనుగుణంగా పరిపాలిస్తుంది. “కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో” దానికి ఎలాంటి సంబంధం లేదు.​—⁠కీర్తన 94:​20; యోహాను 18:​36; 1 యోహాను 5:​19.

రాజు కటాక్షాన్ని పొందడం

అంతటి గొప్ప రాజు ముందు ప్రజలు ఎలా ప్రవర్తించాలి? సొలొమోను ఇలా చెబుతున్నాడు: “నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధమ మరణదూత జ్ఞానియైనవాడు ఆ క్రోధమును శాంతిపరచును.” (సామెతలు 16:​13, 14) నేడు యెహోవాను ఆరాధిస్తున్నవారు ఆ మాటలను మనసులో ఉంచుకుని రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో చురుకుగా పనిచేస్తారు. (మత్తయి 24:​14; 28:​19, 20) వారి పెదవుల్ని ఆ విధంగా ఉపయోగించడం మెస్సీయ రాజైన యేసుక్రీస్తుకు సంతోషం కలిగిస్తుందని వారికి తెలుసు. శక్తివంతమైన మానవ రాజుకు కోపం తెప్పించకుండా ఆయన అనుగ్రహాన్ని పొందడం నిజంగా జ్ఞానయుక్తం. అలాంటప్పుడు మెస్సీయ రాజు ఆమోదాన్ని పొందడం కోసం కృషి చేయడం ఎంత జ్ఞానయుక్తమో కదా!

“రాజుల ముఖప్రకాశమువలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు” అని సొలొమోను చెప్పాడు. (సామెతలు 16:​15) యెహోవా “ముఖకాంతి” ఎలాగైతే దైవిక అనుగ్రహాన్ని సూచిస్తుందో అలాగే ‘రాజు ముఖప్రకాశము’ ఆయన అనుగ్రహాన్ని సూచిస్తుంది. (కీర్తన 44:⁠3; 89:​15) ఎలాగైతే వాన మబ్బులు పంటలను పండించే వర్షానికి సూచనగా ఉంటాయో అలాగే రాజు కటాక్షం మంచి జరుగుతుందనడానికి సూచనగా ఉంటుంది. సొలొమోను రాజు పరిపాలనలో కొద్ది పరిమాణంలో ప్రజలు ఆశీర్వాదాలను, సమృద్ధిని అనుభవించారు. అలాగే మెస్సీయ రాజు పరిపాలనలో ప్రజలు పూర్తిస్థాయిలో ఆశీర్వాదాలను, సమృద్ధిని అనుభవిస్తారు.​—⁠కీర్తన 72:​1-17.

దేవుని రాజ్యం సూర్యుని క్రింది జరిగే కార్యకలాపాలన్నిటినీ అధీనంలోకి తీసుకునేందుకు మనం ఎదురుచూస్తుండగా, మన హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి ఆయన సహాయాన్ని కోరుకుందాం. అంతేకాక యెహోవాపై నమ్మకముంచుతూ దైవభయాన్ని పెంపొందించుకుందాం. అప్పుడే మన ‘ప్రణాళికలు సఫలమవుతాయి’ అనే పూర్తినమ్మకంతో మనం ఉండవచ్చు.​—⁠సామెతలు 16:⁠3.

[18వ పేజీలోని చిత్రం]

యెహోవా ఏ భావంలో ‘నాశన దినమునకు భక్తిహీనులను కలుగజేశాడు’?