కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పునరుత్థానం —మీకు వాస్తవికంగా ఉందా?

పునరుత్థానం —మీకు వాస్తవికంగా ఉందా?

పునరుత్థానం—⁠మీకు వాస్తవికంగా ఉందా?

“పునరుత్థానము కలుగబోవుచున్నది.” ​—⁠అపొస్తలుల కార్యములు 24:​14, 15.

“ఈ లోకంలో మరణం, పన్నులు తప్ప మరేదీ అనివార్యం కాదు.” అమెరికా రాజనీతిజ్ఞుడు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌ 1789లో వ్రాసిన ఆ వ్యాఖ్య జ్ఞానవంతమైనదని కొందరు భావించారు. అయితే నిజాయితీ లేని చాలామంది పన్నులు ఎగ్గొడతారు. కానీ మరణం విషయానికొస్తే అది అనివార్యమన్నట్లే అనిపిస్తుంది. స్వశక్తితో మనమెంత ప్రయత్నించినా ఎప్పుడో ఒకప్పుడు మనం మరణించాల్సిందే. అది నీడలా మనల్నందరినీ వెంటాడుతుంది. ఆకలి తీరని షియోల్‌, అంటే మానవుల సామాన్య సమాధి మన ప్రియమైనవారిని కబళిస్తూనే ఉంది. (సామెతలు 27:​20) అయితే ఓదార్పునిచ్చే ఈ తలంపును పరిశీలించండి.

2 యెహోవా వాక్యం పునరుత్థానం గురించి అంటే తిరిగి జీవం పొందడం గురించి ఒక ఖచ్చితమైన నిరీక్షణనిస్తోంది. ఇది కేవలం కలకాదు, ఈ నిరీక్షణను నిజం చేయకుండా విశ్వంలోని ఏ శక్తీ యెహోవాను అడ్డగించలేదు. అయితే కొందరికి మరణం అనివార్యం కాదనే విషయాన్ని నేడు చాలామంది గ్రహించడం లేదు. ఎందుకు? ఎందుకంటే, త్వరలో రానున్న “మహాశ్రమలనుండి” అసంఖ్యాకమైన ఒక “గొప్పసమూహము” తప్పించుకుంటుంది. (ప్రకటన 7:​9, 10, 14) ఆ తర్వాత వారు నిత్యజీవం పొందే అపేక్షతో జీవిస్తారు. ఆ విధంగా, మరణం వారికి అనివార్యం కాదు. అంతేకాదు, చివరకు ‘మరణం నశింపజేయబడుతుంది.’​—⁠1 కొరింథీయులు 15:​26.

3 పునరుత్థానం కలుగుతుందని అపొస్తలుడైన పౌలు నమ్మినంత ఖచ్చితంగా మనం కూడా నమ్మాలి. ఆయనిలా అన్నాడు: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” (అపొస్తలుల కార్యములు 24:​14, 15) పునరుత్థానానికి సంబంధించిన మూడు ప్రశ్నలను మనం పరిశీలిద్దాం. మొదటిది, ఏది ఈ నిరీక్షణను అంత ఖచ్చితమైనదిగా చేస్తోంది? రెండవది, పునరుత్థాన నిరీక్షణనుబట్టి వ్యక్తిగతంగా మీరెలా ఓదార్పు పొందవచ్చు? మూడవది, ఈ నిరీక్షణ మీ ప్రస్తుత జీవనశైలిని ఎలా ప్రభావితం చేయవచ్చు?

పునరుత్థానం ఖచ్చితంగా కలుగుతుంది

4 పునరుత్థానం ఖచ్చితమని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. అన్నింటికన్నా మిన్నగా, యెహోవా సంకల్పానికి అది కేంద్రబిందువు. సాతాను మానవాళిని పాపానికి, తత్ఫలితంగా అనివార్యంగా సంభవించే మరణానికి నడిపించాడని గుర్తుంచుకోండి. అందుకే యేసు, సాతాను గురించి ఇలా అన్నాడు: “ఆదినుండి వాడు నరహంతకుడు.” (యోహాను 8:​44) అయితే యెహోవా తన “స్త్రీకి” లేదా భార్యలాంటి పరలోక సంస్థకు “సంతానము” కలుగుతుందనీ, ఆ సంతానం “ఆది సర్పమైన” సాతాను తలను చితకగొట్టి అతణ్ణి ఉనికిలో లేకుండా చేస్తాడని వాగ్దానం చేశాడు. (ఆదికాండము 3:1-6, 15; ప్రకటన 12:​9, 10; 20:​10) ఆ మెస్సీయ సంతానానికి సంబంధించిన తన సంకల్పాన్ని యెహోవా క్రమేణా వెల్లడిచేయగా, ఆ సంతానం సాతానును నాశనం చేయడంకన్నా ఎక్కువే చేస్తాడని స్పష్టమైంది. దేవుని వాక్యమిలా చెబుతోంది: “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” (1 యోహాను 3:⁠8) యేసుక్రీస్తు ద్వారా తొలగించబడాలని యెహోవా సంకల్పించిన సాతాను క్రియల్లో, ఆదాము నుండి మనకు సంక్రమించిన పాపంవల్ల వచ్చే మరణం ప్రధానమైనది. ఈ సంబంధంగా యేసు విమోచన క్రయధన బలి, పునరుత్థానం అత్యంత ప్రాముఖ్యమైనవి.​—⁠అపొస్తలుల కార్యములు 2:​22-24; రోమీయులు 6:​23.

5యెహోవా తన పవిత్రనామాన్ని మహిమపర్చేందుకు దృఢంగా సంకల్పించాడు. సాతాను, దేవుని నామానికి కళంకం తీసుకొచ్చి, అబద్ధాలను పెంపొందించాడు. దేవుడు నిషేధించిన ఫలాలు తిన్నా వారు ‘చావనే చావరని’ ఆదాము హవ్వలకు అతను అబద్ధాలు చెప్పాడు. (ఆదికాండము 2:​16, 17; 3:⁠4) అప్పటినుండి సాతాను అలాంటి అబద్ధాలనే పెంచి పోషిస్తున్నాడు, వాటిలో ఆత్మ అమర్త్యమనే అబద్ధ బోధ ఒకటి. అయితే పునరుత్థానం ద్వారా యెహోవా అలాంటి అబద్ధాలన్నింటిని వెల్లడిచేస్తాడు. తాను మాత్రమే ప్రాణాలు కాపాడి, పునరుద్ధరించే దేవుడనని ఆయన శాశ్వతంగా నిరూపిస్తాడు.

6పునరుత్థానం చేసేందుకు యెహోవా ఇష్టపడుతున్నాడు. ఈ విషయంలో యెహోవా భావాలను బైబిలు స్పష్టం చేస్తోంది. ఉదాహరణకు, యథార్థపరుడైన యోబు పలికిన ఈ ప్రేరేపిత మాటలను పరిశీలించండి: “మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు [‘నిర్భంద సేవా కాలమంతా,’ NW] నేను కనిపెట్టియుందును. ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను. నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:​14, 15) ఈ మాటల భావమేమిటి?

7 యోబుకు తాను చనిపోయిన తర్వాత, కొంతకాలంపాటు మరణ నిద్రలో వేచివుండాలని తెలుసు. ఆ కాలాన్ని ఆయన ‘నిర్భంద సేవా కాలముగా’ అంటే తనకు విడుదల లభించేంతవరకు తప్పనిసరిగా వేచివుండాల్సిన కాలముగా దృష్టించాడు. ఆయనకు ఆ విడుదల ఖచ్చితం. ఆ విడుదల తనకు లభిస్తుందని యోబు గ్రహించాడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు యెహోవా మనోభావాలు తెలుసు. తన యథార్థ సేవకుణ్ణి మళ్ళీ చూసేందుకు యెహోవాకు “ఇష్టము కలుగును.” అవును, నీతిమంతులందరినీ తిరిగి బ్రతికించాలని దేవుడు కోరుతున్నాడు. పరదైసు భూమిపై నిరంతరం జీవించే అవకాశాన్ని యెహోవా ఇతరులకు కూడా ఇస్తాడు. (లూకా 23:​43; యోహాను 5:​28, 29) ఆ సంకల్పాన్ని నెరవేర్చడం దేవుని చిత్తం కాబట్టి, ఆయనను ఎవరు అడ్డగించగలరు?

8యేసు పునరుత్థానం ద్వారా మన భావి నిరీక్షణకు హామీ ఇవ్వబడింది. పౌలు ఏథెన్సులో ప్రసంగించినప్పుడు, ఆయనిలా ప్రకటించాడు: “[దేవుడు] తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.” (అపొస్తలుల కార్యములు 17:​31) పునరుత్థానం గురించి విన్నప్పుడు పౌలు శ్రోతల్లోని కొందరు అపహాస్యం చేశారు. కొందరు, విశ్వాసులయ్యారు. ఈ నిరీక్షణకు ఇవ్వబడిన హామీ బహుశా వారి అవధానాన్ని ఆకర్షించి ఉండవచ్చు. యెహోవా యేసును పునరుత్థానం చేసినప్పుడు ఆయన అద్భుతాల్లోకెల్లా మహాద్భుతం చేశాడు. ఆయన తన కుమారుణ్ణి బలమైన ఆత్మప్రాణిగా బ్రతికించాడు. (1 పేతురు 3:​18) పునరుత్థానం చేయబడిన యేసు తన మానవపూర్వ ఉనికిలోవున్న దానికన్నా మరింత గొప్పవాడయ్యాడు. అమర్త్యునిగా, యెహోవా తర్వాత తిరుగులేని అధికారంగల వ్యక్తిగా యేసు ఇప్పుడు తన తండ్రి దగ్గరనుండి అద్భుతమైన నియామకాలు చేపట్టే స్థానంలో ఉన్నాడు. యెహోవా ఇతర పునరుత్థానాలన్నింటినీ, అంటే పరలోకంలో జీవించడానికి, భూమిపై జీవించడానికి చేయబడే పునరుత్థానాలన్నింటినీ యేసు ద్వారానే జరిగిస్తాడు. యేసు ఇలా చెప్పాడు: “పునరుత్థానమును జీవమును నేనే.” (యోహాను 5:​25; 11:​25) యెహోవా తన కుమారుణ్ణి పునరుత్థానం చేయడం ద్వారా విశ్వాసులందరికీ అలాంటి నిరీక్షణలకు హామీ ఇచ్చాడు.

9పునరుత్థానం ప్రత్యక్ష సాక్షుల ఎదుట చేయబడి, దేవుని వాక్యంలో నమోదు చేయబడింది. భూమ్మీద మానవులుగా జీవించడానికి తిరిగి బ్రతికించబడినవారి ఎనిమిది పునరుత్థానాల వివరణాత్మక వర్ణనలు బైబిల్లో ఉన్నాయి. ఈ అద్భుతాలు రహస్యంగా కాదుగానీ, తరచూ ప్రత్యక్ష సాక్షుల ఎదుట బహిరంగముగా జరిగించబడ్డాయి. నాలుగు రోజుల క్రితం చనిపోయిన లాజరును యేసు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారితో సహా దుఃఖిస్తున్న ఒక పెద్ద జనసమూహము సమక్షంలో పునరుత్థానం చేశాడు. దేవుడే యేసును పంపించాడనే ఈ రుజువు ఎంత బలంగా ఉందంటే, యేసు మతసంబంధ శత్రువులు సహితం ఆ పునరుత్థానాన్ని ఎన్నడూ ఖండించలేదు. బదులుగా వారు యేసునే కాక లాజరును కూడా చంపేందుకు పన్నాగం పన్నారు! (యోహాను 11:​17-44, 53; 12:​9-11) అవును, పునరుత్థానం ఖచ్చితంగా జరుగుతుందని మనం గట్టి నమ్మకంతో ఉండవచ్చు. మనల్ని ఓదార్చేందుకు, మన విశ్వాసాన్ని బలపర్చేందుకు దేవుడు గతకాల పునరుత్థానాల నివేదికను మనకిచ్చాడు.

పునరుత్థాన నిరీక్షణలో ఓదార్పు కనుగొనడం

10 ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఓదార్పును కోరుకుంటారా? ఓదార్పుకు ఖచ్చితమైన మూలాధారాన్ని బైబిల్లోని పునరుత్థాన వృత్తాంతాల్లో కనుగొనవచ్చు. అలాంటి వృత్తాంతాలను చదవడం, వాటి గురించి ధ్యానించడం, సంఘటనలను దృశ్యీకరించుకోవడం పునరుత్థాన నిరీక్షణను మీకు మరింత వాస్తవికం చేస్తాయి. (రోమీయులు 15:⁠4) ఇవి కేవలం కథలు కావు. అవి నిజమైన కాలంలో, నిజమైన ప్రాంతంలో జీవిస్తున్న మనలాంటి నిజమైన ప్రజలకు నిజంగా సంభవించాయి. మనమొక ఉదాహరణను అంటే బైబిల్లో నమోదు చేయబడిన మొదటి పునరుత్థానాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం.

11 ఈ సన్నివేశాన్ని దృశ్యీకరించుకోండి. ప్రవక్తయైన ఏలీయా సారెపతులోని విధవరాలి ఇంట్లో మేడగదిలో కొన్నివారాలపాటు అతిథిగా ఉన్నాడు. అది అంధకారకాలం. ఆ ప్రాంతమంతా అనావృష్టి, కరవు కోరల్లో చిక్కుకొనివుంది. ఎంతోమంది మరణిస్తున్నారు. వినయస్థురాలైన ఈ విధవరాలి విశ్వాసానికి ప్రతిఫలమివ్వడానికి, దీర్ఘకాల ప్రభావం చూపించే అద్భుతం చేసేందుకు యెహోవా అప్పటికే ఏలీయాను ఉపయోగించుకున్నాడు. ఆ విధవరాలు, ఆమె కుమారుడు ఆకలితో మరణించే స్థితిలో ఉండి, వారివద్ద కేవలం ఒకపూటకు సరిపడా ఆహారం మాత్రమే మిగిలివున్న సమయంలో, పిండి, నూనె ఎప్పటికీ అయిపోకుండా ఉండేలా అద్భుతం చేసేందుకు దేవుడు ఏలీయాకు శక్తినిచ్చాడు. కానీ ఇప్పుడామెను విషాదం ముంచెత్తింది. అకస్మాత్తుగా వ్యాధికి గురైన ఆ కుమారుడు కొద్దిసేపటికే ప్రాణాలు విడిచాడు. ఆ విధవరాలు ఎంతగానో కృంగిపోయింది! భర్త తోడు, సహాయం లేకుండా జీవించడమే చాలా కష్టం, పైగా ఇప్పుడామె తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా కోల్పోయింది. దుఃఖంలో ఆమె ఏలీయాను, ఆయన దేవుడైన యెహోవాను కూడా నిందించింది! ఆ ప్రవక్త ఏమిచేస్తాడు?

12 తప్పుగా ఆరోపించినందుకు ఏలీయా ఆ విధవరాలిని గద్దించలేదు. బదులుగా ఆయనిలా అన్నాడు: “నీ బిడ్డను నా చేతికిమ్ము.” ఏలీయా ఆ కుర్రవాణ్ణి తన మేడగదిలోకి మోసుకెళ్లి, అతను తిరిగి జీవం పొందాలని పదేపదే ప్రార్థించాడు. చివరకు యెహోవా స్పందించాడు! ఆ కుర్రవాడు ఊపిరి తీసుకోవడం చూసిన ఏలీయా ముఖం ఆనందంతో విప్పారడాన్ని ఊహించండి! ఆ కుర్రవాడు నెమ్మదిగా కళ్లు తెరిచినప్పుడు, అవి జీవంతో మెరిశాయి. ఏలీయా ఆ కుర్రవాణ్ణి అతని తల్లికి అప్పగిస్తూ ‘ఇదిగో! నీ కుమారుడు బ్రతికాడు’ అన్నాడు. అప్పుడామె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆమె ఇలా అంది: “నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును.” (1 రాజులు 17:​8-24) యెహోవాపై, ఆయన ప్రతినిధిపై ఆమె విశ్వాసం ముందెన్నటి కన్నా బలపడింది.

13 అలాంటి వృత్తాంతాన్ని ధ్యానించడం నిశ్చయంగా మీకెంతో ఓదార్పునిస్తుంది. మన శత్రువైన మరణాన్ని యెహోవా ఓడించగలడనేది ఎంతగా స్పష్టమయ్యిందో కదా! మృతుల సాధారణ పునరుత్థాన సమయంలో వేలాదిమంది భూనివాసుల ఆనందం ఆ విధవరాలి ఆనందంకన్నా ఇంకెంత ఎక్కువగా ఉంటుందో ఒక్కసారి ఊహించండి! భూవ్యాప్తంగా పునరుత్థానాలు చేయడంలో యెహోవా తన కుమారుణ్ణి నిర్దేశించడంలో ఆనందాన్ని పొందుతుండగా పరలోకంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. (యోహాను 5:​28, 29) మీకు ప్రియమైనవారు ఎవరైనా చనిపోయారా? చనిపోయినవారిని యెహోవా తిరిగి బ్రతికించగలడని, బ్రతికిస్తాడని తెలుసుకోవడం ఎంత సంతోషకరమో కదా!

మీ నిరీక్షణ, మీ ప్రస్తుత జీవితం

14 పునరుత్థాన నిరీక్షణ మీ ప్రస్తుత జీవన విధానంపై ఎలా ప్రభావం చూపించగలదు? కష్టాల్ని, సమస్యల్ని, హింసను లేదా ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు ఈ నిరీక్షణ నుండి బలం పొందవచ్చు. భద్రత విషయంలో శుష్క వాగ్దానం కోసం ఉద్దేశపూర్వకంగా మీ యథార్థతను కోల్పోయేలా మీరు మరణ భయానికి లోనవ్వాలని సాతాను కోరుతున్నాడు. “తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును” అని సాతాను యెహోవాతో అనడాన్ని గుర్తుంచుకోండి. (యోబు 2:⁠4) అలా అన్నప్పుడు సాతాను మీతోసహా మనందరిపై నింద వేశాడు. మీరు ప్రమాదాన్ని ఎదుర్కొంటే దేవుణ్ణి సేవించడం మానేస్తారనడం సత్యమా? పునరుత్థాన నిరీక్షణను తలపోయడం ద్వారా మీ పరలోక తండ్రి చిత్తాన్ని నిర్విరామంగా చేస్తూవుండాలనే మీ తీర్మానాన్ని బలపర్చుకోవచ్చు.

15 యేసు ఇలా అన్నాడు: “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో [‘గెహెన్నాలో,’ NW] నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.” (మత్తయి 10:​28) సాతానుకు గానీ అతని ప్రతినిధులకు గానీ మనం భయపడనక్కర్లేదు. నిజమే, హాని చేసేందుకు, చివరకు హత్య చేసేందుకు కొందరికి శక్తి ఉండవచ్చు. అయితే, వారెంత ఘోరమైన హానిచేసినా అది కేవలం తాత్కాలికమే. యెహోవా తన నమ్మకమైన సేవకులను పునరుత్థానం చేయడం ద్వారా, వారికి జరిగిన ఎలాంటి నష్టాన్నైనా పూరించగలడు, అలా పూరిస్తాడు కూడా. మన భయానికి, మన ప్రగాఢ భక్తికి, గౌరవానికి యెహోవా మాత్రమే అర్హుడు. మన ప్రాణాల్ని, మన భావి జీవిత అపేక్షలన్నింటిని తీసివేసి ఆత్మను, దేహాన్ని గెహెన్నాలో నాశనం చేయగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. సంతోషకరమైన విషయమేమిటంటే, మీరలా నశించాలని యెహోవా కోరుకోవడం లేదు. (2 పేతురు 3:⁠9) పునరుత్థాన నిరీక్షణ కారణంగా దేవుని సేవకులముగా మనమెల్లప్పుడూ సురక్షితంగా ఉంటామనే నమ్మకంతో ఉండవచ్చు. మనం నమ్మకంగా ఉన్నంతకాలం నిత్యజీవం మన ఎదుటే ఉంటుంది, సాతాను గానీ, అతని అనుయాయులు గానీ దాని విషయంలో ఏమీ చేయలేరు.​—⁠కీర్తన 118:⁠6; హెబ్రీయులు 13:⁠6.

16 మనకు పునరుత్థాన నిరీక్షణ వాస్తవికంగా ఉంటే, అది జీవితాన్ని గురించిన మన మనోవైఖరిని సరిదిద్దుతుంది. ‘మనము బ్రదికినను చనిపోయినను యెహోవావారమై ఉన్నామని’ మనకు తెలుసు. (రోమీయులు 14:​7, 8) కాబట్టి ప్రాధాన్యతలు ఏర్పరచుకునేటప్పుడు మనం పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అన్వయించుకుంటాం: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:⁠2) ప్రతీ కోరికను, ప్రతీ ఆశను, క్షణికమైన ప్రతీ అభిలాషను తీర్చుకునేందుకు చాలామంది వెర్రిగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వారికి జీవితం కేవలం నీటి బుడగలాంటిది, వారు సుఖంకోసం సమస్తాన్ని ఒడ్డేందుకు వెనకాడనట్లు కనిపిస్తారు, ఒకవేళ వారికి కొంతమేర భక్తివున్నా, అది నిశ్చయంగా ‘సంపూర్ణమైన దేవుని చిత్తానికి’ అనుగుణంగా ఉండదు.

17 నిజమే, జీవితకాలం తక్కువగానే ఉంది. మన జీవితం 70 లేదా 80 ఏళ్లకే పరిమితమై, ‘త్వరగా గతించి మనం ఎగిరిపోవచ్చు.’ (కీర్తన 90:​10) నరులు పచ్చిగడ్డిలా, నీడలా, ఊపిరిలా, క్షణికమైనవారు. (కీర్తన 103:​15; 144:​3, 4) మనం కొన్ని దశాబ్దాలపాటు ఎదుగుతూ కొంత జ్ఞానం, అనుభవం సంపాదించుకుని ఆ తర్వాతి కొన్ని దశాబ్దాల్లో కృంగి కృషిస్తూ వ్యాధిగ్రస్థులమై మరణించాలని దేవుడు సంకల్పించలేదు. బదులుగా యెహోవా మానవులను సృష్టించినప్పుడే నిత్యం జీవించాలనే కోరికను వారిలో ఉంచాడు. “ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు” అని బైబిలు మనకు చెబుతోంది. (ప్రసంగి 3:​11) అలాంటి కోరికనిచ్చి ఆ తర్వాత దాని నెరవేర్పును అసాధ్యం చేయడానికి, దేవుడు క్రూరుడా? కానేకాదు, నిజానికి “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:⁠8) చనిపోయినవారికి నిత్యజీవాన్ని సాధ్యం చేసేందుకు ఆయన పునరుత్థానాన్ని ఉపయోగిస్తాడు.

18 పునరుత్థాన నిరీక్షణ కారణంగా మనం సురక్షితమైన భవిష్యత్తును కలిగివుండగలం. మన సామర్థ్యపు పూర్తి స్థాయికి ఇప్పుడే చేరుకోవాలని అమితంగా ఆత్రపడనక్కర్లేదు. గతిస్తున్న ఈ లోకాన్ని మనం ‘అమితంగా అనుభవించాల్సిన’ అవసరం లేదు. (1 కొరింథీయులు 7:​29-31; 1 యోహాను 2:​17) నిజమైన నిరీక్షణలేని ప్రజలకు భిన్నంగా, మనం యెహోవాపట్ల నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయనను యుగయుగాలు స్తుతిస్తూ, జీవితాన్ని ఆనందించవచ్చని తెలుసుకునే అద్భుతమైన బహుమానం మనకుంది. కాబట్టి, మనం పునరుత్థాన నిరీక్షణను నిశ్చయపర్చే యెహోవాను ప్రతీ దినం ఇష్టపూర్వకంగా తప్పక స్తుతిద్దాం!

మీరెలా జవాబిస్తారు?

• పునరుత్థానం గురించి మనమెలా భావించాలి?

• ఏ అంశాలు పునరుత్థాన నిరీక్షణను నిశ్చయం చేస్తున్నాయి?

• పునరుత్థాన నిరీక్షణ నుండి మీరెలా ఓదార్పు పొందవచ్చు?

• మీ జీవన విధానంపై పునరుత్థాన నిరీక్షణ ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మరణం ఎందుకు అనివార్యమైనదిగా అనిపిస్తుంది?

2, 3. (ఎ) మరణం చాలామంది అనుకుంటున్నంత అనివార్యం ఎందుకు కాదు? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

4. పునరుత్థానం యెహోవా సంకల్పానికి ఎలా కేంద్రబిందువుగా ఉంది?

5. పునరుత్థానం యెహోవా నామాన్ని ఎందుకు మహిమపరుస్తుంది?

6, 7. ప్రజలను పునరుత్థానంచేసే విషయంలో యెహోవా ఎలా భావిస్తున్నాడు, ఆయన మనోభావాలు మనకెలా తెలుసు?

8. మన భావి నిరీక్షణకు యెహోవా ఎలాంటి “ఆధారం కలుగజేశాడు”?

9. పునరుత్థాన వాస్తవికతను బైబిలు నివేదిక ఎలా స్థిరపరుస్తోంది?

10. బైబిల్లోని పునరుత్థాన వృత్తాంతాల నుండి ఓదార్పు పొందేందుకు మనకేమి సహాయం చేస్తుంది?

11, 12. (ఎ) సారెపతులోని విధవరాలిని ఏ విషాదం ముంచెత్తింది, మొదట్లో ఆమె ఎలా స్పందించింది? (బి) ఆ విధవరాలి కోసం ఏమి చేసేందుకు యెహోవా తన ప్రవక్తయైన ఏలీయాను బలపర్చాడో వివరించండి.

13. ఒక విధవరాలి కుమారుణ్ణి ఏలీయా పునరుత్థానం చేయడాన్ని గురించిన వృత్తాంతం నేడు మనకెందుకు ఓదార్పునిస్తుంది?

14. పునరుత్థాన నిరీక్షణ మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు?

15. మనం ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు, మత్తయి 10:⁠28లో వ్రాయబడిన యేసు మాటలు మనకెలా ఓదార్పునివ్వవచ్చు?

16. మనమేర్పర్చుకునే ప్రాధాన్యతలపై మన మనోవైఖరి ఎలా ప్రభావం చూపిస్తుంది?

17, 18. (ఎ) మానవుల అల్పాయుష్షును యెహోవా వాక్యమెలా గుర్తిస్తోంది, అయితే దేవుడు మనకోసం ఏమి చేసేందుకు ఇష్టపడుతున్నాడు? (బి) యెహోవాను ప్రతీదినం స్తుతించేందుకు మనమెందుకు పురికొల్పబడుతున్నాం?

[28వ పేజీలోని చిత్రం]

నీతిమంతులను పునరుత్థానం చేసేందుకు యెహోవా ఇష్టపడుతున్నాడని యోబుకు తెలుసు

[29వ పేజీలోని చిత్రం]

‘ఇదిగో, నీ కుమారుడు బ్రతికాడు’