“ప్రభువా, ఎందుకు మౌనంగా ఉన్నావు?”
“ప్రభువా, ఎందుకు మౌనంగా ఉన్నావు?”
పై మాటలను పోప్ బెనెడిక్ట్ XVI 2006, మే 28న పోలాండ్‌లోని ఆష్‌విట్స్‌లో ఉన్న మునుపటి సామూహిక నిర్బంధ శిబిరాన్ని సందర్శించినప్పుడు పలికాడు. నాజీలు లక్షలాదిమంది యూదులను, ఇతరులను చంపిన స్థలంవద్ద ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఈ స్థలంలో ఎన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయో! తరచూ ఈ ప్రశ్నే తలెత్తుతోంది: ఆ రోజుల్లో దేవుడెక్కడున్నాడు? ఆయన మౌనంగా ఎందుకున్నాడు? అంతులేని ఈ ఊచకోతను, దుష్టత్వం విజయం సాధించడాన్ని ఆయనెలా అనుమతించగలిగాడు? . . . మనం వినయంగానైనా సరే పట్టుదలతో దేవుణ్ణి వేడుకుంటూనే ఉండాలి: దేవా మేలుకో! నువ్వు సృష్టించిన మానవుల్ని మర్చిపోకు!”
పోప్ మాటలు ప్రజల్లో కలకలం రేపాయి. యూదులపట్ల ఉన్న వివక్షనుబట్టి ఆష్‌విట్స్‌లో జరిగిన దారుణకృత్యాల వంటి కొన్ని విషయాలను పోప్ ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించలేదని కొందరు వెంటనే పసిగట్టారు. మరికొందరు, పోప్ జాన్ పాల్ II, చర్చి చేసిన పాపాలకు క్షమాపణ కోసం అర్థించడాన్ని అల్పమైన విషయంగా చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన మాటలనుబట్టి అర్థం చేసుకున్నారు. ఒక క్యాథలిక్ జర్నలిస్ట్ అయిన ఫిలిప్పో జెంటిలోని ఇలా వ్యాఖ్యానించాడు: “ఎంతోమంది వ్యాఖ్యానకర్తలు దేవుడెక్కడ ఉన్నాడనే జవాబులేని కష్టమైన ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు, ఆ ప్రశ్నకు బదులుగా పయస్ XII ఎక్కడున్నాడు? అనే మరో సులభమైన ప్రశ్నకు సమాధానం అడిగారు.” మారణహోమం జరుగుతున్నప్పుడు పోప్ పయస్ XII మౌనం వహించడాన్ని గురించి వ్యాఖ్యానకర్తలు అలా అడిగారు.
చరిత్ర అంతటిలో జరిగిన మారణహోమం, జాతి నిర్మూలనకు సంబంధించిన ఇతర క్రియలన్నీ ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొంటున్నాడని’ నిరూపిస్తున్నాయి. (ప్రసంగి 8:9) అంతేగాక, అలాంటి ఘోరమైన కృత్యాలు జరుగుతున్నప్పుడు మానవుల సృష్టికర్త మౌనంగా లేడు. దుష్టత్వాన్ని అనుమతించడానికిగల కారణాలను ఆయన బైబిలు ద్వారా తెలియజేశాడు. మానవజాతిని ఆయన మరచిపోలేదని కూడా హామీ ఇచ్చాడు. నిజానికి, మానవులు తమను తాము పరిపాలించుకోవడానికి దేవుడు అనుమతించిన సమయం త్వరలోనే పూర్తవబోతోంది. (యిర్మీయా 10:23) మన విషయంలో దేవుని సంకల్పమేమిటో మీరు మరింత తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? పోప్ బెనెడిక్ట్ XVIను కలవరపెట్టిన ప్రశ్నలకు బైబిలు నుండి సమాధానాన్ని మీకు చూపించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Oświęcim Museum