కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధలన్నీ త్వరలోనే ఎందుకు అంతమవుతాయి?

బాధలన్నీ త్వరలోనే ఎందుకు అంతమవుతాయి?

బాధలన్నీ త్వరలోనే ఎందుకు అంతమవుతాయి?

“ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము.”​—⁠ద్వితీయోపదేశకాండము 32:⁠4.

ప రదైసులో జీవితాన్ని ఊహించుకోవడం మీకిష్టమా? అద్భుతమైన ఈ గ్రహాన్ని పరిశోధిస్తున్నట్లుగా, అందులో అసంఖ్యాకంగావున్న వివిధరకాల జీవరాశుల గురించి తెలుసుకుంటున్నట్లుగా బహుశా మీరు దృశ్యీకరించుకోవచ్చు. లేదా ఈ భూమిని సేద్యపరుస్తూ, దానినొక భూవ్యాప్త ఉద్యానవనంగా మార్చడంలో తోడ్పడుతూ ఇతరులతో కలిసి పనిచేస్తుండగా కలిగే సంతృప్తి గురించి మీరు ఆలోచిస్తుండవచ్చు. లేదా కళలో, భవననిర్మాణంలో, సంగీతంలో లేక పరుగులుపెట్టే నేటి జీవితంలో మీకు సమయమే లభించని ఇతర వ్యాపకాల్లో, మీ నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోవడం గురించి తలస్తుండవచ్చు. ఏదేమైనా,“వాస్తవమైన జీవము” అని బైబిలు పిలిచేదాన్ని, మనం ఎలా జీవించాలని యెహోవా సంకల్పించాడో అలా జీవించడాన్ని, అంటే నిరంతరం జీవించే నిరీక్షణను మీరు అమూల్యమైనదిగా పరిగణిస్తారు.​—⁠1 తిమోతి 6:​18.

2 ఈ బైబిలు ఆధారిత నిరీక్షణను ఇతరులతో పంచుకోవడం ఆహ్లాదకరమైనదేకాక, ప్రశస్తమైన ఆధిక్యత కూడా, కాదంటారా? కానీ చాలామంది అలాంటి నిరీక్షణను తిరస్కరిస్తారు. అదొక భ్రమ అని, అమాయక ప్రజల అవాస్తవిక స్వప్నమని వారు దానిని కొట్టిపారేస్తారు. పరదైసులో నిత్యజీవాన్ని వాగ్దానం చేస్తున్న దేవుణ్ణి నమ్మడం కూడా వారికి కష్టంగా ఉండవచ్చు. ఎందుకు? కొందరికి, కీడు అని తరచూ పిలవబడే సమస్య అడ్డంకుగా ఉండవచ్చు. దేవుడు ఉనికిలో ఉంటే, అదీ ఆయనకు సర్వశక్తి, ప్రేమవుంటే కీడు, బాధ ఎందుకున్నాయో వివరించడం అసాధ్యమని వారు నమ్ముతారు. కీడును సహించే దేవుడు అసలు ఉనికిలో ఉండనేరడు, ఒకవేళ ఉంటే, ఆయనకు సర్వశక్తైనా లేదు లేక మనపట్ల శ్రద్ధైనా లేదు అని వారు తర్కిస్తారు. కొందరికి ఈ విధమైన తర్కం నమ్మశక్యంగా ఉంటుంది. మానవుల మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేయడంలో సాతాను నిష్ణాతుడనని నిరూపించుకున్నాడు.​—⁠2 కొరింథీయులు 4:⁠4.

3 యెహోవాసాక్షులుగా మనం, సాతానుచేత, ఈ లోకపు జ్ఞానంచేత మోసగించబడుతున్న ప్రజలకు సహాయంచేసే విశిష్ట స్థానంలో ఉన్నాం. (1 కొరింథీయులు 1:​20; 3:​19) చాలామంది బైబిలు వాగ్దానాలను ఎందుకు నమ్మడం లేదో మనకు తెలుసు. వారికి యెహోవా ఎవరో బొత్తిగా తెలియదు. వారికి ఆయన పేరు గానీ, ఆ పేరుకున్న విశిష్టత గానీ తెలియకపోవచ్చు, ఆయన లక్షణాల గురించి లేదా చేసిన వాగ్దానాలు నెరవేర్చేవాడని ఆయనకున్న ఖ్యాతి గురించి వారికి అంతగా తెలియకపోవచ్చు లేక అసలే తెలిసుండకపోవచ్చు. కానీ అలాంటి జ్ఞానాన్ని పొందగలిగినందుకు మనం ధన్యులం. అప్పుడప్పుడు మనం, “దేవుడు ఎందుకు కీడును, బాధను అనుమతిస్తున్నాడు” అని మానవులు అడిగే అతి కష్టమైన ప్రశ్నకు జవాబు కనుగొనేందుకు “అంధకారమైన మనస్సుగల” ప్రజలకు మనమెలా సహాయం చేయవచ్చో సమీక్షించుకోవడం మంచిది. (ఎఫెసీయులు 4:​18) ఆ ప్రశ్నకు సమర్థవంతంగా ఎలా జవాబివ్వవచ్చో మనం మొదట పరిశీలిద్దాం. ఆ తర్వాత, కీడుతో యెహోవా వ్యవహరించిన విధానంలో ఆయన లక్షణాలు ఎలా స్పష్టమయ్యాయో చర్చిద్దాం.

ఆ ప్రశ్నకు జవాబిచ్చే సరైన మార్గం

4 దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడని ఎవరైనా అడిగితే మనమెలా స్పందిస్తాం? మనం వెంటనే ఏదెను వనంలో జరిగిన దానితో మొదలుపెట్టి సవివరంగా చెప్పడానికి మొగ్గుచూపవచ్చు. కొన్ని సందర్భాల్లో అది సరియైనదిగానే ఉండవచ్చు. అయితే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంత పునాది వేయడం అవసరంకావచ్చు. (సామెతలు 25:​11; కొలొస్సయులు 4:⁠6) ఆ ప్రశ్నకు జవాబిచ్చే ముందు మనం స్పష్టం చేయాలనుకునే మూడు లేఖనాధార అంశాలను క్లుప్తంగా పరిశీలిద్దాం.

5 మొదటిది, లోకంలో విస్తృతంగావున్న కీడు విషయమై ఒక వ్యక్తి కలతచెందినట్లు కనిపిస్తే, ఆయనో లేక ఆయనకు ప్రియమైనవారో ఆ కీడు అనుభవించి ఉండవచ్చు. అలాంటప్పుడు, యథార్థ సహానుభూతిని చూపిస్తూ ఆరంభించడం మంచిది. అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు ఇలా ఉపదేశించాడు: “ఏడ్చువారితో ఏడువుడి.” (రోమీయులు 12:​16) సహానుభూతి చూపించడం లేదా ‘ఒకరి సుఖదుఃఖాల్లో ఒకరు పాలుపడడం’ ఒక వ్యక్తిని పురికొల్పవచ్చు. (1 పేతురు 3:⁠8) మనమాయనపట్ల శ్రద్ధ చూపిస్తున్నామని ఆయన అర్థం చేసుకున్నప్పుడు, మనం చెప్పాలనుకున్నది వినేందుకు మరింత సుముఖత చూపించవచ్చు.

6 రెండవది, ఈ ప్రశ్న అడిగినందుకు నిష్కపటియైన ఆ వ్యక్తిని మనం మెచ్చుకోవచ్చు. కొందరు అలాంటి ప్రశ్నలతో సంఘర్షిస్తున్న కారణంగా తమకు దేవుని మీద నమ్మకం లేదనో దేవుడంటే గౌరవం లేదనో అనుకుంటారు. వారలాంటి వారేనని మతనాయకులు సహితం చెప్పి ఉండవచ్చు. అంతమాత్రాన వారికి విశ్వాసం లేదని అది సూచించదు. నిజానికి, బైబిలు కాలాల్లోని విశ్వాసులు అలాగే ప్రశ్నించారు. ఉదాహరణకు, కీర్తనకర్త దావీదు ఇలా అడిగాడు: “యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి యున్నావు?” (కీర్తన 10:⁠1) అదే విధంగా, ప్రవక్తయైన హబక్కూకు ఇలా అడిగాడు: “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.”​—⁠హబక్కూకు 1:​2, 3.

7 వీరు దేవుడంటే ఎనలేని గౌరవం చూపించిన నమ్మకమైన వ్యక్తులు. కలవరపెడుతున్న అలాంటి ప్రశ్నలు అడిగినందుకు వీరు గద్దించబడ్డారా? బదులుగా, నిష్కపటమైన వారి ప్రశ్నలు తన వాక్యంలో నమోదు చేయబడడం సరియని యెహోవా ఎంచాడు. నేడు, కీడు విస్తృతంగా ఉండడాన్నిబట్టి కలవరపడుతున్న వ్యక్తి నిజానికి ఆధ్యాత్మిక ఆకలితో ఉండవచ్చు, అంటే బైబిలు మాత్రమే ఇవ్వగల జవాబుల కోసం అపేక్షిస్తుండవచ్చు. “ఆత్మవిషయమై దీనులైనవారి” గురించి లేదా ఆధ్యాత్మిక ఆకలిగలవారి గురించి యేసు మంచిగా మాట్లాడాడని గుర్తుచేసుకోండి. (మత్తయి 5:⁠3) అలాంటివారు యేసు వాగ్దానం చేసిన ధన్యతను కనుగొనేలా సహాయం చేయడం ఎంతటి ఆధిక్యతో కదా!

8 మూడవది, లోకంలో విస్తృతంగావున్న దుష్టత్వానికి దేవుడు బాధ్యుడుకాదని గ్రహించేలా మనం ఆ వ్యక్తికి సహాయం చేయవచ్చు. మనం జీవిస్తున్న లోకాన్ని దేవుడు పరిపాలిస్తున్నాడని, మనకు జరిగేవాటన్నింటిని దేవుడు ముందెప్పుడో నిర్ణయించాడని, మానవాళిని బాధపెట్టడానికి ఆయనకు నిగూఢమైన కారణాలున్నాయని చాలామందికి బోధించబడింది. ఇవి అబద్ధ బోధలు. ఇవి దేవుణ్ణి అవమానపర్చడమే కాక, లోకంలోని దుష్టత్వానికి, బాధకు ఆయనే బాధ్యుడని చూపిస్తాయి. కాబట్టి అలాంటి బోధలను సరిదిద్దేందుకు మనం దేవుని వాక్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. (2 తిమోతి 3:​16) ఈ భ్రష్ట విధానానికి యెహోవా కాదుగానీ, అపవాదియగు సాతానే పరిపాలకుడైయున్నాడు. (1 యోహాను 5:​19) యెహోవా తెలివిగల తన సృష్టిప్రాణులకు జరగబోయేవాటిని ముందుగానే నిర్ణయించడు; ఆయన మంచి చెడులను, తప్పొప్పులను నిర్ణయించుకునే స్వేచ్ఛను, అవకాశాల్ని ప్రతీ ఒక్కరికీ ఇస్తాడు. (ద్వితీయోపదేశకాండము 30:​19) యెహోవా ఎన్నటికీ దుష్టత్వానికి మూలముగా ఉండనేరడు; ఆయన దుష్టత్వాన్ని ద్వేషించడమే కాక, అన్యాయంగా బాధపడుతున్నవారిపట్ల శ్రద్ధ వహిస్తాడు.​—⁠యోబు 34:​10; సామెతలు 6:​16-19; 1 పేతురు 5:⁠7.

9 మీరలా మంచి పునాది వేసినప్పుడు, దేవుడు దుష్టత్వం కొనసాగేందుకు ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకునేందుకు మీ శ్రోత సిద్ధంగా ఉన్నట్లు మీరు కనుగొంటారు. మీకు సహాయం చేసేందుకు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అనేక ఉపయుక్త ప్రచురణల్ని అందజేశాడు. (మత్తయి 24:​45-47) ఉదాహరణకు, 2005లో జరిగిన “దైవిక విధేయత” జిల్లా సమావేశంలో బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి! అనే కరపత్రం విడుదల చేయబడింది. ఈ కరపత్రం మీ భాషలో లభ్యమౌతుంటే, దానిలోని విషయాలను మీరెందుకు తెలుసుకోకూడదు? అదే విధంగా, ఇప్పుడు 157 భాషల్లో లభ్యమౌతున్న బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో ఒక అధ్యాయమంతా ఈ ప్రాముఖ్యమైన ప్రశ్ననే చర్చిస్తుంది. ఇలాంటి ప్రచురణల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఏదెనులో లేవదీయబడిన సర్వాధిపత్య వివాదాంశపు లేఖనాధార నేపథ్యాన్ని, ఆ సవాలుతో యెహోవా ఎందుకలా వ్యవహరించాడో అవి స్పష్టంగా వివరిస్తాయి. అలాగే, మీరు ఈ అంశాన్ని చర్చిస్తుండగా మీ శ్రోతకు అతి ప్రాముఖ్యమైన జ్ఞానానికి మార్గం తెరుస్తున్నారని గుర్తుంచుకోండి. అది యెహోవా గురించిన, ఆయన అద్భుతమైన లక్షణాల గురించిన జ్ఞానం.

యెహోవా లక్షణాలపై దృష్టిసారించండి

10 సాతాను ప్రభావం క్రింద మానవులు తమనుతాము పరిపాలించుకునేందుకు యెహోవా ఎందుకు అనుమతించాడో అర్థం చేసుకునేందుకు మీరు ప్రజలకు సహాయం చేసేటప్పుడు, యెహోవా అద్భుతమైన లక్షణాలవైపు అవధానం మళ్లించేందుకు ప్రయత్నించండి. దేవుడు శక్తిమంతుడని చాలామందికి తెలుసు; ఇతరులు ఆయనను సర్వశక్తిమంతుడని పిలవడం వారు విన్నారు. అయితే అన్యాయాన్ని, బాధను వెంటనే తొలగించేందుకు ఆయన తన గొప్పశక్తిని ఎందుకు ఉపయోగించడం లేదో గ్రహించడం వారికి కష్టంగా ఉండవచ్చు. వారికి బహుశా, యెహోవా పరిశుద్ధత, న్యాయం, జ్ఞానం, ప్రేమవంటి ఇతర లక్షణాల గురించిన అవగాహన లేకపోవచ్చు. యెహోవా ఈ లక్షణాలను పరిపూర్ణంగా, సమతుల్యమైన రీతిలో కనబరుస్తాడు. అందుకే బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన కార్యము సంపూర్ణము.” (ద్వితీయోపదేశకాండము 32:⁠4) తరచూ ఈ వివాదాంశానికి సంబంధించి వేయబడే ప్రశ్నలకు జవాబిచ్చేటప్పుడు ఈ లక్షణాలను మీరెలా నొక్కిచెప్పవచ్చు? మనం కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం.

11యెహోవా ఆదాము హవ్వలను క్షమించేస్తే సరిపోతుందా? వీరి విషయంలో క్షమాపణ అసంభవం. పరిపూర్ణ మానవులుగా ఆదాము హవ్వలు, యెహోవా సర్వాధిపత్యాన్ని నిరాకరించి, సాతాను మార్గనిర్దేశాన్ని అంగీకరించేందుకు ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్నారు. ఆ తిరుగుబాటుదారుల్లో పశ్చాత్తాపపు ఛాయలు కనిపించలేదు. యెహోవా వారినెందుకు క్షమించలేదని ప్రజలు అడిగారంటే, నిజానికి వారు యెహోవా తన ప్రమాణాన్ని తగ్గించుకోవచ్చు కదా, పాపాన్ని తిరుగుబాటును సహించవచ్చు కదా అనుకుంటుండవచ్చు. దాని జవాబు యెహోవా సహజ తత్వానికే ఆవశ్యకమైన లక్షణానికి అంటే ఆయన పరిశుద్ధతకు ముడిపెట్టబడివుంది.​—⁠నిర్గమకాండము 28:​36; 39:​30.

12 యెహోవా పరిశుద్ధతను బైబిలు వందలసార్లు నొక్కిచెబుతోంది. విషాదకరంగా, ఈ భ్రష్టలోకంలో చాలామంది ఆ లక్షణాన్ని అర్థం చేసుకోరు. యెహోవా శుద్ధత, స్వచ్ఛతగల దేవుడేకాక, ఆయనలో ఏ పాపమూ లేదు. (యెషయా 6:⁠3; 59:⁠2) పాపం విషయంలో ఆయన దానిని పరిహరించేందుకు, తుడిచివేసేందుకు ఏర్పాటుచేశాడు, ఆయన దానిని ఎల్లకాలం సహించడు. యెహోవా పాపాన్ని ఎల్లకాలం సహించడానికి ఇష్టపడితే, మనకు భవిష్యత్తుకు సంబంధించిన ఏ నిరీక్షణా ఉండదు. (సామెతలు 14:​12) తన నియమిత సమయంలో యెహోవా సమస్త సృష్టిని తిరిగి పరిశుద్ధతకు తీసుకొస్తాడు. అది నిశ్చయం, ఎందుకంటే అది పరిశుద్ధ దేవుని చిత్తం.

13యెహోవా ఏదెనులో ఆ తిరుగుబాటుదారులను నాశనంచేసి సృష్టిని తిరిగి ఆరంభించగలిగేవాడా? అలా చేయగల శక్తి ఆయనకుంది; త్వరలో దుష్టులందరినీ నాశనం చేసేందుకు ఆయన ఆ శక్తిని ఉపయోగిస్తాడు. ‘మరి విశ్వంలో కేవలం ముగ్గురే పాపులు ఉన్నప్పుడు ఆయనెందుకు అలా చేయలేదు? అది పాపం విస్తరించడాన్ని తద్వారా లోకంలో మనం చూస్తున్న సమస్త విషాదాన్ని ఆపుజేసి ఉండేది కదా’ అని కొందరు ఆలోచించవచ్చు. యెహోవా ఎందుకు అలా చేయలేదు? ద్వితీయోపదేశకాండము 32:⁠4 ఇలా చెబుతోంది: “ఆయన చర్యలన్నియు న్యాయములు.” న్యాయం విషయంలో యెహోవాకు బలమైన భావాలున్నాయి. నిజానికి, “యెహోవా న్యాయమును ప్రేమించువాడు.” (కీర్తన 37:​28) న్యాయంపట్ల ఆయనకున్న ప్రేమనుబట్టి, ఏదెనులో ఆయన ఆ తిరుగుబాటుదారులను నాశనం చేయలేదు. ఎందుకు?

14 సాతాను చేసిన తిరుగుబాటు యెహోవా సర్వాధిపత్యపు హక్కుకు సంబంధించి ఒక ప్రశ్నను లేవదీసింది. సాతాను లేవదీసిన ఆ ప్రశ్నకు యెహోవా న్యాయాలోచన సరైన జవాబును కోరింది. ఆ తిరుగుబాటుదారులు శిక్షార్హులైనా వారిని వెంటనే నాశనం చేయడం దానికి సరైన జవాబునిచ్చి ఉండేది కాదు. అది యెహోవా సర్వశక్తికి అదనపు రుజువుగా ఉండేది, అయితే వివాదాంశం ఆయన శక్తికి సంబంధించినది కాదు. అంతేకాక, యెహోవా తన సంకల్పమేమిటో ఆదాము హవ్వలకు చెప్పాడు. వారు సంతానాన్ని కని భూమిని నింపి, దానిని లోబర్చుకొని, భూసంబంధ సృష్టినంతటినీ ఏలాలి. (ఆదికాండము 1:​28) యెహోవా ఆదాము హవ్వలను నాశనం చేసివుంటే, మానవుల విషయంలో ఆయన ప్రకటించిన సంకల్పం అర్థరహితమైయుండేది. యెహోవా న్యాయం అలాంటిది జరిగేందుకు ఎన్నటికీ అనుమతించదు, ఎందుకంటే ఆయన సంకల్పం ఎల్లప్పుడూ నెరవేరుతుంది.​—⁠యెషయా 55:​10, 11.

15అలాంటి తిరుగుబాటుతో, విశ్వంలో ఇంకెవరన్నా యెహోవాకన్నా ఎక్కువ జ్ఞానంతో వ్యవహరించగలరా? ఏదెనులో జరిగిన ఆ తిరుగుబాటుకు కొందరు సొంత “పరిష్కారాలను” ప్రతిపాదించవచ్చు. అయితే అలా ప్రతిపాదించడంలో ఆ వివాదాంశంతో వ్యవహరించే విషయంలో తమకు మెరుగైన ఆలోచనలున్నాయని వారు భావాన్నిస్తున్నట్లుండదా? దుర్బుద్ధితో వారలా చేయకపోవచ్చు, అయితే వారు యెహోవాను, ఆయన అసాధారణ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం లేదు. రోమాలోని క్రైస్తవులకు వ్రాసినప్పుడు అపొస్తలుడైన పౌలు, నమ్మకమైన మానవాళిని విడిపించి, తన పరిశుద్ధ నామాన్ని మహిమపర్చుకునేందుకు మెస్సీయ రాజ్యాన్ని ఉపయోగించుకోవాలనే యెహోవా దేవుని సంకల్పాన్ని గురించిన పవిత్ర ‘మర్మముతో’ సహా ఆయన జ్ఞానాన్ని లోతుగా పరిశోధించాడు. ఈ వాగ్దానం చేసిన దేవుని జ్ఞానం గురించి పౌలు ఎలా భావించాడు? ఆ అపొస్తలుడు తన పత్రికను ఈ మాటలతో ముగించాడు: “అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.”​—⁠రోమీయులు 11:​25; 16:​25-27.

16 యెహోవా “అద్వితీయ జ్ఞానవంతుడు” అంటే సమస్త విశ్వంలో ఆయనే సర్వోన్నత జ్ఞానియని పౌలు అర్థం చేసుకున్నాడు. అత్యంత కష్టమైన సర్వాధిపత్యపు సవాలు మాట అటుంచితే, ఏ సమస్య విషయంలోనైనా అపరిపూర్ణ మానవుల్లో ఎవరు మాత్రం అంతకంటే మెరుగ్గా ఆలోచించగలరు? కాబట్టి, “మహా వివేకి” అయిన దేవునిపట్ల మనకున్నలాంటి భక్తిపూర్వక భయాన్నే ప్రజలు కలిగి ఉండేందుకు మనం వారికి సహాయం చేయాలి. (యోబు 9:⁠4) మనం యెహోవా జ్ఞానాన్ని ఎంతెక్కువగా అర్థం చేసుకుంటామో, అంతెక్కువగా ఆయన వ్యవహార విధానం అత్యుత్తమమైనదని విశ్వసిస్తాం.​—⁠సామెతలు 3:​5, 6.

యెహోవా ప్రధాన లక్షణం వహించే పాత్రను గుర్తించడం

17 “దేవుడు ప్రేమాస్వరూపి.” (1 యోహాను 4:⁠8) గమనార్హమైన ఆ మాటలతో బైబిలు, యెహోవా ప్రధాన లక్షణాన్ని సూచిస్తోంది, అది ఆయనకున్న లక్షణాలన్నిట్లోకి అత్యంత ఆకర్షణీయమైనది, దుష్టత్వం ప్రబలి ఉండడాన్నిబట్టి కలవరపడుతున్న వారినెంతో ఓదార్చే లక్షణం. పాపం తన సృష్టిపై చూపించిన వినాశనకర ప్రభావంతో తాను వ్యవహరించిన విధానపు ప్రతీ అంశంలో యెహోవా ప్రేమను కనబర్చాడు. ఆదాము హవ్వల పాపభరిత సంతానానికి నిరీక్షణను అనుగ్రహించేందుకు ప్రేమే యెహోవాను ప్రేరేపించింది, అలా వారాయనను సమీపించి, ఆయనతో ఆమోదయోగ్య సంబంధాన్ని కలిగివుండే అవకాశం ఏర్పడింది. పాపాలను పూర్తిగా క్షమించి, పరిపూర్ణమైన నిత్యజీవాన్ని పునరుద్ధరించే మార్గాన్ని తెరిచే విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రేమే దేవుణ్ణి పురికొల్పింది. (యోహాను 3:​16) సాతానును నిరాకరించి, తనను తమ సర్వాధిపతిగా ఎంచుకునే అవకాశం సాధ్యమైనంత ఎక్కువమందికి ఇస్తూ మానవాళిపట్ల సహనం చూపేందుకు ప్రేమే యెహోవాను కదిలించింది.​—⁠2 పేతురు 3:⁠9.

18 వినాశకరమైన ఉగ్రవాద దాడి వార్షిక సంస్మరణకు సమకూడిన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఒక పాదిరీ ఇలా అన్నాడు: “కీడు, బాధ కొనసాగేందుకు దేవుడెందుకు అనుమతిస్తాడో మనకు తెలియదు.” ఎంత విచారకరం! ఈ విషయంలో మనకున్న జ్ఞానాన్నిబట్టి మనం సంతోషించడం లేదా? (ద్వితీయోపదేశకాండము 29:​29) యెహోవా జ్ఞానవంతుడు, న్యాయవంతుడు, ప్రేమగలవాడు కాబట్టి, ఆయన త్వరలోనే సమస్త బాధను అంతమొందిస్తాడని మనకు తెలుసు. వాస్తవానికి, తానలా చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. (ప్రకటన 21:​3, 4) అయితే గడిచిన శతాబ్దాల్లో చనిపోయిన వారందరి సంగతేమిటి? ఏదెనులో వివాదాంశంతో యెహోవా వ్యవహరించిన విధానం వారికెలాంటి నిరీక్షణా లేకుండా చేసిందా? లేదు. పునరుత్థానం ద్వారా వారికి కూడా నిరీక్షణను అనుగ్రహించేలా ప్రేమ ఆయనను పురికొల్పింది. ఈ అంశమే తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించబడుతుంది.

మీరెలా జవాబిస్తారు?

• దేవుడు ఎందుకు బాధను అనుమతిస్తున్నాడని అడిగే వ్యక్తికి మనమేమి చెప్పవచ్చు?

• ఏదెనులోని తిరుగుబాటుదారులతో వ్యవహరించిన విధానంలో యెహోవా పరిశుద్ధత, ఆయన న్యాయం ఎలా ప్రస్ఫుటమయ్యాయి?

• యెహోవా ప్రేమను మరింతగా అర్థం చేసుకోవడానికి మనమెందుకు ప్రజలకు సహాయం చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) నిత్యజీవ నిరీక్షణను మీరెందుకు అమూల్యమైనదిగా పరిగణిస్తారు? (బి) భవిష్యత్తు గురించి అద్భుతమైన వాగ్దానాలు చేసే దేవుణ్ణి నమ్మకుండా చాలామందిని ఏది అడ్డగిస్తోంది?

3. ఏ కష్టమైన ప్రశ్నకు జవాబిచ్చేందుకు మనం ప్రజలకు సహాయం చేయవచ్చు, అలా జవాబిచ్చే విశిష్టమైన స్థానంలో మనమెందుకున్నాం?

4, 5. దేవుడు ఎందుకు బాధను అనుమతిస్తున్నాడని ఎవరైనా ప్రశ్నిస్తే మొదట మనమేమి చేయాలి? వివరించండి.

6, 7. కలవరపెడుతున్న ఆధ్యాత్మిక ప్రశ్న అడిగిన నిష్కపటియైన వ్యక్తిని మనమెందుకు ప్రశంసించవచ్చు?

8. ఏ తికమక బోధలు, బాధకు దేవుడే బాధ్యుడని ప్రజలు నమ్మేందుకు నడిపించాయి, మనం వారికెలా సహాయం చేయవచ్చు?

9. యెహోవా దేవుడు ఎందుకు బాధను అనుమతిస్తున్నాడో ప్రజలు అర్థం చేసుకునేలా సహాయపడేందుకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఎలాంటి ప్రచురణల్ని అందజేశాడు?

10. దేవుడు బాధనెందుకు అనుమతిస్తున్నాడనే విషయంలో దేన్ని అర్థం చేసుకోవడం చాలామందికి కష్టంగా ఉండవచ్చు, ఎలాంటి జ్ఞానం వారికి సహాయం చేయవచ్చు?

11, 12. (ఎ) పాపం చేసిన ఆదాము హవ్వలను క్షమించడం ఎందుకు అసంభవం? (బి) పాపాన్ని యెహోవా ఎందుకు ఎల్లకాలం అనుమతించడు?

13, 14. యెహోవా ఏదెనులో ఆ తిరుగుబాటుదారులను ఎందుకు నాశనం చేయలేదు?

15, 16. ఏదెనులో లేవదీయబడిన సవాలుకు ప్రజలు ప్రత్యామ్నాయ “పరిష్కారాలను” ప్రతిపాదించినప్పుడు, మనం వారికెలా సహాయం చేయగలుగుతాము?

17. దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడాన్నిబట్టి కలవరపడినవారికి యెహోవా ప్రేమను గురించి మరెక్కువగా అర్థం చేసుకోవడమెలా సహాయం చేయగలదు?

18. మనకెలాంటి జ్ఞానం అనుగ్రహించబడింది, తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

[21వ పేజీలోని చిత్రం]

లోకంలోని బాధనుబట్టి కలవరపడుతున్నవారికి సహాయం చేసేందుకు ప్రయత్నించండి

[23వ పేజీలోని చిత్రాలు]

నమ్మకస్థులైన దావీదు, హబక్కూకు దేవుణ్ణి నిష్కపటమైన ప్రశ్నలు అడిగారు