మనం క్రైస్తవ కూటాలకు ఎందుకు హాజరవ్వాలి?
మనం క్రైస్తవ కూటాలకు ఎందుకు హాజరవ్వాలి?
క్రిస్టీన్‌కు వివాహమైన 20 సంవత్సరాల తర్వాత, ఆమె భర్త ఆమెను అకస్మాత్తుగా వదిలేసి వెళ్లిపోయాడు. ఏడుగురు కుమారులను, ఒక కుమార్తెను పెంచే బాధ్యతలను క్రిస్టీన్ ఒంటరిగా నిర్వర్తించాల్సి వచ్చింది. ఆమె పిల్లలందరూ 7 నుండి 18 మధ్య వయసున్నవారే. ఆమె ఇలా అంటోంది: “ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఇప్పుడు నేనే తీసుకోవాల్సి వస్తుంది. ఆ బాధ్యతలన్నీ నెరవేర్చడం ఎంతో భారంగా ఉన్నట్లు అనిపించేవి, నాకు ఎవరైనా మద్దతు, నిర్దేశం ఇవ్వాలని ఎంతో కోరుకున్నాను.” ఆమెకు అవసరమైన సహాయం ఎక్కడ దొరికింది?
“క్రైస్తవ కూటాలు నాకు, నా కుటుంబానికి ఆసరాగా నిలిచాయి” అని క్రిస్టీన్ చెబుతోంది. “కూటాల్లో మాకు స్నేహితుల మద్దతు, దేవుని వాక్యం నుండి నిర్దేశం లభించేవి. క్రమంగా కూటాలకు హాజరవడం మా కుటుంబ జీవితంలోని అన్ని ప్రాముఖ్యమైన రంగాల్లో సహాయం చేసింది.”
ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ మనలో ప్రతీ ఒక్కరం వివిధ రకాల పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. (2 తిమోతి 3:1) క్రిస్టీన్‌లాగే మీరు కూడా యెహోవాసాక్షుల కూటాలను ఆధ్యాత్మిక ఆసరాగా, యెహోవాకు మీరు చేసే ఆరాధనలో ముఖ్యమైన భాగంగా దృష్టించవచ్చు. ప్రతీవారం ఏర్పాటు చేయబడే ఐదు సంఘ కూటాలు దేవునిపట్ల మీకున్న ప్రేమను బహుశా అధికం చేయవచ్చు, భవిష్యత్తుపై మీకున్న నిరీక్షణను బలోపేతం చేయడమే కాక పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో చూపించే బైబిలు ఆధారిత నిర్దేశాన్ని ఇవ్వవచ్చు.
అయితే కొంతమందికి కూటాలకు క్రమంగా హాజరవడమే ఒక సవాలుగా ఉంటుంది. సాయంకాలానికల్లా వారెంతో అలసిపోతారు, అప్పుడు కూటాలకు చక్కగా తయారై ప్రయాణం చేసి వెళ్లడం అంటే వారికెంతో కష్టంగా అనిపిస్తుంది. మరికొందరికి కూటాలకు హాజరయ్యేందుకు తమ పనివేళలు తరచూ అడ్డొస్తుంటాయి. వారు కూటాలన్నిటికీ హాజరవ్వాలంటే తక్కువ జీతానికి పనిచేయాల్సి వస్తుంది లేక తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిరావచ్చు. మరికొందరైతే, సంఘంతో సహవాసంకన్నా వినోద కార్యకలాపాలే మరింత సేదదీర్పునిస్తాయనుకుని కూటాలకు రాకపోవచ్చు.
మరైతే, క్రైస్తవ కూటాలకు హాజరవడానికి ఎలాంటి బలమైన కారణాలున్నాయి? కూటాలు మీకు వ్యక్తిగతంగా విశ్రాంతినిచ్చేలా లేక సేదదీర్పునిచ్చేలా మీరేమి చేయవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులను పొందడానికి మత్తయి 11:28-30లో ఉన్న యేసు ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మనం పరిశీలిద్దాం. ఆయనిలా అన్నాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”
“నా యొద్దకు రండి”
యేసు “నా యొద్దకు రండి” అని ఆహ్వానించాడు. ఈ ఆహ్వానానికి స్పందించేందుకు ఒక మార్గం కూటాలకు క్రమంగా హాజరవడమే. మీరు కూటాలకు వెళ్లడానికి మంచి కారణమే ఉంది, ఎందుకంటే మరో సందర్భంలో యేసు ఇలా చెప్పాడు: “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును.”—మత్తయి 18:20.
మొదటి శతాబ్దంలో యేసు తనను వెంబడించమని అనేకమందిని స్వయంగా ఆహ్వానించాడు. అలా ఆహ్వానించడం ద్వారా వారు తనతో సన్నిహితంగా సహవసించేందుకు వారికొక అవకాశాన్ని ఇచ్చాడు. కొందరు దాన్ని వెంటనే అంగీకరించారు. (మత్తయి 4:18-22) మరికొందరు భౌతిక విషయాలపట్ల ఆసక్తి ఉండడంవల్ల ఆ ఆహ్వానాన్ని స్వీకరించలేదు. (మార్కు 10:21, 22; లూకా 9:57-62) అయితే, ఆయనను వెంబడించిన వారికి యేసు ఈ హామీనిచ్చాడు: ‘మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; నేను మిమ్మును ఏర్పరచుకొన్నాను.’—యోహాను 15:16.
క్రీస్తు మరణించి పునరుత్థానమైన తర్వాత ఆయన భౌతికంగా తన శిష్యుల మధ్య లేడు. అయితే, ఆయన వారి కార్యకలాపాలను నిర్దేశిస్తూ, తానిచ్చిన ఉపదేశానికి వారి స్పందనను గమనిస్తున్నాడనే భావంలో వారితో ఉన్నాడు. ఉదాహరణకు, యేసు పునరుత్థానమైన దాదాపు 70 సంవత్సరాల తర్వాత తాను ఆసియా మైనరులోని ఏడు సంఘాలకు ఉపదేశించి, వారిని ప్రోత్సహించాడు. ఆయన మాటలు, ఆ సంఘాల్లోని ఆ యా వ్యక్తుల బలాల, బలహీనతల గురించి ఆయనకు చక్కని అవగాహన ఉందని చూపించాయి.—ప్రకటన 2:1-3:22.
యేసుకు నేడు కూడా తన శిష్యులందరిపట్ల ఎంతో శ్రద్ధ ఉంది. ఆయనిలా వాగ్దానం చేస్తున్నాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:20) మనం ఇప్పుడు అంత్యకాలంలో జీవిస్తున్నాం కాబట్టి తనను వెంబడించమని యేసు ఇచ్చిన పిలుపుకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా మనం కూటాలకు క్రమంగా హాజరవ్వాల్సిన అవసరం ఉంది. యేసు తాను చెప్పింది మనం వినాలని, కూటాల్లో క్రమంగా చేసే బైబిలు ఆధారిత అధ్యయనాల ద్వారా, ఇవ్వబడే ప్రసంగాల ద్వారా ‘ఆయన ద్వారా ఉపదేశింపబడేవారిగా’ ఉండాలని కోరుతున్నాడు. (ఎఫెసీయులు 4:20, 21) “నా యొద్దకు రండి” అని యేసు ఇస్తున్న ఆహ్వానానికి మీరు స్పందిస్తున్నారా?
“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులు”
ప్రోత్సాహాన్ని పొందాలనే ముఖ్యమైన కారణంతో మనం క్రైస్తవ కూటాలకు హాజరవ్వాలి. (హెబ్రీయులు 10:24, 25) మనలో చాలామందిమి నిజంగానే అనేక రకాలుగా ‘ప్రయాసపడుతూ భారం మోస్తున్నాం.’ మీరు బహుశా ఆరోగ్య సమస్యలు వంటి వ్యక్తిగత చింతలతో సతమతమౌతుండవచ్చు. అయితే, క్రైస్తవ కూటాల్లో మీరు పరస్పరం ప్రోత్సహించుకోవచ్చు. (రోమీయులు 1:11, 12) ఉదాహరణకు, మీరు కూటాల్లో విశ్వాసాన్ని బలపర్చే వ్యాఖ్యానాలను వింటారు, మీకున్న బైబిలు ఆధారిత నిరీక్షణ గురించి గుర్తుచేయబడతారు, అంతేగాక కష్టాలను సహిస్తున్న ఇతరుల విశ్వాసాన్ని గమనిస్తారు. ఇవన్నీ మీరు మీ సమస్యలను ఎదుర్కోవడానికి, వాటిని సరైన దృక్కోణంలో చూడడానికి సహాయం చేస్తాయి.
దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఒక క్రైస్తవ సహోదరి ఏమి చెప్పిందో గమనించండి: “నా అనారోగ్యం వల్ల నేను కొంతకాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆస్పత్రి నుండి వచ్చిన తర్వాత కూటాలకు వెళ్లడం కాస్త ఇబ్బందిగా అనిపించింది, అయితే అక్కడికి వెళ్లడంవల్ల నాకు ప్రయోజనం చేకూరుతుంది. సహోదర సహోదరీల ప్రేమానురాగాలు నాకు తిరిగి ఆనందాన్నిస్తాయి, అక్కడ యెహోవా, యేసు అందించే బోధన, నిర్దేశం నా జీవితానికి సార్థకతనిస్తాయి.”
“నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి”
మనం పరిశీలిస్తున్న లేఖనంలో, “నాయొద్ద నేర్చుకొనుడి” అని యేసు చెప్పిన మాటలను గమనించండి. యేసు నుండి నేర్చుకోవడం ద్వారా మనం ఆయనకు శిష్యులమౌతాం, దేవునికి సమర్పించుకుని బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఆయన కాడిని ఎత్తుకుంటాం. (మత్తయి 28:19, 20) యేసు శిష్యులుగా ఉండడానికి క్రమంగా కూటాల్లో భాగం వహించడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే క్రైస్తవ కూటాల్లోనే మనం యేసు గురించి, ఆయన బోధల గురించి, ఆయన పద్ధతుల గురించి బోధించబడతాం.
మనం ఎలాంటి భారం మోయాలని క్రీస్తు కోరుతున్నాడు? తాను స్వయంగా మోసే భారాన్ని అంటే దేవుని చిత్తాన్ని చేసే ఆధిక్యతను మనం కూడా మోయాలని యోహాను 4:34; 15:8) దేవుని ఆజ్ఞలకు లోబడడానికి కృషి అవసరమైనా అది భరించలేనంత భారమైంది కాదు. మనం మన స్వశక్తితో దాన్ని మోయాలని ప్రయత్నిస్తే అది బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ మనం దేవుని ఆత్మ కోసం ప్రార్థించి, కూటాల్లో ఇవ్వబడే ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరిస్తే మనం దేవుడిచ్చే “బలాధిక్యము” పొందుతాం. (2 కొరింథీయులు 4:7) కూటాలకు సిద్ధపడి, వాటిలో భాగం వహించడం ద్వారా యెహోవాపట్ల మనకున్న ప్రేమ మరింత బలపడుతుంది. మనం ప్రేమచేత పురికొల్పబడినప్పుడు దేవుని ఆజ్ఞలు ‘భారమైనవిగా అనిపించవు.’—1 యోహాను 5:3.
ఆయన కోరుతున్నాడు. (సాధారణంగా ప్రజలు జీవనోపాధిని సంపాదించుకోవడం, ఆరోగ్య సమస్యలతో, వ్యక్తిగత సమస్యలతో వ్యవహరించడం వంటి సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే, వాటిని అధిగమించడానికి మనం కేవలం మానవ జ్ఞానంపైనే ఆధారపడం. యెహోవా మనకు అవసరమైన వాటిని సమకూర్చి, మన సమస్యలను సహించడానికి సహాయం చేస్తాడు కాబట్టి మనం ‘చింతించకుండా’ ఉండడానికి సంఘ కూటాలు సహాయం చేస్తాయి. (మత్తయి 6:25-33) నిజానికి, క్రైస్తవ కూటాలు దేవునికి మనపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తాయి.
“నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను”
దేవుని వాక్యం చర్చించబడే సమాజమందిరానికి యేసు వాడుకగా వెళ్లేవాడు. అలా వెళ్లిన ఒకరోజు ఆయన యెషయా గ్రంథపు చుట్టను తీసుకుని ఇలా చదివాడు: “[యెహోవా] ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు.” (లూకా 4:16, 18, 19) “నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది” అంటూ ఆయన ఆ మాటల అన్వయింపు గురించి చెప్పినప్పుడు వినడం ఎంత ఆనందాన్నిచ్చి ఉంటుందో కదా!—లూకా 4:21.
సాత్వికుడైన ‘ప్రధాన కాపరియగు’ యేసు ఇంకా తన అనుచరుల ఆధ్యాత్మిక కాపుదలను పర్యవేక్షిస్తూనే ఉన్నాడు. (1 పేతురు 5:1-4) ఆయన నిర్దేశంలో “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లో పురుషులను కాపరులుగా నియమించాడు. (మత్తయి 24:45-47; తీతు 1:5-9) ఆ పురుషులు సాత్వికముతో ‘దేవుని సంఘమును కాయుచు,’ క్రమంగా కూటాలకు హాజరవడం ద్వారా మంచి మాదిరిని ఉంచుతారు. మీరు కూటాలకు హాజరవడం ద్వారా ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈవుల’ పట్ల కృతజ్ఞత చూపించగలరు, అంతేగాక వాటికి హాజరై, వాటిలో భాగం వహించడం ద్వారా మీరు ఇతరుల్ని ప్రోత్సహించగలరు కూడా.—అపొస్తలుల కార్యములు 15:30-33; 20:28; ఎఫెసీయులు 4:8, 11, 12.
“మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును”
మీరు క్రైస్తవ కూటాలకు హాజరౌతున్నప్పుడు, అవి నిజంగా సేదదీర్పునిచ్చేవిగా ఉండేలా మీరేమి చేయవచ్చు? ఒక మార్గమేమిటంటే, మీరు యేసు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవాలి: “మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడి.” (లూకా 8:18) నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి ఉన్నవారు యేసు చెబుతున్నవాటిని శ్రద్ధగా విన్నారు. వారు ఆయన చెప్పిన ఉపమానాలను వివరించమని అడిగారు, దానివల్ల వారికి లోతైన అవగాహన లభించింది.—మత్తయి 13:10-16.
మన కూటాల్లో ఇవ్వబడే ప్రసంగాలను శ్రద్ధగా వినడం ద్వారా ఆధ్యాత్మిక ఆకలివున్న అలాంటి వారిని మీరు కూడా అనుకరించవచ్చు. (మత్తయి 5:3, 6) ఏకాగ్రత నిలిపేందుకు మీరు ప్రసంగీకుడు ఉపయోగించే తర్కాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఇలాంటి ప్రశ్నలు వేసుకోండి: ‘నేను ఈ విషయాల్ని నా జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు? ఇతరులకు సహాయం చేయడానికి నేను దాన్నెలా ఉపయోగించవచ్చు? ఈ విషయాన్ని ఇతరులకు నేనెలా వివరించవచ్చు?’ అంతేగాక, ప్రసంగీకుడు ముఖ్యాంశాలను సమర్థించేందుకు ఉపయోగించే లేఖనాలను తెరిచి చూడండి. మీరు ఎంత శ్రద్ధగా వింటే, కూటాలు మీకంత సేదదీర్పునిచ్చేవిగా ఉంటాయి.
కూటం ముగిసిన తర్వాత, కార్యక్రమంలోని విషయాలను ఇతరులతో చర్చించండి. కూటంలో అందించబడిన సమాచారం గురించి, దాన్నెలా అన్వయించుకోవాలనే విషయం గురించి చర్చించండి. ప్రోత్సాహకరమైన సంభాషణలు కూటలను సేదదీర్పునిచ్చేవిగా చేస్తాయి.
మనం కూటాలకు హాజరవడానికి నిజంగానే బలమైన కారణాలు ఉన్నాయి. మనం ఇప్పటివరకు చర్చించిన ప్రయోజనాలను పరిశీలించిన తర్వాత, మిమ్మల్ని మీరు ఇలా ఎందుకు ప్రశ్నించుకోకూడదు, ‘“నా యొద్దకు రండి” అని యేసు ఇచ్చిన ఆహ్వానానికి నేనెలా స్పందిస్తున్నాను?’
[11వ పేజీలోని చిత్రాలు]
మీరు కూటాలకు హాజరవకుండా ఇతర పనులు అడ్డొస్తున్నాయా?