కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు భవిష్యత్తు అంటే భయమా?

మీకు భవిష్యత్తు అంటే భయమా?

మీకు భవిష్యత్తు అంటే భయమా?

ప్ర జలు భయపడ్డానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు, కొంతమంది భవిష్యత్తులో భూమికి ఏమి జరుగుతుందోనని భయపడుతుంటారు. “వడగాల్పులు, తుఫానులు, వరదలు, మంటలు, మంచు కొండలు అధిక పరిమాణంలో కరిగిపోవడం వంటివి భూగోళ వాతావరణం ఎంతగానో పాడైపోయినట్లు చూపిస్తున్నాయి” అని 2006, ఏప్రిల్‌ 3, టైమ్‌ పత్రిక చెబుతోంది.

2002 మేలో, యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్‌వైరన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, “గ్లోబల్‌ ఎన్‌వైరన్‌మెంట్‌ ఔట్‌లుక్‌-3” అనే పేరుతో ఒక నివేదిక వెలువరించింది. అది వెయ్యికంటే ఎక్కువమంది సహకారంతో తయారుచేయబడింది. ఒక వార్తానివేదిక ప్రకారం అదిలా పేర్కొన్నది: “ప్రస్తుత, భవిష్యత్‌ తరాలకు ఆధారమైన అడవులు, మహాసముద్రాలు, నదులు, పర్వతాలు, వన్యప్రాణులు, ఇతర జీవావరణ వ్యవస్థలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన విపద్దశలో భూగ్రహం ఉంది.”

ప్రస్తుతం భూగోళ వాతావరణం ఉన్న స్థితి ఆందోళనకు ఒక కారణం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు ఉగ్రవాద దాడుల భయంతో జీవిస్తున్నారు. కెనడా భద్రత మరియు గూఢచార విభాగపు డిప్యూటి డైరెక్టర్‌ ఇలా చెప్పాడు: “ఎప్పుడు, ఎలా విపత్తు ముంచుకు వస్తుందోననే భయంతో రాత్రుళ్ళు మేల్కొనే ఉంటున్నాం.” అంతెందుకు, టీవీలో సాయంకాలం వార్తలు చూసినా చాలు, ఎంతో ఆందోళన కలుగుతుంది!

కష్టపడి పనిచేసే చాలామంది, ఉద్యోగాలు కోల్పోతామేమోనని భయపడుతున్నారు. పని నుండి తాత్కాలికంగా తొలగించబడడం, ఫ్యాక్టరీలు మూతపడడం, ఉద్యోగస్థలంలో పోటీ, యజమానులు ఉద్యోగుల నుండి మరీ ఎక్కువ పని కోరడం వంటివి ఉద్యోగ అభద్రతా భావాన్ని సృష్టించవచ్చు. యౌవనస్థులు తాము తమ తోటివారి నిరాకరణకు గురౌతామేమోనని భయపడతారు. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులు తమను నిజంగా ప్రేమించడం లేదేమోనని భయపడతారు. అయితే వారు తమ చుట్టూవున్న పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు? “చిన్నపిల్లలకు, అనుభవం లేనివారికి, కొన్నిసార్లు తమ ఇంటి వెలుపలున్న లోకం పెద్ద భయంకరమైన స్థలంలా అనిపిస్తుండవచ్చు” అని ఆందోళనకు గురైన ఒక తల్లి చెబుతోంది. ప్రపంచ నైతిక పతనం తమ ప్రియమైనవారిపై, ప్రాముఖ్యంగా తమ పిల్లలపై చూపిస్తున్న ప్రభావం గురించి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

వృద్ధులు తరచూ మెట్లమీది నుండి పడిపోతామేమోనని లేక వీధిలో హత్యకు గురవుతామేమోనని ఎంతో భయానికి లోనవుతున్నారు. నిజమే, వారు “ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గములయందు భయంకరమైనవి కనబడును.” (ప్రసంగి 12:⁠5) తీవ్రమైన అనారోగ్యానికి గురౌతామేమోననే భయమూ ఉంది. మరణకరమైన ఫ్లూ జ్వరాలు, క్యాన్సర్లు, అంటువ్యాధుల గురించిన నివేదికలు మనల్ని, మన కుటుంబాన్ని వికలాంగులను చేసే లేదా చంపేసే ఏదైనా క్రొత్త, వింత జబ్బు సోకుతుందేమోనని భయపడేలా చేయవచ్చు. వాస్తవానికి ఆరోగ్యవంతులైన, బలవంతులైన ప్రజలు అనారోగ్యంపాలై, బలహీనులు కావడాన్ని చూసినప్పుడు, మనకు లేదా మన ప్రియమైనవారికి కూడా అలాగే జరుగుతుందేమోనని ఆందోళన చెందకుండా ఉండలేం. ఏ నిరీక్షణా లేని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూడ్డం ఎంత వేదనకరంగా ఉంటుందో కదా!

ఇలా ఎన్నో భయాలతో సతమతమౌతున్న మనం, భవిష్యత్తు గురించి ఆశతో నిరీక్షించడానికి తగిన కారణమేదైనా ఉందా? ఆశావహ దృక్పథంతో ఉండడానికి మనకు ఏదైనా సహాయం చేయగలదా? తర్వాతి ఆర్టికల్‌ ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది.

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Jeroen Oerlemans/Panos Pictures