కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెఫ్తా యెహోవాకు తన మ్రొక్కుబడిని చెల్లించాడు

యెఫ్తా యెహోవాకు తన మ్రొక్కుబడిని చెల్లించాడు

యెఫ్తా యెహోవాకు తన మ్రొక్కుబడిని చెల్లించాడు

విజేయుడైన ఒక యోధుడు తన దేశాన్ని అణచివేత నుండి తప్పించి ఇంటికి తిరిగి వస్తాడు. ఆయన కూతురు సంతోషంతో నాట్యమాడుతూ, తంబుర వాయిస్తూ ఆయనను కలుసుకోవడానికి పరిగెడుతుంది. ఆమెను చూడగానే సంతోషించే బదులు ఆయన తన బట్టలు చింపుకుంటాడు. ఎందుకని? తాను క్షేమంగా ఇల్లు చేరినందుకు తన కూతురుకు కలిగిన ఆనందం ఆయనకు కలుగలేదా? ఆయన ఏ యుద్ధాన్ని గెలిచాడు? ఇంతకీ ఆయన ఎవరు?

ఆయన పేరు యెఫ్తా, ఈయన ప్రాచీన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఒకడు. మిగతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, ఆ వృత్తాంతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఆ అసాధారణ పునఃకలయికకు ముందు అసలు ఏమి జరిగిందో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితి

యెఫ్తా సంక్షోభిత కాలంలో జీవించాడు. తోటి ఇశ్రాయేలీయులు సత్యారాధనను విడిచిపెట్టి సీదోను, మోయాబు, అమ్మోను, ఫిలిష్తీయ దేవతల్ని ఆరాధిస్తారు. అందుకే యెహోవా అమ్మోనీయుల, ఫిలిష్తీయుల చేతుల్లో తన ప్రజలు ఓడిపోయేందుకు అనుమతిస్తాడు, వారు ఇశ్రాయేలీయులను 18 సంవత్సరాలు అణచివేస్తారు. యొర్దానుకు తూర్పుతట్టున ఉన్న గిలాదు నివాసులు మరింత ఎక్కువగా కష్టాలననుభవిస్తారు. * చివరకు ఇశ్రాయేలీయులు తమ తప్పులు తెలుసుకుని, పశ్చాత్తాపంతో యెహోవా సహాయం కోసం మొరపెట్టుకోవడమేకాక ఆయనను సేవించడం మొదలుపెట్టి, తమ మధ్య నుండి అన్య దేవుళ్లను తొలగిస్తారు.​—⁠న్యాయాధిపతులు 10:​6-16.

అమ్మోనీయులు తమ గుడారాన్ని గిలాదులో వేశారు, ఇశ్రాయేలీయులు వారితో తలపడడానికి సమకూడారు. అయితే ఇశ్రాయేలీయులకు సైన్యాధిపతి లేడు. (న్యాయాధిపతులు 10:​17, 18) మరోవైపు యెఫ్తా తన సొంత సమస్యలతో సతమతమౌతున్నాడు. స్వార్థపరులైన ఆయన సోదరులు ఆస్తిని చేజిక్కించుకోవడానికి ఆయనను తరిమేశారు. అందుకే యెఫ్తా గిలాదుకు తూర్పువైపుననున్న టోబు నగరానికి వెళ్లడంతో ఇశ్రాయేలీయుల శత్రువుల నుండి ఆయనకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఎదురయ్యాయి. బహుశా అణచివేసేవారివల్ల తమ ఉపాధిని కోల్పోయిన లేక వారి బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన “అల్లరిజనము” యెఫ్తాతో చేయి కలిపివుండవచ్చు. వారు ‘అతనితోకూడ సంచరించేవారు’ అంటే బహుశా ఆయన శత్రువులపై దాడి చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి పోరాడేవారు. పోరాడడంలో యెఫ్తా కనబరచిన పరాక్రమంవల్ల లేఖనాలు ఆయనను “పరాక్రమముగల బలాఢ్యుడు” అని వర్ణిస్తున్నాయి. (న్యాయాధిపతులు 11:​1-3) మరి, అమ్మోనీయులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులను ఎవరు నడిపిస్తారు?

“నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము”

గిలాదు పెద్దలు యెఫ్తాను ఇలా వేడుకుంటారు: “నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము.” ఆయన తన సొంత ఊరికి తిరిగి వెళ్లడానికి వారిచ్చే ఈ అవకాశాన్ని ఆయన వెంటనే అందిపుచ్చుకుంటాడని వారనుకుంటే పొరబడ్డట్టే. యెఫ్తా ఇలా అడుగుతాడు: “మీరు నాయందు పగపట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నాయొద్దకు రానేల?” వారు యెఫ్తాను మొదట నిరాకరించి తర్వాత సహాయం కోసం ఆయన దగ్గరకు రావడం ఎంత అన్యాయమో కదా!​—⁠న్యాయాధిపతులు 11:​4-7.

యెఫ్తా ఒక షరతుపై గిలాదులో అధిపతిగా ఉంటానని చెప్తాడు. “యెహోవా వారిని నా చేతి కప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదును” అని యెఫ్తా ప్రకటిస్తాడు. వారికి విజయం లభిస్తే, యెహోవా మద్దతు వారికుందని రుజువౌతుంది, అయితే ఆ విపత్తు సమసిపోయిన వెంటనే ప్రజలు దైవిక పరిపాలనను విడవకుండా చూడాలనే ఉద్దేశంతో యెఫ్తా అలా చెప్తాడు.​—⁠న్యాయాధిపతులు 11:​8-11.

అమ్మోనీయులతో వ్యవహరించడం

యెఫ్తా అమ్మోనీయులతో సమాధానపడడానికి ప్రయత్నిస్తాడు. వారి ఆగ్రహానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ఆయన వారి రాజు దగ్గరికి దూతలను పంపిస్తాడు. వారు ఇశ్రాయేలీయులపై ఈ ఆరోపణ చేస్తారు: ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు అమ్మోనీయుల క్షేత్రాన్ని ఆక్రమించుకొన్నారు, వారు దాన్ని తిరిగి ఇచ్చేయాలి.​—⁠న్యాయాధిపతులు 11:​12, 13.

ఇశ్రాయేలీయుల చరిత్ర గురించి బాగా తెలిసిన యెఫ్తా అమ్మోనీయుల ఆరోపణల్ని త్రోసిపుచ్చుతాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు అమ్మోనుకుగానీ, మోయాబుకుగానీ, ఏదోముకుగానీ హానికలిగించలేదని, అంతేకాక ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వివాదాస్పదమైన ఆ ప్రాంతం అమ్మోనీయుల వశంలో లేదని ఆయన చెబుతాడు. ఆ తర్వాత అది అమోరీయుల వశంలోకి వచ్చింది, అయితే దేవుడు వారి రాజైన సీహోనును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు. అంతేకాక, ఇశ్రాయేలీయులు ఆ ప్రాంతంలోనే 300 సంవత్సరాలు నివసించారు. మరైతే అమ్మోనీయులు ఎంతోకాలం గడిచిన తర్వాత ఆ ప్రాంతాన్ని అప్పగించమని ఎందుకు అడుగుతున్నారు?​—⁠న్యాయాధిపతులు 11:​14-22, 26.

ఇశ్రాయేలీయుల బాధలకు ముఖ్య కారణమైన వివాదాంశం గురించి కూడా యెఫ్తా వివరిస్తాడు: సత్యదేవుడు ఎవరు? యెహోవానా లేక ఇశ్రాయేలీయులు ఆక్రమించుకున్న దేశపు దేవుళ్లా? కెమోషుకు నిజంగానే శక్తివుంటే, తన ప్రజల దేశాన్ని తిరిగి స్వాధీనపరచుకునేందుకు తన శక్తిని ఉపయోగించేవాడు కాదా? ఇది అమ్మోనీయులు మద్దతునిస్తున్న అబద్ధమతానికి, సత్యారాధనకు మధ్య జరుగుతున్న పోరాటం. అందుకే, యెఫ్తా సహేతుకంగానే ఈ ముగింపుకు వస్తాడు: “న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.”​—⁠న్యాయాధిపతులు 11:​23-27.

యెఫ్తా పలికిన రాజీపడని మాటలను అమ్మోనీయుల రాజు ఒప్పుకోలేదు. “యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా, అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించు[ను].” బహుశా ఆయన యుద్ధం కోసం పరాక్రమవంతుల్ని సమకూర్చడానికి అక్కడికి వెళ్లివుండవచ్చు.​—⁠న్యాయాధిపతులు 11:​28, 29.

యెఫ్తా మ్రొక్కుబడి

దైవిక నిర్దేశాన్ని ఎంతగానో కోరుకుంటూ యెఫ్తా దేవునికి ఇలా మ్రొక్కుకుంటాడు: “నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయులయొద్దనుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహనబలిగా దాని నర్పించెదను.” యెఫ్తా అడిగినట్లే దేవుడు ఆయనను ఆశీర్వదిస్తాడు, యెఫ్తా అమ్మోనీయుల 20 పట్టణాలవారిని ‘నిశ్శేషముగా హతం చేసి,’ ఇశ్రాయేలీయులు శత్రువులపై గెలిచేందుకు సహాయం చేస్తాడు.​—⁠న్యాయాధిపతులు 11:​30-33.

యెఫ్తా యుద్ధం నుండి తిరిగివచ్చినప్పుడు, ఆయన ప్రియాతిప్రియమైన ఒక్కగానొక్క కూతురు ఆయనను కలవడానికి ఎదురొస్తుంది! “అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని” ఇలా అన్నాడని ఆ వృత్తాంతం చెబుతోంది: “అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవై యున్నావు; నేను యెహోవాకు మాటయిచ్చి యున్నాను గనుక వెనుకతీయలేను.”​—⁠న్యాయాధిపతులు 11:​34, 35.

యెఫ్తా నిజంగానే తన కూతురిని బలివ్వబోతున్నాడా? లేదు. అలా చేయాలని యెఫ్తా అనుకుని ఉండకపోవచ్చు. కనానీయుల దుష్ట ఆచారాల్లో ఒకటైన అక్షరార్థ నరబలిని యెహోవా అసహ్యించుకుంటాడు. (లేవీయకాండము 18:​21; ద్వితీయోపదేశకాండము 12:​31) యెఫ్తా మ్రొక్కుకున్నప్పుడు దేవుని ఆత్మ ఆయనను నిర్దేశించింది, అంతేకాక యెహోవా ఆయన ప్రయత్నాలను ఆశీర్వదించాడు. యెఫ్తా చూపించిన విశ్వాసాన్నిబట్టి, దేవుని సంకల్పంలో ఆయన పోషించిన పాత్రనుబట్టి ఆయన గురించి లేఖనాల్లో ప్రశంసాపూర్వకంగా వ్రాయబడింది. (1 సమూయేలు 12:​11; హెబ్రీయులు 11:​32-34) కాబట్టి, ఆయన నరబలి లేక నరహత్య గురించి ఎంతమాత్రం ఆలోచించివుండడు. మరి యెఫ్తా యెహోవాకు వ్యక్తిని అర్పిస్తానని మ్రొక్కుకున్నప్పుడు ఆయన దేని గురించి ఆలోచించి ఉంటాడు?

యెఫ్తా తనను ఎదుర్కొనే వ్యక్తిని దేవుని సేవకే అంకితం చేయాలనే ఉద్దేశంతో అలా అనివుండవచ్చు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, వ్యక్తులను యెహోవాకు అంకితం చేస్తామని మ్రొక్కుబడి చేసుకోవచ్చు. ఉదాహరణకు, స్త్రీలు బహుశా నీరు తోడడం వంటి పనులు చేస్తూ ఆలయంలో సేవచేసేవారు. (నిర్గమకాండము 38:⁠8; 1 సమూయేలు 2:​22) ఆ సేవ గురించిన వివరాలు అంతగా లేవు, అంతేకాక ఆ సేవ జీవితకాలంపాటు కొనసాగుతుందో లేదో కూడా వివరించబడలేదు. యెఫ్తా మ్రొక్కుకున్నప్పుడు బహుశా అలాంటి ప్రత్యేక సేవ గురించే ఆయన ఆలోచించి ఉండవచ్చు, ఆయన వాగ్దానం బహుశా జీవితాంతం కొనసాగే సేవకు సంబంధించినదై ఉండవచ్చని అనిపిస్తుంది.

యెఫ్తా కుమార్తె, అలాగే ఆ తర్వాతి కాలంలో, బాలుడైన సమూయేలు దైవభక్తిగల తమ తల్లిదండ్రుల మ్రొక్కుబడులను తీర్చడంలో సహకరించారు. (1 సమూయేలు 1:​11) తన తండ్రి ఆ మ్రొక్కుబడి చెల్లించబడాలని ఎంత బలంగా నమ్మాడో, యెహోవాకు విశ్వసనీయురాలైన ఆరాధికురాలిగా యెఫ్తా కుమార్తె కూడా అంతే బలంగా నమ్మింది. అది గొప్ప త్యాగమే, ఎందుకంటే దానిని చెల్లించాలంటే ఆమె ఎన్నటికీ వివాహం చేసుకోకూడదు. ఆమె తన కన్యత్వం విషయమై విలపించింది ఎందుకంటే, ఇశ్రాయేలీయులందరూ తమ వంశం కొనసాగడానికి, స్వాస్థ్యము నిలుపుకోవడానికి సంతానం కలగాలని ఆశించేవారు. యెఫ్తా విషయంలోనైతే, ఆయన తన ప్రియమైన ఒక్కగానొక్క కూతురికి దూరమవ్వాల్సి ఉంటుంది.​—⁠న్యాయాధిపతులు 11:​36-39.

నమ్మకస్థురాలైన ఆ కన్య జీవితం వృథా కాలేదు. ఆమె యెహోవా గృహంలో పూర్తికాల సేవ చేయడం ద్వారా శ్రేష్ఠమైన, సంతృప్తికరమైన, ప్రశంసించదగిన విధంగా ఆయనను మహిమపర్చగలదు. అందుకే “ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.” (న్యాయాధిపతులు 11:​40) ఆమె యెహోవాను సేవించడం యెఫ్తాను ఖచ్చితంగా ఆనందింపజేసి ఉంటుంది.

నేడు దేవుని సేవకుల్లో కూడా అనేకులు పయినీర్లుగా, మిషనరీలుగా, ప్రయాణ సేవకులుగా లేక బెతెల్‌ కుటుంబ సభ్యులుగా పూర్తికాల సేవ చేసే జీవితాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అంటే వారు తమ కుటుంబ సభ్యుల్ని కలవాలనుకున్నప్పుడల్లా కలుసుకోలేకపోవచ్చు. అయినా వారు, వారి కుటుంబ సభ్యులు యెహోవాకు చేయబడే అలాంటి పవిత్ర సేవనుబట్టి ఆనందించవచ్చు.​—⁠కీర్తన 110:⁠3; హెబ్రీయులు 13:​15, 16.

దైవిక నిర్దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు

యెఫ్తా జీవించిన కాలంలో, చాలామంది ఇశ్రాయేలీయులు యెహోవా నిర్దేశాన్ని నిరాకరించారు. యెఫ్తాపై దైవిక ఆశీర్వాదం ఉందనే రుజువున్నా ఎఫ్రాయిమీయులు ఆయనతో తగువుకు దిగుతారు. ఆయన వారిని యుద్ధానికి ఎందుకు పిలవలేదో తెలుసుకోవాలనుకుంటారు. వారు ‘ఆయనతోపాటే ఆయన ఇంటిని’ తగులబెట్టాలని కూడా అనుకుంటారు!​—⁠న్యాయాధిపతులు 12:⁠1, ఈజీ-టు-రీడ్‌-వర్షన్‌.

యెఫ్తా తాను ఎఫ్రాయిమీయులను పిలిచినా వారు రాలేదని చెబుతాడు. ఏదేమైనా దేవుడే ఆ యుద్ధాన్ని గెలిచాడు. గిలాదువారు యెఫ్తాను సైన్యాధిపతిగా ఎన్నుకున్నప్పుడు తమను సంప్రదించలేదని ఎఫ్రాయిమీయులు ఇప్పుడు కోపగించుకుంటున్నారా? నిజానికి, ఎఫ్రాయిమువారి అభ్యంతరం యెహోవాకు వ్యతిరేకంగా చేసే తిరుగుబాటును సూచిస్తుంది, అందుకే వారితో పోరాడడంకన్నా వేరే గత్యంతరం లేకపోయింది. యెఫ్తాకు, వారికి మధ్య జరిగిన పోరాటంలో ఎఫ్రాయిమీయులు ఓడిపోయారు. పారిపోతున్న ఎఫ్రాయిమీయులను పరీక్షించడానికి వారిని పలకమని అడిగిన “షిబ్బోలెతు” అనే పదాన్ని సరిగా పలకలేకపోయినందుకు వారు సులభంగా పట్టుబడ్డారు. ఆ పోరాటంలో మొత్తం 42,000 మంది ఎఫ్రాయిమీయులు హతమయ్యారు.​—⁠న్యాయాధిపతులు 12:​2-6.

ఇశ్రాయేలీయుల చరిత్రలోనే అదెంతటి విషాద ఘటనో కదా! న్యాయాధిపతులైన ఒత్నీయేలు, ఏహూదు, బారాకు, గిద్యోనులు గెలిచిన యుద్ధాలు సమాధానాన్ని నెలకొల్పాయి. ఈ సందర్భంలో శాంతి గురించి ప్రస్తావించబడలేదు. “యెఫ్తా ఆరు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను” అని మాత్రమే ఆ వృత్తాంతం చెబుతోంది.​—⁠న్యాయాధిపతులు 3:​11, 30; 5:​31; 8:​28; 12:⁠7.

పైన ప్రస్తావించబడిన విషయాలన్నిటి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? యెఫ్తా తన జీవితమంతా సంఘర్షించాల్సి వచ్చినా, ఆయన దేవునిపట్ల నమ్మకంగా ఉన్నాడు. ధైర్యశాలి అయిన యెఫ్తా గిలాదులోని పెద్దలతో, అమ్మోనీయులతో, తన కూతురితో, ఎఫ్రాయిమీయులతో మాట్లాడినప్పుడు చివరకు మ్రొక్కుబడి చేసుకుంటున్నప్పుడు కూడా యెహోవా గురించే ప్రస్తావించాడు. (న్యాయాధిపతులు 11:9, 23, 27, 30, 31, 35; 12:⁠3) యెఫ్తాకున్న దైవభక్తినిబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించడమేకాక, ఆయనను ఆయన కుమార్తెను సత్యారాధనను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగించుకున్నాడు. ఇతరులు దైవిక ప్రమాణాలను ఉల్లంఘించిన కాలంలో యెఫ్తా వాటికి కట్టుబడివున్నాడు. యెఫ్తాలాగే మీరూ ఎల్లప్పుడూ యెహోవాకు లోబడివుంటారా?

[అధస్సూచి]

^ పేరా 5 అమ్మోనీయులు ఎంతటి క్రూరత్వానికైనా ఒడిగట్టేవారు. యెఫ్తా కాలం నుండి 60 సంవత్సరాలన్నా గడవకముందే వారు భయాందోళనలకు గురిచేసిన గిలాదు నగరంలోని నివాసులందరి కుడికన్నులను ఊడదీస్తామని బెదిరించారు. వారు గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిన సమయం గురించి ప్రవక్తయైన ఆమోసు ప్రస్తావించాడు.​—⁠1 సమూయేలు 11:⁠2; ఆమోసు 1:​13.