కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేదనాభరిత లోకంలో నిరీక్షణతో ఉండడం

వేదనాభరిత లోకంలో నిరీక్షణతో ఉండడం

వేదనాభరిత లోకంలో నిరీక్షణతో ఉండడం

“మా నవజాతి చరిత్రలో ముందెప్పుడూ లేనంతగా ఇప్పుడు, ప్రజలకు మంచి చేయడంలో, సాధారణ సమస్యలను పరిష్కరించడంలో సామాన్యులు ఎంతో చేయగలుగుతున్నారు.” కెనడాలోని ఒట్టావాలో, 2006 మార్చిలో జరిగిన సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఆ వ్యాఖ్యానం చేశాడు. 2004లో సునామీ వచ్చినప్పటి నుండి అంతర్జాతీయ సుహృద్భావం వృద్ధి చెందుతోందనే ముగింపుకు వచ్చి, ప్రపంచం ఇప్పుడు “ఎప్పుడూ లేనంతగా ఒకరిపై ఒకరు ఆధారపడే దశకు చేరుకుంది” అని కాస్త ఆశాభావంతో అన్నాడు.

మంచి భవిష్యత్తు కోసం పాటుపడేందుకు ప్రకృతి వైపరీత్యాలు అన్ని ప్రాంతాల ప్రజలను పురికొల్పుతాయని మనం ఆశించవచ్చా? “ఎప్పుడూ లేనంతగా ఒకరిపై ఒకరు ఆధారపడడం” నిజమైన శాంతి, నిత్యభద్రత గల భవిష్యత్తును తీసుకురాగలదని నిరీక్షించడానికి విశ్వసనీయమైన ఆధారాన్నిస్తుందా?

నిజమైన నిరీక్షణకు మూలాధారం

మానవజాతి ఆరుకన్నా ఎక్కువ సహస్రాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాల సుదీర్ఘ చరిత్ర, మానవులు పదే పదే ఒకరినొకరు నిరాశపరచుకుంటారని చూపిస్తోంది. కాబట్టి సరైన కారణంతోనే ప్రేరేపిత లేఖనాలు మనకిలా సలహా ఇస్తున్నాయి: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.” (కీర్తన 146:⁠3) ఈ లోక సంస్థలపై, దాని వస్తుసంపదలపై, దాని ఆశయాలపై ఆశలు పెట్టుకోవడం నిరాశనే మిగులుస్తుంది. ఎందుకు? ఎందుకంటే, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి.”​—⁠1 యోహాను 2:​17.

అయితే, గడిచిన శతాబ్దాల కాలంలో, నీతిమంతులైన మానవులకు దేవుడే నిశ్చయమైన నిరీక్షణకు మూలాధారంగా ఉన్నాడు. బైబిలు ఆయనను “[ప్రాచీన] ఇశ్రాయేలునకు ఆశ్రయము,” “[ఇశ్రాయేలు] పితరులకు నిరీక్షణాధారము” అని పిలుస్తోంది, దానిలో ఆయన కోసం నిరీక్షించడానికి, ఆయనపై నమ్మకం, విశ్వాసం ఉంచడానికి సంబంధించిన అనేక పదాలున్నాయి. (యిర్మీయా 14:8; 17:13; 50:⁠7) నిజానికి, “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము” అని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి.​—⁠కీర్తన 27:​14.

సామెతలు 3:5, 6 వచనాలు మనకిలా చెబుతున్నాయి: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” అలాంటి వాగ్దానంలో పూర్తి నమ్మకం ఉంచేందుకు మీకు తగిన కారణముంది, ఎందుకంటే యెహోవా దేవుడు మార్పులేనివాడు, నమ్మదగినవాడు, తన మాట నిలబెట్టుకుంటాడు. (మలాకీ 3:6; యాకోబు 1:​17) మీకు ఏది మంచిదో అది లభించాలని ఆయన కోరుకుంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ ఆయన వాక్యమైన బైబిలులో చెప్పబడినదాని ప్రకారం నడుచుకుంటే, ఈ భయానక కాలాల్లో విజయవంతంగా కొనసాగేందుకు అది మీకు మార్గనిర్దేశాన్నిస్తుంది.​—⁠యెషయా 48:​17, 18.

దేవుని మార్గనిర్దేశాన్ని హృదయపూర్వకంగా అనుసరించే వ్యక్తి ఈ వాగ్దానాన్ని నమ్మవచ్చు: “నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.” (యెషయా 41:​9, 10) పట్టుదలతో ప్రార్థించడంతోపాటు ఈ హామీ గురించి ధ్యానించడం, యెహోవా దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారందరికీ ఎంతో ఓదార్పునిస్తుంది, ఎందుకంటే అది కష్టతరమైన పరిస్థితులను, ఆందోళనలను అధిగమించడానికి వారికి సహాయం చేస్తుంది.

ఒక యెహోవాసాక్షి, ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆండ్రీయనే తీసుకోండి. ఆమె ఇలా చెబుతోంది: “నా జీవితంలో అనిశ్చయ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రార్థించడం, యెహోవా చేసిన వాగ్దానాల గురించి ధ్యానించడం ద్వారానే నేను తిరిగి బలం పుంజుకుంటాను. నేను నా జీవితంలో ఎల్లప్పుడూ యెహోవాకు ప్రథమస్థానం ఇచ్చినప్పుడు మాత్రమే నేను స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతాను.”

యెహోవాపట్ల మీ నమ్మకాన్ని బలపర్చుకోండి

యెహోవా కోసం నిరీక్షించడానికున్న ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఒక కీర్తనకర్త ఇలా చెప్పాడు: “నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు.” (కీర్తన 119:​165) దేవుని వాక్యాన్ని యథార్థంగా అధ్యయనం చేయడం, మీ మనసును, హృదయాన్ని ‘యోగ్యమైన, మెచ్చుకొనదగిన, సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగల’ ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన, ప్రోత్సాహకరమైన విషయాలతో నింపుకునేందుకు ఎంతగానో దోహదపడగలదు. అలాంటి విషయాలను విని, నేర్చుకుని, అంగీకరించి, ఆచరణలో పెట్టడానికి మీరు జాగ్రత్తగా కృషిచేస్తే, “సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును.”​—⁠ఫిలిప్పీయులు 4:8, 9.

దశాబ్దాల వ్యక్తిగత అనుభవంతో, జాన్‌ ఇలా చెబుతున్నాడు: “భవిష్యత్తు విషయంలో నా భావాలను మార్చుకునేందుకు, పరిపూర్ణుడైన, అదృశ్యుడైన దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవాలనుకునే ముందు నా వ్యక్తిత్వంలో, ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉందని తెలుసుకోవడం ప్రాముఖ్యమైంది. నేను ఆధ్యాత్మిక వ్యక్తిని కావడం ద్వారా మాత్రమే ఆ బంధాన్ని ఏర్పరచుకోగలను. అందుకోసం నేను దేవునిపట్ల భక్తి కలిగివుండి, ఆయన ప్రేరేపిత వాక్యాన్ని చదివి దాని గురించి ధ్యానించడం ద్వారా దేవుని మనసు ఏర్పరచుకోవలసి వచ్చింది.”

ప్రేరేపిత లేఖనాల్లోవున్న ఉత్తేజకరమైన, జీవదాయక సత్య జలాలను మీరు త్రాగితే, ప్రచారమాధ్యమాల ద్వారా ప్రతీరోజు వెలువడే అంతులేని చెడువిషయాలను తట్టుకునేందుకు సమర్థవంతమైన, పరీక్షించబడిన పద్ధతిని అవలంభిస్తారు. బైబిల్లో చెప్పబడినదాన్ని అన్వయించుకోవడం మీ కుటుంబ బంధాలను బలపర్చి, ఆందోళనను తగ్గించుకునేందుకు కూడా సహాయం చేయగలదు. అంతేగాక, “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై” తాను సిద్ధంగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. (2 దినవృత్తాంతములు 16:⁠9) నిజంగా మీరు దేనికీ భయపడనవసరం లేనివిధంగా ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు.

యుద్ధం, మారణహోమం జరుగుతున్న కాలంలో జీవించిన ఫినీయాస్‌ ఇలా చెబుతున్నాడు: “నేను నా జీవితాన్ని యెహోవా కాపుదలలో ఉంచడం నేర్చుకున్నాను. బైబిలు సూత్రాలకు కట్టుబడి ఉండడం ద్వారా నేను అనేక సమస్యలను తప్పించుకోగలిగాను.” మీరు నిజంగా యెహోవా దేవునిపై నమ్మకం ఉంచితే, ప్రతికూల పరిస్థితి అనే ఎలాంటి ప్రాకారాన్నైనా అధిగమించడానికి ఆయన మీకు సహాయం చేయగలడు. (కీర్తన 18:​29) తన తల్లిదండ్రులతో సన్నిహిత సంబంధమున్న పిల్లవాడు వాళ్ళను పూర్తిగా విశ్వసిస్తాడు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నా లేక ఏదైనా కష్టంలో ఉన్నా వారు శ్రద్ధ తీసుకుంటారని నిశ్చింతగా ఉంటాడు. మీరు తగిన ప్రయత్నం చేసి, యెహోవా కోసం నిరీక్షించమని ఇవ్వబడుతున్న ఆహ్వానాన్ని అంగీకరిస్తే మీకూ అలాంటి భావనే కలుగుతుంది.​—⁠కీర్తన 37:​34.

నిరీక్షణకు ఖచ్చితమైన పునాది

యేసుక్రీస్తు తన అనుచరులకిలా చెప్పాడు: “మీరీలాగు ప్రార్థనచేయుడి, పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక!” (మత్తయి 6:​9, 10) ఆ పరలోక రాజ్యం ద్వారానే, అంటే యేసుక్రీస్తు నాయకత్వం వహించే ప్రభుత్వం ద్వారానే దేవుడు భూమిపై న్యాయమైన తన సర్వాధిపత్యాన్ని అమలు చేస్తాడు.​—⁠కీర్తన 2:7-12; దానియేలు 7:​13, 14.

నేడు జీవితంలోని ప్రతీ అంశాన్ని ప్రభావితంచేసే అనేక రకాల భయాలు, దేవుడు జోక్యం చేసుకోవడం అవసరమని స్పష్టంగా సూచిస్తున్నాయి. సంతోషకరంగా, దేవుడు అలా జోక్యం చేసుకునే సమయం సమీపించింది! ఇప్పుడు దేవునిచే మెస్సీయ రాజుగా సింహాసనాసీనునిగా చేయబడిన యేసుక్రీస్తుకు యెహోవా సర్వాధిపత్య సత్యసంధతను నిరూపించే, ఆయన నామాన్ని పరిశుద్ధపరిచే అధికారం అప్పగించబడింది. (మత్తయి 28:18) త్వరలోనే, రాజ్య పరిపాలన తన అవధానాన్ని భూమివైపు మళ్ళించి భయానికి, ఆందోళనకు కారణమైనవాటన్నిటినీ నిర్మూలిస్తుంది. మన భయాలను పోగొట్టగల యోగ్య పరిపాలకుడు యేసు అని చూపించే నిదర్శనాలన్నిటినీ యెషయా 9:6 ఉదాహరిస్తోంది. ఉదాహరణకు, ఆయన “నిత్యుడగు తండ్రి,” ‘ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త,’ “సమాధానకర్తయగు అధిపతి” అని పిలువబడ్డాడు.

“నిత్యుడగు తండ్రి” అనే వాత్సల్యపూరిత పదాన్ని తీసుకోండి. నిత్యుడగు తండ్రిగా యేసుకు తన విమోచన క్రయధన బలి ఆధారంగా, విధేయులైన మానవులకు భూమిపై నిత్యజీవం పొందే అవకాశాన్ని ఇవ్వగల శక్తి, అధికారం అలాగే కోరిక కూడా ఉన్నాయి. అంటే చివరకు వారు, పాపియైన మొదటి మానవుడైన ఆదాము మూలంగా వచ్చిన పాపం నుండి అపరిపూర్ణత నుండి విడుదల పొందుతారు. (మత్తయి 20:28; రోమీయులు 5:12; 6:​23) క్రీస్తు, చనిపోయిన అనేకులను తిరిగి జీవానికి తీసుకురావడానికి కూడా, దేవుడు తనకు అప్పగించిన అధికారాన్ని ఉపయోగిస్తాడు.​—⁠యోహాను 11:​25, 26.

యేసు భూమిపై ఉన్నప్పుడు తాను ‘ఆశ్చర్యకరమైన ఆలోచనకర్తను’ అని నిరూపించుకున్నాడు. దేవుని వాక్యం గురించి ఆయనకున్న జ్ఞానాన్నిబట్టి, మానవనైజం గురించి ఆయనకున్న అసాధారణ అవగాహననుబట్టి, అనుదిన జీవిత సమస్యలను ఎలా పరిష్కరించాలో యేసుకు తెలుసు. క్రీస్తు తాను పరలోకంలో సింహాసనాన్ని అధిష్టించినప్పటి నుండి ‘ఆశ్చర్యకరమైన ఆలోచనకర్తగా’ ఉంటూ, యెహోవా మానవులతో సంభాషించే మాధ్యమంలో ముఖ్యమైన వ్యక్తిగా సేవచేస్తున్నాడు. బైబిలులో వ్రాయబడిన యేసు ఉపదేశం ఎల్లప్పుడూ జ్ఞానయుక్తమైనది, నిష్కళంకమైనది. దానిని తెలుసుకొని విశ్వసించడం అనిశ్చయత, విపరీతమైన భయం లేని జీవితాన్ని గడిపేందుకు నడిపిస్తాయి.

యెషయా 9:6 యేసును “సమాధానకర్తయగు అధిపతి” అని కూడా చెబుతోంది. ఆ హోదాలో క్రీస్తు త్వరలోనే సమస్త అసమానతను, అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. ఎలా? మానవజాతిని మెస్సీయ రాజ్య ఏకైక శాంతియుత పరిపాలన క్రిందకు తీసుకురావడం ద్వారా అలా చేస్తాడు.​—⁠దానియేలు 2:⁠44.

రాజ్యపాలన క్రింద, భూవ్యాప్తంగా నిత్యశాంతి నెలకొంటుంది. ఈ విషయాన్ని మీరెందుకు ఖచ్చితంగా నమ్మవచ్చు? దానికి కారణం యెషయా 11:9లో వెల్లడి చేయబడింది, అక్కడ మనమిలా చదువుతాము: ‘నా పరిశుద్ధ పర్వతమందంతటను [రాజ్య పౌరులు] హాని చేయరు, నాశముచేయరు; సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును.’ చివరకు, భూమిపైనున్న ప్రతీ మానవునికి దేవుని గురించి ఖచ్చితమైన జ్ఞానం ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఆయనకు విధేయులవుతారు. ఆ నిరీక్షణ మీకు సంతోషం కలిగిస్తోందా? అలాగైతే, అమూల్యమైన, “యెహోవాను గూర్చిన జ్ఞానము” సంపాదించుకోవడంలో ఆలస్యం చేయకండి.

మన కాలంలోని సంఘటనల గురించి, బైబిల్లో వాగ్దానం చేయబడిన ఉజ్వలమైన భవిష్యత్తు గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో పరిశీలించడం ద్వారా మీరు విశ్వాసాన్ని పెంపొందింపజేసే, జీవదాయకమైన దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి మీ ఇరుగుపొరుగున యెహోవాసాక్షులు అందజేస్తున్న ఉచిత బైబిలు అధ్యయన కార్యక్రమం నుండి ప్రయోజనం పొందమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. భయాన్ని పోగొట్టుకుని, వేదనాభరిత లోకంలో నిజమైన నిరీక్షణతో ఉండడానికి ఇది ఒక మార్గం.

[7వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

రాజ్య ప్రభుత్వం ఎందుకు నిరీక్షణను నింపుతుంది?

దేవుని రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తుకు విశ్వమంతటిపై అధికారం వహించే సామర్థ్యం, హక్కు ఇవ్వబడ్డాయి. (మత్తయి 28:18) ఆయన భూ ఆవరణాన్ని తిరిగి పరిపూర్ణ సమతుల్యానికి తీసుకువస్తాడు. ఆయనకు అనారోగ్యంపై, వ్యాధిపై కూడా పూర్తి ఆధిపత్యం ఉంది. యేసు భూమిపై చేసిన శక్తివంతమైన కార్యాలు, పరిపూర్ణమైన, నమ్మదగిన రాజుగా ఆయన రాజ్యపాలన క్రింద రానున్న మరింత గొప్ప ఆశీర్వాదాలకు ముంగుర్తుగా ఉన్నాయి. మెస్సీయ రాజు గురించి ఈ క్రింద పేర్కొనబడిన వాటిలో ప్రత్యేకంగా ఏ లక్షణాలను మీరు ఇష్టపడతారు?

సమీపించదగినవాడు.​—మార్కు 10:​13-16.

సహేతుకత గలవాడు, నిష్పక్షపాతి.​—⁠మార్కు 10:​35-45.

నమ్మదగినవాడు, నిస్వార్థపరుడు.​—⁠మత్తయి 4:5-7; లూకా 6:​19.

నీతిమంతుడు, న్యాయవంతుడు.​—⁠యెషయా 11:3-5; యోహాను 5:30; 8:​16.

ఆలోచనగలవాడు, దయగలవాడు, వినమ్రుడు.​—⁠యోహాను 13:​3-15.

[4వ పేజీలోని చిత్రం]

బైబిలు చదవడం, ధ్యానించడం మనకు యెహోవాపై నమ్మకాన్ని కలిగిస్తాయి