కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శ్రేష్ఠమైన విద్యాబుద్ధులు నేర్చుకునేలా మా పిల్లలకు మేమెలా సహాయపడవచ్చు?

శ్రేష్ఠమైన విద్యాబుద్ధులు నేర్చుకునేలా మా పిల్లలకు మేమెలా సహాయపడవచ్చు?

శ్రేష్ఠమైన విద్యాబుద్ధులు నేర్చుకునేలా మా పిల్లలకు మేమెలా సహాయపడవచ్చు?

ఒక పిల్లవాడు విద్యాబుద్ధులు నేర్చుకోవడాన్ని ఉత్తేజకరమైన, కష్టాలతో కూడిన ప్రయాణంతో పోల్చవచ్చు. అది మీరు, మీ పిల్లలు కలిసి చేసే ప్రయాణం. మీరు వారిని ప్రోత్సహిస్తూ, ప్రేమతో నిర్దేశిస్తూ వారు జీవన పథంలో ముందుకు సాగేందుకు సహాయం చేస్తారు. వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది!

పిల్లలు జీవితంలో నిజమైన విజయాన్ని, సంతోషాన్ని పొందాలంటే వారు నైతిక, ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించుకుంటూ, తప్పొప్పులను వివేచించడం నేర్చుకోవాలి. వారు యెహోవా గురించి తెలుసుకుని ఆయనను ప్రేమించినప్పుడు వారి విద్యాభ్యాసం నిజంగా ప్రయోజనం చేకూరుస్తుంది, వారు పొందిన ఉపదేశం శాశ్వతంగా గుర్తుంటుంది. మీ పిల్లలు ఏమి నేర్చుకుంటారు, వాటిని వారెలా పరిగణిస్తారు, వాటినెలా అర్థం చేసుకుంటారు అనే విషయంలో తల్లిగా లేక తండ్రిగా మీరు కీలక పాత్రను పోషిస్తారు.

ఆ ప్రయాణంలో తల్లిదండ్రులుగా మీకు కొన్ని సవాళ్లు ఎదురౌతాయి. పిల్లలు సులభంగా ప్రభావితులవుతారు, ఇంటి వెలుపలి వాతావరణం నుండి వారు ఎన్నో చెడు విషయాలను నేర్చుకోవచ్చు. మనం అపవాదియైన సాతాను అధీనంలో ఉన్న లోకంలో జీవిస్తున్నాం. (1 యోహాను 5:​19) అతనికి కూడా మీ పిల్లలు నేర్చుకునే విద్యాబుద్ధులపట్ల ఆసక్తి ఉంది, అయితే అతని ఉద్దేశాలు వేరు. సాతాను బోధించడంలో నైపుణ్యవంతుడు, చాలా అనుభవజ్ఞుడు గానీ అతడు దుష్టుడు. అతడు ‘వెలుగు దూతగా’ నటించినా, అతడిచ్చే జ్ఞానం మోసకరమైనది, యెహోవా వాక్యానికి, చిత్తానికి వ్యతిరేకమైనది. (2 కొరింథీయులు 4:⁠4; 11:​14; యిర్మీయా 8:⁠9) అపవాది, అతని దయ్యాలు మోసపుచ్చడంలో ప్రజ్ఞావంతులు, అవి స్వార్థాన్ని, మోసాన్ని, నైతిక పతనాన్ని పురికొల్పుతాయి.​—⁠1 తిమోతి 4:⁠1.

మీ పిల్లలు మోసపోకుండా వారిని సంరక్షించేందుకు మీరు ఏమి చేయవచ్చు? వారు శ్రేష్ఠమైన, ప్రయోజనకరమైన వాటిని అంగీకరించేలా మీరు వారికెలా బోధించవచ్చు? ఒక ముఖ్యమైన మార్గమేమిటంటే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవడమే. మీరు మంచి మాదిరిని ఉంచాలి. మీ పిల్లలకు శిక్షణనిచ్చే బాధ్యతను మీరే తీసుకొని, దాన్ని నిర్వర్తించడానికి సమయం వెచ్చించడం ప్రాముఖ్యం. అయితే, ఆ విషయాలను పరిశీలించే ముందు, మనం శ్రేష్ఠమైన విద్యాబుద్ధులకు పునాది ఏమిటో తెలుసుకుందాం.

శ్రేష్ఠమైన విద్యాబుద్ధులకు పునాది

ఆ పునాది ఏమిటో, జీవించినవారిలోకెల్లా జ్ఞానవంతులైన వ్యక్తుల్లో ఒకడైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను నుండి తెలుసుకుందాం. ఆయన గురించి బైబిలు మనకిలా చెబుతోంది: “దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.” సొలొమోను “మూడు వేల సామెతలు చెప్పెను, వెయ్యిన్నియయిదు కీర్తనలు రచించెను.” ఆయనకు వృక్షశాస్త్రం గురించిన, జంతువుల గురించిన అపారమైన జ్ఞానం ఉండేది. (1 రాజులు 4:​29-34) సొలొమోను రాజు యెరూషలేములో యెహోవా కోసం నిర్మించబడిన అద్భుతమైన మందిర నిర్మాణంతోపాటు ఇశ్రాయేలు జనాంగపు ఇతర నిర్మాణ పథకాలను కూడా పర్యవేక్షించాడు.

ప్రసంగి లాంటి పుస్తకాల్లో సొలొమోను వ్రాసిన మాటలు ఆయనకు మానవ నైజం గురించిన లోతైన అవగాహన ఉందని చూపిస్తున్నాయి. శ్రేష్ఠమైన విద్యాబుద్ధులకు పునాదేమిటో తెలియజేసేందుకు ఆయన దేవునిచేత ప్రేరేపించబడ్డాడు. సొలొమోను ఇలా చెప్పాడు: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము.” జ్ఞానవంతుడైన రాజు ఇంకా ఇలా చెప్పాడు: “యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.”​—⁠సామెతలు 1:⁠7; 9:​10.

మనకు దేవునిపట్ల భయభక్తులుంటే, మనకు ఆయనపట్ల భక్తిపూర్వక గౌరవం ఉంటుంది, అంతేకాక ఆయనను నొప్పించకుండా ఉండడానికి జాగ్రత్తపడతాం. ఆయనే సర్వాధిపతి అనీ, ఆయనకు మనం జవాబుదారులమనీ గుర్తిస్తాం. మన జీవితాలు ఆధారపడిన వ్యక్తిని అగౌరవపర్చేవారిని మనుష్యులు జ్ఞానవంతులుగా పరిగణించవచ్చు, అయితే అలాంటి జ్ఞానం “దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.” (1 కొరింథీయులు 3:​19) మీ పిల్లలకు ‘పైనుండివచ్చు జ్ఞానముపై’ ఆధారపడిన విద్యాబుద్ధులు అవసరం.​—⁠యాకోబు 3:​15, 17.

యెహోవాను నొప్పిస్తామేమోననే భయానికి, ఆయనపట్ల ఉండే ప్రేమకు చాలా దగ్గరి సంబంధం ఉంది. తన సేవకులకు తనపట్ల భయభక్తులుండాలని అలాగే తనను ప్రేమించాలని యెహోవా కోరుతున్నాడు. మోషే ఇలా అన్నాడు: “ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?”​—⁠ద్వితీయోపదేశకాండము 10:​12, 13.

మన పిల్లల్లో మనం, యెహోవాపట్ల భక్తిపూర్వక భయాన్ని వృద్ధిచేస్తే, వారిని నిజంగా జ్ఞానవంతుల్ని చేసే విద్యాబుద్ధులు వారు నేర్చుకోవడానికి పునాది వేసినవారమవుతాం. వారు భక్తిపూర్వక భయాన్ని పెంపొందించుకుంటుండగా, శ్రేష్ఠమైన సమస్త జ్ఞానానికి మూలమైన సృష్టికర్తపట్ల వారు గౌరవాన్ని పెంచుకుంటారు. అది వారు నేర్చుకునే విషయాల్ని సరైన దృక్కోణంలో చూడడానికి, తప్పుడు నిర్ధారణలకు రాకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. వారు “మేలు కీడులను వివేచించు” సామర్థ్యాన్ని వృద్ధిచేసుకుంటారు. (హెబ్రీయులు 5:​14) అలాంటి పునాది వారు వినయంగా ఉండేందుకు, చెడు చేయకుండా ఉండేందుకు కూడా సహాయం చేస్తుంది.​—⁠సామెతలు 8:​13; 16:⁠6.

మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తున్నారు!

మన పిల్లలు యెహోవాను ప్రేమించి, ఆయనపట్ల భయభక్తులు కలిగివుండేందుకు మనం ఎలా సహాయపడవచ్చు? దానికి సమాధానం యెహోవా మోషే ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలులోని తల్లిదండ్రులకు ఇలా ఆదేశించబడింది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.”​—⁠ద్వితీయోపదేశకాండము 6:​5-7.

ఆ వచనాలు తల్లిదండ్రులకు ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పుతాయి. వాటిలో ఒకటి: తల్లిదండ్రులుగా మీరు మంచి మాదిరినుంచాలి. మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించాలంటే, మీరు ముందుగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన మాటలు మీ హృదయంలో ఉండాలి. అదెందుకు అంత ప్రాముఖ్యం? ఎందుకంటే మీ పిల్లలకు మీరే మొదటి బోధకులు. వారు మీ నుండి నేర్చుకునే విషయాలు వారినెంతో ప్రభావితం చేస్తాయి. పిల్లల జీవితంపై తల్లిదండ్రుల మాదిరి చూపినంత ప్రభావం మరేదీ చూపదు.

మీకున్న ఆశయాలు, ఆదర్శాలు, విలువలు, ఇష్టాలు మీరు చెప్పేదానిలోనేకాక మీరు చేసేదానిలో కూడా కనిపిస్తాయి. (రోమీయులు 2:​21, 22) పిల్లలు పసితనం నుండే తమ తల్లిదండ్రుల్ని శ్రద్ధగా గమనించడం ద్వారా నేర్చుకుంటారు. తమ తల్లిదండ్రులకు ఏవి ప్రాముఖ్యమో పిల్లలు గుర్తిస్తారు, తరచూ వాటినే వారు కూడా ప్రాముఖ్యమైనవిగా పరిగణించడం మొదలుపెడతారు. మీరు నిజంగా యెహోవాను ప్రేమిస్తే మీ పిల్లలు దాన్ని తప్పక గ్రహిస్తారు. ఉదాహరణకు, మీకు బైబిలు చదవడం, అధ్యయనం చేయడం ప్రాముఖ్యమైనవని వారు గమనిస్తారు. మీరు మీ జీవితంలో రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానం ఇస్తున్నారనే విషయాన్ని వారు గ్రహిస్తారు. (మత్తయి 6:​33) మీరు క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం ద్వారా, రాజ్య ప్రకటనా పనిలో భాగం వహించడం ద్వారా యెహోవాకు పవిత్ర సేవ చేయడాన్ని మీరు అత్యంత ప్రాముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారని వారికి చూపిస్తారు.​—⁠మత్తయి 28:​19, 20; హెబ్రీయులు 10:​24, 25.

మీ బాధ్యతల్ని మీరే నెరవేర్చండి

ద్వితీయోపదేశకాండము 6:​5-7 వచనాలనుండి తల్లిదండ్రులు నేర్చుకునే మరొక పాఠం: మీ పిల్లలకు శిక్షణనిచ్చే బాధ్యత మీదే. ప్రాచీన కాలాల్లోని యెహోవా ప్రజల్లో తల్లిదండ్రులే తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో కూడా పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులే ప్రముఖ పాత్ర వహించేవారు. (2 తిమోతి 1:5; 3:​14, 15) పౌలు తోటి క్రైస్తవులకు వ్రాస్తూ, ప్రత్యేకంగా తండ్రులు ‘పిల్లలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలని’ చెప్పాడు.​—⁠ఎఫెసీయులు 6:⁠4.

ఆధునిక కాలపు సవాళ్లు, ఉద్యోగం, మీ సమయాన్ని, శక్తిని హరించివేసే ఇతర పనుల ఒత్తిడివల్ల తల్లిదండ్రులు తమ పిల్లల విద్యాభ్యాసాన్ని టీచర్లకు, పిల్లల సంరక్షణా సంస్థలకు వదిలేయాలనుకోవచ్చు. ఏదేమైనా, ప్రేమగల శ్రద్ధగల తల్లిదండ్రుల స్థానాన్ని ఎవ్వరూ పూరించలేరు. మీ ప్రాముఖ్యతను, ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకండి. మీ పిల్లలకు విద్యాబుద్ధులను నేర్పించే విషయంలో సహాయం అవసరమైతే, జ్ఞానయుక్తంగా దాన్ని ఎంపికచేసుకోండి అంతేకానీ మీ పవిత్రమైన బాధ్యతను వేరేవారి చేతుల్లో వదిలేయకండి.

మీ పిల్లలకు శిక్షణనివ్వడానికి సమయం వెచ్చించండి

ద్వితీయోపదేశకాండము 6:​5-7 వచనాల నుండి తల్లిదండ్రులు నేర్చుకునే మరో పాఠం: పిల్లలకు శిక్షణనివ్వడానికి సమయం, కృషి అవసరం. ఇశ్రాయేలీయులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని సత్యాన్ని ‘అభ్యసింపజేయమని’ ఆదేశించబడ్డారు. ఆదిమ హీబ్రూ భాషలో ‘అభ్యసింపజేయు’ అనే పదానికి అర్థం, “పునరుక్తిచేయడం” లేక “పదే పదే చెప్పడం.” వారు దినమంతటా ఉదయం నుండి సాయంత్రం వరకు ‘ఇంట్లో’ ‘త్రోవలో’ అలాగే చేయాలి. పిల్లలకు బోధించడానికి, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా వారి వైఖరిని, ప్రవర్తనను మలచడానికి సమయం, కృషి అవసరం.

మరి మీ పిల్లలు శ్రేష్ఠమైన విద్యాబుద్ధులు నేర్చుకునేలా సహాయడడానికి మీరేమి చేయవచ్చు? మీరు ఎంతో చేయవచ్చు. యెహోవాను ప్రేమించడం, ఆయనపట్ల భయభక్తులు కలిగివుండడం వారికి నేర్పించండి. మంచి మాదిరినుంచండి. మీ పిల్లలకు బోధించే బాధ్యతను మీరే తీసుకొని, వారికి శిక్షణనివ్వడానికి అవసరమయ్యే సమయాన్ని వెచ్చించండి. మీరు అపరిపూర్ణులు కాబట్టి మీ బాధ్యతను నెరవేర్చే విషయంలో కొన్నిసార్లు మీరు పొరపాట్లు చేస్తారు. కానీ మీరు దేవుని చిత్తం చేయడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తే మీ పిల్లలు మీ ప్రయత్నాలపట్ల కృతజ్ఞత కనబరచి వాటినుండి ప్రయోజనం పొందవచ్చు. సామెతలు 22:⁠6 ఇలా చెబుతోంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” ఇదే సూత్రం అమ్మాయిలకూ వర్తిస్తుంది.

విద్యాబుద్ధులు నేర్చుకోవడం, జీవితాంతం కొనసాగే ప్రయాణం. మీరు, మీ పిల్లలు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ ప్రయాణాన్ని మీరు నిత్యమూ ఆనందించగలుగుతారు. ఎందుకంటే యెహోవా గురించి నేర్చుకోవడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనమేమి చేయాలో నేర్చుకోవడానికి అంతం లేనేలేదు.​—⁠ప్రసంగి 3:​10, 11.

[15వ పేజీలోని చిత్రం]

మీరు మీ పిల్లల కోసం బైబిలు చదువుతారా?

[16వ పేజీలోని చిత్రం]

మీ పిల్లలకు సృష్టికర్త గురించి బోధించడానికి సమయం తీసుకోండి