దుష్టత్వం —దాన్ని అదుపుచేయడం అసాధ్యమా?
దుష్టత్వం —దాన్ని అదుపుచేయడం అసాధ్యమా?
కుతూహలంతో ఒక పిల్లవాడు, పొలంలో కనిపించిన ఒక వస్తువును చేతిలోకి తీసుకున్నాడు, అదొక మందుపాతర, దానితో ఆ అబ్బాయికి కళ్ళుపోయి, అవిటివాడైపోయాడు. ఒక తల్లి ముక్కుపచ్చలారని తన పసిబిడ్డను రోడ్డు పక్కన చెత్తలో దాచిపెట్టి వెళ్లిపోయింది. ఉద్యోగంలో నుండి తీసివేయబడిన ఒక వ్యక్తి తాను ముందు పనిచేసిన ఉద్యోగస్థలానికి వచ్చి అక్కడ కనబడిన వాళ్లందరినీ తుపాకీతో కాల్చి, ఆత్మహత్య చేసేసుకున్నాడు. గౌరవనీయుడైన ఒక వ్యక్తి నిస్సహాయ పిల్లలపై అత్యాచారం చేశాడు.
వి చారకరంగా, అలాంటి దుష్టకార్యాల గురించిన నివేదికలు మన కాలంలో సర్వసాధారణమైపోయాయి. అంతకంటే విచారకరమైన విషయమేమిటంటే, ఈ నివేదికలను జాతి నిర్మూలన, ఉగ్రవాదం గురించిన నివేదికలతో పోలిస్తే, తరచూ అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. 1995లో ప్రచురించబడిన ఒక సంపాదకీయంలో ఇలా వ్రాయబడింది: “ఈ శతాబ్దంలో జరిగిన దారుణకృత్యాలను బట్టి చూస్తే, ఇది సాతాను శతాబ్దం. ప్రజలు తమలో జాతి, మతం, వర్గం పేరిట కోట్లాదిమందిని చంపే సామర్థ్యం, చంపాలనే కోరిక ఇంతగా ఉన్నాయని గతంలో ఎప్పుడూ చూపించలేదు.”
అదే సమయంలో, మనుష్యులు గాలిని కలుషితం చేస్తున్నారు, నేలను పాడుచేస్తున్నారు, భూవనరుల్ని హరించివేస్తున్నారు, అసంఖ్యాక జాతులు అంతరించిపోయేలా చేస్తున్నారు. మానవజాతి ఇలాంటివన్నీ జరగకుండా ఆపి ఈ ప్రపంచాన్ని మెరుగైన, సురక్షితమైన స్థలంగా మార్చగలదా? లేక అలా చేయడానికి ప్రయత్నించడం, ఆకాశానికి నిచ్చెన వేయడంలా ఉంటుందా? దుష్టత్వం గురించి ఎన్నో పుస్తకాలు వ్రాసిన ఒక ప్రొఫెసర్ ఇలా అన్నాడు: “ఈ లోకంలో గమనార్హమైన మార్పు తేవాలని, దాన్ని మెరుగుపర్చాలని నేనెంతో కోరుకున్నాను. కానీ లోకం ఏమాత్రం మెరుగుపడుతున్నట్లు కనిపించడంలేదు.” బహుశా మీరు కూడా అలాగే అనుకుంటుండవచ్చు.
లోకం వెళ్తున్న తీరును, అంతకంతకూ అల్లకల్లోలంగా, ప్రమాదకరంగా తయారవుతున్న సముద్రంలోకి ప్రయాణిస్తున్న ఓడతో పోల్చవచ్చు. ఆ దిశలో వెళ్లడం ఎవరికీ ఇష్టం లేకపోయినా, ఓడను ప్రక్కకు మళ్లించడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి. అలా ఆ ఓడ పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోతుంది, దాన్ని ఎవరూ ఆపలేరు.
అంతకంతకూ దిగజారిపోతున్న ఈ పరిస్థితికి మానవ అపరిపూర్ణత కొంతమేరకు కారణమని చెప్పవచ్చు. (రోమీయులు 3:23) అయితే, దుష్టత్వం ఎంత పెద్ద పెట్టున, ఎంత విస్తారంగా, ఎంత ఎడతెగక సాగుతోందంటే దానికి కేవలం మానవుల్లోని ద్వేషం మాత్రమే కారణం అనడం సమంజసం కాదు. మానవులు అదృశ్యమైన మరియు బలమైన, ఒక దుష్ట శక్తి ద్వారా నియంత్రించబడే సాధ్యత ఉందా? అదే నిజమైతే, ఆ శక్తి ఏమిటి, దాని నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? తర్వాతి ఆర్టికల్ ఆ ప్రశ్నలకు జవాబులిస్తుంది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
© Heldur Netocny/Panos Pictures