నాలుకకు ఉన్నశక్తి
నాలుకకు ఉన్నశక్తి
జిరాఫీ నాలుక 45 సెంటీమీటర్ల పొడవుండి, దానికి వేగంగా కదిలేంత, చెట్లకొమ్మలనుండి ఆకులను లాగేంత శక్తివుంటుంది. నీలి తిమింగిలం నాలుక దాదాపు ఏనుగంత బరువుంటుంది. ఆ నాలుకను కదపడానికి ఎంత బలం అవసరమో కాస్త ఊహించండి!
వాటి పరిమాణంతో, బరువుతో, శక్తితో పోలిస్తే మానవ నాలుక చాలా చిన్నది. అయినా అది ఎంతో శక్తివంతమైనది. మానవ శరీరంలోని ఈ చిన్న అవయవం గురించి బైబిలు ఇలా చెబుతోంది: “జీవమరణములు నాలుక వశము.” (సామెతలు 18:21) అమాయకుల పతనానికి, చివరకు వారి మరణానికి కారణమైన అబద్ధాలను, తప్పుడు సాక్ష్యాలను చెప్పడానికి ఉపయోగించడంలో మానవ నాలుకకు ఉన్న మరణాంతకమైన శక్తి గురించి ఎన్నిసార్లు మనం వినలేదు?
అంతేకాక నొప్పించే మాటలవల్ల దీర్ఘకాల స్నేహాలు కూడా చెడిపోయాయి. కఠినమైన మాటలవల్ల మనసులు గాయపడ్డాయి. తప్పుడు ఆరోపణలకు గురైన యోబు ఇలా రోదించాడు: “ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటలచేత నన్ను నలుగగొట్టుదురు?” (యోబు 19:2) అదుపులేని నాలుకయొక్క వినాశనకరమైన శక్తిని శిష్యుడైన యాకోబు ఇలా స్పష్టంగా చిత్రీకరించాడు: “నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే.”—యాకోబు 3:5, 6.
మరోప్రక్క, నాలుకకు ఉన్న శక్తి జీవాన్ని కూడా ఇవ్వగలదు. సానుభూతిని, ఓదార్పునిచ్చే మాటలు కొంతమందిని మానసిక కృంగుదలకు లోనవకుండా, ఆత్మహత్యకు పాల్పడకుండా కాపాడాయి. మాదక ద్రవ్యాలు వాడేవారు, క్రూరులైన నేరస్థులు, నమ్మదగిన ఉపదేశాన్ని లక్ష్యపెట్టడం ద్వారా అకాల మరణం నుండి తప్పించుకోగలిగారు. నిజంగానే నీతిమంతుని నాలుక పలికే మాటలు “జీవవృక్షము,” అంతేకాక, “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.”—సామెతలు 15:4; 25:11.
అయితే, యెహోవాను స్తుతించడానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి, బైబిల్లోని అమూల్యమైన సత్యాలను ఇతరులకు బోధించడానికి నాలుకను ఉపయోగించడం శ్రేష్ఠం. ఎందుకు? ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.”—యోహాను 17:3; మత్తయి 24:14; 28:19, 20.