కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

క్రైస్తవ పిల్లలకు సరైన శిక్షణనిస్తే వారు యెహోవా మార్గం నుండి తొలగిపోరని సామెతలు 22:6 హామీనిస్తోందా?

ఆ వచనం ఇలా చెబుతోంది: “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” మొక్క చిన్నగా ఉన్నప్పుడే దానికి ఊతమిచ్చి తిన్నగా పెంచగలిగితే అదెలా నిటారుగా పెరుగుతుందో, అలాగే పిల్లలకు చిన్నప్పుడే సరైన రీతిలో శిక్షణనిచ్చినప్పుడు వారు పెద్దవారైన తర్వాత కూడా యెహోవా సేవలో కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులందరికీ తెలిసినట్లుగా అలాంటి శిక్షణకు సమయం, కృషి చాలా అవసరం. తమ పిల్లల్ని క్రైస్తవ శిష్యులుగా చేయాలంటే తల్లిదండ్రులు వారికి శ్రద్ధగా ఉపదేశించి, వారిని మందలించడమేకాక, ప్రోత్సహించి, క్రమశిక్షణలో పెట్టాలి, అంతేకాక తల్లిదండ్రులు మంచి మాదిరినుంచాలి. వారిలా ఎడతెగక, ప్రేమపూర్వకంగా అనేక సంవత్సరాలపాటు చేయాలి.

అయితే, ఒకవేళ పిల్లలు యెహోవా సేవనుండి తొలగిపోతే తల్లిదండ్రుల శిక్షణలో ఏదో లోపముందని దాని భావమా? కొన్ని సందర్భాల్లో, తల్లిదండ్రులు తమ పిల్లల్ని యెహోవా యొక్క శిక్షలోను, బోధలోను పెంచేందుకు పూర్తిగా కృషి చేసివుండకపోవచ్చు. (ఎఫెసీయులు 6:⁠4) అయితే, మంచి శిక్షణనిచ్చినా, పిల్లలు దేవునిపట్ల నమ్మకంగా ఉంటారని ఈ సామెత హామీనివ్వడం లేదు. తల్లిదండ్రులు తమకు ఇష్టమొచ్చినరీతిలో పిల్లలను మలచలేరు. వయోజనులకు ఉన్నట్లే పిల్లలకు కూడా స్వేచ్ఛాచిత్తం ఉంది, చివరకు వారే తమ జీవన విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 30:​15, 16, 19) తల్లిదండ్రులు ఎంత కృషిచేసినా కొంతమంది పిల్లలు అవిశ్వాసులుగా మారతారు, మనం పరిశీలిస్తున్న ఈ వచనాన్ని వ్రాసిన సొలొమోను విషయంలో కూడా అదే జరిగింది. యెహోవా కుమారుల్లో కూడా కొందరు అవిశ్వాసులుగా మారారు.

కాబట్టి అన్ని సందర్భాల్లోనూ పిల్లలు “దానినుండి తొలగిపో[రు]” అని కాదుగానీ వారు యెహోవా మార్గంలో నిలిచి ఉండే అవకాశాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయనేది ఆ లేఖన భావం. ఈ మాటలు తల్లిదండ్రులకు ఎంత ప్రోత్సాహాన్నిస్తాయో కదా! తల్లిదండ్రులు తమ పిల్లలను యెహోవా మార్గంలో పెంచడానికి చేసే కృషి సత్ఫలితాలనిస్తుందని తెలుసుకుని, ఎంతో ప్రోత్సాహాన్ని పొందవచ్చు. తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది, అంతేకాక తమ పిల్లలను వారే ఎక్కువగా ప్రభావితం చేస్తారు కాబట్టి వారు తమ పాత్రను శ్రద్ధగా నిర్వర్తించాలని ప్రోత్సహించబడుతున్నారు.​—⁠ద్వితీయోపదేశకాండము 6:​6, 7.

తమ పిల్లలకు శ్రద్ధగా శిక్షణనిచ్చిన తల్లిదండ్రులు, తమ పిల్లలు యెహోవా సేవనుండి తొలగిపోయినా చివరకు వారు తమ తప్పును తెలుసుకుంటారన్న నిరీక్షణతో ఉండవచ్చు. బైబిలు సత్యం శక్తివంతమైనది కాబట్టి, పిల్లలు తల్లిదండ్రుల నుండి పొందిన శిక్షణను అంత త్వరగా మర్చిపోరు.​—⁠కీర్తన 19:⁠7.