మా పరిచర్యను నెరవేర్చాలనే దృఢనిశ్చయాన్ని కనబరిచాం
జీవిత కథ
మా పరిచర్యను నెరవేర్చాలనే దృఢనిశ్చయాన్ని కనబరిచాం
లీనా డావాసన్ చెప్పినది
“నా కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. నాకేమీ కనిపించడంలేదు” అని మా విమాన పైలట్ అస్పష్టమైన స్వరంతో చెప్పాడు. కొద్ది క్షణాల్లోనే మేమున్న చిన్న విమానంలోని కంట్రోల్స్‌మీద ఆయన పట్టు కోల్పోయి, స్పృహతప్పి తన సీటులోనే వాలిపోయాడు. విమానాన్ని ఎలా నడిపించాలో మావారికి తెలియదు కాబట్టి, ఆయనను లేపడానికి చాలా ప్రయత్నించారు. మేము తృటిలో మరణాన్ని ఎలా తప్పించుకున్నామో వివరించే ముందు భూమ్మీదున్న మారుమూల ప్రాంతాల్లో ఒకటైన పాపువా న్యూ గినీకి విమానంలో వెళ్ళేందుకు దారితీసిన పరిస్థితులను నన్ను వివరించనివ్వండి.
నే ను ఆస్ట్రేలియాలో 1929లో జన్మించాను, న్యూ సౌత్ వేల్స్ రాజధానియైన సిడ్నీలో పెరిగాను. మా నాన్నగారైన బిల్ మస్కట్ అప్పట్లో కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు, కానీ వింతేమిటంటే ఆయన దేవుణ్ణి నమ్మేవాడు. యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయానికి చెందిన జోసెఫ్ ఎఫ్. రూథర్‌ఫర్డ్, సిడ్నీ టౌన్ హాల్‌లో ప్రసంగించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దేశవ్యాప్త విజ్ఞాపన పత్రంమీద సంతకం చేసేందుకు 1938లో మానాన్న కూడా అంగీకరించాడు.
“ఆయనకు ఏదో ప్రాముఖ్యమైన సందేశం తెలిసివుండవచ్చు” అని అప్పుడు మా నాన్న మాతో అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మేము ఆ సందేశంలోని ప్రాముఖ్యమైన అంశాలను తెలుసుకున్నాం. మా నాన్న బైబిలును చర్చించడానికి యెహోవాసాక్షుల పూర్తికాల పయినీరు ప్రచారకుడైన నార్మన్ బెలోటీని మా ఇంటికి ఆహ్వానించారు. మా కుటుంబం వెంటనే బైబిలు సత్యాన్ని అంగీకరించి అనతికాలంలో క్రైస్తవ పరిచర్యలో ఎంతో చురుకుగా పాల్గొంది.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మకు చేయూతనివ్వడానికి నేను 1940ల మధ్య భాగంలో స్కూలుకెళ్లడం మానేశాను. జీవనోపాధి కోసం బట్టలు కూడా కుట్టేదాన్ని. శనివారం రాత్రులు మా అక్క రోస్, నేను కొంతమంది పయినీర్లతో కలిసి సిడ్నీ టౌన్ హాల్ బయట వీధి సాక్ష్యమిచ్చేవాళ్లం. మా అన్నయ్య జాన్ అమెరికాలోని గిలియడ్ మిషనరీ పాఠశాల నుండి 1952లో పట్టభద్రుడయ్యాడు, ఆ తర్వాత ఆయన పాకిస్థాన్‌లో సేవచేసేందుకు నియమించబడ్డాడు. నాకు కూడా పరిచర్య అంటే ఎంతో ఇష్టం, అందువల్ల నేను ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనుకున్నాను. కాబట్టి, తర్వాతి సంవత్సరం నేను క్రమ పయినీరు సేవ చేపట్టాను.
వివాహం, మిషనరీ సేవ
కొంతకాలం తర్వాత నేను యెహోవాసాక్షుల ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయంలో పనిచేసిన జాన్ డావాసన్‌ను కలుసుకున్నాను. ఆయన వినయం, తిరుగులేని దృఢనిశ్చయం, నైతిక బలం నన్ను ఆకట్టుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన క్రైస్తవ తటస్థతను కనబరిచినందుకు మూడుసార్లు జైల్లో వేయబడ్డాడు. క్రైస్తవ పరిచర్యలో పాల్గొనడాన్ని మా జీవిత లక్ష్యంగా చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం.
మా వివాహం 1955 జూన్‌లో జరిగింది. సంచారగృహంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మేమొక బస్సు కొన్నాం. దాని ఆధారంగా ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాల్లో ప్రకటించాలన్నదే మా లక్ష్యం. తర్వాతి ఏడాది, ఆస్ట్రేలియాకు ఉత్తరాన ఉన్న పెద్ద ద్వీపంలోని ఈశాన్య భాగమైన న్యూ గినీకి తరలివెళ్లాల్సిందిగా సాక్షులకు పిలుపు అందింది. * అప్పటికి ప్రపంచంలోని ఆ భాగంలో రాజ్య సువార్త ప్రకటించబడలేదు. మేము వెంటనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చాం.
ఆ కాలంలో న్యూ గినీలోకి ప్రవేశించాలంటే మొదట అక్కడ పూర్తికాల ఉద్యోగ ఒప్పందం కుదుర్చుకోవాలి, అందుకే జాన్ ఉద్యోగవేటలో పడ్డాడు. న్యూ గినీలో భాగంగా ఉన్న అతి చిన్న ద్వీపమైన న్యూ బ్రిటన్‌లోని రంపపు మిల్లులో పనిచేసే ఒప్పందం ఆయనకు వెంటనే లభించింది. ఎన్నో వారాల తర్వాత మేము మా క్రొత్త నియామకంలో పనిచేసేందుకు బయలుదేరి 1956 జూలైలో న్యూ బ్రిటన్‌లోని రాబౌల్‌కు చేరుకున్నాం. వాటర్‌ఫాల్ బేకు తీసుకెళ్లే పడవ కోసం మేమక్కడ ఆరు రోజులు నిరీక్షించాం.
వాటర్‌ఫాల్ బేలో మా పరిచర్య
మేము ఎన్నో రోజుల కష్టభరితమైన ప్రయాణం తర్వాత వాటర్‌ఫాల్ బేకు చేరుకున్నాం, అది రాబౌల్‌కు దక్షిణాన 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద సముద్రశాఖ. అక్కడ అడవి మధ్యలో చదును చేయబడిన భూభాగంలో ఒక పెద్ద రంపపు మిల్లు ఉంది. ఆ రోజు సాయంత్రం, పనివాళ్ళందరూ భోజనబల్ల చుట్టూ కూర్చొని ఉన్నప్పుడు మేనేజర్ ఇలా అన్నాడు, “డావాసన్‌గారు, మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ కంపెనీ రూలేమిటంటే ఉద్యోగస్థులందరూ తాము ఏ మతానికి చెందినవారో చెప్పాలి.”
అలాంటి రూలంటూ ఏదీ లేదని మాకు ఖచ్చితంగా తెలుసు, అయితే మేము పొగత్రాగడానికి నిరాకరించాం కాబట్టి, వారికి మామీద అనుమానం వచ్చివుండవచ్చు. ఏదేమైనా జాన్ ఇలా జవాబిచ్చాడు, “మేము యెహోవాసాక్షులం.” ఆ తర్వాత అసంబద్ధమైన నిశ్శబ్దం చోటుచేసుకుంది. అక్కడి పనివాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికులు, యుద్ధ సమయంలో సాక్షులు తటస్థ వైఖరిని కనబరిచారు కాబట్టి, వారికి సాక్షులంటే ఇష్టంలేదు. అప్పటినుండి అక్కడ పనిచేస్తున్నవారు మాకు కష్టాలు కలుగజేయాలని శతవిధాల ప్రయత్నించారు.
మొదటిగా, మాకు ఫ్రిజ్, స్టవ్ వంటివి కంపెనీవాళ్ళే ఇవ్వాలి గానీ మేనేజరు వాటిని ఇవ్వనన్నాడు. అందువల్ల దాచిపెట్టుకోవాల్సిన ఆహారం పాడైపోయేది కాబట్టి మాకు అడవిలో దొరికిన పాడైన స్టవ్‌ను ఉపయోగించి ఎప్పటికప్పుడు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తాజా పండ్లను, కూరగాయలను మాకు అమ్మకూడదని స్థానిక పల్లెవాసులమీద ఆంక్షలు విధించడంతో మాకు దొరికే కూరగాయలతోనే ఎలాగోలా నెట్టుకొచ్చాం. మమ్మల్ని గూఢచారులని కూడా ముద్రవేసి మేము ఎవరికైనా బైబిలును బోధిస్తున్నామేమో కనుగొనడానికి మమ్మల్ని జాగ్రత్తగా గమనించేవారు. ఆ తర్వాత నాకు మలేరియా కూడా సోకింది.
అయినా, మా పరిచర్యను నెరవేర్చాలనే దృఢనిశ్చయాన్ని కనబరిచాం. కాబట్టి, దేశభాషయైన మెలనేషియన్ పిడ్జిన్‌ను మాకు నేర్పించమని మిల్లులో పనిచేసే స్థానికులైన ఇద్దరు యువకులను కోరాం, వారు ఇంగ్లీషులో మాట్లాడేవారు. దానికి బదులుగా మేము వారికి బైబిలు నేర్పించాం. వారాంతాల్లో మేము “ప్రకృతి అందాలను వీక్షించే” యాత్రలు చేయడానికి ఎంతో దూరం ప్రయాణం చేసేవాళ్లం. మార్గమధ్యంలో మాకు తారసపడే పల్లెవాసులకు నేర్పుతో ప్రకటించేవాళ్లం, మా బైబిలు విద్యార్థులు అనువాదకులుగా పనిచేసేవారు. వేగంగా ప్రవహిస్తున్న నదులను, నదీ తీరాల్లో ఎండలో పడుకున్న పెద్దపెద్ద మొసళ్లను దాటుకుంటూ వెళ్లేవాళ్లం. ఒకసారి మేము వెంట్రుక వాసిలో వాటి దాడిని తప్పించుకున్నాం, ఆ ఒక్క సంఘటన తప్పించి భయానకమైన ఆ క్రూర జంతువులు ఏనాడూ మా జోలికిరాలేదు.
బోధించే ఉపకరణాలను తయారుచేయడం
మా పరిచర్య విస్తరించినప్పుడు, ఆసక్తిగలవారికి పంచిపెట్టేందుకు సులభమైన బైబిలు సందేశాలను టైప్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. వాటిలో మొదటివాటిని అనువదించడానికి మిల్లులో ఉన్న మా బైబిలు విద్యార్థులు సహాయం చేశారు. మేము అనేక రాత్రులు వందలాది కరపత్రాలను టైప్ చేస్తూ గడిపాం, ఆ తర్వాత వాటిని పల్లెవాసులకు, పడవలో పనిచేసే బాటసారులకు ఇచ్చాం.
1957లో అనుభవజ్ఞుడైన ప్రయాణకాపరి, జాన్ కట్ఫోర్త్ మమ్మల్ని సందర్శించి, ప్రోత్సహించాడు. * చిత్రాలను ఉపయోగిస్తూ నిరక్షరాస్యులకు బైబిలు సత్యాలను సమర్థంగా బోధించవచ్చనే సలహా ఇచ్చాడు. ప్రాథమిక బైబిలు బోధలను బోధించడానికి ఆయన, మావారు కొన్ని సులభమైన చిత్రాలను, లేక గీతలతో వేసిన బొమ్మలను రూపొందించారు. ఆ తర్వాత చిత్రాలతో ఉన్న ఆ ప్రసంగాలను పాఠశాల నోటుపుస్తకాల్లో కాపీ చేయడానికి ఎన్నో గంటలు వెచ్చించాం. ప్రతీ బైబిలు విద్యార్థికి ఒక కాపీ ఇచ్చాం, ఆ విద్యార్థి ఇతరులకు ప్రకటించడానికి దానిని ఉపయోగించేవాడు. ఈ బోధనా పద్ధతి చివరకు దేశవ్యాప్తంగా ఉపయోగించబడింది.
రెండున్నర సంవత్సరాల తర్వాత వాటర్‌ఫాల్ బేలో మా పనికి సంబంధించిన ఒప్పందం పూర్తైంది, ఆ దేశంలో ఉండేందుకు మాకు అనుమతి లభించింది. కాబట్టి ప్రత్యేక పయినీరు పరిచర్యను చేపట్టడానికి మాకు లభించిన ఆహ్వానాన్ని మేము స్వీకరించాం.
తిరిగి రాబౌల్‌కు
మేము ఉత్తర దిశలో రాబౌల్‌కు ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రిపూట మా పడవ వైడ్ బేలో ఉన్న కొబ్బరి, కోకోగింజల తోట దగ్గర ఆగింది. తోటపనిని ఆపేసి ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాలనుకున్న ఆ తోట యజమానులైన వృద్ధ
దంపతులు తోట నిర్వహణా పనిని జాన్‌కు అప్పగిస్తామని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన ఎంతో ఆకర్షణీయంగా ఉంది, అయితే మేము ఆ రాత్రి దాని గురించి చర్చించి న్యూ గినీకి వస్తు సంపదలు సంపాదించుకోవడానికి రాలేదనే ఏకాభిప్రాయానికి వచ్చాం. మేము పయినీర్లుగా మా పరిచర్యను నెరవేర్చాలనే దృఢనిశ్చయాన్ని కనబరిచాం. కాబట్టి, మరుసటి రోజు మేము మా నిర్ణయాన్ని ఆ దంపతులకు తెలియజేసి తిరిగి పడవ ఎక్కాం.మేము రాబౌల్‌కు చేరుకున్న తర్వాత, ఇతర దేశాల నుండి ఆ ప్రాంతానికి తరలివచ్చిన సాక్షుల చిన్న గుంపుతో కలిసి సేవచేశాం. రాజ్య సందేశంపట్ల స్థానికులు ఎంతో ఆసక్తి కనబరిచారు, మేము అనేక బైబిలు అధ్యయనాలను ప్రారంభించాం. ఆ సమయంలో మేము అద్దెకు తీసుకున్న స్థానిక హాల్‌లో క్రైస్తవ కూటాలను జరుపుకున్నాం, వాటికి దాదాపు 150 మంది హాజరయ్యేవారు. వారిలో చాలామంది సత్యాన్ని స్వీకరించి దేశంలోని ఇతర ప్రాంతాల్లో దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో దోహదపడ్డారు.—మత్తయి 24:14.
మేము రాబౌల్‌కు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉనబాల్ అనే పల్లెకు కూడా వెళ్లాం, అక్కడ కొంతమంది బైబిలు సత్యంపట్ల ఎంతో ఆసక్తిని కనబరిచారు. అనతికాలంలో, వారు పలుకుబడివున్న ఒక స్థానిక క్యాథలిక్ వ్యక్తి దృష్టిలో పడ్డారు. ఆయన తన చర్చి అనుయాయుల గుంపుతో వచ్చి మా వారపు బైబిలు అధ్యయనానికి భంగం కలుగజేసి మమ్మల్ని ఆ పల్లె నుండి వెళ్లగొట్టాడు. ఆ తర్వాతి వారం మరింత సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని మేము తెలుసుకున్నప్పుడు మాతోపాటు రమ్మని పోలీసులను కోరాం.
ఆ రోజు గేలీ చేస్తున్న క్యాథలిక్కులు రోడ్డుకు ఇరుప్రక్కల చాలా కిలోమీటర్లవరకు బారులుతీరి ఉన్నారు. చాలామంది మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో ఒక ఫాదిరీ ఆ గ్రామం దగ్గర వేలాదిమంది గిరిజనుల్ని సమావేశపరిచాడు. కూటాలు జరుపుకునే హక్కు మాకుందనే భరోసా పోలీసులు మాకిచ్చారు కాబట్టి, ఆ గుంపు మధ్య నుండి వెళ్లేందుకు వారు మాకు మార్గం సుగమం చేశారు. అయితే మేము కూటాన్ని ప్రారంభించిన వెంటనే ఆ ఫాదిరీ ఆ అల్లరిమూకను మామీదికి ఉసిగొల్పాడు. పోలీసులు ఆ అల్లరిమూకను అదుపుచేయలేకపోయారు కాబట్టి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాల్సిందిగా పోలీసు అధికారి మమ్మల్ని కోరి, వెంటనే మా కారు దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్లారు.
ఆ గుంపు మా చుట్టూ చేరి శాపనార్థాలు పెట్టారు, ఉమ్మేశారు, పిడికిలి బిగించి కోపంతో ఊగిపోయారు, ఆ ఫాదిరి చేతులు కట్టుకొని, నవ్వుతూ ఇదంతా గమనిస్తూ నిలబడ్డాడు. తాను అంతటి ఘోరమైన పరిస్థితిని ఇంతవరకు ఎన్నడూ చూడలేదని మేము తప్పించుకున్న తర్వాత పోలీసు అధికారి మాతో చెప్పాడు. ఉనబాల్‌లో ఉన్న చాలామంది ఆ అల్లరిమూక దౌర్జన్యానికి భయపడి రాజ్య సత్యాన్ని స్వీకరించకపోయినా, ఒక బైబిలు విద్యార్థి మాత్రం ధైర్యంగా రాజ్య సత్యాన్ని స్వీకరించాడు. అప్పటినుండి న్యూ బ్రిటన్ అంతటా వందలాది మంది సత్యాన్ని స్వీకరించారు.
న్యూ గినీలో అవకాశాలు ఏర్పడ్డాయి
1960 నవంబరులో మేము ప్రధాన ద్వీపమైన న్యూ గినీ ఉత్తర తీరాన ఉన్న మడాంగ్ అనే పెద్ద పట్టణంలో సేవచేసే నియామకం పొందాం. అక్కడ మాకు పూర్తికాల ఉద్యోగవకాశాలు ఎన్నో లభించాయి. ఒక కంపెనీ తమ బట్టల స్టోరును చూసుకోమని నన్ను కోరింది. మరో కంపెనీ బట్టలకు ఆల్టరేషన్స్ చేయమని నన్ను కోరింది. నేను సొంతగా టైలరింగ్ షాప్ ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం చేయడానికి కూడా వలస వచ్చిన కొంతమంది మహిళలు ముందుకువచ్చారు. మేము మా లక్ష్యాలను గుర్తుంచుకొని వాటిని, మరితర ప్రతిపాదనలను గౌరవపూర్వకంగా తిరస్కరించాం.—2 తిమోతి 2:4.
మడాంగ్ క్షేత్రంలో మంచి ఫలితాలు వచ్చాయి, కొంతకాలానికి అక్కడ వర్ధిల్లే ఒక సంఘం ఏర్పడింది. మేము మారుమూల గ్రామాల్లో ప్రకటించడానికి ఎన్నోరోజులపాటు సాగే యాత్రలు చేసేవాళ్ళం, మేము ఆ గ్రామాలకు కాలినడకన వెళ్లేవాళ్ళం లేక మోటారుసైకిల్‌మీద వెళ్లేవాళ్ళం. మార్గ మధ్యంలో ఉన్న విడిచిపెట్టబడిన గుడిసెల్లో అడవిప్రాంతం నుండి కోసిన గడ్డిని పరచి వాటిమీద నిద్రించేవాళ్లం. క్యాన్డ్ ఆహారం, రస్క్‌లతోపాటు, దోమ తెర వంటి వాటినే మాతోపాటు తీసుకెళ్లేవాళ్ళం.
మేము చేసిన ఒక యాత్రలో మడాంగ్‌కు ఉత్తరాన దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో టాలిడిగ్ అనే గ్రామంలో మేము ఆసక్తిగల కొంతమందిని కలుసుకున్నాం. వారు ఆధ్యాత్మిక
ప్రగతి సాధిస్తున్నప్పుడు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సార్వజనిక స్థలంలో బైబిలు అధ్యయనం చేయకూడదని వారిమీద ఆంక్షలు పెట్టాడు. ఆ తర్వాత వారి ఇళ్లను నాశనం చేసి అడవి ప్రాంతంలోకి వారిని వెళ్లగొట్టేలా అతడు పోలీసులను ఉసిగొల్పాడు. అయితే పొరుగుననున్న ఒక నాయకుడు తన స్థలంలో వారికి ఆశ్రయం కల్పించాడు. కొంతకాలానికి దయగల ఆ నాయకుడు బైబిలు సత్యాన్ని అంగీకరించాడు, ఆ ప్రాంతంలో ఆధునిక రాజ్య మందిరం నిర్మించబడింది.అనువాదం, ప్రయాణపని
న్యూ బ్రిటన్‌కి వచ్చి కేవలం రెండేళ్లు గడచిన తర్వాత, 1956లో వివిధ బైబిలు ప్రచురణలను మెలనేషియన్ పిడ్జిన్‌లోకి అనువదించడానికి మేమిద్దరం ఆహ్వానించబడ్డాం. ఆ పని ఎన్నో ఏళ్లు కొనసాగింది. ఆ తర్వాత 1970లో పాపువా న్యూ గినీ రాజధాని అయిన పోర్ట్ మోర్సిబిలోని బ్రాంచి కార్యాలయంలో పూర్తికాల అనువాదకులుగా పనిచేయడానికి మేము ఆహ్వానించబడ్డాం. మేమక్కడ భాషా తరగతులను కూడా నిర్వహించాం.
1975లో మేము ప్రయాణ పరిచర్యలో సేవచేయడానికి న్యూ బ్రిటన్‌కు తిరిగివచ్చాం. ఆ తర్వాతి 13 ఏళ్లు మేము ఆ దేశంలోని దాదాపు అన్ని భాగాలకు విమానయానం చేశాం, పడవ ప్రయాణం చేశాం, వాహనాల్లో ప్రయాణించాం లేక నడిచివెళ్లాం. ఈ ఆర్టికల్ ప్రారంభంలో వివరించబడిన సంఘటనతోపాటు మేము అనేకసార్లు మార్గమధ్యంలో వెంట్రుకవాసిలో ప్రమాదాలను తప్పించుకున్నాం. ఆ సందర్భంలో, మేము న్యూ బ్రిటన్‌లోని కాండ్రియన్ రన్‌వే దగ్గరకు సమీపిస్తున్నప్పుడు మా పైలట్ తీవ్ర గ్యాస్ట్రైటీస్ (జీర్ణాశయ శోథము) కారణంగా స్పృహకోల్పోయాడు. ఆటోపైలెట్ లేదా ఆటోమేటిక్ సాంకేతిక విధానంవల్ల ఆ విమానం నిస్సహాయంగా అడవిమీద ఆకాశంలో చెక్కర్లు కొడుతున్నప్పుడు మావారు స్పృహ తప్పిన పైలెట్‌ను లేపడానికి చాలా ప్రయత్నించారు. చివరకు, ఆయన స్పృహలోకి వచ్చాడు, ఆయన ప్రయాసపడి విమానాన్ని క్రిందికి దింపాడు. ఆ తర్వాత మళ్లీ స్పృహ కోల్పోయాడు.
సేవచేసేందుకు లభించిన మరో అవకాశం
1988లో బ్రాంచిలో అనువాదకుల అవసరం పెరిగినప్పుడు పోర్ట్ మోర్సిబిలో సేవచేసే నియామకం మాకు మళ్లీ లభించింది. బ్రాంచిలో ఉన్న దాదాపు 50 మందిమి ఒక కుటుంబంగా మెలుగుతూ పనిచేశాం, మేమక్కడ క్రొత్త అనువాదకులకు శిక్షణ కూడా ఇచ్చాం. మేమందరం ఒక రూము మాత్రమే ఉన్న అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్ళం. కుటుంబ సభ్యులు, సందర్శకులు మా గదికి వచ్చి మాతో పరిచయం పెంచుకునే విధంగా తలుపును కొద్దిగా తెరచి ఉంచాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. అలా మేము మా కుటుంబంతో ఎంతో సన్నిహితులవడమే కాక, మేము ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమను కనబరుస్తూ, ఒకరికొకరం ఆసరాగా నిలవగలిగాం.
ఆ తర్వాత మావారు 1993లో గుండెపోటుతో మరణించారు. నాలో ఒక భాగం మరణించిందా అన్నట్లు నాకు అనిపించింది. మేము దంపతులుగా 38 ఏళ్లు గడిపాం, ఆ సమయమంతా మేము పరిచర్యలోనే కలిసి గడిపాం. అయినప్పటికీ యెహోవా బలంతో ఆయన సేవలో కొనసాగాలనే దృఢనిశ్చయాన్ని నేను కనబరిచాను. (2 కొరింథీయులు 4:7) నా అపార్ట్‌మెంట్ తలుపు తెరిచి ఉంచేదాన్ని, యౌవనస్థులు నన్ను చూడడానికి వచ్చేవారు. ఆశావహ దృక్పథాన్ని కనబరచడానికి అలాంటి మంచి సహవాసం నాకు సహాయం చేసింది.
నా ఆరోగ్యం క్షీణించడంతో నేను 2003లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలోవున్న బ్రాంచి కార్యాలయంలో సేవచేసే నియామకం పొందాను. ఇప్పుడు 77 ఏళ్ల వయసులో నేను ఇంకా పూర్తికాల అనువాదకురాలిగా పనిచేస్తూ ప్రకటనా పనిలో కూడా చురుకుగా పాల్గొంటున్నాను. నా స్నేహితులు, ఆధ్యాత్మిక పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు నాకు ఎల్లప్పుడూ ఆనందం కలుగజేస్తారు.
ఇప్పటికీ బెతెల్‌లోని నా గది తలుపు తెరిచే ఉంటుంది, నన్ను చూడడానికి అతిథులు దాదాపు ప్రతీరోజు వస్తుంటారు. నిజానికి, నా తలుపు మూసివుంటే నాకు ఏమైందో చూడడానికి వారు సాధారణంగా తలుపుతడతారు. నేను నా తుదిశ్వాస విడిచేంతవరకు నా పరిచర్యను నెరవేరుస్తూ నా దేవుడైన యెహోవాను సేవించాలనే దృఢనిశ్చయంతో ఉంటాను.—2 తిమోతి 4:5.
[అధస్సూచీలు]
^ పేరా 10 ఆ కాలంలో ఆ ద్వీపంలోని తూర్పుభాగం రెండు భాగాలుగా విభజించబడింది, దక్షిణ భాగాన్ని పాపువా అనీ, ఉత్తర భాగాన్ని న్యూ గినీ అని పిలిచేవారు. నేడు ఇండోనేషియాలో భాగంగా ఈ ద్వీపంలోని పడమటి భాగాన్ని పాపువా అని పిలుస్తారు, తూర్పుభాగాన్ని పాపువా న్యూ గినీ అని పిలుస్తారు.
^ పేరా 19 జాన్ కట్ఫోర్త్ జీవితకథ కోసం కావలికోట, (ఆంగ్లం) జూన్ 1, 1958, 333-6 పేజీలు చూడండి.
[18వ పేజీలోని మ్యాపులు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
న్యూ గినీ
ఆస్ట్రేలియా
సిడ్నీ
ఇండోనేషియా
పాపువా న్యూ గినీ
టాలిడిగ్
మడాంగ్
పోర్ట్ మోర్సిబి
న్యూ బ్రిటన్
రాబౌల్
ఉనబాల్
వైడ్ బే
వాటర్‌ఫాల్ బే
[చిత్రసౌజన్యం]
మ్యాపు, భూగోళం: NASA/Visible Earth imagery ఆధారంగా
[17వ పేజీలోని చిత్రం]
జాన్‌తో న్యూ గినీలోని లేలో 1973లో జరిగిన ఒక సమావేశంలో
[20వ పేజీలోని చిత్రం]
2002లో పాపువా న్యూ గినీ బ్రాంచిలో