కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విలాపవాక్యములు గ్రంథములోని ముఖ్యాంశాలు

విలాపవాక్యములు గ్రంథములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

విలాపవాక్యములు గ్రంథములోని ముఖ్యాంశాలు

యిర్మీయా ప్రవక్త, తాను గత 40 సంవత్సరాలుగా ప్రకటిస్తున్న తీర్పు సందేశం నెరవేరడాన్ని చూశాడు. ప్రవక్త తన ప్రియమైన నగరం నాశనం చేయబడడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఎలా భావించాడు? విలాపవాక్యములు గ్రంథ పరిచయ వాక్యాల్లో గ్రీకు సెప్టాజింట్‌ ఇలా చెబుతోంది: “యిర్మీయా యెరూషలేము విషయమై కన్నీరుమున్నీరుగా ఇలా విలపించాడు.” యెరూషలేము 18 నెలలపాటు ముట్టడివేయబడి, ఆ తర్వాత దహించివేయబడిన సంఘటన ప్రవక్త మనసులో తాజాగా ఉన్నప్పుడే, అంటే సా.శ.పూ. 607లో కూర్చబడిన విలాపవాక్యములు గ్రంథము యిర్మీయా హృదయావేదనను స్పష్టంగా వ్యక్తంచేస్తుంది. (యిర్మీయా 52:​3-5, 12-14) చరిత్రలో మరే నగరం గురించి ఇంత హృదయవిదారకమైన రీతిలో విలపించడం జరగలేదు.

విలాపవాక్యములు గ్రంథము ఐదు పద్యకవితల సమాహారం. మొదటి నాలుగు విలాపములు, లేక శోకగీతాలు; ఐదవది విన్నపం, లేదా ప్రార్థన. మొదటి నాలుగు గీతాలు అక్షరమాలానుక్రమ పద్యకావ్య రూపంలో వ్రాయబడ్డాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే వచనాలు, 22 హీబ్రూ అక్షరాల్లోని ఒక్కో అక్షరంతో ప్రారంభమౌతాయి. ఐదవ గీతంలో హీబ్రూ అక్షరాలకు సరిసమానంగా 22 వచనాలు ఉన్నప్పటికీ, అవి అక్షరక్రమానుసారంగా పొందుపర్చబడలేదు.

“నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి”

(విలాపవాక్యములు 1:1-2:​22)

“జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను? అది విధవరాలివంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచకుమార్తెయైనది ఎట్లు పన్ను చెల్లించునదైపోయెను?” యెరూషలేము విషయమై యిర్మీయా ప్రవక్త విలాపములు అలా ప్రారంభమయ్యాయి. ఈ విపత్తుకు కారణాన్ని చెబుతూ ప్రవక్త ఇలా అంటున్నాడు: “దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు.”​—⁠విలాపవాక్యములు 1:​1, 5.

పిల్లల్ని, భర్తను కోల్పోయిన విధవరాలిగా అభివర్ణించబడిన యెరూషలేము ఇలా అడుగుతుంది: “నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదా?” అది తన శత్రువుల గురించి దేవునికిలా ప్రార్థిస్తోంది: “వారు చేసిన దుష్కార్యములన్నియు నీ సన్నిధినుండును, నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను, నా మనస్సు క్రుంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటినిబట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము.”​—⁠విలాపవాక్యములు 1:​12, 22.

ఎంతో దుఃఖంతో యిర్మీయా ఇలా అంటున్నాడు: “కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు. శత్రువులుండగా తన కుడిచెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు; నఖముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు.” తన విపరీతమైన దుఃఖాన్ని వర్ణిస్తూ ప్రవక్త ఇలా విలపిస్తున్నాడు: “నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి. నా యంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది.” దారిన వెళ్తున్నవారు సహితం ఇలా అంటూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు: “పరిపూర్ణ సౌందర్యముగల పట్టణమనియు, సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరియనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి?”​—⁠విలాపవాక్యములు 2:​3, 11, 15.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:15​—⁠“కన్యకయైన యూదా కుమారిని” యెహోవా ఎలా “ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు”? కన్యకగా వర్ణించబడిన నగరాన్ని నాశనం చేయడంలో బబులోనీయులు ఎంతగా రక్తం చిందించారంటే, దాన్ని ద్రాక్షగానుగలో ద్రాక్షలను నలగగొట్టడంతో పోల్చవచ్చు. యెహోవా దీని గురించి ముందుగానే తెలియజేసి, అది జరిగేందుకు అనుమతించాడు, కాబట్టి దానిని ఆయన ‘ద్రాక్షగానుగలో వేసి త్రొక్కాడని’ చెప్పవచ్చు.

2:1​—⁠‘ఇశ్రాయేలు సౌందర్యము ఆకాశమునుండి భూమిమీదికి’ ఎలా ‘పడవేయబడింది’? ‘ఆకాశములు భూమికిపైన ఎంతో ఎత్తుగా ఉన్నాయి’ కాబట్టి, ఉన్నతపర్చబడినవి హీనపర్చబడడం అనేది కొన్నిసార్లు అవి ‘ఆకాశమునుండి భూమిమీదికి పడవేయబడడంతో’ సూచించబడుతుంది. “ఇశ్రాయేలు సౌందర్యము,” అంటే యెహోవా ఆశీర్వాదము దానిపై ఉన్నప్పుడు అది అనుభవించిన మహిమ, అధికారం, యెరూషలేము నాశనం చేయబడి, యూదా నిర్మానుష్యంగా విడువబడడంతో పడవేయబడ్డాయి.​—⁠యెషయా 55:⁠9.

2:​1, 6​—⁠యెహోవా “పాదపీఠము,” ఆయన “ఆవరణము, [‘పందిరి, NW’]” అంటే ఏమిటి? కీర్తనకర్త ఇలా పాడాడు: “ఆయన నివాసస్థలములకు పోదము రండి; ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.” (కీర్తన 132:⁠7) కాబట్టి, విలాపవాక్యములు 2:1లోని “పాదపీఠము” యెహోవా ఆరాధనా మందిరాన్ని, లేక ఆయన ఆలయాన్ని సూచిస్తుంది. “యెహోవా మందిరము,” ఒక పందిరి అన్నట్లుగా, తోటలోని గుడిసె మాత్రమే అన్నట్లుగా బబులోనీయులు దాన్ని ‘కాల్చివేశారు.’​—⁠యిర్మీయా 52:​12, 13.

2:17​—⁠యెహోవా యెరూషలేము సంబంధంగా తాను యోచించిన ఏ “కార్యము” ముగించియున్నాడు? ఇక్కడ లేవీయకాండము 26:⁠17 గురించి ప్రస్తావించబడుతున్నట్లు తెలుస్తోంది, అక్కడిలా ఉంది: “నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువులయెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.”

మనకు పాఠాలు:

1:​1-9. యెరూషలేము రాత్రియందు బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది. దాని పట్టణపు గుమ్మములన్నియు పాడైపోయెను, దాని యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకులభరితురాలాయెను. ఎందుకు? ఎందుకంటే యెరూషలేము ఘోరమైన పాపం చేసింది. దాని అపవిత్రత దాని చెంగులమీద ఉన్నది. పాపానికి ప్రతిఫలం ఆనందం కాదు; కన్నీళ్ళు, నిట్టూర్పు, దుఃఖం, విషాదం.

1:​18. తప్పిదస్థులను శిక్షించడంలో యెహోవా ఎల్లప్పుడూ న్యాయవంతుడు, నీతిమంతుడు.

2:​20. యెహోవా మాట వినకపోతే, ‘తమ కుమారుల, కుమార్తెల మాంసమును తినడంతో’ సహా, శాపాలు ఎదురౌతాయని ఇశ్రాయేలీయులు హెచ్చరించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 28:​15, 45, 53) దేవునికి అవిధేయత చూపించడం ఎంత అవివేకమో కదా!

“సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము”

(విలాపవాక్యములు 3:1-5:​22)

విలాపవాక్యములు 3వ అధ్యాయంలో, ఇశ్రాయేలు జనాంగం ‘నరునిగా’ ప్రస్తావించబడింది. కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ, ఆ నరుడు ఇలా పాడుతున్నాడు: “నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.” సత్యదేవునికి ప్రార్థిస్తూ ఆయనిలా విజ్ఞప్తి చేస్తున్నాడు: “నీవు నా శబ్దము ఆలకించితివి. సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.” శత్రువు వేసే నిందను వినమని యెహోవాను కోరుతూ ఆయనిలా అంటున్నాడు: “యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీకారము చేయుదువు.”​—⁠విలాపవాక్యములు 3:​1, 25, 56, 64.

యిర్మీయా యెరూషలేము 18 నెలలపాటు ముట్టడించబడడంవల్ల కలిగిన ఘోరమైన పర్యవసానాలపై తన భావాలను వ్యక్తంచేస్తూ ఇలా విలపిస్తున్నాడు: “నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము, ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.” యిర్మీయా ఇంకా ఇలా అంటున్నాడు: “క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించి పోయెదరు, ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.”​—⁠విలాపవాక్యములు 4:​6, 9.

ఐదవ గీతం, యెరూషలేము నివాసులు మాట్లాడుతున్నట్లుగా చూపిస్తుంది. వాళ్ళు ఇలా అంటున్నారు: “యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసికొనుము. దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.” వారు తమ బాధలను చెబుతూ, ఇలా వేడుకుంటున్నారు: “యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు. నీ సింహాసనము తరతరములుండును. యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.”​—⁠విలాపవాక్యములు 5:​1, 19, 21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:16​—⁠“రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను” అనే పదబంధం దేనిని సూచిస్తుంది? ఒక గ్రంథం ఇలా చెబుతోంది: “యూదులు, చెరగా తీసుకువెళ్ళబడుతున్నప్పుడు, నేలలో తవ్విన గుంతల్లో రొట్టెలు కాల్చుకున్నారు, కాబట్టి వాళ్ళ రొట్టెల్లో రాళ్ళు కలిశాయి.” అలాంటి రొట్టెలు తినడంవల్ల ఒక వ్యక్తి పళ్ళు విరిగిపోవచ్చు.

4:​3, 10​—⁠యిర్మీయా ‘తన జనుల కుమారిని’ “యెడారిలోని ఉష్ట్రపక్షులతో” ఎందుకు పోల్చాడు? ఉష్ట్రపక్షి “తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును” అని యోబు 39:⁠16 చెబుతోంది. ఉదాహరణకు, గుడ్లు పొదగబడిన తర్వాత, ఆడపక్షి ఇతర ఆడపక్షులతోపాటు వెళుతుంది, పిల్లల సంరక్షణా బాధ్యతను మగపక్షి తనపై వేసుకుంటుంది. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఏమి జరుగుతుంది? మగపక్షి, ఆడపక్షి రెండూ పిల్లల్ని వదిలేసి గూటి నుండి పారిపోతాయి. బబులోను ముట్టడి సమయంలో, యెరూషలేములో కరువు ఎంత తీవ్రమయ్యిందంటే, సాధారణంగా కరుణాభరితంగా ఉండే తల్లులు అడవిలోని ఉష్ట్రపక్షుల్లా తమ పిల్లలపట్ల క్రూరత్వాన్ని చూపించారు. నక్కలు ఇందుకు పూర్తి భిన్నంగా, ఎంతో మాతృప్రేమను చూపిస్తాయి.

5:7​—⁠యెహోవా, తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలకు దోషశిక్ష విధిస్తాడా? లేదు, యెహోవా, తండ్రులు చేసిన తప్పులకు పిల్లలను శిక్షించడు. ‘మనలో ప్రతి ఒక్కరం తన గురించి తాను దేవునికి లెక్క అప్పగించాలి’ అని బైబిలు చెబుతోంది. (రోమీయులు 14:​11) అయితే, తప్పులవల్ల కలిగే పర్యవసానాలు అలాగే కొనసాగుతూ తర్వాతి తరాలవారు వాటిని అనుభవించవలసి రావచ్చు. ఉదాహరణకు, ప్రాచీన ఇశ్రాయేలు విగ్రహారాధన వైపు తిరగడం, తర్వాతి కాలాల నమ్మకమైన ఇశ్రాయేలీయులు నీతిమార్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం కష్టమయ్యేలా చేసింది.​—⁠నిర్గమకాండము 20:⁠5.

మనకు పాఠాలు:

3:​8, 43, 44. యెరూషలేముపైకి విపత్తు వచ్చిన సమయంలో, నగరవాసులు సహాయం కోసం పెట్టిన మొరను వినడానికి యెహోవా నిరాకరించాడు. ఎందుకు? ఎందుకంటే ప్రజలు అవిధేయత చూపించారు, వాళ్ళు పశ్చాత్తాపం చూపించలేదు. యెహోవా మన ప్రార్థనలు వినాలంటే మనం ఆయనకు విధేయత చూపించాలి.​—⁠సామెతలు 28:⁠9.

3:​20. “సర్వలోకములో మహోన్నతుడైన” యెహోవా ఎంత ఉన్నతుడంటే ఆయన “భూమ్యాకాశములను” వంగి చూడవలసి ఉంటుంది. (కీర్తన 83:​18; 113:⁠6) అయినప్పటికీ, ప్రజలను చూడడానికి క్రిందికి వంగేందుకు, అంటే వారిని ప్రోత్సహించడానికి వారి స్థాయికి దిగేందుకు సర్వశక్తిమంతునికున్న సుముఖత గురించి యిర్మీయాకు బాగా తెలుసు. సత్యదేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞానవంతుడే కాక వినమ్రుడు కూడా అని తెలుసుకోవడం మనకెంతటి ఆనందాన్నిస్తుందో కదా!

3:​21-26, 28-33. తీవ్రమైన బాధను కూడా మనమెలా సహించవచ్చు? యిర్మీయా మనకు చెబుతున్నాడు. యెహోవా కృపగలవాడని, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేదని మనం మరచిపోకూడదు. మనం సజీవంగా ఉండడమే చాలు మనం ఆశవదులుకోకుండా ఉండడానికి తగిన కారణమనీ మనం సహనం వహించి, ఫిర్యాదు చేయకుండా, రక్షణ అనుగ్రహిస్తాడని యెహోవా కోసం మౌనంగా వేచివుండాలనీ కూడా గుర్తుంచుకోవాలి. అంతేగాక, మనం “బూడిదెలో మూతి పెట్టుకొనవలెను,” అంటే ఏది జరగడానికి దేవుడు అనుమతిస్తాడో అది సరైన కారణంతోనే ఆయన అనుమతించి ఉంటాడని గుర్తిస్తూ శ్రమ సమయంలో వినయంగా లోబడివుండాలి.

3:​27. యౌవనకాలంలో విశ్వాస పరీక్షలు ఎదుర్కోవడమంటే కష్టాలను, హేళనలను సహించడమే. కానీ “యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.” ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తి యౌవనంలో ఉన్నప్పుడే శ్రమలనే కాడి మోయడాన్ని నేర్చుకుంటే, తన జీవితంలో ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్ళతో వ్యవహరించడానికి సిద్ధమౌతాడు.

3:​39-42. మనం చేసిన పాపాలనుబట్టి బాధ అనుభవిస్తున్నప్పుడు ‘మూల్గడం’ లేక ఫిర్యాదు చేయడం జ్ఞానయుక్తం కాదు. చేసిన తప్పుకు పర్యవసానాలు అనుభవించడం గురించి ఫిర్యాదుచేసే బదులు, మన “మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.” మనం పశ్చాత్తాపపడి, మన మార్గాలను సరిచేసుకోవడం జ్ఞానయుక్తమైనది.

యెహోవాను మీ ఆశ్రయంగా చేసుకోండి

బబులోనీయులు నగరాన్ని దహించివేసి దేశాన్ని నిర్జనంగా విడిచిపెట్టినప్పుడు యెహోవా యెరూషలేమును, యూదా దేశాన్ని ఎలా దృష్టించాడో బైబిలు పుస్తకమైన విలాపవాక్యములు తెలియజేస్తోంది. పాపాన్ని అంగీకరిస్తూ అందులో నమోదు చేయబడిన వ్యక్తీకరణలు, యెహోవా దృక్కోణం నుండి, విపత్తుకు కారణం ప్రజల తప్పిదమే అని స్పష్టం చేస్తున్నాయి. ఈ పుస్తకంలోని ప్రేరేపిత గీతాల్లో యెహోవాపై నమ్మకాన్ని, తిరిగి సరైన మార్గాన్ని అనుసరించాలనే కోరికను వ్యక్తం చేసే పదాలున్నాయి. ఇవి యిర్మీయా కాలంలోని అనేకమంది మనోభావాలు కాకపోయినా, అవి యిర్మీయాకు, పశ్చాత్తప్త శేషానికి ఉన్న మనోభావాలకు ప్రతీకగావున్నాయి.

విలాపవాక్యములు గ్రంథములో వ్యక్తం చేయబడినట్లుగా, యెరూషలేము పరిస్థితి విషయంలో యెహోవా అంచనా మనకు రెండు ఆవశ్యకమైన పాఠాలను బోధిస్తుంది. మొదటిగా, యెరూషలేము నాశనం, యూదా నిర్జనంగా విడువబడడం, యెహోవాకు విధేయత చూపించాలని ప్రోత్సహిస్తూ, దైవిక చిత్తాన్ని అలక్ష్యం చేయకూడదని హెచ్చరిస్తున్నాయి. (1 కొరింథీయులు 10:​11) రెండవది, యిర్మీయా ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. (రోమీయులు 15:⁠4) ఎంతో వేదన అనుభవిస్తున్న ప్రవక్త, నిరాశాపూరిత పరిస్థితిలో కూడా రక్షణ కోసం యెహోవా వైపు చూశాడు. మనం యెహోవాపై, ఆయన వాక్యంపై పూర్తి నమ్మకం ఉంచి, ఆయనను మన ఆశ్రయంగా చేసుకోవడం ఎంత ఆవశ్యకమో కదా!​—⁠హెబ్రీయులు 4:​12.

[9వ పేజీలోని చిత్రం]

యిర్మీయా ప్రవక్త, తన తీర్పు సందేశపు నెరవేర్పును చూశాడు

[10వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ తటస్థత విషయంలో తాము వహించిన స్థానాన్నిబట్టి కొరియాకు చెందిన ఈ సాక్షుల విశ్వాసం పరీక్షించబడింది