వృద్ధాప్యంలో ఆధ్యాత్మికంగా చిగురిస్తూ ఉండడం
వృద్ధాప్యంలో ఆధ్యాత్మికంగా చిగురిస్తూ ఉండడం
‘యెహోవా మందిరములో నాటబడినవారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు.’ —కీర్తన 92:13, 15.
వృద్ధాప్యం—ఆ మాట మీకు దేనిని గుర్తుచేస్తుంది? ముడతలుపడ్డ శరీరాన్నా? వినికిడి లోపాన్నా? బలహీనపడిన కాళ్లుచేతుల్నా? లేక ప్రసంగి 12:1-7లో స్పష్టంగా వర్ణించబడిన “దుర్దినముల” మరో అంశాన్నా? అలాగైతే, ప్రసంగి 12వ అధ్యాయం, వయసు పెరగడం విషయంలో సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మొదట సంకల్పించిన దానిని కాదుగానీ, మానవ శరీరంపై ఆదాము పాపపు పర్యవసానంగా కలిగే వృద్ధాప్య సమస్యల్ని వర్ణిస్తోందని గుర్తుంచుకోవడం ప్రాముఖ్యం.—రోమీయులు 5:12.
2 వయసు పెరగడం అనే ప్రక్రియ ఒక శాపం కాదు, ఎందుకంటే ఉనికిలో కొనసాగేందుకు సంవత్సరాలు గడుస్తూ ఉండాలి. వాస్తవానికి, పెరగడం, పరిణతి సాధించడమనేవి సమస్త జీవుల్లో కోరదగిన లక్షణాలు. చుట్టూ మనం చూస్తున్న పాపం, అపరిపూర్ణతలవల్ల గత ఆరువేల సంవత్సరాలుగా కలిగిన నష్టమంతా త్వరలోనే తీసివేయబడి, విధేయతగల మానవులు వృద్ధాప్య ఇబ్బందులు, మరణం లేకుండా, మొదట ఉద్దేశించబడినట్లుగా జీవితాన్ని ఆనందిస్తారు. (ఆదికాండము 1:28; ప్రకటన 21:4, 5) ఆ సమయంలో “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” (యెషయా 33:24) వృద్ధులకు వారి “చిన్ననాటి స్థితి తిరిగి కలుగును,” వారి “మాంసము బాలుర మాంసముకన్నా ఆరోగ్యముగా నుండును.” (యోబు 33:25) అయితే ప్రస్తుతం అందరూ ఆదాము ద్వారా సంక్రమించిన పాపంతో పోరాడాలి. కానీ యెహోవా సేవకులు వృద్ధులవుతుండగా వారు ప్రత్యేక విధాలుగా ఆశీర్వదించబడతారు.
3 ‘యెహోవా మందిరములో నాటబడినవారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు’ అని దేవుని వాక్యం మనకు హామీ ఇస్తోంది. (కీర్తన 92:13, 15) దేవుని నమ్మకమైన సేవకులు శారీరకంగా బలహీనులౌతున్నా, ఆధ్యాత్మికంగా వారు ప్రగతిసాధిస్తూ, విలసిల్లుతూ, వర్ధిల్లుతూ ఉండవచ్చనే ప్రాథమిక సత్యాన్ని కీర్తనకర్త అలంకారార్థ భాషలో మాట్లాడాడు. ఈ విషయాన్ని అనేక బైబిలు కాలాల, ఆధునిక కాలాల ఉదాహరణలు ధృవీకరిస్తున్నాయి.
‘దేవాలయము విడువలేదు’
4 మొదటి శతాబ్దపు ప్రవక్త్రియైన అన్న విషయమే పరిశీలించండి. ఆమె 84 ఏళ్ల వయసులో “దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుచుండెను.” ‘ఆషేరు గోత్రికురాలైన’ అన్న తండ్రి లేవీయ కుటుంబానికి చెందినవాడుకాదు కాబట్టి, ఆమె అక్షరార్థంగా దేవాలయంలో నివసించడం కుదరదు. ప్రతీరోజు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు దేవాలయంలో ఉండాలంటే ఆమె ఎంతగా కష్టపడవలసి ఉంటుందో ఊహించండి! అయితే అన్న, తాను చూపించిన లూకా 2:22-24, 36-38; సంఖ్యాకాండము 18:6, 7.
భక్తినిబట్టి బహుగా ఆశీర్వదించబడింది. ధర్మశాస్త్రం ప్రకారం శిశువైన యేసును యెహోవాకు ప్రతిష్ఠించేందుకు యోసేపు, మరియలు ఆయనను దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడేవున్న అన్నకు ఆయనను చూసే ఆధిక్యత లభించింది. యేసును చూసినప్పుడు అన్న, “దేవుని కొనియాడి, యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.”—5 నేడు మన మధ్యవున్న చాలామంది వృద్ధులు క్రమంగా కూటాలకు హాజరవడంలో, సత్యారాధనా పురోభివృద్ధికి నిండు హృదయంతో ప్రార్థించడంలో, సువార్తను ప్రకటించేందుకు ఉత్సాహభరిత అభిలాషను ప్రదర్శించడంలో అన్నలాగే ఉన్నారు. తన భార్యతో కలిసి క్రమంగా క్రైస్తవ కూటాలకు హాజరౌతున్న ఓ 80 ఏళ్ల సహోదరుడు ఇలా అన్నాడు: “మేము కూటాలకు వెళ్లే అలవాటును పెంపొందించుకున్నాం. మేము వేరెక్కడా ఉండాలని కోరుకోం. దేవుని ప్రజలెక్కడ ఉంటారో అక్కడే మేమూ ఉండాలని కోరుకుంటాం. మాకక్కడే ప్రశాంతంగా ఉంటుంది.” అందరికీ అదెంతటి ప్రోత్సాహకరమైన మాదిరో కదా!—హెబ్రీయులు 10:24, 25.
6 “సత్యారాధనకు సంబంధించినదేదైనా ఉంటే, అందులో భాగం వహించగలిగితే నేను తప్పక అలా చేయాలని కోరుకుంటాను.” ఇది 80వ పడిలో ఉన్న క్రైస్తవ విధవరాలైన జీన్ మనోభావం. “నాకు దుఃఖకర సమయాలుంటాయి, అయితే నేను దుఃఖించేటప్పుడు నా చుట్టూవున్న వాళ్లు కూడా ఎందుకు విచారంగా ఉండాలి” అని ఆమె అంటోంది. క్షేమాభివృద్ధికరమైన ఆధ్యాత్మిక సందర్భాల నిమిత్తం ఇతర ప్రదేశాలను సందర్శించడంవల్ల కలిగే ఆనందాన్ని ఆమె మెరిసే కళ్లతో వ్యక్తపర్చింది. ఇటీవలే అలా చేసిన ప్రయాణంలో తన తోటి ప్రయాణికులతో ఆమె ఇలా అంది: “పర్యాటక ప్రదేశాలను ఇంతవరకు చూసింది చాలు; నేను క్షేత్రసేవకు వెళ్లాలనుకుంటున్నాను.” జీన్‌కు స్థానిక భాష రాకపోయినా, బైబిలు సందేశంపట్ల ప్రజల ఆసక్తిని ఆమె రేకెత్తించగల్గింది. అంతేకాక, క్రొత్త భాష నేర్చుకోవడం, కూటాలకు రానూపోనూ రెండు గంటలపాటూ ప్రయాణించాల్సివచ్చినా, చాలా సంవత్సరాలు ఆమె, సహాయం అవసరమున్న సంఘంతో కలిసి పనిచేసింది.
మనసును చురుగ్గా ఉంచుకోవడం
7 జీవితంలో కాలం గడిచేకొద్దీ అనుభవం వస్తుంది. (యోబు 12:12) అయితే మరోవైపు, ఆధ్యాత్మిక పురోగతి వయసుతోపాటు యాంత్రికంగా రాదు. అందువల్ల, కేవలం గతంలో సంపాదించుకున్న జ్ఞానసంపదపై ఆధారపడే బదులు, దేవుని యథార్థ సేవకులు సంవత్సరాలు గడిచేకొద్దీ “జ్ఞానాభివృద్ధి” చేసుకోవడానికి కృషి చేస్తారు. (సామెతలు 9:9) యెహోవా మోషేకు పని అప్పగించినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. (నిర్గమకాండము 7:7) ఆ కాలంలో ఆ వయసువరకు జీవించడం అసాధారణ విషయంగానే పరిగణించబడిందనేది స్పష్టం, ఎందుకంటే ఆయనిలా వ్రాశాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును.” (కీర్తన 90:10) అయినా, నేర్చుకునేందుకు తాను వృద్ధుడనని మోషే ఎన్నడూ తలంచలేదు. మోషే అనేక దశాబ్దాల దేవుని సేవలో, ఎన్నో ఆధిక్యతలు ఆనందిస్తూ, బరువైన బాధ్యతలను మోస్తున్నా, యెహోవాను ఇలా వేడుకున్నాడు: “దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలిసికొందును.” (నిర్గమకాండము 33:13) యెహోవాతో తన సంబంధంలో ఎదుగుతూ ఉండాలని మోషే సదా కోరుకున్నాడు.
8 ప్రవక్తయైన దానియేలు బహుశా తన 90వ పడిలో కూడా పరిశుద్ధ గ్రంథాలను జాగ్రత్తగా పరిశీలిస్తూవచ్చాడు. లేవీయకాండము, యెషయా, యిర్మీయా, హోషేయ, ఆమోసు వంటి “గ్రంథముల” నుండి చేసిన అధ్యయనంలో ఆయన గ్రహించిన విషయాలు యెహోవాకు పట్టుదలగా ప్రార్థించేందుకు ఆయనను పురికొల్పి ఉండవచ్చు. (దానియేలు 9:1, 2) తాను చేసిన ప్రార్థనకు జవాబుగా, రానైయున్న మెస్సీయకు, భవిష్యత్ సత్యారాధనకు సంబంధించిన సమాచారం ఆయనకు ఇవ్వబడింది.—దానియేలు 9:20-27.
9 మోషే, దానియేలులాగే మనం, సాధ్యమైనంత కాలం ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మన మనసును చురుగ్గా ఉంచుకోవచ్చు. మత్తయి 24:45) ఆయనిలా అంటున్నాడు: “నేను సత్యాన్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను, ఆ సత్యపు వెలుగు అంతకంతకు ఎలా తేజరిల్లుతుందో చూడడం నాకెంతో ఆనందాన్నిస్తుంది.” (సామెతలు 4:18) అదే విధంగా, 60కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తికాల సేవలో గడిపిన ఫ్రెడ్, తోటి విశ్వాసులతో బైబిలు చర్చలు ఆరంభించడం ఆధ్యాత్మిక ఉత్తేజాన్నిస్తున్నట్లు కనుగొన్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను బైబిలును నా మనసులో సజీవంగా ఉంచుకోవాలి. మీరు బైబిలును సజీవంగా అంటే అర్థవంతమైనదిగా చేసుకుంటూ, మీరు తెలుసుకుంటున్న విషయాలను ‘హితవాక్య ప్రమాణానికి’ సరిపోల్చి చూసుకోగలిగినప్పుడు, మీ దగ్గర కేవలం సమాచార విడిభాగాలు మాత్రమే ఉండవు. ఆ భాగాలు వాటివాటి స్థానాల్లో ఎలా ప్రకాశిస్తూ ఉంటాయో మీరు చూడగలరు.”—2 తిమోతి 1:13.
చాలామంది అలాగే చేస్తున్నారు. 80వ పడిలోవున్న వర్త్ అనే క్రైస్తవ పెద్ద “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని ఎప్పటికప్పుడు స్వీకరించేందుకు కృషిచేస్తున్నాడు. (10 వృద్ధులైనంత మాత్రాన క్రొత్త విషయాల్ని, క్లిష్టమైన విషయాల్ని తెలుసుకోవడం మానుకోనక్కర్లేదు. 60, 70, 80 ఏళ్ల వయసున్నవారు సహితం నిరక్షరాస్యతను అధిగమించారు, క్రొత్త భాషలు నేర్చుకున్నారు. వివిధ దేశాల్లోని ప్రజలతో సువార్త పంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు యెహోవాసాక్షులు అలా చేశారు. (మార్కు 13:10) పోర్చుగీసు క్షేత్రంలో సహాయం చేసేందుకు నిర్ణయించుకున్న సమయానికి హారీ, ఆయన భార్య 60వ పడి చివర్లో ఉన్నారు. “వృద్ధాప్యంలో ఏ పనైనా మరింత కష్టమౌతుందని మనం అంగీకరించవలసిందే” అని హారీ అంటున్నాడు. అయినాసరే, ప్రయత్నం పట్టుదలతో వారు పోర్చుగీసులో బైబిలు అధ్యయనాలు నిర్వహించగలిగారు. ఇప్పటికి చాలా సంవత్సరాలుగా, హారీ తాను నేర్చుకున్న క్రొత్త భాషలో జిల్లా సమావేశపు ప్రసంగాలు కూడా ఇస్తున్నాడు.
11 నిజమే, అలాంటి సవాళ్లను చేపట్టే ఆరోగ్యం లేదా పరిస్థితులు అందరికీ ఉండవు. అలాంటప్పుడు, కొందరు వృద్ధులు సాధించిన పనుల్ని పరిశీలించడం ఎందుకు? అందరూ ఒకే పరిమాణంలో చేసేందుకు కష్టపడాలని సూచించేందుకు మాత్రం కాదు. బదులుగా, నమ్మకమైన సంఘ పెద్దల గురించి హెబ్రీ క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఈ మాటల్లోని ఉద్దేశంతోనే: “వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” (హెబ్రీయులు 13:7) అలాంటి ఆసక్తికి సంబంధించిన ఉదాహరణలను మనం తలపోసినప్పుడు, దేవునికి తాము చేస్తున్న సేవలో ఈ వృద్ధులకు ప్రేరణనిచ్చే బలమైన విశ్వాసాన్ని అనుకరించేలా మనం ప్రోత్సహించబడవచ్చు. ఇప్పుడు 87 ఏళ్ల వృద్ధునిగావున్న హారీ తనను ప్రేరేపించేదేమిటో వివరిస్తూ ఇలా చెబుతున్నాడు: “నా శేషజీవితాన్ని జ్ఞానయుక్తంగా గడుపుతూ యెహోవా సేవలో సాధ్యమైనంత ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాను.” ముందు పేర్కొన్న ఫ్రెడ్, తన బెతెల్ నియామకంపట్ల శ్రద్ధ వహించడంలో ఎంతో సంతృప్తిని పొందుతున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “యెహోవాను అత్యంత ఉత్తమంగా సేవిస్తూ, ఆ జీవన విధానంలోనే ఎలా కొనసాగవచ్చో మీరు తెలుసుకోవాలి.”
పరిస్థితులు మారుతున్నా దైవభక్తితో ఉండడం
12 శారీరక మార్పులను అంగీకరిస్తూ, వాటితో వ్యవహరించడం కష్టంగా ఉండగలదు. అయితే అలాంటి 2 సమూయేలు 17:27-29; 19:31-40.
మార్పులు చోటుచేసుకున్నా దైవభక్తిని ప్రదర్శించడం సాధ్యమే. ఈ విషయంలో గిలాదీయుడైన బర్జిల్లయి చక్కని మాదిరినుంచాడు. అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, ఆయన తన 80 ఏళ్ల వయసులో దావీదుకు, ఆయన సైన్యానికి ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఏర్పాటుచేసి అసాధారణ రీతిలో ఆతిథ్యమిచ్చాడు. దావీదు యెరూషలేముకు తిరిగివెళ్తున్న సమయంలో, బర్జిల్లయి వారితోకూడా యొర్దాను నదివరకు వెళ్లాడు. దావీదు తన రాజసభలో ఉండేందుకు రమ్మని బర్జిల్లయిని అడిగాడు. దానికి బర్జిల్లయి ఎలా స్పందించాడు? “నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. . . . అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? . . . నీ దాసుడగు కింహాము నా యేలినవాడవును రాజవునగు నీతో కూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుము.”—13 తన పరిస్థితులు మారినప్పటికీ, బర్జిల్లయి యెహోవా నియమిత రాజుకు మద్దతిచ్చేందుకు తాను చేయగలిగింది చేశాడు. ఒకప్పటిలా తనకు రుచి తెలియదని, వినికిడి మందగించిందని ఆయన గుర్తించినప్పటికీ, ఆయన వాటినిబట్టి బాధపడలేదు. బదులుగా, బర్జిల్లయి తనకు చేయాలనుకున్న మేలు కింహాముకు చేయాలని నిస్వార్థంగా సిఫారసు చేయడంలో తన హృదయమెలాంటిదో వెల్లడించాడు. బర్జిల్లయిలాగే వృద్ధులైన చాలామంది నేడు నిస్వార్థమైన, ఔదార్యపూరితమైన స్ఫూర్తిని కనబరుస్తున్నారు. సత్యారాధనకు మద్దతిచ్చేందుకు తాము చేయగలిగింది చేస్తున్నారు, “అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని వారికి తెలుసు. మనమధ్య భక్తిపరులు ఉండడమెంత ఆశీర్వాదకరమో కదా!—హెబ్రీయులు 13:16.
14 కాలప్రవాహంలో దావీదు పరిస్థితులు అనేకమార్లు మారినప్పటికీ, యెహోవాకు తన యథార్థ సేవకులపట్లవున్న శ్రద్ధ ఎన్నటికీ మారదని ఆయన బలంగా విశ్వసించాడు. తన జీవిత చరమాంకంలో ఆయన, నేడు 37వ కీర్తనగా అందరికీ తెలిసిన గీతాన్ని కూర్చాడు. దావీదు గతాన్ని నెమరువేసుకుంటూ సితార పట్టుకుని ఈ మాటలను ఆలపించడం ఒక్కసారి ఊహించండి: “ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. నేను చిన్నవాడనైయుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు.” (కీర్తన 37:23-25) ఈ ప్రేరేపిత కీర్తనలో దావీదు వయసు గురించి ప్రస్తావించబడడం యుక్తమని యెహోవా చూశాడు. నిండు హృదయంతో పలికిన ఆ మాటలకు అది ఎంతటి అర్థాన్ని చేకూరుస్తుందో కదా!
15 పరిస్థితులు మారి, వృద్ధుడైనా నమ్మకంగా ఉండడంలో అపొస్తలుడైన యోహాను మరో చక్కని మాదిరిగా ఉన్నాడు. యోహాను దాదాపు 70 సంవత్సరాలపాటు దేవుని సేవ చేసిన తర్వాత, “దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును” పత్మాసు ద్వీపానికి బంధీగా పంపబడ్డాడు. (ప్రకటన 1:9) అయినప్పటికీ ఆయన పని పూర్తికాలేదు. నిజానికి బైబిల్లో యోహాను వ్రాసినవన్నీ ఆయన తన జీవితపు చివరి సంవత్సరాల్లోనే వ్రాశాడు. పత్మాసులో ఉన్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు కలిగించే ప్రకటన దర్శనం ఆయనకివ్వబడింది, ఆయన దానిని జాగ్రత్తగా వ్రాసిపెట్టాడు. (ప్రకటన 1:1, 2) రోమా చక్రవర్తి నెర్వా పరిపాలనలో ఆయన చెరనుండి విడుదల చేయబడ్డాడని సాధారణంగా తలంచబడుతోంది. ఆ తర్వాత, ఆయన దాదాపు సా.శ. 98లో బహుశా 90 లేదా 100 ఏళ్ల వయసులో యోహాను తన పేరుతో ఉన్న సువార్తను, మూడు పత్రికలను వ్రాశాడు.
తిరుగులేని సహనాన్ని ప్రదర్శించారు
16 అశక్తతలు అనేక రూపాల్లో, వివిధ స్థాయిల్లో రావచ్చు. ఉదాహరణకు, కొందరు సంభాషించగల తమ సామర్థ్యంలో సహితం అశక్తులయ్యారు. అయినప్పటికీ వారు దేవుని ప్రేమ, దయాపూర్వక కృపకు సంబంధించిన మధురస్మృతులను విలువైనవిగా ఎంచుతారు. వారు తమ నోటితో చెప్పలేకపోయినా, తమ హృదయంలో యెహోవాకు వారిలా చెబుతున్నారు: “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్తన 119:97) యెహోవాకు తన ‘నామము స్మరిస్తున్నవారు’ ఎవరో తెలుసు, అలాంటివారు తన మార్గాలను పట్టించుకోని మానవుల్లోని అధికశాతం మందికి ఎంత భిన్నంగా ఉన్నారో కూడా ఆయన గుర్తిస్తున్నాడు. (మలాకీ 3:16; కీర్తన 10:4) మన హృదయ ధ్యానాన్నిబట్టి యెహోవా సంతోషిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా!—1 దినవృత్తాంతములు 28:9; కీర్తన 19:14.
17 దశాబ్దాలుగా యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నవారు నిజంగా విశిష్టమైన దానిని మరియు మరోవిధంగా సాధించలేని దానిని సాధించారు అంటే వారు తిరుగులేని సహనాన్ని ప్రదర్శించారు అనే వాస్తవాన్ని నిర్లక్ష్యం చేయలేం. యేసు ఇలా అన్నాడు: “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.” (లూకా 21:19) నిత్యజీవం పొందడానికి ఓర్పు ఆవశ్యకం. ‘దేవుని చిత్తం నెరవేరుస్తూ’ మీ జీవన విధానం ద్వారా మీ యథార్థతను నిరూపించుకున్న మీరు “వాగ్దానంపొందు నిమిత్తము” ఎదురుచూడవచ్చు.—హెబ్రీయులు 10:36.
18 మీరెంత ఎక్కువ లేదా ఎంత తక్కువ చేసినా యెహోవా మీ పూర్ణాత్మ సేవను అమూల్యమైనదిగా పరిగణిస్తాడు. వయసు పెరుగుతున్నకొద్దీ ‘బాహ్యపురుషునికి’ ఏమి జరుగుతున్నా, “ఆంతర్యపురుషుడు” మాత్రం దినదినము నూతనపర్చబడవచ్చు. (2 కొరింథీయులు 4:16) గతంలో మీరు చేసినదానిని యెహోవా అమూల్యమైనదిగా పరిగణిస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు, అలాగే ఆయన నామం నిమిత్తం మీరిప్పుడు చేస్తున్నదానిని కూడా ఆయన అమూల్యమైనదిగా పరిగణిస్తాడన్నది సుస్పష్టం. (హెబ్రీయులు 6:10) తర్వాతి ఆర్టికల్‌లో అలాంటి విశ్వాస్యతవల్ల కలిగే విస్తృతమైన ప్రభావాలను మనం పరిశీలిస్తాం.
మీరెలా జవాబిస్తారు?
• నేటి వృద్ధ క్రైస్తవులకు అన్న ఎలాంటి చక్కని మాదిరివుంచింది?
• ఒక వ్యక్తి సాధించగలవాటిని వయసు ఎందుకు పరిమితం చేయాల్సిన అవసరం లేదు?
• వృద్ధులు తమ దైవభక్తిని ప్రదర్శించడంలో ఎలా కొనసాగవచ్చు?
• వృద్ధులు తనకుచేసే సేవను యెహోవా ఎలా దృష్టిస్తాడు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) వృద్ధాప్యం తరచూ ఎలా వర్ణించబడింది? (బి) ఆదామువల్ల కలిగిన పాపపు ప్రభావాల విషయంలో లేఖనాలు ఏమి వాగ్దానం చేస్తున్నాయి?
3. క్రైస్తవులు ఏయే విధాలుగా ‘ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు’?
4. వృద్ధ ప్రవక్త్రియైన అన్న, దేవునిపట్ల తన భక్తినెలా ప్రదర్శించింది, ఆమెకు ప్రతిఫలమెలా దక్కింది?
5, 6. నేడు చాలామంది వృద్ధులు ఏయే విధాలుగా అన్న చూపించినలాంటి స్ఫూర్తినే కనబరుస్తున్నారు?
7. వృద్ధాప్యంలో మోషే దేవునితో తన సంబంధంలో ఎదుగుతూ ఉండాలని ఎలా కోరుకున్నాడు?
8. దానియేలు 90వ పడిలో కూడా తన మనసును ఎలా చురుగ్గా ఉంచుకున్నాడు, ఎలాంటి ఫలితాలు లభించాయి?
9, 10. మనసును చురుగ్గా ఉంచుకునేందుకు కొందరు ఏమిచేశారు?
11. నమ్మకమైన వృద్ధులు సాధించిన పనుల్ని ఎందుకు పరిశీలించాలి?
12, 13. తన పరిస్థితులు మారినప్పటికీ బర్జిల్లయి ఏ విధంగా దైవభక్తిని కనబర్చాడు?
14. కీర్తన 37:23-25లో నమోదు చేయబడిన మాటలకు దావీదు వృద్ధాప్యం మరింత అర్థాన్ని ఎలా చేకూరుస్తుంది?
15. పరిస్థితులు మారి, వృద్ధుడైనా నమ్మకంగా ఉండడంలో అపొస్తలుడైన యోహాను ఎలా చక్కని మాదిరినుంచాడు?
16. సంభాషించగల తమ సామర్థ్యంలో అశక్తులుగా మారినవారు యెహోవాపట్ల తమ భక్తినెలా ప్రదర్శించవచ్చు?
17. నిజంగా విశిష్టమైన దేనిని దేవుని దీర్ఘకాల సేవకులు సాధించారు?
18. (ఎ) వృద్ధుల విషయంలో యెహోవా ఏమి చూసేందుకు సంతోషిస్తాడు? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?
[23వ పేజీలోని చిత్రం]
వృద్ధుడైన దానియేలు యూదులు ఎంతకాలం పాటు చెరగా కొనిపోబడతారో “గ్రంథములవలన” గ్రహించాడు
[25వ పేజీలోని చిత్రాలు]
చాలామంది వృద్ధులు క్రమంగా కూటాలకు హాజరవడంలో, ఉత్సాహంగా ప్రకటించడంలో, నేర్చుకొనేందుకు ఆసక్తి చూపించడంలో మాదిరిగా ఉన్నారు