కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వృద్ధులు—యౌవనులకు ఒక వరం

వృద్ధులు—యౌవనులకు ఒక వరం

వృద్ధులు​—⁠యౌవనులకు ఒక వరం

“దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనైయుండువరకు నన్ను విడువకుము.”​—⁠కీర్తన 71:​18.

పశ్చిమాఫ్రికాలో ఒక క్రైస్తవ పెద్ద, వయోధికుడైన ఒక అభిషిక్త సహోదరుణ్ణి సందర్శించి, “ఎలా ఉన్నారు” అని అడిగాడు. దానికి ఆ సహోదరుడు, “నేను పరుగెత్తగలను, గంతులేయగలను,” అంటూ అభినయపూర్వకంగా చూపించేందుకు ప్రయత్నిస్తూ, “కానీ, నేను ఎగరలేను” అన్నాడు. ఆయన మాటల భావాన్ని ఆ పెద్ద అర్థం చేసుకున్నాడు. ‘నేనేమి చేయగలనో అది సంతోషంగా చేస్తాను, కానీ నేను చేయలేని దాన్ని చేయను.’ అలా సందర్శించిన ఆ పెద్ద ఇప్పుడు 80వ పడిలో ఉన్నాడు, ఆయన ఆ సహోదరుని హాస్యచతురతను, ఆయన విశ్వసనీయతను ఎంతో ఇష్టంగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు.

2 ఒక వృద్ధుడు కనబరిచే దైవిక లక్షణాలు ఇతరులపై శాశ్వత ముద్రవేయగలవు. నిజమే, వయసు దానంతటదే జ్ఞానాన్ని, క్రీస్తువంటి లక్షణాలను కలుగజేయదు. (ప్రసంగి 4:​13) బైబిలు ఇలా చెబుతోంది: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును.” (సామెతలు 16:​31) మీరు వయోధికులైతే మీ మాటలు, క్రియలు ఇతరులపై ఎంతటి ప్రయోజనాత్మక ప్రభావం చూపించగలవో మీరు గ్రహిస్తున్నారా? వృద్ధులు ఎంతమేరకు యౌవనులకు ఒక వరంగా ఉన్నారో చూపించే కొన్ని బైబిలు ఉదాహరణలను పరిశీలించండి.

విస్తృత ప్రభావం చూపించగల విశ్వాసం

3 నోవహు విశ్వాసం, స్థిరత్వంవల్ల కలిగిన ప్రయోజనాలు నేటికీ ఉన్నాయి. నోవహు ఓడ నిర్మించి, జంతువులను సమకూర్చి తన పొరుగువారికి ప్రకటించే సమయానికి ఆయన వయసు దాదాపు 600 సంవత్సరాలు. (ఆదికాండము 7:⁠6; 2 పేతురు 2:⁠5) నోవహు దైవభక్తి కారణంగానే ఆయన, ఆయన కుటుంబం ఆ గొప్ప జలప్రళయాన్ని తప్పించుకొని నేడు భూమ్మీద జీవిస్తున్న ప్రజలందరికీ మూలపురుషుడయ్యాడు. నిజమే, సాధారణంగా ప్రజల ఆయుష్కాలం ఎక్కువగా ఉన్న కాలంలో నోవహు జీవించాడు. అయినప్పటికీ, ఆయన బహు వృద్ధాప్యంలోనూ నమ్మకంగా ఉన్నాడు, అది విశేషమైన ఆశీర్వాదాలను తీసుకొచ్చింది. ఏ విధంగా?

4 “భూమిని నింపుడి” అని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరిస్తూ నిమ్రోదు, బాబెలు గోపురాన్ని నిర్మించడం మొదలుపెట్టే సమయానికి నోవహుకు దాదాపు 800 ఏళ్లు. (ఆదికాండము 9:⁠1; 11:​1-9) అయితే నిమ్రోదు చేసిన తిరుగుబాటులో నోవహు పాల్గొనలేదు. కాబట్టి ఆ తిరుగుబాటుదారుల భాష తారుమారు చేయబడినప్పుడు బహుశా ఆయన భాష మారి ఉండకపోవచ్చు. నోవహు వృద్ధాప్యంలోనే కాక, తన జీవితకాలమంతటిలోను చూపించిన విశ్వాసం, స్థిరత్వం అన్ని వయసుల దేవుని సేవకులు అనుకరించడానికి నిజంగా యోగ్యమైనవి.​—⁠హెబ్రీయులు 11:⁠7.

కుటుంబంపై వారి ప్రభావం

5 వృద్ధులు తమ కుటుంబ సభ్యుల విశ్వాసంపై చూపించగల ప్రభావాన్ని నోవహు తర్వాత జీవించిన మూలపురుషుల జీవితాల్లో చూడవచ్చు. అబ్రాహాము వయసు సుమారు 75 సంవత్సరాలున్నప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు: “నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువులయొద్ద నుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిం[చుదును].”​—⁠ఆదికాండము 12:​1, 2.

6 మీ ఇంటిని, మీ స్నేహితులను, మీ జన్మభూమిని, ఉమ్మడి కుటుంబ భద్రతను విడిచిపెట్టి మీకు తెలియని దేశానికి వెళ్లమని చెప్పబడడాన్ని ఊహించుకోండి. సరిగ్గా అదే చేయమని అబ్రాహాముకు చెప్పబడింది. ఆయన ‘యెహోవా చెప్పిన ప్రకారం వెళ్లాడు,’ ఆ తర్వాత తన మిగతా జీవితమంతా, కనానులో పరవాసిగా, సంచారవాసిగా గుడారాల్లో నివసించాడు. (ఆదికాండము 12:⁠4; హెబ్రీయులు 11:​8, 9) అబ్రాహాము “గొప్ప జనము” అవుతాడని యెహోవా చెప్పినా, తన సంతానం లెక్కకు మించినదిగా తయారవడానికి చాలాకాలం ముందే ఆయన మరణించాడు. అబ్రాహాము వాగ్దానదేశంలో 25 సంవత్సరాలు నివసించిన తర్వాతే ఆయన భార్య శారా, ఆయనకు ఒక్కగానొక్క కుమారుణ్ణి కన్నది, ఆయన పేరు ఇస్సాకు. (ఆదికాండము 21:​2, 5) అయితే, అబ్రాహాము విసిగిపోయి తానొచ్చిన పట్టణానికి తిరిగిపోలేదు. విశ్వాసం, సహనం విషయంలో ఎంత చక్కని మాదిరో కదా!

7 అబ్రాహాము సహనం ఆయన కుమారుడైన ఇస్సాకుపై గట్టి ప్రభావం చూపించింది, అందుకే ఇస్సాకు తన జీవితకాలమంతా అంటే 180 సంవత్సరాలు కనానులో పరవాసిగా నివసించాడు. ఇస్సాకు సహనం దేవుని వాగ్దానం మీదున్న విశ్వాసంపై ఆధారపడినది, ఆయన వృద్ధ తల్లిదండ్రులు ఆయనలో ఆ విశ్వాసాన్ని నాటగా అది ఆ తర్వాత యెహోవా ఇచ్చిన మాట ద్వారా మరింత బలపర్చబడింది. (ఆదికాండము 26:​2-5) మానవాళినంతటిని ఆశీర్వదించే “సంతానము” అబ్రాహాము కుటుంబం ద్వారా వస్తుందనే యెహోవా వాగ్దాన నెరవేర్పులో ఇస్సాకు స్థిరత్వం కీలకపాత్ర పోషించింది. వందల సంవత్సరాల తర్వాత, ఆ “సంతానము” యొక్క ప్రాథమిక భాగమైన యేసుక్రీస్తు తనయందు విశ్వాసముంచే వారందరూ తిరిగి దేవునితో సమాధానపడి నిత్యజీవం అనుభవించేందుకు మార్గాన్ని తెరిచాడు.​—⁠గలతీయులు 3:​16; యోహాను 3:​16.

8 అలాగే ఇస్సాకు తన కుమారుడైన యాకోబులో బలమైన విశ్వాసాన్ని పెంపొందింపజేశాడు, అది వృద్ధాప్యంలోనూ ఆయనను బలపర్చింది. ఆశీర్వాదం కోసం రాత్రంతా దేవదూతతో పెనుగులాడినప్పుడు యాకోబు వయసు 97 ఏళ్లు. (ఆదికాండము 32:​24-28) యాకోబు 147 ఏళ్ల వయసులో చనిపోవడానికి ముందు, తన 12 మంది కుమారుల్లో ప్రతీ ఒక్కరినీ ఆశీర్వదించడానికి కావలసిన బలం కూడదీసుకున్నాడు. (ఆదికాండము 47:​28) ఇప్పుడు ఆదికాండము 49:​1-28లో వ్రాయబడివున్న ఆయన ప్రవచనార్థక వాక్కులు నిజమని నిరూపించబడి, ఇంకా నెరవేరుతూనే ఉన్నాయి.

9 దేవుని యథార్థ వృద్ధ సేవకులు తమ కుటుంబ సభ్యులపై ఆరోగ్యదాయకమైన ప్రభావాన్ని చూపించగలరనేది స్పష్టం. జ్ఞానయుక్తమైన సలహా మరియు సహనం విషయంలో మంచి మాదిరితోపాటు లేఖనాధార ఉపదేశం ఒక యౌవనుడు బలమైన విశ్వాసంతో ఎదగడానికి ఎంతగానో తోడ్పడగలదు. (సామెతలు 22:⁠6) వృద్ధులు తమ కుటుంబంపై తాము చూపించగల ప్రయోజనాత్మక ప్రభావాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయకూడదు.

తోటి విశ్వాసులపై వారి ప్రభావం

10 వృద్ధులు తోటి విశ్వాసులపై కూడా చక్కని ప్రభావం చూపించగలరు. యాకోబు కుమారుడైన యోసేపు తన వృద్ధాప్యంలో, విశ్వాసాన్ని చూపించే ఒక చిన్న పని చేశాడు, అది ఆయన తర్వాత జీవించిన లక్షలాదిమంది సత్యారాధకులపై ప్రగాఢమైన ప్రభావం చూపించింది. ఆయన 110 ఏళ్లప్పుడు ‘తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించాడు’ అంటే ఇశ్రాయేలీయులు చివరకు ఐగుప్తును విడిచి వెళ్లినప్పుడు వారు ఆయన శల్యములను తమతో తీసుకొనివెళ్లాలి. (హెబ్రీయులు 11:​22; ఆదికాండము 50:​25) యోసేపు మరణం తర్వాత అనేక సంవత్సరాలపాటు ఇశ్రాయేలీయులు అనుభవించిన కఠిన దాసత్వంలో ఆ ఆజ్ఞ వారికి నిరీక్షణనిచ్చి, వారికి తప్పక విడుదల లభిస్తుందనే హామీనిచ్చింది.

11 యోసేపు కనబర్చిన విశ్వాసాన్నిబట్టి బలపర్చబడినవారిలో మోషే ఒకరు. మోషేకు 80 ఏళ్ల వయసులో, ఐగుప్తునుండి యోసేపు శల్యములను తీసుకెళ్లే ఆధిక్యత లభించింది. (నిర్గమకాండము 13:​19) ఆ సమయంలో ఆయనకు తనకన్నా చాలా చిన్నవాడైన యెహోషువ పరిచయమయ్యాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలపాటు యెహోషువ మోషేకు వ్యక్తిగత పరిచారకునిగా సేవచేశాడు. (సంఖ్యాకాండము 11:​28) ఆయన మోషేతోపాటు సీనాయి కొండ ఎక్కివెళ్లి, శాసనములుగల పలకలతో మోషే దిగివచ్చినప్పుడు ఆయనను కలుసుకునేందుకు అక్కడేవున్నాడు. (నిర్గమకాండము 24:​12-18; 32:​15-17) వృద్ధుడైన మోషే యెహోషువకు పరిణతిగల ఉపదేశాన్ని, జ్ఞానాన్ని సమృద్ధిగా అందజేసే ఊటగా ఉన్నాడు!

12 ఆ తర్వాత యెహోషువ, తాను జీవించినంతకాలం ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రోత్సహించాడు. న్యాయాధిపతులు 2:​7 మనకిలా చెబుతోంది: “యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.” అయితే యెహోషువ, ఇతర పెద్దలు మరణించిన తర్వాత, ప్రవక్తయైన సమూయేలు కాలంవరకు అంటే 300 సంవత్సరాలపాటు సత్యారాధన, అబద్ధారాధనల విషయంలో అనిశ్చయ పరిస్థితి కొనసాగింది.

సమూయేలు ‘నీతికార్యములు జరిగించాడు’

13 సమూయేలు ఏ వయసులో చనిపోయాడో బైబిలు చెప్పడం లేదు, అయితే మొదటి సమూయేలు పుస్తకం 102 సంవత్సరాల కాలవ్యవధిలో జరిగిన సంఘటనలను వివరిస్తోంది, ఆయన వాటిలో అధికశాతం చూశాడు. హెబ్రీయులు 11:​32, 33లో మనం న్యాయాధిపతులు, ప్రవక్తలు ‘నీతికార్యములు జరిగించారని’ చదువుతాం. అవును సమూయేలు, తన సమకాలీనుల్లో కొందరు తప్పు చేయకుండా ఉండేలా లేక తప్పు చేయడం మానేసేలా వారిపై ప్రభావం చూపించాడు. (1 సమూయేలు 7:​2-4) ఏ విధంగా? ఆయన తన జీవితకాలమంతా యెహోవాపట్ల యథార్థంగా ఉన్నాడు. (1 సమూయేలు 12:​2-5) రాజును సహితం తీవ్రంగా గద్దించేందుకు ఆయన భయపడలేదు. (1 సమూయేలు 15:​16-29) అంతేకాక, సమూయేలు ‘తల నెరసిన ముసలివానిగా’ ఉన్నప్పుడు కూడా ఇతరుల విషయమై ప్రార్థించడంలో మంచి మాదిరిగా ఉన్నాడు. ఆయన తన తోటి ఇశ్రాయేలీయుల నిమిత్తము “ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగునుగాక” అని అన్నాడు.​—⁠1 సమూయేలు 12:​2, 23.

14 ఇదంతా తోటి యెహోవా సేవకులపై వృద్ధులు మంచి ప్రభావం చూపించగల అత్యావశ్యకమైన మార్గాన్ని నొక్కిచెబుతోంది. ఆరోగ్యం లేదా ఇతర పరిస్థితులు తమను అశక్తుల్ని చేసినా వృద్ధులు ఇతరుల కోసం ప్రార్థించవచ్చు. మీ ప్రార్థనలు సంఘానికి ఎంత మేలుచేస్తాయో వృద్ధులుగావున్న మీరు గ్రహిస్తున్నారా? క్రీస్తు చిందించిన రక్తంపై మీ విశ్వాసాన్నిబట్టి మీరు యెహోవా ఎదుట ఆమోదయోగ్యమైన స్థానాన్ని ఆనందిస్తున్నారు, మీరు చూపించిన సహనాన్నిబట్టి మీ విశ్వాసం ‘పరీక్షకు నిలిచింది.’ (యాకోబు 1:⁠2-3; 1 పేతురు 1:⁠7) “నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును” అని ఎన్నటికీ మర్చిపోకండి.​—⁠యాకోబు 5:​16.

15 యెహోవా రాజ్యపనికి మద్దతిచ్చేందుకు మీ ప్రార్థనలు అవసరం. మన సహోదరుల్లో కొందరు తమ క్రైస్తవ తటస్థత కారణంగా జైల్లో ఉన్నారు. మరికొందరు ప్రకృతి విపత్తులకు, యుద్ధాలకు, పౌర పోరాటాలకు బలయ్యారు. ఇంకొందరు, మన సంఘాల్లోనే శోధనలను లేదా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. (మత్తయి 10:​35, 36) ప్రకటనాపనిలో, సంఘాలను పర్యవేక్షించడంలో సారథ్యం వహిస్తున్నవారికి కూడా క్రమంగా మీరు చేసే ప్రార్థనలు ఎంతో అవసరం. (ఎఫెసీయులు 6:​18, 19; కొలొస్సయులు 4:​2, 3) ఎపఫ్రాలాగే మీరు కూడా మీ ప్రార్థనల్లో తోటి విశ్వాసులను ప్రస్తావించడం ఎంత మంచిదో కదా!​—⁠కొలొస్సయులు 4:​12.

రాబోయే తరానికి బోధించడం

16 పరలోక నిరీక్షణగల నమ్మకమైన “చిన్నమంద” సభ్యులతో సహవసించడం, భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణగల “వేరేగొఱ్ఱెలకు” చెందినవారికి ఆవశ్యకమైన శిక్షణనిచ్చింది. (లూకా 12:​32; యోహాను 10:​16) కీర్తన 71:​18లో ఈ విషయం ముందుగానే చెప్పబడింది, అక్కడ మనమిలా చదువుతాం: “దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనైయుండువరకు నన్ను విడువకుము.” ఆత్మాభిషిక్తులు యేసుక్రీస్తుతో మహిమపర్చబడేందుకు, వేరేగొర్రెల సహవాసులను విడిచివెళ్లేముందు వారు మరిన్ని బాధ్యతలు చేపట్టేలా వారికి శిక్షణనిచ్చేందుకు ఆసక్తితోవున్నారు.

17 సూత్రప్రాయంగా, “పుట్టబోవువారికందరికి” ఉపదేశించడం గురించి కీర్తన 71:⁠18 చెబుతున్నదాన్ని దేవుని అభిషిక్తుల నుండి ఉపదేశం పొందిన వేరేగొర్రెలకు కూడా అన్వయించవచ్చు. ఇప్పుడు సత్యారాధనను హత్తుకుంటున్నవారికి తనగురించి సాక్ష్యమిచ్చే ఆధిక్యతను యెహోవా వృద్ధులకు ఇచ్చాడు. (యోవేలు 1:​2, 3) వేరేగొర్రెలు అభిషిక్తుల నుండి తాము నేర్చుకున్న విషయాలనుబట్టి ఆశీర్వదించబడ్డామని భావిస్తున్నారు, అంతేకాక, యెహోవాను సేవించాలని కోరుకునే మరితరులతో తమ లేఖన విద్యను పంచుకునేందుకు పురికొల్పబడ్డారు.​—⁠ప్రకటన 7:​9, 10.

18 ఇటు అభిషిక్తుల్లోని అటు వేరేగొర్రెల్లోని యెహోవా వృద్ధ సేవకులు ప్రాముఖ్యమైన చారిత్రక ఘట్టాలను మనకు అందజేయడంలో సజీవ మాధ్యమాలుగా ఉన్నారు. ఇప్పుడు సజీవంగా ఉన్న కొందరు “ఫొటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” చిత్రప్రదర్శనను ప్రత్యక్షంగా చూశారు. సారథ్యం వహిస్తూ 1918లో జైల్లో వేయబడిన సహోదరులు కొందరికి వ్యక్తిగతంగా తెలుసు. మరికొందరు వాచ్‌టవర్‌ రేడియో స్టేషన్‌, డబ్ల్యుబిబిఆర్‌ ప్రసారాల్లో భాగం వహించారు. యెహోవాసాక్షుల మత స్వేచ్ఛకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానాల్లో చట్టపరమైన కేసులు నడిచినకాలం గురించి చాలామంది చెప్పగలరు. మరికొందరు నిరంకుశ పరిపాలనల క్రింద జీవిస్తూ సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడ్డారు. అవును, వృద్ధులు సత్యానికి సంబంధించిన అవగాహన క్రమేణా ఎలా వెల్లడి చేయబడిందో వివరించగలరు. ఈ అనుభవ సంపదనుండి ప్రయోజనం పొందాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.​—⁠ద్వితీయోపదేశకాండము 32:⁠7.

19 వృద్ధ క్రైస్తవులు యౌవనులకు మాదిరిగా ఉండాలని ఉద్బోధించబడ్డారు. (తీతు 2:​2-4) మీ సహనం, ప్రార్థనలు, ఉపదేశం ఇతరులపై చూపించే ప్రభావాన్ని బహుశా మీరిప్పుడు చూడకపోవచ్చు. నోవహు, అబ్రాహాము, యోసేపు, మోషే, మరితరులకు వారి నమ్మకత్వం రాబోయే తరాలపై చూపించే పూర్తిస్థాయి ప్రభావం తెలిసి ఉండకపోవచ్చు. అయినా, వారసత్వంగా మనకు అందజేయబడిన వారి విశ్వాసం, యథార్థత గొప్ప ప్రభావాన్ని చూపించాయి; అలాగే మీ మాదిరి కూడా నేటి యువతరంపై అలాంటి ప్రభావాన్నే చూపించగలదు.

20 మీరు మహా ‘శ్రమ’ నుండి రక్షించబడినా లేక పునరుత్థానం ద్వారా తిరిగి జీవానికి తీసుకురాబడినా “వాస్తవమైన జీవమును” అనుభవించడం ఎంత సంతోషకరమో కదా! (మత్తయి 24:​21; 1 తిమోతి 6:​18-19) క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో వృద్ధాప్య ప్రభావాల్ని యెహోవా తొలగించే సమయాన్ని ఊహించండి. మన శరీరాలు అంతకంతకూ కృశించిపోవడానికి బదులు, మనం మేల్కొనే ప్రతీరోజు మన శరీరం మెరుగౌతూ మరింత శక్తిని, నిశిత దృష్టిని, మంచి వినికిడిని, చక్కని రూపాన్ని సంతరించుకుంటుంది. (యోబు 33:​25; యెషయా 35:​5, 6) దేవుని నూతనలోకంలో జీవించేందుకు దీవించబడినవారు, వారు అనుభవించబోయే నిత్యత్వంతో పోల్చినప్పుడు ఎప్పటికీ యౌవనులుగానే ఉంటారు. (యెషయా 65:​22) కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం అంతంవరకు మన నిరీక్షణను కాపాడుకుంటూ పూర్ణాత్మతో యెహోవాను సేవించడంలో కొనసాగుదాం. యెహోవా తాను వాగ్దానం చేసినవాటన్నిటినీ నెరవేరుస్తాడని, ఆయన చేసేది మనం ఊహించగల దేనికన్నా మరెంతో ఉన్నతంగా ఉంటుందని మనం నమ్మకంతో ఉండవచ్చు.​—⁠కీర్తన 37:⁠4; 145:​16.

మీరెలా జవాబిస్తారు?

• వృద్ధుడైన నోవహు స్థిరత్వం సర్వమానవాళికి ఎలా ఆశీర్వాదాలు తెచ్చింది?

• పితరుల విశ్వాసం వారి సంతానంపై ఎలాంటి ప్రభావం చూపించింది?

• యోసేపు, మోషే, యెహోషువ, సమూయేలు తమ వృద్ధాప్యంలో తోటి ఆరాధకులను ఎలా బలపర్చారు?

• వృద్ధులు దేన్ని మనకు వారసత్వంగా అందించగలరు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. దేవుని వృద్ధ సేవకులు దేనిని గ్రహించాలి, మనమిప్పుడు ఏమి పరిశీలిస్తాం?

3. నోవహు నమ్మకత్వం ఇప్పుడు జీవిస్తున్నవారందరికి ఎలా ప్రయోజనం చేకూర్చింది?

4. నోవహు స్థిరత్వం నేడు దేవుని సేవకులకు ఎలా ప్రయోజనం చేకూర్చింది?

5, 6. (ఎ) అబ్రాహాముకు 75 ఏళ్లున్నప్పుడు ఏమి చేయమని యెహోవా ఆయనకు చెప్పాడు? (బి) దేవుని ఆజ్ఞకు అబ్రాహాము ఎలా స్పందించాడు?

7. అబ్రాహాము సహనం ఆయన కుమారుడైన ఇస్సాకుపై ఎలాంటి ప్రభావం చూపించింది, దానివల్ల మానవాళికి ఎలాంటి ఫలితమొచ్చింది?

8. యాకోబు బలమైన విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాడు, అదెలాంటి ప్రభావం చూపించింది?

9. ఆధ్యాత్మిక పరిణతిగల వృద్ధులు తమ కుటుంబంపై చూపించగల ప్రభావం గురించి ఏమిచెప్పవచ్చు?

10. యోసేపు ‘తన శల్యములను గూర్చి ఏమి ఆజ్ఞాపించాడు,’ అదెలాంటి ప్రభావం చూపించింది?

11. వృద్ధుడైన మోషే యెహోషువపై ఎలాంటి ప్రభావం చూపించి ఉండవచ్చు?

12. యెహోషువ తాను జీవించినంతకాలం ఇశ్రాయేలు జనాంగంపై ఎలా మంచి ప్రభావం చూపించాడు?

13. ‘నీతికార్యములు జరిగించడానికి’ సమూయేలు ఏమిచేశాడు?

14, 15. ప్రార్థన విషయంలో నేడు వృద్ధులు సమూయేలు మాదిరిని ఎలా అనుకరించవచ్చు?

16, 17. కీర్తన 71:​18లో ముందుగానే ఏమి చెప్పబడింది, అదెలా నిజమైంది?

18, 19. (ఎ) యెహోవా వృద్ధ సేవకుల్లో అనేకమంది ఏ ప్రశస్తమైన సమాచారాన్ని అందించగలరు? (బి) దేని విషయంలో వృద్ధ క్రైస్తవులు నిశ్చయత కలిగి ఉండాలి?

20. అంతంవరకు తమ నిరీక్షణను కాపాడుకునేవారికి ఏ ఆశీర్వాదాలు వేచివున్నాయి?

[26వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము సహనం ఇస్సాకుపై గట్టి ప్రభావం చూపించింది

[28వ పేజీలోని చిత్రం]

మోషే పరిణతిగల ఉపదేశం యెహోషువను ప్రోత్సహించింది

[29వ పేజీలోని చిత్రం]

ఇతరుల నిమిత్తం మీరు చేసే ప్రార్థనలు ఎంతో మేలు చేయగలవు

[30వ పేజీలోని చిత్రం]

నమ్మకస్థులైన వృద్ధులు చెప్పేది వినడం ద్వారా యౌవనులు ప్రయోజనం పొందుతారు