సున్నతి చేయించుకోవడం మగతనానికి చిహ్నమా?
సున్నతి చేయించుకోవడం మగతనానికి చిహ్నమా?
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో, ఆరోగ్య సంరక్షణలో భాగంగా మగపిల్లలకు సున్నతి చేస్తారు. ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో సాధారణంగా, మగవారు జీవితాంతం సున్నతి చేయించుకోకుండానే ఉంటారు. యూదులు, ముస్లిమ్ల వంటి కొన్ని మతాలవారు సున్నతి చేయించుకోవడానికి ఆరోగ్య సంరక్షణ మాత్రమే కారణం కాదు, దానికి మత సంబంధమైన ప్రాముఖ్యత కూడా ఉంది.
అయితే కొన్ని దేశాల్లో, అబ్బాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత సున్నతి చేయించుకోవడానికి సంబంధించిన మతాచారాలను పాటిస్తారు. ఆ మతాచారంలో భాగంగా తమ తెగకు సంబంధించిన ఆచారాలు బోధించే పాఠశాలకు ఆ అబ్బాయిని పంపిస్తారు. అక్కడ ఆయనకు సున్నతి చేయబడుతుంది, ఆ ఆపరేషన్ నుండి కోలుకునేంతవరకు అనేక వారాలపాటు ఆయనను సమాజం నుండి వేరుగా ఉంచుతారు. ఆ సమయంలో ఆ అబ్బాయి నిర్దిష్ట మతాచారాలను ఆచరించడమేకాక, మగాడిగా ఉండడం గురించి అతనికి బోధించబడుతుంది. ఒక అబ్బాయికి యుక్తవయసు వచ్చిందని నిరూపించేందుకు ఇలాంటి సున్నతి అవసరమా? ఈ విషయంలో దేవుని దృక్కోణం గురించి బైబిలు ఏమి చెబుతుందో మనం పరిశీలిద్దాం.—సామెతలు 3:5, 6.
సున్నతి విషయంలో దేవుని దృక్కోణం
ప్రాచీనకాలంలో ఐగుప్తీయుల వంటి కొన్ని జనాంగాలు సున్నతిని అంటే గోప్యాంగ చర్మాన్ని కత్తిరించే ఆచారాన్ని పాటించాయి. అయితే, అబ్రాహాము అలాంటి సంస్కృతిలో జన్మించలేదు. వాస్తవానికి ఆయన తన జీవితంలోని అధికభాగం సున్నతి చేయించుకోని వ్యక్తిగానే ఉన్నాడు. సున్నతి చేయించుకోకపోయినా తాను పరాక్రమవంతుణ్ణని అబ్రాహాము నిరూపించుకున్నాడు. నలుగురు రాజుల సైన్యాలు తన సోదరుని కుమారుడైన లోతును చెరపట్టినప్పుడు, ఆయన కొంతమందిని వెంటబెట్టుకొని వెళ్లి ఆ సైన్యాలను వెంబడించి, ఓడించాడు. (ఆదికాండము 14:8-16) దాదాపు 14 ఏళ్ల తర్వాత, ఆయన, ఆయన ఇంటివారు సున్నతి చేయించుకోవాలని దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించాడు. దేవుడు ఎందుకలా ఆజ్ఞాపించాడు?
అబ్రాహాము బాల్యదశ నుండి యుక్తవయసులోనికి ఎదిగాడని అది సూచించడంలేదు. ఎందుకంటే, ఆయనకు అప్పటికే 99 ఏళ్లు! (ఆదికాండము 17:1, 26, 27) ఆ ఆజ్ఞనివ్వడానికిగల కారణాన్ని దేవుడిలా వివరించాడు: “మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును.” (ఆదికాండము 17:11) ఆ అబ్రాహాము నిబంధనలో, అబ్రాహాము ద్వారా “భూమియొక్క సమస్తవంశములు” ఎంతగానో ఆశీర్వదించబడతాయనే దేవుని వాగ్దానం కూడా ఉంది. (ఆదికాండము 12:2, 3) కాబట్టి, దేవుని దృష్టిలో సున్నతికి మగతనంతో ఎలాంటి సంబంధంలేదు. ఒక వ్యక్తి ‘దేవోక్తుల పరము చేయబడే’ ఆధిక్యత పొందిన అబ్రాహాము సంతతి నుండి వచ్చిన ఇశ్రాయేలీయుడని సూచించేందుకే సున్నతి చేయబడేది.—రోమీయులు 3:1, 2.
అబ్రాహాము నిజమైన సంతానమైన యేసుక్రీస్తును తిరస్కరించడం ద్వారా వారు తమకు అప్పగించబడిన ఆ ఆధిక్యతను అనుభవించేందుకు అర్హులుకారని కొంతకాలానికి తేలింది. అందుకే, దేవుడు వారిని తిరస్కరించాడు, అప్పటినుండి దేవుని దృష్టిలో వారి సున్నతికి ఎలాంటి విలువా లేకుండా పోయింది. అయితే, సున్నతి చేయించుకోవాలని దేవుడు ఇంకా కోరుతున్నాడని కొంతమంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు వాదించారు. (అపొస్తలుల కార్యములు 11:2, 3; 15:5) ఆ కారణంగా అపొస్తలుడైన పౌలు వివిధ సంఘాల్లో “లోపముగా ఉన్నవాటిని ది[ద్దడానికి]” తీతును పంపించాడు. పౌలు ఒక లోపం గురించి తీతుకు ఇలా రాశాడు: “అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరబోతులును మోసపుచ్చువారునైయున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభముకొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.”—తీతు 1:5, 10, 11.
పౌలు ఉపదేశం ఇప్పటికీ వర్తిస్తుంది. కాబట్టి, తమ అబ్బాయికి సున్నతి చేయించమని నిజ క్రైస్తవుడు ఇతరులకు సలహా ఇవ్వడం ఖచ్చితంగా లేఖన విరుద్ధమైనది. ఒక క్రైస్తవుడు “పరులజోలికి పో[యే]” వ్యక్తిగా ఉండే బదులు అలాంటి వ్యక్తిగత నిర్ణయాలను తల్లిదండ్రులకు వదిలేస్తాడు. (1 పేతురు 4:15) అంతేకాక, మోషే ధర్మశాస్త్రం ప్రకారమైన, సున్నతి గురించి ఇలా రాసేందుకు పౌలు ప్రేరేపించబడ్డాడు: “సున్నతి పొందినవాడెవడైనను పిలువబడెనా? అతడు సున్నతి పోగొట్టుకొనవలదు; సున్నతి పొందనివాడెవడైనను పిలువబడెనా? సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమియులేదు. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే యుండవలెను.”—1 కొరింథీయులు 7:18-20.
“సున్నతి పాఠశాలల” విషయమేమిటి?
క్రైస్తవ తల్లిదండ్రులు, తమ అబ్బాయికి సున్నతి చేయించాలని నిర్ణయించుకుంటే అప్పుడేమిటి? ముందు వర్ణించబడిన నామకార్థ సున్నతి పాఠశాలకు తమ అబ్బాయిలను పంపించడం బైబిలు ప్రకారం సరైనదేనా? అలాంటి పాఠశాలలో సున్నతితోపాటు మరికొన్ని మతాచారాలను కూడా పాటిస్తారు. ఆ పాఠశాలకు వెళ్లే అబ్బాయి యెహోవా ఆరాధకులుకాని ఇతర అబ్బాయిలతో, ఉపాధ్యాయులతో అనేకవారాలు సన్నిహితంగా గడుపుతాడు. బైబిల్లోని ఉన్నత నైతిక ప్రమాణాలకు విరుద్ధమైన అనేక విషయాలు ఆ పాఠశాలల్లో బోధించబడతాయి. బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరింథీయులు 15:33.
ఈ పాఠశాలకు హాజరవడం ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఉంది. సౌత్ ఆఫ్రికన్ మెడికల్ జర్నల్ 2003లో ఇలా హెచ్చరించింది: “ఈ ఏడాదిలో కూడా సున్నతికి సంబంధించి దిగ్భ్రాంతి గొలిపే వార్తలు వినిపించాయి, ప్రపంచంలోని ప్రధాన వార్తామాధ్యమాలన్నీ మరణాల, అంగచ్ఛేదనాల గురించిన వార్తలను ప్రచురించాయి. . . . ఒక్క మాటలో చెప్పాలంటే, నేడున్న నామకార్థ ‘సున్నతి పాఠశాలలు’ అనేకం బూటకమైనవి, ప్రాణాంతకమైనవి.”
ఆ పాఠశాలకు వెళ్లడం ద్వారా ఒక యువకుని భౌతిక సంక్షేమానికే కాక, ఆయన ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. సున్నతి పాఠశాల బోధలకూ, ఆచారాలకూ అభిచారంతో, మరణించిన పూర్వీకుల ఆరాధనతో దగ్గరి సంబంధముంది. ఉదాహరణకు, శస్త్రవైద్యుల అజాగ్రత్తవల్ల, అపరిశుభ్ర పరిస్థితులవల్ల హాని జరిగిందని ఒప్పుకునే బదులు, మంత్రాల ప్రభావంవల్ల లేక మరణించిన పూర్వీకులకు కోపం తెప్పించడంవల్ల అలాంటి సంఘటనలు సంభవించాయని చాలామంది నమ్ముతారు. అబద్ధమతాలతో సంబంధాల గురించి బైబిలు ఇలా ఆజ్ఞాపిస్తుంది: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? . . . కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును.” (2 కొరింథీయులు 6:14-18) ఈ బైబిలు ఉపదేశం దృష్ట్యా, క్రైస్తవ తల్లిదండ్రులు తమ అబ్బాయిలను సున్నతి పాఠశాలకు పంపించడం ఎంతమాత్రం జ్ఞానయుక్తమైనది కాదు.
క్రైస్తవునిలో మగతనం ఉట్టిపడేలా చేసేదేమిటి?
క్రైస్తవ పురుషుని మగతనానికి ఆయన సున్నతి చేయబడడంతో, చేయబడకపోవడంతో ఎలాంటి సంబంధంలేదు. నిజక్రైస్తవులు ‘శరీర విషయమందు చక్కగా అగుపడడానికి’ ప్రాధాన్యతనివ్వరు గానీ దేవుని దృష్టిలో ఇష్టులుగా ఉండడానికే ప్రాధాన్యతనిస్తారు.—గలతీయులు 6:12.
అయితే క్రైస్తవుడు దేవుని దృష్టిలో ఇష్టునిగా ఉండాలంటే ఆయన ‘హృదయ సున్నతి’ చేసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 10:16; 30:6; మత్తయి 5:8) అది శారీరక సున్నతివల్ల జరగదు గానీ, తప్పుడు కోరికలను విడిచిపెట్టడమేకాక, శారీరక సున్నతివల్ల ఒక వ్యక్తి ఇతరుల కన్నా గొప్పవాడౌతాడనే అహంకారపూరితమైన ఆలోచనలను విడనాడడం ద్వారానే జరుగుతుంది. ఒక క్రైస్తవుడు సున్నతి చేయించుకున్నా, చేయించుకోకపోయినా శోధనలను సహించడం ద్వారా, “విశ్వాసమందు నిలుకడగా” ఉండడం ద్వారా తన మగతనం ఉట్టిపడేలా ప్రవర్తించగలడు.—1 కొరింథీయులు 16:13; యాకోబు 1:12.